Siva Maha Puranam-4
Chapters
అథ ఏకోనవింశో
మహావాక్య నిరూపణము
శ్రీ సుబ్రహ్మణ్య ఉవాచ |
అథ మహావాక్యాని | 1) ప్రజ్ఞానం బ్రహ్మ| 2) అహం బ్రహ్మాస్మి| 3) తత్త్వమసి| 4) అయమాత్మా బ్రహ్మ| 5) ఈశావాస్యమిదం సర్వమ్ | 6) ప్రాణో%స్మి 7) ప్రజ్ఞానాత్మా |8) యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ| 9) అన్యదవ తద్విదితాదథో అవిదితాదసి| 10) ఏష త ఆత్మాంతర్యామ్యమృతః | 11) స యశ్చాయం పురుషే, యశ్చాసావాదిత్యే, స ఏకః | 12) అహమస్మి పరం బ్రహ్మ పరం పరపరాత్పరమ్ | 13) వేదశాస్త్ర గురుత్వాత్తు స్వయమానందలక్షణమ్ | 14) సర్వభూతస్థితం బ్రహ్మ తదేవాహం న సంశయః | 15) తత్త్వస్య ప్రాణో%హమస్మి పృథివ్యాః ప్రాణో%హమస్మి| 16) అపాంచ ప్రాణో%హమస్మి తేజసశ్చ ప్రాణో%హమస్మి|17) వాయోశ్చ ప్రాణో%హమస్మి ఆకాశస్య ప్రాణో%హమస్మి | 18) త్రిగుణస్య ప్రాణో%హమస్మి| 19) సర్వో%హం సంసారీ యద్భూతం యచ్చ భవ్యం యద్వర్తమానం సర్వాత్మకత్వాదద్వితీయో%హమ్ | 20) సర్వం ఖల్విదం బ్రహ్మ | 21) సర్వో%హం విముక్తో%హమ్ | 22) యో%సౌ సో%హం హంసస్సో%హమస్మి| ఇత్యేవం సర్వత్ర సదా ధ్యాయేదితి ||
ఈ పైన చెప్పబడిన మహావాక్యములను సర్వకాలములలో సర్వదేశములలో ధ్యానించ వలెనని గురువు ఉపదేశించవలెను.
అథ మహావాక్యానామర్థమహ |
ప్రజ్ఞానం బ్రహ్మ వాక్యార్థః పూర్వమేవ ప్రబోధితః | అహంపదస్యార్థభూతశ్శక్త్యాత్మా పరమేశ్వరః || 1
అకారస్సర్వవర్ణాద్యః ప్రకాశః పరమశ్శివః | హకారో వ్యోమరూపస్స్యాచ్ఛక్త్యాత్మా సంప్రకీర్తితః || 2
శివశక్త్యోస్తు సంయోగాదానందస్సతతోదితః | బ్రహ్మేతి శివశక్త్యోస్తు సర్వాత్మత్వమితి స్ఫుటమ్ || 3
పూర్వమేవోపదిష్టం తత్సో%హమస్మీతి భావయేత్ | తత్త్వమిత్యత్ర తదితి తచ్ఛబ్దార్థః ప్రబోధితః || 4
అన్యథా సో%హమిత్య త్ర విపరీతార్థభావనా | అహంశబ్దస్తు పురుషస్తదితి స్యాన్నపుంసకమ్ |
ఏవమన్యోన్యవైరుధ్యాదన్వయో న భ##వేత్తయోః || 5
స్త్రీ పుంరూపస్య జగతః కారణం చాన్యథా భ##వేత్ | స తత్త్వమసి ఇత్యేవముపదేశార్థభావనా || 6
అయమాత్మేతి వాక్మేచ పుంరూపం పదయుగ్మకమ్ | ఈశేన రక్షణీయత్వాదీశావాస్యమిదం జగత్ || 7
ప్రజ్ఞానాత్మా యదేవేహ తదముత్రేతి చింతయేత్ | యస్స ఏవేతి విద్వద్భిస్సిద్ధాంతిభిరిహోచ్యతే || 8
ఉపరిస్థితవాక్యే చ యో%ముత్ర స ఇహ స్థితః | ఇతి పూర్వవదేవార్ధః పురుషో విదుషాం మతః || 9
అన్యదేవ తద్విదితాదథో అవిదితాదపి | అస్మిన్వాక్యే ఫలస్యాపి వైపరీత్యవిభావనా || 10
యథా స్యాత్తద్వదేవాత్ర వక్ష్యామి శ్రూయతాం మునే | అయథావిదితాచ్ఛబ్దో పూర్వవద్విదితాదితి || 11
