Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వాత్రింశో%ధ్యాయః

కశ్యప వంశ వర్ణనము

సూత ఉవాచ |

అదితిర్దితిశ్చ సురసారిష్టేలా దనురేవ చ | సురభిర్వినతా చేలా తామ్రా క్రోధవశా తథా || 1

కద్రూర్మునిశ్చ విప్రేంద్ర తాస్వపత్యాని మే శృణు | పూర్వమన్వంతరే శ్రేష్ఠే ద్వాదశాసన్‌ సురోత్తమాః || 2

తుషితా నామ తే%న్యోన్యమూచుర్వైవస్వతేంతరే |ఉపస్థితే సుయశసశ్చాక్షుషస్యాంతరే మనోః || 3

హితాయ సర్వలోకానాం సమాగమ్య పరస్పరమ్‌ | ఆగచ్ఛతస్తు తానూచురదితిం చ ప్రవిశ్య వై || 4

మన్వంతరే ప్రసూయామస్సతాం శ్రేయో భవిష్యతి | ఏవముక్తాస్తు తే సర్వే చాక్షుషస్యాంతరే మనోః || 5

మారీచాత్కశ్యపాజ్ఞాతాస్తే%దిత్యాం దక్షకన్యయా | తత్ర విష్ణుశ్చ శక్రశ్చ జజ్ఞాతే పునరేవ హి || 6

అర్యమా చైవ ధాతా చ త్వష్టా పూషా తథైవ చ | వివస్వాన్‌ సవితా చైవ మిత్రావరుణ ఏవ చ || 7

అంశో భగశ్చాతితేజా ఆదిత్యా ద్వాదశ స్వృతాః | చాక్షుషస్యాంతరే పూర్వమాసన్‌ యే తుషితాస్సురాః || 8

పురైవ తస్యాంతరే తు ఆదిత్యా ద్వాదశ స్మృతాః | ఇతి ప్రోక్తాని క్రమశో% దిత్యపత్యాని శౌనక || 9

సప్తవింశతి యాః ప్రోక్తాస్సోమపత్న్యో%థ సువ్రతాః | తాసామపత్యాన్య భవన్దీప్తయో%మితతేజసః || 10

సూతుడు ఇట్లు పలికెను -

అదితి, దితి, సురస, అరిష్టేల, దనువు, సురభి, వినతి, ఇల, తామ్ర, క్రోధవశ (1), కద్రువు, ముని అను వారు కశ్యపుని భార్యలు. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా ! వారియందు కలిగిన సంతానమును గురించి వినుము. గడచిన మన్వంతరము శ్రేష్ఠమైనది. దానియందు పన్నెండుగురు గొప్ప దేవతలు జన్మించిరి (2). వారి పేరు తుషితులు. వైవస్వతమన్వంతరము గడచి గొప్ప కీర్తిశాలియగు చాక్షుషుని మన్వంతరము సమీపించినప్పుడు (3), సర్వలోకముల హితమును గోరి వారు ఒక నొకరు కలుసుకొని ఇట్లు నిర్ణయించిరి : 'మనము రాబోయే మన్వంతరములో అదితియందు ప్రవేశించి జన్మించెదము. అట్లు చేయుట వలన సత్పురుషులకు మంచి జరుగగలదు'. ఇట్లు పలికి వారందరు చాక్షుషమన్వంతరములో మరీచిపుత్రుడగు కశ్యపునకు దక్షుని కుమార్తెయగు అదితియందు జన్మించిరి. వారికి విష్ణువు మరియు ఇంద్రుడు కూడ మరల జన్మించిరి (4-6). వారితో కలిపి అర్యముడు, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్‌, సవిత, మిత్రావరుణుడు (7), అంశుడు, భగుడు, అతితేజస్సు అను వారు ద్వాదశాదిత్యులు అని చెప్పబడినారు. పూర్వము తుషితులనబడిన దేవతలు చాక్షుషమన్వంతరములో మరల పన్నెండుగురు ఆదిత్యులై జన్మించిరి. ఓ శౌనకా ! ఈ విధముగా నీకు అదితియొక్క సంతానమును గురించి క్రమములో చెప్పితిని (8,9). చంద్రునకు ఇరువది ఏడుగురు భార్యలు గలరనియు, వారు గొప్ప వ్రతము గలవారనియు చెప్పబడినది. వారికి గొప్ప తేజస్సు గల దీప్తులు అనే సంతానము కలిగిరి (10).

