Siva Maha Puranam-4
Chapters
అథ చతుర్దశో
పంచబ్రహ్మ వర్ణనము
వామదేవ ఉవాచ |
భగవన్ షణ్ముఖాశేషవిజ్ఞానామృతవారిధే | విశ్వామరేశ్వరసుత ప్రణతార్తిప్రభంజన || 1
షడ్విధార్ధపరిజ్ఞానమిష్టదం కిముదాహృతమ్ | కే తత్ర షడ్విధా అర్థాః పరిజ్ఞానం చ కిం ప్రభో || 2
ప్రతిపాద్యశ్చ కస్తస్య పరిజ్ఞానే చ కిం ఫలమ్ | ఏతత్సర్వం సమాచక్ష్వ యద్యత్పృష్టం మహాగుహ || 3
ఏతమర్థమవిజ్ఞాయ పశుశాస్త్ర విమోహితః | అద్యాప్యహం మహాసేన భ్రాంతశ్చ శివమాయయా || 4
అహం శివపదద్వంద్వజ్ఞానామృతసాయనమ్ | పీత్వా విగతసమ్మోహో భవిష్యామి యథా తథా || 5
కృపామృతార్ద్ర యా దృష్ట్వా విలోక్య సుచిరం మయి | కర్తవ్యో%నుగ్రహః శ్రీమత్పాదాబ్జశరణాగతే || 6
ఇతి శ్రుత్వా మునీంద్రోక్తం జ్ఞానశక్తిధరో విభుః | ప్రాహాన్యదర్శనమహాసంత్రాసజనకం వచః || 7
వామదేవుడు ఇట్లు పలికెను -
ఓ పూజ్యా! షణ్ముఖా! నీవు అమృతమువంటి సమస్తవిజ్ఞానమునకు నిధివి. సకలదేవతలకు ప్రభువగు శివుని పుత్రుడవగు నీవు నమస్కరించిన వారి కష్టములను ఎగురగొట్టెదవు (1).కోరికలను తీర్చే ఆరు విధముల అర్థము యొక్క పరిజ్ఞానమును నీవు ఉదహరించితివి. అది యెట్టిది? ఆ ఆరు విధముల అర్థములు ఎయ్యవి? ఓ ప్రభూ! ఆ పరిజ్ఞానము ఎయ్యది? (2) ఆ పరిజ్ఞానములో ప్రతిపాదింపబడే వస్తువు ఏది? దాని ఫలమేమి? ఓ మహాగుహా! నేను అడిగిన ఈ సర్వమును చక్కగా చెప్పుము (3). ఓ మహాసేనాపతీ! అజ్ఞానప్రాయములగు శాస్త్రములచే మోహితుడనై యున్న నేను ఈ విషయమును తెలుసుకొనలేక ఈ నాటికీ శివమాయచే భ్రాంతిని పొందియున్నాను (4). నేను శివుని రెండు పాదముల జ్ఞానమనే అమృతము అనే మందును త్రాగి తొలగి పోయిన మోహము గలవాడను అయ్యే విధముగా (5), నీవు సుందరమైన నీ అమృతదయాదృష్టిని చిరకాలము ప్రసరింపజేసి, శోభాయుక్కములగు నీ పాదపద్మములను శరణు పొందియున్న నన్ను అనుగ్రహించుము (6). జ్ఞానశక్తిని ధరించియుండు ఆ ప్రభుడు ఆ మహర్షియొక్క ఈ వచనములను విని ఇతరదర్శనములకు మహాభయమును గొల్పే వచనమును ఇట్లు పలికెను (7).
