Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకాదశో%ధ్యాయః

వరాహావతార వర్ణనము

మునయ ఊచుః |

మన్వంతరాణి సర్వాణి కల్పభేదాంశ్చ సర్వశః | తేష్వేవాంతరసర్గంచ ప్రతిసర్గంచ నో వద || 1

మునులు ఇట్లు పలికిరి-

మన్వంతరములను అన్నింటినీ, కల్పములలోని భేదములను అన్నింటినీ, మరియు వాటిలోననే గల అవాంతరసృష్టిని మరియు ప్రతిసృష్టిని గురించి మాకు చెప్పుము (1).

కాలసంఖ్యావివృత్తస్య పరార్ధో బ్రహ్మణస్స్మృతః | తావాంశ్చైవాస్య కాలో% న్యస్తస్యాంతే ప్రతిసృజ్యతే || 2

దివసే దివసే తస్య బ్రహ్మణః పూర్వజన్మనః | చతుర్దశ మహాభాగా మనూనాం పరివృత్తయః || 3

అనాదిత్వాదనంతత్వాదజ్ఞేయత్వాచ్చ కృత్స్నశః | మన్వంతరాణి కల్పాశ్చ న శక్యా వచనాత్పృథక్‌ || 4

ఉక్తేష్వపి చ సర్వేషు శృణ్వతాం వో వచో మమ | కిమిహాస్తి ఫలం తస్మాన్న పృథగ్వక్తుముత్సహే || 5

య ఏవ ఖలు కల్పేషు కల్పస్సంప్రతి వర్తతే | తత్ర సంక్షిప్య వర్తంతే సృష్టయః ప్రతిసృష్టయః || 6

యస్త్వయం వర్తతే కల్పోవారాహో నామ నామతః | అస్మిన్నపి ద్విజశ్రేష్ఠా మనవస్తు చతుర్దశ || 7

స్వాయంభువాదయస్సప్త సప్త సావర్ణికాదయః | తేషు వైవస్వతో నామ సప్తమో వర్తతే మనుః || 8

మన్వంతరేషు సర్వేషు సర్గసంహారవృత్తయః | ప్రాయస్సమా భవంతీతి తర్కః కార్యో విజానతా || 9

పూర్వకల్పే పరావృత్తే ప్రవృత్తే కాలమారుతే | సన్ముమూలితమూలేషు వృక్షేషు చ వనేషు చ || 10

జగంతి తృణవత్త్రీణి దేవే దహతి పావకే | వృష్ట్యా భువి నిషిక్తాయాం వివేలేష్వర్ణవేషు చ || 11

కాలముయొక్క పరిమాణమును బట్టి వచ్చి పోయే బ్రహ్మగారి ఆయుష్షులో మొదటి భాగము పరార్ధమనియు, ద్వితీయభాగము మరియొక పరార్ధమనియు చెప్పబడినది. ఆ తరువాత మరల సృష్టి ఆరంభమగును (2). సృష్టిలో మున్ముందు జన్మించిన ఆ బ్రహ్మయొక్క ప్రతి పగలునందు పదునల్గురు మహాత్ములగు మనువులు మారిపోవుచుందురు (3). ఈ మన్వంతరములు మరియు కల్పములు ఆది-అంతములు లేనివి. కావున, వాటిని గురించి పూర్తిగా తెలియుట సంభవము కాదు. కాబట్టి, వాటిని గురించి వేరుగా చెప్పుట శక్యము కాదు (4). ఒకచో నేను అన్నింటినీ చెప్పిననూ, వాటి గురించి నా వర్ణనలను వినుట వలన మీకు ప్రయోజనము ఏమి గలదు? కావున, వాటిని గురించి వేర్వేరుగా చెప్పే ఉత్సాహము నాకు లేదు (5). ఆ కల్పములన్నింటిలో ప్రస్తుతము ఏ కల్పము జరుగుచున్నదో, దానియందు ఏ సృష్టులు మరియు పునఃసృష్టులు గలవో, వాటిని గురించి సంక్షేపముగా చెప్పెదను (6). ఇప్పుడు గడుచుచున్న కల్పమునకు వారాహకల్పమని పేరు ప్రసిద్ధముగా నున్నది. ఓ బ్రాహ్మణశ్రేష్ఠులారా! దీనియందు కూడా స్వాయంభువమనువుతో మొదలయ్యే ఏడుగురు, సావర్ణితో మొదలయ్యే ఏడుగురు వెరసి పదునల్గురు మనువులు గలరు. వారిలో ఏడవ వాడు వైవస్వత మనువు (7,8). మన్వంతరములన్నింటియందు సృష్టికార్యము మరియు సంహారకార్యము ఇంచుమించు సమానముగా నుండునని విద్వాంసుడు ఊహించవలెను (9). దీనికి ముందరి కల్పము గడచి పోయినది. ప్రళయకాలవాయువులు వీచుచుండెను. చెట్ల వ్రేళ్లు పెకలించి వేయబడుచుండెను. అడవులు నేలమట్టము అగుచుండెను (10). ముల్లోకములను అగ్నిదేవుడు గడ్డిపోచను వలె కాల్చుచుండెను. వర్షముచే భూమి ముంచెత్తబడెను. సముద్రములు చెలియలి కట్టలను దాటి యుండెను (11).