ప్రవృత్తస్స్యాత్తద్విదితాత్తథైవావిదితాత్పరమ్ | అన్యదేవ హి సంసిద్ధ్యై న భ##వేదితి నిశ్చితమ్ || 12
తరువాత గురువు మహావాక్యముల అర్ధమును చెప్పుచున్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యము యొక్క అర్థము పూర్వమే చెప్పబడినది. ఈ అహమ్ అను పదమునకు అర్థము శక్తిస్వరూపుడగు పరమేశ్వరుడు (1). అక్షరములన్నింటికీ మొదట ఉండే అకారము ప్రకాశస్వరూపుడగు పరమశివుని బోధించును. ఆకాశస్వరూపమగు హకారము శక్తిస్వరూపమని చెప్పబడినది (2). శివశక్తుల సంయోగము శాశ్వ తానందమునకు హేతువు. బ్రహ్మశబ్దము ఆ శివశక్తులే సర్వజగద్రూపముగా నున్నారని స్పష్టము చేయును (3). పూర్వమునందు ఉపదేశించబడియున్న విధముగా అట్టి బ్రహ్మము నేనేనని భావన చేయవలెను. తత్త్వమసి అను వాక్యములోని తత్ అను పదమునకు సో%హమస్మి అను వాక్యము లోని సః అను పదముకు అర్థము సమానమే (4). అట్లు గానిచో, సో%హమస్మి అను వాక్యమునకు విరుద్ధార్థము సంప్రాప్తమగును. ఏల యనగా, అహమ్ అనునది పుంలింగశబ్దము కాగా, తత్ అనునది నపుంసకలింగము. ఈ విధముగా ఈ రెండింటి లింగములలో భేదముండుటచే, వాటికి పరస్పరాన్వయము కుదరదు (5). స్త్రీ పురుషరూపములో నున్న జగత్తునకు కారణము ఈ లింగములకు అతీతమై యుండవలెను. మహావాక్యోపదేశములోని తాత్పర్యమేమనగా, సోహమస్మి అను వాక్యములోని సః అను పదమునకు, తత్త్వమసిలోని తత్ నకు అర్థము సమానమే (6). అయమాత్మా బ్రహ్మ (ఈ ఆత్మ బ్రహ్మమే) అనే వాక్యములో ఈ రెండు పదములు పుంలింగపదములే. ఈ జగత్తును రక్షించువాడు ఈశ్వరుడు, కావున, ఈ జగత్తును ఈశ్వరభావనచే కప్పివేయవలెను (7). ఆత్మ చైతన్యఘనము. ఎనిమిదవ వాక్యములో యత్ నకు యః అనియు, తత్ నకు సః అనియు అర్థము అని విద్వాంసులు సిద్ధాంతమును చేయుచున్నారు. సాధకుడు అటులనే భావన చేయవలెను (8). ఏడవ వాక్యములో చెప్పబడిన చైతన్య -- ఆత్మయే ఈ దేహములో మాత్రమే గాక పరలోకములో లభ్యమయ్యే దేహములో కూడ పురుషరూపములో నుండునని విద్వాంసుల సిద్ధాంతము (9). ఆ ఆత్మ తెలిసిన దానికంటె, తెలియని దానికంటె భిన్నమైనది. ఈ వాక్యములో జ్ఞానఫలమగు మోక్షమును గురించి తప్పుగా తెలుసుకొనే అవకాశము గలదు (10). ఓ మునీ! ఆ వివరమును నేను చెప్పెదను. వినుము. విదితాత్ అను పదమునకు ఉన్నది ఉన్నట్లుగా గాక తప్పుగా తెలియబడినది అని అర్థము (11). ఆత్మ అట్టి విదితము కంటె మరియు తెలియబడనిదాని కంటె (అవిదితాత్) అతీతమైనది. పరమాత్మకంటే భిన్నముగా జగత్తును దర్శించుట మోక్షహేతువు కాదని నిశ్చయించబడినది (12).
