Siva Maha Puranam-4
Chapters
అథ పంచచత్వారింశోధ్యాయః మహాకాళీ ప్రాదుర్భావము మునయ ఊచుః | శ్రుతా శంభోః కథా రమ్యా నానాఖ్యాన సమన్వితా | నానావతారసంయుక్తా భుక్తిముక్తి ప్రదా నృణామ్ || 1 ఇదానీం శ్రోతుమిచ్ఛామస్త్వత్తో బ్రహ్మవిదాం వర | చరిత్రం జగదంబాయా భగవత్యా మనోహరమ్ || 2 పరబ్రహ్మమహేశస్య శక్తిరాద్యా సనాతనీ | ఉమా యా సమభిఖ్యాతా త్రైలోక్యజననీ పరా || 3 సతీ హైమవతీ తస్యా అవతారద్వయం శ్రుతమ్ | అపరానవతారాంస్త్వం బ్రూహి సూత మహామతే || 4 కో విరజ్యేత మతిమాన్ గుణశ్రవణకర్మణి | శ్రీ మాతుర్ జ్ఞానినో యాని న త్యజంతి కదాచన || 5 మునులు ఇట్లు పలికిరి - సుందరమైనది. అనేకములగు ఉపాఖ్యానములతో కూడియున్నది, అనేకములగు అవతారములతో ఒప్పారునది, మానవులకు భుక్తిని మరియు ముక్తిని ఇచ్చునది అగు శంభు చరితమును వింటిమి (1). బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠమైనవాడా! ఇపుడు నీ నుండి జగన్మాతయగు భగవతి యొక్క మనోహరమగు చరిత్రమును వినగోరుచున్నాము (2) పరబ్రహ్మయగు మహేశ్వరుని శక్తి స్వరూపిణి, సృష్టికి కారణము, సనాతని, ముల్లోకములకు తల్లి, సర్వోత్కృష్టురాలు అగు ఉమాదేవియొక్క సతీ-పార్వతీ అనే రెండు అవతారములను గురించి వింటిమి. ఓ సూతా! నీవు మహాబుద్ధిశాలివి. మిగిలిన అవతారములను కూడ చెప్పుము (3,4). శ్రీ మాతయొక్క గుణములను వినుట అను పనిలో బుద్ధిమంతుడగు ఎవ్వానికి విరక్తి కలుగును? జ్ఞానులు ఈ గాథలను ఎన్నడైననూ విడిచిపెట్టరు (5). సూత ఉవాచ | ధన్యా యూయం మహాత్మానః కృతకృత్యాస్థ్స సర్వదా | యత్పృచ్ఛథ పరాంబాయా ఉమాయాశ్చరితం మహత్ || 6 శృణ్వతాం పృచ్ఛతాం చైవ తథా వాచయతాం చ తత్ | పాదాంబుజరజాంసీవ తీర్థాని మునయో విదుః || 7 తే ధన్యాః కృతకృత్యాస్స్యుర్ధన్యా తేషాం ప్రసూః కులమ్| యేషాం చిత్తం భ##వేల్లీనం శ్రీ దేవ్యాం పరసంవిది || 8 యే న స్తువంతి దేవేశీం సర్వకారణకారణామ్ | మాయాగుణౖర్మోహితాస్స్యుర్హత భాగ్యాన సంశయః | 9 న భజంతి మహాదేవీం కరుణారసససాగరామ్ | అంధకూపే పతంత్యేతే ఘోరే సంసారరూపిణి | 10 గంగాం విహాయ తృప్త్యర్థం మరువారి యథా వ్రజేత్ | విహాయ దేవీం తద్భిన్నం తథా దేవాతరం వ్రజేత్ || 11 యస్యాస్స్మరణ మాత్రేణ పురుషార్థచతుష్టయమ్ | అనాయాసేన లభ##తే కస్త్యజేత్తాం నరోత్తమః || 12 ఏతత్పృష్టః పురామేధాస్సురథేన మహాత్మనా | యదుక్తం మేధసా పూర్వం తచ్ఛృణుష్వ వదామితే || 13 స్వారో చిషేంతరే పూర్వం విరథో నామ పార్థివః | సురథస్తస్య పుత్రో% భూన్మహాబలపరాక్రమః || 14 దానశౌండస్సత్యవాదీ స్వధర్మకుశలః కృతీ | దేవీభక్తో దయాసింధుః ప్రజానాం పరిపాలకః | 15 సూతుడిట్లు పలికెను - మహాత్ములగు మీరు ధన్యులు మీరు సర్వకాలములలో కృతకృత్యులై యున్నారు. ఏలయనగా, మీరు సర్వజగన్మాతయగు ఉమాదేవియొక్క గొప్ప