Siva Maha Puranam-4
Chapters
అథ చతుర్థో
సత్రయాగమునకు వాయుదేవుడు విచ్చేయుట
సూత ఉవాచ |
తస్మిన్ దేశే మహాభాగా మునయశ్శంసితవ్రతాః | అర్చయంతో మహాదేవం సత్రమారేభిరే తదా || 1
తత్ర సత్రం ప్రవవృతే సర్వాశ్చర్యం మహర్షిణామ్ | విశ్వం సిసృక్షమాణానాం పురా విశ్వసృజామివ || 2
అథ కాలే గతే సత్రే సమాప్తే భూరిదక్షణ | పితామహనియోగేన వాయుస్తత్రాగమత్స్వయమ్ || 3
శిష్యస్స్వయంభువో దేవస్సర్వప్రత్యక్షదృగ్వశీ | అజ్ఞాయాం మరుతో యస్య సంస్థితాస్సప్తసప్తకాః || 4
ప్రేరయన్ శశ్వదంగాని ప్రాణాద్యాభిస్స్వవృత్తిభిః | సర్వభూతశరీరాణాం కురుతే యశ్చ ధారణమ్ || 5
అణిమాదిభిరష్టాభిరైశ్వర్యైశ్చ సమన్వితః | తిర్యక్కారాదిభిర్మేధ్యైర్భువనాని బిభర్తి యః || 6
ఆకాశయోనిర్ద్విగుణస్స్పర్శశబ్దసమన్వయాత్ | తేజసాం ప్రకృతిశ్చేతి యమాహుస్తత్త్వచింతకాః || 7
తమాశ్రమగతం దృష్ట్వా మునయో ధీర్ఘసత్రిణః | పితామహవచస్స్మృత్వా ప్రహర్షమతులం యయుః || 8
అభ్యుత్థాయ తతస్సర్వే ప్రణమ్యాంబరసంభవమ్ | చామీకరమయం తసై#్మ విష్టరం సమకల్పయన్ || 9
సో%పి తత్ర సమాసీనో మునిభిస్సమ్యగర్చితః | ప్రతినంద్య చ తాన్ సర్వాన్ పప్రచ్ఛ కుశలం తతః || 10
సూతుడు ఇట్లు పలికెను -
మహాత్ములు, కొనియాడబడే వ్రతము గలవారు అగు మునులు అపుడు ఆ స్థానము నందు మహాదేవుని పూజిస్తూ సత్రయాగమునారంభించిరి (1). అచట పూర్వము జగత్తును సృష్టించగోరిన ప్రజాపతుల సత్రయాగము వలెనే, సర్వులకు ఆశ్చర్యమును కలిగించే మహర్షుల సత్రయాగము కూడ ఆరంభమయ్యెను (2). తరువాత కొంత కాలమునకు అధికమగు దక్షిణలు ఈయబడిన ఆ సత్రయాగము పూర్తి అయ్యెను. అపుడు అచటకు బ్రహ్మగారి ఆదేశముచే వాయువు స్వయముగా విచ్చేసెను (3). బ్రహ్మగారి శిష్యుడు, సర్వమును ప్రత్యక్షముగా దర్శించువాడు, స్వతంత్రుడు అగు వాయుదేవుని ఆజ్ఞను నలభై తొమ్మిది మంది మరుత్తులు పాలించుచుందురు (4). ఆయన సర్వకాలములలో తన ప్రాణాపానాదివృత్తులతో అవయవములకు కదిలే శక్తిని ఇస్తూ, సర్వప్రాణుల శరీరములను నిలబెట్టుచున్నాడు (5). అణిమ (తేలికగా అయ్యే సిద్ధి) మొదలగు ఎనిమిది సిద్ధులతో కూడియున్న ఆయన పవిత్రము చేసే గాలులను భూమికి సమాంతరముగా వీచి, లోకములను నిలబెట్టుచున్నాడు (6). ఆకాశమునుండి పుట్టినవాడు, శబ్దము మరియు స్పర్శ అనే రెండు గుణములు ఉండుటచే ఆకాశము కంటె రెట్టింపు గుణములు గలవాడు అగు వాయువు అగ్నికి కారణమని తత్త్వములను వర్ణించే విద్వాంసులు చెప్పెదరు (7). ఆశ్రమమునకు విచ్చేసిన ఆ వాయువును చూచి దీర్ఘమగు సత్రయాగమును చేసియున్న మునులు బ్రహ్మగారి మాటలను గుర్తు చేసుకొని, సాటి లేని హర్షమును పొందిరి (8). అపుడు వారందరు లేచి నిలబడి, ఆకాశపుత్రుడగు వాయువునకు నమస్కరించి, ఆయన కొరకు బంగరు ఆసనమును ఏర్పాటు చేసిరి (9). ఆయన దానియందు కూర్చుండి మునులచే పూజింబపడినవాడై, వారిని అభినందించి, తరువాత వారిని అందరినీ కుశల ప్రశ్నలను వేసెను (10).
