Siva Maha Puranam-4    Chapters   

అథ అష్టమో%ధ్యాయః

ఆవరణ పూజ

ఈశ్వర ఉవాచ |

అత్రాస్తి చ మహాదేవి ఖల్వావరణపంచకమ్‌ | పంచావరణపూజాం తు ప్రారభేత యథాక్రమమ్‌ || 1

ప్రథమం పూజితౌ యత్ర తత్రై వ క్రమశస్సుధీః | గంధాద్యైరర్చయేత్పూర్వం దేవౌ హేరంబషణ్ముఖౌ || 2

పంచ బ్రహ్మాణి పరితో వృత్తే సంపూజయేత్క్ర మాత్‌ | ఈశానదేశే పూర్వే చ దక్షిణ చోత్తరే తథా || 3

పశ్చిమే చ తతస్తస్మిన్‌ షడంగాని సమర్చయేత్‌ | ఆగ్నేయే చ తథైశాన్యే నైరృతే వాయుదేశ##కే || 4

మధ్యే నేత్రం తద్వదస్త్రం పూర్వాది పరితః క్రమాత్‌ | ప్రథమావరణం ప్రోక్తం ద్వితీయావరణం శృణు || 5

అనంతం పూర్వదిక్పత్రే సూక్ష్మం దక్షిణతస్తథా | శివోత్తమం పశ్చిమత ఏకనేత్రం తథోత్తరే || 6

ఏకరుద్రం తథైశాన్యే త్రిమూర్తిం వహ్నిదిగ్దలే | శ్రీకంఠం నైరృతే వా¸° శిఖండీశం సమర్చయేత్‌ || 7

ద్వితీయావరణ చైవ పూజ్యాస్తే చక్రవర్తినః | పూర్వద్వారస్య మధ్యే తు వృషేశానం ప్రపూజయేత్‌ || 8

తద్దక్షిణ నందినం చ మహాకాలం తదుత్తరే | భృంగీశం దక్షిణద్వారపశ్చిమే సంప్రపూజయేత్‌ || 9

తత్పూర్వకోష్ఠే గంధాద్యైస్సంప్రపూజ్య వినాయకమ్‌ | పశ్చిమోత్తరకోష్ఠే చ వృషభం దక్షిణ గుహమ్‌ || 10

ఈశ్వరుడిట్లు పలికెను-

ఓ మహాదేవీ! ఈ పూజలో అయిదు ఆవరణములు కలవు. సాధకుడు క్రమముగా ఈ అయిదు ఆవరణల పూజను ఆరంభించవలెను (1). పూర్వములో ఏ స్థానమునందు విఘ్నేశ్వర కుమారస్వాములు పూజింపబడినారో, అదే స్థానములో బుద్ధిమంతుడగు సాధకుడు ముందుగా వారిద్దరిని క్రమముగా గంధము మొదలగు వాటితో అర్చించవలెను (2). చుట్టూ ఉన్న వృత్తములో ఈశాన్యము, తూర్పు, దక్షిణము, ఉత్తరము మరియు పశ్చిమము అను దిక్కులయందు క్రమముగా అయిదురుగు బ్రహ్మలను చక్కగా పూజించవలెను. తరువాత పశ్చిమ, ఆగ్నేయ, ఈశాన్య, నైరృతి, వాయవ్యములయందు మరియు మధ్యభాగములో ఆరు అంగములను పూజించవలెను. తూర్పుతో మొదలుపెట్టి చుట్టూ వరుసగా నేత్రమును కూడ పూజించవలెను. ఇది మొదటి ఆవరణము. ఇపుడు రెండవ ఆవరణమును గురించి వినుము (3-5). తూర్పు దిక్కునందలి దళములో అనంతుని, దక్షిణదళమునందు సూక్ష్ముని, పశ్చిమదళమునందు శివోత్తముని, ఉత్తరమునందు ఏకనేత్రుని (6), ఈశాన్యమునందు ఏకరుద్రుని, ఆగ్నేయదిక్కులోని దళమునందు త్రిమూర్తిని, నైరృతియందు శ్రీకంఠుని, వాయవ్యమునందు శిఖండీశుని చక్కగా ఆరాధించవలెను (7). ఆ చక్రవర్తులను కూడ రెండవ ఆవరణలో పూజించవలెను. తూర్పు ద్వారమునకు మధ్యలో వృషేశానుని పూజించవలెను (8). దానికి దక్షిణమునందు నందిని, ఉత్తరమునందు మహాకాలుని, దక్షిణద్వారమునకు పశ్చిమమునందు భృంగీశుని శ్రద్ధగా పూజించవలెను (9). దానికి తూర్పు వైపున వినాయకుని గంధము మొదలగు వాటితో చక్కగా పూజించి, వాయవ్యమునందు వృషభమును, దక్షిణమునందు గుహుని పూజించవలెను (10).