చరిత్రమును గురించి ప్రశ్నించినారు (6). ఉమా చరితము వినువారిని, ప్రశ్నించువారిని, చెప్పించువారిని కూడ ఆమె పాదపద్మములయందలి ధూళివలె పావనము చేయునని మహర్షులు చెప్పుచున్నారు (7). ఎవరి మనస్సు పరమచైతన్యస్వరూపిణియగు శ్రీదేవియందు లీనమగునో, వారే ధన్యులు, కృతార్థులు అగుదురు. వారి కులము మరియు సంతానము కూడ ధన్యమగును (8). ఎవరైతే కారణములన్నింటికీ కారణమగు ఆ దేవదేవిని స్తుతించరో, వారు మాయయొక్క గుణములచే మోహమును పొంది నష్టభాగ్యులగుదురనుటలో సందేహము లేదు (9). కరుణారసమునకు నిధియగు ఆ మహాదేవిని ఎవరైతే సేవించరో, వారు భయంకరమగు సంసారమనే చీకటి నూతిలో పడెదరు (10). దేవిని విడిచిపెట్టి మరియొకదైవము నాశ్రయించుట, గంగను విడిచిపెట్టి దాహశాంతి కొరకై ఎండమావుల నీటిని ఆశ్రయించుట వంటిది యగును (11). ఏ దేవిని స్మరించుట మాత్రముచే నాల్గు పురుషార్థములు అనాయాసముగా సిద్ధించునో, అట్టి దేవిని ఉత్తముడగు ఏ మానవుడు విడిచిపెట్టును? (12) పూర్వము మహాత్ముడగు సురథుడు మేధసుని ఇదే విధముగా ప్రశ్నించగా, ఆ మేధసుడు చెప్పిన విషయమును నీకు చెప్పుచున్నాను. వినుము (13). పూర్వము స్వారోచిషమన్వంతరములో విరథుడనే రాజు ఉండెను. ఆయనకు గొప్ప బలపరాక్రమములు గల సురథుడనే పుత్రుడు ఉండెను (14). దానములో నిపుణుడు, సత్యమును పలుకువాడు, స్వధర్మములో నేర్పరి, సమర్థుడు, దేవీభక్తుడు, దయాసముద్రుడు అగు ఆ రాజు ప్రజలను చక్కగా పాలించుచుండెను (15). పృథివీం శాసతస్తస్య పాకశాసనతేజసః | బభూవుర్నవ యే భూపాః పృథివీగ్రహణతత్పరాః || 16 కోలానామ్నీం రాజధానీం రురుధుస్తస్య భూపతేః | తైస్సమం తుములం యుద్ధం సమపద్యత దారుణమ్ | | 17 యుద్ధే స నిర్జితో భూపః ప్రబలైసై#్తర్ద్విషద్గణౖః | ఉజ్జాసితశ్చ కోలాయా హత్వా రాజ్యమశేషతః || 18 స రాజా స్వపురీమేత్యాకరోద్రాజ్యం స్వమంత్రిభిః | తత్రాపి చ మహాపక్లైర్విపక్లైస్స పరాజితః || 19 దైవాచ్ఛత్రుత్వమాపన్నైరమాత్యప్రముఖైర్గణౖః | కోశస్థితం చ యద్విత్తం తత్సర్వం చాత్మసాత్కృతమ్ || 20 తతస్స నిర్గతో రాజా నగరాన్మృగయాఛలాత్ | అసహాయో%శ్వమారుహ్య జగామ గహనం వనమ్ || 21 ఇతస్తతస్తత్ర గచ్ఛన్ రాజా మునివరాశ్రమమ్ | దదర్శ కుసుమారామభ్రాజితం సర్వతోదిశమ్ || 22 వేదధ్వనిసమాకీర్ణం శాంతజంతు సమాశ్రితమ్ | శిషై#్యః ప్రశిషై#్యస్తచ్ఛిషై#్యస్సమంతాత్పరివేష్టితమ్ || 23 వ్యాఘ్రాదయో మహావీర్యా అల్పవీర్యాన్మహామతే | తదాశ్రమే న బాధంతే ద్విజవర్య ప్రభావతః || 24 ఉవాస తత్ర నృపతిర్మహాకారుణికో బుధః | సత్కృతో మునినాథేన సువచో భోజనాసనైః || 25 ఇంద్రుని వంటి తేజశ్శాలియగు ఆ రాజు భూమిని పాలించుచుండెను. ఇంతలో తొమ్మిది మంది రాజులు పరరాజ్యములను ఆక్రమించుటలో నిమగ్నమై యుండిరి (16). వారు ఆ మహారాజుయొక్క రాజధానియగు కోలానగరమును