అరిష్టనేమిపత్నీ నామపత్యానీహ షోడశ | బహుపుత్రస్య విదుషశ్చతస్రో యాస్సుతాః స్మృతాః || 11

కృశాశ్వస్య తు దేవర్షే దేవప్రహరణాః స్మృతాః | భార్యాయామర్చిషి మునే ధూమ్రకేశస్తథైవ చ || 12

స్వధా సతీ చ ద్వే పత్న్యౌ స్వధా జ్యేష్ఠా సతీ పరా | స్వధాసూత పితృ న్‌ వేదమథర్వాంగిరసం సతీ || 13

ఏతే యుగసహస్రాంతే జాయంతే పునరేవ హి | సర్వదేవనికాయాశ్చ త్రయస్త్రింశత్తు కామజాః || 14

యథా సూర్యస్య నిత్యం హి ఉదయాస్తమయావిహ | ఏవం దేవానికాస్తే చ సంభవంతి యుగే యుగే || 15

దిత్యాం బభూవతుః పుత్రౌ కశ్యపాదితి నః శ్రుతమ్‌ | హిరణ్యకశిపుశ్చైవ హిరణ్యాక్షశ్చ వీర్యవాన్‌ || 16

సంహికా హ్యభవత్కన్యా విప్రచిత్తేః పరిగ్రహః | హిరణ్యకశిపోః పుత్రాశ్చత్వారః ప్రథితౌజసః || 17

అనుహ్రాదశ్చ హ్రాదశ్చ సంహ్రాదశ్చైవ వీర్యవాన్‌ | ప్రహ్రాదశ్చానుజస్తత్ర విష్ణుభక్తివిచారధీః || 18

అనుహ్రాదస్య సుర్యాయాం పులోమా మహిషస్తథా | హ్రాదస్య ధమనిర్భార్యాసూత వాతాపిమిల్వలమ్‌ || 19

సంహ్రాదస్య కృతిర్భార్యాసూత పంచజనం తతః | విరోచనస్తు ప్రాహ్రాదిర్దేవ్యాస్తస్యాభవద్బలిః || 20

అరిష్టనేమికి తన భార్యలయందు పదునార్గురు సంతానము కలిగిరి. ఓ దేవర్షీ! అనేకపుత్రులు గలవాడు, విద్వాంసుడు అగు కృశాశ్వునకు దేవప్రహరణులు అనబడే నలుగురు కుమారులు గలరు. ఓ మునీ ! ఆయనకు అర్చి అనబడే భార్యయందు ధూమ్రకేశుడు అనే పుత్రుడు కలిగెను (11,12). స్వధ, సతి అనే ఇద్దరు భార్యలలో స్వధ పెద్ద ఆమె కాగా, సతి చిన్న ఆమె. స్వధ పితృదేవతలను, సతి అథర్వాంగిరసుని కనెను (13).వీరు వేయి యుగముల తరువాత మరల జన్మించెదరు. మైథుసృష్టిలో భాగమైన దేవతలు ముప్పది మూడు సముదాయములుగా నుండిరి (14). ఈ లోకములో సూర్యుడు నిత్యము ఉదయించి అస్తమించుచుండును. అటులనే, ఈ దేవతాసముదాయములు ప్రతి యుగమునందు పుట్టుచుందురు (15). కశ్యపునకు దితియందు హిరణ్యకశిపుడు మరియు పరాక్రమశాలియగు హిరణ్యాక్షుడు అనే ఇద్దరు పుత్రులు కలిగిరని మేము విని యుంటిమి (16). ఆయనకు సింహిక అనే కన్య కూడ కలిగెను. ఆమెను విప్రచిత్తి వివాహమాడెను. హిరణ్యకశిపునకు అనుహ్రాదుడు, హ్రాదుడు, పరాక్రమశాలి యగు సంహ్రాదుడు, మరియు ప్రహ్రాదుడు అనే ప్రఖ్యాతి గాంచిన తేజస్సు గల నలుగురు పుత్రులు కలిగిరి. వారిలో కనిష్ఠసోదరుడగు ప్రహ్రాదుని విచారాత్మకమగు బుద్ధి విష్ణుభక్తితో నిండియుండెను (17,18). అనుహ్రాదునకు సూర్యయందు పులోముడు, మహిషుడు అనే పుత్రులు కలిగిరి. హ్రాదునకు ధమని అనే భార్యయందు వాతాపి మరియు ఇల్వలుడు అనే కుమారులు కలిగిరి (19). సంహ్రాదునకు కృతి అనే భార్య యందు పంచజనుడు అనే కుమారుడు కలిగెను. ప్రహ్రాదుని కుమారుడు విరోచనుడు.ఆతనికి భార్యయగు దేవియందు బలి అనే పుత్రుడు కలిగెను (20).

