Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వాదశోధ్యాయః

బ్రహ్మ జగత్తును సృష్టించుట

వాయురువాచ |

సర్గం చింతయుతస్తస్య తదా వై బుద్ధిపూర్వకమ్‌ | ప్రధ్యానకాలే మోహస్తు ప్రాదుర్భూతస్తమోమయః || 1

తమోమోహో మహామోహస్తామిస్రశ్చాంధసంజ్ఞితః | అవిద్యా పంచమీ చైషా ప్రాదుర్భూతా మహాత్మనః || 2

పంచధా%వస్థితస్సర్గో ధ్యాయతస్త్వభిమానినః | సర్వతస్తమసా%తీవ బీజకుంభవదావృతః || 3

బహిరంతశ్చాప్రకాశః స్తబ్ధో నిస్సంజ్ఞ ఏవ చ | తస్మాత్తేషాం వృతా బుద్ధిర్ముఖాని కరణాని చ || 4

తస్మాత్తే సంవృతాత్మానో నగా ముఖ్యాః ప్రకీర్తితాః | తం దృష్ట్వా%సాధకం బ్రహ్మా ప్రథమం సర్గమీదృశమ్‌ || 5

అప్రసన్నమనా భూత్వా ద్వితీయం సో%భ్యమన్యత | తస్యాభిధ్యాయతస్సర్గం తిర్యక్‌ స్రోతో% భ్యవర్తత || 6

అంతఃప్రకాశాస్తిర్యంచ ఆవృతాశ్చ బహిః పునః | పశ్వాత్మానస్తతో జాతా ఉత్పథగ్రాహిణశ్చతే || 7

తమప్యసాధకం జ్ఞాత్వా సర్గమన్యమమన్యత | తదోర్ధ్వ స్రోతసో వృత్తో దేవసర్గస్తు సాత్త్వికః || 8

తే సుఖప్రీతిబహులా బహిరంతశ్చ నావృతాః | ప్రకాశా బహిరంతశ్చ స్వభావాదేవ సంజ్ఞితాః || 9

తతో%భిధ్యాయతో%వ్యక్తాదర్వాక్‌ స్రోతస్తు సాధకః | మనుష్యనామా సంజాతస్సర్గో దుఃఖసముత్కటః || 10

వాయువు ఇట్లు పలికెను -

అపుడు బ్రహ్మ తన బుద్ధిని ఉపయోగించి సృష్టిని గురించి ఆలోచించుచుండగా, ఆ ధ్యానసమయములో ఆయనయందు తమోగుణకార్యమగు మోహము ఉద్భవించెను (1). మహాత్ముడగు ఆ బ్రహ్మకు తమోమోహము (చీకటి వంటి మోహము), మహమోహము, తామిస్రము (దట్టని చీకటి), అంధము (గ్రుడ్డితనము) మరియు అవిద్య (అజ్ఞానము) అనే అయిదు స్థితులు కలిగినవి (2). నేను కర్తను అనే అభిమానము కలిగి ధ్యానము చేయుచున్న ఆయనకు అయిదు రకముల సృష్టి గోచరించెను. ఆ ధ్యానములో ఆయన బుద్ధి కుండలోని విత్తనము వలె అంతటా అతిశయించిన చీకటితో వ్యాప్తమై యుండెను (3). ఆయనకు బయట, లోపల చీకటితో, కదలిక మరియు జ్ఞానము లేని స్థితి ఉండెను. కావుననే, ఆయన ముఖమునుండి వచ్చిన ఆ సృష్టియందు బుద్ధి, ముఖములు మరియు ఇంద్రియములు కప్పివేయబడి యుండెను. ఈ విధముగా కప్పివేయబడిన బుద్ధి గల ఆ సృష్టియే పర్వతములు, చెట్లు అని చెప్పబడినది. మొట్టమొదటి సృష్టి ఈ విధముగా ప్రయోజనకారి కాకపోవుటను గాంచి బ్రహ్మ (4,5) వ్యాకులమైన మనస్సు గలవాడై రెండవ సారి ధ్యానమును చేసెను. ఈ విధముగా ఆయన ధ్యానించుచుండగా, పశుపక్ష్యాదుల సృష్టి ప్రకటమయ్యెను. పశుపక్ష్యాదులలో లోపల జ్ఞానము ఉన్ననూ, బాహ్యమునందు వాటి జ్ఞానము కప్పివేయబడి యుండును. అని సన్మార్గమును ఎన్నుకొని పాటించే సామర్థ్యము లేని ప్రాణులు అయినవి (6,7). ఆ సృష్టి కూడ ప్రయోజనకారి కాలేదని తలపోసి బ్రహ్మమరల సృష్టిని గురించి ధ్యానించెను. అపుడు సత్త్వగుణప్రధానమైన దేవతా సృష్టి జరిగినది. ఈ సృష్టికి ఊర్ధ్వస్రోతస్సు (ఊర్ధ్వదిశలోని ప్రవాహము) అని పేరు (8). దేవతలయందు సుఖము, ప్రీతి అధికముగా నుండును. వారికి బయట గాని, లోపల గాని అజ్ఞానావరణము లేదు. వారికి బయట, లోపల కూడ ప్రకాశము గలదు. వారు చైతన్యస్వరూపులు (9). తరువాత మరల బ్రహ్మ ధ్యానమును చేయగా, అవ్యక్తమునుండి అర్వాక్‌ స్రోతస్సు (క్రిందికి ప్రవాహము) అనబడే ప్రయోజనకరమగు మనుష్యులనబడే ప్రాణుల సృష్టి జరిగినది. ఈ సృష్టి దుఃఖము అధికముగా గలది (10).

