Siva Maha Puranam-4    Chapters   

మను పుత్ర వంశ వర్ణనము

అథ షట్త్రింశో%ధ్యాయః

మను పుత్ర వంశ వర్ణనము

సూత ఉవాచ |

మనోర్వైవస్వతస్యాసన్‌ పుత్రా వై నవ తత్సమాః | పశ్చాన్మహోన్నతా ధీరాః క్షత్రధర్మపరాయణాః || 1

ఇక్ష్వాకుశ్శిబినాభాగౌ ధృష్టశ్శర్యాతిరేవ చ | నరిష్యంతో%థ నాభాగః కరూషశ్చ ప్రియవ్రతః || 2

అకరోత్పుత్రకామస్తు మనురిష్టిం ప్రజాపతిః | అనుత్పన్నేషు పుత్రేషు తత్రేష్ట్యాం మునిపుంగవ || 3

సా హి దివ్యాంబరధరా దివ్యాభరణభూషితా | దివ్యసంహననా చైవమిలా జజ్ఞే హి విశ్రుతా || 4

తామిడేత్యేవ హోవాచ మనుర్దండధరస్తథా | అనుగచ్ఛ త్వం మామేతి తమిడా ప్రత్యువాచ హ || 5

సూతుడు ఇట్లు పలికెను -

వైవస్వతమనువునకు తొమ్మిది మంది పుత్రులు గలరు. వారు ఆయనతో సమానమైన వారు. వారు తరువాతి కాలములో గొప్ప ఉన్నతిని పొందిరి. ధీరులగు ఆ మనుపుత్రులు క్షత్రియధర్మమును పాలించుటలో నిష్ఠను కలిగి యుండిరి (1). ఇక్ష్యాకువు, శిబి, నాభాగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, రెండవ నాభాగుడు, కరూషుడు, ప్రియవ్రతుడు అనునవి వారి పేర్లు (2). ఓ మహర్షీ! ప్రజాపతియగు మనువు పుత్రులను కోరి ఇష్టిని చేసెను. కాని పుత్రులు కలుగ లేదు. ఆ యజ్ఞములో దివ్యవస్త్రములను మరియు దివ్యాభరణములను దాల్చి దివ్య దేహము గలదై ఇల జన్మించెనని ప్రసిద్ధి (3,4). అపుడు దుష్టశిక్షకుడగు మనువు ఆమెను 'ఓ ఇడా!' అని మాత్రమే సంబోధించి, 'నీవు నా వెంట రమ్ము' అని పలుకగా, ఆ ఇడ ఇట్లు బదులిడెను (5).

ఇడోవాచ |

ధర్మయుక్తమిదం వాక్యం పుత్రకామం ప్రజాపతిమ్‌ | మిత్రావరుణయోరంశైర్జాతాస్మి వదతాం వర || 6

తయోస్సకాశం యాస్యామి న మో%ధర్మే రుచిర్భవేత్‌ | ఏవముక్త్వా సతీ సా తు మిత్రావరుణయోస్తతః || 7

గత్వాంతికం వరారోహా ప్రాంజలిర్వాక్యమబ్రవీత్‌ | అంశైస్తు యువయోర్జాతా మనుయజ్ఞే మహామునీ || 8

ఆగతా భవతోరంతి బ్రూతం కిం కరవాణి వామ్‌ | అన్యాన్‌ పుత్రాన్‌ సృజ విభో తైర్వంశ##స్తే భవిష్యతి || 9

పుత్రులను కోరి ధర్మబద్ధముగా యజ్ఞమును చేయుచున్న ఆ ప్రజాపతిని ఉద్దేశించి ఇడ ఇట్లు పలికెను -

ఓ వక్తలలో శ్రేష్ఠమమైనవాడా ! నేను మిత్రావరుణుల అంశ##చే జన్మించితిని (6). నేను వారి వద్దకు వెళ్లెదను. నాకు అధర్మమునందు అభిరుచి లేకుండుగాక ! ఇట్లు పలికి ఆ సుందరి తరువాత మిత్రావరుణుల వద్దకు వెళ్లి చేతులను జోడించి నమస్కరించి ఇట్లు పలికెను: ఓ మహర్షులారా! నేను మనువుయొక్క యజ్ఞములో మీ అంశలచే జన్మించితిని (7,8). మీ వద్దకు వచ్చియుంటిని. చెప్పుడు. మీకు ఏ పనిని నేను చేయవలెను? ఓ పరమేశ్వరా! ఇతరసంతానమును సృష్టించుము. దాని వలన నీ వంశము వృద్ధిని పొందును (9).

