Siva Maha Puranam-4
Chapters
అథ ద్వితీయో
మునులు బ్రహ్మను ప్రశ్నించుట
సూత ఉవాచ |
పురా కాలేన మహతా కల్పే %తీతే పునః పునః | అస్మిన్నుపస్థితే కల్పే ప్రవృత్తే సృష్టికర్మణి || 1
ప్రతిష్టితాయాం వార్తాయాం ప్రబుద్ధాసు ప్రజాసు చ | మునీనాం షట్కులీయానాం బ్రువతామితరేతరమ్ || 2
ఇదం పరమిదం నేతి వివాదస్సుమహానభూత్ | పరస్య దుర్నిరూపత్వాన్న జాతస్తత్ర నిశ్చయః || 3
తే %భిజగ్ముర్విధాతారం ద్రష్టుం బ్రహ్మాణమవ్యయమ్ | యత్రాస్తే భగవాన్ బ్రహ్మా స్తూయమానస్సురాసురైః || 4
మేరుశృంగే శుభే రమ్యే దేవదానవసంకులే | సిద్ధచారణసంబాధే యక్షగంధర్వసేవితే || 5
విహంగసంఘసంఘుష్టే మణివిద్రుమభూషితే | నికుంజకందరదరీగుహానిర్ఘరశోభితే || 6
తత్ర బ్రహ్మవనం నామ నానామృగసమాకులమ్ | దశయోజనవిస్తీర్ణం శతయోజనమాయతమ్ || 7
సురసామలపానీయపూర్ణరయ్యసరోవరమ్ | మత్తభ్రమరసంఛన్నరమ్యపుష్పితపాదపమ్ || 8
తరుణాదిత్యసంకాశం తత్ర చారు మహత్పురమ్ | దుర్ధర్షం బలదృప్తానాం దైత్యదానవరక్షసామ్ || 9
తప్తజాంబూనదమయం ప్రాంశుప్రాకారతోరణమ్ | నిర్వ్యూహవలభీకూటప్రతోలీశతమండితమ్ || 10
మహార్హమణిచిత్రాభిర్లేలిహానమివాంబరమ్ | మహాభవనకోటీభిరనేకాభిరలంకృతమ్ || 11
సూతుడు ఇట్లు పలికెను -
పూర్వము చాల కాలము క్రితము అనేకకల్పములు గడచిన తరువాత ఈ కల్పము వచ్చి సృష్టి ఆరంభమయ్యెను (1). మానవులు తెలివితేటలు గలవారైరి. వారియందు సంస్కృతీ సంప్రదాయములు స్థిరపడెను. ఆరు కులములకు చెందిన మునుల మధ్యలో పరస్పర సంభాషణలు జరిగినవి (2). ఇది గొప్ప; ఇది దీనికంటె గొప్ప అంటూ పెద్ద వివాదము చెలరేగెను. కాని, ఏది గొప్ప అను విషయమును నిరూపించుట చాల క్లేశముతో కూడిన పని యగుటచే, వారు ఆ సమయములో ఒక నిశ్చయమునకు రాలేకపోయిరి (3). వారు వినాశము లేని బ్రహ్మను చూచుటకు వెళ్లిరి. భగవాన్ బ్రహ్మ దేవతలచే మరియు అసురులచే స్తుతింపబడుచూ బ్రహ్మవనమునందుండెను (4). శుభకరమైనది, సుందరమైనది, దేవదానవులతో రద్దీగానున్నది, సిద్ధచారణుల గుంపులతో కూడియున్నది, యక్షులచే మరియు గంధర్వులచే సేవింపబడునది, పక్షల గుంపుల కిలకిలారావములతో నిండియున్నది, మణులతో మరియు పగడములతో అలంకరింపబడియున్నది, పొదరిళ్లు లోయలు కనుమలు మరియు గుహలు అను వాటితో శోభిల్లునది ఆగు మేరపర్వతశిఖరమునందు (5, 6), అనేకమృగములతో హడావుడిగా నున్నది, పది యెజనముల నిడివి, వంద యోజనముల పొడవు గలది, రుచికరమైన స్వచ్ఛమైన నీటితో నిండియున్న అందమగు సరోవరములు గలది, మదించిన తుమ్మెదలచే కప్పివేయబడియున్న సుందరమగు పుష్పములతో కూడిన చెట్లు గలది అగు బ్రహ్మవనమనే పేరుగల అడవి గలదు (7, 8). దానిలో ఉదయించే సూర్యుని పోలిన కాంతులు గలది, సుందరమైనది, బలముచే గర్వించియుండే దైత్యులకు దానవులకు మరియు రాక్షసులకు ముట్టడించ శక్యము కానిది, పుటము పెట్టిన బంగారముతో నిండి యున్నది, ఎత్తైన ప్రాకారములు మరియు తోరణములు గలది, వందల సంఖ్యలో దిట్టముగా నిర్మించబడిన డాబాలు ఇళ్లు రాజమార్గములు అనువాటితో ప్రకాశించునది, గొప్ప విలువైన మణులనుండి ప్రసరించే రంగు రంగుల కాంతులు గల అనేకములగు పెద్ద భవనముల సముదాయములతో అలంకరింపబడి ఆకాశమును చుంబించుచున్నదా యన్నట్లు ఉన్నది అగు పెద్ద నగరము గలదు (9-11).
