Siva Maha Puranam-4    Chapters   

అథ షష్ఠో%ధ్యాయః

మండల పూజ - న్యాస విధి

ఈశ్వర ఉవాచ |

దక్షిణ మండలస్యాథ వైయాఘ్రం చర్మ శోభనమ్‌ | ఆస్తీర్య శుద్ధతోయేన ప్రోక్షయేదస్త్ర మంత్రతః || 1

ప్రణవం పూర్వముద్ధృత్య పశ్చాదాధారముద్ధరేత్‌ | తత్పశ్చాచ్ఛక్తికమలం చతుర్థ్యంతం నమోంతకమ్‌ || 2

మనుమేవ సముచ్చార్య స్థిత్వా తస్మిన్నుదఙ్ముఖః | ప్రాణానాయమ్య విధివత్ర్పణవోచ్చారపూర్వకమ్‌ || 3

అగ్నిరిత్యాదిభిర్మంత్రై ర్భస్మ సంధారయేత్తతః | శిరసి శ్రీగురం నత్వామండలం రచయేత్పునః || 4

త్రికోణవృత్తం బాహ్యే తు చతురస్రాత్మకం క్రమాత్‌ | అభ్యర్చ్యోమితి సాధారం స్థాప్య శంఖం సమర్చయేత్‌ || 5

ఆపూర్వ శుద్ధతోయేన ప్రణవేన సుగంధినా | అభ్యర్చ్య గంధపుష్పాద్యైః ప్రణవేన చ సప్తధా || 6

అభిమంత్ర్య తతస్తస్మిన్ధేనుముద్రాం ప్రదర్శయేత్‌ | శంఖముద్రాం చ తేనైవ ప్రోక్షయేదస్త్ర మంత్రతః || 7

ఆత్మానం గంధపుష్పాదిపూజోపకరణాని చ | ప్రాణాయామత్రయం కృత్వా ఋష్యాదికమథాచరేత్‌ || 8

అస్య శ్రీసౌరమంత్రస్య దేవభాగ ఋషిస్తతః | ఛందో గాయత్రమిత్యుక్తం దేవస్సూర్యో మహేశ్వరః || 9

దేవతా స్యాత్‌ షడంగాని హ్రామిత్యాదీని విన్యసేత్‌ | తతస్సంప్రోక్షయేత్పద్మమస్త్రేణాగ్నేరగోచరమ్‌ || 10

ఈశ్వరుడు ఇట్లు పలికెను -

తరువాత మండలమునకు దక్షిణమునందు అందమైన వ్యాఘ్రచర్మమును పరిచి ఆస్త్ర మంత్రము (ఫట్‌) తో శుద్ధమగు నీటిని ప్రోక్షించవలెను (1). ముందుగా ప్రణవమును, తరువాత మూలాధారమును, ఆ తరువాత శక్తిపద్మమును ఉద్ధరించవలెను (స్పష్టముగా తెలుసుకొని ఉచ్చరించవలెను). మంత్రమును ఉద్ధరించుట యనగా పారిభాషిక పదములతో వాక్యమునందు రహస్యముగా నిక్షేపించ బడిన మంత్రమును తెలుసుకొని పైకి తీయుట. ఆ చర్మముపై ఉత్తరముఖముగా కూర్చుండి ఓం నమశ్శివాయ అను మంత్రమును మాత్రమే ఉచ్చరించి, ఓంకారమును ఉచ్చరిస్తూ యథావిధిగా ప్రాణాయామమును చేయవలెను (2,3). తరువాత 'అగ్నిరితి' మొదలగు మంత్రములతో భస్మను ధరించవలెను. తరువాత తలను వంచి శ్రీ గురువునకు నమస్కరించి మరల మండలమును రచించవలెను (4). బయట త్రిభుజిని, వృత్తమును, చతురస్రమును క్రమముగ గీసి, ఓంకారము నుచ్చరించి పూజించిశంఖమును దాని ఆధారముతోసహా స్థాపించి చక్కగా అర్చించవలెను (5). ఓంకారమునుచ్చరించి శంఖమును సుగంధభరితమగు శుద్ధజలముతో నింపి ఏడు సార్లు ఓంకారమునుచ్చరిస్తూ దానిని గంధము, పుష్పములు మొదలగు వాటితో అర్చించవలెను (6). తరువాత దానిని అభిమంత్రించి ధేనుముద్రను (గోవు రూపములో చేతివ్రేళ్లను) చూపవలెను. శంఖముద్రను కూడ చూపి ఆస్త్ర మంత్రమును పఠిస్తూ నీటిని చల్లవలెను (7). తనపై, మరియు, గంధము, పుష్పములు మొదలగు పూజాద్రవ్యములపై కూడా నీటిని చల్లి, మూడు సార్లు ప్రాణాయామమును చేసి ఋషి మొదలగు వాటిని పఠించవలెను (8). ఈ సౌరమంత్రమునకు దేవభాగుడు ఋషి. ఛందస్సు గాయత్రి. ప్రకాశస్వరూపుడగు సూర్యుని రూపములోనున్న మహేశ్వరుడు దేవతయని చెప్పబడినది. హ్రామ్‌ మొదలగు ఆరు అంగన్యాసములను చేయవలెను. తరువాత అగ్నికి (కంటికి) గోచరము కాని పద్మమును అనగా హృదయపద్మమును అస్త్ర మంత్రముతో సంప్రోక్షించవలెను (9,10).