బలేఃపుత్రశతం త్వాసీదశనాయాం మునీశ్వర | బలిరాసీన్మహాశైవశ్శివభక్తిపరాయణః || 21

దానశీల ఉదారశ్చ పుణ్యకీర్తితపాః స్మృతః | తత్పుత్రో బాణనామాయస్సో%పి శైవవరస్సుధీః |

యస్సంతోష్య శివం సమ్యగ్గాణాపత్యమవాప హ || 22

సా కథా శ్రుతపూర్వా తే బాణస్య హి మహాత్మనః | కృష్ణం యస్సమరే వీరస్సుప్రసన్నం చకార హ || 23

హిరణ్యాక్షసుతాః పంచ పండితాస్సుమహాబలాః | కుకురశ్శకునిశ్చైవ భూతసంతాపనస్తథా || 24

మహానాదశ్చ విక్రాంతః కాలనాభస్తథైవ చ | ఇత్యుక్తా దితిపుత్రాశ్చ దనోః పుత్రాన్మునే శృణు || 25

అభవన్దనుపుత్రాశ్చ శతం తీవ్రపరాక్రమాః | అయోముఖశ్శంబరశ్చ కపోలో వామనస్తథా || 26

వైశ్వానరః పులోమా చ విద్రావణమహాశిరౌ | స్వర్భానుర్వృషపర్వాచ విప్రచిత్తిశ్చ వీర్యవాన్‌ || 27

ఏతే సర్వే దనోః పుత్రాః కశ్యపాదనుజజ్ఞిరే | ఏషాం పుత్రాన్‌ శృణు మునే ప్రసంగాద్వచ్మి తే%నఘ || 28

స్వర్భానోస్తు ప్రభా కన్యా పులోమ్నస్తు శచీ సుతా | ఉపదానవీ హయశిరా శర్మిష్ఠా వార్షపర్వణీ || 29

పులోమా పులోమికా చైవ వైశ్వానరసుతే ఉభే | బహ్వపత్యే మహావీర్యే మారీచేస్తు పరిగ్రహః || 30

