Siva Maha Puranam-4
Chapters
అథ ఏకోనచత్వారింశో
శివుని ధ్యానించే విధి
ఉపమన్యురువాచ |
శ్రీకంఠనాథం స్మరతాం సద్యస్సర్వార్థసిద్ధయః | ప్రసిధ్యంతీతి మత్వైకం తం వై ధ్యాయంతి యోగినః || 1
స్థిత్యర్థం మనసః కేచిత్ స్థూలధ్యానం ప్రకుర్వతే | స్థూలం తు నిశ్చలం చేతో భ##వేత్సూక్ష్మే తు తత్ స్థిరమ్ || 2
శివే తు చింతితే సాక్షాత్సర్వాస్సిధ్యంతి సిద్ధయః | మూర్త్యంతరేషు ధ్యాతేషు శివరూపం విచింతయేత్ || 3
లక్షయేన్మనసః స్థైర్యం తత్తద్ధ్యాయేత్పునః పునః | ధ్యానమాదౌ సవిషయం తతో నిర్విషయం జగుః || 4
తత్ర నిర్విషయం ధ్యానం నాస్తీత్యేవ సతాం మతమ్ | బుద్ధేర్హి సంతతిః కాచిద్ధ్యానమిత్యభిధీయతే || 5
తేన నిర్విషయా బుద్ధిః కేవలేహ ప్రవర్తతే | తస్మాత్స్వవిషయం ధ్యానం బలార్కకిరణాశ్రయమ్ || 6
సూక్ష్మాశ్రయం నిర్విషయం నాపరం పరమార్థతః | యద్వా సవిషయం ధ్యానం తత్సాకారసమాశ్రయమ్ || 7
నిరాకారాత్మసంవిత్తిర్ధ్యానం నిర్విషయం మతమ్ | నిర్బీజం చ సబీజం చ తదేవ ధ్యానముచ్యతే || 8
నిరాకారాశ్రయత్వేన సాకారాశ్రయతస్తథా | తస్మాత్సవిషయం ధ్యానమాదౌ కృత్వా సబీజకమ్ || 9
అంతే నిర్విషయం కుర్యాన్నిర్బీజం సర్వసిద్ధయే | ప్రాణాయామేన సిధ్యంతి దివ్యాశ్శాంత్యాదయః క్రమాత్ || 10
శ్రీకంఠనాథుని ధ్యానించువారలకు సకలప్రయోజనములు శీఘ్రముగా సిద్ధించునని తెలుసుకొని, యోగులు అద్వితీయుడగు ఆయనను నిశ్చయముగా ధ్యానించుచున్నారు (1). మనస్సుయొక్క నిలకడ కొరకై కొందరు స్థూలమగు మూర్తిని ధ్యానించెదరు. స్థూలధ్యానము నందు నిశ్చలమైన మనస్సు సూక్ష్మరూపధ్యానమునందు కూడ స్థిరపడును (2). శివుని స్మరించినచో సకలసిద్ధులు ప్రత్యక్షముగా సిద్ధించును. ఇతరములగు మూర్తులను ధ్యానించే సందర్భములో శివరూపమును కూడ ధ్యానించవలెను (3). ఏయే రూపమునందు మనస్సు స్థరముగా నిలుచునట్లు కానవచ్చునో, ఆయా రూపమును మరల మరల ధ్యానించవలెను. ధ్యానము ముందులో సవిషయము (ధ్యేయ రూపము కలది) అనియు, తరువాత నిర్విషయము (విషయము లేనిది) అగుననియు చెప్పెదరు (4). వీటిలో నిర్విషయధ్యానము అనేది సంభవమే కాదని కొందరు మహాత్ముల అభిప్రాయము. బుద్ధిలోని ఒకానొక విశిష్టమైన వృత్తిప్రవాహమునకు ధ్యానము అని పేరు (5). కావున, నిర్విషయమగు బుద్ధి కేవలము నిర్గుణపరబ్రహ్మ విషయములో మాత్రమే సంభవమగును. కావున, సవిషయధ్యానము ఉదయించే సూర్యుని కిరణములు వలె ప్రకాశించే జ్యోతిని ఆశ్రయించుకొని ప్రవర్తిల్లును (6). నిర్విషయధ్యానమునకు సూక్ష్మతత్త్వము ఆలంబనమగును. ఈ రెండింటి కంటె అధికముగా మరియొక ధ్యానము వాస్తవముగా లేదు. ఈ రెండింటినీ మరియొక విధముగా వర్ణించవచ్చును. సాకార-ఈశ్వరుని ఆశ్రయించుకొని ఉండేది సవిషయధ్యానము కాగా (7), నిరాకారమగు ఆత్మయొక్క జ్ఞానము నిర్విషయ ధ్యానమని చెప్పబడినది. ఈ రెండింటికీ క్రమముగా సబీజ, నిర్బీజ ధ్యానములు అనే వ్యవహారము కూడ గలదు (8). నిరాకారమును ఆశ్రయించే ధ్యానము నిర్బీజము కాగా, సాకారాశ్రయము సబీజమగును. కావున, సాధకుడు సవిషయ (సబీజ) ధ్యానమును ముందుగా చేసి (9), ఆఖరులో నిర్బీజధ్యానమును చేసినచో, సర్వము సిద్ధించును. శాంతి మొదలగు దివ్యసిద్ధులు ప్రాణాయామముచే క్రమముగా సిద్ధించును (10).
