Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

వామదేవ మహర్షి కుమారస్వామిని ప్రార్థించుట

ఋషయ ఊచుః |

సూత సూత మహాభాగ త్వమస్మద్గురురుత్తమః | అతస్త్యాం పరిపృచ్ఛామో భవతో%నుగ్రహో యది || 1

శ్రద్ధాలుషు చ శిష్యేషు త్వాదృశా గురువస్సదా | స్నిగ్ధభావా ఇతీదం నో దర్శితం భవతా%ధునా || 2

విరజాహోమసమయే వామదేవమతం పురా | సూచితం భవతా%స్మాభిర్న శ్రుతం విస్తరాన్మునే || 3

తదిదానీం శ్రోతుకామాః శ్రద్ధయా పరమాదరాత్‌ | వయం సర్వే కృపాసింధో ప్రీత్యా తద్వక్తుమర్హసి || 4

ఇతి తేషాం వచః శ్రుత్వా సూతోహృష్టతనూరుహః | నమస్కృత్య మహాదేవం గురోః పరతరం గురుమ్‌ || 5

మహాదేవీం త్రిజననీం గురుం వ్యాసం చ భక్తితః | ప్రాహ గంభీరయా వాచా మునీనాహ్లాదయన్నిదమ్‌ || 6

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ సూతా ! సూతా! మహాత్మా! నీవు మాకు ఉత్తమమగు గురుడవు. కావుననే, నీ అనుగ్రహము ఉన్నచో, నిన్ను ప్రశ్నించెదము (1). నీ వంటి గురువులు శ్రద్ధావంతులగు శిష్యుల విషయములో సర్వకాలములలో ప్రేమభావమును కలిగియుందురని నీవు ఇప్పుడు మాకు నిరూపించితివి (2). పూర్వము విరజాహోమసమయములో నీవు వామదేవమతమును సూచించితివి. ఓ మునీ! మేము దానిని విస్తరముగా వినలేదు (3). మేము అందరము ఇపుడు దానిని పరమాదరముతో శ్రద్ధతో వినగోరుచున్నాము. ఓ దయానిధీ| నీవు దానిని ప్రీతితో చెప్పదగుదువు (4). వారి ఈ మాటలను విని సూతుడు ఆనందముతో గగుర్పాటు గలవాడై గురువులకు అందరికీ గురువైన మహాదేవుని, ముల్లోకములకు తల్లియగు మహాదేవిని, గురువగు వ్యాసుని భక్తితో నమస్కరించి, మునులకు ఆహ్లాదమును కలిగిస్తూ గంభీరమగు వాక్కుతో నిట్లు పలికెను (5,6).

సూత ఉవాచ |

స్వస్త్యస్తు మునయస్సర్వే సుఖినస్సంతు సర్వదా | శివభక్తాః స్థిరాత్మానశ్శివభక్తిప్రవర్తకాః || 7

తదతీవ విచిత్రం హి శ్రుతం గురుముఖాంబుజాత్‌ | ఇతః పూర్వం మయా నోక్తం గుహ్యప్రాకట్యశంకయా || 8

యూయం ఖలు మహాభాగాశ్శివభక్తా దృఢవ్రతాః | ఇతి నిశ్చిత్య యుష్మాకం వక్ష్యామి శ్రూయతాం ముదా || 9

పురా రథంతరే కల్పే వామదేవో మహామునిః | గర్భయుక్తశ్శివజ్ఞానవిదాం గురుతమస్స్వయమ్‌ || 10

వేదాగమపురాణాదిసర్వశాస్త్రార్థతత్త్వవిత్‌ | దేవాసురమనుష్యాదిజీవానాం జన్మకర్మవిత్‌ || 11

భస్మావదాతసర్వాంగో జటామండలమండితః | నిరాశ్రమో నిస్స్పృహశ్చ నిర్ద్వంద్వో నిరహంకృతిః || 12

