Siva Maha Puranam-4
Chapters
అథ త్రయోదశో
సన్న్యాసమును స్వీకరించే పద్ధతి
సుబ్రహ్మణ్య ఉవాచ |
అథ మధ్యాహ్నసమయే స్నాత్వా నియతమానసః | గంధపుష్పాక్షతాదీని పూజాద్రవ్యాణ్యుపాహరేత్ || 1
నైరృత్యే పూజయేద్దేవం విఘ్నేశం దేవపూజితమ్ | గణానాం త్వేతి మంత్రేణావాహయేత్సువిధానతః || 2
రక్తవర్ణం మహాకాయం సర్వాభరణభూషితమ్ | పాశాంకుశాక్షాభీష్టం చ దధానం కరపంకజైః || 3
ఏవమావాహ్య సంధ్యాయాం శంభుపుత్రం గజాననమ్ | అభ్యర్చ్య పాయసాపూపనారికేలగుడాదిభిః || 4
నైవేద్యముత్తమం దద్యాత్తాంబూలాదిమథాపరమ్ | పరితోష్య నమస్కృత్య నిర్విఘ్నం ప్రార్థయేత్తతః || 5
ఔపాసనాగ్నౌ కర్తవ్యం స్వగృహ్యోక్తవిధానతః | ఆజ్యభాగాంతమాగ్నేయం మఖతంత్రమతః పరమ్ || 6
భూస్స్వాహేతి త్యృచా పూర్ణాహుతిం హుత్వా సమాప్య చ | గాయత్రీం ప్రజపేద్యావదపరాహ్ణమతంద్రితః || 7
అథ సాయంతనీం సంధ్యాముపాస్య స్నానపూర్వకమ్ | సాయమౌపాసనం హుత్వా మౌనీ విజ్ఞాపయేద్గురుమ్ || 8
శ్రర్పయిత్వా చరుం తస్మిన్ సమిదన్నాజ్యభేదతః | జుహుయాద్రౌ ద్రసూక్తేన సద్యోజాతాదిపంచభిః || 9
బ్రహ్మభిశ్చ మహాదేవం సాంబం వహ్నౌ విభావయేత్ | గౌరీమిమాయ మంత్రేణ హుత్వా గౌరీమనుస్మరన్ || 10
సుబ్రహ్మణ్యస్వామి ఇట్లు పలికెను -
తరువాత మధ్యాహ్నసమయమునందు స్నానమును చేసి, ఏకాగ్రమగు మనస్సు గలవాడై, గంధము పుష్పములు అక్షతలు మొదలగు పూజాసామగ్రిని తెచ్చుకొనవలెను (1). సంధ్యాకాలములో నైరృతి దిక్కునందు ప్రకాశ స్వరూపుడు, దేవతలచే పూజింపబడువాడు, ఎర్రని వర్ణము గలవాడు, పెద్ద శరీరము గలవాడు, సకలాభరణములచే అలంకరింపబడినవాడు, పాశము అంకుశము జపమాల మరియు వరదముద్రలను పద్మములవంటి చేతులయందు దాల్చినవాడు, శివపుత్రుడు, ఏనుగు ముఖము కలవాడు అగు విఘ్నేశ్వరుని 'గణానాం త్వా (గణములకు ప్రభువు అగునిన్ను ----)' అను మంత్రముతో యథావిధిగా ఆవాహన చేసి, చక్కగా పూజించి, పాయసము అప్పములు కొబ్బరి మరియు బెల్లము మొదలగు ఉత్తమద్రవ్యములను నైవేద్యమిడి, తాంబూలము మొదలగు ఇతరములగు ఉపచారములను సమర్పించి, సంతోషపెట్టి, నమస్కరించి విఘ్నములు లేకుండగా చేయుమని ప్రార్థించవలెను. తరువాత (2-5), తన గృహ్యసూత్రములో చెప్పబడిన విధముగా ఔపాసనాగ్నియందు ఆజ్యభాగాంతము (ప్రతిదినము ప్రాతస్సాయంకాలములయందు ఆహితాగ్ని ఇచ్చే రెండు ఆహుతుల వరకు) ఆగ్నేయయాగతంత్రమును పూర్తిచేసి, ఆ తరువాత (6), 'భూస్స్వాహా' అను మంత్రముతో పూర్ణాహుతిని హోమము చేసి, హోమాదికమును పూర్తి చేసి, మరునాడు మధ్యాహ్నము వరకు సోమరితనము లేనివాడై గాయత్రీజపమును చేయవలెను (7). తరువాత, సాయంకాలము స్నానము చేసి, సంధ్యావందనమును పూర్తి చేసుకొని, సాయంకాలమునకు సంబంధించిన ఔపాసనకర్మను మౌనముగా పూర్తిచేసి, గురువునకు విన్నవించవలెను (8). అగ్నియందు హోమము కొరకై అన్నము (చరువు) ను వండి, సమిధలు అన్నము మరియు నేయి అను హోమద్రవ్యములతో రుద్రసూక్తముతో మరియు సద్యోజాతాది అయిదు బ్రహ్మమంత్రములతో హోమము చేయవలెను. అగ్ని యందు పార్వతీసమేతుడగు మహాదేవుని భావన చేయవలెను. గౌరీ దేవిని స్మరిస్తూ, గౌరీమిమాయ అను మంత్రముతో హోమమును చేయవలెను (9,10).