సూత ఉవాచ |

తాం తథా వాదినీం సాధ్వీమిడాం మన్వధ్వరోద్భవామ్‌ | మిత్రావరుణనామానౌ మునీ ఊచతురాదరాత్‌ || 10

సూతుడిట్లు పలికెను -

మనువుయొక్క యజ్ఞములో పుట్టిన సాధ్వి యగు ఆ ఇడ ఈ విధముగా పలుకగా, మిత్రావరుణులు అనే పేరు గల ఆ మునులు సాదరముగా నిట్లు పలికిరి (10).

మిత్రావరుణావూచతుః |

అనేన తప ధర్మజ్ఞే ప్రశ్రయేణ దమేన చ| సత్యేన చైవ సుశ్రోణి ప్రితౌ ద్వౌవరవర్ణిని || 11

ఆవయోస్త్వం మహాభాగే ఖ్యాతిం చైవ గమిష్యసి | మనోర్వంశకరః పుత్రస్త్వమేవ చ భవిష్యసి || 12

సుద్యుమ్న ఇతి విఖ్యాతస్త్రిషు లోకేషు విశ్రుతః | జగత్ప్రయో ధర్మశీలో మనువంశవివర్ధనః || 13

మిత్రావరుణులు ఇట్లు పలికిరి -

ఓ ధర్మాత్మురాలా! సుందరీ! శ్రేష్ఠమగు దేహవర్ణము గలదానా! నీ ఈ వినయము చేత, ఇంద్రియనిగ్రహము చేత మరియు సత్యము చేత మేము ఇద్దరము సంతోషించితిమి (11) ఓ మహాత్మురాలా! నీవు మా కీర్తిని నిశ్చయముగా పొందగలవు. మనువుయొక్క వంశమును నిలబెట్టే పుత్రుడవు నీవే కాగలవు (12). నీవు ధర్మాత్ముడవు, లోకప్రియుడవు అయి ముల్లోకములలో సుద్యుమ్నుడు అను పేర ఖ్యాతిని గాంచి, మనువుయొక్క వంశమును వృద్ధిలోనికి తీసుకొని రాగలవు (13).

సూత ఉవాచ |

నివృత్తా సా తు తచ్ఛ్రుత్వా గచ్ఛంతీ పితురంతికే | బుధేనాంతరమాసాద్య మైథునాయోపమంత్రితా || 14

సోమపుత్రాత్తతో జజ్ఞే తస్యాం రాజా పురూరవాః | పుత్రో% తిసుందరః ప్రాజ్ఞ ఉర్వశీపతిరున్నతః || 15

జనయిత్వా చ సా తత్రపురూరవసమాదరాత్‌ | పుత్రం శివప్రసాదాత్తు పునస్సుద్యుమ్నతాం గతః || 16

సుద్యుమ్నస్య తు దాయాదాస్త్రయః పరమధార్మికాః | ఉత్కలశ్చ గయశ్చాపి వినతాశ్వశ్చ వీర్యవాన్‌ || 17

ఉత్కలస్యోత్కలా విప్ర వినతాశ్వస్య పశ్చిమాః| దిక్పూర్వా మునిశార్దూల గయస్య తు గయాః స్మృతాః || 18

ప్రవిష్టే తు మనౌ తాత దివాకరతనుం తదా | దశధా తత్ర తత్‌ క్షేత్రమకరోత్పృథివీం మనుః || 19

ఇక్ష్వాకుః శ్రేష్ఠదాయాదో మధ్యదేశమవాప్తవాన్‌ | వసిష్ఠవచనాదాసీత్ర్పతిష్ఠానం మహాత్మనే || 20

ప్రతిష్ఠాం ధర్మరాజ్యస్య సుద్యుమ్నోథ తతో దదౌ | తత్పురూరవసే ప్రాదాద్రాజ్యం ప్రాప్య మహాయశాః || 21

మానవో యో మునిశ్రేష్ఠాః స్త్రీ పుంసోర్లక్షణః ప్రభుః | నరిష్యంతాచ్ఛకాః పుత్రా నభగస్య సుతో%భవత్‌ || 22