తస్మిన్‌ సమర్చయేద్విద్వాన్‌ ప్రభూతాం విమలామపి | సారాం చాథ సమారాధ్య పూర్వాదిపరతః క్రమాత్‌ || 11

అథ కాలాగ్నిరుద్రం చ శక్తిమాధారసంజ్ఞితామ్‌ | అనంతం పృథివీం చైవ రత్నద్వీపం తథైవ చ || 12

సంకల్పవృక్షోద్యానం చ గృహం మణిమయం తతః | రక్తపీఠం చ సంపూజ్య పాదేషు ప్రాగుపక్రమాత్‌ || 13

ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం చ చతుష్టయమ్‌ | అధర్మాద్యగ్నికోణాదికోణషు చ సమర్చయేత్‌ || 14

మాయాధశ్ఛదనం పశ్చాద్విద్యోర్థ్వచ్ఛదనం తతః | సత్త్వం రజస్తమశ్చైవ సమభ్యర్చ్య యథాక్రమమ్‌ || 15

పూర్వాదిదిక్షు మధ్యే చ దీప్తాం సూక్ష్మాం జయామపి | భద్రాం విభూతిం విమలామమోఘాం వైద్యుతామపి || 16

సర్వతోముఖసంజ్ఞాం చ కందనాలం తథైవ చ | సుషిరం చ తతస్తంతుకంటకాస్తదనంతరమ్‌ || 17

మూలచ్ఛదనకింజల్కప్రకాశసకలాత్మనః | పంచగ్రంథికర్ణికాం చ దలాని తదనంతరమ్‌ || 18

కేశరాన్‌ బ్రహ్మవిష్ణూ చ రుద్రమాత్మానమేవ చ | అంతరాత్మానమపి చ జ్ఞానాత్మపరమాత్మనీ || 19

సంపూజ్య పశ్చాత్సౌరాఖ్యం యోగపీఠం సమర్చయేత్‌ | పీఠోపరి సమాకల్ప్య మూర్తిం మూలేన మూలవిత్‌ || 20

విద్వాంసుడగు సాధకుడు దానియందు ప్రభూత, విమల, సార అను దేవతలను ఆ క్రమములో చక్కగా ఆరాధించవలెను (11). తరువాత కాలాగ్నిరుద్రుని, మూలాధారశక్తిని, అనంతుని, పృథివీదేవతను, రత్నద్వీపమును (12), సంకల్పములను ఈడేర్చే కల్పవృక్షముల ఉద్యానమును, అచటి మణిమయగృహమును, ఎర్రని పాదపీఠమును పూజించవలెను. తూర్పుదిక్కుతో మొదలిడి ధర్మ-జ్ఞాన-వైరాగ్య-ఐశ్వర్యములనే నాలుగు (అధిష్ఠాన) దేవతలను, ఆగ్నేయము మొదలగు మూలలయందు అధర్మము మొదలగు అధిష్ఠానదేవతలను చక్కగా కొలువ వలెను (13, 14). తరువాత ఆ పద్మమునకు క్రింది ఆకు అనదగిన మాయను, పై ఆకు అనదగిన విద్యను, తరువాత సత్త్వరజస్తమోగుణములను వరుసగా శ్రద్ధతో పూజించి (15), తూర్పు మొదలగు దిక్కులయందు, మరియు మధ్యలో దీప్త, సూక్ష్మ, జయ భద్ర, విభూతి, విమల, అమోఘ, వైద్యుత, సర్వతోముఖములను, కందనాల (పద్మముయొక్క దుంపనుండి వచ్చే నాళము) సుషిరము (నాళమునందుండే రంధ్రము) లను, తంతుకంటకము (నాళమునకు ఉండే ముళ్లు) లను, తరువాత తొడిమను, కింజల్కములను, వాటి ప్రకాశమును, సకలాత్మను, అయిదు ముడులు కలిగినయున్న కర్ణిక (దుద్దు)ను, తరువాత పత్రములను, సన్నని దారములవంటి కేసరములను, బ్రహ్మవిష్ణురుద్రులను, ఆత్మను పూజించి, అంతరాత్మను విజ్ఞానాత్మ పరమాత్మలను చక్కగా పూజించి, తరువాత సౌరము అనబడే యోగపీఠమును పూజించవలెను. మూలాధారమునెరింగిన సాధకుడు ఈశ్వరుని మూర్తిని మూలాధారపీఠమునందు భావన చేయవలెను (16-20).