తతో % గ్నయే స్విష్టకృతే స్వాహేతి జుహుయాత్సకృత్ | హుత్వోపరిష్టాత్తంత్రం తు తతో%గ్నేరుత్తరే బుధః || 11
స్థిత్వాసనే జపేన్మౌనీ చైలాజినకుశోత్తరే | ఆబ్రాహ్మం చ ముహూర్తం తు గాయత్రీం దృఢమానసః || 12
తతస్న్సాత్వా త్వశక్తశ్చేద్భస్మనా వా విధానతః | శ్రపయిత్వా చరుం తస్మిన్నగ్నావేవాభిఘారితమ్ || 13
ఉదగుద్వాస్య బర్హిష్యాసాద్యాజ్యేన చరుం తతః | అభిఘార్య వ్యాహృతీశ్చ రౌద్రసూక్తం చ పంచ చ || 14
జపేత్ బ్రహ్మాణి సంధార్య చిత్తం శివపదాంబుజే | ప్రజాపతిమథేంద్రం చ విశ్వేదేవాస్తతః పరమ్ || 15
బ్రహ్మాణం సచతుర్ధ్యంతం స్వాహాంతాన్ ప్రణవాదికాన్ | సంజప్య వా చయిత్వా%థ పుణ్యాహం చ తతః పరమ్ || 16
పరస్తాత్తంత్రసమయే స్వాహేత్యగ్నిముఖావధి | నిర్వర్త్య పశ్చాత్ర్పా ణాయ స్వాహేత్యారభ్య పంచభిః || 17
సాజ్యేన చరుణా పశ్చాదగ్నిం స్విష్టకృతం హువేత్ | పునశ్చ ప్రజపేత్సూక్తం రౌద్రం బ్రహ్మాణి పంచ చ || 18
మహేశాది చతుర్వ్యూహమంత్రాంశ్చ ప్రజపేత్పునః | హుత్వోపరిష్టాత్తం త్రం తు స్వశాఖోక్తేన వర్త్మనా || 19
తత్తద్దేవాన్ సముద్దిశ్య సాంగం కుర్యాద్విచక్షణః | ఏవమగ్నిముఖాద్యం యత్కర్మతంత్రం ప్రవర్తితమ్ || 20
తరువాత 'అగ్నయే స్విష్టకృతే స్వాహా (హితమును కలిగించు అగ్నికి సమర్పితమగు గాక)' అను మంత్రముతో ఒకేసారి హోమమును చేయవలెను. విద్వాంసుడగు సాధకుడు ఆ హోమము తరువాత మిగిలిన తంత్రమును అగ్నికి ఉత్తరములోచేయవలెను (11). ఆతడు దృఢమగు మనస్సు గలవాడై, వస్త్రము మృగచర్మము మరియు దర్భలు అను వాటితో చేసిన ఆసనమునందు మౌనముగా కూర్చుండి, తెల్లవారు జాము సమయము వరకు గాయత్రిని జపించవలెను (12). తరువాత యథావిధిగా స్నానమును చేసి, శక్తి లేనిచో విభూతి స్నానమును మాత్రమే చేసి, హోమము కొరకై అన్నము (చరవు) ను అదే అగ్నియందు వండి, దానిపై నేతిని చిలికించి (13), ఉత్తరదిక్కునందు దర్భలపై నుంచి, అన్నముపై నేతిని మరల అభిఘారమును చేయవలెను. మనస్సును శివుని పాదపద్మములపై నిలిపి భూఃమొదలైన వ్యాహృతులను, రుద్రసూక్తమును, పంచబ్రహ్మ మంత్రములను జపించవలెను. ప్రజాపతి, ఇంద్రుడు, విశ్వే దేవతలు, బ్రహ్మ అను దేవతల నామములను ఓంకారముతో మొదలిడి చతుర్థీవిభక్తితో అంతము చేసి, దానికి స్వాహాకారమును జతచేసి, జపించవలెను. తరువాత పుణ్యాహవాచనమును చేయించవలెను (14-16). తరువాత 'అగ్నయే స్వాహా' అను ఆహుతితో మొదలయ్యే అయిదు మంత్రములతో నేతితో కలిసియున్న అన్నమును హోమము చేసి, తరువాత "అగ్నయే స్విష్టకృతే స్వాహా' అను మంత్రముతో హోమమును చేయవలెను. తరువాత మరల రుద్రసూక్తమును, పంచబ్రహ్మ మంత్రములను జపించవలెను (17,18). తరువాత మహేశాది నాలుగు వ్యూహమంత్రములను జపించి, తరువాత మరల స్వశాఖాగృహ్యసూత్రములో చెప్పబడిన విధముగా మిగిలిన తంత్రమును పూర్తి చేయవలెను (19). విద్వాంసుడగు సాధకుడు ఈ విధముగా ఆయా దేవతలను ఉద్దేశించి సాంగముగా అగ్నిముఖము మొదలైన కర్మవిధిని నిర్వర్తించవలెను (20).