శాంతిః ప్రశాంతిర్దీప్తిశ్చ ప్రసాదశ్చ తతః పరమ్ | శమస్సర్వాపదాం చైవ శాంతిరిత్యభిధీయతే || 11
తమసోం%తర్బహిర్నాశః ప్రశాంతిః పరిగీయతే | బహిరంతః ప్రకాశో యో దీప్తిరిత్యభిధీయతే || 12
స్వస్థతా యా తు సా బుద్ధేః ప్రసాదః పరికీర్తితః | కరణాని చ సర్వాణి సబాహ్యాభ్యంతరాణి చ || 13
బుద్ధేః ప్రసాదతః క్షిప్రం ప్రసన్నాని భవంత్యుత | ధ్యాతా ధ్యానం తథా ధ్యేయం యద్వా ధ్యాన ప్రయోజనమ్ |
ఏతచ్చతుష్టయం జ్ఞాత్వా ధ్యాతా ధ్యానం సమాచరేత్ || 14
జ్ఞానవైరాగ్యసంపన్నో నిత్యమవ్యగ్రమాసనః | శ్రద్దధానః ప్రసన్నాత్మా ధ్యాతా సద్భిరుదాహృతః || 15
ధ్యై చింతాయాం స్మృతో ధాతుశ్శివచింతా ముహుర్ముహుః || 16
యోగాభ్యాసస్తథాల్పో%పి యథా పాపం వినాశ##యేత్ | ధ్యాయతఃక్షణమాత్రం వా శ్రద్ధయా పరమేశ్వరమ్ || 17
అవ్యాక్షిప్తేన మనసా ధ్యానమిత్యభిధీయతే || 18
బుద్ధిప్రవాహరూపస్య ధ్యానస్యాస్యావలంబనమ్ | ధ్యేయమిత్యుచ్యతే సద్భిస్తచ్చ సాంబస్స్వయం శివః || 19
విముక్తి ప్రత్యయం పూర్ణమైశ్వర్యం చాణిమాదికమ్ | శివధ్యానస్య పూర్ణస్య సాక్షాదుక్తం ప్రయోజనమ్ || 20
ఆ సిద్ధులకు శాంతి, ప్రశాంతి, దీప్తి మరియు ప్రసాదము అని పేర్లు. సకలములగు ఆపదలు తొలగిపోవుటకు శాంతి అని పేరు (11). లోపల, బయట తమోగుణము (అజ్ఞానము) నశించుటకు ప్రశాంతి అని పేరు. లోపల, బయట ప్రకాశము (జ్ఞానము) నకు దీప్తి అని పేరు (12). బుద్ధియందు నెలకొనే స్వస్థత (స్వరూపస్థితి) కు ప్రసాదము అని పేరు. బుద్ధియొక్క ప్రసాదము వలన బాహ్యేంద్రియములు మరియు అంతరింద్రియమగు మనస్సు కూడ ప్రసన్నములగును. ధ్యానము చేయువాడు ధ్యాత, ధ్యానము, ధ్యేయము మరియు ధ్యానప్రయోజనము అనే నాలుగు అంశములను తెలుసుకొని ధ్యానమును చేయవలెను (13, 14). జ్ఞానవైరాగ్యములు గలవాడు, సర్వకాలములలో ఆందోళనను చెందని మనస్సు గలవాడు, శ్రద్ధావంతుడు, ప్రసన్నమగు మనస్సు గలవాడు అగు వ్యక్తి ధ్యాత అగునని మహాత్ములు చెప్పుచున్నారు (15). ధ్యై చింతాయాం అనే ధాతువును పాణిని మహర్షి పఠించియున్నాడు. కావున, నిరంతరమగు శివచింతయే ధ్యానమగును (16). యోగాభ్యాసము అల్పమైననూ పాపమును పోగొట్టును. అదే విధముగా, శ్రద్ధతో పరమేశ్వరుని క్షణకాలము విక్షిప్తము కాని (ఇటునటు చెదిరిపోని) మనస్సుతో భావన చేసిననూ, అది ధ్యానమనబడును (17, 18). బుద్ధిప్రవాహరూపమగు ఈ ధ్యానమునకు ఏది ఆలంబనమగునో, దానికి ధ్యేయమని పేరు. ఆ ధ్యేయము స్వయముగా పార్వతీసమేతుడగు శివుడేనని మహాత్ములు చెప్పుచున్నారు (19). పూర్ణమగు శివధ్యానమునకు సాక్షాత్తుగా పూర్ణమగు మోక్షానుభవము మరియు అణిమ మొదలగు అష్టసిద్ధులతో కూడిన ఈశ్వరభావము అనునవి ప్రయోజనము (20).
