Siva Maha Puranam-4
Chapters
అథ సప్తదశో
శివాద్వైత జ్ఞానము
వామదేవ ఉవాచ |
నియత్యధస్తాత్ర్ప కృతేరుపరిస్థః పుమానితి | పూర్వత్ర భవితా ప్రోక్తమిదానీం కథమన్యథా || 1
మాయయా సంకుచద్రూపస్తదా ధస్తాదితి ప్రభో | ఇతి మే సంశయం నాథ ఛేత్తుమర్హసి తత్త్వతః || 2
వామదేవుడు ఇట్లు పలికెను -
ఓ ప్రభూ! ప్రకృతికి క్రింద నియతి, పైన పురుషుడు ఉందురని తమరు ముందుగా నాకు చెప్పియుంటిరి. కాని, ఇప్పుడు దానికి భిన్నముగా, పురుషుడు మాయచే సంకోచమును పొందిన స్వరూపముగలవాడై ప్రకృతికి క్రింద (వశములో) ఉండునని చెప్పుచున్నారేల? ఓ తండ్రీ! నా ఈ సందేహమును యథార్థముగా నివారించ దగును (1, 2).
శ్రీసుబ్రహ్మణ్య ఉవాచ |
అద్వైతశైవవాదో%యం ద్వైతం న సహతే క్వచిత్ | ద్వైతం చ నశ్వరం బ్రహ్మాద్వైతం పరమనశ్వరమ్ || 3
సర్వజ్ఞస్సర్వకర్తా చ శివస్సర్వేశ్వరో%గుణః | త్రిదేవజనకో బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః || 4
స ఏవ శంకరో దేవస్స్వేచ్ఛయా చ స్వమాయయా | సంకుచద్రూప ఇవ సన్ పురుషస్సంబభూవ హ || 5
కలాదిపంచకేనైవ భోక్తృత్వేన ప్రకల్పితః | ప్రకృతిస్థః పుమానేష భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ || 6
ఇతి స్థానద్వయాంతఃస్థః పురుషో న విరోధకః | సంకుచన్నిజరూపాణాం జ్ఞానాదీనాం సమష్టిమాన్ || 7
సత్త్వాదిగుణసాధ్యం చ బుద్ధ్యాదిత్రితయాత్మకమ్ | చిత్తప్రకృతితత్త్వం తదాసీత్సత్త్వాదికారణమ్ || 8
సాత్త్వికాదివిభేదేన గుణా ః ప్రకృతిసంభవా ః | గుణభ్యో బుద్ధి రుత్పన్నా వస్తునిశ్చయకారిణీ || 9
తతో మహానహంకారస్తతో బుద్ధీంద్రియాని చ | జాతాని మనసో రూపం స్యాత్సంకల్ప వికల్పకమ్ || 10
బుద్ధీంద్రియాణి శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వా చ నాసికా | శబ్దస్స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ గోచరః || 11
బుద్ధీంద్రియాణాం కథితః శ్రోత్రాదిక్రమతస్తతః | వైకారికాదహంకారాత్తన్మాత్రాణ్యబ్రువన్ క్రమాత్ || 12
శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇట్లు పలికెను -
ఈ శివాద్వైతసిద్ధాంతము ద్వైతమును లేశ##మైననూ దరికి చేరనీయదు. ద్వైతము నశించును. అద్వైతపరబ్రహ్మకు వినాశము లేదు (3). శివుడు సర్వము తెలిసినవాడు, సర్వమును సృష్ఠించువాడు, సర్వమునకు ప్రభువు, నిర్గుణుడు, త్రిమూర్తులకు తండ్రి, పరంబ్రహ్మ స్వరూపుడు మరియు సచ్చిదానందస్వరూపుడు (4). ఆ శంకరదేవుడు తన ఇచ్ఛచే మరియు తన మాయచే తన స్వరూపమును సంకోచము చేసి పురుషుడు అయినాడు (5). ఈ పురుషుడు కళ మొదలగు ఐదు తత్త్వములతో కూడినవాడై, ప్రకృతితో తాదాత్మ్యమును పొంది, ఆ కారణముచే తనయందు భోక్తృత్వమును కల్పించుకొని ప్రకృతియందలి