Siva Maha Puranam-4
Chapters
అథ పంచత్రింశో
సూర్యుని గాథ
సూత ఉవాచ |
వివస్వాన్ కశ్యపాజ్జజ్ఞే దాక్షాయణ్యాం మహాఋషేః | తస్య భార్యా%భవత్సంజ్ఞా త్వాష్ట్రీదేవీ సురేణుకా || 1
మునే%సహిష్ణునా తేన తేజసా దుస్సహేన చ | భర్తృరూపేణ నాతుష్యద్రూప¸°వనశాలినీ || 2
ఆదిత్యస్య హి తద్రూపమసహిష్ణుస్సుతేజసః | దహ్యమానా తదోద్వేగమకరో ద్వరవర్ణినీ || 3
ఋషే%స్యాం త్రీణ్యపత్యాని జనయామాస భాస్కరః | సంజ్ఞాయాం తు మనుః పూర్వం శ్రాద్ధదేవః ప్రజాపతిః || 4
యమశ్చ యమునా చైవ యమలౌ సంబభూవతుః | ఏవం హి త్రీణ్యపత్యాని తస్యాం జాతాని సూర్యతః || 5
సంవర్తులం తు తద్రూపం దృష్ట్యా సంజ్ఞా వివస్వతః | అసహంతీ తతశ్ఛాయామాత్మనస్సా%సృజచ్ఛుభామ్ || 6
మాయామయీ తు సా సంజ్ఞామవోచద్భక్తితశ్శుభే | కిం కరోమీహ కార్యం తే కథయస్వ శుచిస్మితే || 7
సూతుడు ఇట్లు పలికెను -
కశ్యపమహర్షికి దక్షుని కుమార్తెయందు సూర్యుడు జన్మించెను. ఆయనకు త్వష్టుని కుమార్తెయగు సంజ్ఞ భార్య ఆయెను. ఆమెకు సురేణుక అని కూడ పేరు గలదు (1). ఓమునీ! రూపముతో మరియు ¸°వనముతో ప్రకాశించే ఆ సంజ్ఞ భర్త అనే రూపములో నున్న దుస్సహమగు తేజస్సును సహించలేకపోయెను. ఆమెకు ఆనందము లేకుండెను (2). సూర్యుని ఆ మహాతేజస్వంతమగు రూపమును సహించుట అసంభవము. సుందరియగు ఆ సంజ్ఞ ఆ తేజస్సుచే తపింపజేయబడి దుఃఖమును పొందెను (3). ఓ మహర్షీ! ఆ సంజ్ఞయందు సూర్యునకు ముందుగా ప్రజాపతియగు శ్రాద్ధదేవమనువు, తరువాత యముడు మరియు యమున అనే కవల పిల్లలు, వెరసి ముగ్గురు సంతానము కలిగెను (4,5). అగ్నిహోత్రము వలె సంహింప శక్యము కాని ఆ సూర్యుని రూపమును గాంచి ఆ సంజ్ఞ సహించలేనిదై తన యొక్క శుభకరమైన ఛాయను సృష్టించెను (6). మాయాస్వరూపరాలగు ఆ ఛాయ సంజ్ఞతో భక్తిపూర్వకముగా నిట్లనెను : ఓ మంగళస్వరూపురాలా ! స్వచ్ఛమగు చిరునవ్వు గలదానా ! నేను నీకు చేయదగిన కార్యము ఏమి ? చెప్పుము (7)
సంజ్ఞోవాచ |
అహం యస్యామి భద్రం తే మమైవ భవనం పితుః | త్వయైతద్భవనే సత్యం వస్తవ్యం నిర్వికారతః || 8
ఇమౌ మే బాలకౌ సాధూ కన్యా చేయం సుమధ్యమా | పాలనీయాస్సుఖేనైవ మమ చేదిచ్ఛసి ప్రియమ్ || 9
సంజ్ఞ ఇట్లు పలికెను -
నీకు శుభమగుగాక! నేను నా తండ్రియొక్క నివాసమునకు వెళ్లిపోయెదను. నీవు వికారములు ఏమియు లేకుండగా ఈ భవనమునందు నివసించుము. ఇది యథార్థము (8). నాకు ప్రీతిని కలిగించవలెననే ఇచ్ఛ నీకు ఉన్నచో, నా ఈ ఇద్దరు బాలకులను మరియు సుందరియగు ఈ అమ్మాయిని చక్కగా పాలించుము (9).