ఓ మహర్షీ! బలికి అశన అనే భార్యయందు వంద మంది పుత్రులు కలిగిరి. బలి గొప్ప శివభక్తుడు. ఆయనకు శివభక్తియందు గొప్ప నిష్ఠ ఉండెను (21). ఆయన దానము చేసే స్వభావము, ఔదార్యము గలవాడు. ఆయన పుణ్యదాయకమగు తపస్సును చేసి కీర్తిని పొందెను. ఆయన పుత్రుడు బాణుడు. ఆయన కూడ గొప్ప బుద్ధిమంతుడు మరియు శివభక్తాగ్రగణ్యుడు. ఆయన శివుని చక్కగా సంతోషపెట్టి గణాధ్యక్షస్థానమును పొందెను (22). మహాత్ముడగు ఆ బాణుని కథను నీవు ఇదివరలో వినియుంటివి. ఆ వీరుడు యుద్ధములో శ్రీకృష్ణుని మిక్కిలి ప్రసన్నుని చేసెను (23). హిరణ్యాక్షునకు కుకురుడు, శకుని, భూతసంతాపనుడు, మహానాదుడు, పరాక్రమశాలియగు కాలనాభుడు అనే పండితులు, మహాబలశాలురు అగు అయిదుగురు పుత్రులు గలరు. ఓ మునీ ! ఇంతవరకు దితియొక్క సంతానమును గురించి చెప్పితిని. ఇప్పుడు దనుపుత్రులను గురించి వినుము (24,25). దనువునకు తీవ్రమగు పరాక్రమము గల వందమంది పుత్రులు ఉండిరి. అయోముఖుడు, శంబరుడు, కపోలుడు, వామనుడు, వైశ్వానరుడు, పులోముడు, విద్రావణుడు, మహాశిరుడు, స్వర్భానుడు, వృషపర్వుడు, పరాక్రమశాలియగు విప్రచిత్తి అను వీరు అందరు కశ్యపునకు దనువునందు జన్మించిరి. ఓ మునీ! నేను ప్రసంగవశముచే వీరి పుత్రులను గురించి చెప్పుచున్నాను. ఓయీ పుణ్యాత్మా ! నీవు వినుము (26-28). స్వర్భానువునకు ప్రభ, పులోమునకు శచి అనే కుమార్తెలు కలిగిరి. ఉపదానవి, హయశిర, శర్మిష్ఠ అను వారలు వృషపర్వుని కుమార్తెలు (29). వైశ్వానరునకు పులోమ, పులోమిక అనే ఇద్దరు కుమార్తెలు కలిగిరి. వారిని మరీచియొక్క పుత్రుడగు కశ్యపుడు వివాహమాడెను. వారికి గొప్ప పరాక్రమము గల అనేకులు పుత్రులు కలిగిరి (30).

తయోఃపుత్రసహస్రాణి షష్టిర్దానవనందనాః | మారీచిర్జనయామాస మహతా తపసాన్వితః || 31

పౌలోమాః కాలఖంజాశ్చ దానవానాం మహాబలాః | అవధ్యా దేవతానాం చ హిరణ్యపురవాసినః || 32

పితామహప్రసాదేన యే హతాస్సవ్యసాచినా | సింహికాయామథోత్పన్నా విప్రచిత్తేస్సుతాస్తథా || 33

దైత్యదానవసంయోగాజ్ఞాతాస్తీ వ్రపరాక్రమాః | సైంహికేయా ఇతి ఖ్యాతాస్త్ర యోదశ మహాబలాః || 34

రాహుశ్శల్యో సుబలినో బలశ్చైవ మహాబలః | వాతాపిర్నముచిశ్చైవాథేల్వలస్స్వసృపస్తథా || 35

అజికో నరకశ్చైవ కాలనాభస్తథైవ చ | శరమాణశ్శరకల్పశ్చ ఏతే వంశవివర్థనాః || 36

ఏషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ దనువంశవివర్ధనాః | బహువశ్చ సముద్భూతా విస్తరత్వాన్న వర్ణితాః || 37

సంహ్రాదస్య తు దైతేయా నివాతకవచాః కులే | ఉత్పన్నా మరుతస్తస్మింస్తపసా భావితాత్మనః || 38

షణ్ముఖాద్యా మహాసత్త్వా స్తామ్రయాః పరికీర్తితాః | కాకీశ్యేనీ చ భాసీ చ సుగ్రీవీ చ శుకీ తథా || 39

గృద్ధ్రికాశ్వీ హ్యులూకీ చ తామ్రా కన్యాః ప్రకీర్తితాః |కాకీ కాకానజనయదులూకీ ప్రత్యులూకకాన్‌ || 40

