Siva Maha Puranam-4    Chapters   

అథ చత్వారింశో%ధ్యాయః

నైమిషీయ మహర్షుల యాత్ర

శ్రీసూత ఉవాచ |

ఇతి స విజిత మన్యోర్యాదవేనోపమన్యోరధిగతమభిధాయ జ్ఞానయోగం మునిభ్యః |

ప్రణతిముపగతేభ్యస్తేభ్య ఉద్భావితాత్మా సపది వియతి వాయుస్సాయమంతర్హితో%భూత్‌ || 1

తతః ప్రభాతసమయే నైమిషీయాస్తపోధనాః | సత్రాంతే%వభృథం కర్తుం సర్వ ఏవ సముద్యయుః || 2

తదా బ్రహ్మసమాదేశాద్దేవీ సాక్షాత్సరస్వతీ | ప్రసన్నా స్వాదుసలిలా ప్రావర్తత నదీ శుభా || 3

సరస్వతీం నదీం దృష్ట్వా మునయో హృష్టమానసాః | సమాప్య సత్రం ప్రారబ్ధం చక్రుస్తత్రావగాహనమ్‌ || 4

అథ సంతర్ప్య దేవాదీంస్తదీయైస్సలిలైశ్శివైః | స్మరంతః పూర్వవృత్తాంతం యయుర్వారాణసీం ప్రతి || 5

తదా తే హిమవత్పాదాత్పతంతీం దక్షిణాముఖీమ్‌ | దృష్ట్వా భాగీరథీం తత్ర స్నాత్వా తత్తీరతో యయుః || 6

తతో వారాణసీం ప్రాప్య ముదితాస్సర్వ ఏవ తే | తదోత్తరప్రవాహాయాం గంగాయామవగాహ్య చ || 7

అవిముక్తేశ్వరం లింగం దృష్ట్వాభ్యర్చ్య విధానతః | ప్రయాతుముద్యతాస్తత్ర దదృశుర్దివి భాస్వరమ్‌ || 8

సూర్యకోటిప్రతీకాశం తేజో దివ్యం మహాద్భుతమ్‌ | ఆత్మప్రభావితానేన వ్యాప్తసర్వదిగంతరమ్‌ || 9

అథ పాశుపతాస్సిద్ధా భస్మసంఛన్నవిగ్రహాః | మునయో%భ్యేత్య శతశో లీనాస్స్యుస్తత్ర తేజసి || 10

శ్రీసూతుడు ఇట్లు పలికెను-

ఈ విధముగా కోపమును జయించిన ఉపమన్యువునుండి యదుకులతిలకుడగు శ్రీకృష్ణుడు పొందిన జ్ఞానయోగమును ఆత్మజ్ఞానియగు ఆ వాయువు తనకు నమస్కరించిన ఆ మునులకు బోధించి, వెంటనే సాయంకాలసమయములో అంతరిక్షమునందు అంతర్ధానమును జెందెను (1). తరువాత మరునాడు ఉదయము నైమిషారణ్యవాసులు, తపస్సే ధనముగా గల వారు అగు ఆ మహర్షులు అందరు సత్రయాగము పూర్తి అయిన తరువాత అవభృథస్నానమునకు సంసిద్ధులైరి (2). అపుడు బ్రహ్మయొక్క ఆదేశముచే సాక్షాత్తుగా సరస్వతీదేవి ప్రసన్నురాలై తియ్యని జలములతో నిండిన నదీరూపములో ప్రవహించెను (3). మునులు సరస్వతీనదిని చూచి ఆనందముతో నిండిన మనస్సులు గలవారై తాము ప్రారంభించిన సత్రయాగమును పూర్తిచేసి, దాని యందు స్నానమును చేసిరి (4). తరువాత వారు ఆ సరస్వతీ నదియొక్క మంగళకరమగు జలములతో దేవతలు మొదలగు వారికి తర్పణములనిచ్చి, పూర్వములో జరిగిన వృత్తాంతమును స్మరిస్తూ, వారాణసీ నగరమునకు బయలుదేరిరి (5). అప్పుడు వారికి హిమవత్పర్వతమునుండి ఉదయించి దక్షిణముఖముగా ప్రవహించుచున్న భాగీరథీనది కనబడినది. వారు దానియందు స్నానము చేసి, దాని తీరము వెంబడి వెళ్లిరి (6). తరువాత వారందరు ఆనందముతో వారాణసిని చేరుకొని, అక్కడ ఉత్తరదిక్కు వైపునకు ప్రవహించే గంగయందు స్నానమును చేసి (7), అవిముక్తేశ్వర లింగమును దర్శించి, యథావిధిగా పూజించి, బయలు దేరుటకు సిద్ధపడుచుండగా, వారికి ఆకాశమునందు కోటి సూర్యుల కాంతితో ప్రకాశించునది, గొప్ప ఆశ్చర్యమును గొల్పునది, తన కాంతుల విస్తారముచే సకలదిక్కుల అంతము వరకు వ్యాపించియున్న ది అగు దివ్య తేజస్సు కానవచ్చెను (8, 9). అపుడు భస్మచే పూయబడిన దేహములు గల పాశుపతులు, సిద్ధులు, మునులు వందల సంఖ్యలో వచ్చి, ఆ తేజస్సునందు లీనమగుచుండిరి (10).