తస్మిన్నివసతి బ్రహ్మా సబ్యైస్సార్ధం ప్రజాపతిః | తత్ర గత్వా మహాత్మానం సాక్షాల్లోకపితామహమ్ || 12
దదృశుర్మునయో దేవా దేవర్షగణసేవితమ్ | శుద్ధచామీకరప్రఖ్యం సర్వాభరణభూషితమ్ || 13
ప్రసన్నవదనం సౌమ్యం పద్మపత్రాయతేక్షణమ్ | దివ్యకాంతిసమాయుక్తం దివ్యగంధానులేపనమ్ || 14
దివ్యశుక్లాంబరధరం దివ్యమాలావిభూషితమ్ | సురాసురేంద్రయోగీంద్రవంద్యమానపదాంబుజమ్ || 15
సర్వలక్షణయుక్తాంగ్యా లబ్ధచామరహస్తయా | భ్రాజమానం సరస్వత్యా ప్రభ##యేవ దివాకరమ్ || 16
తం దృష్ట్వా మునయస్సర్వే ప్రసన్నవదనేక్షణాః | శిరస్యంజలిమాధాయ తుష్టువుస్సురవుంగవమ్ || 17
ఆ నగరములో ప్రజలకు ప్రభువు అగు బ్రహ్మ సభాసదులతో గూడి నివసించును. మును లు మరియు దేవతలు అచటకు వెళ్లి, మహాత్ముడు, సాక్షాత్తుగా లోకములకు పితామహుడు, దేవర్షుల గణములచే సేవింపబడువాడు, మేలిమి బంగారపు మేని కాంతి గలవాడు, సకలములగు ఆభరణములచే అలంకరింప బడినవాడు, ప్రసన్నమగు ముఖము గలవాడు, ఉల్లాసముతో నిండిన మనస్సు గలవాడు, పద్మపురేకులవంటి నిడివి కన్నులు గలవాడు, దివ్యమగు కాంతితో కూడియున్నవాడు, దివ్యమగు గంధమును పూసుకున్నవాడు, దివ్యమగు తెల్లని వస్త్రములను ధరించినవాడు, దివ్యమగు మాలచే చక్కగా అలంకరింపబడి యున్నవాడు, దేవతలు రాక్షసులు వారి ప్రభువులు యోగిశ్రేష్ఠులు అనువారిచే నమస్కరింపబడే పాదపద్మములు గలవాడు, సమస్తలక్షణములతో కూడిన అవయవములు కలిగి చేతిలో వింజామరను పట్టుకొనియున్న సరస్వతితో కూడి వెలుతురుతో కూడియున్న సూర్యుని పోలియున్నవాడు అగు బ్రహ్మను చూచిరి (12-16). మునులు అందరు ఆ దేవదేవుని చూచి ప్రసన్నమగు ముఖము మరియు కన్నులు గలవారై శిరస్సులపై చేతులను జోడించి స్తోత్రమును చేసిరి (17).
మునయ ఊచుః |
నమస్త్రి మూర్తయే తుభ్యం సర్గస్థిత్యంతహేతవే | పురుషాయ పురాణాయ బ్రహ్మణ పరమాత్మనే || 18
నమః ప్రధానదేహాయ ప్రధానక్షోభకారిణ | త్రయోవింశతిభేదేన వికృతాయావికారిణ || 19
నమో బ్రహ్మాండదేహాయ బ్రహ్మాండోదరవర్తినే | తత్ర సంసిద్ధకార్యాయ సంసిద్ధకరణాయ చ || 20
నమో%స్తు సర్వలోకాయ సర్వలోకవిధాయినే | సర్వాత్మదేహసంయోగవియోగవిధిహేతవే || 21
త్వయైవ నిఖిలం సృష్టం సంహృతం పాలితం జగత్ | తథాపి మాయయా నాథ న విద్మస్త్వాం పితామహ || 22
మునులు ఇట్లు పలికిరి -
త్రిమూర్తుల రూపములో సృష్టిస్థితిలయములను చేయువాడు, పురాణపురుషుడు, పరంబ్రహ్మ, పరమాత్మ అగు నీకు నమస్కారము (18). ప్రకృతియే దేహముగా గలవాడు, ప్రకృతియొక్క సామ్యావస్థయందు సంక్షోభమును కలిగించువాడు, ఇరవై మూడు తత్త్వములుగా వికారమును చెందియున్ననూ వికారములు లేనివాడు అగు నీకు నమస్కారము (19). బ్రహ్మాండమే దేహముగా గలవాడు, బ్రహ్మాండముయొక్క ఉదరమునందు ఉండువాడు, దానిలో పరిపూర్తిచేయబడిన జగత్కార్యము గలవాడు, జగత్తును సృష్టించుటయందు పరిపూర్తిని చెందిన క్రియాశక్తి గలవాడు అగు నీకు నమస్కారము (20). సమస్తలోకముల రూపములోనున్నవాడు, సకల లోకములను సృస్టించువాడు, ఆత్మకు సమస్త దేహములతో సంయోగ వియోగములు కలుగుటకు కారణమైనవాడు అగు నీకు నమస్కారమగుగాక! (21) నీవే సర్వజగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నావు. ఓ నాథా! పితామహా! అయిననూ, మేము మాయాప్రభావముచే నిన్ను తెలియలేకున్నాము (22).