దిగంబరో మహాజ్ఞానీ మహేశ్వర ఇవాపరః | శిష్యభూతైర్మునీంద్రైశ్చ తాదృశైః పరివారితః || 13

పర్యటన్‌ పృథివీమేతాం స్వపాదస్పర్శపుణ్యతః | పవిత్రయన్‌ పరే ధామ్ని నిమగ్నహృదయో%న్వహమ్‌ || 14

కుమారశిఖరం మేరోర్దక్షిణం ప్రావిశన్ముదా | యత్రాస్తే భగవానీశతనయశ్శిఖివాహనః || 15

జ్ఞానశక్తిధరో వీరస్సర్వాసురవిమర్దనః | గజవల్లీసమాయుక్తస్సర్వైర్దేవైర్నమస్కృతః || 16

సూతుడు ఇట్లు పలికెను -

ఓ మునులారా! మీకు మంగళమగుగాక! శివభక్తులు, స్థిరచిత్తులు, శివభక్తిని ప్రవర్తిల్లజేయువారు అగు మీరందరు సర్వదా సుఖముగా నుండెదరు గాక! (7) అది చాల విచిత్రమైన గాథ. దానిని నేను గురువుయొక్క ముకపద్మమునుండి వినియుంటిని. రహస్యమును ప్రకటించుటయందు గల సంశయముచే నేను ఇంతకు ముందు దానిని చెప్పలేదు (8). మీరు శివభక్తులు, దృఢమగు వ్రతము గలవారు అగు మహాత్ములని నిశ్చయించి, మీకు చెప్పెదను. ఆనందముతో వినుడు (9). పూర్వము రథంతర కల్పములో వామదేవ మహర్షి తల్లి గర్భమునందుండగనే, స్వయముగా శవజ్ఞానమునెరంగిన వారిలో శ్రేష్ఠుడగు గురువుగా నుండెడి వాడు (10). వేదములు ఆగమములు పురాణములు మొదలగు సకలశాస్త్రముల సారమగు అర్థమునెరింగినవాడు, దేవతలు రాక్షసులు మానవులు మొదలగు జీవుల జన్మలన మరియు కర్మలను ఎరింగినవాడు (11). సకలావయవములయందు భస్మను ధరించినవాడు, జటామండలమే అలంకారముగా గలవాడు, ఆశ్రమములకు అతీతుడు కామనలు లేనివాడు, సుఖదుఃఖాది ద్వంద్వములు లేనివాడు, అహంకారము లేనివాడు (12). దిగంబరుడు, మహాజ్ఞాని, రెండవ మహేశ్వరుడా యన్నట్లు ఉన్నవాడు, శిష్యులుగా మారియున్న అటువంటి మహర్షులచే చుట్టువారబడి యున్నవాడు అగు ఆ వామదేవుడు (13) ఈ భూమండలమును సర్యటించుచూ, తన పాదస్పర్శయొక్క పుణ్యముచే భూమిని పవిత్రము చేయుచూ, నిత్యము పరంబ్రహ్మయందు నిమగ్నమై యున్న హృదయము గలవాడై (14). మేరువునకు దక్షిణమునందున్న కుమారశిఖరమును ఆనందముతో ప్రవేశించెను (15). శివుని పుత్రుడు, నెమలి వాహనముగా గలవాడు, జ్ఞానశక్తిని ధరించినవాడు, వీరుడు, రాక్షసులనందరినీ సంహరించినవాడు, సర్వదేవతలచే నమస్కరింపబడువాడు అగు భగవాన్‌ కుమారస్వామి గజవల్లితో కూడి అచటనే నివసించును (16).