అంబరీషస్తు బాహ్లేయో బాహ్లకం క్షేత్రమాప్తవాన్‌ | శర్యాతేర్మిథునం త్వాసీదానర్తో నామ విశ్రుతః || 23

పుత్రస్సుకన్యా కన్యా చ యా పత్నీ చ్యవనస్య హి | ఆనర్తస్య హి దాయాదో రైభ్యో నామ సరైవతః || 24

సూతుడు ఇట్లు పలికెను -

ఆ మాటను విని ఆమె తండ్రి వద్దకు మరలి వెళ్లుచుండగా, బుధుడు మధ్యలో అవకాశమునెరింగి ఆమె పొందును కోరెను. (14). బుధుని వలన ఆమె యందు మిక్కిలి సుందరుడు, బుద్ధిశాలి, ఉర్వశీప్రయుడు, గొప్పవాడు అగు పురూరవమహారాజు పుత్రుడై పుట్టెను (15). ఆమె అచట పురూరవుని పుత్రునిగా పొంది శివుని అనుగ్రహము వలన మరల సాదరముగా సుద్యుమ్నుడుగా ఆయెను (16). సుద్యుమ్నునకు ఉత్కలుడు, గయుడు మరియు పరాక్రమశాలియగు వినతాశ్వడు అనే ముగ్గురు మహాధర్మాత్ములు అగు దాయాదులు గలరు (17). ఓ బ్రాహ్మణా! మహర్షీ! ఉత్కలునకు ఉత్కలదేశము, వినతాశ్వునకు పశ్చిమదేశములు, గయునకు గయదేశము మరియు తూర్పు దిక్కు ఈయబడినవని చెప్పెదరు (18). ఓ వత్సా! మనువు దేహమును విడిచి సూర్యమండలములో ఐక్యమగుటకు ముందు ఆయన ఆ భూక్షేత్రమును పది భాగములు చేసెను (19). పెద్ద కొడకు అగు ఇక్ష్వాకుడు మధ్యదేశమును పొందెను. గొప్ప కీర్తిశాలియగు సుద్యుమ్నుడు తరువాత వసిష్ఠుని వచనముచే ధర్మరాజ్యమునకు సుస్థిరనిలయమగు ప్రతిష్ఠానదేశమునందలి రాజ్యాధికారమును పురూరవునకు ఇచ్చెను (20,21). ఓ మహర్షులారా! మనుపుత్రుడగు సుద్యుమ్నప్రభువునందు స్త్రీ పురుషలక్షణములు రెండు గలవు. నరిష్యంతుని పుత్రులు శకులు. నభగుని పుత్రుడగు అంబరీషుడు బాహ్లకదేశమును పొంది బాహ్లేయుడు ఆయెను. శర్యాతికి కొడుకు, కూతురు ఉండిరి. కొడుకు ప్రసిద్ధిని గాంచిన ఆనర్తుడు (22,23) కన్య పేరు సుకన్య. ఆమెయే చ్యవనుని భార్య. ఆనర్తుని కొడుకు రైభ్యుడు. ఆయనకు రైవతుడనియు పేరు గలదు (24).

ఆనర్తవిషయే యస్య పురీ నామ కుశస్థలీ | మహాదివ్యా సప్తపురీమధ్యే యా సప్తమీ మతా || 25

తస్య పుత్రశతం త్వాసీత్కకుద్మీ జ్యేష్ఠ ఉత్తమః | తేజస్వీ సుబలః పారో ధర్మిష్ఠో బ్రహ్మపాలకః || 26

కకుద్మినస్తు సంజాతా రేవతీ నామ కన్యకా | మహాలావణ్యసంయుక్తా దివ్యలక్ష్మీరివాపరా || 27

ప్రష్టుం కన్యావరం రాజా కకుద్మీ కన్యయా సహ | బ్రహ్మలోకే విధేస్సమ్యక్‌ సర్వాధీశో జగామ హ || 28

ఆవర్తమానే గాంధర్వే స్థితో లబ్ధక్షణః క్షణమ్‌ | శుశ్రావ తత్ర గాంధర్వం నర్తనే బ్రహ్మణో%ంతికే || 29

మూహూర్తభూతం తత్కాలే గతం బహుయుగం తదా | న కించిద్బుబుధే రాజా కకుద్మీ మునయస్సతు || 30