ముట్టడించిరి. వారితో ఆయనకు దారుణమగు సంకులసమరము జరిగెను (17). ఆ రాజు అధిక బలశాలురగు ఆ శత్రుమూకల చేతిలో ఓడిపోయెను. వారు ఆయన రాజ్యమునంతనూ అపహరించి కోలానగరమునుండి తరిమివేసిరి (18). ఆ రాజు అపుడు తన నగరమునకు వచ్చి తన మంత్రులతో గూడి రాజ్యమునేలుచుండెను. అక్కడ కూడ పెద్ద సైన్యము గల శత్రువులాయనను ఓడించిరి (19). విధివశముచే ఆయనకు మంత్రులు మరియు ఇతర అధికారులు శత్రువులై కోశాగారములోని ధనమునంతనూ స్వంతము చేసుకొనిరి (20). అపుడు నిస్సహాయుడగు ఆ రాజు వేటఅనే మిషచే నగరమునుండి గుర్రమునెక్కి బయటకు వచ్చి దట్టనైన అడవిలోనికి ప్రవేశించెను (21). ఆ రాజు ఇటునటు తిరుగుచూ, పుష్పోద్యానములతో అన్నిదిక్కులయందు ప్రకాశించునది, వేదధ్వనితో మారుమ్రోగుచున్నది, శాంతముగా నున్న జంతువులకు ఆశ్రయమైనది, శిష్యులచే మరియు వారి శిష్యులచే మరియు వారి శిష్యులచే అంతటా చుట్టువారబడియున్నది అగు ఒక మహర్షియొక్క ఆశ్రమమును చూచెను (22,23). ఓ మహాబుద్ధిశాలీ! ఆ మహర్షియొక్క మహిమ వలన ఆయన ఆశ్రమములో పెద్ద పులి మొదలైన మహాబలము గల జంతువులు తక్కువ బలము గల జంతువులను బాధించుట లేదు (24). గొప్ప దయాశాలి, పండితుడు అగు ఆ రాజును మహర్షి మంచిమాటలతో ఆసనమునిచ్చి భోజనమునిడి సత్కరించెను. ఆ రాజు అచటనే నివసించెను (25). ఏకదా స మహారాజశ్చింతామాప దురత్యయామ్ | అహో మే హీనభాగ్యస్య దుర్బుద్ధేర్హీనతేజసః || 26 హృతం రాజ్యమశేషేణ శత్రువర్గైర్మదోద్ధతైః | మత్పూర్వై రక్షితం రాజ్యం శత్రుభిర్భుజ్యతే%ధునా || 27 మాదృశ##శ్చైత్రవంశేస్మిన్న కోప్యాసీ న్మహీపతిః | కిం కరోమి క్వ గచ్ఛామి కథం రాజ్యం లభేమహి || 28 అమాత్యా మంత్రిణశ్చైవ మామకా యే సనాతనాః | న జనే కం చ నృపతిం సమాసాద్యాధునాసతే || 29 వినాశ్య రాజ్యమధునా న జానే కాం గతిం గతాః | రణభూమి మహోత్సాహా అరివర్గనికర్తనాః || 30 మామకా యే మహాశూరా నృపమన్యం భజంతి తే | పర్వతాభా గజా అశ్వా వాతవద్వేగగామినః || 31 పూర్వపూర్వార్జితః కోశః పాల్యతే తైర్న వాధునా | ఏవం మోహవశం యాతో రాజా పరమాధార్మికః || 32 ఏతస్మిన్నంతరే తత్రవైశ్యః కశ్చిత్సమాగతః | రాజా పప్రచ్ఛ కస్త్వం భోః కిమర్థమిహ చాగతః || 33 దుర్మనా లక్ష్యసే కస్మాదేతన్మే బ్రూహి సాంప్రతమ్ | ఇత్యాకర్ణ్య వచో రమ్యం నరపాలేన భాషితమ్ || 34 దృగ్భ్యాం విముంచన్నశ్రూణి సమాధిర్వైశ్యపుంగవః | ప్రత్యువాచ మహీపాలం ప్రణయావనతాం గిరమ్ || 35 ఒకనాడు ఆ మహారాజు అతిక్రమించ శక్యము కాని మానసిక దుఃఖమును పొందెను అయ్యో! నేను మందభాగ్యుడను. దుష్టబుద్ధిని, క్షీణించిన తేజస్సుగలవాడను అగు (26). నా రాజ్యమునంతనూ బలముచే గర్వించియున్న శత్రువుల మూకలు అపహరించినవి. నా పూర్వీకులచే పాలించబడిన రాజ్యమును ఈనాడు శత్రువులు అనుభవించుచున్నారు (27). ఈ చైత్రవంశములో