తథా విలీయమానేషు తపస్విషు మహాత్మసు | సద్యస్తిరోదధే తేజస్తదద్భుతమివాభవత్‌ || 11

తద్దృష్ట్వా మహదాశ్చర్యం నైమిషీయా మహర్షయః | కిమేతదిత్యజానంతో యయుర్బ్రహ్మవనం ప్రతి || 12

ప్రాగేవైషాం తు గమనాత్పవనో లోకపావనః | దర్శనం నైమిషీయాణాం సంవాదసై#్తర్మహాత్మనః || 13

శుద్ధాం బుద్ధిం తతస్తేషాం సాంబే సానుచరే శివే | సమాప్తిం చాపి సత్రస్య దీర్ఘపూర్వస్య సత్రిణామ్‌ || 14

విజ్ఞాప్య జగతాం ధాత్రే బ్రహ్మణ బ్రహ్మయోనయే | స్వకార్యే తదనుజ్ఞాతో జగామ స్వపురం ప్రతి || 15

అథ స్థానగతో బ్రహ్మా తుంబురోర్నారదస్య చ | పరస్పరస్పర్ధితయోర్గానే వివదమానయోః || 16

తదుద్భావితగానోత్థరసైర్మాధ్యస్థ్యమాచరన్‌ | గంధర్వైరప్సరోభిశ్చ సుఖమాస్తే నిషేవితః || 17

తదానవసరాదేవ ద్వాఃస్థైర్ద్వారి నివారితాః | మునయో బ్రహ్మభవనాద్బహిః పార్శ్వముపావిశన్‌ || 18

అథ తుంబురుణా గానే సమతాం ప్రాప్య నారదః | సాహచర్యేష్వనుజ్ఞాతో బ్రహ్మణా పరమేష్ఠినా || 19

త్యక్త్వా పరస్పరస్పర్ధాం మైత్రీం చ పరమాం గతః | సహ తేనాప్సరోభిశ్చ గంధర్వైశ్చ సమావృతః || 20