తదాసౌ విధిమానమ్య స్వాభిప్రాయం కృతాంజలిః | న్యవేదయద్వినీతాత్మా బ్రహ్మణ పరమాత్మనే || 31

తదభిప్రాయమాకర్ణ్య స ప్రహస్య ప్రజాపతిః | కకుద్మినం మహారాజం సమాభాష్య సమబ్రవీత్‌ || 32

అయనయొక్క నగరమగు కుశస్థలి ఆనర్తదేశమునందు గలదు. గొప్ప దివ్యమగు ఆ నగరము ఏడు నగరములలో ఏడవది (25). ఆయనకు వంద మంది పుత్రులు గలరు. వారిలో ఉత్తముడు, తేజశ్శాలి, గొప్ప బలశాలి, మహాత్ముడు, ధర్మాత్ముడు, బ్రాహ్మణులను రక్షించువాడు అగు కకుద్మి పెద్దవాడు (26). కకుద్మికి మహాలావణ్యవతి, రెండవ దివ్యలక్ష్మి వలెనున్నది అగు రేవతి అను కన్యక పుట్టెను (27). ఆ కన్యకు వరుని గురించి అడుగుటకై సర్వాధీశ్వరుడగు ఆ కకుద్మిమహారాజు కన్యను తోడ్కొని బ్రహ్మలోకములో బ్రహ్మవద్దకు వెళ్లెను (28). అచట బ్రహ్మ సమీపములో నృత్యగీతములు జరుగుచుండగా, ఆ రాజు క్షణకాలము ఉత్సాహమును పొంది ఆ గీతమును వినుచుండెను (29). ఓ మునులారా! అది బ్రహ్మకాలమును బట్టి ముహూర్తమే అయినా, అనేకయుగములు గడచిపోయెను. ఆ కకుద్మి మహారాజునకు కాలము గురించి లేశ##మైననూ తెలియలేదు (30). అపుడు వినయస్వభావము గల ఆ రాజు పరమాత్మయగు బ్రహ్మకు చేతులను జోడించి నమస్కరించి తన అభిప్రాయమును విన్నవించెను (31). ఆ కకద్మిమహారాజుయొక్క అభిప్రాయమును విని ప్రజాపతి నవ్వి, ఆయనను దగ్గరకు పిలచి ఇట్లు పలికెను (32).

బ్రహ్మోవాచ |

శృణు రాజన్‌ రైభ్యసుత కకుద్మిన్‌ పృథివీపతే | మద్వచః ప్రీతితస్సత్యం ప్రవక్ష్యామి విశేషతః || 33

కాలేన సంహృతాస్తేవై వరా యే తే కృతా హృది | న తద్గోత్రం హి తత్రాస్తి కాలస్సర్వస్య భక్షకః || 34

త్వత్పుర్యపి హతా పుణ్యజనైస్సా రాక్షసైర్నృప | అష్టావింశద్వాపరే% ద్య కృష్ణేన నిర్మితా పునః || 35

కృతా ద్వారావతీ నామ్నా బహుద్వారా మనోరమా | భోజవృష్ఠ్యంధకైర్గుప్తా వాసుదేవపురోగమైః || 36

తద్గచ్ఛ తత్ర ప్రీతాత్మా వాసుదేవాయ కన్యకామ్‌ | బలదేవాయ దేహి త్వమిమాం స్వతనయాం నృప || 37

బ్రహ్మ ఇట్లు పలికెను -

రైభ్యకుమారా! కకుద్మిమహారాజా! నా మాటను ప్రీతితో వినుము. నేను విశేషించి సత్యమును చెప్పెదను (33). ఏ వరులను నీవు మనస్సులో భావన చేయుచుంటివో, వారు కాలగర్భములో కలిసిపోయినారు. భూలోకములో వారి గోత్రమైననూ మిగిలి లేదు. కాలము సర్వమును కబళించును (34). ఓ రాజా! నీ నగరము కూడ పుణ్యజనులనే రాక్షసులచే అపహరించబడినది. ఇప్పుడు ఇరవై ఎనిమిదవ ద్వాపరము నడచుచున్నది. శ్రీకృష్ణుడు మరల ఆ నగరమును నిర్మించినాడు (35) అనేకద్వారములతో మనోహరముగానుండే ఆ నగరమునకు ద్వారావతి అని పేరు. వాసుదేవుడు నాయకుడుగా గల భోజ-వృష్ణి- అంధకవంశీయులు దానికి రక్షకులు (36). ఓ రాజా! కావున, నీవు సంతసించిన అంతరంగము గలవాడవై అచటకు వెళ్లుము. నీవు నీ ఈ కుమార్తెను వసుదేవుని కుమారుడగు బలదేవునకు ఇమ్ము (37).