సుబ్రహ్మణ్య ఉవాచ |
శ్రూయతాం మునిశార్దూల త్వయా యత్పృష్టమాదరాత్ |సమష్టివ్యష్టిభావేన పరిజ్ఞానం మహేశితుః || 8
ప్రణవార్థపరిజ్ఞానరూపం తద్విస్తరాదహమ్ | వదామి షడ్విధార్థైక్యపరిజ్ఞానేన సువ్రత || 9
ప్రథమో మంత్రరూపస్స్యాద్ద్వితీయో మంత్రభావితః | దేవతార్థస్తృతీయో%ర్థః ప్రపంచార్థస్తతః పరమ్ || 10
చతుర్థః పంచమార్థస్స్యాద్గురురూపప్రదర్శకః | షష్ఠశ్శిష్యాత్మరూపో%ర్థష్షడ్విధార్థాః ప్రకీర్తితాః || 11
తత్ర మంత్రస్వరూపం తే వదామి మునిసత్తమ | యేన విజ్ఞానమాత్రేణ మహాజ్ఞానీ భ##వేన్నరః || 12
ఆద్యస్స్వరః పంచమశ్చ పంచమాంతస్తతః పరః | బిందునాదౌ చ పంచార్ణాః ప్రోక్తా వేదైర్న చాన్యథా || 13
ఏతత్సమష్టిరూపో హి వేదాదిస్సముదాహృతః | నాదస్సర్వసమష్టిస్స్యాద్బింద్వాఢ్యం యచ్చతుష్టయమ్ || 14
వ్యష్టి రూపేణ సంసిద్ధం ప్రణవే శివవాచకే | యంత్రరూపం శృణు ప్రాజ్ఞ శివలింగం తదేవ హి || 15
సర్వాధస్తాల్లిఖేత్పీఠం తదూర్ధ్వం ప్రథమం స్వరమ్ | ఉవర్ణం చ తదూర్ధ్వస్థం పవర్గాంతం తదూర్ధ్వగమ్ || 16
తన్మస్తకస్థం బిందుం చ తదూర్ధ్వం నాదమాలిఖేత్ | యంత్రే సంపూర్ణతాం యాతే సర్వకామః ప్రసిధ్యతి || 17
సుబ్రహ్మణ్యస్వామి ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! మహేశ్వరుని సమష్టివ్యష్టిరూపముగా తెలుసుకొనుట అను విషయమును గురించి నీవు అడిగిన ప్రశ్నకు నేను చెప్పే సమాధానమును నీవు సాదరముగా వినుము (8). ఓ గొప్ప వ్రతము గలవాడా! నీవు అడిగిన విషయము, ఓంకారముయొక్క అర్థమును తెలియుట అను విషయము ఒక్కటియే. నేను ఆరు విధముల ఐక్యజ్ఞానముతో దానిని విస్తరముగా చెప్పుచున్నాను (9). వీటిలో మొదటి అర్థము మంత్రము, రెండవది యంత్రము, మూడవది దేవత, నాల్గవది ప్రపంచము, అయిదవది జ్ఞానమునిచ్చే గురువు, ఆరవది ఆత్మరూపుడగు శిష్యుడు అని ఈ ఆరు విషయములు చెప్పబడినవి (10.11). ఓ మహర్షీ! వాటిలో మంత్రస్వరూపమును గురించి నీకు చెప్పెదను. దీనిని తెలుసుకున్నంత మాత్రాన మానవుడు గొప్ప జ్ఞాని యగును (12). మొదటి అచ్చు (అ), అయిదవ అచ్చు (ఉ), అయిదవ వర్గయొక్క ఆఖరి అక్షరము (మకారము), బిందువు మరియు నాదము కలిసి ఓంకారము అగును. వేదములు ఓంకారమును ఈ విధముగా మాత్రమే వర్ణించుచున్నవి. దీనిలో మరియొక వికల్పము లేదు (13). వేదమునకు ఆదిలో నుండే ఈ ఓంకారము ఈ అయిదింటి కలయికయే. ఓంకారములోని నాదము సర్వము యొక్క సమష్టిస్వరూపము కాగా, బిందువుతో కలిసి ఉండే నాలుగు అంశములు శివుని బోధించే ఓంకారముయొక్క వ్యష్టిస్వరూపము అగుచున్నది. ఓ గొప్ప బుద్ధిశాలీ! ఇప్పుడు యంత్రముయొక్క స్వరూపమును వినుము. అదియే శివలింగము. అనగా శివునకు ప్రతీక (14,15). అన్నింటికంటె క్రిందుగా పీఠమును వ్రాయవలెను. దానిపైన మొదటి అచ్చు అగు ఆకారమును, దానిపైన ఉకారమును, దానిపైన పవర్గలోని ఆఖరి అక్షరమగు మకారమును, దాని శిరస్సుపై బిందువును, దానిపై నాదమును వ్రాయవలెను. ఈ విధముగా సంపూర్ణమగు యంత్రమును లిఖించినచో, కోరికలన్నియు ఈడేరును (16,17).
