Siva Maha Puranam-4
Chapters
అథ పంచమో
సన్న్యాస మండల విధి
ఈశ్వర ఉవాచ |
పరీక్ష్య విధివద్భూమిం గంధవర్ణరసాదిభిః | మనో%భిలషితే తత్ర వితానవితతాంబరే || 1
సుప్రలిప్తే మహీపృష్ఠే దర్పణోదరసన్నిభే | అరత్నియుగ్మమానేన చతురస్రం ప్రకల్పయేత్ || 2
తాలపత్రం సమాదాయ తత్సమాయామవిస్తరమ్ | తస్మిన్ భాగాన్ ప్రకుర్వీత త్రయోదశసమాం కలామ్ || 3
తత్పత్రం తత్ర నిక్షిప్య పశ్చిమాభిముఖః స్థితః | తత్పూర్వభాగే సుదృఢం సూతమాదాయ రంజితమ్ || 4
ప్రాక్ ప్రత్యక్ దక్షిణోదక్ చ చతుర్దిశి నిపాతయేత్ | సూత్రాణి దేవదేవేశి నవషష్ట్యుత్తరం శతమ్ || 5
కోష్ఠాని స్యుస్తతస్తస్య మధ్యకోష్ఠం తు కర్ణికా | కోష్ఠాష్టకం బహిస్తస్య దలాష్టకమిహోచ్యతే || 6
దలాని శ్వేతవర్ణాని సమగ్రాణి ప్రకల్పయేత్ | పీతరూపాం కర్ణికాం చ కృత్వా రక్తం చ వృత్తకమ్ || 7
వనభిద్దలదక్షం తు సమారభ్య సురేశ్వరి | రక్తకృష్ణాః క్రమేణౖవ దలసంధీన్ విచిత్రయేత్ || 8
కర్ణికాయాం లిఖేద్యంత్రం ప్రణవార్థప్రకాశకమ్ | అధఃపీఠం సమాలిఖ్య శ్రీకంఠం చ తదూర్ధ్వతః || 9
తదుపర్యమరేశం చ మహాకాలం చ మధ్యతః | తన్మస్తకస్థం దండం చ తత ఈశ్వరమాలిఖేత్ || 10
ఈశ్వరుడు ఇట్లు పలికెను -
గంధము, రంగు, రసము మొదలగు అంశములను ఆధారముగా చేసుకొని భూమిని యథావిధిగా పరీక్షించవలెను. అచట మనస్సునకు నచ్చిన స్థానములో ఆకాశమును వస్త్ర పు పందిరితో కప్పవలెను (1). ఆ భూభాగమును చక్కగా అలికి అద్దమువలె శుభ్రము చేయవలెను. దానిపై రెండు అరత్నుల (మోచేతినుండి చిటికెన వ్రేలి వరకు గల) పొడవు గల భుజములతో ఒక చతురస్రమును గీయవలెను (2). తాటియాకును తీసుకొని దాని వెడల్పుతో సమానమగు భుజము గల చిన్న చతురస్రములను పెద్ద చతురస్రములోపల గీయవలెను. నిలువుగా గాని, అడ్డముగా గాని పదమూడు చిన్న చదరములు ఉండును (3). సాధకుడు దాని లోపల ఆ తాటియాకును ఉంచి, పశ్చిమదిక్కు వైపునకు తిరిగి నిలబడి దాని తూర్పువైపున గట్టి రంగు దారమును కట్టవలెను (4). దారములు తూర్పు, దక్షిణము, పశ్చిమము మరియు ఉత్తరము అనే నాలుగు దిక్కులయందు వచ్చునట్లు చుట్టవలెను. దేవతలచే కూడ ఆరాధింపబడే ఓ పార్వతీ! ఈ చతురస్రముల సంఖ్య 169 ఉండును. వాటి మధ్యలోనున్న చతురస్రము తొడిమ యగును. దాని చుట్టు ఉన్న ఎనిమిది చతురస్రములు ఎనిమిది దళములు అగునని చెప్పబడినది (5,6). దళములన్నియు తెల్లగను, తొడిమ పచ్చగను ఉండవలెను. చతురస్రము లోపల ఎర్రని రంగు గల వృత్తమును గీయవలెను (7). ఓ దేవదేవీ! తూర్పు దిక్కునందు ఉండే దళముతో నారంభించి దళముల మధ్య గల గీతలు క్రమముగా ఎరుపు, నలుపు రంగులో ఉండునట్లు చేయవలెను (8). కర్ణికాస్థానములో ఓంకారముయొక్క అర్థమును ప్రకటింపజేసే యంత్రమును వ్రాయవలెను. దానికి క్రింద పీఠమును, పైన కంఠమునందు విషము గల శివుని వ్రాయవలెను (9). దానిపైన అమరేశుని, మధ్యలో మహాకాలుని, ఆ మహాకాలుని పైన దండమును, తరువాత ఈశ్వరుని వ్రాయవలెను (10).