ఏష త ఆత్మాంతర్యామీ యో%మృతశ్చ శివస్స్వయమ్ | యశ్చాయం పురుషే శంభుర్యశ్చాదిత్యే వ్యవస్థితః || 13
స చాసౌ హేతి పార్థక్యం నైకం సర్వం స ఈరితః | సోపాధిద్వయమస్యార్థ ఉపచారాత్తథోచ్యతే || 14
తం శంభునాథం శ్రుతయో వదంతి హి హిరణ్మయమ్ | హిరణ్యబాహవ ఇతి సర్వాంగస్యోపలక్షణమ్ || 15
అన్యథా తత్పతిత్వం తు న భ##వేదితి యత్నతః | య ఏషోంతరితి శంభుశ్ఛాందోగ్యే శ్రూయతే శివః || 16
హిరణ్యశ్మశ్రువాంస్తద్వద్ధిరణ్యమయకేశవాన్ | నఖమారభ్య కేశాంతం సర్వత్రాపి హిరణ్మయః || 17
అహమస్మి పరం బ్రహ్మ పరాత్పరపరాత్పరమ్ | ఇతి వాక్యస్య తాత్పర్యం వదామి శ్రూయతామిదమ్ || 18
అహంపదస్యార్థ భూతశ్శక్త్యాత్మా శివ ఈరితః | స ఏవాస్మీతి వాక్యార్థయోజనా భవతి ధ్రువమ్ || 19
సర్వోత్కృష్టశ్చ సర్వాత్మా పరబ్రహ్మ స ఈరితః | పరశ్చాథాపరశ్చేతి పరాత్పరమితి త్రిధా || 20
రుద్రో బ్రహ్మా చ విష్ణుశ్చ ప్రోక్తాః శ్రుత్యైవ నాన్యథా | తేభ్యశ్చ పరమో దేవః పరశ##బ్దేన బోధితః || 21
వేదశాస్త్ర గురూణాం చ వాక్యాభ్యాసవశాచ్ఛిశోః | పూర్ణానందమయశ్శంభుః ప్రాదూర్భూతో భ##వేద్ధృది || 22
నీ లోపలనుండి నిన్ను నియంత్రించే ఈ నీ వినాశము లేని ఆత్మ సాక్షాత్తుగా శివుడే. ఈ పురుషునియందు ఏ శివుడు గలడో, ఆయన సూర్యునియందు కూడ స్థిరముగా నున్నాడు (13). సః (ఆతడు), అసౌ (వీడు), సః అను మూడు పదములు కలిసి భేదమును నిరాకరించి, సర్వము శివుడేనని బోధించుచున్నవి. ఈ రెండు ఉపాధులు వేరుగా నుండుటచే, లోకములో పురుషుడు మరియు ఆదిత్యుడు అనే గౌణవ్యవహారము కలిగినది (14). ఆ శంభునాథుని వేదములు హిరణ్మయుడని వర్ణించుచున్నవి. నమో హిరణ్యబాహవే (హిరణ్యవికారములగు చేతులు గల రుద్రునకు నమస్కారము) అను మంత్రములో బాహుశబ్దము శరీరములోని అవయవములను అన్నింటిని నిర్దేశించును (15). అట్లు గానిచో, ఆయన హారణ్యపతి అయి ఉండెడి వాడు కాదు. అందువలననే, వేదము ఛాందోగ్యములో య ఏషోంతరాదిత్యే--- (ఆదిత్యుని యందు గల ఈ పురుషుడు) ఇత్యాదిగా శివుని వర్ణించుచున్నది. శివుడు హిరణ్మయ (జ్యోతిర్మయ) మగు శిరోజములు, గెడ్డము, మీసములు గలవాడనియు, కాలిగోటితో ఆరంభించి