ఉపవీణయితుం దేవం నకులీశ్వరమీశ్వరమ్‌ | భవనాన్నిర్య¸° ధాతుర్జలదాదంశుమానివ || 21

తపశ్శాలురగు మహాత్ములు ఆ విధముగా విలీనమగుచుండగా, ఆ తేజస్సు వెంటనే మాయమయ్యెను. అది ఒక అద్భుతము వలె నుండెను (11). ఆ మహాద్భుతమును చూచి, నైమిషారణ్యవాసులగు మహర్షులు, ఇది యేమి ? అను విషయమునెరుంగని వారై, బ్రహ్మవనమునకు వెళ్లిరి (12). వీరు వెళ్లుటకు ముందే లోకములను పవిత్రము చేయు వాయుదేవుడు తాను నైమిషారణ్యవాసులగు మహర్షులను దర్శించుట, మహాత్ముడగు వాయువునకు వారితో జరిగిన సంభాషణము (13), ఆ సంభాషణము వలన వారికి పార్వతితో మరియు అనుచరులతో కూడియున్న శివునియందు పవిత్రమగు భక్తిభావము, దీర్ఘమగు సత్రయాగమును చేయుచున్న ఆ మహర్షులు ఆ యాగమును పూర్తి చేసిన వైనము (14) అను విషయములను జగత్తులను సృష్టించినవాడు, వేదములను ఆవిర్భవింప జేసినవాడు అగు బ్రహ్మగారికి విన్నవించి, తన లోక కార్యమునందు నిమగ్నుడగుటకు బ్రహ్మగారి అనుమతిని పొంది, తన నగరమునకు వెళ్లెను (15). తరువాత తన లోకమునందున్న బ్రహ్మగారు, ఒకరితో నొకరు గానము విషయములో స్పర్ధ గలవారై వివాదపడుచున్న నారదతుంబురులకు (16) మధ్యవర్తియై, వారు చేసే గంభీరమగు గానము నుండి పుట్టిన మధురానుభూతిని గంధర్వులతో మరియు అప్సరసలతో కలిసి ఆస్వాదిస్తూ, వారిచే సేవించ బడుచున్నవాడై, సుఖముగా కూర్చుని యుండెను (17). ఆ సమయములో లోపల స్థలము లేకుండుట చే ద్వారపాలకులు ఆ మహర్షులను ద్వారము వద్దనే నిలిపి వేయగా, వారు బ్రహ్మభవనమునకు బయట ప్రక్కనే కూర్చుండిరి (18). తరువాత నారదుడు గానవిద్యయందు తుంబురునితో సమానమగు స్థాయిని సంపాదించి, తుంబురునితో కలిసి స్నేహమును చేయుమని పరమేష్ఠియగు బ్రహ్మగారిచే ఆజ్ఞాపించబడెను (19). అపుడు వారిద్దరు ఒకరితో నొకరు స్పర్ధను విడనాడి, మంచి స్నేహితులైరి. తుంబురుడు, అప్సరసలు మరియు గంధర్వులు నారదుని చుట్టుముట్టిరి (20). ఆయన నకులీశ్వర మహాదేవుని సమీపములో వీణను వాయించుటకై బ్రహ్మగారి భవనమునుండి, మేఘమునుండి సూర్యుని వలె , బయటకు వచ్చెను (21).

తం దృష్ట్వా షట్కులీయాస్తే నారదం మునిగోవృషమ్‌ | ప్రణమ్యావసరం శంభోః పప్రచ్ఛుః పరమాదరాత్‌ ||22

స చావసర ఏవాయమితోంతర్గమ్యతామితి | వదన్యయావన్యపరస్త్వరయా పరయా యుతః || 23

తతో ద్వారి స్థితా యే వై బ్రహ్మణ తాన్న్యవేదయన్‌ | తేన తే వివిశుర్వేశ్మ పిండీభూయాండజన్మనః || 24

ప్రవిశ్య దూరతో దేవం ప్రణమ్య భువి దండవత్‌ | సమీపే తదనుజ్ఞాతాః పరివృత్యోపతస్థిరే || 25

తాంస్తత్రావస్థితాన్‌ దృష్ట్వా కుశలం కమాలసనః | వృత్తాంతం వో మయా జ్ఞాతం వాయురేవాహ నో యతః || 26

భవద్భిః కిం కృతం పశ్చాన్మారుతేంతర్హితే సతి | ఇత్యుక్తవతి దేవేశే మునయో%వభృథాత్పరమ్‌ || 27

గంగాతీర్థేస్య గమనం యాత్రాం వారాణసీం ప్రతి | దర్శనం తత్ర లింగానాం స్థాపితానాం సురేశ్వరైః || 28

అవిముక్తేశ్వరస్యాపి లింగస్యాభ్యర్చనం సకృత్‌ | ఆకాశే మహతస్తస్య తేజోరాశేశ్చ దర్శనమ్‌ || 29

