Siva Maha Puranam-4
Chapters
అథ షోడశోధ్యాయః శివతత్త్వముల వర్ణనము సూత ఉవాచ | శ్రుత్వోపదిష్టం గురుణా వేదార్థం మునిపుంగవః | పరమాత్మని సందిగ్ధం పరిపప్రచ్ఛ సాదరమ్ || 1 సూతుడు ఇట్లు పలికెను - శివునిచే ఉపదేశింపబడిన వేదార్థమును విని ఆ మహర్షి పరమాత్మ విషయములో తనకు గల సందేహమును సాదరముగా ఇట్లు ప్రశ్నించెను (1). వామదేవ ఉవాచ | జ్ఞానశక్తిధర స్వామిన్ పరమానందవిగ్రహ | ప్రణవార్థామృతం పీతం శ్రీముఖాబ్జాత్పరిస్రుతమ్ || 2 దృఢప్రజ్ఞశ్చ జాతో%స్మి సందేహో విగతో మమ | కించిదన్యన్మహాసేన పృచ్ఛామి త్వాం శృణు ప్రభో || 3 సదాశివాదికీటాంతరూపస్య జగతః స్థితిః | స్త్రీ పుంరూపేణ సర్వత్రం దృశ్యతే న హి సంశయః || 4 ఏవం రూపస్య జగతః కారణం యత్సనాతనమ్ | స్త్రీ రూపం తత్కిమాహోస్విత్పురుషో వా నపుంసకమ్ || 5 ఉత మిశ్రం కిమన్యద్వాన జాతస్తత్ర నిర్ణయః | బహుధా వివదంతీహ విద్వాంసశ్శాస్త్ర మోహితాః || 6 జగత్సృష్టివిధాయిన్యః శ్రుతయో జగతా సహ | విష్ణు బ్రహ్మాదయో దేవాస్సిద్ధాశ్చ న విదంతి హి || 7 యథైక్యభావం గచ్ఛేయురేతదన్యచ్చ వేదయ | జానామీతి కరోమీతి వ్యవహారః ప్రదృశ్యతే || 8 స హి సర్వాత్మసంసిద్ధో వివాదో నాత్ర కస్యచిత్ | సర్వదేహేంద్రియమనోబుద్ధ్యహంకారసంభవః || 9 ఆహోస్విదాత్మనో రూపం మహానత్రాపి సంశయః | ద్వయమేతద్ధి సర్వేషాం వివాదాస్పదమద్భుతమ్ || 10 ఉత్పాట్యాజ్ఞానసంభూతం సంశయాఖ్యం విషద్రుమమ్ | శివాద్వైతమహావల్పవృక్షభూమిర్యథా భ##వేత్ || 11 చిత్తం మమ యథా దేవ బోధ్యో%స్మి కృపయా తవ | కృపాతస్తవ దేవేశ దృఢజ్ఞానీ భవామ్యహమ్ || 12 వామదేవుడు ఇట్లు పలికెను - జ్ఞానశక్తిని ధరించియున్న ఓ కుమారస్వామీ! నీవు ఆనందస్వరూపుడవు. శోభాయుతమగు నీ ముఖపద్మమునుండి జాలువారిన ఓంకారార్థము అనే అమృతమును నేను పానము చేసితిని (2). నాకు దృఢమైన జ్ఞానము కలిగినది. నా సందేహము తొలగి పోయినది. ఓ మహాసేనాపతీ! నేను నిన్ను మరియొక ప్రశ్నను అడిగెదను. ప్రభూ! వినుము (3). సదాశివునితో మొదలిడి కీటమువరకు గల జగత్తులోని సర్వప్రాణులు స్త్రీ పురుషరూపములలో కనబడుచున్నవనుటలో సందేహము లేదు (4). ఈ రూపములలో కానవచ్చే జగత్తునకు కారణమైన సనాతనతత్త్వము స్త్రీయా? పురుషుడా? లేక నవుంసకుడా? (5). లేక, వీటి కలయికయగు మరియొకటియా? ఈ విషయములో నాకు నిర్ణయము కలుగకున్నది. శాస్త్రములచే మోహితులై యున్న పండితులు ఈ విషయములో పలురకముల వాదవివాదములను చేయుచున్నారు (6). జగత్తులోని జనులు, జగత్తుయొక్క సృష్టిని బోధించే శ్రుతలు, విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలు మరియు సిద్ధులు కూడ దీనిని తెలియకున్నారు (7). ఈ వాదములన్నియు ఏ సత్యమునందు విలీనమగునో, ఆ సత్యమును తెలుపుడు చేయుము. 