Siva Maha Puranam-4
Chapters
అథ పంచదశో
బ్రహ్మ పార్వతీపరమేశ్వరులను స్తుతించుట
వాయురువాచ |
యదా పునః ప్రజాస్సృష్టా న వ్యవర్ధంత వేధసః | తథా మైథునజాం సృష్టిం బ్రహ్మా కర్తుమమన్యత|| 1
న నిర్గతం పురా యస్మాన్నారీణాం కులమీశ్వరాత్ | తేన మైథునజాం సృష్టిం న శశాక పితామహః || 2
తతస్స విదధే బుద్ధిమర్థనిశ్చయగామినీమ్ |ప్రజానామేవ వృద్ధ్యర్ధం ప్రష్టవ్యః పరమేశ్వరః|| 3
ప్రసాదేన వినా తస్య న వర్ధేరన్నిమాః ప్రజాః | ఏవం సంచింత్య విశ్వాత్మా తపః కర్తుం ప్రచక్రమే || 4
తదాద్యా పరమా శక్తిరసంతా లోకపావనీ | ఆద్యా సూక్ష్మతరా శుద్ధా భావగమ్యా మనోహరా || 5
నిర్గుణా నిష్ప్రపంచా చ నిష్కళా నిరుపప్లవా | నిరంతరతరా నిత్యా నిత్య మీశ్వరపార్శ్వగా || 6
తయా పరమయాశక్త్యా భగవంతం త్రియంబకమ్ | సంచింత్య హృదయే బ్రహ్మా తతాప పరమం తపః || 7
తీవ్రేణ తపసా తస్య యుక్తస్య పరమేష్ఠినః | అచిరేణౖవ కాలేన పితా సంప్రతుతోష హ || 8
తతః కేనచిదంశేన మూర్తిమావిశ్య కామపి | అర్ధనారీశ్వరో భూత్వా య¸° దేవస్స్వయం హరః || 9
వాయువు ఇట్లు పలికెను -
బ్రహ్మ సృష్టించిన ప్రజలలో మరల వృద్ధి లేకుండెను. అపుడు బ్రహ్మ స్త్రీ పురుషసంగమము వలన కలిగే సృష్టిని కూడ చేయవలెనని తలపోసెను (1). పూర్వము ఈశ్వరునినుండి స్త్రీ సమూహము ఉద్భవించి యుండలేదు. కావున,స్త్రీ పురుషసంగమము వలన కలిగే సృష్టిని పితామహుడు చేయలేక పోయెను (2). అపుడాయన ఆలోచించి విషయమును నిర్ణయించే బుద్ధిని వినియోగించి ఇట్లు తలంచెను. ప్రజల అభివృద్ధి కొరకై పరమేశ్వరుని అడుగవలెను (3). ఆయన అనుగ్రహము లేనిదే , ఈ ప్రజలు వర్ధిల్లరు. జగత్స్వరూపుడగు బ్రహ్మ ఇట్లు తలపోసి, తపస్సను చేయుటకారంభించెను (4). ఆ పరమేశ్వరుడే కారణముగా గలది, సర్వోత్కృష్టము, అనంతము, లోకములను సంకల్పరూపముగా నిర్మించునది, సర్వకారణము, మిక్కిలి సూక్ష్మమైనది, సంసారదోషములు లేనిది, భక్తిచే పొందదగినది, సుందరమైనది, గుణములు లేనిది, ప్రపంచకారణత్వము వాస్తవముగా లేనిది, అవయవములు లేనిది, దుఃఖసంపర్కము లేనిది, ఏకరసము (ద్వితీయము లేనిది), అవినాశి అగు శక్తి నిత్యము ఈశ్వరుని ప్రక్కన ఉండును (5,6). బ్రహ్మ ఆ పరమశక్తితో కూడియున్న ముక్కంటి దేవుని హృదయములో ధ్యానించి గొప్ప తపస్సును చేసెను (7). ఆ పరమేష్ఠిఈ విధముగా తీవ్రమగు తపస్సును చేయుచుండగా, కొద్ది కాలములోననే తండ్రియగు ఈశ్వరుడు సంతోషించెను (8). అపుడు ఒకానొక అంశముచే ఒకానొక విలక్షణమగు రూపమును దాల్చి, శివదేవుడు అర్ధనారీశ్వరుడై స్వయముగా వెళ్లెను (9).