ప్రకాశా బహిరంతస్తే తమోద్రిక్తా రజో%ధికాః | పంచమో%నుగ్రహస్సర్గశ్చతుర్ధా సంవ్యవస్థితః || 11

విపర్యయేణ శక్త్యాచ తుష్ట్యా సిద్ధ్యా తథైవ చ | తే%పరిగ్రాహిణస్సర్వే సంవిభాగరతాః పునః || 12

ఖాదనాశ్చాప్యశీలాశ్చ భూతాద్యాః పరికీర్తితాః | ప్రథమో మహతస్సర్గో బ్రహ్మణః పరమేష్ఠినః || 13

తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్గస్స ఉచ్యతే | వైకారికస్తృతీయస్తు సర్గ ఐంద్రియకస్స్మృతః || 14

ఇత్యేష ప్రకృతేస్సర్గస్సంభూతో% బుద్ధిపూర్వకః | ముఖ్యసర్గశ్చతుర్థస్తు ముఖ్యా వై స్థావరాస్స్మృతాః || 15

తిర్యక్‌ స్రోతస్తు యః ప్రోక్తస్తిర్యగ్యోనిస్స పంచమః | తదూర్ధ్వస్రోతసష్షష్ఠో దేవసర్గస్తు స స్మృతః || 16

తతో% ర్వాక్‌ స్రోతసాం సర్గస్సప్తమస్స తు మానుషః | అష్టమో% నుగ్రహస్సర్గః కౌమారో నవమస్స్మృతః || 17

ప్రాకృతాశ్చ త్రయః పూర్వే సర్గాస్తే%బుద్ధిపూర్వకాః | బుద్ధిపూర్వం ప్రవర్తంతే ముఖ్యాద్యాః పంచవైకృతాః || 18

అగ్రే ససర్జవై బ్రహ్మా మానసానాత్మనస్సమాన్‌ | సనందం సనకం చైవ విద్వాంసం చ సనాతనమ్‌ || 19

ఋభుం సనత్కుమారం చ పూర్వమేవ ప్రజాపతిః | సర్వే తే యోగినో జ్ఞేయా వీతరాగా విమత్సరాః || 20

రజస్తమోగుణముల ఆధిక్యము గల మనుష్యులు లోపల, బయట కూడ ప్రకాశము గల వారు. ఈ అయిదవ సృష్టికి అనుగ్రహసర్గము అని పేరు. విపర్యయము (ఆహారము పై నుండి క్రిందకు ప్రవహించుట), శక్తి, తుష్టి, సిద్ధి అను నాలుగు రూపములలో ఈ సృష్టి చక్కని వ్యవస్థను కలిగియున్నది. ఆ మానవులందరు ఇతరుల నుండిదేనినైననూ అపేక్షించని వారై, తమవద్ద గల సంపదను నలుగురికి పంచుటయందు ప్రీతిని కలిగియుండిరి (11,12). మానవులలో కొందరు శీలమునెరుంగక తిండియందు మాత్రమే ప్రీతిని కలిగియున్ననూ, మానవులు ప్రాణులలో అగ్రేసరులుగా పరిగణింపబడు చున్నారు. సర్వజగత్కర్తయగు బ్రహ్మయొక్క సృష్టిలో మొదటిది మహత్తత్త్వము (13). సూక్ష్మపంచభూతముల సృష్టి రెండవది. దానికే భూతసర్గము అని పేరు. మూడవది వైకారిక (అహంకారముయొక్క) సృష్టి దీనికే ఐంద్రియక (ఇంద్రియముల) సర్గము అని పేరు (14). ఇంతవరకు ప్రకృతినుండి బుద్ధిసంబంధము లేకుండగా జరిగిన సృష్టి. నాల్గవది ముఖ్యసర్గము. ముఖ్యములనగా చెట్టుచేమలు (15). తిర్యక్‌ స్రోతస్సు అనగా పశుపక్ష్యాదుల సృష్టి. ఇది అయిదవ సర్గము. ఊర్ధ్వ స్రోతస్సు అనగా దేవతల సృష్టి. ఇది ఆరవది (16). తరువాతిది అర్వాక్‌ స్రోతస్సు. అనగా మనుష్యుల సృష్టి. ఇది ఏడవది. ఎనిమిదవది అనుగ్రహసర్గము. తొమ్మిదవది కౌమారసర్గము (17). మొదటి మూడు సర్గములు ప్రకృతినుండి ఉద్భవించినవి. వాటికి బుద్ధిసంబంధము లేదు. ముఖ్యసర్గముతో మొదలయ్యే అయిదు వికారసర్గములు బుద్ధిపూర్వకముగా చేయబడినవి (18). ప్రజాపతియగు బ్రహ్మ మొట్టమొదటనే తనతో సమానమైన మానసపుత్రులను సనందుడు, సనకుడు, విద్వాంసుడగు సనాతనుడు, ఋభుడు, సనత్కుమారుడు అనువారిని సృష్టించెను. వీరందరు యోగలు, విరాగులు మరియు మాత్సర్యము లేనివారు అని తెలియదగును (19,20).