ఏవం యంత్రం సమాలిఖ్య ప్రణవేనైవ వేష్టయేత్ | తదుత్థేనైవ నాదేన విద్యాన్నాదావసానకమ్ || 18
దేవతార్థం ప్రవక్ష్యామి గూఢం సర్వత్ర యన్మునే | తవ స్నేహాద్వామదేవ యథా శంకరభావితమ్ || 19
సద్యోజాతం ప్రపద్యామీత్యుపక్రమ్య సదాశివమ్ | ఇతి ప్రాహ శ్రుతిస్తారం బ్రహ్మపంచకవాచకమ్ || 20
విజ్ఞేయా బ్రహ్మరూపిణ్యస్సూక్ష్మాః పంచైవ దేవతాః | ఏతా ఏవ శివస్యాపి మూర్తిత్వేనోపబృంహి తాః || 21
శివస్య వాచకో మంత్రశ్శివమూర్తేశ్చ వాచకః | మూర్తిమూర్తిమతోర్భేదో నాత్యంతం విద్యతే యతః || 22
ఈశానముకుటోపేత ఇత్యారభ్య పురోదితాః | శివస్య విగ్రహః పంచవక్త్రా ణి శృణు సాంప్రతమ్ || 23
పంచమాది సమారభ్య సద్యోజాతాద్యనుక్రమాత్ | ఊర్ధ్వాంతమీశానాంతం చ ముఖపంచకమీరితమ్ || 24
ఈశానసై#్యవ దేవస్య చతుర్వ్యూహపదే స్థితమ్ | పురుషాద్యం చ సద్యాంతం బ్రహ్మరూపం చతుష్టయమ్ || 25
పంచబ్రహ్మ సమష్టిస్స్యాదీశానం బ్రహ్మ విశ్రుతమ్ | పురుషాద్యం తు తద్వ్యష్టిస్సద్యోజాతాంతికం మునే || 26
అనుగ్రహమయం చక్రమిదం పంచార్థకారణమ్ | పరబ్రహ్మాత్మకం సూక్ష్మం నిర్వికారమనామయమ్ || 27
ఈ విధముగా యంత్రమును వ్రాసి దాని చుట్టూ ఓంకారమును మాత్రమే వ్రాయవలెను. ఓంకారమునుండి పుట్టే నాదముతోనే ఓంకారనాదము సమాప్తమగునని తెలియవలెను (18). ఓ మునీ! అన్నివిధములుగా రహస్యమైన దేవతాస్వరూపమును శంకరుడు బోధించియున్నాడు. ఓ వామదేవా! నీయందలి ప్రేమచే దానిని నీకు చెప్పెదను (19). 'సద్యోజాతమ్ ----' తో మొదలిడి 'సదాశివోమ్'వరకు వేదము అయిదు మంత్రములను స్పష్టముగా బోధించియున్నది (20). పరబ్రహ్మయొక్క సూక్ష్మస్వరూపములగు ఈ అయిదు దేవతలు శివుని సగుణమూర్తివిస్తారమేనని తెలియవలెను (21). మూర్తికి, ఆ మూర్తిని కలిగియున్న నిరాకార తత్త్వమునకు భేదము లేశ##మైననూ లేదు. కావున, నిరాకారుడగు శివుని బోధించు మంత్రము శివుని మూర్తివిస్తారమును కూడ బోధించును (22). శివుని శిరస్సు ఈశానుడు అని మొదలిడి పూర్వము శివుని స్వరూపమును నేను బోధించియున్నాను. ఇపుడు శివుని అయిదు ముఖములను గురించి వినుము (23). సద్యోజాతమ్ తో మొదలిడి ఈశానః వరకు అయిదు మంత్రములు గలవు. అయిదవ ముఖము అగు సద్యోజాతునితో మొదలిడి ఈ క్రమము అన్నింటి కంటె పైన ఈశానునితో పూర్తి యగును. ఈ విధముగా అయిదు ముఖములు వర్ణించబడినవి (24). తత్పురుషునితో మొదలై సద్యోజాతునితో అంతమయ్యే నాలుగు బ్రహ్మరూపములు ఈశానదేవుని చతుర్వ్యూహములో మాత్రమే భాగములగుచున్నవి (25). ఓ మునీ! ఈఅయిదు బ్రహ్మలు కలిసి సమష్టి యగును. తత్పురుషునితో మొదలై సద్యోజాతునితో అంతమయ్యే ఈశానబ్రహ్మ వ్యష్టి యనబడును (26). ఈ అయిదు తత్త్వముల చక్రము జగత్కారణము, సూక్ష్మము, వికారములు లేనిది మరియు వినాశము లేనిది యగు పరబ్రహ్మ యొక్క అనుగ్రహరూపమే (27)
అనుగ్రహో%పి ద్వివిధస్తిరోభావాదిగోచరః | ప్రభుశ్చాన్యస్తు జీవానాం పరావరవిముక్తిదః || 28
ఏతత్సదా శివసై#్యవ కృత్యద్వయముదాహృతమ్ | అనుగ్రహే%పి సృష్ట్యాదికృత్యానాం పంచకం విభోః || 29