మునీనాం విలయం తత్ర నిరోధం తేజసస్తతః | యాథాత్మ్యావేదనం తస్య చింతితస్యాపి చాత్మభిః || 30

సర్వం సవిస్తరం తసై#్మ ప్రణమ్యాహుర్ముహుర్ముహుః | మునిభిః కధితం శ్రుత్వా విశ్వకర్మా చతుర్ముఖః || 31

కంపయిత్వా శిరః కించిత్ర్పాహ గంభీరయా గిరా |

ఆరు వంశములకు చెందిన ఆ ఋషులు శంభుని భక్తుడగు ఆ నారదమహర్షిని చూసి నమస్కరించి, బ్రహ్మగారిని చూసే అవకాశమును గురించి గొప్ప ఆదరముతో ప్రశ్నించిరి (22). అట్టి అవకాశము ఇప్పుడే గలదు, మీరు లోపలకు వెళ్లుడు అని పలుకుతూ, మరియొక పని హడావుడిలోనున్న నారదుడు చాల వేగముతో వెళ్లిపోయెను (23). తరువాత ద్వారము వద్దనున్నవారు వీరి గురించి బ్రహ్మగారికి చెప్పిరి. ఆయన అనుమతిని పొంది వారు బ్రహ్మగారి భవనములోనికి ఒక గుంపుగా ప్రవేశించిరి (24). అట్లు ప్రవేశించి దూరమునుండియే బ్రహ్మగారికి సాష్టాంగనమస్కారమును చేసి, ఆయన అనుమతిని పొంది ఆయన చుట్టూ దగ్గరగా నిలబడిరి (25). ఆ విధముగా అచట నిలబడియున్న ఆ మహర్షులను చూచి, బ్రహ్మగారు కుశలమునడిగి, ఇట్లు పలికెను: మీ వృత్తాంతము నాకు తెలిసినది. ఏలయన, మాకు వాయువే స్వయముగా చెప్పినాడు (26). వాయుదేవుడు అంతర్ధానమైన పిదప మీరు ఏమి చేసితిరి? ఆ దేవప్రభువు ఇట్లు ప్రశ్నించగా, ఆ మునులు అవభృథస్నానము తరువాత (27) తాము గంగాతీర్థమునకు వెళ్లుట, వారాణసీ యాత్ర, అచట లోకపాలకులచే స్థాపించబడిన లింగములను దర్శించుట (28), ఒక్కసారి అవిముక్తేశ్వర లింగమును అర్చించుట, ఆకాశములో ఆ పెద్ద తేజస్సుయొక్క ముద్ద కనబడుట (29), దానియందు మునులు విలీనమగుట, తరువాత ఆ తేజస్సు అంతర్థానమగుట, తాము ఎంత ఆలోచించిననూ ఆ తేజస్సు యొక్క యథార్థస్వరూపమును తెలియలేక పోవుట (30) అనే విషయములను అన్నింటినీ విస్తారముగా ఆయనకు పలుమార్లు నమస్కరించి చెప్పిరి. మునులు చెప్పిన ఆ వృత్తాంతమును విని, జగత్తును సృష్టించిన ఆ నాలుగు మోముల దైవము (31) తలను కొద్దిగా పంకించి గంభీరమగు వాక్కుతోనిట్లు పలికెను.

ప్రత్యాసీదతి యుష్మాకం సిద్ధిరాముష్మికీ పరా || 32

భవద్భిర్దీర్ఘసత్రేణ చిరమారాధితః ప్రభుః | ప్రసాదాభిముఖో భూత ఇతి భూతార్థసూచితమ్‌ || 33

వారాణస్యాం తు యుష్మాభిర్యద్దృష్టం దివి దీప్తిమత్‌ | తల్లింగసంజ్ఞితం సాక్షాత్తేజో మాహేశ్వరం పరమ్‌ || 34

తత్ర లీనాశ్చ మునయః శ్రౌతుపాశుపతవ్రతాః | ముక్తా బభూవుస్స్వస్థాశ్చనైష్ఠికా దగ్ధకిల్బిషాః || 35