నిరుద్ధప్రాణ ఆసీనో మూలేనైవ స్వమూలతః | శక్తిముత్థాప్య తత్తేజఃప్రభావాత్పింగలాధ్వనా || 21

పుష్పాంజలౌ నిర్గమయ్య మండలస్థస్య భాస్వతః | సిందూరారుణదేహస్య వామార్ధదయితస్య చ ||22

అక్షస్రక్పాశఖట్వాంగకపాలాంకుశపంకజమ్‌ | శంఖం చక్రం దధానస్య చతుర్వక్త్ర స్య లోచనైః || 23

రాజితస్య ద్వాదశభిస్తస్య హృత్పంకజోదరే | ప్రణవం పూర్వముద్ధృత్య హ్రాం హ్రీం సస్తదనంతరమ్‌ || 24

ప్రకాశశక్తిసహితం మార్తండం చ తతః పరమ్‌ | ఆవాహయామి నమ ఇత్యావాహ్యావాహనాఖ్యయా || 25

ముద్రయా స్థాపనాద్యాశ్చ ముద్రాస్సందర్శయేత్తతః | విన్యస్యాంగాని హ్రాంహ్రీం హ్రూమంతేన మనునా తతః || 26

పంచోపచారాన్‌ సంకల్ప్య మూలేనాభ్యర్చయేత్త్రి ధా | కేశ##రేషు చ పద్మస్య షడంగాని మహేశ్వరి || 27

వహ్నీశరక్షోవాయూనాం పరితః క్రమతస్సుధీః | ద్వితీయావరణ పూజ్యాశ్చతస్రో మూర్తయః క్రమాత్‌ || 28

పూర్వాద్యుత్తరపర్యంతం దలమూలేషు పార్వతి | ఆదిత్యో భాస్కరో భానూ రవిశ్చేత్యనుపూర్వశః || 29

అర్కో బ్రహ్మా తథా రుద్రో విష్ణుశ్చేతి పునః ప్రియే | ఈశానాదిషు సంపూజ్యాస్తృతీయావరణ పునః || 30

సాధకుడు ఆసనముపై కూర్చుండి ప్రాణాయామమును చేసి, మూలాధారశక్తిచేతనే ఆ శక్తిని మూలాధారమునుండి పైకి లేచునట్లు చేసి, ఆ తేజస్సుయొక్క ప్రభావముచే పింగళనాడీ మార్గముగుండా దానిని బయటకు తెచ్చి చేతియందు పుష్పములను ధరింపజేసి, మండలము నందున్నవాడై సిందూరమువలె అరుణవర్ణము గల దేహముతో ప్రకాశించుచున్నవాడు; ఎడమ భాగమునందు భార్యను కలిగియున్నవాడు; జపమాల, పాశము, ఖట్వాంగము (ఒక ఆయుధము), కపాలము, అంకుశము, పద్మము, శంఖము, మరియు చక్రము అను వాటిని ధరించియున్నవాడు; నాలుగు ముఖములయందు పన్నెండు నేత్రములతో ఒప్పారువాడు అగు శివునకు ఆ పుష్పములను అర్పించవలెను. తరువాత సాధకుడు తన హృదయపద్మముయొక్కమధ్యభాగమునుండి ముందుగా ఓంకారమును, తరువాత హ్రాం హ్రీం సః ఆను వర్ణములను భావన చేయవలెను (21-24). తరువాత ప్రకాశమును, వేడిని కలిగియున్న సూర్యుని 'ఆవాహయామి నమః (నేను నమస్కారపూర్వకముగా ఆహ్వానించుచున్నాను)' అను ఆవాహనమంత్రముతో మరియు ఆవాహనమనే ముద్రతో ఆవాహన చేయవలెను (25). తరువాత స్థాపనము మొదలగు ముద్రలను ప్రదర్శించి హ్రాం హ్రీం హ్రూం అను బీజాక్షరములతో అంతమయ్యే మంత్రముతో అంగన్యాసమును చేయవలెను (26). ఓ మహేశ్వరీ! తరువాత మూలమంత్రముతో అయిదు ఉపచారములను భావన చేసి పద్మముయొక్క కేసరములయందు ఆరు అంగములను పూజించవలెను. ఈ విధముగా మూడు పర్యాయములు చేయవలెను (27). ఓ పార్వతీ! విద్వాంసుడగు సాధకుడు రెండవ ఆవరణయందు ఆగ్నేయ, ఈశాన్య, నైరృతి, వాయవ్యమూలలయందు తూర్పుతో మొదలిడి ఉత్తరము వరకు గల పద్మపత్రములయందు క్రమముగా ఆదిత్య, భాస, భాను, రవి అనే నాలుగు మూర్తులను వరుసగా కొలువవలెను (28,29). ఓ ప్రియురాలా! మరల మూడవ ఆవరణయందు ఈశాన్యము మొదలగు దిక్కులయందు సూర్యుని, బ్రహ్మను, రుద్రుని, మరియు విష్ణువును చక్కగా పూజించవలెను (30).