తం దృష్ట్వా పరమం దేవం తమసః పరమవ్యయమ్ | అద్వితీయమనిర్దేశ్యమదృశ్యమకృతాత్మభిః || 10
సర్వలోకవిధాతారం సర్వలోకమహేశ్వరమ్ | సర్వలోకవిధాయిన్యా శక్త్యా పరమయా యుతమ్ || 11
అప్రతర్క్యమనాభాసమమేయమజరం ధ్రువమ్ | అచలం నిర్గుణం శాంతమనంతమహిమాస్పదమ్ || 12
సర్వగంసర్వదం సర్వసదసద్వ్యక్తివర్జితమ్ | సర్వోపమాననిర్ముక్తం శరణ్యం శాశ్వతం శివమ్ || 13
ప్రణమ్య దండవద్బ్రహ్మాసముత్థాయ కృతాంజలిః | శ్రద్ధావినయసంపన్నైః శ్రావ్యైస్సంస్కారసంయుతైః || 14
యథార్థయుక్తసర్వార్థైర్వేదార్థపరిబృంహితైః | తుష్టావ దేవం దేవీం చ సూక్తైస్సూక్ష్మార్థగోచరైః || 15
సర్వోత్కృష్టుడు, ప్రకాశస్వరూపుడు, అజ్ఞానమునకు ఆవలనుండువాడు, వినాశము లేని వాడు, రెండవ వస్తువు లేనివాడు, ఇదమిత్థముగ నిర్దేశింపశక్యము కానివాడు, మనోనిగ్రహము లేనివారికి కంటికి కానరానివాడు, సర్వలోకములను సృష్టించువాడు, సర్వలోకములకు రాజాధిరాజు, సర్వలోకములను నిర్మించే సర్వకారణశక్తితో కూడియున్నవాడు, ఊహకు అందనివాడు, మిథ్యాజగత్తుతో సంపర్కము లేనివాడు, ప్రమాణములకు అందనివాడు, వృద్ధ్యాప్యము లేనివాడు, నిత్యుడు, చలనము లేనివాడు, గుణములు లేనివాడు, సర్వప్రపంచోపశమమునకు అధిష్ఠానమైనవాడు, అనంతమగు మహిమకు నిధానమైనవాడు, సర్వవ్యాపి, సర్వమును ఇచ్చువాడు, మూర్తామూర్తపదార్థములన్నింటికీ అతీతమైనవాడు, సర్వవిధముల ఉపమానములకు అతీతుడు, శరణు పొంద దగినవాడు, శాశ్వతుడు అగు ఆ శివుని చూచి (10-13), బ్రహ్మ సాష్టాంగప్రణామమునాచరించి, లేచి చేతులను జోడించి నిలబడి, శ్రద్ధ మరియు వినయముతో నిండియున్నవి, వినుటకు సొంపైనవి, సంస్కారముతో నిండియున్నవి (14), సర్వవిషయములను గురించి సత్యమును ప్రకటించునవి, వేదార్థమును వర్థిల్లజేయునవి, సూక్ష్మమగు అర్థమును ప్రకాశింప జేయునవి అగు సూక్తములతో ఆ దేవుని మరియు దేవిని కూడ స్తుతించెను (15).
బ్రహ్మోవాచ |
జయ దేవ మహాదేవ జయేశ్వర మహేశ్వర | జయ సర్వగుణశ్రేష్ఠ జయ సర్వసురాధిప || 16
జయ ప్రకృతి కల్యాణి జయ ప్రకృతినాయికే | జయ ప్రకృతిదూరే త్వం జయ ప్రకృతిసుందరి || 17
జయామోఘమహామాయ జయామోఘమనోరథ | జయామోఘమహాలీల జయామోఘమహాబల || 18
జయ విశ్వజగన్మాతర్జయ విశ్వజగన్మయే | జయ విశ్వజగద్ధాత్రి జయ విశ్వజగత్సఖి || 19
జయ శాశ్వతికైశ్వర్యే జయ శాశ్వతికాలయ | జయ శాశ్వతికాకార జయ శాశ్వతికానుగ || 20
జయాత్మత్రయనిర్మాత్రి జయాత్మత్రయపాలిని| జయాత్మత్రయసంహర్త్రి జయాత్మత్రయనాయికే || 21
జయావలోకనాయత్త జగత్కారణబృంహణ | జయోపేక్షాకటాక్షోత్థహుతభుగ్భుక్తభౌతిక || 22
జయ దేవాద్యవిజ్ఞేయే స్వాత్మసూక్ష్మదృశోజ్జ్వలే | జయ స్థూలాత్మశ##క్త్యేశే జయ వ్యాప్తచరాచరే || 23
జయ నానైకవిన్యస్తవిశ్వతత్త్వసముచ్చయ | జయాసురశిరోనిష్ఠ శ్రేష్ఠానుగకదంబక || 24
జయోపాశ్రితసంరక్షాసంవిధానపటీయసి | జయోన్మూలితసంసారవిషవృక్షాంకురోద్గమే || 25