'నేను తెలుసుకొనుచున్నాను, నేను చేయుచున్నాను' అనే లోకవ్యవహారముకానవచ్చుచున్నది (8). ఈ అనుభవము అందరకీ సమముగనే యున్నది. దీని విషయములో ఎవరికైననూ వివాదము లేదు. ఆత్మ యనగా సర్వ ప్రాణులయొక్క దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము అనునవియేనా? లేక, ఆత్మయొక్క గొప్ప స్వరూపము ఒకటి గలదా? అను విషయములో కూడ నాకు సంశయము గలదు. ఈ రెండు అంశములు సర్వులకు వివాదాంశములుగా నుండుట చాల అద్భుతము (9, 10) ఓ దేవా! అజ్ఞానమునుండి పుట్టే సంశయము అనే విషపు చెట్టును పీకివేసి, నా మనస్సు శివాద్వైతమనే గొప్ప కల్పవృక్షముయొక్క నివాసస్థానము అగునట్లుగా నీవు దయచేసి నాకు బోధించుము. ఓ దేవదేవా! నీ దయ వలన నేను దృఢమగు జ్ఞానము గలవాడను అగుదును (11, 12). సూత ఉవాచ | శ్రుత్వైవం మునినా పృష్టం వచో వేదాంతనిర్వృతమ్ | రహస్యం ప్రభురాహేదం కించిత్ర్పహసితాననః || 13 ఈ విధముగా వేదాంతవిషయములతో నిండియున్న మహర్షియొక్క ప్రశ్నను విని ఆ ప్రభువు చిరునవ్వుతో వికసించిన మోము గలవాడై ఆ వేదాంతరహస్యములనీ విధముగా చెప్పెను (13). బ్రహ్మణ్య ఉవాచ | ఏతదేవ మునే గుహ్యం శివేన పరిభాషితమ్ | అంబాయాః శృణ్వతో దేవ్యా వామదేవ మమాపి హి || 14 తస్యాః స్తన్యం తదా పీత్వా సంతృప్తో %స్మి ముహుర్ముహుః | శ్రుతవాన్నిశ్చలం తద్వై నిశ్చితం మే విచారితమ్ || 15 తత్తే వదామి దయయా వామదేవ మహామునే | మహద్గుహ్యం చ పరమం సుత త్వంశృణు సాంప్రతమ్ || 16 కర్మాస్తి తత్త్వాదారభ్య శాస్త్ర వాదస్సువిస్తరః | యథావివేకం శ్రోతవ్యో జ్ఞానినా జ్ఞానదో మునే || 17 త్వయోపదిష్టా యే శిష్యాస్తత్ర కో వా భవత్సమః | కాపిలాదిషు శాస్త్రే షు భ్రమంత్యద్యాపి తే %ధమాః ||18 తే శప్తా మునిభిష్షడ్భిశ్శివనిందాపరాః పురా | న శ్రోతవ్యా హితద్వార్తా తే %న్యథావాదినో యతః || 19 అనుమానప్రయోగస్యాప్యవకాశో న విద్యతే | పంచావయవయుక్తస్య స తుధూమస్య దర్శనాత్ || 20 పర్వతస్యాగ్నిమద్భావం వదంత్యత్రాపి సువ్రత | ప్రత్యక్షస్య ప్రపంచస్య దర్శనాలంబనం త్వతః || 21 జ్ఞాతవ్యః పరమేశానః పరమాత్మా న సంశయః | స్త్రీ పుంరూపమయం విశ్వం ప్రత్యక్షేణౖవ దృశ్యతే || 22 షట్ కోశరూపః పిండో హి తత్ర చాద్యత్రయం భ##వేత్ | మాత్రంశజం పునశ్చాన్యత్పిత్రంశజమితి శ్రుతిః || 23 సుబ్రహ్మణ్యస్వామి ఇట్లు పలికెను - ఓ మునీ! ఇదే రహస్యమును శివుడు పార్వతీమాత వినుచుండగా చెప్పెను. ఓ వామదేవా! ఆ సమయములో ఆమెయొక్క స్తన్యమును పలుమార్లు త్రాగిసంతృప్తిని చెందియున్న నేను కూడా నిశ్చలముగానుండి ఉపదేశమును వినియుంటిని, దాని వలన నాకు జ్ఞాననిష్ఠ కలిగినది (14, 15). ఓ వామదేవ మహర్షీ! నేను ఆ విషయములను మాత్రమే దయతో నీకు చెప్పెదను. ఓ కుమారా! ఆ పరమతత్త్వమును గొప్ప రహస్యము. దానిని ఇప్పుడు నీవు వినుము (16). ఓ మునీ! ఫలమునిచ్చే కర్మ గలదు అనే తత్త్వముతో నారంభించి శాస్త్రములలో విస్తారమగు చర్చలు గలవు. జ్ఞానదాయకమగు మీమాంసను జ్ఞాని వివేకపూర్వకముగా శ్రవణము చేయవలెను (17). నీవు ఉపదేశించిన శిష్యులలో నీతో సమమైనవాడు ఎవడు గలడు? ఆ అధములు ఈ నాటికీ కాపిలసాంఖ్యము మొదలగు శాస్త్ర ములయందు భ్రమించుచున్నారు (18). శివనిందయందు ఆసక్తి గల ఆ శిష్యులను పూర్వము ఆరుగురు మహర్షులు శపించినారు. వారు అసత్యవాదులు గనుక, వారి ప్రసంగమును వినరాదు (19). ఈ విషయములో అనుమాన ప్రమాణము (ఒక వస్తువును చూచి దానితో సంబద్ధమై యుండే మరియొక వస్తువుయొక్క ఉనికిని నిశ్చయించుట) ను వినియోగించి నిశ్చయించే ఆవకాశము లేదు. కొండపై పొగను చూచి నిప్పు ఉన్నదని నిశ్చయించుట అనుమానమనబడును. ఓ గొప్ప వ్రతము గలవాడా! ఈ అనుమానమునందు ప్రతిజ్ఞ, హేతువు, ఉవాహరణము, ఉపనయనము