గుణములను అనుభవించుచున్నాడు (6). ఈ విధముగా ఒకే పురుషుడు రెండు ఉపాధులయందు ఉపలభ్యమగుటలో విరోధమేమియు లేదు. సంకోచమును పొందియున్న జ్ఞానము మొదలైన తన స్వరూపముల సమష్టియే పరమేశ్వరుడు (7). సత్త్వము మొదలగు గుణములనుండి బుద్ది మొదలైన మూడు తత్త్వములు పుట్టినవి. ప్రకృతినుండి సమష్టిబుద్ధి పుట్టినది. ఆదసత్త్వగుణప్రధానమైనది. సత్త్వరజస్తమోగుణములు ప్రకృతినుండి పుట్టినవి. ఈ గుణములనుండి నిశ్చయాత్మకమగు బుద్ధి పుట్టినది (8, 9). ఆ మహత్తత్త్వమునుండి అహంకారము పుట్టినది. దానినుండి జ్ఞానేంద్రియములు పుట్టినవి. మనస్సు సంకల్పవికల్పాత్మకమైనది (10). చెవి, చర్మము, కన్నులు, నాలుక మరియు ముక్కు అనునవి జ్ఞానేంద్రియములు. శబ్దము, స్పర్శ, రూపము రసము మరియు గంధము అనునవి క్రమముగా వాటికి గోచరమగు విషయములు (11). పైన పేర్కొనబడిన చెవి మొదలగు జ్ఞానేంద్రియములు క్రమముగా పంచభూతముల తన్మాత్ర (సూక్ష్మావస్థ) లనుండి పుట్టినవి. ఆ తన్మాత్రలు అహంకారమునుండి పుట్టినవి. ఆ అహంకారము కూడ మహత్తత్త్వమునుండి పుట్టియుండుటచే ఒకానొక వికారము (కార్యము) మాత్రమే అగుచున్నది (12).
తాని ప్రోక్తాని సూక్ష్మాణి మునిభిస్తత్త్వదర్శిభిః | కర్మేంద్రియాణి జ్ఞేయాని స్వకార్యసహితాని చ || 13
విప్రర్షే వాక్కరౌ పాదౌ పాయూపస్థౌ చ తత్ర్కియాః | వచనాదానగమనవిసర్గానందసంజ్ఞితాః || 14
భూతాదికాదహంకారాత్తన్మాత్రాణ్యభవన్ క్రమాత్ | తాని సూక్ష్మాని రూపాణి శబ్దాదీనామితి స్థితిః || 15
తేభ్యశ్చాకాశవాయ్వగ్నిజలభూమిజనిః క్రమాత్ | విజ్ఞేయా మునిశార్దూల పంచభూతమితీష్యతే || 16
అవకాశప్రదానం చ వాహకత్వం చ పావనమ్ | సంరంభో దారణం తేషాం వ్యాపారాః పరికీర్తితాః || 17
అవియే సూక్ష్మపంచభూతములని తత్త్వవేత్తలగు మునులు నిర్దేశించుచున్నారు. ఇపుడు కర్మేంద్రియములను మరియు వాటి వాటి కార్యములను తెలియవసి యున్నది (13). ఓ మహర్షీ! వాక్కు, చేతులు, కాళ్లు, విసర్జనేంద్రియము, జననేంద్రియము అనునవి కర్మేంద్రియములు. మాటలాడుట, పట్టుకొనుట, నడచుట, విసర్జించుట మరియు ఆనందించుట అనునవి క్రమముగా వాటి కార్యములు (14). మహత్తత్త్వమునుండి అహంకారము, దానినుండి పంచతన్మాత్రలు పుట్టినవి. ఈ తన్మాత్రలే శబ్దము మొదలగు అయిదు విషయములయొక్క సూక్ష్మరూపములు. ఈ విధముగా సృష్టివ్యవస్థ చెప్పబడినది. (15). ఓ మహర్షీ! ఆ పంచతన్మాత్రలనుండి క్రమముగా ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివి అనే పంచభూతములు పుట్టినవని తెలుసుకొనుము (16). అవకాశమునిచ్చుట, గంధమును ఒకచోటినుండి మరయొక చోటికి మోసుకొని పోవుట, పవిత్రము చేయుట, ప్రవహించుట, మోయుచుండుట అనునవి క్రమముగా వాటి కార్యములని చెప్పబడినవి (17).