తత్ర స్కందసరో నామ సరస్సాగరసన్నిభమ్‌ | శిశిరస్వాదుపానీయం స్వచ్ఛాగాధబహూదకమ్‌ || 17

సర్వాశ్చర్యగుణోపేతం విద్యతే స్వామిసన్నిధౌ | తత్ర స్నాత్వా వామదేవస్సమా శిషై#్యర్మహామునిః || 18

కుమారం శిఖరాసీనం మునిబృందనిషేవితమ్‌ | ఉద్యదాదిత్యసంకాశం మయూరవరవాహనమ్‌ || 19

చతుర్భుజముదారాంగం మకుటాదివిభూషితమ్‌ | శక్తి రత్నద్వయోపాస్యం శక్తికుక్కుటధారిణమ్‌ || 20

వరదాభయహస్తం చ దృష్ట్వా స్కందం మునీశ్వరః | సంపూజ్య పరయా భక్త్యా స్తోతుం సముపచక్రమే || 21

అచట కుమారస్వామి నివాసమునకు సమీపములో సముద్రముతో పోల్చదగినది, చల్లని తియ్యని స్వచ్ఛమైన లోతైన అధికమైన నీరు గలది, అనేకములైన ఆశ్చర్యమును కలిగించే లక్షణములు కలది అగు స్కందసరస్సు అనే సరస్సు గలదు. వామదేవమహర్షి శిష్యులతో గూడి దానియందు స్నానము చేసి (17, 18), యువకుడు, మేరుశిఖరమునందుకూర్చున్నవాడు, మహర్షుల బృందములచే సేవించబడుచున్నవాడు, ఉదయించే సూర్యుని పోలిన కాంతి గలవాడు, గొప్ప నెమలి వాహనముగా గలవాడు (19), నాలుగు చేతులు గలవాడు, పెద్ద అవయవములు గలవాడు, కిరీటము మొదలగు వాటిచే అలంకరింపబడినవాడు, రెండు గొప్ప శక్తులచే సేవింపబడువాడు, శక్తిని కుక్కుటమును ధరించినవాడు (20), చేతులయందు వరద-అభయ ముద్రలను దాల్చినవాడు అగు కుమారస్వామిని చూచి, ఆ మహర్షి ఆయనను పరమభక్తితో కొలిచి స్తుతించుటకు ఉపక్రమించెను (21).

వామదేవ ఉవాచ |

ఓం నమః ప్రణవార్థాయ ప్రణవార్థవిధాయినే | ప్రణవాక్షరబీజీయ ప్రణవాయ నమో నమః || 22

వేదాంతార్థస్వరూపాయ వేదాంతార్థవిధాయినే | వేదాంతార్థవిదే నిత్యం విదితాయ నమో నమః || 23

నమో గుహాయ భూతానాం గుహాసు నిహితాయ చ | గుహ్యాయ గుహ్యరూపాయ గుహ్యాగమవిదే నమః || 24

అణోరణీయసే తుభ్యం మహాతో%పి మహీయసే |నమః పరావరజ్ఞాయ పరమాత్మస్వరూపిణ || 25

స్కందాయ స్కందరూపాయ మిహిరారుణతేజసే | నమో మందారమాలోద్యన్ముకుటాదిభృతే సదా || 26

శివశిష్యాయ పుత్రాయ శివస్య శివదాయినే | శివప్రియాయ శివయోరానందనిధయే నమః || 27

గాంగేయాయ నమస్తుభ్యం కార్తికేయాయ ధీమతే | ఉమాపుత్రాయ మహతే శరకాననశాయినే || 28

షడక్షరశరీరాయ షడ్విధార్థవిథాయినే | షడధ్వాతీతరూపాయ షణ్ముఖాయ నమో నమః || 29

ద్వాదశాయతనేత్రాయ ద్వాదశోద్యతబాహవే | ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్నమో%స్తుతే || 30