ఈశ్వరాసక్తమనసో న చక్రుస్సృష్టయే మతిమ్‌ | తేషు సృష్ట్యనపేక్షేషు గతేషు సనకాదిషు || 21

స్రష్టుకామః పునర్ర్బహ్మా తతాప పరమం తపః | తసై#్యవం తవ్యమానస్య న కించిత్సమవర్తత || 22

తతో దీర్ఘేణ కాలేన దుఃఖాత్ర్కోధో వ్యజాయత | క్రోధావిష్టస్య నేత్రాభ్యాం ప్రాపతన్నశ్రుబిందవః || 23

తతస్తేభ్యో%శ్రుబిందుభ్యో భూతాః ప్రేతాస్తదాభవన్‌ | సర్వాంస్తానశ్రుజాన్‌ దృష్ట్వా బ్రహ్మాత్మానమనిందత|| 24

తస్య తీవ్రా %భవన్మూర్ఛా క్రోధామర్షసముద్భవా | మూర్ఛితస్తు జహౌ ప్రాణాన్‌ క్రోధావిష్టః ప్రజాపతిః || 25

తతః ప్రాణశ్వరో రుద్రో భగవాన్నీలలోహితః | ప్రసాదమతులం కర్తుం ప్రాదురాసీత్ర్పభోర్ముఖాత్‌ || 26

దశధా చైకధా చక్రే స్వాత్మానం ప్రభురీశ్వరః | తే తేనోక్తా మహాత్మానో దశధా చైకధా కృతాః || 27

యూయం సృష్టా మయా వత్సా లోకానుగ్రహకారణాత్‌ | తస్మాత్సర్వస్య లోకస్య స్థాపనాయ హితాయ చ || 28

ప్రజాసంతాన హేతోశ్చ ప్రయతధ్వమతంద్రితాః | ఏవముక్తాశ్చ రురుదుర్దుద్రువుశ్చ సమంతతః || 29

రోదనాత్‌ ద్రావణాచ్చైవ తే రుద్రా నామతస్స్మృతాః | యే రుద్రాస్తే ఖలు ప్రాణా యే ప్రాణాస్తే మహాత్మకాః || 30

వారు ఈశ్వరునియందు లగ్నమైన మనస్సు గలవారై సృష్టియందు శ్రద్ధను చూపకుండిరి. ఈ విధముగా సృష్టియందు ఉత్సాహము లేని ఆ సనకాదులు వెళ్ళగానే (21). బ్రహ్మ మరల సృష్టిని చేయగోరి గొప్ప తపస్సును చేసెను. ఈ విధముగా ఆయన తపస్సును చేసిననూ, ప్రయోజనమేమియు లేకుండెను (22). ఈ విధముగా చాల కాలము గడచిన తరువాత ఆయనకు దుఃఖము, దానినుండి కోపము కలిగినవి. కోపముతో ఆవేశమును పొందిన బ్రహ్మయొక్క కన్నులనుండి నీటి బొట్టులు జారి పడెను (23). అపుడా నీటిబొట్లనుండి భూతప్రేతములు పుట్టినవి. కన్నీటి బిందువులనుండి పుట్టిన వాటినన్నింటినీ చూచి బ్రహ్మ తనను తాను నిందించుకొనెను (24). ఆయనకు కోపము, అసహనము కలిగి వాటి వలన తీవ్రమగు మూర్ఛ కలిగెను. ఆయన కోపముయొక్క ఆవేశములో మూర్ఛిల్లి ప్రాణములను విడిచెను (25). అపుడు ప్రాణములకు ప్రభువు, కంఠమునందు నీలవర్ణము ఇతరత్రా ఎర్రని రంగు గల రుద్ర భగవానుడు సాటిలేని అనుగ్రహమును చేయగోరి బ్రహ్మప్రభుని ముఖమునుండి ఆవిర్భవించెను (26). ఆ శివప్రభుడు తనను పదకొండు రూపములుగా విభజించుకొనెను. ఈ విధముగా పదకొండుగా చేయబడిన మహాత్ములగు ఆ మూర్తులనుద్దేశించి ఆయన ఇట్లు పలికెను (27). ఓ కుమారులారా! నేను మిమ్ములను లోకముల అనుగ్రహము కొరకై సృష్టించితిని. కావు, సకలలోకముల స్థితి మరియు హితముల కొరకు (28), ప్రజల సృష్టి కొరకు సోమరితనము లేనివారై యత్నించుడు. ఈ విధముగా ఆయన పలుకగా, వారు అంతటా పరుగులు తీస్తూ ఏడ్చిరి (29). ఏడుస్తూ పరుగులెత్తుట వలన వారికి రుద్రులు అను పేరు కలిగెను. ప్రాణులలోని ప్రాణములు మహాత్ములగు ఆ రుద్రులే (30).