ఛాయోవాచ |
ఆకేశగ్రహణాద్దేవి సహిష్యే%హం సుదుష్కృతమ్ | నాఖ్యాస్యామి మతం తుభ్యం గచ్ఛ దేవి యథాసుఖమ్ || 10
ఛాయ ఇట్లు పలికెను -
ఓ దేవీ ! జుట్టును పట్టుకొని లాగుట మొదలైన సకలదుష్టచేష్టలను నేను సహించెదను. నా ఇబ్బందులను నా అభిప్రాయమును నీకు చెప్పను. నీవు సుఖముగా వెళ్లుము (10).
సూత ఉవాచ |
ఇత్యుక్తా సా%గమద్దేవీ వ్రీడితా సన్నిధౌ పితుః | పిత్రా నిర్భర్త్సితా తత్ర నియుక్తా సా పునః పునః || 11
అగచ్ఛద్వడవా భూత్వా%%చ్ఛాద్య రూపం తతస్స్వకమ్ | కురూంస్తదోత్తరాన్ ప్రాప్య నృణాం మధ్యే చచార హ || 12
సంజ్ఞాం తాం తు రవిర్మత్వా ఛాయాయాం సుసుతం తదా | జనయామాస సావర్ణిం మనుంవై సవితా కిల || 13
సంజ్ఞా%ను ప్రార్థితా ఛాయా సా స్వపుత్రే%పి నిత్యశః | చకారాభ్యధికం స్నేహం న తథా పూర్వజే సుతే || 14
అనుజశ్చాక్షమస్తత్తు యమస్తం నైవ చక్షమే | స సరోషస్తు బాల్యాచ్చ భావినో%ర్థస్య గౌరవాత్ || 15
ఛాయాం సంతర్జయామాస యదా వైవస్వతో యమః | తం శశాప తతః క్రోధాచ్ఛాయా తు కలుషీకృతా || 16
చరణః పతతామేష తవేతి భృశరోషితః | యమస్తతః పితుస్సర్వం ప్రాంజలిః ప్రత్యవేదయత్ || 17
భృశం శాపభయోద్విగ్నస్సంజ్ఞావాక్యైర్విచేష్టితః | మాత్రా స్నేహేన సర్వేషు వర్తితవ్యం సుతేషు వై || 18
స్నేహమస్మాస్వపాకృత్య కనీయాంసం భిభర్తి సా | తస్మాన్మయోద్యతః పాదస్తద్భవాన్ క్షంతుమర్హతి || 19
శప్తోహమస్మి దేవేశ జనన్యా తపతాం వర | తవ ప్రసాదాచ్చరణో నపతేన్మమ గోపతే || 20
సూతుడు ఇట్లు పలికెను -
ఆ దేవి ఇట్లు పలికి సిగ్గు పడుతూ తండ్రి వద్దకు వెళ్లెను. కాని తండ్రి ఆమెపై కోపించి భర్తవద్దకు వెళ్లుమని పదే పదే ఆదేశించుచుండెను (11). అపుడామె నిజరూపమును కప్పిపుచ్చి ఆడు గుర్రము రూపమును దాల్చి ఉత్తరకురుదేశములకు వెళ్లి మానవుల మధ్యలో సంచరించుచుండెను (12). ఇంతలో సూర్యుడు ఛాయయే సంజ్ఞయని భావించుచుండెను. ఆయనకు ఆమెయందు ఒక కుమారుడు కలిగెను. అతడే సావర్ణి మనువు (13). సంజ్ఞచే ప్రార్థింపబడి యున్ననూ, ఛాయ నిత్యము తన పుత్రునియందు మాత్రమే అత్యధికమగు ప్రేమను చూపుతూ, పెద్ద కుమారునియందు అట్టి ప్రేమను చూపుట మానివేసెను (14). పెద్ద సోదరుడగు యముడు ఆ పరిస్థితిని సహించలేక పోయెను. బాలుడై యుండుట వలన మరియు జరుగబోయే ఘటనలను నిర్దేశించే విధి బలీయమగుట వలన, క్రోధముతో నిండియున్న సూర్యపుత్రుడగు యముడు ఛాయను బెదిరించెను. అపుడు