చతుర్భుజాయ శాంతాయ శక్తికుక్కుటధారిణ | వరదాయ విహస్తాయ నమో% సురవిదారిణ || 31

గజవల్లీకుచాలిప్తకుంకుమాంకితవక్షసే | నమో గజాననానందమహిమానొందితాత్మనే || 32

వామదేవుడు ఇట్లు పలికెను -

ఓం. ఓంకారముయొక్క అర్థము అయినవాడు, ఓంకారముయొక్క అర్థమును బోధించువాడు, ఓంకారములోని బీజాక్షరస్వరూపుడు, ఓంకారస్వరూపుడు అగు స్కందునకు అనేక నమస్కారములు (22), వేదాంతముచే తాత్పర్యభూతముగా ప్రతిపాదింపబడే స్వరూపము గల వాడు, వేదాంతతాత్పర్యమును బోధించువాడు, వేదాంతతాత్పర్యమును తెలిసినవాడు, నిత్యము మహాత్ములచే తెలియబడువాడు అగు స్కందునకు అనేకనమస్కారములు (23). ప్రాణుల బుద్ధియందు చైతన్యరూపముగా విలసిల్లువాడు, సర్వులచే తెలియబడని వాడు, రహస్యమగు స్వరూపము గలవాడు, రహస్యమగు శాస్త్రములనెరింగనవాడు అగు గుహునకు నమస్కారము (24). అతిసూక్ష్మమైన దానికంటె సూక్ష్మమైనవాడు, మిక్కిలి పెద్ద దారికంటె పెద్దవాడు, కార్యకారణములనెరింగినవాడు,పరమాత్మస్వరూపుడు అగు నీకు నమస్కారము (25). సూర్యుని వలె ఎర్రని కాంతి గలవాడు, సర్వదా మందారమాలతో ప్రకాశించే కిరీటము మొదలగు వాటిని ధిరించినవాడు అగు స్కందుని రూపములోనున్న శివునకు నమస్కారము (26). శివునకు శిష్యుడు, శివుని పుత్రుడు, మంగళములనిచ్చువాడు, శివునకు ప్రియమైనవాడు, పార్వతీపరమేశ్వరులకు ఆనందనిధానమైనవాడు అగు కుమారస్వామికి నమస్కారము (27). గంగాపుత్రుడు, కృత్తికల పుత్రుడు, బుద్ధిశాలి, పార్వతీపుత్రుడు, గొప్పవాడు, రెల్లు గడ్డియందు జన్మించినవాడు అగు నీకు నమస్కారము (28). ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము (29). ద్వాదశాదిత్యుల రూపములో వెలుగొందు వాడా! పన్నెండు నిడివి కన్నులు గలవాడు, పైకి ఎత్తి పెట్టిన పన్నెండు బాహువులలో పన్నెండు ఆయుధములను దాల్చిన వాడు అగు నీకు నమస్కారము అగుగాక! (30). నాలుగు భుజములు గలవాడు, శాంతస్వరూపుడు, రాక్షసులను సంహరించినవాడు అగు కుమారస్వామికి నమస్కారము (31). గజవల్లియొక్క కుచములయందలి కుంకుమచే ఎర్రనైన వక్షఃస్థలము గలవాడు, విఘ్నేశ్వరుని మహిమలను మరియు ఆనందమును చూచి ఉప్పొంగే మనస్సు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము (32).

బ్రహ్మాదిదేవమునికిన్నరగీయమానగాథావిశేషశుచిచింతితకీర్తిధామ్నే |

బృందారకామలకిరీటవిభూషణస్రక్పూజ్యాభిరామపదపంకజ తే నమో%స్తు || 33

ఇతి స్కందస్తవం దివ్యం వామదేవేన భాషితమ్‌ | యః పఠేచ్ఛృణుయాద్వాపి స యాతి పరమాం గతిమ్‌ || 34

మహాప్రజ్ఞాకరం హ్యేతచ్ఛివభక్తివివర్ధనమ్‌ | ఆయురారోగ్యధనకృత్సర్వకామప్రదం సదా || 35

ఇతి స్తుత్వా వామదేవో దేవం సేనాపతిం ప్రభుమ్‌ | ప్రదక్షిణాత్రయం కృత్వా ప్రణమ్య భువి దండవత్‌ || 36