తతో మృతస్య దేవస్య బ్రహ్మణః పరమేష్ఠినః | ఘృణీ దదౌ పునః ప్రాణాన్‌ బ్రహ్మపుత్రో మహేశ్వరః || 31

ప్రహృష్టవదనో రుద్రః ప్రాణప్రత్యాగమాద్విభోః | అభ్యభాషత విశ్వేశో బ్రహ్మాణం పరమం వచః || 32

మా భైర్మా భైర్మహాభాగ విరించే జగతాం గురో | మయాతే ప్రాణితాః ప్రాణాస్సుఖముత్తిష్ఠ సువ్రత || 33

స్వప్నానుభూతమివ తచ్ర్ఛుత్వా వాక్యం మనోహరమ్‌ | హరం నిరీక్ష్య శనకైర్నేత్రైః పుల్లాంబుజప్రభైః || 34

తథా ప్రత్యాగతప్రాణః స్నిగ్ధగంభీరయా గిరా | ఉవాచ వచనం బ్రహ్మా తముద్దిశ్య కృతాంజలిః || 35

త్వం హి దర్శనమాత్రేణ చానందయసి మే మనః | కో భవాన్‌ విశ్వమూర్త్యా వా స్థిత ఏకాదశాత్మకః || 36

తస్య తద్వచనం శ్రుత్వా వ్యాజహార మహేశ్వరః | స్పృశన్‌ కరాభ్యాం బ్రహ్మాణం సుసుఖాభ్యాం సురేశ్వరః || 37

మాం విద్ధి పరమాత్మానం తవ పుత్రత్వమాగతమ్‌ | ఏతే చైకాదశ రుద్రాస్త్వాం సురక్షితుమాగతాః || 38

తస్మాత్తీవ్రామిమాం మూర్ఛాం విధాయ మదనుగ్రహాత్‌ | ప్రబుద్ధస్వ యథాపూర్వం ప్రజా వై స్రష్టుమర్హసి || 39

ఏవం భగవతా ప్రోక్తో బ్రహ్మా ప్రీతమనా హ్యభూత్‌ | నామాష్టకేన విశ్వాత్మా తుష్టావ పరమేశ్వరమ్‌ || 40

సర్వజగత్కర్తయగు బ్రహ్మదేవుడు ఈ విధముగా మరణించగా, బ్రహ్మయొక్క పుత్రుడగు మహేశ్వరుడు దయ గలవాడై మరల ప్రాణములను ఇచ్చెను (31). అపుడు బ్రహ్మదేవుని ప్రాణములు తిరిగి రాగా, జగత్ర్పభువగు రుద్రుడు ఆనందముతో నిండిన ముఖము గలవాడై బ్రహ్మను ఉద్దేశించి శ్రేష్ఠమగు వచనమును పలికెను (32). ఓ మహాత్మా! భయపడకుము. భయ పడకుము. ఓ జగత్కర్తా! బ్రహ్మా! నేను నీ ప్రాణములను ఉజ్జీవింప జేసితిని. ఓ గొప్ప వ్రతము గలవాడా! సుఖముగా లెమ్ము (33). తిరిగి వచ్చిన ప్రాణముల గల బ్రహ్మ స్వప్నములో అనుభవింపబడినట్లు ఉన్న ఆ మనోహరమగు వచనమును విని, వికసించిన పద్మముల ప్రకాశమును కలిగియున్న కన్నులతో మెల్లగా శివుని పరికించి చూచి, చేతులను జోడించి, ఆ శివుని ఉద్దేశించి ప్రేమతో నిండినది మరియు గంభీరమైనది అగు వాక్కుతో నిట్లు పలికెను (34,35). నీవు కేవలము దర్శనము చేతనే నా మనస్సునకు ఆనందమును కలిగించుచున్నావు. పదకొండు రూపములలో జగత్తును వ్యాపించి జగద్రూపములోనున్న నీవు ఎవరు? (36) ఆ బ్రహ్మయొక్క ఆ మాటను విని దేవదేవుడగు మహేశ్వరుడ ఆయనను గొప్ప సుఖమును కలిగించే తన రెండు చేతులతో స్పృశిస్తూ ఇట్లు పలికెను (37). నేను నీ పుత్రుని రూపములో వచ్చియున్న పరమేశ్వరుడనని తెలియుము. ఈ పదకొండు రుద్రులు నిన్ను సంరక్షించుటకు వచ్చియున్నారు (38). కావున, నా అనుగ్రహముచే తీవ్రమగు ఈ మూర్ఛను పారద్రోలి తెలివిని తెచ్చుకొని పూర్వమునందు వలెనే ప్రజలను సృష్టించ తగుదువు (39). భగవానుడు ఇట్లు పలుకగా, జగత్స్వరూపుడగు బ్రహ్మ సంతోషముతో నిండిన మనస్సు గలవాడై, పరమేశ్వరుని ఎనిమిది నామములతో ఇట్లు స్తుతించెను (40).