దిక్షు సర్వాసు మగ్నాసు వారపూరే మహీయసి | తదద్భిశ్చటులాక్షేపైస్తరంగభుజమండలైః || 12

ప్రారబ్ధచండనృత్యేషు తతః ప్రలయవారిషు | బ్రహ్మా నారాయణో భూత్వా సుష్వాప సలిలే సుఖమ్‌ || 13

ఇమం చోదాహరన్మంత్రం శ్లోకం నారాయణం ప్రతి | తం శృణుధ్వం మునిశ్రేష్ఠాస్తదర్థం చాక్షరాశ్రయమ్‌ || 14

ఆపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః | అయనం తస్య తా యస్మాత్తేన నారాయణస్స్మృతః || 15

శివయోగమయీం నిద్రాం కుర్వంతం త్రిదశేశ్వరమ్‌ | బద్ధాంజలిపుటాస్సిద్ధా జనలోకనివాసినః || 16

స్తోత్రైః ప్రబోధయామాసుః ప్రభాతసమయే సురాః | యథా సృష్ట్యాదిసమయే ఈశ్వరం శ్రుతయః పురా || 17

తతః ప్రబుద్ధ ఉత్థాయ శయనాత్తో యమభ్యగాత్‌ | ఉదైక్షత దిశస్సర్వా యోగనిద్రాలసేక్షణః || 18

నాపశ్యత్స తదా కించిత్స్వాత్మనో వ్యతిరేకి యత్‌ | సవిస్మయ ఇవాసీనః పరాం చింతాముపాగమత్‌ || 19

క్వ సా భగవతీ యా తు మనోజ్ఞా మహతీ మహీ | నానావిధమహశైలనదీనగరకాననా || 20

ఏవం సంచింతయన్‌ బ్రహ్మా బుబుధేనైవ భూస్థితిమ్‌ | తదా సస్మార పితరం భగవంతం త్రిలోచనమ్‌ || 21

దిక్కులన్నియు అతివిస్తృతమైన జలరాశిలో మునిగియుండెను. ఆ ప్రళయజలములు తరంగములనే గుండ్రని భుజములను దేనినీ లెక్క చేయకున్నవా యన్నట్లు తీవ్రముగా త్రిప్పుతూ నీటిని చిమ్ముతూ భయంకరమగు నాట్యమును అరంభించినవి. అపుడు బ్రహ్మ నారాయణరూపమును దాల్చి ఆ నీటిలో సుఖముగా నిద్రించెను (12,13). మనము నారాయణుని ఉద్దేశించి ఈ మంత్రమును తెలుసుకొనవలెను. ఓ మహర్షులారా! దానిని వినుడు. దానిలోని పదముల అర్థమును తెలియుడు (14). జలములకు నారాః అని పేరు. జలములు అవినాశియగు పరంబ్రహ్మనుండి పుట్టినవి. అవి ఆ పరమేశ్వరునకు నివాసస్థానమైనవి. కావుననే, ఆయనకు నారాయణుడను పేరు వచ్చినది (15). పూర్వము సృష్టి జరిగిన సమయములో వేదములు ఈశ్వరుని స్తుతించిన విధముగా, జనలోకమునందు నివసించే సిద్ధులు మరియు దేవతలు ప్రాతః కాలమునందు చేతులను జోడించి శివయోగస్వరూపమైన నిద్రలో నున్న ఆ దేవాధిదేవుని స్తోత్రములతో మేలుకొలిపిరి (16,17). అపుడు ఆయన నిద్రమేల్కాంచి నీటిలోనికి వెళ్లెను. యోగనిద్ర వలన బరువుగానున్న కన్నులతో ఆయన దిక్కులనన్నింటినీ పరికించెను (18). అపుడాయనకు తనకంటె భిన్నముగా ఏదియు కానరాలేదు. అపుడాయన ఆశ్చర్యమును పొందినవానివలె కూర్చుండి దీర్ఘముగా ఆలోచించెను (19). పూజ్యురాలు, సుందరి, గొప్పది. అనేకవిధములగు పెద్ద పర్వతములతో నదులతో నగరములతో మరియు అడవులతో రాజిల్లునది అగు ఆ భూదేవి యెక్కడ? (20) ఈ విధముగా ఆలోచించుచున్న బ్రహ్మకు భూమియొక్క స్థితియైననూ తెలియలేదు. అపుడాయన తన తండ్రియగు ముక్కంటి దేవుని స్మరించెను (21).