సాష్టాంగం చ పునః కృత్వా ప్రదక్షిణనమస్కృతమ్‌ | అభవత్పార్శ్వతస్తస్య వినయావనతో ద్విజః || 37

వామదేవకృతం స్తోత్రం పరమార్థవిజృంభితమ్‌ | శ్రుత్వా%భవత్ప్ర సన్నో హి మహేశ్వరసుతః ప్రభుః || 38

తమువాచ మహాసేనః ప్రీతో%స్మి తవ పూజయా | భక్త్యా స్తుత్యా చభద్రం తే కిమద్య కరవాణ్యహమ్‌ || 39

మునే త్వం యోగినాం ముఖ్యః పరిపూర్ణశ్చ నిస్స్పృహః | భవదృశాం హి లోకే%స్మిన్‌ ప్రార్థనీయం న విద్యతే || 40

తథాపి ధర్మరక్షాయై లోకానుగ్రహకాంక్షయా | త్వాదృశాస్సాధవస్సంతో విచరంతి మహీతలే || 41

శ్రోతవ్యమస్తి చేద్బ్ర హ్మన్‌ వక్తుమర్హసి సాంప్రతమ్‌ | తదిదానీమహం వక్ష్యే లోకానుగ్రహహేతవే || 42

ఇతి స్కందవచః శ్రుత్వా వామదేవో మహామునిః | ప్రశ్రయావనతః ప్రాహ మేఘగంభీరయా గిరా || 43

బ్రహ్మమొదలగు దేవతలు మునులు కిన్నరులు అను వారిచే గానము చేయబడే గాథలయందు విశేషముగా కీర్తింపబడిన పవిత్రత మరియు కీర్తి అను వాటికి నివాసస్థానమైన వాడవు, దేవతల స్వచ్ఛమైన కిరీటములయందలి అలంకారమాలలచే పూజింపబడే సుందరమైన పద్మములవంటి పాదములు గలవాడవు అగు నీకు నమస్కారమగు గాక! (33) వామదేవునిచే పఠింపబడిన ఈ దివ్యమైన స్కందస్తుతిని ఎవడైతే పఠించునో, లేదా వినునో వాడు ఉత్తమగతిని పొందును (34). ఈ స్తోత్రము గొప్ప బుద్ధి ఒసంగును; శివునియందు భక్తిని వర్ధిల్లజేయును; ఆయుర్దాయమును, ఆరోగ్యమును మరియు ధనమును కలుగజేయును; సర్వకాలములలోకోరికలనన్నింటినీ ఈడేర్చును (35). ఓ బ్రాహ్మణులారా! వాసుదేవుడు ఈ విధముగా సేనాపతి, సర్వసమర్థుడు అగు కుమారస్వామిని స్తుతించి, మూడు సార్లు ప్రదక్షిణమును, రెండు సార్లు సాష్టాంగనమస్కారమును, మరల ప్రదక్షిణమును మరియు నమస్కారమును చేసి, వినయముతో వంగినవాడై ఆయన ప్రక్కనే నిలబడెను (36, 37). వామదేవునిచే చేయబడిన గంభీరమగు అర్థముతో ప్రకాశించే స్తుతిని విని సర్వసమర్థుడు, మహేశ్వరుని పుత్రుడు అగు కుమారస్వామి ప్రసన్నుడాయెను (38). మహాసేనుడగు కుమారస్వామి ఆయనతో నిట్లనెను: నీవుచేసిన పూజచే, నీ భక్తిచే మరియు నీ స్తోత్రముచే నేను సంతసించితిని. నీకు మంగళమగుగాక! నేను నీకు ఏమి చేయవలెను? (39) ఓ మునీ! నీవు యోగులలో శ్రేష్ఠుడవు, పరిపూర్ణుడవు, కోరికలు లేనివాడవు, నీవంటి వారలకు ఈ లోకములో కొరదగినది ఏదీ లేదు (40). అయిననూ, నీవంటి సాధుసంతులు ధర్మమును రక్షించి ప్రజలను అనుగ్రహించు కోరికతో భూమండలము నందు సంచరించెదరు (41). ఓ బ్రాహ్మణా! నీవు నానుండి వినదగినది ఉన్నచో, ఇప్పుడు చెప్పుము. నేను లోకములను అనుగ్రహించుట కొరకై దానిని ఇప్పుడు చెప్పగలను (42). స్కందుని ఈ మాటను విని, వామదేవమహర్షి వినయముతో వంగిన దేహము గలవాడై, మేఘగర్జన వలె గంభీరమగు స్వరముతో నిట్లనెను (43).

