Siva Maha Puranam-4    Chapters   

అథ దశమో%ధ్యాయః

సూతుని తీర్థయాత్ర

వ్యాస ఉవాచ |

గతే%థ సూతే మునయస్సువిస్మితా విచింత్య చాన్యోన్యమిదం తు విస్మృతమ్‌ |

యద్వామదేవస్య మతం మునీశ్వరః ప్రత్యూచి తం తత్ఖలు కష్టమద్య || 1

కదా ను భూయాన్‌ మునివర్యదర్శనం భవాబ్ధిదుఃఖౌఘహరం పరం హి తత్‌ |

మహేశ్వరారాధనపుణ్యతో%ధునా మునీశ్వరస్సత్వరమావిరస్తు న ః || 2

ఇతి చింతాసమావిష్టా మునయో మునిపుంగవమ్‌ | వ్యాసం సంపూజ్య హృత్పద్మే తస్థుస్తద్దర్శనోత్సుకాః || 3

సంవత్సరాంతే స పునః కాశీం ప్రాప మహామునిః | శివభక్తిరతో జ్ఞానీ పురాణార్థప్రకాశకః || 4

తం దృష్ట్వా సూతమాయాంతం మునయో హృష్టచేతసః | అభ్యుత్థానాసనార్ఘ్యాది పూజయా సమపూజయన్‌ || 5

సో%పి తాన్మునిశార్దులానభినంద్య స్మితోదరమ్‌ | ప్రీత్యా స్నాత్వా జాహ్నవీయే జలే పరమపావనే || 6

ఋషీన్‌ సంతర్ప్య చ సురాన్‌ పితౄంశ్చ తిలతండులైః | తీరమాగత్య సంప్రోక్ష్య వాససీ పరిధాయ చ || 7

ద్విరాచమ్య సమాదాయ భస్మ సద్యాదిమంత్రతః | ఉద్ధూలనాదిక్రమతో విధార్యాథ మునీశ్వరః || 8

రుద్రాక్షమాలాభరణః కృతనిత్యక్రియస్సుధీః | యథోక్తాంగేషు విధినా త్రిపుండ్రం రచతి స్మ హ || 9

విశ్వేశ్వరముమాకాంతం ససుతం సగణాధిపమ్‌ | పూజయామాస సద్భక్త్యా హ్యస్తౌన్నత్వా ముహుర్ముహుః || 10