బ్రహ్మోవాచ |

నమస్తే భగవన్‌ రుద్ర భాస్కరామితతేజసే | నమో భవాయ దేవాయ రసాయాంబుమయాత్మనే |

శర్వాయ క్షితిపాయ నందీసురభ##యే నమః || 41

ఈశాయ వసవే తుభ్యం నమస్స్పర్శమయాత్మనే | పశూనాం పతయే చైవ పావకాయాతితేజసే |

భీమాయ వ్యోమరూపాయ శబ్దమాత్రాయ తే నమః || 42

ఉగ్రాయోగ్రస్వరూపాయ యజమానాత్మనే నమః | మహాదేవాయ సోమయ నమో%స్త్వమృతమూర్తయే || 43

ఏవం స్తుత్వా మహేదేవం బ్రహ్మా లోకపితామహః | ప్రార్థయామాస విశ్వేశం గిరా ప్రణతిపూర్వయా || 44

భగవన్‌ భూతభ##వ్యేశ మమ పుత్ర మహేశ్వర | సృష్టి హేతోస్త్వముత్పన్నో మమాంగే%నంగనాశనః || 45

తస్మాన్మహతి కార్యే%స్మిన్‌ వ్యాపృతస్య జగత్ర్పభో | సహాయం కురు సర్వత్ర స్రష్టుమర్హసి సుప్రజాః || 46

తేనైవం ప్రార్థితో దేవో రుద్రస్త్రిపురమర్దనః | బాఢమిత్యేవ తాం వాణీం ప్రతిజగ్రహ శంకరః || 47

తతస్స భగవాన్‌ బ్రహ్మా హృష్టం తమభినంద్య చ | స్రష్టుం తేనాభ్యనుజ్ఞాతస్తథాన్యాశ్చాసృజత్ర్పజాః || 48

మరీచిభృగ్వంగిరసః పులస్త్యం పులహం క్రతుమ్‌ | దక్షమత్రిం వసిష్టం చ సో%సృజన్మనసైవ చ |

పురస్తాదసృజద్ర్బహ్మా ధర్మం సంకల్పమే వ చ || 49

ఇత్యేతే బ్రహ్మణః పుత్రా ద్వాదశాదౌ ప్రకీర్తితాః | సహ రుద్రేణ సంభూతాః పురాణా గృహమేధినః || 50

బ్రహ్మ ఇట్లు పలికెను -

హే భగవన్‌! అనంతతేజస్సు గల సూర్యుని స్వరూపములోనున్న నీకు నమస్కారము. సత్తా (ఉనికి) స్వరూపుడు, నీరు అనే రూపములో రసస్వరూపుడు అగు శివునకు నమస్కారము. సంహారకాలములో హింసకుడు, భూమి రూపములో నున్నవాడు అగు రుద్రునకు, నందీశ్వరునకు, కామధేనువునకు నమస్కారము (41). ఈశ్వరుడవు, వసువుల రూపములో నున్నవాడవు, స్పర్శస్వరూపుడవు అగు నీకు నమస్కారము. జీవులకు ప్రభువు, గొప్ప తేజస్సు గల అగ్నిస్వరూపుడు, భయంకరుడు, ఆకాశరూపములో నున్నవాడు, శబ్దతన్మాత్రస్వరూపుడు అగునీకు నమస్కారము (42). సంహారకాలములో భయంకరమగు రూపమును దాల్చే ఉగ్రుడు, సోమయాగమును చేయు యజమానుని రూపములో నున్నవాడు. జగన్మాతతో కూడియున్నవాడు, అమృతస్వరూపుడు అగు మహాదేవునకు నమస్కారము (43). లోకములకు పితామహుడు అగు బ్రహ్మ విశ్వేశ్వరుడగు మహాదేవుని ఈ విధముగా స్తుతించి, నమస్కారపూర్వకమగు వాక్కుతో ఇట్లు ప్రార్థించెను (44). ఓ భగవాన్‌! భూతభవిష్యద్వర్తమానములకు ప్రభువైన వాడా! నా పుత్రుడా! మహేశ్వరా! మన్మథుని సంహరించిన నీవు సృష్టి కొరకై నా దేహమునుండి ఉద్భవించినావు (45). ఓ జగత్ర్పభూ! ఈ గొప్ప కార్యములో నిమగ్నుడనై యున్ననాకు అన్ని కాలములలో సహకరించుము. నీవు చక్కని సంతానమును కనవలెను (46). త్రిపురాసురసంహారకుడు, మంగళకరుడు అగు రుద్రుడు ఆ బ్రహ్మచే ఈ విధముగా ప్రార్థించబడినవాడై, అటులనే యగుగాక! అని పలికి ఆ ప్రార్థనను స్వీకరించెను (47). తరువాత ఆ బ్రహ్మభగవానుడు సంతోషించియున్న ఆ రుద్రుని అభినందించి, సృష్టిని చేయుటకు ఆయన అనుమతిని పొంది, ఇతరులగు పుత్రులను సృష్టించెను (48). బ్రహ్మముందుగా మరీచి, భృగువు, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, అత్రి, వసిష్టుడు, ధర్ముడు, సంకల్పుడు అనువారిని మనస్సు చేతనే సృష్టించెను (49). ఈ విధముగా బ్రహ్మకు సృష్ట్యాదియందు రుద్రునితో కలిపి సనాతనులు, గృహస్థులు అగు ఈ పన్నెండు మంది పుత్రులు కలిగిరని కీర్తించబడినది (50).