కేశములవరకు సర్వత్రా హిరణ్మయుడనియు వర్ణించబడినది (16,17). అహమస్మి పరం బ్రహ్మ పరా పరపరాత్పరమ్ అను వాక్యమునకు ఇపుడు తాత్పర్యమును చెప్పెదను. దీనిని వినుము (18). అహమ్ అను పదమునకు శక్తిస్వరూపుడగు శివుడ అర్థమని చెప్పబడినది. అట్టి శివుడు నేనే అగుచున్నాను అని ఈ వాక్యమునకు తాత్పర్యము నిశ్చితము (19). సర్వమునకు ఆత్మ సర్వముకంటె ఉత్కృష్టుడు అగు ఆ పరబ్రహ్మ పరుడనియు, అపరుడనియు మరియు పరాత్పరుడనియు మూడు విధములుగా వర్ణించబడుచున్నాడు (20). ప్రకాశస్వరూపుడగు శివుడు బ్రహ్మవిష్ణురుద్రులకంటె ఉత్కృష్టుడు గనుక, వేదములు ఆయనను పరశబ్దముచే నిర్దేశించుచున్నవి. దీనిలో వికల్పము లేదు (21). అజ్ఞానియగు సాధకుడు గురువుచే ఉపదేశించబడిన వేదశాస్త్రముల వాక్యములను అభ్యాసము చేయుట వలన, పూర్ణానందస్వరూపుడగు శివుడు హృదయమునందు ఆవిర్భవించును (22).
సర్వభూతస్థితశ్శంభుస్స ఏవాహం న సంశయః | తత్త్వజాతస్య సర్వస్య ప్రాణో%స్మ్యహమహం శివః || 23
ఇత్యుక్త్యా పునరప్యాహ శివస్తత్త్వత్రయస్య చ | ప్రాణో%స్మీత్యత్ర పృథ్వ్యాదిగుణాంతగ్రహణాన్మునే || 24
ఆత్మతత్త్వాని సర్వాణి గృహీతానీతి భావయ | పునశ్చ సర్వగ్రహణం విద్యాతత్త్వే శివాత్మనోః || 25
తత్త్వయోశ్చాస్మ్యహం ప్రాణస్సర్వస్సర్వాత్మకో హ్యహమ్ | జీవస్య చాంత ర్యామిత్వాజ్జీవో%హం తస్య సర్వదా || 26
యద్భూతం యచ్చ భవ్యం యద్భవిష్యత్సర్వమేవ చ | మన్మయత్వాదహం సర్వస్సర్వో వై రుద్ర ఇత్యపి || 27
శ్రుతిరాహ మునే సాహి సాక్షాచ్ఛివముఖోద్గతా | సర్వాత్మా పరమైరేభిర్గుణౖర్నిత్యసమన్వయాత్ || 28
స్వస్మాత్పరాత్మవిరహాదద్వితీయో % హమేవ హి | సర్వం ఖల్విదం బ్రహ్మేతి వాక్యార్థః పూర్వమీరితః || 29
పూర్ణో%హం భావరూపత్వాన్నిత్యముక్తో%హమేవ హి | పశవో మత్ర్ప సాదేన ముక్తా మద్భావమాశ్రితాః || 30
యో%సౌ సర్వాత్మకశ్శంభుస్సో%హంహంసశ్శివో%స్మ్యహమ్ | ఇతి వై సర్వవాక్యార్థో వామదేవ శివోదితః || 31
ఇతీశశ్రుతివాక్యాభ్యాముపదిష్టార్థమాదరాత్ | సాక్షాచ్ఛివైక్యదం పుంసాం శిశోర్గురురుపాదిశేత్ || 32
ఆదాయ శంఖం సాధారమస్త్ర మంత్రేణ భస్మనా | శోధ్య తత్పురతః స్థాప్య చతురస్రే సమర్చితే || 33