ఛాయ క్రోధముతో కలుషితమైన మనస్సు గలదై, నీ ఈ పాదము భగ్నమగును గాక! అని ఆయనను శపించెను. అపుడు యముడు సూర్యునకు చేతులను జోడించి నమస్కరించి జరిగిన విషయమునంతనూ విన్నవించెను (15-17). నేను శాపభయముచే చాల కంగారు పడితిని. సంజ్ఞయొక్క వచనములు నన్ను నిశ్చేష్టుని చేసినవి. తల్లి తన పిల్లలు అందరియందు సమానమగు ప్రేమను చూపవలెను గదా ! (18). ఆమె మాయందు ప్రేమను తప్పించి చిన్న తమ్ముని మాత్రమే ప్రేమించుచున్నది. కావుననే, నేను కాలిని పైకి ఎత్తితిని. కావున, మీరు నన్ను క్షమించుడు (19). ఓ దేవదేవా ! ప్రకాశించు వారిలో నీవు శ్రేష్ఠుడవు. తల్లి నన్ను శపించినది. ఓ ప్రకాశస్వరూపా ! నీ అనుగ్రహముచే నా పాదము భగ్నము కాకుండును గాక ! (20).
సవితోవాచ |
అసంశయం పుత్ర మహద్భవిష్యత్యత్ర కారణమ్ | యేన త్వామావిశత్ర్కోధో ధర్మజ్ఞం సత్యవాదినమ్ || 21
న శక్యతే తన్మిథ్యావై కర్తుం మాతృవచస్తవ | కృమయో మాంసమాదాయ గమిష్యంతి మహీతలే || 22
తద్వాక్యం భవితా సత్యం త్వం చ త్రాతౌ భవిష్యసి | కురు తాత న సందేహం మనశ్చాశ్వాస్య స్వం ప్రభో || 23
సూర్యుడు ఇట్లు పలికెను -
ఓ కుమారా ! ధర్మజ్ఞుడవు మరియు సత్యవాదివి అగు నీకు కోపావేశము వచ్చినదనగా, దీనికి నిస్సందేహముగా పెద్ద కారణము ఉండియుండును (21). నీ తల్లియొక్క ఆ వచనమును మిథ్యగా చేయుట సంభవము కాదు. క్రిములు నీ పాదము యొక్క మాంసమును గ్రహించి భూమి లోపలికి ప్రవేశించ గలవు (22). ఆమెయొక్క వచనము సత్యము కాగలదు. కాని నీకు కూడరక్షణ లభించగలదు. ఓ పుత్రా! నీవు సందేహమును పెట్టుకొనుకుము. నీవు సమర్థుడవు. నీ మనస్సును నీవే ఊరడించుకొనుము (23).
సూత ఉవాచ |
ఇత్యుక్త్వా తనయం సూర్యో యమసంజ్ఞం మునీశ్వర | ఆదిత్యాశ్చాబ్రవీత్తాం తు ఛాయాం క్రోధసమన్వితః || 24
సూతుడు ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! అదితిపుత్రుడగు సూర్యుడు యముడనే పేరు గల తన కుమారునితో ఇట్లు పలికి, కోపముతో నిండియున్నవాడై ఆ ఛాయతో నిట్లనెను (24).
సూర్య ఉవాచ |
హే ప్రియే కుమతే చండి కిం త్వయా%%చరితం కిల | కిం తు మే%భ్యధికస్స్నేహ ఏతదాఖ్యాతుమర్హసి || 25
సూర్యుడు ఇట్లు పలికెను -
ఓసీ ప్రియురాలా ! దుష్టబుద్ధీ ! క్రూరాత్మురాలా ! నీవు ఏమి పనిని చేసితివి ? నీకు నా పుత్రులలో ఒకనిపై మాత్రమే అధికమగు ప్రేమ ఉండుటకు కారణమేమి ? ఈ విషయమును నీవు నాకు చెప్పదగుదువు (25).