జయ ప్రాదేశికైశ్వర్యవీర్యశౌర్య విజృంభణ | జయ విశ్వబహిర్భూతనిరస్తపరవైభవ|| 26
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ దేవా! మహాదేవా! నీకు జయమగుగాక! ఓ ఈశ్వరా! మహేశ్వరా! నీకు జయమగుగాక! సకలగుణాభిరామా! నీకు జయమగుగాక! సకలదేవతాధిరాజా! నీకు జయమగుగాక! (16) స్వభావము చేతనే మంగళములను చేయు ఓ ప్రకృతినాయికా! నీకు జయమగుగాక! ప్రకృతిక్ అతీతమైన ఓ సహజసౌందర్యనిధానమా! నీకు జయమగుగాక (17) అమోఘమైన మహామాయ గలవాడా! నీకు జయమగుగాక! అమోఘమైన మనోరధములు గలవాడా! నీకు జయమగుగాక!అమోఘమైన గొప్ప లీలలు గలవాడా!నీకు జయమగుగాక! అమోఘమైన గొప్ప బలము గలవాడా! నీకు జయమగుగాక! (18) ఓ సకలజగన్మాతా! నీకు జయమగుగాక! సకలజగత్స్వరూపిణీ! నీకు జయమగుగాక! సకలజగత్తును పెంచి పోషించు తల్లీ! నీకు జయమగుగాక! సకలప్రాణుల హితమును గోరు ఓ తల్లీ! నీకు జయమగుగాక! (19). శాశ్వతైశ్వర్యము గల ఓ శివా! నీకు జయమగుగాక! ఓ మోక్షనిధానమా!నీకు జయమగుగాక! ఓ శాశ్వతమైన రూపము గలవాడా! నీకు జయమగుగాక! శాశ్వతులైన అనుచరులు గల ఓ శివా! నీకు జయమగుగాక! (20) మూడు ఆత్మలను నిర్మించుదానా! నీకు జయమగుగాక! మూడుఆత్మలను (ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ) పాలించుదానా! నీకు జయమగుగాక! మూడు ఆత్మలను సంహరించుదానా! నీకు జయమగుగాక! మూడు ఆత్మల నాయకీ! నీకు జయమగుగాక! (21) ఓ శివా! జగత్కారణమగు ప్రకృతి జగద్రూపముగా ప్రకటమగుట నీ కంటి చూపుపై ఆధారపడియున్నది. నీకు జయమగుగాక! నీ నిరసనదృష్టినుండి పుట్టిన అగ్ని జగత్తును భక్షించును. నీకు జయమగుగాక! (22) దేవతలు మొదలగు వారిచే తెలియబడజాలని స్వరూపము గల ఓ తల్లీ!నీకు జయమగుగాక! సూక్ష్మదృష్టిచే దర్శించబడే ప్రత్యగాత్మయందు చైతన్యరూపముగా ప్రకాశించే ఓ తల్లీ!స్థూలరూపముగా ప్రకటమైన ఆత్మశక్తిని నియంత్రించుదానా! నీకు జయమగుగాక!చరాచరజగత్తును వ్యాపించియున్న ఓ తల్లీ! నీకు జయమగుగాక! (23) ఓశివా! జగత్తులోని తత్త్వములన్నియు కలిసిపోయి నీయందు వీలీనమగుచున్నవి. నీకు జయమగుగాక! ఓ తండ్రీ! సర్వశ్రేష్ఠమగు నీ అనుచరబృందము రాక్షసుల శిరస్సులపై నాట్యమాడుచున్నది. నీకు జయమగుగాక! (24) ఆశ్రయించిన వారిని రక్షించే ఉపాయములను చేయుటలో సమర్థురాలైన ఓ తల్లీ! నీకు జయమగుగాక! సంసారమనే విషపు చెట్టును వ్రేళ్లతో సహా పెకలించి వేసే ఓ తల్లీ! నీకు జయమగుగాక! (25) హృదయాకాశము అనే స్థానములో ఉపలభ్యమయ్యే ఓ శివా! నీవు ఐశ్వర్యముతో శక్తితో మరియు పరాక్రమముతో అతిశయించి ప్రకాశించుచున్నావు. నీకు జయమగుగాక! జగత్తుతో సంపర్కములేని ఓ శివా! శత్రువుల వైభవమును నాశనము చేసినవాడా! నీకు జయమగుగాక! (26)
జయ ప్రణీతపంచార్థప్రయోగపరమామృత | జయ పంచార్థవిజ్ఞానసుధాస్తోత్రస్వరూపిణి || 27
జయాతిఘోరసంసారమహారోగభిషగ్వర | జయానాదిమలాజ్ఞానతమఃపటలచంద్రికే || 28
