Siva Maha Puranam-4
Chapters
అథ వింశో
యతి నియమములు
శ్రీ సుబ్రహ్మణ్య ఉవాచ |
క్షౌరస్నానవిధిం వక్ష్యే వామదేవ మహామునే | యస్య సద్యో విధానేన శుద్ధిస్స్యాద్యతినః పరా || 1
యోగపట్టప్రకారస్య విధిం ప్రాప్య మునీశ్వర | స శిష్యస్స్యాద్ర్వతీ పూర్ణః క్షౌరకర్మోద్యతో భ##వేత్ || 2
గురుం నత్వా విశేషేణ లబ్ధానుజ్ఞస్తతో గురోః | శిరస్సంక్షాల్య చాచమ్య సవాసాః క్షౌరమాచరేత్ || 3
క్షాలయేద్వసనం పశ్చాన్మృదంభోభిః క్షురాది కమ్ | తద్ధస్తౌ చ మృదాలిప్య క్షాలయేతి మృదం దదేత్ || 4
స్థాపితం ప్రోక్షితం తోయైశ్శివం శివమితీరయన్ | స్వనేత్రే పిహితే చైవానామాంగుష్ఠాభిమంత్రితే || 5
అస్త్రే ణోన్మీల్య సందృశ్య క్షురాది క్షౌరసాధనమ్ | అభిమంత్ర్య ద్వాదశాథ ప్రోక్షయేదస్త్ర మంత్రతః || 6
క్షురం గృహీత్వా తారేణ దక్షభాగే నికృంతయేత్ | కేశాంశ్చ కాంశ్చిదగ్రేషు వప్త్వా సర్వం చ వాపయేత్ || 7
పృథివ్యాం పర్ణమాదాయ విక్షిపేన్న భువః స్థలే | శ్మశ్రూణి హస్త పాదస్థనఖాని చ నికృంతయేత్ || 8
బిల్వాశ్వత్థతులస్యాదిస్థానే సంగృహ్య మృత్తికామ్ | ద్విషడ్వారం నిమజ్యాప్సు తీరం గత్వోపవిశ్య చ || 9
శుద్ధే దేశే తు సంస్థాప్య మృదం త్రేధా విభజ్య చ | ఏవం పునస్త్రి ధా కృత్వా ప్రోక్ష్యాస్త్రే ణాభిమంత్రయేత్ || 10
శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఇట్లు చెప్పెను -
ఓ వామదేవమహర్షీ! ఇప్పుడు క్షౌరస్నానవిధిని చెప్పెదను. దీనిని పాటించుట వలన యతికి వెనువెంటనే శ్రేష్ఠమగు శుద్ధి లభించును (1). ఓ మహర్షీ! యథావిధిగా యోగపట్టమును పొంది పూర్ణుడై యన్న ఆ శిష్యుడు వ్రతనిష్ఠను స్వీకరించి, క్షౌరకర్మకు సంసిద్ధుడు కావలెను (3). గురువునకు ప్రత్యేకముగా నమస్కరించి, గురువుయొక్క అనుమతిని పొంది, శిరస్సును నీటితో కడిగి, ఆచమనము చేసి అదే వస్త్రముతో క్షౌరమును చేయించుకొన వలెను (3). తరువాత ఆ వస్త్రమును మట్టితో మరియు నీటితో శుభ్రము చేయవలెను. కత్తిని కడిగి చేతులను కడుగుకొనుమని చెప్పి మంగలికి మట్టిని ఈయవలెను (4). నేలపై నుంచబడిన కత్తిపై శివమ్, శివమ్ అని ఉచ్చరిస్తూ నీటిని చల్లి, బొటన వ్రేలు మరియు అనామికలతో తన కళ్లను మూసుకొనవలెను. అస్త్ర మంత్రముచే అభిమంత్రించి కళ్లను తెరచి, కత్తి మొదలగు క్షౌరసాధనములను చూచి, అస్త్ర మంత్రమును పన్నెండు సార్లు పఠించి వాటిపై నీటని చల్లవలెను. (5,6). ఓంకారము నుచ్చరించి కత్తిని, తీసుకొని, కుడివైపున కొన్ని కేశముల చిగుళ్లను కోసి, తరువాత మొత్తము ముండనము చేయించవలెను (7). ఆ కేశములను నేలపై ఆకును ఉంచి దానిలో వేయవలెనే గాని, నేలపై పారవేయరాదు. మీసములను, గెడ్డమును గీయించుకొని, చేతివ్రేళ్లకు కాలి వ్రేళ్లకు గల గోళ్లను కత్తిరింపజేయవలెను (8). మారేడు, రావి, తులసి మొదలైన చెట్ల మొదలు వద్ద గల మట్టిని తీసుకొని, పన్నెండు సార్లు నీటిలో మునిగి, గట్టుమీదకు వచ్చి కూర్చుండి (9), శుద్ధమగు ప్రదేశమునందు ఆ మట్టిని ఉంచి, దానిని మూడు భాగములుగా విభజించి, మరల ప్రతి భాగమును మూడుగా విభజించి, వాటిపై అస్త్ర మంత్రముతో నీటిని చల్లవలెను (10).