సకలప్రాణులలోనున్న శంభుడను నేనే. సందేహము లేదు. సకలతత్త్వముల ప్రాణమును నేనే. శివుడను నేనే (23) అని చెప్పి మహావాక్యము మరల ఇట్లు చెప్పుచున్నది: మూడు తత్త్వములకు ప్రాణమగు శివుడను నేనే అగుచున్నాను. ఓ మునీ! పృథివి మొదలగు వాటి గుణముల వరకు గ్రహించుటచే, ఆత్మతత్త్వములన్నియు గ్రహింపబడినవనియే యెరుంగుము. మరల సర్వశబ్దమును చెప్పుటచే, విద్యాతత్త్వమునందు, శివుడు మరియు ఆత్మ అను తత్త్వములయందు గల ప్రాణశక్తి నేనే అగుచున్నాను అని స్పష్టము చేయబడినది. సర్వుడను, సర్వముయొక్క స్వరూపమునునేనే. నేను సర్వకాలములలో జీవునియందు అంతర్యామినై యున్నాను గనుక, జీవుని ప్రాణశక్తి నేనే (24-26). భూతభవిష్యద్వర్తమానకాలములలోని సర్వము నాతో నిండి యున్నది గనుక, సర్వము నేనే. ఓ మునీ! సర్వో వై రుద్రః (సర్వము రుద్రుడే) అని కూడ వేదము చెప్పుచున్నది. ఆ శ్రుతి సాక్షాత్తుగా శివుని ముఖమునుండి పుట్టినది. జగత్కారణమగు ఈ గుణముల యందు సర్వకాలములలో అనుగతుడై యుండుటచే, సర్వమునకు ఆత్మ శివుడే (27, 28). నా కంటె భిన్నముగ మరియొక ఆత్మ లేదు గనుక, అద్వితీయుడను (రెండవ తత్త్వము లేకుండుట) నేనే. సర్వం ఖల్విదం బ్రహ్మ అను వాక్యమునకు అర్థము పూర్వములో చెప్పబడినది (29). నేను సత్త (ఉనికి) యే స్వరూపముగా గలవాడనగుటచే, పూర్ణుడను. నేను సర్వకాలములలో ముక్తుడనే. జీవులు నా స్వరూపమగు చైతన్యమును ఆశ్రయించినవారై నా అనుగ్రహముచే ముక్తులగుదురు (30). సర్వమునకు ఆత్మయగు శంభుడను నేనే. అజ్ఞాననాశకుడగు శివుడను నేనే. ఓ వామదేవా! ఈ విధముగా వాక్యములన్నింటి యొక్క అర్థమును శివుడు చెప్పియున్నాడు (31). ఈ విధముగా ఈశావాస్యోపనిషత్తులోని రెండు వాక్యములచే ఉపదేశించబడినది, మానవులకు సాక్షాత్తుగా శివునిలో ఐక్యమును కలిగించునది అగు మహావాక్యార్థమును గురువు తన పుత్రునివంటి శిష్యునకు బోధించవలెను (32). శంఖమును ఆధారపీఠముతో సహా తీసుకొని, అస్త్ర మంత్రముతో మరియు భస్మతో దానిని పవిత్రము చేసి, పూజింపబడియున్న చతురస్రమునందు శిష్యునకు ఎదురుగా నుంచవలెను (33).
