Siva Maha Puranam-4
Chapters
అథ త్రయస్త్రింశో
మరుత్తుల చరితము
సూత ఉవాచ |
ఏష మన్వంతరే తాత సర్గస్స్వారోచిషే స్మృతః | వైవస్వతే తు మహతి వారుణ వితతే క్రతౌ || 1
జుహ్వానస్య బ్రహ్మణో వై ప్రజాసర్గ ఇహో చ్యతే | పూర్వం యానథ బ్రహ్మర్షీనుత్పన్నాన్ సప్త మానసాన్ || 2
పుత్రాన్ వై కల్పయామాస స్వయమేవ పితామహః | తేషాం విరోధో దేవానాం దానవానాం మహానృషే || 3
దితిర్వినష్టపుత్రా తు కశ్యపం సముపస్థితా | స కశ్యపః ప్రసన్నాత్మా సమ్యగారాధితస్తయా || 4
వరేణ చ్ఛందయామాస సా చ వవ్రే వరం తదా | పుత్రమింద్రవధార్థాయ సమర్థమమితౌ జసమ్ || 5
స తసై#్య చ వరం ప్రాదాత్ప్రార్థితం సుమహాతపాః | బ్రహ్మచర్యాదినియమం ప్రాహ చైవ శతం సమాః || 6
ధారయామాస గర్భం తు శుచిస్తా వరవర్ణినీ | బ్రహ్మచర్యాదినియమం దితిర్దధ్రే తథైవ వై || 7
తతస్త్వాధాయ దిత్యాం స గర్భం తం శంసితవ్రతః | జగామ కశ్యపస్తప్తుం తపస్సంహృష్టమానసః || 8
తస్యాశ్చైవాంతరం ప్రేప్సుస్సో%భవత్పాకశాసనః | ఊనవర్షే శ##తే చాస్యా దదర్శాంతరమేవ సః || 9
అకృత్వా పాదయోశ్శౌచం దితిరర్వాక్శిరాస్తదా | నిద్రామాహారయామాస భావినో% ర్థస్య గౌరవాత్ || 10
సూతుడు ఇట్లు పలికెను -
ఓ వత్సా! స్వారోచిషమన్వంతరమందలి సృష్టి ఈ విధముగా వర్ణించబడినది. ఇప్పుడు వైవస్వతమన్వంతరములో గొప్ప విస్తారమైన వారుణక్రతువునందు హోమమును చేయుచూ బ్రహ్మ చేసిన ప్రజాసృష్టి వర్ణించబడుచున్నది. మున్ముందుగా పుట్టిన ఏడ్గురు బ్రహ్మర్షులను బ్రహ్మగారు తన మానసపుత్రులుగా చేసుకొనెను. దేవతలకు దానవులకు జరిగిన మహాయుద్ధములో దితి తన పుత్రులను అందరినీ పోగొట్టుకొనెను. అపుడు ఆమె కశ్యపుని వద్దకు వెళ్లి చక్కగా సేవించగా, ఆయన ప్రసన్నమగు మనస్సు గలవాడై నచ్చిన వరమును కోరుకొమ్మని పలికెను. అపుడామె ఇంద్రుని వధించుట కొరకై మహా తేజశ్శాలి, సమర్థుడు అగు పుత్రుని ఇమ్మని కోరెను (1-5). మహాతపశ్శాలియగు కశ్యపుడు ఆమె కోరిన వరమును ఆమెకు ఇచ్చెను. వంద సంవత్సరములు బ్రహ్మచర్యము మొదలగు నియమములను పాటించుమని చెప్పెను (6). ఆ సుందరియగు దితి శుచియై గర్భమును ధరించి, బ్రహ్మచర్యము మొదలగు నియమములను ఆయన చెప్పిన విధముగానే పాటించుచుండెను (7). కొనియాడదగిన వ్రతనిష్ఠ గల కశ్యపుడు ఆమె గర్భమును ధరించిన తరువాత సంతోషముతో నిండిన మనస్సు గలవాడై తపస్సును చేయుటకై వెడలెను (8). ఆమె యొక్క దౌర్బల్యమును కనిపెట్టగోరి ఇంద్రుడు వేచియుండెను. వంద సంవత్సరముల నియమకాలములో ఒకే ఒక సంవత్సము మిగిలియుండగా ఆతనికి ఆమెలో దౌర్బల్యము దొరికెను (9). విధివిధానములో చాల పెద్ద ఘటన జరుగనున్నది. అందువలననే ఆ దితి పాదములను కడుగుకొనకుండగా తల క్రిందకు వ్రేలాడుచుండగా నిద్రించెను (10).