వాయురువాచ |
అత్ర వః కుశలం విప్రాః కచ్చిద్వృత్తే మహాక్రతౌ | కచ్చిద్యజ్ఞహనో దైత్యా న బాధేరన్ సురద్విషః || 11
ప్రాయశ్చిత్తం దురిష్టం వా న కశ్చిత్సమజాయత | స్తోత్రశస్త్ర గ్రహైర్దేవాన్ పితౄన్ పిత్ర్యైశ్చ కర్మభిః || 12
కచ్చిదభ్యర్చ్య యుష్మాభిర్విధిరాసీత్స్వనుష్ఠితః | నివృత్తే చ మహాసత్రే పశ్చాత్కిం వశ్చికీర్షితమ్ || 13
ఇత్యుక్తా మునయస్సర్వేవాయునా శివభావినా | ప్రహృష్టమనసః పూతాః ప్రత్యూచుర్వినయాన్వితాః || 14
వాయువు ఇట్లు పలికెను-
ఓ బ్రాహ్మణులారా ! ఈ గొప్ప యజ్ఞము కొనసాగుచుండగా మీరు ఇచట క్షేమముగా నుంటిరా ? యజ్ఞములను చెడగొట్టే రాక్షసులు మిమ్ములను బాధించలేదు గదా? (11) ప్రాయశ్చిత్తము గాని, ఆపద గాని ఏదీ సంభవించలేదు గదా ? స్తోత్రములతో, సూక్తములతో, గ్రహములతో (సోమరసమును గ్రహించే పాత్రలు) దేవతలను మరియు పితృకర్మలతో పితృదేవతలను మీరు యథావిధిగా పూజించి, కర్మకాండను చక్కగా అనుష్ఠించినారా? ఈ గొప్ప సత్రయాగము పూర్తి అయిన తరువాత మీరు ఏమి చేయగోరుచున్నారు? (12,13) శివుని ధ్యానించే వాయువు ఇట్లు పలుకగా, మునులందరు సంతోషముతో నిండిన మనస్సులు గలవారై, వాయువుయొక్క దర్శనముచే పవిత్రులై, వినయముతో కూడినవారై ఇట్లు పలికిరి (14).