సోమం కుజం బుధం జీవం కవిం మందం తమస్తమః | సమంతతో యజేదేతాన్‌ పూర్వాదిదలమధ్యతః || 31

అథవా ద్వాదశాదిత్యాన్‌ ద్వితీయావరణ యజేత్‌ | తృతీయావరణ చైవ రాశీన్‌ ద్వాదశ పూజయేత్‌ || 32

సప్తసాగరగంగాశ్చ బహిరస్య సమంతతః | ఋషీన్‌ దేవాంశ్చ గంధర్వాన్‌ పన్నగానప్సరోగణాన్‌ || 33

గ్రామణ్యశ్చ తథా యక్షాన్‌ యాతుధానాంస్తథా హయాన్‌ | సప్త ఛందోమయాంశ్చైవ వాలఖిల్యాంశ్చ పూజయేత్‌ || 34

ఏవం త్ర్యావరణం దేవం సమభ్యర్చ్య దివాకరమ్‌ | విరచ్య మండలం పశ్చాచ్చతురస్రం సమాహితః || 35

స్థాప్య సాధారకం తామ్రపాత్రం ప్రస్థోదవిస్తృతమ్‌ | పూరయిత్వా జలైశ్శుద్ధైర్వాసితైః కుసుమాదిభిః || 36

ఆభ్యర్చ్య గంధపుష్పాద్యైర్జానుభ్యామవనీం గతః | అర్ఘ్యపాత్రం సమాదాయ భ్రూమధ్యాంతం సముద్ధరేత్‌ || 37

తతో బ్రూయాదిమం మంత్రం సావిత్రం సర్వసిద్ధిదమ్‌ | శృణు తచ్చ మహాదేవి భుక్తిముక్తి ప్రదం సదా || 38

సిందూరవర్ణాయ సుమండలాయ నమో%స్తు వజ్రాభరణాయ తుభ్యమ్‌ |

పద్మాభ##నేత్రాయ సుపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ || 39

సరక్తచూర్ణం ససువర్ణతోయం స్రక్కుంకుమాఢ్యం సకుశం సపుష్పమ్‌ |

ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్‌ ప్రసీద || 40

తూర్పు దిక్కుతో మొదలిడి చుట్టూ ఉండే దళముల మధ్యలో చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు అను గ్రహములను ఆరాధించవలెను (31). లేదా, రెండవ ఆవరణలో పన్నెండుగురు ఆదిత్యులను, మూడవ ఆవరణలో పన్నెండు రాశులను పూజించవలెను (32). దానికి బయట అన్నివైపులా ఏడు సముద్రములను, ఏడు గంగలను, ఏడ్గురు ఋషులను, దేవతలను, గంధర్వులను, నాగులను, అప్సరసల గణములను (33), గ్రామదేవతలను, యక్షరాక్షసులను, వేదముల రూపములోనున్న ఏడు గుర్రములను, వాలఖిల్యమహర్షులను పూజించవలెను (34). ఈ విధముగా మూడు ఆవరణలతో కూడి యున్న ప్రకాశస్వరూపుడుగు ఆదిత్యుని చక్కగా పూజించి, తరువాత సాధకుడు ఏకాగ్రచిత్తముగలవాడై చతురస్రాకారమండలమును రచించవలెను (35). దానిపై ఆధారము (మట్టు) కలిగి శేరు నీరు పట్టే రాగి చెంబును ఉంచి, దానిని పుష్పములు మొదలగు వాటి పరిమళముతో కూడిన శుద్ధజలములతో నింపవలెను (36). దానిని గంధము, పుష్పములు మొదలగు వాటితో పూజించి, మోకాళ్లపై నేల మీద నిలబడి, ఆ జలపాత్రను కనుబొమల మధ్య వరకు పైకి ఎత్తవలెను (37). తరువాత సకలసిద్ధులను ఇచ్చే, సూర్యదేవతాకమైన ఈ మంత్రమును చెప్పవలెను. ఓ మహాదేవీ! ఈ మంత్రము సర్వకాలములలో భుక్తిని మరియు ముక్తిని ఇచ్చును (38). ఎర్రని రంగు గలవాడు, చక్కని మండలము గలవాడు, వజ్రమును ఆభరణముగా దాల్చువాడు, పద్మము వలె ప్రకాశించే కన్నులు గలవాడు, పద్మములను వికసింప జేయువాడు, బ్రహ్మ-ఇంద్ర-నారాయణులకు కారణమైనవాడు అగు నీకు నమస్కారమగు గాక! (39). ఓ భగవాన్‌! మాల, దర్భలు మరియు పుష్పములతో రాజిల్లునది, కుంకుమతో కూడిన స్వచ్ఛమైన జలములు గలది అగు ఈ బంగరు పాత్రలోని శ్రేష్ఠమగు అర్ఘ్యమును స్వీకరించి ప్రసన్నుడవు కమ్ము (40).