వామదేవ ఉవాచ |
భూతసృష్టిః పురా ప్రోక్తా కలాదిభ్యః కథం పునః | అన్యథా ప్రోచ్యతే స్కంద సందేహో%త్ర మహాన్మమ || 18
ఆత్మతత్త్వమకారస్స్యాద్విద్యా స్యాదుస్తతః పరమ్ | శివతత్త్వం మకారస్స్యాద్వామదేవేతి చింత్యతామ్ || 19
బిందునాదౌ చ విజ్ఞే¸° సర్వతత్త్వార్థకావుభౌ | తత్రత్యా దేవతా యాశ్చ తా మునే శృణు సాంప్రతమ్ |7 20
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ మహేశ్వరసదాశివౌ | తే హి సాక్షాచ్చివసై#్యవ మూర్తయః శ్రుతివిశ్రుతాః || 21
ఇత్యుక్తం భవతా పూర్వమిదానీముచ్యతే %న్యథా | తన్మాత్రేభ్యో భవంతీతి సందేహో%త్ర మహాన్మమ || 22
కృత్వా తత్కరుణాం స్కంద సంశయం ఛేత్తుమర్హసి | ఇత్యాకర్ణ్య మునేర్వాక్యం కుమారః ప్రత్యభాషత || 23
వామదేవుడు ఇట్లు పలికెను -
ఓ స్కందా! పూర్వము నీవు కళలు మొదలగు వాటినుండి పంచభూతముల ఉత్పత్తిని చెప్పియుంటివి.కాని, ఇపుడు దానికి భిన్నముగా చెప్పుచున్నావు. ఈ విషయములో నాకు పెద్ద సందేహము కలుగుచున్నది (18). ఓ వామదేవా! ఆత్మతత్త్వము అకారమనియు, దాని తరువాత ఉండే ఉకారము విద్యాతత్త్వమనియు, మకారము శివతత్త్వమనియు భావన చేయుము (19). బిందునాదములు అను రెండింటియందు తత్త్వములన్నియు అంతర్గతమగుచున్నవి. ఓ మునీ! దానియందలి దేవతలను గురించి ఇపుడు వినుము (20). వారే బ్రహ్మవిష్ణురుద్రమహేశ్వరసదాశివులు. వారు సాక్షాత్తుగా శివుని స్వరూపములేనని వేదములు ఉద్ఘోషించుచున్నవి (21). పూర్వము నీవు ఈ విధముగా చెప్పియుంటివి. కాని, దానికి భిన్నముగా పంచభూతములు తన్మాత్రలనుండి పుట్టునని చెప్పటచే నాకు ఈ విషయములో పెద్ద సందేహము కలుగుచున్నది (22). ఓ స్కందా! నీవు నాపై దయచూపి ఈ సంశయమును పోగొట్ట తగుదువు. ఆ మహర్షియొక్క ఈ వచనములను విని కుమారస్వామి ఇట్లు బదులిడెను (23).