తతః పరం ప్రజుహుయాద్విరజాహోమమాత్మనః | షడ్వింశత్తత్త్వరూపే%స్మిన్ దేహే లీనస్య శుద్దయే || 21
తత్త్వాన్యేతాని మద్దేహే శుధ్యంతామిత్యనుస్మరన్ | తత్రాత్మతత్త్వశుద్ధ్యర్థం మంత్రై రారుణకేతుకైః || 22
పఠ్యమానైః పృథివ్యాదిపురుషాంతం క్రమాన్మునే | సాజ్యేన చరుణా మౌనీ శివపాదాంబుజం స్మరన్ || 23
పృథివ్యాది చ శబ్దాది వాగాద్యం పంచకం పునః | శ్రోత్రాద్యం చ శిరఃపార్శ్వపృష్ఠోదరచతుష్టయమ్ || 24
జంఘాం చ యోజయేత్పశ్చాత్త్వగాద్యం ధాతుసప్తకమ్ | ప్రాణాద్యం పంచకం పశ్చాదన్నాద్యం కోశపంచకమ్ || 25
మనశ్చిత్తం చ బుద్ధిశ్చాహంకృతిః ఖ్యాతిరేవ చ | సంకల్పం తు గణాః పశ్చాత్ర్ప కృతిః పురుషస్తతః || 26
పురుషస్య తు భోక్తృత్వం ప్రతిపన్నస్య భోజనే | అంతరంగతయా తత్త్వపంచకం పరికీర్తితమ్ || 27
నియతిః కాలరాగశ్చ విద్యా చ తదనంతరమ్ | కలా చ పంచకమిదం మాయోత్పన్నం మునీశ్వర || 28
మాయాం తు ప్రకృతిం విద్యాదితి మాయాశ్రుతీరితా | తజ్జాన్యేతాని తత్త్వాని శ్రుత్యుక్తాని న సంశయః || 29
కాలస్వభావో నియతిరితి చ శ్రుతిరబ్రవీత్ | ఏతత్పంచకమేవాస్య పంచకంచుకముచ్యతే || 30
ఆ తరువాత ఇరువది యారు తత్త్వముల రూపములో ఉన్న ఈ దేహమునందు తాదాత్మ్యమును చెందియున్న ఆత్మయొక్క శుద్ధి కొరకై విరజాహోమమును చేయవలెను (21). ఓ మునీ! నా దేహమునందలి ఈ తత్త్వములు పరిశుద్ధమగును గాక! అని స్మరిస్తూ, మౌనముగా శివుని పాదపద్మములను స్మరిస్తూ, పృథివితో మొదలిడి పురుషుడు వరకు గల ఆత్మతత్త్వముల శుద్ధి కొరకై, ఆరుణకేతుకమంత్రములను వరుసగా పఠిస్తూ, నేతితో కూడిన చరువును హోమము చేయవలెను (22,23). పృథివి మొదలగు అయిదు భూతములు, శబ్దము మొదలగు అయిదు విషయములు, వాక్కు మొదలగు అయిదు కర్మేంద్రియములు, చెవి మొదలగు అయిదు జ్ఞానేంద్రియములు, తల ప్రక్క భాగము వీపు పొట్ట అనే నాలుగు భాగములు దేహమునందు గలవు (24). వీటికి తరువాత పిక్కలను, చర్మము మొదలగు ఏడు ధాతువులను, ప్రాణము మొదలగు అయిదు వాయువృత్తులను, అన్నమయ మొదలగు అయిదు కోశములను జతచేయవలెను (25). మనస్సు (సంకల్ప వికల్పాత్మకము), చిత్తము (స్మరణాత్మకము), బుద్ధి (నిర్ణయాత్మకము), అహంకారము, ఖ్యాతి (జ్ఞానము), సంకల్పము, మూడు గుణములు, వీటి తరువాత ప్రకృతి మరియు పురుషుడు అనునవి తత్త్వములు (26). భోక్తృత్వమును పొందియున్న పురుషునకు భోగములో అయిదు తత్త్వములు అంతరంగ సాధనములగునని చెప్పబడినది (27). ఓ మహర్షీ!నియతి (కర్మఫలము అవశ్యము లభించుట), కాలము, రాగము, విద్య, కళ అనే ఈ ఐదు మాయనుండి పుట్టినవి (28). జగత్తుయొక్క ఉపాదానకారణము మాయయేననియు, వేదములలో చెప్పబడిన ఈ తత్త్వములు మాయనుండి పుట్టినవనియు మాయను బోధించే వేదవాక్యములు చెప్పుచున్నవి. దీనిలో సందేహము లేదు (29). నియతి కాలముయొక్క స్వభావమని వేదము చెప్పుచున్నది. ఈ అయిదింటికి పంచకంచుకమని కూడ పేరు గలదు (30).
అజానన్పంచ తత్త్వాని విద్వానపి చ మూఢధీః | నియత్యధస్తాత్ర్ప కృతేరుపరిష్టాత్పుమానయమ్ || 31
కాకాక్షిన్యాయమాశ్రిత్య వర్తతే పార్శ్వతో%న్వహమ్ | విద్యాతత్త్వమిదం ప్రోక్తం శుద్ధవిద్యామహేశ్వరౌ || 32
సదాశివశ్చ శక్తిశ్చ శివశ్చేదం తు పంచకమ్ | శివతత్త్వమిదం బ్రహ్మన్ ప్రజ్ఞాన బ్రహ్మవాగ్యతః || 33
పృథివ్యాది శివాంతం యత్తత్త్వజాతం మునీశ్వర | స్వకారణలయద్వారా శుద్ధిరస్య విధీయతామ్ || 34
ఏకాదశానాం మంత్రాణాం పరసై#్మపదపూర్వకమ్ | శివజ్యోతిశ్చతుర్థ్యంతమిదం పదమథోచ్చరేత్ || 35
న మమేతి వదేత్పాశ్చాదుద్దేశత్యాగ ఈరితః | అతః పరం వివిట్ట్యేతి కషోత్కాయేతి మంత్రయోః || 36
వ్యాపకాయ పదస్యాంతే పరమాత్మన ఇత్యపి | శివజ్యోతిశ్చతుర్ధ్యంతం విశ్వభూతపదం పునః || 37
ఘసనోత్సుకశబ్దశ్చ చతుర్ధ్యంతమథో వదేత్ | పరసై#్మపదముచ్చార్య దేవాయ పదముచ్చరేత్ || 38
ఉత్తిష్ఠస్వేతి మంత్రస్య విశ్వరూపాయ శబ్దతః | పురుషాయ పదం బ్రూయాదోం స్వాహేత్యస్య సంవదేత్ || 39
లోకత్రయపదస్యాంతే వ్యాపినే పరమాత్మనే | శివాయేదం న మమ పదం బ్రూయాదతః పరమ్ || 40