తత్త్రైకాం మృదమాదాయ దాపయిత్వా%న్యపాణినా | కరౌ ద్వాదశధాలిప్య ప్రత్యేకం కేన క్షాలయేత్ || 11
పునరేకాం పాదయోశ్చ ముఖే చాన్యాం కరే క్రమాత్ | సంలిప్యాక్షాల్య చాంభోభిః పునశ్చ జలమావిశేత్ || 12
అన్యాం మృదం భాగయిత్వా శిరసి ద్వాదశ క్రమాత్ | ఆలిప్య మృదమాస్యాంతం నిమజ్య చ పునః పునః || 13
తీరం గత్వా తు గండూషాన్ షోడశాచమనం ద్విధా | ప్రాణానాయమ్య చ పునః ప్రణవం ద్వ్యష్టసంఖ్యయా || 14
మృదమన్యాం పునస్త్రే ధా విభజ్య చ తదేకయా | కటిశౌచం పాదశౌచం విధాయాచమ్య చ ద్విధా || 15
ప్రణవేనాథ షోడశ ప్రాణానాయమ్య వాగ్యతః | పునరన్యాం స్వోరుదేశే త్రిధా విన్యస్య చోమితి || 16
ప్రోక్ష్యాభిమంత్రయేత్సప్త స్వపాణ్యోస్తలమేకధా | త్రిధాలిప్యాథ సంపశ్యేత్సూర్యమూర్తిం చ పావనీమ్ || 17
స్వకక్షయోస్సమాలిప్య వ్యత్యస్తాభ్యామథాన్యయా | పాణిభ్యాం చ మృదా శిష్యస్సుమతిర్దృఢమానసః || 18
గృహీత్వాన్యాం మృదం శుద్ధాం తథాసౌ గురుభక్తిమాన్ | శిర ఆరభ్య పాదాంతం విలిప్యాదిత్యదృష్టయా || 19
సముత్థాయ తతో%సౌ వై దండమాదాయ భూతలే | స్వగురుం మంత్రదం భక్త్యా సంస్మరేత్ జ్ఞానినిష్ఠయా || 20
వాటిలో ఒక మట్టి ముద్దను తీసికొని, రెండవ చేతికి రాసుకొని, రెండు చేతులను పన్నెండుసార్లు రుద్దుకొని, చేతులను విడివిడిగా నీటితో కడుగవలెను (11). వరుసగా ఒక ముద్దను కాళ్లకు, ఒక ముద్దను ముఖమునకు, ఒక ముద్దను మరల చేతులకు రాసుకొని, నీటితో కడిగి, మరల నీటిలోనికి దిగవలెను (12). మరియొక ముద్దను పన్నెండు భాగములుగా చేసి, శిరస్సునకు ముఖమునకు మెడవరకు రాసుకొని, పలుమార్లు నీటిలో మునగవలెను (13). ఒడ్డు మీదకు వచ్చి, పదునారు పర్యాయములు పుక్కిలించి ఊసి, రెండు సార్లు ఆచమనమును చేసి, ప్రాణాయామమును చేసి, పదునారు పర్యాయములు ఓంకారమును జపించవలెను (14). మరియొక మట్టిముద్దను మరల మూడుగా విభజించి వాటిలో ఒకదానితో నడుమును, మిగిలిన రెండింటితో పాదములను శుభ్రము చేసుకొని, రెండు సార్లు ఆచమనమును చేసి (15), పదునారు సార్లు ఓంకారమును జపించి, ప్రాణాయామమును చేసి, మౌనముగా నుండవలెను. మరియొక మట్టిముద్దను తన తొడపై నుంచి మూడు సార్లు ఓంకారమును జపించవలెను (16). ఓంకారమును ఏడు సార్లు జపించి దానిపై నీటిని చల్లవలెను. తరువాత అరచేతులకు ముందుగా ఒకసారి, తరువాత మూడుసారులు మట్టిని రాసుకొని, పావనమగు సూర్యబింబమును దర్శించవలెను (17). బుద్ధిమంతుడు, దృఢమగు చిత్తము గలవాడు అగు ఆ శిష్యుడు కుడిచేతిలోని మట్టిని ఎడమ, ఎడమచేతిలోని మట్టిని కుడి బాహుమూలములయందు రాసుకొనవలెను (18). గురువుయందు భక్తిగల ఆతడు అదే విధముగా మరియొక స్వచ్ఛమగు మట్టిముద్దను తీసుకొని, దానికి సూర్యకిరణములను సోకనిచ్చి, తలనుండి పాదము వరకు రాసుకొనవలెను (19). తరువాత ఆతడు లేచి నిలబడి దండమును నేలపై అన్చి మంత్రమునిచ్చిన తన గురువును జ్ఞానమునందు నిష్ఠగల భక్తితో స్మరించవలెను (20).