ఏవముక్త్వా తతో దత్త్వా తదర్ఘ్యం సూర్యమూర్తయే | నమస్కుర్యాదిమం మంత్రం పఠిత్వా సుసమాహితః || 41

నమశ్శివాయ సాంబాయ సగణాయాదిహేతవే | రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణ చ త్రిమూర్తయే || 42

ఏవముక్త్వా నమస్కృత్య స్వాసనే సమవస్థితః | ఋష్యాదికం పునః కృత్వా కరం సంశోధ్య వారిణా || 43

పునశ్చ భస్మ సంధార్య పూర్వోక్తేనైవ వర్త్మనా | న్యాసజాతం ప్రకుర్వీత శివభావవివృద్ధయే || 44

పంచోపచారైస్సంపూజ్య శిరసా శ్రీగురుం బుధః | ప్రణవం శ్రీచతుర్థ్యంతం నమో%తం ప్రణమేత్తతః || 45

పంచాత్మకం బిందుయుతం పంచమస్వరసంయుతమ్‌ | తదేవ బిందుసహితం పంచమస్వరవర్జితమ్‌ || 46

పంచమస్వరసంయుక్తం మంత్రీశం చ సబిందుకమ్‌ | ఉద్ధృత్య బిందుసహితం సంవర్తకమథోద్ధరేత్‌ || 47

ఏతైరేవం క్రమాద్బీజైరుద్ధృతైః ప్రణమేద్బుధః | భుజయోరూరుయుగ్మే చ గురుం గణపతిం తథా || 48

దుర్గాం చ క్షేత్రపాలం చ బద్ధ్వాంజలిపుటః స్థితః | ఓమస్త్రాయ ఫడిత్యుక్త్వా కరౌ సంశోధ్య షట్‌ క్రమాత్‌ || 49

అపసర్పంత్వితి ప్రోచ్య ప్రణవం తదనంతరమ్‌ | అస్త్రాయ ఫడితి ప్రోచ్య పార్‌ష్ణిఘాతత్రయేణ తు || 50

ఇట్లు పలికి, తరువాత ఆ అర్ఘ్యమును సూర్యనారాయణమూర్తికి సమర్పించి, మిక్కిలి ఏకాగ్రమగు మనస్సు గలవాడై ఈ మంత్రమును పఠించి నమస్కరించవలెను (41). మంగళస్వరూపుడు, జగన్మాతతో మరియు గణములతో కూడియున్నవాడు, ఆదికారణుడు, బ్రహ్మవిష్ణురుద్రులనే త్రిమూర్తుల రూపములో నున్నవాడు అగు నీకు నమస్కారము (42). ఇట్లు పలికి నమస్కరించి తన ఆసనములో చక్కగా కూర్చుండి మరల ఋషి మొదలగు వాటని చెప్పి చేతులను నీటితో కడుగుకొని (43), మరల భస్మను పూర్వములో చెప్పినవిధముగనే ధరించి, శివ భావము వర్ధిల్లుట కొరకై దేహమునందు న్యాసములనన్నింటిని చేయవలెను (44). అపుడు విద్వాంసుడగు సాధకుడు శ్రీగురువును అయిదు ఉపచారములతో చక్కగా పూజించి, 'ఓం శ్రియై నమః (సర్వసంపత్స్వరూపుడగు పరమేశ్వరునకు నమస్కారము)' అని పలికి నమస్కరించవలెను (45). బిందునాదములతో కలిపి అయిదు అవయవములతో కూడియున్న ఓంకారమును, నాదము లేని ఓంకారమును ధ్యానించవలెను (46). అయిదు అంశలతో కూడిన మంత్రరాజమగు ఓంకారమునీ విధముగా ఉద్ధరించి, తరువాత సంవర్తక బీజమును ఉద్ధరించవలెను (47). ఈ విధముగా క్రమముగా బీజములను ఉచ్చరించి విద్వాంసుడగు సాధకుడు మండలము యొక్క భుజములయందు ఊరువులయందు ఉన్న గురువునకు మరియు గణ పతికి ప్రణమిల్లవలెను (48). నిలబడి చేతులను జోడించి దుర్గకు మరియు క్షేత్రపాలకునకు కూడ నమస్కరించి, 'ఓం అస్త్రాయ ఫట్‌' అని ఆరు సార్లు పలికి చేతులను కలపవలెను (49). తరువాత 'అపసర్పంతు (పిశాచములు మొదలగునవి దూరముగా తొలగిపోవుగాక') అనే మంత్రమును, ఓంకారమును, 'అస్త్రాయ ఫట్‌' అను మంత్రమును పఠించి మూడు సార్లు వెనుక భాగమునందు తట్టుకొనవలెను (50).