జయ త్రిపురకాలాగ్నే జయత్రిపురభైరవి | జయ త్రిపురనిర్ముక్తే త్రిగుణమర్దిని || 29
జయ ప్రథమసర్వజ్ఞ జయ సర్వప్రబోధికే | జయ ప్రచురదివ్యాంగ జయ ప్రార్థితదాయిని || 30
క్వ దేవ తే పరం ధామ క్వ చ తుచ్ఛం చ నో వచః | తథాపి భగవాన్ భక్త్యా ప్రలపంతం క్షమస్వ మామ్ || 31
విజ్ఞాపై#్యవంవిధైస్సూక్తైర్విశ్వకర్మా చతుర్ముఖః | నమశ్చకార రుద్రాయ రుద్రాణ్యౖ చ ముహుర్ముహుః || 32
ఇదం స్తోత్రవరం పుణ్యం బ్రహ్మణా సముదీరితమ్ | అర్థనారీశ్వరం నామ శివయోర్హర్షవర్థనమ్ || 33
య ఇదం కీర్తయేద్భక్త్యా యస్య కస్యాపి శిక్షయా | స తత్ఫలమవాప్నోతి శివయోః ప్రీతికారణాత్ || 34
సకలభువనభూతభావనాభ్యాం జననవినాశవిహీనవిగ్రహాభ్యామ్ |
నరవరయువతీవపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతో%స్మిశంకరాభ్యామ్ || 35
ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే బ్రహ్మకృత శివాశివస్తుతివర్ణనం నామ పంచదశో%ధ్యాయః (15).
అయిదు రకముల మోక్షము అనే పురుషార్థమును అందజేసి పరమానందరూపమగు అమృతత్వమును అందజేయువాడా! నీకు జయమగుగాక! పంచార్థవిజ్ఞానము అనే అమృతము వంటి స్తోత్రము స్వరూపముగా గల ఓ తల్లీ! నీకు జయమగుగాక!(27) మిక్కిలి భయంకరమగు సంసారమనే మహారోగమును కుదిర్చే శ్రేష్ఠవైద్యా! నీకు జయమగుగాక! అనాదిదోషము అగు అజ్ఞానము అనే చీకటి గుంపులను చెల్లాచెదరు చేసే వెన్నెలవంటి ఓ తల్లీ! నీకు జయమగుగాక! (28) త్రిపురములకు ప్రళయకాలాగ్నివంటివాడా! నీకు జయమగుగాక! స్థూలసూక్ష్మకారణదేహములనే మూడు రకముల బంధమును నశింపజేయు ఓ భైరవీ! నీకు జయమగుగాక!(29) ప్రథమజీవుడు మరియు సర్వజ్ఞుడు అగు హిరణ్యగర్భుని రూపములో నున్నవాడా ! నీకు జయమగుగాక! సర్వులకు జ్ఞానమునిచ్చు ఓతల్లీ! నీకు జయమగుగాక! కోరిన కోరికలను తీర్చే తల్లీ! నీకు జయమగుగాక! (30) ఓ దేవా! నీ సర్వశ్రేష్ఠమగు ధామము ఎక్కడ? తుచ్ఛములగు మా వాక్కులు ఎక్కడ? ఓ భగవాన్! అయిననూ, భక్తితో ప్రేలాపనను చేసే నన్ను క్షమించుము (31).జగత్తును సృష్టించిన నాల్గు మోముల బ్రహ్మ ఈ విధమగు సూక్తములచే విన్నవించి, శివపార్వతులకు పలుమార్లు ప్రణమిల్లెను (32). బ్రహ్మ చేసిన ఈ దివ్యమగు స్తోత్రరాజమునకు అర్థనారీశ్వరము అని పేరు. ఇది పార్వతీపరమేశ్వరులకు ఆనందమును వర్ధిల్లజేయును (33). ఎవడైతే దీనిని భక్తితో కీర్తించునో, లేదా ఎవరికైననూ నేర్పునో వానికి పార్వతీపరమేశ్వరులకు ప్రీతిని కలిగించిన కారణముగా ఆ ఫలము లభించును (34). సకలభువనములలోని ప్రాణుల హృదయములో చైతన్యరూపముగా విలసిల్లువారు, చావు పుట్టుకలు లేని దేహములు గలవారు, యువతీయువకుల దేహములను దాల్చియున్నవారు అగు పార్వతీపరమేశ్వరులను నేను సర్వకాలములలోనమస్కరించుచున్నాను (35).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో బ్రహ్మకృత శివాశివ స్తుతిని వర్ణించే పదనైదవ అధ్యాయము ముగిసినది (15).