సూత ఉవాచ |
సా రవేర్వచనం శ్రుత్వా యథా తథ్యం న్యవేదయత్ | నిర్దగ్ధా కామరవిణా సాంత్వయామాస వై తదా || 26
సూతుడు ఇట్లు పలికెను -
ఆమె సూర్యుని ఈ పలుకులను విని ఉన్న విషయమును యథాతథముగా విన్నవించుకొనెను. సూర్యకిరణములచే తాపమును పొందిన ఆమె అపుడు ఆయనను ఇట్లు ఓదార్చెను (26).
ఛాయోవాచ |
తవాతితేజసా దగ్ధా ఇదం రూపం న శోభ##తే | అసహంతీ చ తత్సంజ్ఞా వనే వసతి శాద్వలే || 27
శ్లాఘ్యా యోగబలోపేతా యోగమాసాద్య గోపతే | అనుకూలస్తు దేవేశ సందిశ్యాత్మమయం మతమ్ || 28
రూపం నివర్తయామ్యద్య తవ కాంతం కరోమ్యహమ్ |
ఛాయ ఇట్లు పలికెను -
నీ ఈ రూపము శోభిల్లుట లేదు. నీ తీవ్రతేజస్సుచే తపింపచేయ బడినదై దానిని సహించలేక సంజ్ఞ అడవిలో పచ్చికబయలులో బ్రతుకుచున్నది (27). ఓ రశ్మిపతీ ! ఆమె యోగమును చేపట్టి యోగబలమును పొందియున్నది. ఆమె కొనియాడదగినది. ఓ దేవదేవా ! నీవు నీ మనస్సులోని మాటను ఆమెకు సందేశముగా పంపి, ఆమెకు అనుకూలుడవు కమ్ము (28). నేను నీ క్రోధరూపమును మళ్లింపజేయుచున్నాను. నిన్ను సుందరునిగా నేను తీర్చి దిద్దెదను.,
సూత ఉవాచ |
తచ్ఛ్రుత్వా%పగతః క్రోధో మార్తండస్య వివస్యతః || 29
భ్రమిమారోప్య తత్తేజశ్శాతయామాస వై మునిః | తతో విభ్రాజితం రూపం తేజసా సంవృతేన చ || 30
కృతం కాంతతరం రూపం త్వష్ట్ర్వా తచ్ఛుశుభే తదా | తతోభియోగమాస్థాయ స్వాం భార్యాం హి దదర్శ హ || 31
అధృష్యాం సర్వభూతానాం తేజసా నియమేన చ | సో%శ్వరూపం సమాస్థాయ గత్వా తాం మైథునేచ్ఛయా || 32
మైథునాయ విచేష్టంతీం పరుపుంసోభిశంకయా | ముఖతో నాసికాయాం తు శుక్రం తత్ వ్యదధాన్మునే || 33
దేవౌ తతః ప్రజాయేతామశ్వినౌ భిషజాం వరౌ | నాసత్యౌ తౌ చ దస్రౌ చస్మృతౌ ద్వావశ్వినావపి || 34
తౌ తు కాంతేన రూపేణ దర్శయా మాస భాస్కరః | ఆత్మానం సా తు తం దృష్ట్వా ప్రహృష్టా పతిమాదరాత్|| 35
పత్యా తేన గృహం ప్రాయాత్స్వం సతీ ముదితాననా | ముముదాతే%థ తౌ ప్రీత్యా దంపతీ పూర్వతోధికమ్ || 36
యమస్తు కర్మణా తేన భృశం పీడితమానసః | ధర్మేణ రంజయామాస ధర్మరాజ ఇమాః ప్రజాః || 37
లేభే స కర్మణా తేన ధర్మరాజో మహాద్యుతిః | పితృణామాధిపత్యం చ లోకపాలత్వమేవ చ || 38
మనుః ప్రజాపతిస్త్వాసీత్సావర్ణిస్స తపోధనః | భావ్యస్స కర్మణా తేన మనోస్సావర్ణికేంతరే || 39
మేరపృష్ఠే తపో ఘోరమద్యాపి చరతే ప్రభుః | యవీయసీ తయోర్యా తు యమీ కన్యా యశస్వినీ || 40
అభవత్సా సరిచ్ఛ్రేష్ఠా యమునా లోకపావనీ | మనురిత్యుచ్యతే లోకే సావర్ణిరితి చోచ్యతే || 41
య ఇదం జన్మ దేవానాం శృణుయాద్ధారయేత్తు వా | ఆపదం ప్రాప్య ముచ్యేత ప్రాప్నుయాత్సుమహద్యశః || 42
ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం వేవస్వతవర్ణనం నామ పంచత్రింశో%ధ్యాయః (35).