ఉద్ధృత్య విఘ్నాన్‌ భూయిష్ఠాన్‌ కరతాలత్రయేణ తు | అంతరిక్షగతాన్‌ దృష్ట్వా విలోక్య దివి సంస్థితాన్‌ || 51

నిరుద్ధప్రాణ ఆసీనో హంసమంత్రమనుస్మరన్‌ | హృదిస్థం జీవచైతన్యం బ్రహ్మనాడ్యా సమానయేత్‌ || 52

ద్వాదశాంతఃస్థవిశ##దే సహస్రారమహాంబుజే | చిచ్చంద్రమండలాంతఃస్థం చిద్రూపం పరమేశ్వరమ్‌ || 53

శోషదాహప్లవాన్‌ కుర్యాద్రేచకాదిక్రమేణ తు | సషోడశచతుష్షష్టిద్వాత్రింశద్గణనాయుతైః || 54

వాయ్వగ్నిసలిలాద్యైసై#్తస్స్వవేదాద్యైరనుక్రమాత్‌ | ప్రాణానాయమ్య మూలస్థాం కుండలీం బ్రహ్మరంధ్రగామ్‌ || 55

ఆనీయ ద్వాదశంతఃస్థసహస్రారాంబుజోదరే | చిచ్చంద్రమండలోద్భూతపరమామృతధారయా || 56

సంసిక్తాయాం తనౌ భూయశ్శుద్ధదేహస్సుభావనః | సో%హమిత్యవతీర్యాథ స్వాత్మానం హృదయాంబుజే || 57

ఆత్మన్యావేశ్య చాత్మానమమృతం సృతిధారయా | ప్రాణప్రతిష్ఠాం విధివత్కుర్యాదత్ర సమాహితః || 58

ఏకాగ్రమానసో యోగీ విమృశ్యాత్తాం చ మాతృకామ్‌ | పుటితాం ప్రణవేనాథ న్యసేద్బాహ్యే చ మాతృకామ్‌ || 59

పునశ్చ సంయతప్రాణః కుర్యాదృష్యాదికం బుధః | శంకరం సంస్మరేచ్చిత్తే సన్న్యాసేచ్చ విమత్సరః || 60

ఈ విధముగా మూడు సార్లు చప్పట్లను కొట్టి సకలవిఘ్నములను తరిమికొట్టి అంతరిక్షములో మరియు స్వర్గములో ఉండే ప్రాణులను (భావనారూపముగా) దర్శించి (51), కూర్చుండి ప్రాణాయామమును చేసి, హంసమంత్రమును స్మరిస్తూ, హృదయమునందు ఉండే జీవచైతన్యమును బ్రహ్మనాడి గుండా పైకి తీసుకురావలెను (52). పన్నెండు దళముల హృదయపద్మములోపల స్వచ్ఛమగు ఆకాశములో, సహస్రారము అనే మహాపద్మములో, మరియు కనుబొమలపైన చిన్మయమగు చంద్రమండలములోనున్న చైతన్న స్వరూపుడగు పరమేశ్వరునియందు ఆ జీవచైతన్యమును విలీనము చేయవలెను (53). పదహారు, అరవై నాలుగు, ముప్పది రెండు పర్యాయములు లెక్కపెట్టుకొని వరుసగా రేచక-పూరక-కుంభకములనే వరుసలో శోష-దాహ-ప్లవములనే ప్రాణాయామములను చేయవలెను (54). ప్రాణాయామమును చేసిన తరువాత తన వేదశాఖలో చెప్పబడిన విధముగా వాయువు, అగ్ని, జలము మొదలగు చక్రముల వరుసలో మూలాధారమునందుండే కుండలినీ శక్తిని బ్రహ్మరంధ్రము వరకు గొనివచ్చి పన్నెండు దళముల హృదయపద్మములో మరియు సహస్రారపద్మములోపల నుండి శివునియందు లీనము చేయవలెను. చైతన్యస్వరూపుడగు చంద్రుని మండలమునందు ఉద్భవించే అమృతధారతో తడుపబడినప్పుడు దేహము మరియు మనస్సు శుద్ధమగును. తరువాత సాధకుడు 'సో%హమ్‌ (పరబ్రహ్మ నేనే)' అని భావన చేస్తూ తన ఆత్మను హృదయమపద్మములోనికి తీసుకురావలెను (55-57). ఏకాగ్రమగు మనస్సు గల సాధకుడు అమృతము ప్రవహించే ధారయొక్క మార్గము గుండా ఆత్మను బుద్ధియందు ఆవేశింపజేసి హృదయమునందు యథావిధిగా ప్రాణప్రతిష్ఠను చేయవలెను (58). ఏకాగ్రమగు మనస్సు గల యోగి మాతృక (అక్షరముల మాలిక) ను భావన చేయవలెను. తరువాత, ఓంకారముచే కూర్చబడిన ఆ మాతృకను బాహ్యమునందు న్యాసము చేయవలెను (59). విద్వాంసుడగు సాధకుడు మరల ప్రాణాయామమును చేసి ఋషి మొదలగు వివరములను పఠించి మనస్సునందు శంకరుని స్మరిస్తూ మాత్సర్యమును విడనాడి ఏకాంతమునందు ఉండవలెను (60).