సూత ఉవాచ |
ఏవం బ్రహ్మా మహాభాగైర్మహర్షిభిరభిష్టుతః | ప్రాహ గంభీరయా వాచా మునీన్ ప్రహ్లాదయన్నివ || 23
సూతుడు ఇట్లు పలికెను -
మహాత్ములగు మహర్షులచే ఆ విధముగా స్తుతించబడిన బ్రహ్మ మునులకు ఆహ్లాదమును కలిగించుచున్నాడా యన్నట్లు గంభీరమగు వాక్కుతో నిట్లనెను (23).
బ్రహ్మొవాచ |
ఋషయో హే మహాభాగా మహాసత్త్వా మహౌజసః | కిమర్థం సహితాస్సర్వే యూయమత్ర సమాగతాః || 24
తమేవంవాదినం దేవం బ్రహ్మాణం బ్రహ్మవిత్తమాః | వాగ్భిర్వినయగర్భాభిస్సర్వే ప్రాంజలయో% బ్రువన్ || 25
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ బుషులారా! మహాత్ములారా! మీరు గొప్ప తేజస్సు మరియు సాత్త్వికస్వభావము గలవారు. మీరందరు కూడగట్టుకొని ఇచటకు వచ్చుటకు కారణమేమి? (24) ఈ విధముగా పలికిని బ్రహ్మదేవునితో బ్రహ్మవేత్తలగు మునుల అందరు చేతులను జోడించినవారై, వినయముతో నిండియున్న వచనములతో ఇట్లు పలికిరి (25).
మునయ ఊచుః |
భగవన్నంధకారేణ మహతా వయమావృతాః | ఖిన్నా వివదమానాశ్చ న పశ్యామో%త్ర యత్పరమ్ || 26
త్వం హి సర్వజగద్దాతా సర్వకారణకారణమ్ | త్వయా హ్యవిదితం నాథ నేహ కించన విద్యతే || 27
కః పుమాన్ సర్వసత్త్వేభ్యః పురాణః పురుషః పరః | విశుద్ధః పరిపూర్ణశ్చ శాశ్వతః పరమేశ్వరః || 28
కేనైవ చిత్రకృత్యేన ప్రథమం సృజ్యతే జగత్ | తత్త్వం వద మహాప్రాజ్ఞ స్వసందేహాపనుత్తయే || 29
ఏవం పృష్టస్తదా బ్రహ్మా విస్మయస్మేరవీక్షణం | దేవానాం దానవానాం చ మునీనామపి సన్నిధౌ || 30
ఉత్థాయ సుచిరం ధ్యాత్వా రుద్ర ఇత్యుచ్చరన్ గిరమ్ | ఆనందక్లిన్నసర్వాంగః కృతాంజలిరభాషత || 31
ఇతిశ్రీశివమమాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే మునిప్రశ్నవర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2).
మునులు ఇట్లు పలికిరి -
హే భగవాన్! మేము పెను చీకటిచే ఆవరింపబడి ఖేదమును పొందినవారమై కలహించుచున్నాము. ఈ జగత్తులో సర్వోత్కృష్టమైన తత్త్వమును తెలియలేకున్నాము (26). నీవు సకల జగత్తును సృష్టించినవాడవు; కారణములన్నింటికీ కారణమైనవాడవు. ఓ నాథా! ఈ లోకములో నీకు తెలియనది ఏదీ లేదు (27). సర్వప్రాణులకంటె పూర్వమునందు ఉన్నవాడు, సర్వోత్కృష్టుడు, సంసారదోషములు లేనివాడు, పరిపూర్ణుడు, వినాశము లేనివాడు, పరమేశ్వరుడు అగు పురుషుడు ఎవరు? (28) ఎవని విచిత్రమగు కార్యముచే ముందుగా జగత్తు సృష్టించబడుచున్నది? ఓ మహాబుద్ధిశాలీ! మా సందేహములను పోగొట్టుటకై ఈ సత్యమును చెప్పుము (29). ఈ విధముగా వారు ప్రశ్నించగా, అపుడు బ్రహ్మ ఆశ్చర్యపడినవాడై చిరునవ్వు కన్నులలో కానవచ్చుచుండగా దేవతలు దానవులు మరియు మహర్షుల సన్నిధిలో (30) లేచి నిలబడి చాలసేపు ఆలోచించి రుద్రుడు అను పదమును పలికి, ఆనందముతో గగుర్పాటును చెందిన సకలమగు అవయవములు గలవాడై, చేతులను జోడించి, ఇట్లు పలికెను (31).
శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో మునులు బ్రహ్మను ప్రశ్నించుటను వర్ణించే రెండవ అధ్యాయము ముగిసినది (2).