వ్యాసుడు ఇట్లు పలికెను -

అపుడు సూతుడు వెళ్లిన తరువాత మిక్కిలి విస్మయమును పొందియున్న మునులు ఆలోచించి ఒకరితో నొకరు ఇట్లు పలికిరి: సూతమహర్షి వామదేవుని ఉపదేశమును గురించి సూచించినాడు. మనము ఆ సంగతిని మరచితిమి. అయ్యో! ఇప్పుడు మనకు కష్టము వచ్చినది (1). మరల ఆ మహర్షియొక్క దర్శనము ఎప్పుడు కలుగునో! శ్రేష్టమగు ఆయన దర్శనము సంసారమనే సముద్రములోని దుఃఖముల సముదాయమును పోగొట్టును. మనము ఇప్పుడు మహేశ్వరుని ఆరాధించి యుంటిమి. ఆ పుణ్యప్రభావముచే ఆ మహర్షి ఇచటకు తొందరలో వచ్చును గాక! (2) ఈఅ విధమగు చింతతో కూడియున్న ఆ మునులు వ్యాసమహర్షిని తమ హృదయపద్మములో పూజించి సూతుని దర్శించవలెననే ఉత్కంఠతో నుండిరి (3). సంవత్సరము తరువాత శివభక్తియందు నిష్ఠ గలవాడు, జ్ఞాని మరయు పురాణముల తాత్పర్యమును ప్రకాశింప జేసినవాడు అగు ఆ మహర్షి మరల కాశీకి విచ్చేసెను (4). సూతుడు వచ్చుచుండగా గాంచిన మునులు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై ఆయనకు ఎదురేగి ఆసనము, అర్ఘ్యము మొదలగు వాటిని సమర్పించి శ్రద్ధగా పూజించిరి (5). ఆ సూతుడు కూడ చిరునవ్వుతో ఆ మహర్షులను అభినందించి పరమపవిత్రమగు గంగాజలములలో ప్రీతితో స్నానమును చేసి (6), నువ్వులతో మరియు బియ్యముతో ఋషి-దేవ-పితృతర్పణములను చేసి ఒడ్డు మీదకు వచ్చి బట్టలపై నీటిని చల్లి వాటిని ధరించెను (7). ఆ మహర్షి రెండుసార్లు ఆచమనమును చేసి భస్మను తీసుకొని సద్యోజాతాది మంత్రములతో యథావిధిగా దానిని శరీరమునకు పూసుకొనెను (8). గొప్ప విద్వాంసుడగు ఆ సూతుడు రుద్రాక్షమాలయే ఆభరణముగా గలవాడై నిత్యకర్మలను పూర్తి చేసుకొని అవయవములయందు యథావిధిగా త్రిపుండ్రమును ధరించెను (9). ఆయన కుమారులతో మరియు గణాధ్యక్షులతో కూడియున్న పార్వతీపతియగు విశ్వేశ్వరుని చక్కని భక్తితో పూజించి పలుమార్లు ప్రణమిల్లి స్తుతించెను (10).

కాలభైరవనాథం చ సంపూజ్యాథ విధానతః | ప్రదక్షిణీకృత్య పునస్త్రే ధా నత్వా చ పంచధా || 11

పునః ప్రదక్షిణీకృత్య ప్రణమ్య భువి దండవత్‌ | తుష్టావ పరయా స్తుత్యా సంస్మరంస్తత్పదాంబుజమ్‌ || 12

శ్రీమత్పంచాక్షరీం విద్యామష్టోత్తరసహస్రకమ్‌ | సంజప్య పురతః స్థిత్వా క్షమాపయ్య మహేశ్వరమ్‌ || 13

చండేశం సంప్రపూజ్యథ ముక్తిమండపమధ్యతః | నిర్దిష్టమాసనం భేజే మునిభిర్వేదపారగైః || 14

ఏవం స్థితేషు సర్వేషు నమస్కృత్య సమంత్రకమ్‌ | అథ ప్రాహ మునీంద్రాణాం భావవృద్ధికరం వచః || 15

తరువాత యథావిధిగా కాలభైరవనాథుని పూజించి, మరల మూడుసార్లు ప్రదక్షిణమును చేసి, అయిదు సార్లు ప్రణమిల్లి (11). మరల ప్రదక్షిణమును చేసి సాష్టాంగనమస్కారమును చేసి ఆ శివుని పాదపద్మములను స్మరిస్తూ గొప్ప స్తోత్రముతో స్తుతించెను (12). మహేశ్వరుని యెదుట నిలబడి శ్రీమత్పంచాక్షరీమంత్రమును 1008 సార్లు జపించి ఆయనకు క్షమాపణలను చెప్పి (13). తరువాత చండీశ్వరుని పూజించి ముక్తిమండపమునకు మధ్యలో తనకు నిర్దిష్టమైన ఆసనమునందు కూర్చుండెను. వేదవేత్తలగు మునులు ఆయన చుట్టూ కూర్చుండిరి (14). ఈ విధముగా అందరు సమావేశము కాగా , ఆయన మంత్రపూర్వకముగా నమస్కరించి ఆ మహర్షుల భక్తిని పెంపొందించే వచనమును పలికెను (15).