సూతుడు ఇట్లు పలికెను -
ఆ మాటను వినిన సూర్యుని కోపము తగ్గెను (29). మహర్షియగు త్వష్ట ఆయనను చక్రముపైకి ఎక్కించి సానపట్టి తేజస్సు తగ్గునట్లు చేసెను. అప్పుడు తీవ్రప్రకాశము గల ఆయన రూపములో కొంత తేజస్సు తగ్గెను. (30). త్వష్టచే మరింత సుందరముగా తీర్చిదిద్దబడిన ఆయన రూపము చక్కగా ప్రకాశించెను. అపుడాయన యోగశక్తిని ఆశ్రయించి తన భార్యను చూచెను (31). ఆమె తపోనియమము గలదై సర్వప్రాణులకు దరిచేర శక్యము కాని తేజస్సుతో నుండెను. సూర్యుడు ఆమెతో సంగమించ గోరి గుర్రము రూపములో వెళ్లెను (32). ఓ మునీ ! ఆమెకు ఆతనియందు పరపురుషుడనే శంక కలిగెను. ఆ శుక్రము నాసికయందు నిక్షేపించబడెను (33). అపుడు వైద్య శ్రేష్ఠులగు అశ్వినీ దేవతలు జన్మించిరి. ఆ ఇద్దరు అశ్వినీ దేవతలకు నాసత్యులనియు, దస్రులనియు కూడ పేర్లు ప్రసిద్ధిని గాంచెను (34). సూర్యుడు తన సుందరమగు రూపమును వారిద్దరికి చూపించెను. సంజ్ఞ భర్తను గాంచి చాల సంతోషించి, ఆదరించెను (35). ఆ పతివ్రత సంతోషముతో నిండిన ముఖము గలదై తన భర్తతో గూడి స్వగృహమునకు వెళ్లెను. తరువాత ఆ దంపతులు పూర్వము కంటె అధికముగా ఆనందించిరి (36). ఈ ఘటన యముని మనస్సును చాల కలత పెట్టెను. ఆ యమధర్మరాజు ఈ ప్రజలను ధర్మముతో పాలించి సంతోషపెట్టెను. (37). గొప్ప ప్రకాశము గల యమధర్మరాజు ప్రజలను ధర్మముతో పాలించుట వలన పితృదేవతలపై ఆధిపత్యమును మరియు లోకపాలపదవిని పొందెను. (38). తపోధనుడగు ఆ సావర్ణి ప్రజాపతి ఆయెను. ఆ ఘటన వలన ఆయన మనుపు కాగలడు. ఆయన రాజ్యము చేసిన కాలమునకు సావర్ణికమన్వంతరమని పేరు (39). సమర్థుడగు ఆ మనువు ఇప్పటికీ మేరుశిఖరముపై ఘోరమగు తపస్సును చేయుచున్నాడు. వారి చిన్న చెల్లెలు అగు యమి అనే కన్య కీర్తిని గాంచెను (40). ఆమె యమునా అనే గొప్ప నదియై జనులను పావనము చేయుచున్నది. లోకములో సావర్ణి మనువు ప్రసిద్ధిని గాంచినాడు (41). ఈ దేవతల జన్మవృత్తాంతమును ఎవడైతే వినునో, కంఠస్థము చేయునో, వానికి వచ్చిన ఆపద తొలగిపోవును. ఆతడు చాల గొప్పకీర్తిని పొందును (42).
శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు సూర్యుని గాథను వర్ణించే ముప్పది ఐదవ ఆధ్యాయము ముగిసినది (35).