యస్మాత్సౌఖ్యం చ మోక్షం చ ధ్యానాదభయమాప్నుయాత్ | తస్మాత్సర్వం పరిత్యజ్య ధ్యానయుక్తో భ##వేన్నరః || 21
నాస్తి ధ్యానం వినా జ్ఞానం నాస్తి ధ్యానమయోగినః | ధ్యానం జ్ఞానం చ యస్యాస్తి తీర్ణస్తేన భవార్ణవః || 22
జ్ఞానం ప్రసన్నమేకా గ్రమశేషోపాధివర్జితమ్ | యోగాభ్యాసేన యుక్తస్య యోగినస్త్వేవ సిధ్యతి || 23
ప్రక్షీణాశేషపాపానాం జ్ఞానే ధ్యానే భ##వేన్మనః | పాపోపహతబుద్ధీనాం తద్వార్తాపి సుదుర్లభా || 24
యథా వహ్నిర్మహాదీప్తశ్శుష్కమార్ద్రం చ నిర్దహేత్ | తథా శుభాశుభం కర్మ ధ్యానాగ్నిర్దహతే క్షణాత్ || 25
అత్యల్పో%పి యథా దీపస్సుమహన్నాశ##యేత్తమః | యోగాభ్యాసస్తథాల్పో%పి మహాపాపం వినాశ##యేత్ || 26
ధ్యాయతః క్షణమాత్రం వా శ్రద్ధయా పరమేశ్వరమ్ | యద్భవేత్సుమహచ్ఛ్రేయస్తస్యాంతో నైవ విద్యతే || 27
నాస్తి ధ్యానసమం తీర్థం నాస్తి ధ్యానసమం తపః | నాస్తి ధ్యానసమో యజ్ఞస్తస్మాద్ధ్యానం సమాచరేత్ || 28
తీర్థాని తోయపూర్ణాని దేవాన్ పాషాణమృన్మయాన్ | యోగినో న ప్రపద్యంతే స్వాత్మప్రత్యయకారణాత్ || 29
యోగినాం చ వపుస్సూక్ష్మం భ##వేత్ర్పత్యక్షమైశ్వరమ్ | యథా స్థూలమయుక్తానాం మృత్కాష్ఠాద్యైః ప్రకల్పితమ్ || 30
ధ్యానము వలన సౌఖ్యము, మోక్షము మరియు అభయము లభించును. కావున, మానవుడు సర్వమును ప్రక్కన బెట్టి ధ్యానమునందు నిమగ్నుడు కావలెను (21). ధ్యానము లేనిదే జ్ఞానము లేదు. యోగి కానివానికి ధ్యానము లేదు. ఎవనికైతే ధ్యానము మరియు జ్ఞానము కూడ గలవో, వాడు సంసారసముద్రమును దాటివేయును (22). యోగమును అభ్యసించే యోగికి మాత్రమే ప్రసన్నము, ఏకాగ్రము,సమస్తములగు ఉపాధులనుండి వినిర్ముక్తము అగు జ్ఞానము సిద్ధించును (23). నశించిన సకలపాపములు గలవారికి మాత్రమే ధ్యానమునందు, జ్ఞానమునందు మనస్సు లగ్నమగును. పాపముచే వినష్టము చేయబడిన బుద్ధి గలవారికి వాటి మాట కూడ దరికి చేరదు (24). ప్రజ్వరిల్లే పెద్ద మంట ఎండు కట్టెలను మాత్రమే గాక, పచ్చి కట్టెలను కూడ తగుల బెట్టును. అదే విధముగా, ధ్యానము అనే అగ్ని పుణ్యపాపకర్మలను రెండింటినీ క్షణములో తగులబెట్టును (25). ఏ విధముగానైతే మిక్కిలి చిన్న దీపమైననూ అతి దట్టమగు చీకటిని పోగొట్టునో, అదే విధముగా యోగాభ్యాసము అల్పమైననూ మహాపాపమును నశింపజేయును (26). శ్రద్ధతో పరమేశ్వరుని క్షణకాలము ధ్యానము చేసిననూ, దాని వలన కలిగే గొప్ప శ్రేయస్సునకు అంతము లేనే లేదు (27). ధ్యానముతో సమానమగు పవిత్రతీర్థము లేదు. ధ్యానముతో సమానమగు తపస్సు లేదు. ధ్యానముతో