స్మరణాద్దేవదేవస్య భవస్యామితతేజసః | జ్ఞాతవాన్‌ సలిలే మగ్నాం ధరణీం ధరణీపతిః || 22

తతో భూమేస్సముద్ధారం కర్తుకామః ప్రజాపతిః | జలక్రీడోచితం దివ్యం వారాహం రూపమస్మరత్‌ || 23

మహాపర్వతవర్ష్మాణం మహాజలదనిస్స్వనమ్‌ | నీలమేఘప్రతీకాశం దీప్తశబ్దం భయానకమ్‌ || 24

పీనవృత్తఘనస్కంధపీనోన్నతకటీతటమ్‌ | హ్రస్వవృత్తోరుజంఘాగ్రం సుతీక్‌ష్ణఖురమండలమ్‌ || 25

పద్మరాగమణిప్రఖ్యవృత్తభీషణలోచనమ్‌ | వృత్తదీర్ఘం మహాగాత్రం స్తబ్ధకర్ణస్థలోజ్జ్వలమ్‌ || 26

ఉదీర్ణోచ్ఛ్వాసనిశ్శ్వాసఘూర్ణితప్రలయార్ణవమ్‌ | వి స్ఫురత్సుసటాచ్ఛన్నకపోల స్కంధబంధురమ్‌ || 27

మణిభిర్భూషణౖశ్చిత్రైర్మహారత్నైః పరిష్కృతమ్‌ | విరాజమానం విద్యుద్భిర్మేఘసంఘమివోన్నతమ్‌ || 28

ఆస్థాయ విపులం రూపం వారాహమమితం విధిః | పృథివ్యుద్ధరణార్థాయ ప్రవివేశ రసాతలమ్‌ || 29

స తదా శుశుభే%తీవ సూకరో గిరిసంనిభః | లింగాకృతేర్మహేశస్య పాదమూలం గతో యథా || 30

తతస్స సలిలే మగ్నాం పృథివీం పృథివీధరః | ఉద్ధృత్యాలింగ్య దంష్ట్రాభ్యామున్నమజ్జ రసాతలాత్‌ || 31