ప్రాప్యానేన యథా ముక్తిరచిరాద్భవతామపి | స చాయమర్థస్సూచ్యేత యుష్మద్దృష్టేన తేజసా || 36

తత్ర వః కాల ఏవైష దైవాదుపనతస్స్వయమ్‌ | ప్రయాత దక్షిణం మేరోశ్శిఖరం దేవసేవితమ్‌ || 37

సనత్కుమారో యత్రాస్తే మమ పుత్రః పరో మునిః | ప్రతీక్ష్యాగమనం సాక్షాద్భూతనాథస్య నందినః || 38

పురా సనత్కుమారోపి దృష్ట్వాపి పరమేశ్వరమ్‌ | అజ్ఞానాత్సర్వయోగీంద్రమానీ వినయదూషితః || 39

అభ్యుత్థానాదికం యుక్తమకుర్వన్నతినిర్భయః | తతో%పరాధాత్ర్కుద్ధేన మహోష్ట్రో నందినా కృతః || 40

మీకు సర్వోత్కృష్టమైన ఆముష్మిక (పరలోకసంబంధి) మగు సిద్ధి చాల దగ్గరలో నున్నది (32). మీరు దీర్ఘమగు సత్రయాగమును చేసి చిరకాలము ఆ శివప్రభువును ఆరాధించితిరి. ఆయన ఇప్పుడు అనుగ్రహించుటకు అభిముఖముగా నున్నాడని జరిగిన ఆ ఘటన వలన సూచించబడుచున్నది (33). మీరు వారాణసిలో అంతరిక్షమునందు గొప్పగా ప్రజ్వరిల్లే ఏ జ్యోతిని చూచితిరో, అది సాక్షాత్తుగా మహేశ్వరుని పరమజ్యోతిర్మయ లింగము (34). దాని యందు వేదోక్తమగు పాశుపతవ్రతమును నిష్ఠాపూర్వకముగా అనుష్ఠించే మునులు విలీనమై నశించిన పాపములు గలవారై మోక్షమును పొంది స్వస్వరూపమునందు ఉన్నారు (35). మీకు కూడ ఇదే మార్గములో తొందరలోనే మోక్షము లభించగలదు. మీరు చూచిన తేజస్సుచే ఈ విషయమే సూచించబడినది (36). మీకు కూడ మోక్షము లభించే ఈ కాలము దైవేచ్ఛచే తనంత తానుగా సంప్రాప్తమైనది. దేవతలచే సేవించబడే మేరుపర్వతముయొక్క దక్షిణశిఖరమునకు ప్రయాణము కండు (37). నా పుత్రుడగు సనత్కుమారమహర్షి సాక్షాత్తుగా భూతగణములకు ప్రభువగు నందీశ్వరుని రాకను ప్రతీక్షిస్తూ అక్కడనే ఉన్నాడు (38). పూర్వము సనత్కుమారుడు కూడ పరమేశ్వరుని చూచి కూడా, అజ్ఞానముచే కలుషితమైన వినయస్వభావము గలవాడై, తానే యోగులందరిలో గొప్పవాడనని తలపోసినాడు (39). ఆయన దాని వలన ఏ మాత్రము భయము లేనివాడై శివునకు ఎదురేగి యోగ్యమగు సత్కారమును చేయలేదు. ఈ అపరాధమునకు కోపించి నందీశ్వరుడు ఆయనను శపించి పెద్ద ఒంటెగా మార్చి వేసినాడు (40).

అథ కాలేన మహతా తదర్థే శోచతా మయా | ఉపాస్య దేవం దేవీం చ నందినం చానునీయ వై || 41

కథంచిదుష్ట్రతా తస్య ప్రయత్నేన నివారితా | ప్రాపితో హి యథాపూర్వం సనత్పూర్వం కుమారతామ్‌ || 42

తదాహ చ మహాదేవస్స్మయన్నివ గణాధిపమ్‌ | అవజ్ఞాయ హి మామేవ తధా హంకృతవాన్మునిః || 43

అతస్త్వమేవ యాథాత్మ్యం మమాసై#్మ కథయానఘ | బ్రహ్మణః పూర్వజః పుత్రో మా మూఢ ఇవ సంస్మరన్‌ || 44