శ్రీసుబ్రహ్మణ్య ఉవాచ |
తస్మాద్వేతి సమారభ్య భూతసృష్టిక్రమో మునే | తచ్ఛృణుష్వ మహాప్రాజ్ఞ సావధానతయా%%దరాత్ || 24
జాతాని పంచభూతాని కలాభ్య ఇతి నిశ్చితమ్ | స్థూలప్రపంచరూపాణి భూతపతేర్వపుః || 25
శివతత్త్వాదిపృథ్వ్యంతం తత్త్వానాముదయక్రమే | తన్మాత్రేభ్యో భవంతీతి వక్తవ్యాని క్రమాన్మునే || 26
తన్మాత్రాణాం కలానామపై#్యక్యం స్యాద్భూతకారణమ్ | అవిరుద్ధత్వమేవాత్ర విద్ధి బ్రహ్మవిదాం వర || 27
స్థూలసూక్ష్మాత్మకే విశ్వే చంద్రసూర్యాదయో గ్రహాః | సనక్షత్రాశ్చ సంజాతాస్తథాన్యే జ్యోతిషాం గణాః || 28
బ్రహ్మవిష్ణుమహేశాదిదేవతా భూతజాతయః | ఇంద్రాదయో%పి దిక్పాలా దేవాశ్చ పితరో%సురాః || 29
రాక్షసా మానుషాశ్చాన్యే జంగమత్వవిభాగినః | పశవః పక్షిణః కీటాః పన్నగాదిప్రభేదినః || 30
తరుగుల్మలతౌషధ్యః పర్వతాశ్చాష్ట విశ్రుతాః | గంగాద్యాస్సరితస్సప్త సాగరాశ్చ మహర్ధయః || 31
యత్కించిద్వస్తు జాతం తత్సర్వమత్ర ప్రతిష్ఠితమ్ | విచారణీయం సద్బుద్ధ్యాన బహిర్మునిసత్తమ || 32
స్త్రీ పుంరూపమిదం విశ్వం శివశక్త్యాత్మకం బుధైః | భవాదృశైరుపాస్యం స్యాచ్ఛివజ్ఞానవిశారదైః || 33
సర్వం బ్రహ్మేత్యుపాసీత సర్వం వై రుద్ర ఇత్యపి | శ్రుతిరాహ మునే తస్మాత్ర్ప పంచాత్మా సదాశివః || 34
శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇట్లు పలికెను -
గొప్ప బుద్ధిశాలి వగు ఓ మునీ! తస్మాద్వా ఏతస్మాదాత్మనః----అను వాక్యముతో మొదలిడి శ్రుతి పంచభూతముల సృష్టిక్రమమును చెప్పియున్నది. ఆ వివరములను సావధానముగా శ్రద్ధగా వినుము (24). పంచభూతములు కళలనుండి పుట్టినవని నిశ్చయించబడియున్నది. ఆ పంచభూతములే జగన్నాథుని శరీరమనదగిన ప్రపంచముయొక్క రూపములో నున్నవి (25). ఓ మునీ! శివతత్త్వమునుండి మొదలిడి పృథివి వరకు తత్త్వములు పుట్టిన క్రమమునందు ఈ పంచభూతములు తన్మాత్రలనుండి పుట్టినవనియే చెప్పవలయును (26). బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవగు ఓ మునీ! తన్మాత్రలే కళలు గనుక, అవి పంచస్థూలభూతములకు కారణము అనుటలో విరోధము లేదని గ్రహించుము (27). ఈ విధముగా స్థూలసూక్ష్మభూతములతో నిండియున్న విశ్వములో చంద్రుడు, సూర్యుడు మొదలగు గ్రహములు, నక్షత్రములు, మరియు ఇతరములగు జ్యోతిర్మండలసమూహములు పుట్టినవి (28). బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, ప్రాణిజాతులు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు, దేవతలు, పితృదేవతలు, అసురులు (29). రాక్షసులు, మనుష్యులు, కదిలే ప్రాణులలోని ఇతరరకములు, పశువులు, పక్షులు, పాము మొదలగు వివిధరకములు కీటకములు (30), చెట్లు, పొదలు, లతలు, పంటధాన్యముల మొక్కలు, ఎనిమిది ప్రసిద్ధపర్వతములు, గంగ మొదలగు నదులు, ఏడు సముద్రములు, వివిధసంపదలు (31) ఇత్యాదిగా పుట్టుక గల వస్తువులు అన్నియు దీనియందు ప్రతిష్ఠను కలిగియున్నవి. ఓ మహర్షీ! బహిర్ముఖము కాని మంచి బుద్ధితో విచారమును చేయవలెను (32). శివజ్ఞానమునందు దిట్టలు, పండితులు అగు నీవంటి వారు స్త్రీ పురుషరూపములోనున్న ఈ జగత్తును శివశక్తిస్వరూపముగా ఉపాసన చేయవలెను (33). ఈ సర్వము బ్రహ్మయే అనియు, ఈ సర్వము రుద్రుడే అనియు కూడ ఉపాసన చేయవలెనని వేదము బోధించుచున్నది. ఓ మునీ! కావున, సదాశివుడు ప్రపంచరూపములో నున్నాడు (34).