ఉత్తరద్వారపూర్వే తు ప్రదక్షిణవిధానతః | నామాష్టకవిధానేన పూజయేదుచ్యతే హి తత్‌ || 11

భవం శర్వం తథేశానం రుద్రం పశుపతిం పునః | ఉగ్రం భీమం మహాదేవం తృతీయావరణం త్విదమ్‌ || 12

యో వేదాదౌ సర్వ ఇతి సమావాహ్య మహేశ్వరమ్‌ | పూజయేత్పూర్వదిగ్భాగే కమలే కర్ణకోపరి || 13

ఈశ్వరం పూర్వదిక్పత్రే విశ్వేశం దక్షిణ తతః | సౌమ్యే తు పరమేశానం సర్వేశం పశ్చిమే యజేత్‌ || 14

దక్షిణ తు యజేద్రుద్రమా వో రాజానమిత్యృచా | ఆవాహ్య గంధపుష్పాద్యైః కర్ణికాయాం దలేషు చ || 15

శివః పూర్వే దక్షిణతో హర ఉత్తరతో మృడః | భవః పశ్చిమదిక్పత్రే పూజ్యా ఏతే యథాక్రమమ్‌ || 16

ఉత్తరే విష్ణుమావాహ్య గంధపుష్పాదిభిర్యజేత్‌ | ప్రతద్విష్ణురితి ప్రోచ్య కర్ణికాయాం దలేషు చ || 17

వాసుదేవం పూర్వభాగే దక్షిణ చానిరుద్ధకమ్‌ | సౌమ్యే సంకర్షణం చైవ ప్రద్యుమ్నం పశ్చిమే యజేత్‌ || 18

బ్రహ్మాణం పశ్చిమే పద్మే సమావాహ్య సమర్చయేత్‌ | హిరణ్యగర్భస్సమవర్తత ఇతి మంత్రేణ మంత్రవిత్‌ || 19

హిరణ్యగర్భం పూర్వస్యాం విరాజం దక్షిణ తతః | ఉత్తరే పుష్కరం చైవ కాలం పశ్చిమతో యజేత్‌ || 20

ఉత్తరద్వారమునకు తూర్పు నందు ప్రదక్షిణవిధానముగా మరియు ఎనిమిది నామములతో కూడియున్న విధానముతో పూజించవలెను. ఆ విధానము చెప్పబడుచున్నది (11). భవ, శర్వ, ఈశాన, రుద్ర, పశుపతి, ఉగ్ర, భీమ, మహాదేవ అను నామములు మూడవ ఆవరణలో నుండును (12). 'యో వేదాదౌ సర్వః' అనే మంత్రముతో మహేశ్వరుని తూర్పు దిక్కునందలి పద్మములోని కర్ణికపైన చక్కగా ఆవాహన చేసి పూజించవలెను (13). తూర్పు దిక్కునందలి దళమునందు ఈశ్వరుని, దక్షిణమునందు విశ్వేశుని, ఉత్తరమునందు పరమేశానుని, పశ్చిమమునందు సర్వేశుని పూజించవలెను (14). దక్షిణమునందు రుద్రుని, 'ఆ వో రాజానమ్‌' అనే మంత్రముతో కర్ణికయందు మరియు దళములయందు కూడ ఆవాహన చేసి గంధము, పుష్పములు మొదలగు వాటితో పూజించవలెను (15). తూర్పునందు శివుని, దక్షిణమునందు హరుని, ఉత్తరమునందు మృడుని, పశ్చిమదిక్కులోని దళమునందు భవుని వరుసగా పూజించవలెను (16). ఉత్తరమునందు విష్ణువును ఆవాహనచేసి 'ప్రతిద్విష్ణుః' అనే మంత్రమును పఠించి కర్ణికయందు మరియు దళములయందు కూడా గంధము పుష్పములు మొదలగు వాటితో పుజించవలెను (17). తూర్పు భాగమునందు వాసుదేవుని, దక్షిణమునందు అనిరుద్దుని, ఉత్తరమునందు సంకర్షణుని, పశ్చిమమునందు ప్రద్యుమ్నుని ఆరాధించవలెను (18). మంత్రములనెరింగిన సాధకుడు పశ్చిమపద్మమునందు 'హిరణ్యగర్భస్సమవర్తతాగ్రే' అను మంత్రముతో బ్రహ్మను ఆవాహన చేసి పూజించవలెను (19). తూర్పు దిక్కునందు హిరణ్యగర్భుని, దక్షిణమునందు విరాట్పురుషుని, ఉత్తరమునందు పుష్కరుని, పశ్చిమమునందు కాలుని పూజించవలెను (20).