శ్యామేన పీఠం పీతేన శ్రీకంఠం చ విచిత్రయేత్ | అమరేశం మహాకాలం రక్తం కృష్ణం చ తౌ క్రమాత్ || 11
కుర్యాత్సుధూమ్రం దండం చ ధవలం చేశ్వరం బుధః | ఏవం యంత్రం సమాలిఖ్య రక్తం సద్యేన వేష్టయేత్ || 12
తదుత్థేనైవ నాదేన విద్యాదీశానమీశ్వరి | తద్వాసపంక్తీర్గృహ్ణీయాదాగ్నేయాదిక్రమేణ వై || 13
కోష్ఠాని కోణభాగేషు చత్వార్యేతాని సుందరి | శుక్లేనాపూర్య వర్ణాది చతుష్కం రక్తధాతుభిః || 14
ఆపూర్య తాని చత్వారి ద్వారాణి పరికల్పయేత్ | తతస్తత్పార్శ్వయోర్ద్వంద్వం పీతేనైవ ప్రపూరయేత్ || 15
ఆగ్నేయకోష్ఠమధ్యే తు పీతాభే చతురస్రకే | అష్టపత్రం లిఖేత్పద్మం రక్తాభం పీతకర్ణికమ్ || 16
హకారం విలిఖేన్మధ్యే బిందుయుక్తం సమాహితః | పద్మస్యనైరృతే కోష్ఠే చతురస్రం తదా లిఖేత్ || 17
పద్మమష్టదలం రక్తం పీతకింజల్కకర్ణికమ్ | శవర్గస్య తృతీయం తు షష్ఠరసమన్వితమ్ || 18
చతుర్దశస్వరోపేతం బిందునాదవిభూషితమ్ | ఏతద్బీజవరం భ##ద్రే పద్మమధ్యే సమాలిఖేత్ || 19
పద్మస్యేశానకోష్ఠేతు తథా పద్మం సమాలిఖేత్ | కవర్గస్య తృతీయం తు పంచమస్వరసంయుతమ్ || 20
పీఠమునకు నీలము, శ్రీకంఠునకు పచ్చన, అమరేశునకు ఎరుపు, మహాకాలునకు నలుపు రంగులను కల్పించవలెను (11). వివేకియగు సాధకుడు దండమునకు బూడిదరంగును, ఈశ్వరునకు తెలుపు కల్పించవలెను. ఈ విధముగా యంత్రమును వ్రాసి ఎరుపు రంగు గల అమరేశుని వెంటనే నూతన వస్త్ర ముతో చుట్టవలెను (12). ఓ ఈశ్వరీ! ఆ ప్రణవయంత్రమునుండి నాదము ఉదయించుచున్నట్లు భావన చేసి ఈశానుని ఉపాసించ వలెను. ఈశ్వరుడు ఆ మండలములో నివసించే వరుసలను ఆగ్నేయముతో మొదలిడి వరుసగా గ్రహించ వలెను (13). ఓ సుందరీ! కోణములయందలి చతురస్రములకు తెల్లని రంగును పూయవలెను. మొదటి నాలుగు అక్షరములను (అ,ఆ,ఇ, ఈ) ఎర్రని రంగుతో వ్రాసి వాటిని నాలుగు ద్వారములుగా భావించవలెను. ఈ ద్వారములకు రెండు ప్రక్కలనుండే రేండేసి చతురస్రములకు పచ్చరంగును పూయవలెను (14,15). ఆగ్నేయదిక్కునందు ఉండే పచ్చని ప్రకాశము గల చతురస్రమునకు మధ్యలో ఎనిమిది దళములు గలది, ఎర్రని కాంతులు గలది, పచ్చని తొడిమ గలది అగు పద్మమును వ్రాయవలెను (16). ఓ మంగళకరురాలా! సాధకుడు సమాహితచిత్తుడై దాని మధ్యలో హకారమును, బిందువును వ్రాసి, పద్మమునకు నైరృతి దిక్కులో చతురస్రమును వ్రాసి దానియందు ఎనిమిది దళముల ఎర్రని పద్మమును వ్రాయవలెను. దాని లోని దుద్దు మరియు కింజల్కములు పచ్చగా నుండవలెను. ఆరవ అచ్చు (ఊ) తో కూడిన శవర్గతృతీయవర్ణము (స) ను, బిందువుతో మరియు నాదముతో కూడియున్న పదునాల్గవ అచ్చు (అమ్) అనే గొప్ప వర్ణమును పద్మమునకు మధ్యలో వ్రాయవలెను (17-19). పద్మమునకు ఈశానదిక్కునందలి చతురస్రములో కూడ మరియొక పద్మమును వ్రాసి అయిదవ అచ్చు (ఉ)తో గూడిన కవర్గములోని మూడవ అక్షరము (గ) ను వ్రాయవలెను (20).