మునే తత్రాపి సద్యాద్యా దేవతాః పరికీర్తితాః | పరబ్రహ్మస్వరూపాస్తాః పంచ కల్యాణదాస్సదా || 30
అనుగ్రహమయం చక్రం శాంత్యతీతకళామయమ్ | సదాశివాధిష్ఠితం చ పరమం పదముచ్యతే || 31
ఏతదేవ పదం ప్రాప్యం యతీనాం భావితాత్మనామ్ | సదాశివోపాసకానాం ప్రణవాసక్తచేతసామ్ || 32
ఏతదేవ పదం ప్రాప్య తేన సాకం మునీశ్వరాః | భుక్త్వా సువిపులాన్ భోగాన్ దేవేన బ్రహ్మరూపిణా || 33
మహాప్రలయసంభూతౌ శివసామ్యం భజంతి హి | న పతంతి పునః క్వాపి సంసారాబ్ధౌ జనాశ్చ తే || 34
తే బ్రహ్మలోక ఇతి చ శ్రుతిరాహ సనాతనీ | ఐశ్వర్యం తు శివస్యాపి సమష్టిరిదమేవ హి || 35
సర్వైశ్వర్యేణ సంపన్న ఇత్యాహాథర్వణీ శిఖా | సర్వైశ్వర్యప్రదాతృత్వమసై#్యవ ప్రవదంతి హి || 36
చమకస్య పదాన్నాన్యదధికం విద్యతే పదమ్ | బ్రహ్మపంచకవిస్తారప్రపంచఃఖలు దృశ్యతే || 37
బ్రహ్మభ్య ఏవం సంజాతా నివృత్త్యాద్యాః కలా మతాః | సూక్ష్మభూతస్వరూపిణ్యః కారణత్వేన విశ్రుతాః || 38
స్థూలరూపస్వరూపస్య ప్రపంచస్యాస్య సువ్రత | పంచధా%వస్థితం యత్తద్ర్బా హ్మపంచకమిష్యతే || 39
అనుగ్రహము కూడ ఆవిర్భావము (ప్రకటమగుట) మరియు తిరోభావము (కారణములో విలీనమగుట) అని ద్వివిధముగా నున్నది. జీవులకు పరమముక్తిని మరియు దానికంటె తక్కువ స్థాయికి చెందిన ముక్తిని ఇచ్చే ఆ ప్రభుడు జీవులకంటె భిన్నముగా నున్నాడు (28). ఆ ప్రభుని సృష్టి- స్థితి- లయ- తిరోధాన - అనుగ్రహములనే అయిదు కార్యములలో ఈ రెండు కార్యములను సర్వదా శివుడు మాత్రమే చేయునని చెప్పబడినది (29). ఓ మునీ! సద్యోజాతుడు మొదలగు అయిదుగురు దేవతలు సర్వకాలములలో కల్యాణములనొసంగే పరబ్రహ్మయొక్క స్వరూపములేనని చెప్పబడినది (30). శాంతికి అతీతమైన కళతో గూడియున్నది, సదాశివునచే అధిష్ఠించబడియున్నది అగు అనుగ్రహమయమగు చక్రమునకు పరమపదము అని పేరు (31). శుద్ధమగు అంతఃకరణము గలవారు, సదాశివుని ఉపాసించువారు, ఓంకారమునందు లగ్నమైన మనస్సు గలవారు అగు యతులు పొందే ధామము ఇదియే (32). మహర్షులు ఈ ధామమును మాత్రమే పొంది, బ్రహ్మరూపములోనున్న ఆ పరమేశ్వరునితో కూడి చాల గొప్ప భోగములను అనుభవించి (33), మహాప్రలయము సంభవించినప్పుడు శివునితో సమానమగు స్థాయిని పొందెదరు. అట్టి జనులు మరల సంసారసముద్రములో ఎక్కడైననూ పడే ప్రసక్తి లేదు (34). ఈ విషయమునే 'తే బ్రహ్మలోకే తు ----' అనే వేదవాక్యము చెప్పుచున్నది. ఈ సమష్టియే శివుని ఐశ్వర్యమని కూడ చెప్పబడును (35). 'సర్వైశ్వర్యేణ సంపన్నః (సమస్తమైన ఐశ్వర్యముతో కూడియున్నవాడు)' అని అథర్వవేదములోని ఉపనిషత్తు చెప్పుచున్నది. సకలైశ్వర్యములనిచ్చువాడు శివుడేనని మహర్షులు చెప్పుచున్నారు (36). శివుని ధామముకంటె ఉత్కృష్టమైన ధామము మరియొకటి లేదని చమకాధ్యాయము బోధించుచున్నది. ఈ కంటికి కనబడే ప్రపంచము అయిదు బ్రహ్మల విస్తారమే (37). సూక్ష్మభూతముల రూపములో జగత్కారణములగు నివృత్తి మొదలగు కళలు ఈ అయిదు బ్రహ్మలనుండి మాత్రమే పుట్టినవని చెప్పెదరు (38). ఓ గొప్ప వ్రతము గలవాడా! ఈ అయిదు బ్రహ్మలు ఈ ప్రపంచములో అయిదు స్థూలభూతముల రూపములో వ్యాపించి యున్నారు (39).