ఓమిత్యభ్యర్చ్య గంధాద్యైరస్త్రం వస్త్రో పశోభితమ్ | వాసితం జలమాపూర్య సంపూజ్యోమితి మంత్రతః || 34
సప్తధైవాభిమంత్ర్యాథ ప్రణవేన పునశ్చ తమ్ | యస్త్వంతరం కించిదపి కురుతే సో%తిభీతిభాక్ || 35
ఇత్యాహ శ్రుతిసత్తత్త్వం దృఢాత్మా గతభీర్భవ | ఇత్యాభాష్య స్వయం శిష్యం దేవం ధ్యాయన్ సమర్చయేత్ || 36
శిష్యాసనం సంప్రపూజ్య షడుత్థాపనమార్గతః | శివాసనం చ సంకల్ప్య శివమూర్తిం ప్రకల్పయేత్ || 37
పంచ బ్రహ్మాణి విన్యస్య శిరః పాదావసానకమ్ | ముండవక్త్ర కలాభేదైః ప్రణవస్య కలా అపి || 38
అష్టత్రింశన్మంత్రరూపాశ్శిష్యదేహే%థ మస్తకే | సమావాహ్య శివం ముద్రాః స్థాపనీయాః ప్రదర్శయేత్ || 39
తతశ్చాంగాని విన్యస్య సర్వజ్ఞానీత్యనుక్రమాత్ | (?) కల్పయేదుపచారాంశ్చ షోడశాసనపూర్వకాన్ || 40
పాయసాన్నం చ నైవేద్యం సమర్ప్యోమగ్నిజాయయా | గండూషాచమనార్ఘ్యాది ధూపదీపాదికం క్రమాత్ || 41
నామాష్టకేన సంపూజ్య బ్రాహ్మణౖర్వేదపారగైః | జపేద్ర్బహ్మవిదాప్నోతి భృగుర్వై వారుణిస్తతః || 42
యో దేవానాముపక్రమ్య యః పరస్స మహేశ్వరః | ఇత్యేతం తస్య పురతః కహ్లారాదివినిర్మితామ్ || 43
ఆదాయ మాలాముత్థాయ శ్రీవిరూపాక్షనిర్మితే | శాస్త్రే పంచాశికే రూపే సిద్ధిస్కంధం జపేచ్ఛనైః || 44
ఓంకారమునుచ్చరించి దానిని గంధము పుష్పములు మొదలగు వాటితో పూజించి, అస్త్ర మంత్రమును పఠించి, వస్త్ర మును దానికి చుట్టి, సుగంధభరితమైన నీటిని దానిలో నింపి, చక్కగా పూజించి, ఏడు సార్లు ఓంకారమునుచ్చరించి దానిని అభిమంత్రించి, తరువాత గురువు శిష్యునకు ఇట్లు బోధించవలెను; ఓమ్. ఎవడైతే లేశ##మైననూ భేదభావనను చేయునో, వాడు మహాభయమును పొందునని వేదము సద్రూపమగు ఆత్మతత్త్వమును భోదించుచున్నది. కావున, నీవు దృఢమగు మనస్సు గలవాడనై భయమును విడిచిపెట్టుము. గురువు శిష్యునకు ఈ విధముగా బోధించి, తాను స్వయముగా శిష్యుని శివుని రూపములో ధ్యానిస్తూ పూజించవలెను (34, 36). షడుత్థాపన (?) విధానములో శిష్యుని ఆసనమును చక్కగా పూజించి, దానియందు శివుని ఆసనమును భావన చేసి, శిష్యునియందు శివస్వరూపమును భావన చేయవలెను (37). శిష్యుని శిరస్సునుండి పాదముల వరకు పంచ బ్రహ్మమంత్రముల న్యాసమును చేసి, శిష్యుని దేహమునందలి తల నోరు మొదలగు ఆవయవములయందు ముప్పది ఎనిమిది మంత్రముల రూపములో నున్న ఓంకారకళలను కూడ న్యాసము చేసి, తరువాత ఆతని శిరస్సుపై శివుని ఆవాహన చేసి, స్థాపనీ మొదలగు ముద్రలను ప్రదర్శించవలెను (38,39). తరువాత క్రమముగా అంగన్యాసమును చేసి, ఆసనము మొదలగు పదునారు