తేషాం ద్వాదశ వంశాస్స్యుర్దివ్యా దేవగణాన్వితాః | ప్రజావంతః క్రియావంతో మహర్షిభిరలంకృతాః || 51

అథ దేవాసురపితౄన్‌ మనుష్యాంశ్చ చతుష్టయమ్‌ | సహ రుద్రేణ సిసృక్షరంభ##స్యేతాని వై విధిః || 52

స సృష్ట్యర్థం సమాధాయ బ్రహ్మాత్మానమయూయుజత్‌ | ముఖాదజనయద్దేవాన్‌ పితౄంశ్చైవోపపక్షతః || 53

జఘనాదసురాన్‌ సర్వాన్‌ ప్రజనాదపి మానుషాన్‌ | అవస్కరే క్షుధావిష్టా రాక్షసాస్తస్య జజ్ఞిరే || 54

పుత్రాస్తమోరజఃప్రాయా బలినస్తే నిశాచరాః | సర్పా యక్షాస్తథా భూతా గంధర్వాస్సంప్రజజ్ఞిరే || 55

వయాంసి వక్షతస్సృష్టాః పక్షిణో వక్షసో%సృజత్‌ | ముఖతో%జాంస్తథా పార్శ్వాదురగాంశ్చ వినిర్మమే || 56

పద్భ్యాం చాశ్వాన్‌ సమాతంగాన్‌ శరభాన్‌ గవయాన్‌ మృగాన్‌ | ఉష్ట్రానశ్వతరాంశ్చైవ న్యంకూనన్యాంశ్చ జాతయః || 57

ఔషధ్యః ఫలమూలాని రోమభ్యస్తస్య జజ్ఞిరే | గాయత్రీం చ ఋచం చైవ త్రివృత్సామ రథంతరమ్‌ || 58

అగ్నిష్టోమంచ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాత్‌ | యజూంషి త్రైష్టుభం ఛందః స్తోమం పంచదశం తథా || 59

బృహత్సామ తథోక్థ్యం చ పశ్చిమాదసృజన్ముఖాత్‌ | సామాని జగతీఛందఃస్తోమం సప్తదశం తథా || 60

వైరూప్యమతిరాత్రం చ పశ్చిమాదసృజన్ముఖాత్‌ | ఏకవింశమథర్వాణమాప్తోర్యామాణమేవ చ || 61

అనుష్టుభం సవైరాజముత్తరాదసృజన్ముఖాత్‌ | ఉచ్చావచాని భూతాని గాత్రేభ్యస్తస్య జజ్ఞిరే || 62