పృథివికి ప్రభువు అగు ఆ విష్ణువు దేవదేవుడు, మహాతేజశ్శాలి యగు శివుని స్మరించుట వలన పృథివి నీటిలో మునిగియున్నదని తెలుసుకొనెను (22). అపుడా విష్ణురూపములోనున్న బ్రహ్మ భూమిని పైకి ఎత్తగోరి, నీటిలో క్రీడించుటకు తగిన దివ్యమగు వరాహరూపమును స్మరించెను (23). పెద్ద పర్వతమువంటి దేహము గలది, గొప్ప మేఘముల వలె గర్జించునది, నల్లని మేఘములను పోలియున్నది. భయంకరమగు కాంతి మరియు శబ్దము గలది (24). బలిసిన గుండ్రని దట్టనైన భుజములు మరియు బలిసిన ఎత్తైన పృష్ఠభాగము గలది, సన్నని గుండ్రని పెద్ద పిక్కల అగ్రభాగములు గలది, మిక్కిలి వాడియైన గుండ్రని డెక్కలు గలది (25), పద్మరాగ మాణిక్యములను బోలిన గుండ్రని భయమును గొల్పే కన్నులు గలది, గుండ్రని పొడవైన పెద్ద దేహము గలది, నిక్కబొడుచుకొనియున్న చెవులు మరియు వాటి చుట్టూ ఉండే దేహభాగములతో గొప్పగా ప్రకాశించునది (26), వేగముతో కూడిన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములచే కలచి వేయబడిన ప్రళయకాలమందలి సముద్రము గలది, విశేషముగా ప్రకాశించే చక్కని జూలుచే కప్పబడియున్న చెక్కిళ్లతో మరియు భుజస్కంధములతో ఒప్పారునది (27), మిక్కిలి విలువైన రంగు రంగుల మణులతో ఆభరణములతో అలంకరించబడి మెరుపులతో ప్రకాశించే ఎత్తైన మేఘసమూహము వలె ప్రకాశించునది (28), విశాలమైనది అగు అనంతవరాహరూపమును దాల్చి బ్రహ్మ పృథివిని పైకి లేవనెత్తుటకై పాతాళములోనికి ప్రవేశించెను (29), పర్వతమును బోలియున్న ఆ వరాహము ఆ సమయములో లింగాకారములోనున్న మహేశ్వరుని పాదమూలమును చేరిన దానివలె ప్రకాశించెను (30). అప్పుడు నీటిలో మునిగియున్న పృథివిని పైకి ఒడిసి పట్టి ఎత్తి కోరలతో పాతాళమునుండి పైకి లేపెను (31).

తం దృష్ట్వా మునయస్సిద్ధా జనలోకనివాసినః | ముముదుర్ననృతుర్మూర్ధ్ని తస్య పుషై#్పరవాకిరన్‌ || 32

వపుర్మహావరాహస్య శుశుభే పుష్పసంవృతమ్‌ | పతద్భిరివ ఖద్యోతైః ప్రాంశురంజనపర్వతః || 33

తతస్సంస్థామానీయ వరాహో మహతీం మహీమ్‌ | స్వమేవ రూపమాస్థాయ స్థాపయామాస వై విభుః || 34

పృథివీం చ సమీకృత్య పృథివ్యాం స్థాపయన్‌ గిరీన్‌ | భూరాద్యాంశ్చతురో లోకాన్‌ కల్పయామాస పూర్వవత్‌ || 35

ఇతి స హ మహతీం మహీం మహీధ్రైః ప్రలయమహాజలధేరధఃస్థమధ్యాత్‌ |

ఉపరి చ వినివేశ్య విశ్వకర్మా చరమచరం చ జగత్ససర్జ భూయః || 36

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే వరాహావతార వర్ణనం నామ ఏకాదశో%ధ్యాయః (11).

మునులు, జనలోకమునందు నివసించే సిద్ధులు ఆయనను చూచి, సంతోషముతో నాట్యమును చేసి, ఆయన శిరస్సుపై పుష్పములను చల్లిరి (32). పుష్పములతో నిండియున్న ఆ మహావరాహముయొక్క దేహము, తన మీద ఎగురుచున్న మిణుగురు పురుగులతో కూడి యున్న కాటుక కొండ వలె ప్రకాశించెను (33). అపుడా సర్వసమర్థుడగు వరాహమూర్తి విశాలమగు ఆ భూమిని యథాస్థానమునకు తీసుకు వచ్చి, తన మామూలు రూపమును ధరించి, దానిని అచట నిలబెట్టెను (34). ఆయన భూమిని సమతలముగా చేసి, భూమిపై పర్వతములను స్థాపించి, భూలోకముతో మొదలిడి నాలుగు లోకములను పూర్వకల్పమునందు వలెనే నిర్మించెను (35). ఈ విధముగా ఆ సృష్టికర్త పర్వతములతో కూడియున్న విశాలమగు భూమిని ప్రళయకాలమునందలి మహాసముద్రముయొక్క మధ్యలో క్రిందనుండి పైకి తీసుకు వచ్చి, యథాస్థానములో నుంచి, చరాచరజగత్తును మరల సృష్టించెను (36).

శ్రీశివమహాపురాణమునందలి వాయవీయసంహితయందు పూర్వభాగములో వరాహావతారమును వర్ణించే పదునొకండవ అధ్యాయము ముగిసినది (11).

Siva Maha Puranam-4    Chapters