పురుషః శ్రోత్రవాణ్యౌ చ శబ్దాకాశౌ చ పంచమమ్ | వ్యాప్తమీశానరూపేణ బ్రహ్మణా మునిసత్తమ || 40
ప్రకృతిస్త్వక్చ పాణిశ్చ స్పర్శో వాయుశ్చ పంచకమ్ | వ్యాప్తం పురుషరూపేణ బ్రహ్మణౖవ మునీశ్వర|| 41
అహంకారస్తథా చక్షుఃపాదౌ రూపం చ పంచకః | అఘోరబ్రహ్మణా వ్యాప్తమేతత్పంచకమంచితమ్ || 42
బుద్ధిశ్చ రసనా పాయూ రస ఆపశ్చ పంచకమ్ | బ్రహ్మణా వామదేవేన వ్యాప్తం భవతి నిత్యశః || 43
మనో నాసా తథోపస్థోగంధో భూమిశ్చ పంచకమ్ | సద్యేన బ్రహ్మణా వ్యాప్తం పంచబ్రహ్మమయం జగత్ || 44
యంత్రరూపేణోపదిష్టః ప్రణవశ్శివవాచకః | సమష్టిః పంచవర్ణానాం బింద్వాద్యం యచ్చతుష్టయమ్ || 45
శివోపదిష్టమార్గేణ యంత్రరూపం విభావయేత్ | ప్రణవం పరమం మంత్రాధిరాజం శివరూపిణమ్ || 46
ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం పంచబ్రహ్మవర్ణనం నామ చతుర్దశో%ధ్యాయః (14).
ఓ మహర్షీ! పురుషుడు, చెవి, వాక్కు, శబ్దము, ఆకాశము అనే అయిదు ఈశానుని రూపములో నున్న పరబ్రహ్మచే వ్యాపించబడియున్నవి (40). ఓ మహర్షీ! ప్రకృతి, చర్మము, చేతులు, స్పర్షేంద్రియము, వాయువు అనే అయిదు తత్పురుషరూపములోనున్న బ్రహ్మచే వ్యాపించబడి యున్నవి (41). అహంకారము, కన్ను, పాదములు, రూపము, అగ్ని అనే సుందరమగు ఐదు అఘోరబ్రహ్మచే వ్యాప్తమై యున్నవి (42). బుద్ధి, జిహ్వ, విసర్జనేంద్రియము, రసము, నీరు అనే ఐదు వామదేవబ్రహ్మచే నిత్యము వ్యాప్తమై యున్నవి (43). మనస్సు, నాసిక, జననేంద్రియము, గంధము, భూమి అనే ఐదు సద్యోజాతబ్రహ్మచే వ్యాప్తమై యున్నవి. ఈ విధముగా జగత్తు అంతయు ఈ ఐదు బ్రహ్మల స్వరూపమై యున్నది (44). శివుని బోధించే ఓంకారము యంత్రరూపములో బోధించబడినది. దానిలోని అయిదు వర్ణములు కలిసి సమష్టి యగును. బిందువుతో మొదలయ్యే నాలుగు వర్ణములు యంత్రముయొక్క రూపము అగునని శివుడు ఉపదేశించిన విధానములో నున్నది. మంత్రములలో సర్వోత్తమమైన ఓంకారము శివుని స్వరూపమే (45, 46).
శ్రీ శివమహాపురాణములో కైలాససంహితయందు పంచబ్రహ్మవర్ణనమనే పదునాల్గవ అధ్యాయము ముగిసినది (14).