ఈ అయిదు తత్త్వములను తెలియని వాడు పండితుడైనా మూఢబుద్ధియే. పురుషుడు ప్రకృతికి అతీతుడై యుండగా, నియతి ప్రకృతికి లోబడి యుండును. అట్టి వ్యక్తి సంసారములో పడి కాకి కన్ను వలె అటు చైతన్యముతో మరియు ఇటు జడప్రకృతితో ముడి పడినవాడై ప్రతిదినము సంసారముననుభవించుచున్నాడు. పురుషుడు కాకి కన్నువలె ప్రకృతిని, నియతిని రెండువైపులా కలిగియున్నాడు. ఇంతవరకు విద్యాతత్త్వమును చెప్పితిని. ఓ బ్రాహ్మణా! శుద్ధజ్ఞానము, మహేశ్వరుడు, సదాశివుడు, శక్తి మరియు శివుడు అనే అయిదు కలిసి శివతత్త్వమని చెప్పబడుచున్నవి.'ప్రజ్ఞానం బ్రహ్మ' అనే ఉపనిషద్వాక్యము దీనినే బోధించుచున్నది (31-33). ఓ మహర్షీ! పృథివితో మొదలిడి శివుని వరకు గల తత్త్వముల సమూహమును తమ తమ కారణములయందు లయము చేయుట ద్వారా ఈ తత్త్వసముదాయమునకు శుద్ధిని కలిగించవలెను (34). పదకొండు విరజా మంత్రములను 'పరసై#్మ (పరబ్రహ్మస్వరూపుని కొరకు)' అని పదముతో కలిపి చెప్పి, శివజ్యోతిషే (జ్యోతిస్స్వరూపుడగు శివుని కొరకు)' అని జోడించి, తరువాత 'ఇదమ్ (ఇది)' అని ఉచ్చరించి (35), తరువాత 'న మమ' అని పలికి త్యాగమును చేయవలెను. తరువాత 'వివిట్ట్యై స్వాహా' అనే రెండు మంత్రములతో హోమము చేయవలెను (36). 'వ్యాపకాయ (వ్యాపించి యున్న వాని కొరకు)' అను పదమునకు అంతములో 'పరమాత్మనే శివజ్యోతిషే' అనియు, విశ్వభూత (జగద్రూపముగా ప్రకటమగుచున్నవాడు)' అనియు (37), 'ఘసనోత్సుకాయ (జగత్తును లయము చేయుటయందు ఉత్సాహము గలవాని కొరకు)' అనియు, 'పరసై#్మ దేవాయ (దేవోత్తముని కొరకు) ఇదం న మమ' అనియు పలుకవలెను (38). 'ఉత్తిష్ఠస్వ' అనే మంత్రమునకు 'ఓం విశ్వరూపాయ పురుషాయ స్వాహా (జగత్స్వరూపుడగు చైతన్యపరబ్రహ్మ కొరకు సమర్పించుచున్నాను)' అని జోడించవలెను (39). 'లోకత్రయ' అనుపదమునకు తరువాత 'వ్యాపినే పరమాత్మనే శివాయేదం న మమ (ఇది సర్వవ్యాపకపరమాత్మయగు శివునికొరకు సమర్పించబడినది; ఇది నాది కాదు)' అని పలుకవలెను (40).
స్వశాఖోక్తప్రకారేణ పురస్తాత్తంత్ర కర్మ చ | నిర్వర్త్య సర్పిషా మిశ్రం చరుం ప్రాశ్య పురోధసే || 41
ప్రదద్యాద్దక్షిణాం తసై#్మ హేమాదిపరిబృంహితమ్ | బ్రహ్మాణముద్వాస్య తతః ప్రాతరౌపాసనం హువేత్ || 42
సం మా సించంతు మరుత ఇతి మంత్రం జపేన్నరః | యా తే అగ్న ఇత్యనేన మంత్రేణాగ్నౌ ప్రతాప్య చ || 43
హస్తమగ్నౌ సమారోప్య స్వాత్మన్యద్వైతధామని | ప్రాభాతికీం తతస్సంధ్యాముపాస్యాదిత్యమప్యథ || 44
ఉపస్థాయ ప్రవిశ్యాప్సు నాభిదఘ్నం ప్రవేశయన్ | తన్మంత్రాన్ ప్రజపేత్ర్పీ త్యా నిశ్చలాత్మా సముత్సుకః || 45
ఆహితాగ్నిస్తు యః కుర్యాత్ర్పా జాపత్యేష్టిమాహితే | శ్రౌతే వైశ్వానరే సమ్యక్ సర్వవేదసదక్షిణామ్ || 46
అథాగ్నిమాత్మన్యారోప్య బ్రాహ్మణః ప్రవ్రజేద్గృహాత్ | సావిత్రీ ప్రథమం పాదం సావిత్రీమిత్యుదీర్య చ || 47
ప్రవేశయామి శబ్దాంతే భూరోమితి చ సంవదేత్ | ద్వితీయం పాదముచ్చార్య సావిత్రీమితి పూర్వవత్ || 48
ప్రవేశయామి శబ్దాంతే భూవరోమితి సంవదేత్ | తృతీయం పాదముచ్చార్య సావిత్రీమిత్యతః పరమ్ || 49
ప్రవేశయామి శబ్దాంతే సువరోమిత్యుదీరయేత్ | త్రిపాదముచ్చరేత్పూర్వం సావిత్రీమిత్యతః పరమ్ || 50
ప్రవేశయామి శబ్దాంతే భూర్భువస్సువరోమితి | ఉదీరయేత్పరం ప్రీత్యా నిశ్చలాత్మా మునీశ్వర || 51
ముందుగా తన గృహ్యసూత్రములో చెప్పబడిన విధముగా అగ్నిహోత్రాది కర్మను ముగించుకొని, నేతితో కలిపిన అన్నమును తిని, పురోహితునకు బంగారము మొదలగువాటితో కూడియున్న అధికమగు దక్షిణనీయవలెను. తరువాత, బ్రహ్మకు ఉద్వాసన చెప్పి, ప్రాతరౌపాసనమును చేయవలెను (41,42). ఆ సాధకుడు 'సం మా సించంతు మరుతః' అను మంత్రమును చెప్పి, 'యా తే అగ్నే' అ%ు మంత్రముతో అగ్నిపై చేతులను ఉంచి (43), అద్వైతపరబ్రహ్మకు అభిన్నమైన ఆత్మయందు అగ్నిని ఆరోపించుకొనవలెను. తరువాత ప్రాతస్సంధ్యావందనమును చేసి, సూర్యోపస్థానమును చెప్పి, నీటిలో బొడ్డు లోతు వరకు ప్రవేశించి, ఉత్సాహము గలవాడై నిశ్చలమగు మనస్సుతో