ఉపచారములను చేయవలెను (40). క్రమముగా ధూపదీపములను ప్రదర్శించి, ఎనిమిది నామములతో పూజించి, ఓమ్ స్వాహా అను మంత్రముతో పాయసాన్నమును నైవేద్యమిడి, ఉత్తరాపోశనమును హస్తాదిప్రక్షాళనము కొరకు జలమును సమర్పించి, వేదవేత్తలగు బ్రాహ్మణులతో కలిసి బ్రహ్మవిదాప్నోతి పరమ్ ( బ్రహ్మను తెలిసిన వాడు మోక్షమును పొందును) అను ప్రశ్నను, భృగుర్వైవారుణః (వరణుని పుత్రుడగు భృగువు) అను ప్రశ్నను పఠించి, తరువాత (41, 42) యో దేవానాం--- (దేవతలలో అగ్రేసరుడు) తో మొదలిడి, యః పరస్స మహేశ్వరః (మహేశ్వరుడు ప్రకృతికి అతీతుడు) అను వాక్యముతో అంతమయ్యే అనువాకమును పఠించవలెను. తరువాత ఆ శిష్యుని వద్దకు కహ్లారము (ఎర్ర కలువ) మొదలగు పుష్పములతో తయారు చేసిన మాలను తెచ్చి, గురువు శ్రీవిరూపాక్షనిచే నిర్మించబడిన పంచాశిక (ఏబది అధ్యాయముల) శాస్త్రములోని సిద్ధిస్కంధమును మెల్లగా జపము చేయవలెను (43,44).
ఖ్యాతిః పూర్ణో%హమిత్యేతం సానుకూలేన చేతసా | దేశికస్తస్య శిష్యస్య కంఠదేశే సమర్పయేత్ || 45
తిలకం చందనేనాథ సర్వాంగాలేపనం పునః | స్వసంప్రదాయానుగుణం కారయేచ్చ యథావిధి || 46
తతశ్చ దేశికః ప్రీత్యా నామశ్రీపాదసంజ్ఞితమ్ | ఛత్రం చ పాదుకాం దద్యాద్దూర్వాకల్పవికల్పనమ్ || (?)47
వ్యాఖ్యాతృత్వం చ కర్మాది గుర్వాసనపరిగ్రహమ్ | అనుగృహ్య గురుస్తసై#్మ శిష్యాయ శివరూపిణ || 48
శివో % హమస్మీతి సదా సమాధిస్థో భ##వేతి తమ్ | సంప్రోచ్యాథ స్వయం తసై#్మ నమస్కారం సమాచరేత్ |
సంప్రదాయానుగుణ్యన నమస్కుర్యుస్తథాపరే || 49
శిష్యస్తదా సముత్థాయ నమస్కుర్యాద్గురుం తథా | గురోరపి గురుం తస్య శిష్యాంశ్చ స్వగురోరపి || 50
ఏవం కృతనమస్కారం శిష్యం దద్యాద్గురుస్స్వయమ్ | సుశీలం యతవాచం తం వినయావనతం స్థితమ్ || 51
అద్యప్రభృతి లోకానామనుగ్రహపరో భవ | పరీక్ష్య వత్సరం శిష్యమంగీకురు విధానతః || 52
రాగాదిదోషాన్ సంత్యజ్య శివధ్యానపరో భవ | సత్సంప్రదాయసంసిద్ధైస్సంగం కురు న చేతరైః || 53
అనభ్యర్చ్య శివం జాతు మా భుంక్ష్వాప్రాణసంక్షయమ్ | గురుభక్తిం సమాస్థాయ సుఖీ భవ సుఖీ భవ || 54
ఇతి క్రమాద్గురువరో దయాలుః జ్ఞానసాగరః | సానుకూలేన చిత్తేన సమం శిష్యం సమాచరేత్ || 55
తవ స్నేహాన్మయా % యం వై వామదేవ మునీశ్వర | యోగపట్టప్రకారస్తే ప్రోక్తో గుహ్యతరో % పి హి || 56
ఇత్యుక్త్వా షణ్ముఖస్తసై#్మ క్షౌరస్నానవిధిక్రమమ్ | వక్తుమారభ##తే ప్రీత్యా యతీనాం కృపయా శుభమ్ || 57
ఇతి శ్రీ శివమహాపురాణ కైలాససంహితాయాం యోగపట్టవిధివర్ణనం నామ ఏకోనవింశో%ధ్యాయః (19).