మయైవ శిష్యతో దత్తో మమ జ్ఞానప్రవర్తకః | ధర్మాధ్యక్షాభిషేకం చ తవ నిర్వర్తయిష్యతి || 45

స ఏవం వ్యాహృతో భూయస్సర్వభూతగణాగ్రణీః | యత్పురా జ్ఞాపనం మూర్ధ్నా ప్రాతః ప్రతిగృహీతవాన్‌ || 46

తథా సనత్కుమారో% పి మే రౌ మదనుశాసనాత్‌ | ప్రసాదార్థం గణస్యాస్య తపశ్చరతి దుశ్చరమ్‌ || 47

ద్రష్టవ్యశ్చేతి యుష్మాభిః ప్రాగ్గణశసమాగమాత్‌ | తత్ర్పసాదార్థమచిరాన్నందీ తత్రాగమిష్యతి || 48

ఇతి సత్వరమాదిశ్య ప్రేషితా విశ్వయోనినా | కుమార శిఖరం మేరోర్దక్షిణం మునయో యయుః || 49

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే నైమిషీయ మహర్షి యాత్రావర్ణనం నామ చత్వారింశో%ధ్యాయః (40).

ఆ తరువాత చాల కాలము గడిచనది. ఆ సనత్కుమారుని స్థితిని చూచి దుఃఖమును పొందిన నేను పార్వతీపరమేశ్వరులను ఉపాసించి, నందీశ్వరునకు నచ్చజెప్పి (41), ప్రయత్నించి అతికష్టము మీద ఆతని ఒంటె రూపమును మార్చగలిగినాను. ఆయన తనకు పూర్వము నందుండే సనత్కుమార రూపమును మరల పొందినాడు (42). అపుడు మహాదేవుడు చిరునవ్వుతో గణాధ్యక్షుడగు నందీశ్వరునితో ఇట్లు చెప్పెను: ఓయీ పుణ్యాత్మా ! ఈ మహర్షి నన్ను కూడ తిరస్కరించునంతటి అహంకారమును పెంచుకున్నాడు. కావున, నీవే ఆయనకు నా యథార్థస్వరూపమును గురించి చెప్పుము. బ్రహ్మయొక్క పెద్ద కొడుకు మూర్ఖుని వలె నన్ను స్మరించుచున్నాడు (43, 44). నేనే ఈతనిని నీకు శిష్యునిగా అప్పజెప్పుచున్నాను. ఈతడు నా జ్ఞానమును లోకములో ప్రవర్తిల్ల జేయగలడు. ఇంతేగాక, ఈయన నిన్ను ధర్మాధ్యక్షపదవియందు అభిషేకించగలడు (45). సకలభూతగణములకు అధ్యక్షుడగు నందీశ్వరుడు ఈ విధముగా ప్రాతః కాలమునందు శివునిచే ఆజ్ఞాపించ బడినవాడై ఆ ఆజ్ఞను శిరస్సును వంచి స్వీకరించెను (46). అదే విధముగా సనత్కుమారుడు కూడ నా ఆజ్ఞచే మేరుపర్వతమునందు గణాధ్యక్షుడగు ఈ నందీశ్వరుని అనుగ్రహము కొరకు ఇతరులు చేయ శక్యము కాని తపస్సును చేయుచున్నాడు (47). ఆయన నందీశ్వరునితో కలియుటకు పూర్వమే మీరు ఆయనను దర్శించవలెను. నందీశ్వరుడు ఆయనను అనుగ్రహించుట కొరకై అచటకు తొందరలో రాగలడు (48). ఈ విధముగా ఆదేశించి జగన్నిర్మాతయగు బ్రహ్మ వారిని వెంటనే పంపగా, ఆ మునులు మేరుపర్వతమునకు దక్షిణమునందున్న కుమారశిఖరమునకు వెళ్లిరి (49).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో నైమిషీయ మహర్షుల యాత్రను వర్ణించే నలుబదియవ అధ్యాయము ముగిసినది (40).

Siva Maha Puranam-4    Chapters