నా వంటి రాజు మరియొకడు లేడు. నేనేమి చేయుదును? ఎచటకు పోయెదను? రాజ్యమును ఎట్లు పాందెదను? (28) పూర్వతరములనుండి వచ్చుచున్న నా మంత్రులు, సలహాదారులు ఇపుడు ఏ రాజును ఆశ్రయించియున్నారో నాకు తెలియకున్నది (29). రాజ్యమును నశింపజేసిన ఆ మంత్రులు ఇపుడు ఏ గతిని పొందినారో నాకు తెలియదు. యుద్ధభూమిలో గొప్ప ఉత్సాహమును చూపి శత్రు మూకలను దునుమాడే మహాశూరులగు నా సైనికులు ఇపుడు మరియొక రాజును సేవించుచున్నారు. నా ఏనుగులు పర్వతముల వంటివి. గుర్రములు గాలితో సమముగా పరుగెత్తెడివి (30,31). పూర్వజులగు రాజులచే సంపాదించబడిన ఖజానా ఇపుడు సురక్షితముగా ఉన్నదో? లేదో? పరమధర్మాత్ముడగు ఆ రాజు ఈ విధముగా మోహమునకు వశుడై యుండెను (32). ఇంతలో అచటకు ఒకవైశ్యుడు విచ్చేసెను. రాజు ఆయనను ఇట్లు ప్రశ్నించెను: అయ్యా! మీరెవరు? ఇచటకు ఏల వచ్చిరి? (33) మీ మనస్సు ప్రసన్నముగా లేదని మీ ముఖమును బట్టి తెలియుచున్నది. ఆ విషయమును నాకిపుడు చెప్పుడు. ఆ మహారాజు పలికిన ఈ మధురమగు మాటలను విని (34), కన్నుల వెంబడి నీటిని గార్చుచూ, సమాధియను పేరుగల ఆ వైశ్యోత్తముడు ప్రేమ పూర్వకముగా సవినయముగా ఆ రాజుతో నిట్లనెను (35). వైశ్య ఉవాచ | సమాధిర్నామ వైశ్యో%హం ధనివంశసముద్భవః | పుత్రదారాదిభిస్త్యక్తో ధనలోభాన్మహీపతే || 36 వనమభ్యాగతో రాజన్ దుఃఖితస్స్వేన కర్మణా | సోహం పుత్రప్రపౌత్రాణాం కలత్రాణాం తథైవ చ || 37 భ్రాతౄణాం భ్రాతృపుత్రాణాం పరేషాం సుహృదాం తథా | న వేద్మి కుశలం సమ్యక్ కరుణాసాగర ప్రభో || 38 వైశ్యుడు ఇట్లు పలికెను- నేను వైశ్యుడను. నా పేరు సమాధి. నేను ధనికుల వంశములో పుట్టినాను. ఓ రాజా! ధనమునందలి లోభముచే నన్ను పుత్రులు, భార్యమొదలగు వారు విడిచిపెట్టినారు (36). ఓ రాజా! నేను చేసిన కర్మచే దుఃఖితుడనై అడవికి వచ్చితిని. ఓ ప్రభూ! నీవు దయాసముద్రుడవు. అట్టి నాకు పుత్రులు, పౌత్రులు, భార్య, సోదరులు, వారి పుత్రులు మరియు ఇతరులగు మిత్రులు అను వారి క్షేమ సమాచారము చక్కగా తెలియకున్నది (37,38). రాజోవాచ | నిష్కాసితో యైః పుత్రాద్యైర్దుర్వృత్తైర్ధన గర్ధిభిః | తేషు కిం భవతా ప్రీతిః క్రియతే మూర్ఖజంతువత్ || 39 రాజు ఇట్లు పలికెను - ఏ పుత్రుడు మొదలగు వారు ధనమందలి లోభముచే దుష్టచేష్టులై నిన్ను నెట్టివేసినారో, వారియందు నీవు మూర్ఖప్రాణి వలె ఇంకనూ ప్రీతిని ఏల కలిగియున్నావు? (39) వైశ్య ఉవాచ | సమ్యగుక్తం త్వయా రాజన్ వచస్సారార్థ బృంహితమ్ | తథాపి స్నేహపాశేన మోహ్యతే%తీవ మే మనః || 40 ఏవం మోహాకులౌ వైశ్యపార్థివౌ మునిసత్తమ | జగ్మతుర్మునివర్యస్య మేధసస్సన్నిధిం తదా || 41 స వైశ్యరాజసహితో నరరాజః ప్రతాపవాన్ | ప్రణనామ మహాధీర శ్శిరసా యోగినాం వరమ్ | 42 బద్ధ్వాంజలిమిమాం వాచమూవాచ నృపతిర్మునిమ్ | భగవన్నావయోర్మోహం