విలిఖేన్మధ్యతస్తస్య బిందుకంఠే స్వలంకృతమ్ | తద్బాహ్యపంక్తిత్రితయే పూర్వాదిపరతః క్రమాత్ || 21
కోష్ఠాని పంచ గృహ్ణీయాద్గిరిరాజసుతే శివే | మధ్యే తు కర్ణికాం కుర్యాత్పీతం రక్తం చ వృత్తకమ్ || 22
దలాని రక్తవర్ణాని కల్పయేత్కల్పవిత్తమః | దలబాహ్యే తు కృష్ణేన రంధ్రాణి పరిపూరయేత్ || 23
ఆగ్నేయాదీని చత్వారి శుక్లేనైవ ప్రపూరయేత్ | పూర్వే షడ్బిందుసహితం షట్కోణం కృష్ణమాలిఖేత్ || 24
రక్తవర్ణం దక్షిణతస్త్రి కోణం చోత్తరే తతః | శ్వేతాభమర్ధచంద్రం చ పీతవర్ణం చతుష్టయమ్ || 25
చతురస్రం క్రమాత్తేషు లిఖేద్బీజం చతుష్టయమ్ | పూర్వే బిందుం సమాలిఖ్య శుభ్రం కృష్ణం తు దక్షిణ || 26
ఉకారముత్తరే రక్తం మకారం పశ్చిమే తతః | అకారం పీతమేవం తు కృత్వా వర్ణచతుష్టయమ్ || 27
సర్వోర్ధ్వపంక్త్య ధఃపంక్తౌ సమారభ్య చ సుందరి | పీతం శ్వేతం చ రక్తం చ కృష్ణం చేతి చతుష్టయమ్ || 28
తదధో ధవలం శ్యామం పీతం రక్తం చతుష్టయమ్ | అధస్త్రి కోణకే రక్తం శుక్లం పీతం వరాననే | 29
దాని మధ్యలో బిందువును, కంఠముతో గూడిన గుకారము (గుమ్) ను వ్రాసి చక్కగా అలంకరించవలెను. ఓ పర్వతరాజపుత్రీ!శివపత్నీ! దానికి బయటనుండే మూడు పంక్తులలో తూర్పునుండి అయిదు చతురస్రములను తీసుకొని మధ్యలో పచ్చని తొడిమను, ఎర్రని వృత్తమును వ్రాయవలెను (21,22). ఈ కల్పమునెరింగిన సాధకుడు ఎర్రని దళములను వ్రాయవలెను. దళములకు బయటనుండే రంధ్రములను నల్లని రంగుతో పూర్తిగా నింపవలెను (23). ఆగ్నేయముతో మొదలిడి నాలుగు కోణములలోని చతురస్రములకు తెల్లని రంగును పూయవలెను. తూర్పు దిక్కునందు ఆరు బిందువులతో కూడియున్న నల్లని షడ్భుజిని వ్రాయవలెను (24). దక్షిణమునందు ఎర్రని షడ్భుజిని, తరువాత ఉత్తరమునందు తెల్లని త్రిభుజిని, పశ్చిమమునందు పచ్చని అర్ధచంద్రాకారమును వ్రాసి (25), ఆ చతురస్రములలో క్రమముగా నాల్గు బీజములను వ్రాయవలెను. తూర్పునందు తెల్లని బిందువును, దక్షిణమునందు నల్లని ఉకారమును (26), ఉత్తరమునుందు ఎర్రని మకారమును, తరువాత పశ్చిమమునందు పచ్చని ఆకారమును, ఈ విధముగా నాలుగు వర్ణములను వ్రాయవలెను (27). ఓ సుందరీ! అన్నింటికంటె పై పంక్తికి క్రింద, అనగా రెండవ పంక్తితో ప్రారంభించి వరుసగా నాలుగు చతరస్రములను పసుపు, తెలుపు, ఎరుపు, నలుపు అనే నాలుగు రంగులను పూయవలెను (28). ఓ సుందరీ! వాటి క్రిందనుండే చతురస్రములను తెలుపు నీలము, పసుపు, ఎరుపు, అనే రంగులతో, ఆ క్రింది త్రిభుజిని ఎరుపు , తెలుపు, పసుపు రంగులతో పూయవలెను (29).