సూచ ఉవాచ|

ఇత్యాదిష్టో నృపో% యం తం నత్వా తాం చ పురీం గతః | గతాన్‌ బహూన్‌ యుగాన్‌ జ్ఞాత్వా విస్మితః కన్యయా యుతః|| 38

తతస్తు యువతీం కన్యాం తాం చ స్వాం సువిధానతః | కృష్ణభ్రాత్రే బలాయాశు ప్రాదాత్తత్ర స రేవతీమ్‌ || 39

తతో జగామ శిఖరం మేరోర్దివ్యం మహాప్రభుః | శివమారాధయామాస స నృపస్తపసి స్థితః || 40

సూతుడు ఇట్లు పలికెను -

ఈ మహారాజు ఆ విధముగా ఆదేశించబడినవాడై ఆయనకు నమస్కరించి, అనేకయుగములు గడచినవని తెలిసి ఆశ్చర్యచకితుడై, తన కుమార్తెతో కూడి ఆ నగరమునకు వెళ్లెను (38). తరువాత ఆయన అచట యువకన్య యగు తన కుమార్తెను వెంటనే శ్రీకృష్ణుని సోదరుడగు బలరామునకు ఇచ్చి వివాహమును చేసెను (39). తరువాత గొప్ప సమర్థుడగు ఆ రాజు దివ్యమగు మేరుశిఖరమునకు వెళ్లి తపస్సునందు నిమగ్నుడై శివుని ఆరాధించెను (40).

ఋషయ ఊచుః |

తత్ర స్థితో బహుయుగం బ్రహ్మలోకే స రేవతః | యువైవాగాన్మర్త్యలో కమేతన్నస్సంశయో మహాన్‌ || 41

ఋషులు ఇట్లు పలికిరి -

ఆ కకుద్మిమహారాజు రేవతితో గూడి అనేకయుగముల కాలము బ్రహ్మలోకములో నున్నవాడై యువకుడుగనే తిరిగి మనుష్యలోకమునకు వచ్చినాడు. ఈ విషయములో మాకు పెద్ద సంశయము గలదు (41)

సూత ఉవాచ|

న జరా క్షుత్పిపాసా వా వికారాస్తత్ర సంతివై | అపమృత్యుర్న కేషాంచిన్మునయో బ్రహ్మణో%తికే || 42

అతో న రాజా సంప్రాప జరాం మృత్యుం చ సా సుతా | స యువైవాగతస్తత్ర సంమంత్ర్య తనయావరమ్‌ || 43

గత్వా ద్వారావతీం దివ్యాం పురీం కృష్ణవినిర్మితామ్‌ | వివాహం కారయామాస కన్యాయాస్స బలేన హి || 44

తస్య పుత్రశతం త్వాసీద్ధార్మికస్య మహాప్రభోః | కృష్ణస్యాపి సుతా జాతా బహుస్త్రీభ్యో%మితాస్తతః || 45

అన్వవాయో మహాంస్తత్ర ద్వయోరపి మహాత్మనోః | క్షత్రియా దిక్షు సర్వాసు గతా హృష్టాస్సుధార్మికాః || 46

ఇతి ప్రోక్తో హి శర్యాతేర్వంశో% న్యేషాం వదామ్యహమ్‌ | మానవానాం హి సంక్షేపాచ్ఛృణుతాదరతో ద్విజాః || 47

నాభాగో ధృష్టపుత్రో% భూత్స చ బ్రాహ్మణతాం గతః | స్వక్షత్రవంశం సంస్థాప్య బ్రహ్మకర్మభిరావృతః || 48

ధృష్టాద్ధార్‌ష్టమభూత్‌ క్షత్రం బ్రహ్మభూయం గతం క్షితౌ | కరూషస్య తు కారూషాః క్షత్రియా యుద్ధదుర్మదాః || 49