సమానమగు యజ్ఞము లేదు. కావున , మానవుడ చక్కగా ధ్యానమును చేయవలెను (28). యోగులు తమ ఆత్మయొక్క జ్ఞానమునందు నిష్ఠ గలవారగుటచే, జలరూపములో నుండే తీర్థముల జోలికి, రాతితో మట్టితో చేసిన దేవతాప్రతిమల జోలికి పోరు (29). ఏ విధముగానైతే యోగులు కానివారికి మట్టి, చెక్క మొదలగు వాటితో చేసిన స్థూలమగు దేవతామూర్తి ప్రత్యక్షమగుచుండునో,అదే విధముగా యోగులకు ఈశ్వరుని సూక్ష్మరూపము ప్రత్యక్షమగును (30).
యథేహాంతశ్చరా రాజ్ఞః ప్రియాస్స్యుర్న బహిశ్చరాః | తథాంతర్ధ్యాననిరతాః ప్రియాశ్శంభోర్న కర్మిణః || 31
బహిస్కరా యథా లోకే నాతీవ ఫలభోగినః | దృష్టా నరేంద్రభవనే తద్వదత్రాపి కర్మిణః || 32
యద్యంతరా విపద్యంతే జ్ఞానయోగార్థముద్యతః | యోగస్యోద్యోగమాత్రేణ రుద్రలోకం గమిష్యతి || 33
అనుభూయ సుఖం తత్ర స జాతో యోగినాం కులే | జ్ఞానయోగం పునర్లబ్ధ్వా సంసారమతివర్తతే || 34
జిజ్ఞాసురపి యోగస్య యాం గతిం లభ##తే నరః | న తాం గతిమవాప్నోతి సర్వైరపి మహామఖైః || 35
ద్విజానాం వేదవిదుషాం కోటిం సంపూజ్య యత్ఫలమ్ | భిక్షా మాత్ర ప్రదానేన తత్ఫలం శివయోగినే || 36
యజ్ఞాగ్నిహోత్రదానేన తీర్థహోమేషు యత్ఫలమ్ | యోగినామన్నదానేన తత్సమస్తం ఫలం లభేత్ || 37
యే చాపవాదం కుర్వంతి విమూఢాశ్శివయోగినామ్ | శ్రోతృభిస్తే ప్రపద్యంతే నరకేష్వామహీక్షయాత్ || 38
సతి శ్రోతరి వక్తాస్యాదపవాదస్య యోగినామ్ | తస్మాచ్ఛ్రోతా చ పాపీయాన్ దండ్యస్సుమహతాం మతః |
యే పునస్సతతం భక్త్యా భజంతి శివయోగినః || 39
తే విదంతి మహాభోగానంతే యోగం చ శాంకరమ్ | భోగార్థిభిర్నరైస్తస్మాత్సంపూజ్యాశ్శివయోగినః || 40
ప్రతిశ్రయాన్నపానాద్యైశ్శయ్యాప్రావరణాదిభిః |
ఈ లోకములో రాజుయొక్క అంతఃపురములో సంచరించే వ్యక్తులు మాత్రమే రాజునకు ప్రీతిపాత్రులగుదురే గాని, బయట తిరుగాడువారు కాదు. అదే విధముగా, అంతర్ముఖులై ధ్యానమును చేయువారు శంభునకు ప్రీతిపాత్రులగుదురే గాని, కర్మఠులు కాదు (31). రాజుయొక్క భవనములోని పరిచారకులు అనుభవించే భోగములు రాజాంతఃపురమునకు బయట పనులను చేసుకొనే వారికి లభించవను సంగతి మనకు తెలిసినదే. కర్మఠుల పరిస్థితి కూడ అట్టిదియే. ధ్యానయోగులకు లభించే మహాఫలమునకు వారు దూరముగా నుందురు (32). జ్ఞానయోగమును సాధించుటకు పూనుకున్న వ్యక్తి అది పూర్తి కాకుండగనే మరణించినచో, ఆ విధముగా యోగము కొరకు చేసిన ప్రయత్నముయొక్క ప్రభావముచే ఆతడు రుద్రలోకమును పొందగలడు (33). ఆతడు అచట సుఖముననుభవించి, యోగుల కులములో జన్మించి, మరల జ్ఞానయోగమును పొంది సంసారసముద్రమును తరించును (34). కేవలము యోగమును