ఈ శిష్యుడు నాకు కీర్తిని దెచ్చును; నేను పూర్ణుడనైతిని అని ఆ గురువు ప్రసన్నమగు మనస్సుతో భావన చేసి, పూర్ణో హం అను మంత్రమును పఠించి, ఆ మాలను శిష్యుని కంఠములో వేయవలెను (45). తమ సంప్రదాయమునకు అనురూపముగా యథావిధిగా ఆతనికి తిలకమును దిద్ది, గంధమును అవయవములన్నింటియందు పూయవలెను (46). తరువాత గురువు ప్రేమతో శ్రీపాద అను బిరుదముతో బాటు ఆతనికి పేరును పెట్టి, గొడుగును చెప్పులను ఈయవలెను (47). గురువు శివరూపుడగు ఆ శిష్యునకు శాస్త్ర ములను వ్యాఖ్యానించే అధికారమును, దేవపూజ మొదలగు కర్మలయందు అధికారమును, గురువు యెదుట ఆసనముపై కూర్చుండుటకు అనుజ్ఞను అనుగ్రహించవలెను (48). శివో%హమస్మి (నేనే శివుడను అగుచున్నాను) అని సర్వదా భావన చేస్తూ సమాధియందు ఉండుము అని ఆయన ఆతనికి బోధించి, తరువాత తాను స్వయముగా ఆతనికి నమస్కరించవలెను. తరువాత సంప్రదాయమునకు అనురూపముగా ఇతరులు కూడ నమస్కరించెదరు (49). అపుడు ఆ శిష్యుడు లేచి, గురువునకు, గురువుయొక్క గురువునకు, ఆ పరమగురుని శిష్యులకు, తన గురువుయొక్క ఇతరశిష్యులకు నమస్కరించవలెను (50). ఈ విధముగా నమస్కారములను చేసి వినయముతో తలను వంచి నిలబడియున్న వాఙ్మియమము మరియు మంచి శీలము గల ఆ శిష్యునకు గురువు స్వయముగా ఇట్లు బోధించవలెను (51). ఈ నాటినుండియు జనులను అనుగ్రహించుచుండుము. ఒకవ్యక్తిని సంవత్సరకాలము పరీక్షించిన తరువాత యథావిధిగా శిష్యునిగా స్వీకరించుము (52). రాగము మొదలగు మానసిక దోషములను విడిచి పెట్టి, శివధ్యానమునందు నిమగ్నుడవై యుండుము. చక్కని సంప్రదాయమునందు సిద్ధిని పొందినవారితో మాత్రమే స్నేహమును చేయుము. ఇతరులకు దూరముగా నుండుము. (53). శివుని పూజించకుండగా ఒక్కనాడైననూ భోజనమును చేయకుము. ప్రాణము పోవువరకు గురుభిక్తిని కలిగియుండి సుఖమును పొందుము (54). దయామయుడు, జ్ఞాననిధి అగు ఆ గురుశ్రేష్ఠుడు ప్రసన్నమగు మనస్సు గలవాడై, ఈ విధముగా క్రమముగా శిష్యుని తనతో సమానునిగా చేయవలెను (55). ఓ వామదేవమహర్షీ! ఈ యోగపట్టపద్ధతి చాల రహస్యమైనదే అయిననూ, నీయందలి ప్రేమచే నేను నీకు చెప్పియుంటిని (56). కుమారస్వామి ఇట్లు పలికి, యతుల యెడల దయ గలవాడై శుభకరమగు క్షౌరస్నానవిధిని ప్రీతితో చెప్పుటకు మొదలిడెను (57).
శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు యోగపట్టవిధిని వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).