అగ్నిమంత్రములను జపించవలెను (44,45). ఆహితాగ్నియగు సాధకుడు వైశ్వానరస్వరూపమగు శ్రౌతాగ్నియందు ప్రాజాపత్యేష్టిని, చేసి, తన సర్వస్వమును దక్షిణగా నీయవలెను (46). తరువాత ఆ బ్రాహ్మణుడు అగ్నిని తనయందు ఆరోపించుకొని, ఇంటిని విడిచిపెట్టి సన్న్యసించవలెను. సావిత్రీ (గాయత్రీ) మంత్రముయొక్క మొదటి పాదమును చెప్పి, 'సావిత్రీం ప్రవేశయామి భూరోమ్ (సావిత్రిని భూః అను వ్యాహృతియందు ప్రవేశ##పెట్టుచున్నాను; పరమేశ్వరునకు నమస్కారము )' అని పలుకవలెను. రెండవ పాదమును చెప్పి, పూర్వమునందు వలెనే 'సావిత్రీం ప్రవేశయామి భువరోమ్ (సావిత్రిని భువః యందు ప్రవేశ##పెట్టుచున్నాను)' అని పలికి , మూడవ పాదమును చెప్పి, 'సావిత్రీం ప్రవేశయామి సువరోమ్' అని పలుకవలెను. ఓమహర్షీ! తరువాత సాధకుడు నిశ్చలమగు మనస్సు గలవాడై ప్రీతితో మూడు పాదములను కలిపి చెప్పి, 'సావిత్రీం ప్రవేశయామి భూర్భువస్సువరోమ్' అని చెప్పవలెను (47-51).
ఇయం భగవతీ సాక్షాచ్ఛంకరార్ధశరీరిణీ | పంచవక్త్రా దశభుజా త్రిపంచనయనోజ్జ్వలా || 52
నవరత్నకిరీటోద్యచ్చంద్రలేఖావతంసినీ | శుద్ధస్ఫటికసంకాశా దశాయుధధరా శుభా || 53
హారకేయూరకటకకింకిణీనూపురాదిభిః | భూషితావయవా దివ్యవసనా రత్నభూషణా || 54
విష్ణునా విధినా దేవఋషిగంధర్వనాయకైః | మానవైశ్చ సదా సేవ్యా సర్వాత్మావ్యాపినీ శివా || 55
సదాశివస్య దేవస్య ధర్మపత్నీ మనోహరా | జగదంబా త్రిజననీ త్రిగుణా నిర్గుణాప్యజా || 56
ఇత్యేవం సంవిచార్యాథ గాయత్రీం ప్రజపేత్సుధీః | ఆదిదేవీం చ త్రిపదాం బ్రాహ్మణత్వాదిదామజామ్ || 57
యోహ్యన్యథా జపేత్పాపో గాయత్రీం శివరూపిణీమ్ | స పచ్యతే మహాఘోరే నరకే కల్పసంఖ్యయా || 58
సా వ్యాహృతిభ్యస్సంజాతా తాస్వేవ విలయం గతా | తాశ్చ ప్రణవసంభూతాః ప్రణవే విలయం గతాః || 59
ప్రణవస్సర్వవేదాదిః ప్రణవశ్శివవాచకః |మంత్రాధిరాజరాజశ్చ మహాబీజం మనుః పరః || 60
శివో వా ప్రణవో హ్యేష ప్రణవో వా శివస్స్మృతః | వాచ్యవాచకయోర్భేదో నాత్యంతం విద్యతే యతః || 61
ఏనమేవ మహామంత్రం జీవానాం చ తనుత్యజామ్ | కాశ్యాం సంశ్రావ్య మరణ దత్తే ముక్తిం పరాం శివః || 62
సాక్షాత్తుగా శంకరుని అర్ధాంగి, అయిదు ముఖములు పది భుజములు పదిహేను కన్నులు గలది, నూతనమైన రత్నములతో పొదగబడిన కిరీటముతో మరియు ప్రకాశించే చంద్రరేఖతో అలంకరింపబడిన శిరస్సు గలది, స్వచ్ఛమైన స్ఫటికమువలె ప్రకాశించునది, పది ఆయుధములను ధరించియున్నది, మంగళకరమైనది, హారము అంగదములు హస్తాభరణములు చిరుగంటలు గల నూపురములు మొదలగు వాటిచే అలంకరింపబడిన అవయవములు గలది, దివ్యమగు వస్త్రములను దాల్చినది, రత్నాభరణములు గలది, అందరిలో ఆత్మరూపముగా వ్యాపించియున్నది, మంగళస్వరూపురాలు, పరమేశ్వరుడగు సదాశివుని ధర్మపత్ని, సుందరి, జగన్మాత, త్రిమూర్తులకు తల్లి, త్రిగుణాత్మిక ప్రకృతి, గుణరహిత, పుట్టుక లేనిది అగు ఈ భగవతిని విష్ణువు, బ్రహ్మ , దేవతలు, ఋషులు, గంధర్వులు, వీరి నాయకులు మరియు మానవులు సర్వకాలములలో సేవించుచున్నారు (52-56). విద్వాంసుడగు సాధకుడు ఈ విధముగా భావన చేసి, ఆదిదేవి, బ్రాహ్మణత్వము మొదలగు వాటిని ఇచ్చునది, పుట్టుక లేనిది అగు గాయత్రీదేవి యొక్క మూడు పాదముల మంత్రమును జపించవలెను (57). ఏ పాపాత్ముడైతే శివస్వరూపురాలగు గాయత్రిని మరియొక విధమును జపించునో, వాడు ఒక కల్పముయొక్క కాలము మహాభయంకరమగు నరకములో వేయించబడును (58). ఆ గాయత్రీ వ్యాహృతుల (భూర్భువస్సువః) నుండి పుట్టి, వాటియందు విలీనమగును. వ్యాహృతులు ఓంకారమునుండి పుట్టి ఓంకారములో విలీనమగును (59). వేదములన్నింటికీ ఆదిలో ఉన్నదిఓంకరామే. మంత్రములలో సర్వశ్రేష్ఠమైనది, గొప్ప బీజాక్షరము అగు ఓంకారము శివుని బోధించును (60). వాచ్యుడగు శివునకు వాచకమగు ఓంకారమునకు భేదము లేశ##మైననూ లేదు. కావుననే, శివుడే ఓంకారమనియు, ఓంకారమే శివుడనియు చెప్పబడినది (61). కాశీలో మరణించే జీవులకు మరణసమయములో శివుడు చెవిలో ఈ గొప్ప మంత్రమును మాత్రమే బోధించి ముక్తిని ఇచ్చును (62).