మునయ ఊచుః |
అద్య నః కుశలం సర్వమద్య సాధు భ##వేత్తపః | అస్మచ్ఛ్రే యో%భివృద్ధ్యర్థం భవానత్రాగతో యతః || 15
శృణు చేదం పురా వృత్తం తమసా%క్రాంతమానసైః | ఉపాసితః పురా % స్మాభిర్విజ్ఞానార్థం ప్రజాపతిః || 16
సో%ప్యస్మాననుగృహ్యాహ శరణ్యశ్శరణాగతాన్ | సర్వస్మాదధికో రుద్రో విప్రాః పరమకారణమ్ || 17
తమప్రతర్క్యయాథాత్మ్యం భక్తిమానేవ పశ్యతి | భక్తిశ్చాస్య ప్రసాదేన ప్రసాదాదేవ నిర్వృతిః || 18
తస్మాదస్య ప్రసాదార్ధం నైమిషే సత్రయోగతః | యజ్యధ్వం దీర్ఘసత్రేణ రుద్రం పరమకారణమ్ || 19
తత్ర్ప సాదేన సత్రాంతే వాయుస్తత్రాగమిష్యతి | తన్ముఖాత్ జ్ఞానలాభో వస్తత్ర శ్రేయో భవిష్యతి || 20
ఇత్యాదిశ్య వయం సర్వే ప్రేషితాః పరమేష్ఠినా | అస్మిన్ దేశే మహాభాగ తవా గమనకాంక్షిణః || 21
దీర్ఘసత్రం సమాసీనా దివ్యవర్షసహస్రకమ్ | అతస్తవాగమాదన్యత్ర్పా ప్యం నో నాస్తి కించన || 22
ఇత్యాకర్ణ్య పురావృత్తమృషీణాం దీర్ఘసత్రిణామ్ | వాయుః ప్రీతమనా భూత్వా తత్రాసీన్మునిసంవృతః || 23
తతసై#్తర్మునిభిః పృష్టస్తేషాం భావవివృద్ధయే | సర్గాది శార్వమైశ్వర్యం సమాసాదవదద్విభుః || 24
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే వాయు సమాగమో నామ చతుర్థో%ధ్యాయః (4).
మునులు ఇట్లు పలికిరి -
ఈనాడు మాకు సర్వము కుశలము. ఈనాడు మా తపస్సు బాగుగా నున్నది. ఏలయనగా, మాశ్రేయస్సును అభివృద్ధి చేయుట కొరకై నీవు ఇచటకు విచ్చేసితివి (15). నీవీ పూర్వవృత్తాంతమును వినుము. అజ్ఞానముచే ఆక్రమించబడిన మనస్సులు గల మేము పూర్వము జ్ఞానము కొరకై బ్రహ్మగారిని ఉపాసించితిమి (16). శరణాగతవత్సలుడగు ఆయన శరణుజొచ్చిన మమ్ములను అనుగ్రహించి, ఇట్లు పలికెను : ఓ బ్రాహ్మణులారా! సర్వకారణకారణుడగు రుద్రుడు అందరి కంటె అధికుడు (17). తర్కమునకు అందని ఆయన యొక్క స్వరూపమును భక్తి గలవాడు మాత్రమే చూడగల్గును. శివుని అనుగ్రహము వలన భక్తి కలుగును. అనుగ్రహము వలన మాత్రమే మోక్షము కలుగును (18). కావున, పరమకారణుడగు రుద్రుని అనుగ్రహము కొరకై నైమిషారణ్యములో దీర్ఘకాలము సాగే సత్రయాగమును సాధనముగా చేసుకొని ఆయనను ఆరాధించుడు (19). సత్రయాగము పూర్తి అయిన పిదప, ఆయన యొక్క అనుగ్రహముచే అచటకు వాయుదేవుడు రాగలడు. అపుడు ఆయన ముఖము నుండి మీకు జ్ఞానము లభించి, శ్రేయస్సు కలుగగలదు (20). బ్రహ్మగారు ఈ విధముగా ఆదేశించి మమ్ములను అందరినీ పంపివేసెను. ఓ మహాత్మా! మేమీ స్థానములో నీ రాకకొరకు ఎదురు చూచుచున్నాము(21). మేము వేయి దివ్యసంవత్సరముల కాలము కొనసాగే దీర్ఘసత్రయాగమును చేయుచున్నాము. కావున, నీ రాకను మించి మరియొక దానిని మేము కోరుట లేదు (22). దీర్ఘమగు సత్రయాగమును చేయుచున్న మునులయొక్క ఈ పూర్వవృత్తాంతమును విని, మునులచే చుట్టువార బడియున్న వాయువు మనస్సులో సంతోషించి, అక్కడ ఉండెను (23). అపుడా మునులు భక్తి వర్ధిల్లుట కొరకై ఆయనను ప్రశ్నించగా, ఆ ప్రభుడు శివుని యొక్క సృష్టి మొదలగు ఈశ్వరభావమును గురించి సంగ్రహముగా చెప్పెను (24).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయొక్క పూర్వభాగమునందు వాయుదేవుడు సత్రయాగమునకు విచ్చేయుటను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).