ఏతస్మిన్నంతరే శక్రస్తస్యాః కుక్షిం ప్రవిశ్య సః | వజ్రపాణిస్తు తం గర్భం సప్తధా హి న్యకృంతత || 11
స పాట్యమానో గర్భో%థ వజ్రేణ ప్రరురోద హ | రుదంతం సప్తధైకైకం మారోదీరితి తాన్ పునః |
చకర్త వజ్రపాణిస్తాన్నైవ మమ్రుస్తథాపి తే || 12
తే తమూచుః పాత్యమానాస్సర్వే ప్రాంజలయో మునే | నో జిఘాంససి కిం శక్ర భ్రాతరో మరుతస్తవ || 13
ఇంద్రేణ స్వీకృతాస్తే హి భ్రాతృత్వే సర్వ ఏవ చ | తత్యజుర్దైత్యభావం తే విప్రర్షే శంకరేచ్ఛయా || 14
మరుతో నామ తే దేవా బభూవుస్సుమహాబలాః | ఖగా ఏకోనపంచాశత్సహాయా వజ్రపాణినః || 15
తేషామేవ ప్రవృద్ధానాం హరిః ప్రాదాత్ ప్రజాపతిః | క్రమశస్తాని రాజ్యాని పృథుపూర్వం శృణుష్వ తత్ || 16
అరిష్టపురుషో వీరః కృష్ణో జిష్ణుః ప్రజాపతిః | పర్జన్యస్తు ఘనా ధ్యక్షస్తస్య సర్వమిదం జగత్ || 17
భూతసర్గమిమం సమ్యగవోచం తే మహామునే | విభాగం శృణు రాజ్యానాం క్రమశస్తం బ్రువే%ధునా || 18
అభిషిచ్యాధిరాజ్యే తు పృథుం వైన్యం పితామహః | తతః క్రమేణ రాజ్యాని వ్యాదేష్టుముపచక్రమే || 19
ద్విజానాం వీరుధాం చైవ నక్షత్రగ్రహయోస్తథా | యజ్ఞానాం తపసాం చైవ సోమం రాజ్యే%భ్యషేచయత్ || 20
ఇంతలో ఆ ఇంద్రుడు వజ్రమును చేత దాల్చి ఆమెయొక్క గర్భములో ప్రవేశించి ఆ గర్భమును ఏడు ముక్కలుగా భగ్నము చేసెను (11). అపుడు వజ్రముచే ఏడు ముక్కలుగా భగ్నము గావించబడిన ఆ గర్భము తీవ్రముగా రోదించెను. కాని వజ్రపాణియగు ఇంద్రుడు ఆ గర్భశకలములను 'ఏడవకుడు' అని పలుకుతూ, మరల ఒక్కొక్కదానిని ఏడు ముక్కలుగా పగులగొట్టెను. అయిననూ, ఆ శకలములు మరణించలేదు (12). ఓమునీ! ఆ విధముగా పగులగొట్ట బడుచున్న శకలములు అన్నియు చేతులను జోడించి ఇంద్రునితో, 'ఓ ఇంద్రా! మమ్ములను సంహరించ గోరుచున్నావా? మేము నీ సోదరులమగు మరుత్తులము' అని పలికెను (13). వారిని అందరినీ ఇంద్రుడు తన సోదరులుగా స్వీకరించెను. ఓ బ్రహ్మర్షీ! వారు శంకరుని ఇచ్ఛచే రాక్షసభావమును విడిచిపెట్టిరి (14). మహాబలశాలురగు ఆ బాలకులు మరుత్తులు అనే దేవతలు అయిరి. ఆ నలభై తొమ్మిది మంది ఆకాశమునందు సంచరిస్తూ వజ్రపాణియగు ఇంద్రునకు సహాయకులగుచున్నారు (15). వారు పెరిగి పెద్దవారైన తరువాత ప్రజలను పాలించే విష్ణువు పృథువుతో మొదలిడి క్రమముగా వారికి రాజ్యములను ఇచ్చెను. ఆ వివరములను వినుము (16). అరిష్టుడు పరాక్రమశాలియగు పురుషుడు. కృష్ణుడు విజేత మరియు ప్రజాపాలకుడు (?). పర్జన్యుడు మేఘాధిపతి. ఈ జగత్తు అంతయు ఆయనకు సంబంధించినదియే (17). ఓ మహర్షీ! నేను నీకు ప్రాణుల సృష్టిని చక్కగా చెప్పితిని. ఇప్పుడు రాజ్యముల క్రమవిభాగమును చెప్పుచున్నాను. వినుము (18). బ్రహ్మగారు వేనుని కుమారుడగు పృథువును చక్రవర్తి స్థానమునందు అభిషేకించి తరువాత క్రమముగా రాజ్యములను అప్పజెప్పుటకు ఆరంభించెను (19). బ్రాహ్మణులకు, ఓషధులకు, నక్షత్రములకు, గ్రహములకు, యజ్ఞములకు మరియు తపస్సులకు రాజుగా సోముని అభిషేకించెను (20).