తస్మాదేకాక్షరం దేవం శివం పరమకారణమ్ | ఉపాసతే యతిశ్రేష్ఠా హృదయాంభోజమధ్యగమ్ || 63
ముముక్షవో%పరే ధీరా విరక్తా లౌకికా నరాః | విషయాన్మనసా జ్ఞాత్వోపాసతే పరమం శివమ్ || 64
ఏవం విలాప్య గాయత్రీం ప్రణవే శివవాచకే | అహం వృక్షస్య రేరివేత్యనువాకం జపేత్పునః | 65
యశ్ఛందసామృషభ ఇత్యనువాకముపక్రమాత్ | గోపాయాంతం జపన్ పశ్చాదుత్థితో%హమితీరయేత్ || 66
వదేజ్జపేత్త్రి ధా మందమధ్యోచ్ఛ్రా యక్రమాన్మునే | ప్రణవం పూర్వముద్ధృత్య సృష్టిస్థితిలయక్రమాత్ || 67
తేషామథ క్రమాద్భూయాద్భూస్సన్న్యస్తం భువస్తథా | సన్న్యస్తం సువరిత్యుక్త్వా సన్న్యస్తం పదముచ్చరన్ || 68
సర్వమంత్రాద్యః ప్రదేశే మయేతి చ పదం వదేత్ | ప్రణవం పూర్వముద్ధృత్య సమష్టివ్యాహృతీర్వదేత్ || 69
సమస్తమిత్యతో బ్రూయాన్మయేతి చ సమబ్రవీత్ | సదాశివం హృది ధ్యాత్వా మందాదీతి తతో మునే || 70
పై#్ర షమంత్రాంస్తు జపై#్త్వవం సావధానేన చేతసా | అభయం సర్వభూతేభ్యో మత్తస్స్వాహేతి సంజపన్ || 71
ప్రాచ్యాం దిశ్యప ఉద్ధృత్య ప్రక్షిపేదంజలిం తతః | శిఖాం యజ్ఞోపవీతం చ యత్రోత్పాట్య చ పాణినా || 72
గృహీత్వా ప్రణవం భూశ్చ సముద్రం గచ్ఛ సంవదేత్ | వహ్నిజాయాం సముచ్చార్య సోదకాంజలినా తతః || 73
అప్సు హూయాదథ ప్రేషైరభిమంత్ర్య త్రిధా త్వపః | ప్రాశ్య తీరే సమాగత్య భూమౌ వస్త్రా దికం త్యజేత్ || 74
కావుననే, ఓంకారముచే బోధింపబడువాడు, సర్వజగత్కారణుడు, ప్రకాశస్వరూపుడు, హృదయమునే పద్మము లోపలనుండువాడు అగు శివుని గొప్ప యతులు ఉపాసన చేయుచున్నారు (63). ఇంతే గాక, మోక్షమును కోరువారు, జ్ఞానులు, వైరాగ్యము గల లౌకికజనులు కూడ ఇంద్రియసుఖముల సంగతిని తెలుసుకొని పరమశివుని ఉపాసన చేయుచున్నారు (64). ఈ విధముగా శివుని బోధించే ఓంకారమునందు గాయత్రిని విలీనము చేసి, 'అహం వృక్షస్య రేరివా (సంసారము అనే వృక్షమునకు శక్తిని ఇచ్చువాడను నేనే)' అనే అనువాకమును, తరువాత 'యశ్ఛందసామృషభో ---- శ్రుతం మే గోపాయ (ఓంకారము వేదములలో ప్రముఖమైనది, ---- నేను విన్నదానిని రక్షించుము)' అనే అనువాక్యమును జపించి, తరువాత 'ఏషణభ్యః వ్యుత్థితో%హమ్ (నేను కామనలను విడిచి పెట్టినాను)' అని చెప్పవలెను (65,66). ఈ వాక్యమును మంద, మధ్యమ స్వరములతో మరియు బిగ్గరగా చెప్పవలెను. ఓమునీ! సృష్టి స్థితి లయముల క్రమములో ప్రణవ మంత్రమునుద్ధరించవలెను (67). ఓ మునీ! తరువాత క్రమముగా ఆ సాధకుడు 'బూస్సన్న్యస్తం మయా (భూః నేను సన్న్యసించుచున్నాను), భువస్సన్న్యస్తం మయా, సువస్సన్న్యస్తం మయా' అని చెప్పి, 'ఓం భూర్భువస్సువః సన్న్యస్తం మయా (నేను భూః భువః సువః అనే మూడు లో కములను సన్న్యసించితిని)' అని చెప్పవలెను. సదాశివుని మనస్సులో ధ్యానిస్తూ ఈ వాక్యములను మెల్లగా, మధ్యస్వరములో మరియు బిగ్గరగా చెప్పవలెను (68-70). ఈ విధముగా ఏకాగ్రమగు మనస్సుతో పై#్ర షమంత్రములను చెప్పి, 'అభయం సర్వభూతేభ్యో మత్తస్స్వాహా ( నా వలన సర్వప్రాణులకు అభయము లభించు గాక!)' అని జపించవలెను (71). దోసిలితో నీళ్ళను తీసుకొని తూర్పువైపునకు పైకి విడిచిపెట్టవలెను. తరువాత చేతితో పిలకను, యజ్ఞోపవీతమును తొలగించి (72), చేతితో పట్టుకొని, 'ఓం భూస్సముద్రం గచ్ఛ స్వాహా (సముద్రమును పొందుము)' అని జపించి చేతిలో నీళ్లను తీసుకొని పై మంత్రములనుచ్చరిస్తూ వాటిని నీళ్లలో సమర్పించవలెను. ఆ తరవాత నీటిని త్రాగి ఒడ్డు మీదకు వచ్చి, నేలపై వస్త్ర ము మొదలగు వాటిని విడిచిపెట్టవలెను (73,74).