ఛేత్తుమర్హసి సాంప్రతమ్ || 43 అహం రాజశ్రియా త్యక్తో గహనం వనమాశ్రితః | తథాపి హృతరాజ్యస్య తోషోనైవాభిజాయతే || 44 అయం చ వైశ్య స్స్వజనైర్దారాద్యైర్నిష్కృతో గృహాత్ | తథాప్యేతస్య మమతా న నివృత్తిం సమశ్నుతే || 45 కిమత్ర కారణం బ్రూహి జ్ఞానినోరపి నో మనః | మోహేన వ్యాకులం జాతం మహత్యేషా హి మూర్ఖతా || 46 వైశ్యుడు ఇట్లు పలికెను- ఓ రాజా! నీవు సారవంతమగు అర్థముతో నిండియున్న వచనమును చక్కగా చెప్పితివి. అయిననూ, నా మనస్సు అనురాగము అను పాశముచే బంధింపబడి తీవ్రమగు మోహమునకు వశ##మై యున్నది (40). ఓ మహార్షీ! ఈ విధముగా మోహవశులై దుఃఖితులై యున్న ఆ వైశ్యుడు మరియు రాజు మేధసుడు అనే మహర్షి వద్దకు ఆ సమయములో వెళ్లిరి (41). ప్రతాపము గలవాడు, గొప్ప వివేకి అగు ఆ మహారాజు వైశ్యశ్రేష్ఠునితో గూడినవాడై యోగివర్యుడగు ఆ మేధసునకు తలవంచి ప్రణమిల్లెను (42). ఆ రాజు చేతులను జోడించి మహర్షితో నిట్లనెను. ఓ పూజ్యా! నీవు ఇపుడు మా యిద్దరి మోహమును నిర్మూలించదగును (43). నేను రాజ్యలక్ష్మిని పోగొట్టుకొని దట్టమగు అడవుల పాలైతిని. అయిననూ, రాజ్యము అపహరింపబడిన నాకు సంతోషము లేశ##మైననూ కలుగుట లేదు (44). ఈ వైశ్యుని భార్య మొదలగు స్వీయజనులు ఇంటినుండి వెళ్లగొట్టిరి. అయిననూ, ఈతనికి స్వజనుల యందలి మమకారము తగ్గుట లేదు (45). దీనికి కారణమేమి? చెప్పుడు. వివేకము గలవారమే అయినా మా మనస్సులు మోహమునకు వశ##మై దుఃఖితమై యున్నవి. ఈ మూర్ఖత చాల బలీయమైనది (46). ఋషిరువాచ | మహామాయా జగద్ధాత్రీ శక్తిరూపా సనాతనీ | సామోహయతి సర్వేషాం సమాకృష్య మనాంసివై || 47 బ్రహ్మాదయస్సురాస్సర్వే యన్మాయామోహితాః ప్రభో | న జానంతి పరం తత్త్వం మనుష్యాణాం చ కా కథా || 48 సా సృజత్యఖిలం విశ్వం సైవ పాలయతీతి చ | సైవ సంహరతే కాలే త్రిగుణా పరమేశ్వరీ || 49 యస్యోపరి ప్రసన్నా సా వరదా కామరూపిణీ | స ఏవ మోహమత్యేతి నాన్యథా నృపసత్తమ || 50 ఋషి ఇట్లు పలికెను - జగన్మాత, శక్తి స్వరూపిణి, ఆద్యంతములు లేనిది అగు ఆ మహామాయ సర్వుల మనస్సులను బలముగా ఆకర్షించి మోహపెట్టుచున్నది (47). ఓ రాజా! ఆ మాయచే మోహితులైన బ్రహ్మ మొదలగు దేవతలందరు కూడ పరమతత్త్వమును తెలియకున్నారు. ఇక మానవుల గురించి చెప్పునదేమున్నది? (48) త్రిగుణాత్మికయగు ఆ పరమేశ్వరియే జగత్తునంతనూ సృష్టించి, పాలించి, కాలము వచ్చినప్పుడు సంహరించును (49). వరములనిచ్చునది, తనకు నచ్చిన రూపమును స్వీకరించునది అగు ఆ మాయ ఎవనిపై ప్రసన్నురాలగునో, వాడు మాత్రమే మోహమునతిక్రమించును. ఓ మహారాజా! మరియొక ఉపాయము లేదు (50). రాజోవాచ | కా సా దేవీ మహామాయా యా చ మోహయతే%ఖిలాన్ | కథం జాతా చ సా దేవీ కృపయా వద మే మునే || 51 రాజు ఇట్లు పలికెను - సర్వులను మోహింపజేసే ఆ మహామాయాదేవి ఎవరు? ఆ దేవి ఎట్లు