ప్రణవస్య ఋషిర్‌ బ్రహ్మా దేవి గాయత్రమీరతమ్‌ | ఛందో%త్ర దేవతాహం వై పరమాత్మా సదాశివః || 61

అకారో బీజమాఖ్యాతముకారశ్శక్తిరుచ్యతే | మకారః కీలకం ప్రోక్తం మోక్షార్ధే వినియుజ్యతే || 62

అంగుష్ఠద్వయమారభ్య తలాంతం పరిమార్జయేత్‌ | ఓమిత్యుక్త్వాథ దేవేశి కరన్యాసం సమారభేత్‌ || 63

దక్షహస్తస్థితాంగుష్ఠం సమారభ్య యథాక్రమమ్‌ | వామహస్తకనిష్ఠాంతం విన్యసేత్పూర్వవత్ర్క మాత్‌ || 64

అకారమప్యుకారం చ మకారం బిందుసంయుతమ్‌ | నమో%తంప్రోచ్య సర్వత్ర హృదయాదౌ న్యసేదథ || 65

అకారం పూర్వముద్ధృత్య బ్రహ్మాత్మానమథాచరేత్‌ | జేంతం నమోంతం హృదయే వినియుజ్యాత్తథా పునః || 66

ఉకారం విష్ణుసహితం శిరోదేశే ప్రవిన్యసేత్‌ | మకారం రుద్రసహితం శిఖాయాం తు ప్రవిన్యసేత్‌ || 67

ఏపముక్త్వా మునిర్మంత్రీ కవచం నేత్రమస్తకే | విన్యసేద్దేవదేవేశి సావధానేన చేతసా || 68

అంగవక్త్ర కలాభేదాత్పంచ బ్రహ్మాణి విన్యసేత్‌ | శిరోవదనహృద్గుహ్యపాదేష్వేతాని విన్యసేత్‌ || 69

ఈశానస్య కలాః పంచ పంచస్వేతేషు చ క్రమాత్‌ | తతశ్చతుర్షు వక్త్రేషు పురుషస్య కలా అపి || 70

చతస్రః ప్రణిధాతవ్యాఃపూర్వాదిక్రమయోగతః | హృత్కంఠాంసేషు నాభౌ చ కుక్షౌ పృష్ఠే చ వక్షసి || 71

అఘోరస్య కలాశ్చాఎ్టౌ పూజనీయా యథాక్రమమ్‌ | పశ్చాత్త్ర యోదశ కలాః పాయుమేఢ్రోరుజానుషు || 72

జంఘాస్ఫిక్కటిపార్శ్వేషు వామదేవస్య భావయేత్‌ | సద్యస్యాపి కలాశ్చాష్టౌ నేత్రేషు చ యథా క్రమమ్‌ || 73

కీర్తితాస్తాః కలాశ్చైవం పాదయోరపి హస్తయోః | ప్రాణ శిరసి బాహ్వోశ్చ కల్పయేత్కల్పవిత్తమః || 74