వామదేవ ఉవాచ |

భగవన్‌ పరమేశస్త్వం పరావరవిభూతిదః | సర్వజ్ఞస్సర్వకర్తా చ సర్వశక్తిధరః ప్రభుః || 44

జీవా వయం తు తే వక్తుం సన్నిధౌ పరమేశితుః | తథాప్యనుగ్రహో%యం తే యత్త్వం వదసి మాం ప్రతి || 45

కృతార్థో%హం మహాప్రాజ్ఞ విజ్ఞానకణమాత్రతః | ప్రేరితః పరిపృచ్ఛామి క్షంతవ్యో%తిక్రమో మమ || 46

ప్రణవో హి పరస్సాక్షాత్పరమేశ్వరవాచకః | వాచ్యః పశుపతిర్దేవః పశూనాం పాశమోచకః || 47

వాచకేన సమాహూతః పశూన్మోచయతే క్షణాత్‌ | తస్మాద్వాచకతాసిద్ధిః ప్రణవేన శివం ప్రతి || 48

ఓమితీదం సర్వమితి శ్రుతిరాహ సనాతనీ | ఓమితి బ్రహ్మ సర్వం హి బ్రహ్మేతి చ సమబ్రవీత్‌ || 49

దేవసేనాపతే తుభ్యం దేవానాం పతయే నమః | నమో యతీనాం పతయే పరిపూర్ణాయ తే నమః || 50

ఏవం స్థితే జగత్యస్మిన్‌ శివాదన్యన్న విద్యతే | సర్వరూపధరస్స్వామీ శివో వ్యాపీ మహేశ్వరః || 51

సమష్టివ్యష్టిభావేన ప్రణవార్థః శ్రుతో మయా | న జాతుచిన్మహాసేన సంప్రాప్తస్త్వాదృశో గురుః || 52

అతః కృత్వా% నుకంపాంవై తమర్థం వక్తుమర్హసి | ఉపదేశవిధానేన సదాచారక్రమేణ చ || 53

స్వామ్యేకస్సర్వజంతూనాం పాశ##చ్ఛేదకరో గురుః | అతస్త్వత్కృపయా సో%ర్థః శ్రోతవ్యో హి మయా గురో || 54

ఇతి స మునినా పృష్టస్స్కందః ప్రణమ్య సదాశివం ప్రణవవవుషం సాష్టత్రింశత్కలావరలక్షితమ్‌ |

సహితముమయా శశ్వత్పార్శ్వే మునిప్రవరాన్వితం గదితముపచక్రామ శ్రేయః శ్రుతిష్వపి గోపితమ్‌ || 55

ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం వామదేవస్య మేరుగమనం నామ ఏకాదశో%ధ్యాయః (11)