తతస్సాంబం మహేశానం శంకరం చంద్రశేఖరమ్ | సంస్మరేద్భక్తితశ్శిష్యస్సర్వైశ్వర్యపతిం శివమ్ || 21
త్రివారం ప్రణమే త్ర్పీత్యా సాష్టాంగం చ గురుం శివమ్ | పంచాంగేనైకవారం చ సముత్థాయ చ వందయేత్ || 22
తీర్థం ప్రవిశ్య తన్మధ్యే నిమజ్యోన్మజ్య తాం మృదమ్ | స్కంధే సంస్థాప్య పూర్వోక్తప్రకారేణ విలేపయేత్ || 23
తత్రావశిష్టం సంగృహ్య జలమధ్యే ప్రవిశ్య చ | విలోడ్య సమ్యక్ తాం తత్ర సర్వాంగేషు విలిప్య చ || 24
త్రివారమోమితి ప్రోచ్య శివపాదాంబుజం స్మరన్ | సంసారాంబుధిసంతారం సదా యద్విధితో హి సః || 25
అభిషిచ్యోమితి జలం విరజాభస్మలోలితమ్ | అంగోపమార్జనం కృత్వా సుస్నాయాద్భస్మనా తతః || 26
త్రిపుండ్రం చ విధాయాథ యథోక్తవిధినా శుభమ్ | యథోక్తాంగేషు సర్వేషు సావధానతయా మునే || 27
తతశ్శుద్ధమనా భూత్వా కుర్యాన్మధ్యదినక్రియాః | మహేశ్వరం నమస్కృత్య గురూంస్తీర్థాదికాని చ || 28
సంపూజయేన్మహేశానం భక్త్యా పరమయా మునే | సాంబికం జ్ఞానదాతారం పాతారం త్రిభవస్యవై || 29
తతో%సౌ దృఢచేతస్కో యతిస్స్వవృషసంస్థితః | భిక్షార్థం ప్రవ్రజేచ్ఛుద్ధో విప్రవర్గేషు సాధుషు || 30
తరువాత జగన్మాతతో కూడియున్నవాడు, మహేశ్వరుడు, మంగళకరుడు, చంద్రుని శిరస్సుపై ఆభరణముగా దాల్చినవాడు, సమస్తములగు ఐశ్వర్యములకు ప్రభువు అగు శివుని ఆ శిష్యుడు భక్తితో స్మరించవలెను (21). ఆతడు శివస్వరూపుడగు గురువునకు మూడు సార్లు సాష్టాంగనమస్కారమును చేసి, లేచి నిలబడి ఒకసారి పంచాంగ (అయిదు అవయవములతో కూడియున్న) నమస్కారమును చేయవలెను (22). తరువాత జలాశయములోనికి దిగి దానిలో మునిగి మట్టిని కడిగి వేసుకొని మరల మట్టిని పూర్వములో చెప్పిన విధముగా భుజమునకు రాసుకొనవలెను (23). అచట మిగిలియున్న మట్టిని తీసుకొని నీటి మధ్యలోనికి ప్రవేశించి దానిని అచట నీటితో కలిపి శరీరమంతటా రాసుకొని (24), మూడు సార్లు ఓంకారమును జపించి, సంసారసముద్రమును దాటించే శివుని పాదపద్మములను స్మరించవలెను. సర్వ కాలములలో శివుని ధ్యానము విధింపబడినది గదా! (25) ఓంకారముతో అభిషేకమును చేసి, విరజాహోమము చేసిన అగ్నిలోని భస్మను శరీరమునకు రాసుకొని, తరువాత చక్కగా భస్మస్నానమును చేయవలెను (26). ఓ మునీ! తరువాత పూర్వము చెప్పబడిన అవయవములన్నింటియందు పూర్వము చెప్పబడిన విధముగా సావధానముగా శుభకరమగు త్రిపుండ్రమును ధరించవలెను (27). ఓ మునీ! తరువాత ఆతడు పవిత్రమగు మనస్సు గలవాడై మాధ్యందినకర్మలను చేసుకొని, మహేశ్వరునకు గురువునకు నదీజలమునకు నమస్కరించి, జగన్మాతతో కూడియుండువాడు, జ్ఞానమునిచ్చువాడు, ముల్లోకములను రక్షించువాడు అగు మహేశ్వరుని పరమభక్తితో చక్కగా పూజంచవలెను (28, 29). తరువాత పరిశుద్ధుడగు ఆ యతి దృఢమగు మనస్సు గలవాడై తన ధర్మమునందు ఉన్నవాడై బ్రాహ్మణులు మరియు సాధువుల సమూహములోనికి భిక్ష కొరకై వెళ్లవలెను (30).