మరియు నిగమనము అనే అయిదు అంశములు ఉండును. మనమీ ప్రపంచమును కంటితో చూచి తెలియగల్గుచున్నాము గనుక, అది ప్రత్యక్షప్రమాణగమ్యము ఆగుచునే యున్నది (20, 21). సర్వమునకు ఆత్మయగు పరమేశ్వరుని తెలియవలసిన ఆవశ్యకత నిశ్చయముగా గలదు. ఈ జగత్తులోని ప్రాణులు స్త్రీ మరియు పురుషరూపములో గలరని మనకు ప్రత్యక్షముగా తెలయుచునే యున్నది (22). పిండమునందు ఆరు కోశములు గలవనియు, వాటిలో మూడు తల్లియొక్క అంశనుండి పుట్టినవనియు, మిగిలిన మూడు తండ్రియొక్క అంశనుండి పుట్టుననియు శ్రుతి చెప్పుచున్నది. (23). ఏవం సర్వశరీరేషు స్త్రీ పుంభావవిదో జనాః | పరమాత్మన్యపి మునే స్త్రీ పుంభావం విదుర్బుధాః || 24 సచ్చిదానందరూపత్వం వదతి బ్రహ్మణః శ్రుతిః | అసన్నివర్తకశ్శబ్దస్సదాత్మేతి నిగద్యతే || 25 నివర్తనం జడత్వస్య చిచ్ఛబ్దేన విధీయతే | త్రిలింగవర్తీ సచ్ఛబ్దః పురుషో%త్ర విధీయతామ్ || 26 ప్రకాశవాచీ స భ##వేత్సప్రకాశ ఇతి స్ఫుటమ్ | జ్ఞానశబ్దస్య పర్యాయశ్చిచ్ఛబ్దః స్త్రీ త్వమాగతః || 27 ప్రకాశశ్చిచ్చ మిథునం జగత్కారణతాం గతమ్ | సచ్చిదాత్మన్యపి తథా జగత్కారణతాం గతే || 28 ఏకత్రై వ శివశ్శక్తిరితి భావో విధీయతే | తైలవర్త్యాదిమాలిన్యాత్ర్పకాశస్యాపి వర్తతే || 29 మాలిన్యమశివత్వం చ చితాగ్న్యాదిషు దృశ్యతే | ఏవం నివర్తకత్వేన శివత్వం శ్రుతిచోదితమ్ || 30 జీవాశ్రితాయాశ్చిచ్ఛక్తేర్దౌర్బల్యం విద్యతే సదా | తన్నివృత్త్యర్థమేవా త్ర శక్తిత్వం సార్వకాలికమ్ || 31 బలవాన్ శక్తిమాంశ్చేతి వ్యవహారః ప్రదృశ్యతే | లోకే వేదే చ సతతం వామదేవ మహామునే || 32 ఏవం శివత్వం శక్తిత్వం పరమాత్మని దర్శితమ్ | శివశక్త్యోస్తు సంయోగాదానందస్సతతోదితః || 33 ఓ మునీ! ఈ విధముగా శరీరములన్నింటియందు స్త్రీ పురుషలక్షణములను చూచి విద్వాంసులగు జనులు పరమాత్మయందు కూడా స్త్రీ పురుషభేదమును భావన చేయుచున్నారు (24). బ్రహ్మ సచ్చిదానందరూపమని వేదము చెప్పుచున్నది. సత్ అను పదము ఆత్మయందు అభావము (లేకుండుట) ను త్రోసిపుచ్చును. కావుననే, ఉనికి ఆత్మయే (ఆత్మా సత్ ) అని చెప్పబడుచున్నది (25). ఆత్మయందు జడత్వమును చిత్ అను శబ్దము త్రోసిపుచ్చుచున్నది. సత్ అను శబ్దము మూడు లింగములయందు గలదు. కాని ఈ సందర్భములో అది పురుషుని బోధించును (26). చిత్ అనగా ప్రకాశము అను అర్తము గలదు. కావున, ఆత్మ స్వయంప్రకాశమని స్పష్టమగుచున్నది. జ్ఞానము అనే అర్థము గల చిత్ స్త్రీ లింగశబ్దము (27). ప్రకాశము, చైతన్యము అనే జంట జగత్తునకు కారణమగుచున్నది. కావున సచ్చిదాత్మా ఈ విధముగా జగత్కారణమగుచున్నది (28). ఒకే ఆత్మతత్త్వమునందు శివుడు మరియు శక్తి అనే రెండు భావములను శ్రుతి బోధించుచున్నది. నూనె, వత్తి మొదలగు వాటి మాలిన్యము వలన ప్రకాశమునకు కూడ మాలిన్యము గలదు. శ్మశానాగ్ని మొదలగు వాటియందు ప్రకాశమునకు అమంగళకరత్వము మనకు తెలియుచునే యున్నది. ఈ లక్షణములను త్రోసిపుచ్చి వేదము భగవానునియందు మంగళకరత్వమును బోధించుచున్నది (29, 30). జీవునకు ఆశ్రయమైన చైతన్యశక్తి సర్వదా దుర్బలముగా నుండును. మోక్షమనగా ఆ దౌర్బల్యమునకు అతీతముగా సర్వకాలములయందు శక్తిని కలిగియుండుటయే గదా! (31) ఓ వామదేవ మహర్షీ! లోకమునందు