నృగో యో మనుపుత్రస్తు మహాదాతా విశేషతః | నానావసూనాం సుప్రీత్యా విప్రేభ్యశ్చ గవాం తథా || 50

గోదానవ్యత్యయాద్యస్తు స్వకుబుద్ధ్యా స్వపాపతః | కృకలాసత్వమాపన్నః శ్రీకృష్ణేన సముద్ధృతః || 51

తసై#్యకోభూత్సుతః శ్రేష్ఠః ప్రయాతిర్ధర్మవిత్తథా | ఇతి శ్రుతం మయా వ్యాసాత్తత్ర్పోక్తం హి సమాసతః || 52

సూతుడు ఇట్లు పలికెను -

ఓ మునులారా! బ్రహ్మయొక్క సన్నిధిలో ముసలితనము, ఆకలిదప్పికలు, ఇతరదేహవికారములు, అకాలమరణము అనునవి ఎవ్వరికైననూ ఉండవు. (42). కావుననే, ఆ రాజునకు గాని, ఆయన కుమార్తెకు గాని జరామరణములు కలుగలేదు. ఆయన అచట కుమార్తెకు వరుని గురించి చర్చించి యువకుడుగనే మరలి వచ్చినాడు (43). ఆయన శ్రీకృష్ణునిచే నిర్మింపబడిన దివ్యమగు ద్వారావతీ నగరమునకు వెళ్లి, కుమార్తెకు బలరామునితో వివాహమును జరిపించెను (44). ధర్మాత్ముడు మహాప్రభువు అగు బలరామునకు నూర్గురు పుత్రులు కలిగిరి. తరువాత శ్రీకృష్ణునకు కూడ అనేక భార్యలయందు లెక్కలేనంత మంది పుత్రులు కలిగిరి (45). ఆ ఇద్దరు మహాత్ముల ద్వారా పెద్ద వంశము బయలు దేరెను. ఆ వంశక్షత్రియులు సర్వదిక్కులకు వెళ్లి ఆనందముగా ధర్మమునకు బద్ధులై ఉండిరి (46). ఓ బ్రాహ్మణులారా! ఈ విధముగా శర్యాతియొక్క వంశమును గురించి చెప్పితిని. ఇతరమనుపుత్రుల వంశములను గురించి కూడ సంక్షేపముగా చెప్పెదను. సాదరముగా వినుడు (47). ధృష్టునకు నాభాగుడు అనే పుత్రుడు ఉండెను. ఆయన తన క్షత్రియవంశమును చక్కగా స్ధాపించి వేదవిహితకర్మలలో నిమగ్నుడై బ్రాహ్మణత్వమును పొందెను (48). ధృష్టునినుండి ధార్‌ష్టము అనే క్షత్రియవంశము భూమిలో నెలకొని బ్రాహ్మణత్వమును పొందెను. కరూషుని వంశీయులగు క్షత్రియులు కారూషులు అనబడుదురు. వారు అధికమగు యుద్ధగర్వమును కలిగియుండిరి (49). మనుపుత్రుడగు నృగుడు గొప్ప దాత. ఆయన పలు విధముల సంపదను, గోవులను మహాప్రీతితో బ్రాహ్మణులకు దానము చేసెను (50). ఆయన తన చెడు బుద్ధిచే గోదానములో అపరాధమును చేసి తన పాపముచే ఊసరవెల్లి జన్మను పొందగా, శ్రీకృష్ణుడు ఆయనను ఉద్ధరించెను (51). ఆయనకు ప్రయాతి అనే ధర్మవేత్త మరియు గొప్పవాడు అగు ఒక పుత్రుడు కలిగెను. వ్యాసుడు ఈ విధముగా సంగ్రహముగా చెప్పిన దానిని నేను విని మీకు చెప్పితిని (52).