వారు దేవగణములతో కూడినవి, సంతానము గలవి, వైదికకర్మలు గలవి, మహర్షులచే అలంకరింపబడినవి అగు పన్నెండు దివ్యవంశములకు మూలపురుషులు అగుదురు (51). తరువాత బ్రహ్మ రుద్రునితో కలిసి ప్రళయసముద్రమునందు దేవతలు, రాక్షసులు, పితరులు మరియు మనుష్యులు అనే నాలుగు సముదాయములను సృష్టించగోరెను (52). ఆ బ్రహ్మ మనస్సును ఏకాగ్రము చేసి సృష్టి కొరకైతన దేహమును తాను వినియోగములోనికి తెచ్చెను. ఆయన తన ముఖమునుండి దేవతలను, పార్శ్వమునునుండి పితరులను, పొత్తికడుపు భాగము నుండి అసురులను, జననేంద్రియమునుండి మనుష్యులను సృష్టించెను. అయనయొక్క విసర్జనేంద్రియమునందు ఆకలితో అలమటించే రాక్షసులు జన్మించిరి (53,54). రజస్తమోగుణములు ప్రధానముగా గలవారు, బలవంతులు అగు రాక్షసులు, నాగులు, యక్షులు, భూతములు మరియు గంధర్వులు ఆయనకు పుత్రులై జన్మించిరి (55). ఆయన ప్రక్కలనుండి కాకులను, వక్షఃస్థలమునుండి పక్షులను, ముఖమునుండి మేకలను, పార్శ్వములనుండి పాములను సృష్టించెను (56). పాదములనుండి గుర్రములను, ఏనుగులను, శరభమృగములను, గవయమృగములను, లేళ్లను, ఒంటెలను, గాడిదలను, దుప్పి అనే జంతువులను మరియు ఇతరజాతులను సృష్టించెను (57). పంట మొక్కలు, పళ్లు, దుంపలు ఆయన రోమములనుండి జన్మించినవి. తూర్పు ముఖమునుండి ఆయన గాయత్రీచ్ఛందస్సును, ఋగ్వేదమును, త్రివృత్‌ మరియు రథంతరము అనే సామలను, యజ్ఞములలో ప్రముఖమగు అగ్నిష్టోమమును నిర్మించెను. యజుర్వేదమును, త్రిష్టుప్‌ ఛందస్సును, పంచదశస్తోమము (స్తోత్రరూపమగు మంత్రసముదాయము) ను, బృహత్‌ అనే సామను మరియు ఉక్థము (స్తోత్రరూపమగు మంత్రము) ను ఆయన దక్షిణ ముఖమునుండి సృష్టించెను. వైరూప్యము మొదలగు సామలను, జగతీఛందస్సును, సప్తదశస్తోమమును, మరియు అతిరాత్రమనే క్రతువును ఆయన పశ్చిమముఖమునుండి సృష్టించెను. ఏకవింశస్తోమమును, అథర్వవేదమును, ఆప్తోర్యామమనే క్రతువును, అనుష్టుప్‌ ఛందస్సును మరియు వైరాజసామను ఆయన ఉత్తరముఖమునుండి సృష్టించెను. చిన్న పెద్ద ప్రాణులు ఆయన అవయవములనుండి పుట్టినవి (58-62).

యక్షాః పిశాచా గంధర్వాస్తథైవాప్సరసాం గణాః | నరకిన్నరరక్షాంసి వయఃపశుమృగోరగాః || 63

అవ్యయం చైవ యదిదం స్థాణు స్థావరజంగమమ్‌ | తేషాం వై యాని కర్మాణి ప్రాక్‌సృష్టాని ప్రపేదిరే || 64

తాన్యేవ తే ప్రపద్యంతే సృజ్యమానాః పునః పునః | హింస్రాహింస్రే మృదుక్రూరే ధర్మాధర్మావృతానృతే || 65

తద్భావితాః ప్రపద్యంతే తస్మాత్తత్తస్య రోచతే | మహాభూతేషు నానాత్వమింద్రియార్థేషు ముక్తిషు || 66

వినియోగం చ భూతానాం ధాతైవ వ్యదధాత్స్వయమ్‌ | నామ రూపం చ భూతానాం ప్రాకృతానాం ప్రపంచనమ్‌ || 67

వేదశ##బ్దేభ్య ఏవాదౌ నిర్మమే %సౌ పితామహః | ఆర్షాణి చైవ నామాని యాశ్చ వేదేషు వృత్తయః || 68

శర్వర్యంతే ప్రసూతానాం తాన్యేవైభ్యో దదావజః | యథర్తావృతులింగాని నానారూపాణి పర్యయే || 69

దృశ్యంతే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు | ఇత్యేష కరణోద్భూతో లోకసర్గస్స్వయంభువః || 70

మహదాద్యో విశేషాంతో వికారః ప్రకృతేస్స్వయమ్‌ | చంద్రసూర్యప్రభాజుష్టో గ్రహనక్షత్రమండితః || 71

నదీభిశ్చ సముద్రైశ్చ పర్వతైశ్చ స మండితః | పురైశ్చ వివిధై రమ్యైస్సీతైర్జనపదైస్తథా || 72

తస్మిన్‌ బ్రహ్మవనే%వ్యక్తో బ్రహ్మాచరతి సర్వవిత్‌ | అవ్యక్తబీజప్రభవ ఈశ్వరానుగ్రహే స్థితః || 73