జన్మించినది? ఓ మునీ! దయచేసి నాకు ఈ విషయమును చెప్పుము (51). ఋషిరువాచ | జగత్యేకార్ణవే జాతే శేషమాస్తీర్య యోగరాట్ | యోగనిద్రాముపాశ్రిత్య యదా సుష్వాప కేశవః || 52 తదా ద్వావసురౌ జాతౌ విష్ణోః కర్ణమలేన వై | మధుకైటభనామానౌ విఖ్యాతౌ పృథివీతలే || 53 ప్రలయార్కప్రభౌ ఘోరౌ మహాకా¸° మహాహనూ | దంష్ట్రా కరాలవదనౌ భక్షయంతౌ జగంతి వా || 54 తౌ దృష్ట్వా భగవన్నాభిపంకజే కమలాసనమ్ | హననాయోద్యతావాస్తాం కస్త్వం భోరితి వాదినౌ || 55 సమాలోక్య తు తౌ దైత్యౌ సురజ్యేష్ఠో జనార్దనమ్ | శయానం చ పయోంభోధౌ తుష్టావ పరమేశ్వరీమ్ || 56 ఋషి ఇట్లు పలికెను - జగత్తు అంతయూ జలమయమై ఉండగా, యోగీశ్వరుడగు విష్ణువు శేషునిపై పరుండి యోగనిద్రలో నుండెను (52).అపుడు విష్ణువుయొక్క చెవిలోని మాలిన్యము నుండి ఇద్దరు రాక్షసులు జన్మించిరి. వారికి భూలోకములో మధుకైటభులను ప్రసిద్ధి కలిగెను (53). ప్రళయకాలసూర్యుని వలె ప్రకాశిస్తూ కోరలు గల ముఖములతో భయమును గొల్పువారు, పెద్ద దేహములు గలవారు, పెద్ద నోళ్లను తెరచి జగత్తులను భక్షించెదరా యున్నట్లు ఉన్న ఆ ఇద్దరు విష్ణుభగవానుని నాభినుండి పుట్టిన పద్మమునందు ఉపవిష్టుడై యున్న బ్రహ్మను చూచి, 'ఓరీ! నీవెవరు?' అని పలికి ఆయనను సంహరించుటకు సిద్ధపడుచుండిరి (54,55). దేవతలలో మొదటివాడగు బ్రహ్మ ఆ రాక్షసులినిద్దరినీ, చూచి, దుష్టజనసంహారకుడగు విష్ణువు సముద్రమునందు నిద్రించుచుండుటను గాంచి, పరమేశ్వరిని స్తుతించెను (56). బ్రహ్మోవాచ | రక్ష రక్ష మహామాయే శరణాగతవత్సలే | ఏతాభ్యాం ఘోరరూపాభ్యాం దైత్యాభ్యాం జగదంబికే || 57 ప్రణమామి మహామాయాం యోగనిద్రాముమాం సతీమ్ | కాలరాత్రిం మహారాత్రిం మోహరాత్రిం పరాత్పరామ్ || 58 త్రిదేవజననీం నిత్యాం భక్తాభీష్టపలప్రదామ్ | పాలినీం సర్వదేవానాం కరుణా వరుణాలయామ్ || 59 త్వత్ర్పభావాదహం బ్రహ్మా మాధవో గిరిజాపతిః | సృజత్యవతి సంసారం కాలే సంహరతీతి చ || 60 త్వం స్వాహా త్వం స్వధా త్వం హ్రీస్త్వం బుద్ధిర్విమలా మతా | తుష్టిః పుష్టిస్త్వమేవాంబ శాంతిః క్షాంతిః క్షుధా దయా || 61 విష్ణుమాయా త్వమేవాంబ త్వమేవ చేతనా మతా | త్వం శక్తిః పరమా ప్రోక్తా లజ్జా తృష్ణా త్వమేవ చ || 62 భ్రాంతిస్త్వం స్మృతిరూపా త్వం మాతృరూపేణ సంస్థితా | త్వం లక్ష్మీర్భవనే పుంసాం పుణ్యాచారప్రవర్తినామ్ || 63 త్వం జాతిస్త్వం మతా వృత్తిర్వ్యాప్తిరూపా త్వమేవ హి | త్వమేవ చిత్తిరూపేణ వ్యాప్య కృత్స్నం ప్రతిష్ఠితా || 64 సా త్వమేతౌ దురాధర్షావసురౌ మోహయాంబికే | ప్రబోధయ జగద్యోనే నారాయణమజం విభుమ్ || 65 బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ మహామాయా! రక్షించుము ఓ జగన్మాతా! శరణు పొందిన వారియందు మాతృప్రేమను చూపే నీవు భయంకరాకారులగు ఈ రాక్షసుల బారినుండి నన్ను