ఉదఙ్ముఖః ప్రాఙ్ముఖో వా గచ్ఛేత్సప్తపదాధికమ్ | కించిద్దూరమథాచార్యస్తిష్ఠ తిష్ఠేతి సంవదేత్ || 75
లోకస్య వ్యవహారార్ధం కౌపీనం దండమేవ చ | భగవన్ స్వీకురుష్వేతి దద్యాత్స్వేనైవ పాణినా || 76
దత్త్వాసుదోరం కౌపీనం కాషాయవసనం తతః | ఆచ్ఛాద్యాచమ్య చ ద్వేధా తం శిష్యమితి సంవదేత్ || 77
ఇంద్రస్య వజ్రో%సి తత ఇతి మంత్రముదాహరేత్ | సంప్రార్ధ్య దండం గృహ్ణీయాత్సఖాయ ఇతి సంజపన్ || 78
అథ గత్వా గురోః పార్శ్వం శివపాదాంబుజం స్మరన్ | ప్రణమేద్దండవద్భూమౌ త్రివారం సంయతాత్మవాన్ || 79
పునరుత్థాయ చ శ##నైః ప్రేవ్ణూ పశ్యన్ గురుం నిజమ్ | కృతాంజలిపుటస్తిష్ఠేద్గురుపాదసమీపతః || 80
కర్మారంభాత్పూర్వమేవ గృహీత్వా గోమయం శుభమ్ | స్థూలామలకమాత్రేణ కృత్వా పిండాన్ విశోషయేత్ || 81
సౌరైస్తు కిరణౖరేవ హోమారంభాగ్నిమధ్యగాన్ | నిక్షిప్య హోమసంపూర్తౌ భస్మ సంగృహ్య గోపయేత్ || 82
తతో గురుస్సమాదాయ విరజానలజం సితమ్ | భస్మ తేనైవ తం శిష్యమగ్నిరిత్యాదిభిః క్రమాత్ || 83
మంత్రై రంగాని సంస్పృశ్య మూర్ధాదిచరయణాంతతః | ఈశానాద్యైః పంచమంత్రై శ్శిర ఆరభ్య సర్వతః || 84
సముద్ధృత్య విధానేన త్రిపుండం ధారయేత్తతః | త్రియాయుషైస్త్య్రంబకైశ్చ మూర్ధ్న ఆరభ్య చ క్రమాత్ || 85
ఉత్తరము వైపునకు గాని, తూర్పువైపునకు గాని ఏడు అడుగులకంటె అధికముగా కొంచెను దూరము వెళ్లవలెను. అపుడు ఆచార్యుడు 'ఆగుము, ఆగుము' అని పలుకవలెను (75). 'ఓ పుజ్యా! లోకవ్యవహారము కొరకై దండమును, కౌపీనమును స్వీకరించుము' అని పలికి, ఆచార్యుడు తన చేతితో మంచి లంగోటాను ఇచ్చి, కాషాయవస్త్రమును కప్పి, రెండు సార్లు ఆచమనమును చేసి, ఆ శిష్యుని ఉద్దేశించి 'ఇంద్రస్య వజ్రో%సి (ఇంద్రుని వజ్రము అగుచున్నావు)' అను మంత్రమును పలుకవలెను. శిష్యుడు గురువును 'సఖాయః (యోగ్యమగు మిత్రుడు)' అను పదముతో ఆరంభమయ్యే మంత్రముతో ప్రార్థించి దండమును స్వీకరించవలెను (76-78). అపుడాతడు గురువు సమీపమునకు వెళ్లి, శివుని పాదపద్మములను స్మరిస్తూ, ఏకాగ్రమగు మనస్సు గలవాడై, మూడు సార్లు సాష్టాంగనమస్కారమును చేయవలెను (79). నెమ్మదిగా లేచి నిలబడి, తన గురువును ప్రేమతో చూస్తూ, చేతులను జోడించి, గురువుయొక్క పాదముల సమీపమునందు నిలబడవలెను (80). కర్మ ఆరంభమగుటకు పూర్వమునందే చక్కని గోమయమును తీసుకొని పెద్ద ఉసిరికాయ పరిమాణములో పిండములను చేసి ఎండబెట్టవలెను. వాటిని హోమమునకు ఆరంభములో అగ్ని మధ్యలో నుంచి, హోమము అయిన తరువాత ఆ భస్మను తీసి జాగ్రత్త పెట్టవలెను (81,82). అపుడు గురువు విరజాహోమము చేసిన అగ్నిస్థానమునుండి తెల్లని భస్మను తీసి, అగ్నిరితి భస్మ ఇత్యాది మంత్రములను పఠిస్తూ, తలనుండి కాలి వరకు శిష్యుని అవయవములకు భస్మను పూయవలెను. ఈశానః, త్రియాయుషమ్, త్ర్యంబకం యజామహే (ముక్కంటి దేవుని ఆరాధించుచున్నాము ) అనే మంత్రములను పఠించి,శిష్యుని శిరస్సునుండి ఆరంభించి అంతటా యథావిధిగా త్రిపుండ్రములను ధరింపజేయవలెను (83-85).