యక్షులు, పిశాచములు, గంధర్వులు, అప్సరసల గణములు, నరులు, కిన్నరులు, రాక్షసులు, పక్షులు, పశువులు, వన్యమృగములు, సర్పములు (63), వినాశములేని పదార్థములు, జడములు, కదిలే ప్రాణులు మరియు కదలని ప్రాణులు జన్మించినవి. ఆయా ప్రాణులు ఈ సృష్టికి ముందు ఏయే కర్మలను చేసియున్నవో, వాటికి తగిన జన్మలను మాత్రమే మరల మరల అవి పొందుచున్నవి. ధర్మ-అధర్మములు, సత్య-అసత్యములు అను పూర్వసంస్కారములను బట్టి హింసను చేయునవి, హింసను చేయనివి, మృదుస్వభావము గలవి, క్రూరస్వభావము గలవి అగు ప్రాణులు ఆయా దేహములను పొందుచున్నవి. ప్రాణులకు ఆయా పూర్వజన్మసంస్కారములను బట్టి ఆయా కర్మలు ప్రీతికరములగుచుండును. మహాభూతములయందు, ఇంద్రియభోగములయందు, మరియు మోక్షములయందు అనేకత్వమును ఆ ప్రజాపతియే స్వయముగా నిర్మించెను. ఆ పితామహుడు సృష్ట్యాదియందు ప్రకృతివికారములగు పంచభూతములకు నామరూపముల వ్యాకరణమును అనగా విస్తారమును వేదశబ్దములను ఆధారముగా చేసుకొని మాత్రమే చేసెను. పుట్టుక లేని ఆ బ్రహ్మ ప్రళయము పూర్తి కాగానే, జన్మించిన జీవులకు వేదములయందు బోధింపబడియున్న ఋషుల నామములను, వారి జీవనవ్యాపారములను అందజేసెను. ప్రతిసంవత్సరములో ఒక ఋతువు తిరిగి వచ్చునాటికి అనేకవిధముల ఋతుధర్మములు సమానముగా తిరిగి ప్రకటమగుచుండును. యుగములు, కల్పములు మొదలగు వాటిలో ప్రాణుల పరిస్థితి కూడా అటులనే యుండును. ఈ విధముగా బ్రహ్మయొక్క అవయవములనుండి లోకములు సృష్టించబడినవి (64-70). మహత్తుతో మొదలిడి పరమాణువిశేషము వరకు గల వికారములు స్వయముగా ప్రకృతినుండి ప్రకటమైనవి. చంద్రసూర్యుల కాంతులతో ప్రకాశించునది, గ్రహములతో మరియు, నక్షత్రములతో అలంకరింపబడినది (71), నదులతో సముద్రములతో పర్వతములతో నొప్పారునది, వివిధములగు సుందరనగరములతో మరియు సుందరమగు పల్లెసీమలతో కళకళలాడునది అగు (72) బ్రహ్మవనము (పరంబ్రహ్మయే అధిష్ఠానముగా గల జగత్తు) నందు సర్వజ్ఞుడు, మాయాశక్తి అనే బీజమునుండి నుండి పుట్టినవాడు, ఈశ్వరుని అనుగ్రహమునందు స్థిరముగా నున్నవాడు అగు హిరణ్యగర్భుడు కంటికి కానరాకుండగా సంచరించుచున్నాడు (73).

బుద్ధిస్కంధమహాశాఖ ఇంద్రియాంతరకోటరః | మహాభూతప్రమాణశ్చ విశేషామలపల్లవః || 74

ధర్మాధర్మసుపుష్పాఢ్యస్సుఖదుఃఖఫలోదయః | ఆజీవ్యస్సర్వభూతానాం బ్రహ్మవృక్షస్సనాతనః || 75

ద్యాం మూర్ధానం తస్య విప్రా వదంతి ఖం వై నాభిం చంద్రసూర్యౌ చనేత్రే |

దిశః శ్రోత్రే చరణౌ చక్షితిం చ సో%చింత్యాత్మా సర్వభూతప్రణతా || 76

వక్త్రాత్తస్య బ్రాహ్మణాస్సంప్రసూతాస్తద్వక్షసః క్షత్రియాః పూర్వభాగాత్‌ |

వైశ్యా ఊరుభ్యాం తస్య పద్భ్యాం చ శూద్రాస్సర్వే వర్ణా గాత్రతస్సంప్రసూతాః || 77

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే జగత్సృష్టి వర్ణనం నామ ద్వాదశో%ధ్యాయః (12).

బుద్ధియే మొదలు మరియు పెద్ద కొమ్మలుగా గలది, ఇంద్రియగోళకములే తొర్రలుగా గలది, మహాభూతములే నిడివిగా గలది, పరమాణువిశేషములే స్వచ్ఛమగు చిగుళ్లుగా గలది (74), ధర్మ-అధర్మములనే అందమైన పువ్వులతో ఒప్పారునది, సుఖదుఃఖములనే పళ్లను కాయునది, ప్రవాహరూపములో నిత్యమైనది అగు బ్రహ్మ అనే చెట్టు (జగద్రూపముగా ప్రకటమైన పరంబ్రహ్మము) ను సర్వప్రాణులు ఆశ్రయించి యున్నవి (75). ఊహింప శక్యము కాని స్వరూపము గలవాడు, సర్వప్రాణులను సృష్టించినవాడు అగు ఆ హిరణ్యగర్భునకు స్వర్గలోకము శిరస్సు అనియు, ఆకాశము నాభి యనియు, సూర్యచంద్రులు నేత్రములనియు, దిక్కులు చెవులనియు, పాదములు భూమి అనియు పండితులు వర్ణించుచున్నారు (76). ఆయన శరీరముయొక్క పై భాగములో నోటినుండి బ్రాహ్మణులు, వక్షఃస్థలమునుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు, ఈ విధముగా అన్ని వర్ణములు వారు ఆయన దేహమునుండియే పుట్టినారు (77).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో జగత్సృష్టిని వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

Siva Maha Puranam-4    Chapters