రక్షించుము (57). యోగనిద్రాస్వరూపురాలు, పార్వతీ సతీ రూపములను దాల్చినది, మహాప్రళయస్వరూపురాలు, ప్రళయ కాలరాత్రి స్వరూపురాలు, మోహమనే చీకటిని కలిగించునది, సర్వకారణములకు కారణమైనది, ముల్లోకములకు తల్లి, నిత్యురాలు, భక్తులు కోరిన ఫలములనిచ్చునది, దేవతలనందరినీ రక్షించునది, కరుణాసముద్రము అగు మహామాయను ప్రణమిల్లుచున్నాను (58,59). నీ ప్రభావముచే బ్రహ్మనగు నాచే సృష్టింపబడి, విష్ణువుచే రక్షింపబడే జగత్తును కాలము వచ్చినప్పుడు పార్వతీపతియగు రుద్రుడు సంహరించుచున్నాడు (60). దేవతలకు హవిస్సుల నర్పించే స్వాహాకారము నీవే. పితరులకు పిండములనర్పించే స్వధాకారము నీవే. వినయము నీవే. జ్ఞానుల స్వచ్ఛమగు బుద్ధి నీవేనని మహర్షులు చెప్పుచున్నారు. ఓ తల్లీ! సంతోషము, పుష్టి, శాంతి, సహనము, ఆకలి, దయ నీ స్వరూపమే (61). ఓ తల్లీ! విష్ణుమాయవు నీవే. చైతన్యము నీవేనని చెప్పబడినది. పరమశక్తివి వీనేనని మహర్షులు చెప్పుచున్నారు. కులస్త్రీలలోని సిగ్గు, ప్రాణులలోని తృష్ణ నీ స్వరూపమే (62). భ్రాంతి, స్మృతి కూడ నీ స్వరూపములే. తల్లి రూపములో నీవే ఉన్నావు. పుణ్యకర్మలను చేయువారి ఇంటిలోని సంపద నీవే (63). జాతి (పుట్టుక) నీవే. మనోవృత్తి నీవే. వ్యాప్తి నీ స్వరూపమే. సర్వమును నీవు చైతన్య రూపములో వ్యాపించి ఉనికిని ప్రసాదించుచున్నావు. (64). అట్టి నీవు జయింప శక్యము కాని ఈ రాక్షసులను మోహింప జేయుము. ఓ తల్లీ! జగత్కారణము నీవే. పుట్టుక లేని వాడు, సర్వవ్యాపకుడు అగు ఈ నారాయణుని నీవు మోల్కొలుపుము (65). ఋషిరువాచ | బ్రహ్మణా ప్రార్థితా సేయం మధుకైటభనాశ##నే | మహావిద్యా జగద్ధాత్రీ సర్వవిద్యాధిదేవతా || 66 ద్వాదశ్యాం ఫాల్గునసై#్యవ శుక్లాయాం సమభూన్నృప | మహాకాలీతి విఖ్యాతా శక్తిసై#్త్రలోక్యమోహినీ || 67 తతో%భవద్వియద్వాణీ మా భైషీః కమలాసన | కంటకం నాశయామ్యద్య హత్వాజౌ మధుకైటభౌ || 68 ఇత్యుక్త్వా సా మహామాయా నేత్రవక్త్రాదితో హరేః | నిర్గమ్య దర్శనే తస్థౌ బ్రహ్మణో%వ్యక్తజన్మనః || 69 ఉత్తస్థౌ చ హృషీకేశో దేవదేవో జనార్దనః | స దదర్శ పురో దైత్యౌ మధుకైటభసంజ్ఞకౌ || 70 తాభ్యాం ప్రవవృతే యుద్ధం విష్ణోరతులతేజసః | పంచవర్షసహస్రాణి బాహుయుద్ధమభూత్తదా || 71 మహామాయాప్రభావేణ మోహితౌ దానవోత్తమౌ | జజల్పతూ రమాకాంతం గృహాణ వరమీప్సితమ్ || 72 ఋషి ఇట్లు పలికెను - బ్రహ్మ విద్యాస్వరూపురాలు, సర్వవిద్యలకు అధిష్ఠానదైవము అగు ఆ జగన్మాత ఈ విధముగా మధుకైటభుల వినాశము కొరకై బ్రహ్మచే ప్రార్థించబడి (66), ఫాల్గున శుద్ధ దశమినాడు ఆవిర్భవించెను. ఓ రాజా! ముల్లోకములను మోహింపజేయు ఆ శక్తి మహాకాళియను పేరుతో ప్రఖ్యాతిని గాంచెను (67). అపుడు, 'బ్రహ్మా! నీవు భయపడకుము. ఇపుడు యుద్ధములో మధుకైటభులను సంహరించి నీ కష్టమును తొలగించెదను' అని