అపాం తు వరుణం రాజ్యే రాజ్ఞాం వైశ్రవణం ప్రభుమ్ | ఆదిత్యానాం తథా విష్ణుం వసూనామథ పావకమ్ || 21
ప్రజాపతీనాం దక్షం తు మరుతామథ వాసవమ్ | దైత్యానాం దానవానాం చ ప్రహ్లాదమమితౌజసమ్ || 22
వైవస్వతం పితౄణాం చ యమం రాజ్యే%భిషేచయత్ | మాతౄణాం చ వ్రతానాం చ మంత్రాణాం చ తథా గవామ్ || 23
యక్షాణాం రాక్షసానాం చ పార్థివానాం తథైవ చ | సర్వభూతపిశాచానాం గిరిశం శూలపాణినమ్ || 24
శైలానాం హిమవంతం చ నదీనామథ సాగరమ్ | మృగాణామథ శార్దూలం గోవృషం తు గవామపి || 25
వనస్పతీనాం వృక్షాణాం వటం రాజ్యే%భిషేచయత్ | ఇతి దత్తం ప్రజేశేన రాజ్యం సర్వత్ర వై క్రమాత్ || 26
పూర్వస్యాం దిశి పుత్రం తు వైరాజస్య ప్రజాపతేః | స్థాపయామాస సర్వాత్మా రాజ్యే విశ్వపతిర్విభుః ||27
తథైవ మునిశార్దూల కర్దమస్య ప్రజాపతేః | దక్షిణస్యాం తథా పుత్రం సుధన్వానమచీక్లుపత్ || 28
పశ్చిమాయాం దిశి తథా రజసః పుత్రమచ్యుతమ్ | కేతుమంతం మహాత్మానం రాజానం వ్యాదిశత్ర్పభుః || 29
తథా హిరణ్యరోమాణం పర్జన్యస్య ప్రజాపతేః | ఉదీచ్యాం దిశి రాజానం దుర్ధర్షం సో%భ్యషేచయత్ || 30
తస్య విస్తరమాఖ్యాతం పృథోర్వైన్యస్య శౌనక | మహర్ధ్యేతదధిష్ఠానం పురాణం పరికీర్తితమ్ || 31
ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం మరుచ్చరిత్రవర్ణనం నామ త్రయస్త్రింశో%ధ్యాయః (33)
జలములకు వరుణుని, రాజులకు కుబేరప్రభువును, ఆదిత్యులకు విష్ణువును, వసువులకు అగ్నిని, ప్రజాపతులకు దక్షుని, మరుత్తులకు ఇంద్రుని, దైత్యులకు మరియు దానవులకు మహాతేజశ్శాలియగు ప్రహ్లాదుని, పితృదేవతలకు సూర్యపుత్రుడగు యముని, మాతృదేవతలకు వ్రతములకు మంత్రములకు గోవులకు యక్షులకు రాక్షసులకు రాజులకు సకలభూతపిశాచములకు శూలమును చేతబట్టి ఉండే కైలాసవాసియగు శివుని, పర్వతములకు హిమవంతుని, నదులకు సముద్రుని, మృగములకు పెద్దపులిని, గోవులకు ఎద్దును, చెట్టుచేమలకు మర్రిచెట్టును అధిపతిగా అభిషేకించెను. ఈ విధముగా ప్రజాపతి సర్వజగత్తులో క్రమముగా రాజ్యాధికారములను అప్పజెప్పెను (21-26). సర్వమునకు ఆత్మయైనవాడు, జగత్తునకు ప్రభువు, సర్వవ్యాపకుడు అగు పరమేష్ఠి తూర్పు దిక్కునందు వైరాజప్రజాపతియొక్క కుమారుని స్థాపించెను (27). ఓ మహర్షీ! అదే విధముగా కర్దమప్రజాపతియొక్క పుత్రుడగు సుధన్వుని దక్షిణదిక్కునందు అధిపతిగా నియమించెను (28). అదే విధముగా పరమేష్ఠి పశ్చిమదిక్కునందు రజసుని పుత్రుడు, మహాత్ముడు, వినాశము లేనివాడు అగు కేతుమంతుని రాజుగా అభిషేకించెను (29). అదే విధముగా ఆయన ఉత్తరదిక్కునందు పర్జన్యప్రజాపతియొక్క కుమారుడు, జయింప శక్యము కానివాడు అగు హిరణ్యరోముని రాజుగా అభిషేకించెను (30). ఓ శౌనకా! వేనుని పుత్రుడగు పృథువుయొక్క వృత్తాంతమును నీకు విస్తారముగా చెప్పితిని. అతి ప్రాచీనమైన, ఆ పృథువు యొక్క సామ్రాజ్యము అగు ఈ భూమి సమస్త సంపదలకు నిలయమని కీర్తించబడినది (31).
శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు మరుత్తుల చరితమును వర్ణించే ముప్పది మూడవ అధ్యాయము ముగిసినది (33).