తెలియగోరిన మానవునకు ఏ ఉత్తమమగు గితి లభించునో, అది గొప్ప యజ్ఞములను అన్నింటినీ చేసిననూ లభించదు (35). కోటిమంది వేదవేత్తలగు బ్రాహ్మణులను చక్కగా పూజించినచో, ఏ ఫలము లభించునో, శివయోగికి భిక్షను ఇచ్చినంత మాత్రాన ఆ ఫలము లభించును (36). యజ్ఞము, అగ్నిహోత్రము, దానము, తీర్థాటనము, హోమము అను వాటియందు ఏ ఫలము గలదో, యోగులకు అన్నదానము చేయుట వలన ఆ ఫలమంతయు లభించును (37). ఏ పరమమూర్ఖులు శివయోగులను నిందించెదరో, వారు ఆ నిందను విన్నవారితో సహా ఈ లోకములో ప్రళయము సంభవించునంత వరకు నరకముల ననుభవించెదరు (38). వినేవాడు ఉన్నప్పుడు మాత్రమే ఒకడు యోగులను నిందించగల్గును. కావున, వినేవాడు కూడ పాపియే గనుక శిక్షకు అర్హుడని మహాత్ముల అభిప్రాయము. దీనికి భిన్నముగా ఎవరైతే శివయోగులను సర్వకాలములలో భక్తితో సేవించెదరో (39), వారు మహాభోగములను పొందుటయే గాక, అంతమునందు శివయోగమును కూడ పొందెదరు. కావున, భోగములను కోరు మానవులు శివయోగులకు (40) మకాము నిచ్చి ఆహారము, త్రాగే నీరు, శయ్య, కంబళి మొదలగు వాటిని ఇచ్చి పూజించవలెను.
యోగధర్మస్ససారత్వాదభేద్యః పాపముద్గరైః || 41
వజ్రతందులవద్ జ్ఞేయం తథా పాపేన యోగినః | న లిప్యంతే చ తాపౌఘైః పద్మపత్రం యథాంభసా || 42
యస్మిన్ దేశే వసేన్నిత్యం శివయోగరతో మునిః | సో%పి దేశో భ##వేత్పూతస్స పూత ఇతి కిం పునః || 43
తస్మాత్సర్వం పరిత్యజ్య కృత్యమన్యద్విచక్షణః | సర్వదుఃఖప్రహాణాయ శివయోగం సమభ్యసేత్ || 44
సిద్ధయోగఫలో యోగీ లోకానాం హితకామ్యయా | భోగాన్ భుక్త్వా యథాకామం విహరేద్వాత్ర వర్తతామ్ || 45
అథవా క్షుద్రమిత్యేవ మత్వా వైషయికం సుఖమ్ | త్యక్త్వా విరాగయోగేన స్వేచ్ఛయా కర్మ ముచ్యతామ్ || 46
యస్త్వాసన్నాం మృతిం మర్త్యో దృష్ట్వారిష్టం చ భూయసా | స యోగారంభనిరతశ్శివక్షేత్రం సమాశ్రయేత్ || 47
స తత్ర నివసన్నేవ యది ధీరమనా నరః | ప్రాణాన్ వినాపి రోగాద్యైస్స్వయమేవ పరిత్యజేత్ || 48
కృత్వాప్యనశనం చైవ హుత్వా చాంగం శివానలే | క్షిప్త్వావా శివతీర్థేషు స్వదేహమవగాహనాత్ || 49
శివశాస్త్రోక్తవిధివత్ర్పాణాన్యస్తు పరిత్యజేత్ | సద్య ఏవ విముచ్యేత నాత్ర కార్యా విచారణా || 50
యోగధర్మము గొప్ప సారము గల ధర్మము. పాపములు అనే రోకళ్లు దానిని భేదించలేవు (41). యోగికి, పాపమునకు మధ్యలో వజ్రమునకు, బియ్యపు గింజకు గల తేడా గలదని తెలియవలెను. తామరాకును నీరు తడి చేయలేదు. అటులనే, యోగులను తాపముల సమూహములు స్పృశించలేవు (42). శివయోగమునందు నిష్ఠ గల యోగి ఏ స్థానమునందు నిత్యము నివసించునో, ఆ స్థానము కూడ పవిత్రమగునన్నచో, ఆ యోగి పవిత్రుడని వేరే చెప్పవలయునా? (43) కావున, వివేకియగు వ్యక్తి ఇతరములగు సర్వకార్యములను ప్రక్కనబెట్టి, సకల దుఃఖముల నివృత్తి కొరకై శివయోగమును అభ్యసించవలెను (44). యోగఫలము సిద్ధించిన యోగి జనుల హితమును కోరి భోగములననుభవించి యథేచ్ఛగా విహరించ వచ్చును. లేదా, తన స్థానమునందు స్థిరముగా నుండవచ్చును (45). లేదా, విషయభోగములు తుచ్ఛమైనవి యని భావించి వాటిని విడిచిపెట్టి, వైరాగ్యమనే మోక్షోపాయమును చేపట్టినవాడై తన ఇచ్ఛచే కర్మను పరిత్యజించవచ్చును (46). ఎవడైతే జీవితములో అధికమగు ఆపదలను అనుభవించి తనకు మరణము సమీపించినదని గ్రహించునో, అట్టి వ్యక్తి యోగాభ్యాసమునందు నిష్ఠ గలవాడై శివక్షేత్రమును ఆశ్రయించి (47), అచటనే నివసించవలెను. ఆతడు ధైర్యముతో నిండిన మనస్సు గలవాడైనచో, రోగము మొదలగు వాటి కొరకు వేచి చూడకుండగా, ఉపవాసమును చేసి గాని, శివాగ్నియందు దేహమును హోమము చేసి గాని, తానే స్వయముగా ప్రాణములను విడిచి పెట్టవచ్చును (48, 49). ఎవడైతే శివశాస్త్రములో చెప్పబడిన విధానములో ప్రాణములను విడిచిపెట్టునో, అట్టి వాడు వెనువెంటనే మోక్షమును పొందుననుటలో సందేహము లేదు (50).
రోగాద్యైర్వాథ వివశశ్శివక్షేత్రం సమాశ్రితః | మ్రియతే యది సోప్యేవం ముచ్యతే నాత్ర సంశయః || 51
యథా హి మరణం శ్రేష్ఠముశంత్యనశనాదిభిః | శాస్త్రవిశ్రంభధీరేణ మనసా క్రియతే యతః || 52
శివనిందారతం హత్వా పీడితస్స్వయమేవ వా | యస్త్యజేద్దుస్త్యజాన్ ప్రాణాన్న స భూయః ప్రజాయతే || 53
శివనిందారతం హంతుమశక్తో యస్స్వయం మృతః | సద్య ఏవ ప్రముచ్యేత త్రిస్సప్తకులసంయుతః || 54
శివార్థే యస్త్యజేత్ర్పాణాన్ శివభక్తార్థమేవ వా | న తేన సదృశః కశ్చిన్ముక్తిమార్గస్థితో నరః || 55
తస్మాచ్ఛీఘ్రతరా ముక్తిస్తస్య సంసారమండలాత్ | ఏతేష్వన్యతమోపాయం కథమప్యవలంబ్య వా || 56
షడధ్వశుద్ధిం విధివత్ర్పాప్తో వా మ్రియతే యది | పశూనామివ తస్యేహ న కుర్యాదౌర్ధ్వదైహికమ్ || 57
నైవాశౌచం ప్రపద్యేత తత్పుత్రాదిర్విశేషతః | శివాచారార్థమథవా శివవిద్యార్థమేవ వా |
ఖనేద్వా భువి తద్దేహం దహేద్వా శుచినాగ్నినా || 58
క్షిపేద్వాప్సు శివాస్వేవ త్యజేద్వా కాష్ఠలోష్ఠవత్ | అథైనమపి చోద్దిశ్య కర్మ చేత్కర్తుమీప్సితమ్ || 59
కల్యాణమేవ కుర్వీత శక్త్యా భక్తాంశ్చ తర్పయేత్ | ధనం తస్య భ##జేచ్ఛైవశ్శైవీ చేత్త స్య సంతతిః |
నాస్తి చేత్తచ్ఛివే దద్యాన్న దద్యాత్పశుసంతతిః || 60
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే ధ్యానవిధి వర్ణనం నామ ఏకోనచత్వారింశో%ధ్యాయః (39).