ఏవం దక్షిణమారభ్య కుర్యాత్సోమాంతమీశ్వరి | తద్బాహ్యపంక్తౌ పూర్వాదిమధ్యమాంతం విచిత్రయేత్ || 30
పీతం రక్తం చ కృష్ణం చ శ్యామం శ్వేతం చ పీతకమ్ | ఆగ్నేయాది సమారభ్య రక్తం శ్యామం సితం ప్రియే || 31
రక్తం కృష్ణం చ రక్తం చ షట్కమేవం ప్రకీర్తితమ్ | దక్షిణాద్యం మహేశాని పూర్వావధి సమీరితమ్ || 32
నైరృతాద్యం తు విజ్ఞేయమాగ్నేయావధి చేశ్వరి | వారుణం తు సమారభ్య దక్షిణావధి చేరితమ్ || 33
వాయవ్యాద్యం మహాదేవి నైరృతావధి చేరితమ్ | సోమాద్యం పరమేశాని వారుణావధి చేరితమ్ || 34
ఈశానాద్యం తు విజ్ఞేయం వాయవ్యావధి చాంబికే | ఇత్యుక్తో మండలవిధిర్మయా తుభ్యం చ పార్వతి || 35
ఏవం మండలమాలిఖ్య నియతాత్మా యతిస్స్వతః | సౌరపూజాం ప్రకుర్వీత స హి తద్వస్తుతత్పరః || 36
ఇతి శ్రీ శివమహాపురాణ కైలాసంహితాయాం సన్న్యాసమండలవిధి వర్ణనం నామ పంచమో%ధ్యాయః(5).
ఓ ఈశ్వరీ! ఈ విధముగా దక్షిణముతో మొదలిడి ఉత్తరము వరకు అదే విధముగా చేయవలెను. దానికి బయటనుండే పంక్తియందు తూర్పుతో మొదలిడి మధ్య వరకు పసుపు, ఎరుపు, నలుపు, నీలము, తెలుపు, పసుపు రంగులను వేయవలెను. ఓ ప్రియురాలా! ఆగ్నేయముతో మొదలిడి ఎరుపు, నీలము, తెలుపు, ఎరుపు, నలుపు, మరియు ఎరుపు అనే రంగులను వేయవలెనని చెప్పబడినది. ఓ మహేశ్వరీ! మహాదేవీ! పరమేశ్వరీ! అంబికా! దక్షిణముతో మొదలిడి తూర్పు వరకు, నైరృతినుండి ఆగ్నేయము వరకు,పశ్చిమముతో మొదలిడి దక్షిణము వరకు, వాయవ్యముతో మొదలిడి నైరృతి వరకు, ఉత్తరమునుండి పశ్చిమము వరకు, ఈశాన్యముతో మొదలిడి వాయవ్యము వరకు రంగులు ఈ విధముగనే చెప్పబడినవి. ఓ పార్వతీ! నేను నీకు ఈ విధముగా మండలమును నిర్మించు విధానమును చెప్పియుంటిని (30-35). మనోనియంత్రణ గల యతి ఈ విధముగా మండలమును వ్రాసి, బ్రహ్మవస్తువునందు లగ్నమైన మనస్సు గలవాడై తాను స్వయముగా సూర్యపూజను చేయవలెను (36).
శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు సన్న్యాసమండలవిధిని వర్ణించే అయిదవ అధ్యాయము ముగిసినది (5).