శ్వేనీ శ్యేనాంస్తథా భాసీ భాసాన్‌ గృధ్రీ తు గృధ్రకాన్‌ | శుకీ శుకానజనయత్సుగ్రీవీ శుభపక్షిణః || 41

గొప్ప తపశ్శాలి, మరీచిపుత్రుడు అగు కశ్యపునకు వారిద్దరియందు దానవులకు ఆనందమును కలిగించే అరవై వేలమంది పుత్రులు కలిగిరి (31). ఈ పులోమపుత్రులు మరియు కాలఖంజులు దానవులలో గొప్ప బలము గలవారు. హిరణ్యపురమునందు నివసించే వీరిని దేవతలు సంహరింపజాలరు (32). వీరు బ్రహ్మగారి అనుగ్రహముచే అర్జనునిచే సంహరింపబడిరి. విప్రచిత్తికి సింహికయందు పుత్రులు కలిగిరి (33). దైత్యదానవసంయోగము వలన కలిగిన ఈ పుత్రులు తీవ్రమగు పరాక్రమము గలవారు. వీరికి సైంహికేయులు అను పేరు ప్రసిద్ధిని గాంచినది. ఈ పదముగ్గురు చాల బలము గలవారు (34). మహాబలశాలురగు రాహువు , శల్యుడు, బలుడు, మహాబలుడు, వాతాపి, నముచి, ఉల్వలుడు, స్వసృపుడు (35), అజికుడు, నరకుడు, కాలనాభుడు, శరమాణుడు, శరకల్పుడు అను ఈ పదముగ్గురు వంశమును వర్థిల్లజేసిరి (36). వీరికి అనేకులు పుత్రులు, పౌత్రులు, కలిగి దనువంశమును వర్థిల్లజేసిరి. విస్తారభయముచే ఆ వివరములు ఈయబడుట లేదు (37). సంహ్రాదుని కులములో నివాతకవచులు అనే దైత్యులు మరియు మరుత్తులు పుట్టిరి. మరుత్తులు తపస్సును చేసి మనస్సును పరమేశ్వరునియందు లగ్నము చేసిరి (38). తామ్రయొక్క పుత్రులగు షణ్ముఖుడు మొదలగు వారు మహాబలశాలురని కీర్తిని బడసిరి. తామ్రకు కాకి, శ్యేని, భాసి, సుగ్రీవి, శుకి (39)., గృద్ధ్రిక, అశ్వి, ఉలూకి అను కన్యలు పుట్టి ప్రఖ్యాతిని గాంచిరి. కాకి కాకులను, ఉలూకి గుడ్లగూబలను కనెను (40).శ్యేని గరుడపక్షులను, భాసి రాబందులను, గృద్ధ్రి గ్రద్దలను, శుకి చిలుకలను, సుగ్రీవి శుభకరమగు పక్షులను కనెను (41).

అశ్వానుష్ట్రాన్‌ గర్దభాంశ్చ తామ్రా చ కశ్యపప్రియా | జనయామాస చేత్యేవం తామ్రావంశాః ప్రకీర్తితాః || 42

వినతాయాశ్చ పుత్రౌ ద్వావరుణో గరుడస్తథా | సుపర్ణః పతతాం శ్రేష్ఠో నారుణస్స్వేన కర్మణా || 43

సురసాయాస్సహస్రం తు సర్పాణామమితౌ జసామ్‌ | అనేకశిరసాం తేషాం ఖేచరాణాం మహాత్మనామ్‌ || 44