మరియు వేదమునందు బలవంతుడు మరియు శక్తిమంతుడు అను వ్యవహారము సర్వకాలములలో గలదు (32). అదే విధముగా, పరమాత్మయందు శివశక్తితత్త్వములు రెండు గలవని వేదమునందు నిరూపించబడినది. సర్వదా శివశక్తుల సమ్మేళనముచే ఆనందము పుట్టును (33). అతో మునే తముద్దిశ్య మునయః క్షీణకల్మషాః | శివే మనస్సమాదాయ ప్రాప్తాశ్శివమనామయమ్ || 34 సర్వాత్మత్వం తయోరేవం బ్రహ్మేత్యుపనిషత్సుచ | గీయతే బ్రహ్మవబ్దేన బృంహిధాత్వర్థగోచరమ్ || 35 బృంహణత్వం బృహత్త్వం చ సదా శంభ్వాఖ్యవిగ్రహే | పంచబ్రహ్మమయే విశ్వప్రతీతిర్ర్బ హ్మశబ్దితా || 36 ప్రతిలోమాత్మకం హంసే వక్ష్యామి ప్రణవోద్భవమ్ | తవ స్నేహాద్వామదేవ సావధానతయా శృణు || 37 వ్యంజనస్య సకారస్య హకారస్య చ వర్జనాత్ | ఓమిత్యేవ భ##వేత్ స్థూలో వాచకః పరమాత్మనః || 38 మహామంత్రస్స విజ్ఞేయో మునిభిస్తత్త్వదర్శిభిః | తత్ర సూక్ష్మో మహామంత్రస్తదుద్ధారం వదామి తే || 39 ఆద్యే త్రపంచరూపే చ స్వరే షోడశ##కే త్రిషు | మహామంత్రో భ##వేదాదౌ ససకారో భ##వేద్యదా || 40 హంసస్య ప్రతిలోమస్స్యాత్సకారార్థశ్శివస్స్మృతః | శక్త్యాత్మకో మహామంత్రవాచ్యస్స్యాదిత నిర్ణయః || 41 గురూపదేశకాలే తు సోమం శక్త్యాత్మకశ్శివః | ఇతి జీవపరో భూయాన్మహామంత్రస్తదా పశుః || 42 శక్త్యాత్మకశ్శివాంశశ్చ శివైక్యాచ్ఛివసామ్యభాక్ | ప్రజ్ఞానం బ్రహ్మవాక్యే తు ప్రజ్ఞానార్థః ప్రదర్శితః || 43 ప్రజ్ఞానశబ్దశ్చైతన్యపర్యాయస్య్యాన్న సంశయః | చైతన్యమాత్మేతి మును శివసూత్రం ప్రవర్తితమ్ || 44 ఓ మునీ! కావుననే, తొలగిపోయిన పాపములు గల మహర్షులు శివునియందు మనస్సును ఏకాగ్రము చేసి, ఆయనను ఉద్దేశించి తపస్సును చేసి, దోషరహితమైన శివస్థానమును పొందిరి (34). ఈ విధముగా శివపార్వతుల సర్వాత్మభావము (సర్వమునకు ఆత్మయై ఉండుట) ను ఉపనిషత్తులు బ్రహ్మశబ్దముచే ప్రతిపాదించుచున్నవి. ఈ బ్రహ్మశబ్దము బృంహిధాతువునుండి పుట్టినది. ఆ ధాతువునకు వ్యాపకత్వము, విశాలత్వము అను అర్థములు గలవు. కావున ఆ ధాతువునుండి పుట్టిన బ్రహ్మ శబ్దము ఆ రెండు అర్థములను నిత్యము కలిగియున్న శంభుని బోధించును. సద్యోజాతాది పందబ్రహ్మలతో కూడియున్న శంభుని మూర్తిని సర్వదా బ్రహ్మశబ్దము బోధించును. అట్టి శంభునియందు మాత్రమే ఈ జగత్తు భాసించుచున్నది (45, 36). ఓ వామదేవా! హంస శబ్దమును తల్లక్రిందులుగా ఉచ్చరించినప్పుడు ఓంకారము పుట్టిన విధమును గురించి నీయందు నాకు గల ప్రేమచే చెప్పుచున్నాను. సావధానముగా వినుము (37). సోహమ్ నుండి సకారహకారములనే హల్లులను తీసివేసినచో ఓమ్ మిగలును. ఈ స్థూలమగు ఓంకారము పరమాత్మను బోధించును (38). ఇది మహామంత్రమని తత్త్వవేత్తలగు మునులు తెలియదగును. ఇంతేగాక, హంసయందు సూక్ష్మమగు మహామంత్రము కూడ గలదు. దాని స్వరూపమును నీకు నేను చెప్పుచున్నాను (39). సకారము, విసర్గ (పదునారవ అచ్చు), అకారము (మొదటి అచ్చు), హకారము మరియు అనుస్వారము (పదునైదవ అచ్చ) కలిసి సో%హమ్ (సః అహమ్ ) అనే మహామంత్రము ఏర్పడినది (40). ఇది హంసః అను శబ్దమునకు తల్లక్రిందులుగా నున్నది. దీనిలో సకారము శివుని బోధించును. ఈ మహామంత్రము శక్తిస్వరూపుడగు పరమాత్మను బోధించునని నిర్ణయము చేయబడినది (41). గురువు