సర్వోర్ధ్వపంక్తౌ పూర్వాది ప్రదక్షిణవిధానతః | తత్తత్‌ స్థానేషు సంపూజ్య లోకపాలాననుక్రమాత్‌ || 21

రాంతం పాంతం తథా జ్ఞాంతం లాంతం లాంతమపూర్వకమ్‌ | షాంతం సాంతం చ వేదాద్యం శ్రీబీజం చ దశ క్రమాత్‌ || 22

బీజాని లోకపాలానామేతైరేతాన్‌ సమర్చయేత్‌ | నైరృతే చోత్తరే తద్వదీశానస్య చ దక్షిణ || 23

బ్రహ్మవిష్ణూ చ విధినా పూజయేదుపచారకైః | బాహ్యరేఖాసు దేవేశం పంచమావరణ యజేత్‌ || 24

శ్రీమత్త్రిశూలమీశానే వజ్రం మహేంద్రదిఙ్ముఖే | పరశుం వహ్నిదిగ్భాగే యామ్యే సాయకమర్చయేత్‌ || 25

నైరృతే తు యజేత్ఖడ్గం పాశం వరుణగోచరే | అంకుశం మారుతే భాగే పినాకం చోత్తరే యజేత్‌ || 26

పశ్చిమాభిముఖం రౌద్రం క్షేత్రపాలం సమర్చయేత్‌ | యథావిధి విధానజ్ఞశ్శివప్రీత్యర్థమేవ చ || 27

కృతాంజలిపుటాస్సర్వే చింత్యాస్మ్సితముఖాంబుజాః | సాదరం ప్రేక్షమాణాశ్చ దేవం దేవీం చ సర్వదా || 28

ఇత్థమావరణాభ్యర్చాం కృత్వా విక్షేపశాంతయే | పునరభ్యర్చ్య దేవేశం ప్రణవం చ శివం విదేత్‌ || 29

ఏవమభ్యర్చ్య విధివద్గంధాద్యైరుపచారకైః | ఉపచర్య తతో దద్యాన్నైవేద్యం విధిసాధితమ్‌ || 30

అన్నింటి కంటె పైనుండే వరుసలో తూర్పు దిక్కుతో మొదలిడి ప్రదక్షిణపద్ధతిలో (ఎడమనుండి కుడికి) ఆయా స్థానములయందు క్రమముగా లోకపాలకులను చక్కగా పూజించవలెను (21). రాంతము (రకారముతో అంతమగునది), పాంతము, జ్ఞాంతము, లాంతములు, అకారముతో మొదలయ్యే లాంతము, షాంతము, సాంతము, వేదమంత్రములకు ఆదిలోనుండే ఓంకారము మరియు శ్రీ బీజము అను పది లోకపాలకుల బీజాక్షరములు. వీటితో వారిని పూజించవలెను. నైరృతి, ఉత్తరము, ఈశాన్యము మరియు దక్షిణము అను దిక్కులయందు బ్రహ్మవిష్ణువులను యథావిధిగా ఉపచారములతో పూజించవలెను. అయిదవ ఆవరణమునకు బయట ఉండే రేఖలయందు దేవదేవుడగుశివుని పూజించవలెను (22-24). శోభాయుతమగు త్రిశూలమును ఈశాన్యమునందు, వజ్రమును తూర్పునందు పరశువును ఆగ్నేయమునందు, బాణమును దక్షిణమునందు పూజించవలెను (25). నైరృతియందు కత్తిని, పశ్చిమమునందు పాశమును, వాయవ్యమునందు అంకుశమును, ఉత్తరమునందు పినాకధనస్సును పూజించవలెను (26). పూజావిధానమునెరింగన సాధకుడు శివుని ప్రీతి కొరకై రుద్రునకు సంబంధించినవాడు, పశ్చిమదిక్కునకు అభిముఖముగా నుండువాడు అగు క్షేత్రపాలకుని యథావిధిగా చక్కగా పూజించవలెను (27). వీరందరు చిరునవ్వులతో కూడియున్న పద్మములవంటి ముఖములు గలవారై సర్వకాలములలో సాదరముగా శివపార్వతులను చేతులను జోడించి చూచుచున్నట్లు భావన చేయవలెను (28). ఈ విధముగా ఆవరణములను పూజించి మనస్సులోని అలజడి తగ్గుట కొరకై మరల దేవదేవుడగు శివుని పూజించి, ఓంకారము శివుని స్వరూపమేనని తెలియవలెను (29). ఈ విధముగా యథావిధిగా గంధము మొదలగు ఉపచారములతో పూజించి, సేవలను చేసి, తరువాత యథావిధిగా తయారుచేసిన నైవేద్యమును సమర్పించవలెను (30).

పునరాచమనీయం చ దద్యాదర్ఘ్యం యథా పురా | తతో నివేద్య పానీయం తాంబూలం చోపదేశతః || 31

నీరాజనాదికం కృత్వా పూజాశేషం సమాపయేత్‌ | ధ్యాత్వా దేవం చ దేవీశ్చ మనుమష్టోత్తరం జపేత్‌ || 32

తత ఉత్థాయ రచితపుష్పాంజలిపుటః స్థితః | జపేద్ధ్యాత్వా మహాదేవం యో దేవానామితి క్రమాత్‌ || 33

యో వేదాదౌ సర్వః ప్రోక్త ఇత్యేవం పరమేశ్వరి | పుష్పాంజలిం తతో దత్త్వా త్రిః ప్రదక్షిణమాచరేత్‌ || 34

సాష్టాంగం ప్రణమేత్తం చ భక్త్యా పరమయాన్వితః | పునః ప్రదక్షిణాం కృత్వా ప్రణమేత్పునరేకధా || 35

స్థిత్వాసనే సమభ్యర్చ్య దేవం నామాష్టకేన చ | సాధు వా%సాధు వా కర్మ యద్యదాచరితం మయా || 36

తత్సర్వం భగవన్‌ శంభో భవదారాధనం పరమ్‌ | ఇతి శంఖోదకేనైవ సపుష్పేణ సమర్పయేత్‌ || 37

పూజ్యం పునస్సమభ్యర్చ్య సార్ధం నామాష్టకం జపేత్‌ | తదేవ శృణు దేవేశి సంబ్రువే తవ భక్తితః || 38

ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం ఆవరణపూజావర్ణనం నామ అష్టమో%ధ్యాయః (8).

మరల ఆచమనీయమును, పూర్వమునందు వలెనే అర్ఘ్యమును ఈయవలెను. తరువాత నైవేద్యమునిడి నీటిని సమర్పించి శాస్త్రోపదేశానుసారముగా తాంబూలమును ఇచ్చి, నీరాజనము మొదలగు వాటిని సమర్పించి మిగిలిన పూజను పూర్తి చేయవలెను. తరువాత శివుని, దేవీమూర్తులను ధ్యానించి 108 సార్లు మంత్రమును జపించవలెను (31,32). తరువాత లేచి నిలబడి దోసిలియందు పుష్పములను పట్టుకొని, మహాదేవుని ధ్యానించి యో దేవానామ్‌ అను మంత్రముతో మొదలిడి, యో వేదాదౌ స్వరః ప్రోక్తః అను మంత్రము వరకు జపించవలెను. ఓ పరమేశ్వరీ! తరువాత పుష్పాంజలిని సమర్పించి మూడు సార్లు ప్రదక్షిణమును చేయవలెను (33, 34). సాధకుడు గొప్ప భక్తితో కూడిన వాడై ఆ శివునకు సాష్టాంగప్రణామమును చేయవలెను. మరల ప్రదక్షిణమును చేసి మరల ఇంకోసారి నమస్కారమును చేయవలెను (35). తరువాత ఆసనము నందు కూర్చుండి, ఆ దేవుని ఎనిమిది నామములతో చక్కగా పూజించి, 'ఓ భగవాన్‌ ! శంభో! నేను మంచి గాని చెడు గాని దేనిని చేసియుంటినో, ఆ సర్వము శ్రేష్ఠమగు నీ ఆరాధనయే' అని పలికి పుష్పములతో మరియు శంఖమునందలి జలముతో సమర్పించవలెను (36, 37). పూజ్యుడగు శివుని మరల చక్కగా పూజించి అర్ఘముతో సహా ఎనిమిది నామములను జపించవలెను. ఓ దేవదేవీ! ఆ వివరములను కూడ నేను నీకు చెప్పెదను. భక్తితో వినుము (38).

శ్రీ శివమహాపురాణమునందలి కైలాససంహితయందు ఆవరణపూజను వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).

Siva Maha Puranam-4    Chapters