ఆకాశవాణి పలికెను (68). ఆ మహామాయ ఇట్లు పలికి, అవ్యక్త ప్రకృతికి అధిష్ఠానమగు ఈశ్వరునినుండి జన్మించిన బ్రహ్మకు దర్శనమునిచ్చెను. ఆమె విష్ణువుయొక్క కన్నులు, ముఖము మొదలగు వాటినుండి బయటకు వచ్చెను (69). ఇంద్రియాధిపతి. దేవదేవుడు. దుష్టజనసంహారకుడు అగు విష్ణువు లేచి నిలబడి ఎదురుగా మధుకైటభులను పేరు గల రాక్షసులను చూచెను (70). సాటిలేని తేజస్సు గల విష్ణువునకు వారితో యుద్ధము ఆరంభమాయెను. అపుడు ఆయన ఐదువేల సంవత్సరములు చేతులతో యుద్ధమును చేసెను (71). మహామాయయొక్క ప్రభావముచే మోహమును పొందిన ఆ దానవశ్రేష్ఠులు లక్ష్మీపతియగు విష్టువుతో, 'నీకు నచ్చిన వరమును కోరుకొనుము' అని పలికిరి (72). నారాయణ ఉవాచ | మయి ప్రసన్నౌ యది వాం దీయతామేషమే వరః | మమ వధ్యాపుభౌ నాన్యం యువాభ్యాం ప్రార్థయే వరమ్ || 73 నారాయణుడు ఇట్లు పలికెను - మీరిద్దరు నాయందు ప్రసన్నులైనచో, నాకు ఈ వరమునిచ్చెదరు గాక! మీరు ఇద్దరు నా చేతిలో మరణించవలెను. నేను మీ నుండి మరియొక వరమును కోరుట లేదు (73). ఋషిరువాచ | ఏకార్ణవాం మహీం దృష్ట్వా ప్రోచతుః కేశవం వచః | ఆవాం జహి న యత్రాసౌ ధరణీ పయసా%%ప్లుతా || 74 తథాస్తు ప్రోచ్య భగవాంశ్చక్రముత్థాయ సూజ్వలమ్ | చిచ్ఛేద శిరసీ కృత్వా స్వకీయ జఘనే తయోః || 75 ఏవం తే కథితో రాజన్ కాలికాయాస్సముద్భవః | మహాలక్ష్మ్యాస్తథోత్పత్తిం నిశామయ మహామతే | 76 నిర్వికారాది సాకారా నిరాకారాపి దేవ్యుమా | దేవానాం తాపనాశార్థం ప్రాదురాసీద్యుగే యుగే || 77 యదిచ్ఛా వైభవం సర్వం తస్యా దేహగ్రహః స్మృతః | లీలయాసాపి భక్తానాం గుణవర్ణన హేతవే || 78 ఇతి శ్రీశివ మహాపురాణ ఉమాసంహితాయాం మహాకాళికావతారవర్ణనం నామ పంచచత్వారింశో%ధ్యాయః (45). ఋషిఇట్లు పలికెను - భూమి అంతయు నీటితో నిండియుండుటను చూచి వారిద్దరు కేశవునితో, 'ఈ భూమి నీటియందు మునగకుండా తేలియున్న స్థలములో మమ్ములను సంహరించుము' అని పలికిరి (74). విష్ణుభగవానుడు 'అటులనే యగుగాక!' అని పలికి మిక్కిలి ప్రకాశించే చక్రమును పైకెత్తి వారిద్దరి శిరస్సులను తన ఒడిలో పెట్టుకొని నరికెను (75). ఓ రాజా! ఈ తీరున కాళీ ప్రాదుర్భావమును నీకు చెప్పితిని. ఓ మహా బుద్ధిశాలీ! అదే విధముగా మహాలక్ష్మీ ప్రాదుర్భావమును కూడ వినుము (76). ఉమాదేవి వికారములు, ఆకారము మొదలగునవి లేనిదే అయిననూ, దేవతల దుఃఖమును పోగొట్టుట కొరకై ప్రతియుగములో ఆవిర్భవించెను (77). ఆ దేవి భక్తులు తన గుణములను వర్ణించే అవకాశమును కల్పించుట కొరకై లీలచే అవతారములను దాల్చుచుండునని మహర్షులు చెప్పిరి. ఈ జగత్తు అంతయు ఆమె యొక్క ఇచ్ఛాశక్తి విలాసము మాత్రమే (78). శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు మహాకాళీప్రాదుర్భావమును వర్ణించే నలుబది అయిదవ అధ్యాయము ముగిసినది (45).