సూత ఉవాచ |

థన్యా యూయం మహాప్రాజ్ఞా మునయశ్శంసితవ్రతాః | భవదర్థమిహ ప్రాప్తో%హం తద్వృత్తమిదం శృణు || 16

యదా%హముపదిశ్యాథ భవతః ప్రణవార్థకమ్‌ | గతస్తీ ర్థాటనార్థాయ తద్వృత్తాంతం బ్రవీమి వః || 17

ఇతో నిర్గత్య సంప్రాప్య తీరం దక్షపయోనిధేః | స్నాత్వా సంపూజ్య విధవదేవీం కన్యామయీం శివామ్‌ |

పునరాగత్య విప్రేం ద్రాస్సువర్ణముఖరీతటమ్‌ || 18

శ్రీకాలహస్తిశైలాఖ్యనగరే పరమాద్భుతే | సువర్ణముఖరీతోయే స్నాత్వా దేవానృషీనపి || 19

సంతర్ప్య విధివద్భక్త్యా సముద్రం గిరిశం స్మరన్‌ | సమర్చ్యకాలహస్తీశం చంద్రకాంతసమప్రభమ్‌ || 20

పశ్చిమాభిముఖం పంచశిరసం పరమాద్భుతమ్‌ | సకృద్దర్శనమాత్రేణ సర్వాఘక్షయకారణమ్‌ || 21

సర్వసిద్ధిప్రదం భుక్తిముక్తిదం త్రిగుణశ్వరమ్‌ | తతశ్చపరయా భక్త్యా తస్య దక్షిణగాం శివామ్‌ || 22

జ్ఞానప్రసూనకలికాం సమర్చ్య హి జగత్ప్ర సూమ్‌ | శ్రీమత్పంచాక్షరీం విద్యామష్టోత్తరసహస్రకమ్‌ || 23

జప్త్వా ప్రదక్షిణీకృత్య స్తుత్వా నత్వా ముహుర్ముహుః || 24

తతః ప్రదక్షిణీకృత్య గిరిం ప్రత్యహమాదరాత్‌ | ఆమోదతీవ మనసి ప్రత్యహం నియమస్థితః || 25

సూతుడు ఇట్లు పలికెను -

గొప్ప బుద్ధిశాలురు, కొనియాడబడే వ్రతనిష్ఠ గలవారు, మహర్షులు అగు మీరు ధన్యులు. నేను మీ కొరకై ఇచటకు వచ్చియుంటిని. ఆ వృత్తాంతమును వినుడు (16). నేను మీకు ఓంకారముయొక్క అర్థమును ఉపదేశించి తీర్థాటన కొరకై వెళ్లియుంటిని గదా! అప్పుడు జరిగిన వృత్తాంతమును మీకు చెప్పెదను (17). ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! నేను ఇక్కడనుండి బయలు దేవి దక్షిణసముద్రతీరమును చేరి, స్నానమును చేసి కన్యాకుమారి రూపములో నున్న పార్వతిని యథావిధిగా పూజించి మరల బయలుదేరి సువర్ణముఖీనదీతీరమును చేరి (18). మహాద్భుతమగు శ్రీకాళహస్తినగరములో సువర్ణముఖీనదిలో స్నానమును చేసి దేవ-ఋషితర్పణములను యథావిధిగా చేసి, భక్తితో ముద్రలను ప్రదర్శించి కైలాసవాసియగు శివుని స్మరిస్తూ, చంద్రుని వెన్నెలవంటి శోభ గలవాడు, పశ్చిమముఖముగా నున్నవాడు, అయిదు శిరస్సులతో గొప్ప ఆశ్చర్యమును గొల్పువాడు, ఒక్కసారి దర్శించినంత మాత్రముచే సకలపాపములను పోగొట్టువాడు, సకలసిద్ధులను ఇచ్చువాడు, భుక్తిని ముక్తిని ఇచ్చువాడు, మూడు గుణముల ప్రకృతిపై ఆధిపత్యము గలవాడు అగు కాళహస్తీశ్వరుని చక్కగా పూజించి, తరువాత పరమభక్తితో ఆయనకు కుడివైపున ఉన్న, జ్ఞానమనే పుష్పముయొక్క మొగ్గవంటిది, జగన్మాత (జ్ఞానప్రసూనాంబిక) అగు పార్వతిని పూజించి శ్రీమత్సంచాక్షరీమంత్రమును 1008 సార్లు జపించి ప్రదక్షిణమును చేసి స్తుతించి పలుమార్లు నమస్కరించి (19, 24), తరువాత ప్రతిదినము శ్రద్ధతో ఆ పర్వతమును ప్రదక్షిణము చేస్తూ ప్రతిదినము నియమములు పాటిస్తూ మనస్సులో గొప్ప ఆనందమును పొందితిని (25).