అష్టత్రింశత్కలాన్యాససామర్థ్యాద్ద్వైభావనా | సదాశివో%హమేవేతి భవితాత్మా గురుశ్శివః || 35
ఏవంవిచారీ సచ్ఛిష్యో గురుస్స్యాత్స శివస్స్వయమ్ | ప్రపంచదేవతా యంత్రమత్రాత్మా న హి సంశయః || 36
ఆచార్యరూపయా విప్ర సంఛిన్నాఖిలబంధనః | శిశుశ్శివపదాసక్తో గుర్వాత్మా భవతి ధ్రువమ్ || 37
యుదస్తి వస్తు తత్సర్వం గుణప్రాధాన్యయోగతః | సమస్తం వ్యస్తమపి చ ప్రణవార్థం ప్రచక్షతే || 38
రాగాదిదోషరహితం వేదసారశ్శివో దిశః | తుభ్యం మే కథితం ప్రీత్యాద్వైతజ్ఞానం శివప్రియమ్ || 39
యో హ్యన్యథైతన్మనుతే మద్వచో మదగర్వితః | దేవో వా మానవస్సిద్ధో గంధర్వో మనుజో%పి వా || 40
దురాత్మనస్తస్య శిరశ్ఛింద్యాం సమతయాత్ ధ్రువమ్ | సచ్ఛక్త్యా రిపుకాలాగ్నికల్పయా న హి సంశయః || 41
భవానేన మునే సాక్షాచ్ఛివాద్వైతవిదాం వరః | శివజ్ఞానోపదేశే హి శివాచారప్రదర్శకః || 42
యద్దేహభస్మసంపర్కాత్సంఛిన్నాఘవ్రజో%శుచిః | మహాపిశాచన్సంప్రాప త్వత్కృపాతస్సతాం గతిమ్ || 43
జగత్తు ముప్పది యెనిమిది కళల (అంశముల) సమాహారమగుటచే ద్వైతభావన ఉన్ననూ, సదాశివుడను నేనే యను విచారముచే ఆత్మస్వరూపమును తెలుసుకున్న గురువు శివుడే యగును (35). ఈ జ్ఞానము గల శిష్యుడు యోగ్యమైన శిష్యుడు. అట్టి గురువు సాక్షాత్తుగా ప్రపంచము, దేవత, మంత్రము మరియు యంత్రము అను రూపములలో నుండే శివుడే యని చెప్పుటలో సందేహము లేదు (36). ఓ బ్రాహ్మణా! ఆచార్యరూపములోనున్న శివునిచే తొలగించబడిన సకలసందేహములు గలవాడై, శివుని పాదములయందు ఆసక్తి గల వ్యక్తి బాలుడే అయిననూ, నిశ్చయముగా గురువుతో సమానమగును (37). సత్త్వరజస్తమోగుణములు వేర్వేరు పాళ్లలో ఒకటి ప్రముఖము మరియొకటి ఆప్రధానము అను రీతిలో కలియుటచే ఈ జగత్తులోని సమస్తవస్తువులు ఉద్భవించినవి. అట్టి ఈ సమష్టి వ్యష్టిరూపమగు జగత్తు అంతయు ఓంకారముయొక్క అర్థములో విలీనమగునని మహర్షులు చెప్పుచున్నారు (38). రాగము మొదలగు దోషములు లేనిది, వేదముల సారము, శివునిచే ఉపదేశించబడినది ? శివునకు ప్రియమైనది అగు అద్వైతజ్ఞానమును నేను నీయందలి ప్రీతిచే నీకు చెప్పియుంటిని (39). మానవుడు గాని, దేవత గాని, సిద్ధుడు గాని, గంధర్వుడు గాని ఎవడైతే అహంకారముచే గర్వించి నా ఉపదేశమును మరియొక విధముగా స్వీకరించునో (40). అట్టి దురాత్ముని తలను సమానమగు వేగముగల, శత్రువులకు ప్రలయకాలాగ్నివంటి మంచి శక్తితో నిశ్చయముగా నరికెదననుటలో సందేహము లేదు (41). ఓ మునీ! శివజ్ఞానమును ఉపదేశించే సమయములో శివాచారమును నిరూపించే నీవే సాక్షాత్తుగా శివద్వైతము తెలిసిన వారిలో ప్రముఖుడవు (42). శౌచమునెరుంగని ఒక మహాపిశాచి నీ అనుగ్రహముచే నీ దేహమునందలి భస్మతో సంపర్కమును పొందుట వలన నశించిన పాపసమూహములు గలదై సద్గతిని పొందినది (43).
శివయోగీతి సంఖ్యాతస్త్రి లోకవిభవో భవాన్ | భవత్కటాక్షసంపర్కాత్పశుః పశుపతిర్భవేత్ || 44
తవ తస్య మయి ప్రేక్షాలో కశిక్షార్థమాదరాత్ | లోకోపకారకరణ విచరంతీహ సాధవః ||45
ఇదం రహస్యం పరమం ప్రతిష్ఠితమతస్త్వయి | త్వమపి శ్రద్ధయా భక్త్యా ప్రణవేష్వేవ సాదరమ్ || 46
ఉపవేశ్య చ తాన్ సర్వాన్ సంయోజ్య పరమేశ్వరే | శివాచారం గ్రాహయస్వ భూతిరుద్రాక్షమాశ్రితమ్ || 47
త్వం శివో హి శివాచారీ సంప్రాప్తాద్వైతభావతః | విచరంల్లోకరక్షయై సుఖమక్షయమాప్నుహి || 48
మూడు లోకములకు సంపదవంటివాడవగు నీవు శివయోగి యని ప్రసిద్ధిని బడసినావు. నీ దయాదృష్టి పడినచో జీవుడు శివుడు అగును (44). అట్టి నీవు నన్ను దర్శించి ఆదరముతో నావద్ద జ్ఞానమును పొందుట జనుల శిక్షణ కొరకు మాత్రమే. సాధువులు జనులకు ఉపకారమును చేయుటకై లోకములో సంచరించుచుందురు (45). కావున, ఈ పరమరహస్యమగు జ్ఞానము నీయందు స్థిరముగా నున్నది. నీవు కూడ శ్రద్ధతో మరియు భక్తితో ఓంకారజపమునందు మాత్రమే నిష్ఠ గలవాడువు అగుము (46). నీవు జనులనందరినీ కూర్చుండబెట్టి పరమేశ్వరుని యందు వారి మనస్సులను లగ్నము చేసి భస్మను మరియు రుద్రాక్షలను ధరించే శివాచారమును వారికి నేర్పుము (47). శివాచారమును పాటించే నీవు అద్వైతజ్ఞానము కలవాడవగుటచే సాక్షాత్తుగా శివుడవే. నీవు జనుల రక్షణ కొరకై సంచరించుచూ వినాశము లేని సుఖమును పొందుము (48).
సూత ఉవాచ |
శ్రుత్వేదమద్భుతమతం హి షడాననోక్తం వేదాంతనిష్ఠితమృషిస్తు వినమ్రమూర్తిః |
భూత్వా ప్రణమ్య బహుశో భువి దండవత్తత్పాదారవిందవిహరన్మధుపత్వమాప || 49
ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం శివాద్వైతజ్ఞానకథనవర్ణనం నామ సప్తదశో%ధ్యాయః (17).
సూతుడు ఇట్లు పలికెను -
కుమారస్వామిచే ఉపదేశించబడిన ఈ అద్భుతమగు, ఉపనిషత్తులలో ప్రతిపాదించబడే జ్ఞానమును విని ఆ మహర్షి వినయముతో వంగిన దేహము గలవాడై, పలుమార్లు సాష్టాంగముగా ప్రణమిల్లి, ఆ కుమారస్వామియొక్క పాదపద్మములయందు విహరించే తుమ్మెదయొక్క స్థితిని పొందెను (49).
శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు శివాద్వైతజ్ఞానమును వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).