వామదేవుడు ఇట్లు పలికెను -

ఓ భగవాన్‌! నీవు గొప్ప వారిక అల్పులకు కూడ గొప్ప మరియు అల్పమైన సంపదలను ఇచ్చే పరమేశ్వరుడవు; స్వర్గాది పుణ్యలోకములను మాత్రమే గాక, నీవు మోక్షమును కూడ ఇచ్చెదవు. సర్వమును తెలిసి సర్వమును సృష్ఠించి సర్వశక్తులను ధరించియున్న ప్రభుడవు నీవే (44). జీవులగు మేము పరమేశ్వరుడవగు నీ సన్నిధియందు పలుకజాలము. కాని. నీవు నాతో ఈ విధముగా పలుకుట నీ అనుగ్రహమే (45). ఓ మహాబుద్ధిశాలీ! నేను నీనుండి విజ్ఞానముయొక్క లేశమునైననూ పొందినచో కృతార్థుడనగుదును. ఈ విధమగు ప్రేరణ గలవాడనై నిన్ను ప్రశ్నించుచున్నాను. నేను హద్దు మీరినచో, క్షమించవలెను (46). సాక్షాత్తుగా పరమేశ్వరుని బోధించే (వాచక) ఓంకారము చాల గొప్పది. జీవుల సంసారబంధమును తొలగించే పశుపతిదేవుడు ఓంకారముచే బోధింపబడుచున్నాడు (వాచ్య) (47). వాచకమగు ఓంకారముతో పరమేశ్వరుని పిలిచి కోరినచో, క్షణములో ఆయన జీవులకు మోక్షమునిచ్చుచున్నాడు. కావున, ఓంకారము శివునకు వాచకము అను మాట యుక్తియుక్తముగ నున్నది (48). ఓమితీదం సర్వమ్‌ (ఈ సర్వము ఓంకారవాచ్యమైన పరబ్రహ్మమే) అనియు, ఓమితి బ్రహ్మ సర్వం హి బ్రహ్మ (ఈ సర్వము ఓంకారముచే బోధించబడే బ్రహ్మమే) అనియు సనాతనమగు వేదము చెప్పుచున్నది (49). ఓ దేవసేనాపతీ! దేవతలకు మరియు యతులకు ప్రభుడవు, పరిపూర్ణుడవు అగు నీకు నమస్కారములు (50). వస్తుస్థితి ఇట్లుండగా, ఈ జగత్తులో శివుని కంటె భిన్నమైనది మరియొకటి లేదు. ప్రభువు, మంగళకరుడు, సర్వవ్యాపకుడు అగు మహేశ్వరుడే సర్వరూపములను దాల్చి యున్నాడు (51). సమష్టి (సర్వజగత్కారణమగు బ్రహ్మ) మరియు వ్యష్టి (ప్రత్యగాత్మ) అనురెండు స్థాయిలలో ఓంకారముయొక్క అర్థమును నేను వినియుంటిని. ఓ మహాసేనా! కాని, నాకు నీ వంటి గురువు ఒక్కనాడైననూ లభించలేదు (52). కావున,నీవు నాయందు దయను చూపి సదాచారముయొక్క క్రమమును మరియు ఉపదేశవిధిని పాటిస్తూ దాని అర్థమును చెప్పవలెను (53). సర్వప్రాణుల సంసారబంధమును తొలగించువాడు, గురువు అగు స్వామి ఒక్కడే. ఓ గురూ! కావున, నీ కృపచే నేను ఆ ప్రణవార్థమును వినవలెను (54). ఆ మహర్షి ఈ విధముగా ప్రశ్నించగా, ఓంకారస్వరూపుడు, ముప్పది ఎనిమిది గొప్ప కళలతో కూడియున్నవాడు, పార్వతీసనాథుడు, సర్వదా సమీపమునందు ఉండే మహర్షులచే సేవింపబడువాడు అగు సదాశివునకు నమస్కరించి, స్కందుడు వేదములయందు కూడ రహస్యముగా నుంచబడిన మోక్షహేతువగు తత్త్వమును చెప్పుటకు ఉపక్రమించెను (55).

శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు వామదేవుడు మేరుపర్వతమునకు వెళ్లుటను వర్ణించే పదునొకండవ అధ్యాయము ముగిసినది (11).

Siva Maha Puranam-4    Chapters