ఆనయం చతురో మాసానేవం తత్ర మునీశ్వరాః | జ్జానప్రసూనకలికామహాదేవ్యాః ప్రసాదతః || 26

ఏకదా తు సమాస్తీర్య చైలాజినకుశోత్తరమ్‌ | ఆసనం పరమం తస్మిన్‌ స్థిత్వా రుద్ధేంద్రియో మునిః || 27

సమాధిమాస్థాయ సదా పరమానందచిద్ఘనః | పరిపూర్ణశ్శివో%స్మీతి నిర్వ్యగ్రహృదయో%భవమ్‌ || 28

ఏతస్మిన్నేవ సమయే మద్గురుఃకరుణానిధిః | నీలజీమూతసంకాశో విద్యుత్పింగజటాధరః || 29

ప్రాంశుః కమండలూద్దండకృష్ణాజినధరస్స్వయమ్‌ | భస్మావదాతసర్వాంగస్సర్వలక్షణలక్షితః || 30

త్రిపుండ్రవిలసద్భాలో రుద్రాక్షాలంకృతాకృతిః | పద్మపత్రారుణాయామవిస్తీర్ణనయనద్వయః || 31

ప్రాదుర్భూయ హృదంభోజే తదానీమేవ సత్వరమ్‌ | విమోహితస్తదైవాసమేతదద్భుతమాస్తికాః || 32

తత ఉన్మీల్య నయనే విలాపం కృతవానహమ్‌ | ఆసీన్మమాశ్రుపాతశ్చ గిరనిర్ఘ రసన్నిభః || 33

ఏతస్మిన్నేవ సమయే శ్రుతా వాగశరీరిణీ | వ్యోమ్నో మహాద్భుతా విప్రాస్తమేవ శృణుతాదరాత్‌ || 34

ఓ మహర్షులారా! నేను జ్ఞానప్రసూనాంబికా మహాదేవియొక్క అనుగ్రహముచే ఈ విధముగా అచట నాలుగు మాసములు గడిపితిని (26). ఒకవాడు వస్త్రము, మృగచర్మ మరియు దర్భలతో ఒకదానిపై ఒకటి వేసి తయారుచేసిన గొప్ప ఆసనమును పరచి దానిపై కూర్చుండి ఇంద్రియములను ఉపసంహరించి మననము చేసి (27), సమాధిని పొంది, 'సర్వకాలములలో పరమానందచైతన్యస్వరూపుడు మరియు పరిపూర్ణుడు అగు శివుడను నేనే' అని దర్శిస్తూ అలజడి లేని హృదయము గలవాడనై యుంటిని (28). ఇదే సమయంలో దయాసముద్రుడు, నల్లని మేఘము వలె ప్రకాశించువాడు, మెరుపు వలె పచ్చనైన జటలను ధరించినవాడు, పొడవైన వాడు, కమండలము దండము కృష్ణాజినము అనువాటిని స్వయముగా పట్టుకొని యున్నవాడు, భస్మముచే పూయబడిన సకలావయవమలు గలవాడు, సకలసల్లక్షణములతో నొప్పారువాడు, త్రిపుండ్రముతో ప్రకాశించు ఫాలభాగము గలవాడు, రుద్రాక్షలతో విరాజిల్లే ఆకారము గలవాడు, పద్మపు రేకుల వలె ఎర్రనైన రెండు నిడివి కన్నులు గలవాడు అగు నా గురువు (29-31). నా హృదయపద్మములో ఆవిర్భవించెను. ఓ శ్రద్ధాళువులారా! ఇది ఆశ్చర్యము! అదే క్షణములో నేను వెంటనే స్పృహను గోల్పోతిని (32). తరువాత నేను కళ్లను తెరిచి దుఃఖించితిని. నా కన్నుల వెంబడి కొండ కాలువ వలె నీరు స్రవించినది (33). ఓ బ్రాహ్మణులారా! అదే సమయములో ఆకాశమునుండి మహాద్భుతమగు ఆకాశవాణి వినబడినది. ఆ వివరములను ఆదరముతో వినుడు (34).