పృషధ్రస్తు మనోః పుత్రో గోపాలో గురుణా కృతః | పాలయామాస గా యత్తో రాత్ర్యాం వీరాసనవ్రతః || 53

స ఏకదా%%గతం గోష్టే వ్యాఘ్రం గా హింసితుం బలీ | శ్రుత్వా గోక్రందనం బుద్ధో హంతుం తం ఖడ్గధృగ్య¸° || 54

అజానన్నహనద్బభ్రోశ్శిరశ్శార్దూలశంకయా | నిశ్చక్రామ సభీర్వ్యాఘ్రో దృష్ట్వా తం ఖడ్గినం ప్రభుమ్‌ || 55

మన్యమానో హతం వ్యాఘ్రం స్వస్థానం స జగామ హ | రాత్ర్యాం తస్యాం భ్రమాపన్నో వర్షవాతవినష్టధీః || 56

వ్యుష్టాయాం నిశి చోత్థాయ ప్రగే తత్ర గతో హి సః | అద్రాక్షీత్స హతాం బభ్రుం న వ్యాఘ్రం దుఃఖితో% భవత్‌ || 57

శ్రుత్వా తద్వృత్తమాజ్ఞాయ తం శశాప కృతాగసమ్‌ | అకామతో%విచార్యేతి శూద్రో భవ నక్షత్రియః || 58

ఏవం శప్తస్తు గురుణా కులాచార్యేణ కోపతః | నిస్సృతశ్చ పృషధ్రస్తు జగామ విపినం మహత్‌ || 59

నిర్విణ్ణస్స తు కష్టేన విరక్తో% భూత్స యోగవాన్‌ | వనాగ్నౌ దగ్ధదేహశ్చ జగామ పరమాం గతిమ్‌ || 60

కవిః పుత్రో మనోః ప్రాజ్ఞశ్శివానుగ్రహతో%భవత్‌ | ఇహ భుక్త్వా సుఖం దివ్యం ముక్తిం ప్రాప సుదుర్లభామ్‌ || 61

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం మనునవపుత్రవంశవర్ణనం నామ షట్త్రింశో%ధ్యాయః (36).

మనుపుత్రుడగు పృషధ్రుని గురువు సేవించుమని ఆదేశించెను. ఆతడు రాత్రియందు జాగరూకుడై వీరాసనమునందు కూర్చుండి గోవులను రక్షించెడివాడు (53). ఒకనాడు గోశాలలోని గోవులను చంపుటకై ఒక పెద్ద పులి వచ్చెను. గోవుల ఆక్రందనమును విని తెలివి తెచ్చుకుని బలశాలియగు ఆతడు ఆ పెద్దపులిని చంపుటకై కత్తిని పట్టుకొని వెళ్లెను. (54). ఖడ్గమును చేతబట్టియున్న ఆ వీరుని గాంచి పెద్దపులి భయపడి పారిపోయెను. కాని, ఆతనికి ఆ విషయము తెలియక, పెద్పులి అని భ్రమపడి కపిలగోవుయొక్క తలను నరికివేసెను (55). పెద్దపులి మరణించినదని తలంచి ఆతడు తన స్థానమునకు మరలి వెళ్లెను. ఆ రాత్రియందు గాలివాన వలన వినష్టమైన బుద్ధిగల ఆతడు భ్రమపడెను (56). రాత్రి గడచి తెల్లవారగానే ఆతడు అచటకు వెళ్లి పెద్దపులికి బదులుగా సంహరింపబడియున్న కపిలగోవును చూచి దుఃఖించెను (57). ఆ వృత్తాంతమును విని, ఆతడు ఆ పాపమును బుద్దిపూర్వకముగా చేయలేదనియు, పరిశీలించకపోవుట వలన పాపము జరిగినదనియు గ్రహించిన గురువు ఆతనిని 'నీవు క్షత్రియుడవై ఉండదగవు; శూద్రుడవు కమ్ము' అని శపించెను (58). కులాచార్యుడగు గురువు కోపముతో ఇట్లు శపించగా, ఆ పృషధ్రుడు అక్కడనుండి బయటకు వచ్చి దట్టమగు అడవికి వెళ్లెను (59). ఆతడు వైరాగ్యమును పొంది కష్టపడి యోగమును సాధించి దావాగ్నియందు దహింపబడిన దేహము గలవాడై పరమగతిని పొందెను (60). మనుపుత్రుడగు కవి శివుని అనుగ్రహము వలన జ్ఞానమును పొంది ఇహలోకములో దివ్యసుఖములననుభవించి మిక్కిలి దుర్లభ##మైన మోక్షమును పొందెను. (61).

శ్రీ శివమహాపురాణములోని ఉమాసంహితయందు మనుపుత్రవంశవర్ణనమనే ముప్పది ఆరవ అధ్యాయము ముగిసినది (36).

Siva Maha Puranam-4    Chapters