తతస్తత్ర చ శుద్ధాత్మా పంచధా పరికల్పితమ్ | భక్ష్యం యథోచితం కుర్యాద్దూషితాన్నం వివర్జయేత్ || 31
శౌచస్నానం తథా భిక్షాం నిత్యమేకాంతసేవనమ్ | భిక్షోశ్చత్వారి కర్మాణి పంచమం నైవ విద్యతే || 32
అలాబుం వేణుపాత్రం చ దారవం మృణ్మయం తథా | భిక్షోశ్చత్వారి పాత్రాణి పంచమం నైవ విద్యతే || 33
తాంబూలం తైజసం పాత్రం రేతస్సేకం సితాంబరమ్ | దివాస్వాపో హి నక్తాన్నం యతీనాం షడ్ వివర్జితాః || 34
సాక్షరా విపరీతాశ్చ రాక్షసాస్త ఇతి స్మృతాః | తస్మాద్వై విపరీతం చ కర్మ నైవాచరేద్యతిః || 35
యతిః ప్రయత్నతః కుర్యాత్ క్షౌరస్నానం చ శుద్ధయే | సంస్మరన్మనసా శుద్ధం పరం బ్రహ్మ సదాశివమ్ || 36
ఇత్యేవం మునిశార్దూల తవ స్నేహాన్మయాఖిలః | క్షౌరస్నానవిధిః ప్రోక్తః కిం భూయః శ్రోతుమిచ్ఛసి || 37
తరువాత అక్కడ ఆతడు ఆహరమును అయిదు భాగములుగా చేసి సరియగు విధానములో భుజించవలెను. అపవిత్రమగు అన్నమును తినరాదు (31). శుద్ధికర్మలు, స్నానము, భిక్ష, సర్వదా ఏకాంతమునందుండుట అను నాలుగు పనులను మాత్రమే భిక్షువు చేయవలెను. భిక్షువునకు ఐదవ పని లేదు (32). డొల్ల ఆసపకాయ, వెదురు పాత్ర, చెక్క పాత్ర, మట్టి పాత్ర అను నాలుగు రకముల పాత్రలను మాత్రమే యతి వాడవలెను. యతి ఐదవ రకము పాత్రను వాడరాదు (33). తాంబూలము, బంగరు పాత్ర, రేతస్సేచనము, తెల్లని వస్త్రములు, పగలు నిద్రించుట, రాత్రి భోజనము చేయుట అను ఆరు పనులను యతి విడువవలెను (34). యోగ్యులగు యతులు సాక్షరాః (అక్షరపరబ్రహ్మతో కూడియున్నవారు) అనబడుదురు. వారే విరుద్ధముగా ప్రవర్తించినచో రాక్షసాః (రాక్షసులు) అగుదురు. కావున, యతి విపరీతకర్మను చేయనే రాదు (35). యతి శుద్ధి కొరకై శుద్ధుడు, పరబ్రహ్మ అగు సదాశివుని మనస్సులో స్మరిస్తూ క్షౌరస్నానమును ప్రయత్నపూర్వకముగా చేయవలెను (36). ఓ మహర్షీ! నీయందలి ప్రేమచే నేను క్షౌరస్నానవిధానమునంతనూ చెప్పియుంటిని. నీవు ఇంకనూ ఏమి వినగోరుచున్నావు? (37)
శ్రీ శివమహాపురాణములోని కైలాససంహితయందు క్షౌరస్నానవిధిని వర్ణించే ఇరుపదియవ అధ్యాయము ముగిసినది (20).