అట్లుగాక, ఎవడైతే శివక్షేత్రమును ఆశ్రయించి జీవించుచుండగా రోగము మొదలగు వాటిచే స్వాధీనత లేనివాడై మరణించునో, అట్టివాడు కూడ ఇదే విధముగా మోక్షమును పొందుననుటలో సందేహము లేదు (51). సాధకుడు ఉపవాసము మొదలగు వాటిని చేసి మరణించినచో, ఆతడు శాస్త్రమునందలి విశ్వాసముచే లభించిన ధైర్యము గల మనస్సుతో అట్లు చేయగల్గినాడు గనుక ఆ మరణము శ్రేష్ఠమని మహర్షులు చెప్పియున్నారు (52). ఎవడైతే శివనిందయందు ప్రీతిగల వ్యక్తిని కొట్టి, లేదా తానే స్వయముగా వానిచే పీడించబడి, విడిచిపెట్ట శక్యము కాని ప్రాణములను విడిచిపెట్టునో, అట్టివానికి పునర్జన్మ లేదు (53). ఎవడైతే శివనిందయందు ప్రీతిగల వ్యక్తిని కొట్టబోయి, కొట్టలేక, తాను మరణించునో, అట్టివాడు తన కులములోని ఇరువది ఒక్క తరముల వారితో సహా వెంటనే మోక్షమును పొందును (54).ఎవడైతే శివుని కొరకు గాని, శివభక్తుని కొరకు గాని ప్రాణములను విడిచిపెట్టునో, మోక్షమార్గమునందు పయనించే అట్టివానితో సమానుడగు మానవుడు మరియొకడు లేడు (55). కావున , అట్టివానికి సంసారమండలము నుండి అత్యంతశీఘ్రముగా మోక్షము లభించును. ఎవడైతే వీటిలో ఏదో ఒక ఉపాయమును ఏదో విధముగా చేపట్టి గాని (56), లేదా యథావిధిగా షడధ్వశుద్ధిని పొంది గాని మరణించునో, వానికి అజ్ఞానులకు చేసిన విధముగా మరణానంతర సంస్కారములను చేయరాదు (57). వాని పుత్రులు మొదలగు వారికి ఆశౌచము ఉండదు. వాని దేహమును శివాచారమును పాటించుట కొరకై నేలలో పాతిపెట్టవచ్చును. లేదా, శివవిద్యయందలి ప్రీతిచే పవిత్రమగు అగ్నితో తగులబెట్టవచ్చును (58). లేదా, పవిత్రమగు జలములలో పారవేయవచ్చును. లేదా, కట్టెను వలె, మట్టిబెడ్డను వలె ఎక్కడైననూ పారవేయవచ్చును. అట్లుగాక, ఆ వ్యక్తిని ఉద్దేశించి అపరకర్మను చేసే ఉద్దేశ్యము ఉన్నచో (59), యథాశక్తి మంగళకరమగు సంస్కారమును మాత్రమే చేసి, శివభక్తులను సంతోషపెట్టవలెను.వాని ధనమును శివభక్తుడు అనుభవించవలెను. వాని సంతానము శివభక్తులైనచో, వారు అనుభవించ వచ్చును. అట్టి స్థితి లేనిచో, దానికి శివునకు సమర్పించవలెను. కాని శివభక్తి లేని అజ్ఞానులగు వాని సంతతి దానిని తీసుకొనరాదు (60).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివధ్యానవిధిని వర్ణించే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).