యేషాం ప్రధానా రాజానశ్శేషవాసుకితక్షకాః | ఐరావతో మహాపద్మః కంబలాశ్వతరావుభౌ || 45

ఐలాపుత్రస్తథా పద్మః కర్కోటకధనంజ¸° | మహానీలమహాకర్ణౌ ధృతరాష్ట్రో బలాహకః || 46

కుహరః పుష్పదంతశ్చ దుర్ముఖస్సుముఖస్తథా | బహుశః ఖరరోమా చ పాణిరిత్యేవమాదయః || 47

గణాః క్రోధవశాయాశ్చ తస్యాస్సర్వే చ దంష్ట్రిణః | అండజాః పక్షిణో%బ్జాశ్చ వారాహ్యాః పశవో మతాః || 48

అనాయుషాయాః పుత్రాశ్చ పంచాశచ్చ మహాబలాః | అభవన్‌ బలవృక్షౌ చ విక్షరో%థ బృహంస్తథా || 49

శశాంస్తు జనయామాస సురభిర్మహిషాంస్తథా | ఇలా వృక్షాంల్లతా వల్లీస్తృణజాతీస్తు సర్వశః || 50

ఖశా తు యక్షరక్షాంసి మునిరప్సరసస్తథా | అరిష్టాసూత సర్పాంశ్చ ప్రభావైర్మానవోత్తమాన్‌ || 51

ఏతే కశ్యపదాయాదాః కీర్తితాస్తే మునీశ్వర | యేషాం పుత్రాశ్చ పౌత్రాశ్చ శతశో%థ సహస్రశః || 52

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం కశ్యపవంశవర్ణనం నామ ద్వాత్రింశో%ధ్యాయః (32).

కశ్యపుని ప్రియురాలగు తామ్ర గుర్రములను , ఒంటెలను, గాడిదలను కనెను. ఈ విధముగా తామ్రవంశము వర్ణింపబడినది (42). వినతకు అరుణుడు, గరుడుడు అనే ఇద్దరు పుత్రులు గలరు. గరుడుడు పక్షులలో గొప్పవాడు. అరుణుడు తాను చేసిన పొరపాటుచే ఎగురజాలడు (43). సురసకు గొప్ప తేజస్సు గలవారు, అనేకశిరస్సులు గలవారు, ఆకాశసంచారులు, మహాత్ములు అగు వేయి సర్పములు కలిగిరి (44). వారిలో శేషుడు, వాసుకి, తక్షకుడు, ఐరావతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఐలాపుత్రుడు, పద్ముడు, కర్కోటకుడు, ధనంజయుడు, మహానీలుడు, మహాకర్ణుడు, ధృతరాష్ట్రుడు, బలాహకుడు, కుహరుడు, పుష్పదంతుడు, దుర్ముఖుడు, సుముఖుడు, ఖరరోముడు, ఖరపాణి మొదలగు సర్పరాజులు ప్రధానమైనవారు. వీరే గాక ఇంకనూ అనేకులు గలరు (45-47). కోరలు గల జంతువులు, గ్రుడ్లనుండి పుట్టే జంతువులు, పక్షులు మరియు నీటియందు పుట్టే జంతువులు క్రోధవశయొక్క సంతానము అయినవి. వారాహియొక్క సంతానము పశువులు అని చెప్పబడినది (48). అనాయుషకు ఏభై మంది మహాబలవంతులగు పుత్రులు కలిగిరి. బలుడు, వృక్షుడు, విక్షరుడు, బృహన్‌ అను వారలు ముఖ్యులు (49). సురభికి కుందేళ్లు, గేదెలు సంతానమైనవి. ఇల వృక్షములను, లత లతలను మరియు సర్వవిధముల గడ్డి జాతి మొక్కలను కనెను (50). ఖశ యక్షులను మరియు రాక్షసులను, ముని అప్సరసలను, అరిష్ట శక్తిలో మానవుల కంటె గొప్పవి యగు సర్పములను కనెను (51). ఓ మహర్షీ! నేనీ కశ్యపుని దాయాదులను గురించి నీకు వివరించి చెప్పితిని. వీరికి పుత్రులు, పౌత్రులు వందల మరియు వేల సంఖ్యలో గలరు (52).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు కశ్యపవంశవర్ణనము అనే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32)

Siva Maha Puranam-4    Chapters