ఓ దేవీ! ఓంకారమునకు ఋషి బ్రహ్మ, ఛందస్సు గాయత్రి, పరమాత్ముడను, సదాశివుడను అగు నేను దేవతను (61). అకారము బీజమనియు, ఉకారము శక్తి అనియు, మకారము కీలకమనియు చెప్పబడినది. ఈ మంత్రము మోక్షము కొరకై జపించబడును (62). ఓ దేవదేవీ! కరన్యాసమును రెండు బొటనవ్రేళ్లతో మొదలిడి చేయవలెను. కరతలములను, వెనుక భాగములను పరస్పరము స్పృశించుటతో కరన్యాసము అంతమగును. ఓం కారపూర్వకముగా దీనిని చేయవలెను (63). కుడిచేతి బొటనవ్రేలితో మొదలిడి క్రమముగా ఎడమ చేతి చిటికెన వ్రేలి వరకు పూర్వమునందు చెప్పన విధముగనే న్యాసమును చేయవలెను (64). తరువాత, అకార-ఉకారములను, బిందువుతో కూడిన మకారమును, అంతమునందు 'నమః' అనియు ఉచ్చరించి హృదయాదిన్యాసమును చేయవలెను (65). ముందుగా అకారమును ఉద్ధరించి (ఉచ్చరించి, లేదా భావనలో పైకి తీసి) బ్రహ్మను భావన చేయవలెను. తరువాత మరల చతుర్థీవిభక్తితో కూడిన 'నమః' అను పదమును (నమశ్శివాయః) ఉచ్చరించి హృదయమునందు వినియోగించవలెను; అనగా, స్పృశించి భావన చేయవలెను (66). ఉకారమునుచ్చరించి విష్ణువును భావించి శిరస్సుపై స్పృశించవలెను. మకారమునుచ్చరించి శివుని స్మరించి శిఖ (పిలక) ను స్పృశించవలెను (67). ఓ దేవదేవీ! ఈశ్వరీ! మంత్రమును జపము చేసే ఆ సాధకుడు సావధానమనస్కుడై ఈ విధముగా ఉచ్చరిస్తూ కవచము, కళ్లు, శిరస్సు అను వాటియందు న్యాసము చేయవలెను (68). అంగము, ముఖము మరియు కళ అను వాటిలో గల భేదములను బట్టి అయిదుగురు బ్రహ్మలను (సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన) న్యాసము చేయవలెను. శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు అను అవయవములయందు ఈశానుని అయిదు కళలను క్రమముగా న్యాసము చేయవలెను. తరువాత నాలుగు ముఖములయందు పురుషుని కళలను కూడ తూర్పు దిక్కునందు మొదలిడి క్రమముగా న్యాసము చేయవలెను. అఘోరుని ఎనిమిది కళలను హృదయము, కంఠము, రెండు భుజములు, నాభి, ఉదరము, వీపు, వక్షఃస్థలము అను స్థానములయందు క్రమముగా పూజించవలెను. తరువాత, విసర్జన జననేంద్రియములు, తొడలు, మోకాళ్లు, పిక్కలు, పిరుదులు, నడుము, ప్రక్కటెముకలు అను పదమూడు స్థానములయందు వామదేవుని పదమూడు కళలను భావన చేయవలెను. సద్యోజాతుని ఎనిమిది కళలను నేత్రములయందు భావన చేయవలెను (69-73).న్యాసవిధిలో నిష్ణాతుడైన సాధకుడు పైన చెప్పిన విధముగా కళలను పాదములు, చేతులు, ప్రాణము (ఊపిరి), శిరస్సు, రెండు బాహువులు అను స్థానములయందు భావన చేయవలెను (74).

అష్టత్రింశత్కలాసమేవం కృత్వా తు సర్వశః | పశ్చాత్ర్పణవవిద్ధీమాన్‌ ప్రణవన్యాసమాచరేత్‌ || 75

బాహుద్వయే కూర్పరయోస్తథా చ మణిబంధయోః | పార్శ్వతోదరజంఘేషు పాదయోఃపృష్ఠతస్తథా || 76

ఇత్థం ప్రణవవిన్యాసం కృత్వా న్యాసవిచక్షణః | హంసన్యాసం ప్రకుర్వీత పరమాత్మవిబోధిని || 77

ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం న్యాసవర్ణనం నామ షష్ఠో%ధ్యాయః (6).

ఈ విధముగా అన్నిస్థానములయందు ముప్పది ఎనిమిది కళలను న్యాసమును చేసి, తరువాత ప్రణవస్వరూపమునెరింగిన సాధకుడు రెండు చేతులు, మోచేతులు, మణికట్టు స్థానములు, ప్రక్కటెముకలు, ఉదరము, పిక్కలు, పాదములు, వీపు అను స్థానములయందు ప్రణవన్యాసమును చేయవలెను (75,76). పరమాత్మస్వరూపమును ఎరింగిన ఓ దేవీ! న్యాసమునందు విద్వాంసుడగు సాధకుడు ఈ విధముగా ఓంకారన్యాసమును చేసిన తరువాత హంసన్యాసమును చేయవలెను (77).

శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు న్యాసవర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).

Siva Maha Puranam-4    Chapters