సూతపుత్ర మహాభాగ గచ్ఛ వారాణసీం పురీమ్‌ | తత్రాసన్మునయః పూర్వముపదిష్టాస్త్వయా%ధునా || 35

త్వదుపాగమకల్యాణం కాంక్షంతే వివశా భృశమ్‌ | తిష్టంతితే నిరాహారా ఇత్యుక్త్వా విరరామ సా || 36

తత ఉత్థాయ తరసా దేవం దేవీం చ భక్తితః | ప్రదక్షిణీకృత్య పునః ప్రణమ్య భువి దండవత్‌ || 37

ద్విషడ్వారం గురోరాజ్ఞాం విజ్ఞాయ శివయోరథ | క్షేత్రాన్నిర్గత్య తరసా చత్వారింశద్దినాంతరే || 38

ఆగతో%స్మి మునిశ్రేష్ఠా అనుగృహ్ణంతు మామిహ | మయా కిమద్య వక్తవ్యం భవంతస్తద్బ్రు వంతు మే || 39

ఇతి సూతవచః శ్రుత్వా ఋషయో హృష్టమానసాః | అవోచన్మునిశార్దూలం వ్యాసం నత్వా ముహుర్ముహుః || 40

ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం సూతయాత్రావర్ణనం నామ దశమో%ధ్యాయః (10).

ఓ సూతపుత్రా! మహాత్మా! వారాణసీనగరమునకు వెళ్లుము. పూర్వము నీవు ఉపదేశమును చేసిన మునులు ఇప్పుడు అచ్చటనే యున్నారు (35). వారు నీ రాక అనే మంగళమును కోరుతూ మిక్కిలి వివశులై ఆహారమును విడిచిపెట్టి యున్నారు. ఇట్లు పలికి ఆ ఆకాశవాణి విరమించెను (36). తరువాత నేను వెంటనే లేచి పార్వతీపరమేశ్వరులకు భక్తితో ప్రదక్షిణమును చేసి మరల పన్నెండు సార్లు సాష్టాంగనమస్కారమును చేసి, ఆ వచనము గురువుయొక్క మరియు పార్వతీపరమేశ్వరుల ఆజ్ఞయేయని గ్రహించి వెంటనే ఆ క్షేత్రమునుండి బయలుదేరి నలుబది దినముల లోపులో (37, 38) వచ్చియుంటిని. ఓ ఋషులారా! మీరు ఇప్పుడు నన్ను అనుగ్రహించెదరు గాక! నేను ఇప్పుడు మీకు ఏమి చెప్పవలెను? నాకా విషయమును చెప్పుడు (39). సూతుని ఈ మాటను విని ఋషులు ఆనందముతో నిండిన మనస్సులు గలవారై వ్యాసునకు పలువార్లు నమస్కరించి ఆ మహర్షితో నిట్లనిరి (40).

శ్రీ శివమహాపురాణములో కైలాససంహితయందు సూతుని తీర్థయాత్రను వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10).

Siva Maha Puranam-4    Chapters