తతస్సద్భక్తియుక్తేన చేతసా శిష్యసత్తమః | హృత్పంకజే సమాసీనం ధ్యాయేచ్ఛివముమాసఖమ్ || 86
హస్తం నిధాయ శిరసి శిష్యస్య చ గురుర్వదేత్ | త్రివారం ప్రణవం దక్షకర్ణే ఋష్యాదిసంయుతమ్ || 87
తతఃకృత్వా చ కరుణాం ప్రణవస్యార్థమాదిశేత్ | షడ్విధార్థపరిజ్ఞానసహితం గురుసత్తమః || 88
ద్విషట్ర్ప కారం స గురుం ప్రణమేద్భువి దండవత్ | తదధీనో భ##వేన్నిత్యం నాన్యత్కర్మ సమాచరేత్ || 89
తదాజ్ఞయా తతశ్శిష్యో వేదాంతార్ధానుసారతః | శివజ్ఞానరతో భూయాత్సగుణాగుణభేదతః || 90
తతస్తేనైవ శిష్యేణ శ్రవణాద్యంగపూర్వకమ్ | ప్రాభాతికాద్యనుష్ఠానం జపాంతం కారయేద్గురుః || 91
పూజాం చ మండలే తస్మిన్ కలైసప్రస్తరాహ్వయే | శివోదితేన మార్గేణ శిష్యస్తత్రై వ పూజయేత్ || 92
దేవం నిత్యమశక్తశ్చేత్పూజితుం గురుణా శుభమ్ | స్ఫాటికం పీఠికోపేతం గృహ్ణీయాల్లింగమైశ్వరమ్ || 93
వరం ప్రాణపరిత్యాగశ్ఛేదనం శిరసో % పి మే | న త్వనభ్యర్చ్య భుంజీయాం భగవంతం త్రిలోచనమ్ || 94
ఏవం త్రివారముచ్చార్య శపథం గురుసన్నిధౌ | కుర్యాద్దృఢమనాశ్శిష్యశ్శివభక్తిం సముద్వహన్ || 95
తత ఏవం మహాదేవం నిత్యముద్యుక్తమానసః | పూజయేత్పరయా భక్త్యా పంచావరణమార్గతః || 96
ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం సన్న్యాసస్వీకారపద్ధతినిరూపణం నామ త్రయోదశో%ధ్యాయః (13).
శ్రేష్ఠుడగు ఆ శిష్యుడు తరువాత చక్కని భక్తితో నిండిన మనస్సుతో హృదయపద్మములో కూర్చుండియున్న పార్వతీ సమేతుడగు శివుని ధ్యానించవలెను (86). ఆ గురువు శిష్యుని శిరస్సుపై చేతిని ఉంచి, కుడి చెవిలో ఋషి మొదలగు వివరములతో సహా ఓంకారమును మూడు సార్లు చెప్పవలెను (87). తరువాత ఆ గురుశ్రేష్ఠుడు ఓంకరాముయొక్క ఆరు రకముల అర్థమును దయతో బోధించవలెను (88). ఆ శిష్యుడు గురువునకు పన్నెండు సార్లు సాష్టాంగప్రణామమును చేసి నిత్యము ఆయనకు అధీనములో నుండవలెనే గాని, ఇతరకార్యములయందు నిమగ్నుడు కారాదు (89). తరువాత శిష్యుడు గురువుయొక్క ఆజ్ఞను గైకొని ఉపనిషత్తుల అర్ధమునకనుగుణముగా సగుణనిర్గుణరూపములతో కూడియున్న శివుని జ్ఞానమునందు నిమగ్నుడు కావలెను (90). తరువాత గురువు ఆ శిష్యునిచే శ్రవణము మొదలగు అంగములతో మొదలై జపముతో అంతమయ్యే ప్రాతఃకాలీనానుష్ఠానమును చేయించవలెను (91). కైలాసప్రస్తరము అనే పేరు గల ఆ మండలములో శివుడు బోధించియున్న మార్గములో శిష్యుడు అచటనే పూజను చేయవలెను (92). గురువుచే పూజింపబడిన ఈశ్వరుని నిత్యము పూజించే శక్తి లేనిచో, ఆ సాధకుడు పీఠముతో కూడియున్న స్ఫటికశివలింగమును గురువు వద్దనుండి స్వీకరించవలెను (93). ముక్కంటి భగవానుని పూజించకుండగా భుజించుటకంటె నాకు ప్రాణములను వీడుట మరియు శిరశ్ఛేదము మేలు (94). ఈవిధముగా ఆ శిష్యుడు మనస్సులో దృఢముగా శివభక్తిని నిలబెట్టుకొని గురువు యొక్క సన్నిధిలో మూడు సార్లు శపథమును చేయవలెను (95). తరువాత ఆతడు ఈ విధముగా నిత్యము ఉత్సాహముతో కూడిన మనస్సు గలవాడై పరమభక్తితో పంచావరణపూజావిధానము ననుసరించి మహాదేవుని పూజించవలెను (96).
శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు సన్యాసస్వీకారపద్ధతిని నిరూపించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).