ఉపదేశించిన కాలములో సో%హమ్ అను మహామంత్రము జీవరూపములోనున్న శక్తిస్వరూపుడగు శివుని బోధించును. అపుడు జీవుడు శక్తిస్వరూపుడు మరియు శివాంశ గలవాడై శివునితో ఐక్యమును పొంది, ఆ కారణముగా శివునితో సమానుడగును. ప్రజ్ఞానం బ్రహ్మ అను మహావాక్యములో ప్రజ్ఞానశబ్దమునకు చైతన్యము అని యర్థము అనుటలో సందేహము లేదు. ఓ మునీ! చైతన్యము ఆత్మయేనను శివసూత్రము దీనినుండియే ప్రవర్తిల్లినది (42- 44). చైతన్యమితి విశ్వస్య సర్వజ్ఞానక్రియాత్మకమ్ | స్వాతంత్ర్యం తత్స్వభావో యస్స ఆత్మా పరికీర్తితః || 45 ఇత్యాది శివసూత్రాణాం వార్తికం కథితం మయా | జ్ఞానం బంధ ఇతీదం తు ద్వితీయం సూత్రమీశితుః || 46 జ్ఞానమిత్యాత్మనస్తస్య కించిత్ జ్ఞానక్రియాత్మకమ్ | ఇత్యాహాద్యదేనేశః పశువర్గస్య లక్షణమ్ || 47 ఏతద్ద్వయం పరాశ##క్తేః ప్రథమం స్పందతాం గతమ్ | ఏతామేవ పరాం శక్తిం శ్వేతాశ్వతదశాఖినః || 48 స్వాభావికీ జ్ఞానబలక్రియా చేత్యస్తువన్ముదా | జ్ఞానక్రియేచ్ఛారూపం హి శంభోర్దృష్టిత్రయం విదుః || 49 ఏతన్మనోమధ్యగం సదింద్రియజ్ఞానగోచరమ్ | అనుప్రవిశ్య జానాతి కరోతి చ పశుస్సదా || 50 తస్మాదాత్మన ఏవేదం రూపమిత్యేవ నిశ్చితమ్ | ప్రపంచార్థం ప్రవక్ష్యామి ప్రణవైక్యప్రదర్శనమ్ || 51 ఓమితీదం సర్వమితి శ్రుతిరాహ సనాతనీ | తస్మాద్వేతీత్యుపక్రమ్య జగత్సృష్టిః ప్రకీర్తితా || 52 తస్యాః శ్రుతేస్తు తాత్పర్యం వక్ష్యామి శ్రూయతామిదమ్ | తవ స్నేహాద్వామదేవ వివేకార్థవిజృంభితమ్ || 53 ఈ జగత్తులోని క్రియాశక్తి జ్ఞానశక్తులు ఆన్నియు చైతన్యమే. స్వాతంత్ర్యము (మోక్షము) దాని స్వరూపము. అదియే ఆత్మయని కీర్తించబడుచున్నది (45). ఈ విదముగా నేను శివసూత్రమునకు వార్తికమును చెప్పియున్నాను. జ్ఞానము బంధః (జ్ఞానమే బంధము) అనునది రెండవ శివసూత్రము (46). జీవులకు గల జ్ఞానక్రియశక్తులు అల్పములు మాత్రమేనను జీవలక్షణమును ఈ సూత్రములోని మొదటి పదము (జ్ఞానము) లో శివుడు నిర్దేశించినాడు (47). ఈ జ్ఞానక్రియాశక్తులు రెండు పరాశక్తి యొక్క మొట్టమొదటి చలనము మాత్రమే. స్వాభావికీ జ్ఞానబలక్రియా చ (జ్ఞానక్రయిశక్తులు ఆ పరాశక్తియొక్క స్వరూపములు) అను మంత్రములో శ్వేతాశ్వతరశాఖాధ్యాయులగు బుషులు ఈ పరాశక్తిని మాత్రమే ఆనందముతో స్తుతించినారు. జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అనునవి శంభుని మూడు కన్నులు అని మహర్షులు చెప్పుచున్నారు (48, 49). ఈ మూడు శక్తులు మనస్సులో మరియు తద్ద్వారా ఇంద్రియములలో ప్రవేశించి ఉద్దీపింపజేయుట చేతనే వాటికి జ్ఞానక్రియాశక్తులు ఏర్పడినవి. అందువలననే, జీవుడు సర్వకాలములలో జ్ఞానేంద్రియముల ద్వారా తెలుసుకొని, కర్మేంద్రియముల ద్వారా పనులను చేయుచున్నాడు (50). కావున, ఈ రెండు శక్తులు ఆత్మయొక్క స్వరూపము మాత్రమేనని నిశ్యించబడినది. నేను ఇప్పుడు ప్రపంచస్వరూపమును, అది ఓంకారములో విలీనమయ్యే విధానమును వివరించెదను (51). ఓమితీదం సర్వమ్ (ఈ సర్వజగత్తు ఓంకారమే) అని సనాతనమగు వేదవాక్కు బోధించుచున్నది. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశస్సంభూతః (ఆ ఈ ఆత్మనుండి ఆకాశము పుట్టినది ) అని వేదము జగత్తు సృష్టించబడిన విధమును చెప్పుచున్నది (52). ఓ వామదేవా! నీయందలి ప్రేమచే నిత్యనిత్యవస్తువివేకముయొక్క సారముతో నిండియున్న ఆ వేదవాక్యముయొక్క తాత్పర్యమును బోధించెదను. దీనిని వినుము (53). శివశక్తిసమాయోగః పరమాత్మేతి నిశ్చితమ్ | పరాశ##క్తేస్తు సంజాతా చిచ్ఛక్తిస్తు తదుద్భవా || 54 ఆనందశక్తిస్తజ్జా స్యాదిచ్ఛాశక్తిస్తదుద్భవా | జ్ఞానశక్తిస్తతో జాతా క్రియాశక్తిస్తు పంచమీ | ఏతాభ్య ఏవ సంజాతా నివృత్త్యాద్యాః కలా మునే || 55 చిదానందసముత్పన్నౌ నాదబిందూ ప్రకీర్తితౌ | ఇచ్చాశ##క్తేర్మకారస్తు జ్ఞానక్తేస్తు పంచమః|| 56 స్వరః క్రియాశక్తిజాతో హ్యకారస్తు మునీశ్వర | ఇత్యుక్తా ప్రణవోత్పత్తిః పంచబ్రహ్మోద్భవం శృణు || 57 శివాదీశాన ఉత్పన్నస్తతస్తత్పురుషోద్భవః | తతో%ఘోరస్తతో వామస్సద్యోజాతోద్భవస్తతః || 58 ఏతస్మాన్మాతృకాదష్టత్రింశన్మాతృసముద్భవః | ఈశానాచ్ఛాత్యతీతాఖ్యా కలా జాతా%థ పూరుషాత్ | 59 ఉత్పద్యతే శాంతికలా విద్యా%ఘోరసముద్భవా || ప్రతిష్ఠా చ నివృత్తిశ్చ వామసద్యోద్భవే మతే | ఈశాచ్చిచ్ఛక్తిముఖతో విభోర్మిథునపంచకమ్ || 60 అనుగ్రహాదికృత్యానాం హేతుః పంచకమిష్యతే | తద్విద్భిర్మునిభిః ప్రజ్ఞైర్వరతత్త్వ ప్రదర్శిభిః || 61 వాచ్యవాచకసంబంధాన్మిథునత్వముపేయుషి | కలావర్ణస్వరూపే%స్మిన్ పంచకే భూతపంచకమ్ || 62 వియదాదిక్రమాదాసీదుత్పన్నం మునిపుంగవ | ఆద్యం మిథునమారభ్య పంచమం యన్మయం విదుః || 63 పరమాత్మయందు శివశక్తుల సమావేశము గలదను విషయము సునిశ్చితము. పరాశక్తి నుండి చైతన్యశక్తి, దానినుండి ఆనందశక్తి, దానినుండి ఇచ్ఛాశక్తి, దానినుండి జ్ఞానశక్తి, దానినుండి అయిదవది యగు క్రియాశక్తి పుట్టినవి. ఓ మునీ! ఈ శక్తులనుండియే నివృత్తి మొదలగు కళలు పుట్టినవి (54, 55). ఓ మహర్షీ! చైతన్యమునుండి నాదము, ఆనందమునుండి బిందువు, ఇచ్ఛాశక్తినుండి మకారము, జ్ఞానశక్తినుండి అయిదవ అచ్చు అగు ఉకారము, క్రియాశక్తినుండి అకారము పుట్టినవి. ఈ విధముగా ఓంకారముయొక్క ఉత్పత్తిని చెప్పితిని. ఇప్పుడు అయిదుగురు బ్రహ్మల ఉత్పత్తిని గురించి వినుము (56, 57). శివునినుండి ఈశానుడు, ఈశానునినుండి తత్పురుషుడు , ఆయననుండి అఘోరుడు, ఆయననుండి వామదేవుడు, ఆయననుండి సద్యోజాతుడు పుట్టినారు (58). ఈ ఓంకారమనే అక్షరమునుండి మప్పుది ఎనిమిది మాతృకాక్షరములు , అనగా అయిదు అచ్చులు, ముప్పది మూడు హల్లులు పుట్టినవి. ఈశానునినుండి శాంత్యతీత అనే కళ, తత్పురుషునినుండి శాంతి అనే కళ, అఘోరునినుండి విద్యాకళ, వామదేవునినుండి ప్రతిష్ఠా అనే కళ, సద్యోజాతునినుండి నివృత్తి అనే కళ పుట్టినవని వర్ణించబడినది. ఈశానవిభుని నుండి చిచ్ఛక్తి ద్వారా మిథునపంచకము పుట్టినది (59, 60). అనుగ్రహము మొదలగు జగత్కార్యములకు ఈ అయిదు మిథునములు కారణమగుచున్నారని శివతత్త్వము తెలిసినవారు, గొప్ప బుద్ధిశాలురు, పరతత్త్వమును బోధించుటలో నిపుణులు అగు మునులు చెప్పుచున్నారు (61). వాచ్యవాచకసంబంధముచే వీటికి మిథునత్వము (జంటగా నుండట) కలిగినది. కళలు, వర్ణములు వీటి రూపములే. అయిదు మహాభూతములు వీటియందే అంతర్గతమగును. ఓ మహర్షీ! ఆకాశము, వాయువు, అగ్ని జలము, పృథివి అను క్రమములో ఆ అయిదు భూతములు పుట్టినవి ( 62, 63). శ##బ్దైకగుణ ఆకాశశ్శబ్దస్పర్శగుణో మరుత్ | శబ్దస్పర్శరూపగుణప్రధానో వహ్నిరుచ్యతే || 64 శబ్దస్పర్శరూపరసగుణకం సలిలం స్మృతమ్ | శబ్దస్సర్శరూపరసగంధాఢ్యా పృథివీ స్మృతా || 65 వ్యాపకత్వం చ భూతానామిదమేవ ప్రకీర్తితమ్ | వ్యాప్యత్వం వైపరీత్యేన గంధాదిక్రమతో భ##వేత్ || 66 భూతపంచకరూపో%యం ప్రపంచః పరికీర్త్యతే | విరాట్ సర్వసమష్ట్యాత్మా బ్రహ్మాండమితి చ స్ఫుటమ్ || 67 పృథివీతత్త్వమారభ్య శివతత్త్వావధి క్రమాత్ | నిలీయ తత్త్వసందోహే జీవ ఏవ విలీయతే || 68 సంశక్తికః పునస్సృష్టౌ శక్తిద్వారా వినిర్గతః | స్థూలప్రపంచరూపేణ తిష్టత్యాప్రలయం సుఖమ్ || 69 నిజేచ్ఛయా జగత్సృష్టముద్యుక్తస్య మహేశితుః | ప్రథమో యః పరిస్పందశ్శివతత్త్వం తదుచ్యతే || 70 ఏషైవేచ్ఛాశక్తితత్త్వం సర్వకృత్యానువర్తనాత్ | జ్ఞానక్రియాశక్తియుగ్మే జ్ఞానాధిక్యే సదాశివః || 71 మహేశ్వరం క్రియోద్రేకేత త్త్వం విద్ధి మునీశ్వర | జ్ఞానక్రియాశక్తిసామ్యం శుద్ధవిద్యాత్మకం మతమ్ || 72 స్వాంగరూపేషు భావేషు మాయాతత్త్వ విబేదధీః | శివో యదా నిజం రూపం పరమైశ్వర్యపూర్వకమ్ || 73 నిగృహ్య మాయయా శేషపదార్థగ్రాహకో భ##వేత్ | తదా పురుష ఇత్యాఖ్యా తత్సృష్ట్వే త్య భవచ్ర్ఛుతిః || 74 ఆకాశమునకు శబ్దము అనే ఒక గుణము, వాయువునకు శబ్దము మరియు స్పర్శ అను రెండు గుణములు, అగ్నికి శబ్దస్పర్శరూపములనే మూడు గుణములు కలవని చెప్పబడినది (64). నీరు శబ్దస్పర్శరూపరసములనే నాలుగు గుణములు కలది అనియు, పృథివి శబ్దస్పర్శరూపరసగంధములనే అయిదు గుణములు కలదియని చెప్పబడిదని (65). ఈ విధముగా ఈ క్రమములో భూతములు వ్యాపకములగుచున్నది. అనగా, వరుసలో పై భూతముయొక్క గుణము క్రింది భూతములోనికి ప్రసరించును. కావున, పై భూతము వ్యాపకము కాగా, క్రిందిది వ్యాప్యము అగుచుండును (66). ఈ ప్రపంచముయొక్క స్వరూపము ఈ అయిదు భూతములేనవి చెప్పబడినది. సకలబ్రహ్మాండము అనే స్థూలదేహముయొక్క అభిమాని విరాట్ అనబడును (67). పృథివీతత్త్వముతో మొదలిడి శివతత్త్వము వరకు గల తత్త్వసముదాయము బ్రహ్మాండమని స్పష్టమే. వాటిలో క్రిందిదిపై దానిలో విలీనము కాగా, అంతమునందు ప్రాణరూపుడగు ఈశ్వరునియందు విలీనమగును (68). మరల ఈ సర్వము మాయాశక్తి నుండి జగద్రూపముగా సకలశక్తులతో ప్రకటమై స్థూలప్రపంచరూపముతోప్రలయము వరకు నిరాటంకముగా కొనసాగును (69). తన సంకల్పముచే జగత్తును సృష్టించుటకు ఉద్యుక్తుడైన మహేశ్వరుని మొట్టమొదటి చలనమునకు శివతత్త్వము అని పేరు (70). సృష్టికార్యములన్నింటియందు అనువృత్తమయ్యే ఈ ఈశ్వరసంకల్పమే ఇచ్చాశక్తి అనే తత్త్వము అగును. జ్ఞానశక్తి క్రియాశక్తి అనే జంటలో జ్ఞానప్రధానుడు సదాశివుడు (71). ఓ మహర్షీ! క్రియాశక్తిప్రధానమగు తత్త్వము మహేశ్వరుడని యెరుంగుము. జ్ఞానశక్తి క్రియాశక్తుల సమానావస్థకు శుద్ధమగు విద్యాతత్త్వము అని పేరు (72). శివుని అంగ భూతములైన సర్వపదార్థములయందు గల భేదబుద్ధికి మాయాతత్త్వమని పేరు.న సర్వజగత్తుయొక్క సృష్టస్థితిలయసమర్థుడగు ఆయన మాయచే తన స్వరూపమునుపసంహరించి సకలపదార్థములను తనలోనికి గ్రహించి యున్న సమయములో పురుషుడనబడును. తత్సృష్ట్వా, తదేవానుప్రావిశత్ (పరమేశ్వరుడు జగత్తును సృష్టించి దానిలోనికి ప్రవేశించెను) అని శ్రుతి చెప్పుచున్నది (73, 74). ఆయమేవ హి సంసారీ మాయయా మోహిమితః పశుః | శివజ్ఞానవిహీనో హి నానాకర్మవిమూఢధీః || 75 శివాదభిన్నం న జగదాత్మానం భిన్నమిత్యపి | జానత్రోస్య పశోరేవ మోహో భవతి న ప్రభోః || 76 యథైంద్రజాలికస్యాపి యోగినో న భ##వేద్ర్భ మః | గురుణా జ్ఞాపితైశ్వర్యశ్శివో భవతి చిద్ఘనః || 77 సర్వకర్తృత్వరూపా చ సర్వజ్ఞత్వస్వరూపిణీ | పూర్ణత్వరూపా నిత్యద్వవ్యాపకత్వస్వరూపిణీ || 78 శివస్య శక్తయః పంచ సంకుచద్రూపభాస్వరాః | అపి సంకోచరూపేణ విభాంత్య ఇతి నిత్యశః || 79 పశోః కలాఖ్యవిద్యేతి రాగకాలౌ నియత్యపి | తత్త్వపంచకరూపేణ భవత్యత్ర కలేతి సా || 80 కించిత్కర్తృత్వహేతుస్స్యాత్కించిత్తత్వైకసాధనమ్ | సా%విద్యా తు భ##వేద్రాగో విషయేష్వనురంజకః || 81 కాలో హి భావాభావానాం భాసానాం భాసనాత్మకః | క్రమావచ్ఛేదకో భూత్వా భూతాదిరితి కథ్యతే || 82 ఇదం తు మమ కర్తవ్యమిదం నేతి నియామికా | నియతిస్స్యాద్విభోశ్శక్తిస్తదాక్షేపాత్పతేత్పశుః || 83 ఏతత్పంచకమేవాస్య స్వరూపావరకత్వతః | పంచకంచుకమాఖ్యాతమంతరంగం చ సాధనమ్ || 84 ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం శివతత్త్వవర్ణనం నామ షోడశో%ధ్యాయః (16). మాయచే మోహితుడై శివజ్ఞానము లేక వివిధకర్మలయందు తగుల్కొనియున్న మనస్సు గలవాడై ఉండే జీవుడే సంసారి యనబడును (75). జగత్తు శివునికంటె భిన్నముగా లేదు. తాను శివునికంటె వేరుగా నున్నానని తలపోయు జీవునకు మాత్రమే మోహము గలదు. శివప్రభునకు మోహము లేదు (76). ఐంద్రజాలికునకు గాని, యోగికి గాని భ్రమ ఉండదు. అదే విధముగా, తాను స్వరూపమునందు ఈశ్వరుడేనని గురువుచే బోధింపబడిన జీవుడు చైతన్యఘనుడగు శివుడు అగును (77). సర్వకర్తృత్వము (సర్వజగత్తునకు కర్తయగుట), సర్వజ్ఞత్వము (సర్వమును తెలిసియుండుట), పూర్ణత్వము (పరిచ్ఛేదములు లేకుండుట), నిత్యత్వము (వినాశము లేకుండుట) మరియు వ్యాపకత్వము (సర్వమునకు అధిష్ఠానమై యుండుట) అను (78) ఐదు శక్తులు శివునకు గలవు. గొప్ప ప్రకాశముగల ఈ శక్తులు ఆయనయందు అణగి మణగి యుండును. అట్లు ఉన్ననూ, అవి సర్వకాలములలో విశేషముగా ప్రకాశించును (79). కళ, విద్య, రాగము, కాలము, నియతి అనే ఐదు తత్త్వములు జీవునియందు ఉండును. ఈ అయిదు తత్త్వములకు 'కలా' అనే పేరు గలదు. అల్పములగు కార్యములను చేయుటకు హేతువు అగు తత్త్వము విద్య యనబడును. అల్పమగు పరిజ్ఞానము కలుగుటకు హేతువు విద్య. రాగము ఇంద్రియసుఖములయందు ఆసక్తిని కలిగించును (80, 81). కాలము వస్తువుల ఉనికికి మరియు అభావము (లేకుండుట) నకు క్రమముగా విశేషణమై వాటిని ప్రకాశింపజేస్తూ, భూతాది (సర్వప్రాణులకు అదిలో నున్నది ) అను పేరును పొందినది (82). ఇది నాకు కర్తవ్యము, ఇది నాకు కర్తవ్యము కాదు అనే విషయమును నియంత్రించునది నియతి. అది శివప్రభుని శక్తి. దానిని ఉల్లంఘించు జీవుడు పతితుడగును (83). ఈ ఐదు జీవుని స్వరూపమును ఆవరించి యుండుటచే, వాటికి పంచకంచుకములు అను పేరు వచ్చెను. జీవునకు అంతరంగసాదనము ఆవశ్యకము (84). శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు శివతత్త్వములను వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది (16).