Siva Maha Puranam-4
Chapters
అథ ఏకోనవింశో
వీరభద్రుని పుట్టుక
ఋషయ ఊచుః |
కథం దక్షస్య ధర్మార్ధం ప్రవృత్తస్య దురాత్మనః | మహేశః కృతవాన్ విఘ్నమేతదిచ్ఛామ వేదితుమ్ || 1
ఋషులు ఇట్లు పలికిరి -
దుష్టబుద్ధియగు దక్షుడు ధర్మము కొరకై ప్రవర్తించుచుండగా, మహేశ్వరుడు విఘ్నమును చేసిన విధానమెట్టిది? మేమీ విషయమును తెలియగోరుచున్నాము (1).
వాయురువాచ |
విశ్వస్య జగతో మాతురపి దేవ్యాస్తపోబలాత్ | పితృభావముపాగత్య ముదితే హిమవద్గిరౌ || 2
దేవే % పి తత్కృతోద్వాహే హిమవచ్ఛిఖరాలయే | సంక్రీడతి తయా సార్ధం కాలే బహుతరే గతే || 3
వైవస్వతే%ంతరే ప్రాప్తే దక్షః ప్రాచేతసస్స్వయమ్ | అశ్వమేధేన యజ్ఞేన యక్ష్యమాణో%న్వపద్యతే || 4
తతో హిమవతః పృష్ఠే దక్షో వై యజ్ఞమాహరత్ | గంగాద్వారే శుభే దేశే ఋషిసిద్ధనిషేవిత || 5
తస్య తస్మిన్ మఖే దేవాస్సర్వే శక్రపురోగమాః | గమనాయ సమాగమ్య బుద్ధిమాపేదిరే తదా || 6
ఆదిత్యా వసవో రుద్రాస్సాధ్యాస్సహ మరుద్గణౖః | ఉష్మపాస్సోమపాశ్చైవ ఆజ్యపా ధూమపాస్తథా || 7
అశ్వినౌ పితరశ్చైవ తథా చాన్యే మహర్షయః | విష్ణునా సహితాస్సర్వే స్వాగతా యజ్ఞభాగినః || 8
దృష్ట్వా దేవకులం సర్వమీశ్వరేణ వినా గతమ్ | దధీచో మన్యునా%విష్టో దక్షమేవమభాషత || 9
వాయువు ఇట్లు పలికెను -
సకలజగత్తునకు తల్లియగు సతీదేవికి తపస్సుయొక్క బలముచే తండ్రి అనే స్థానమును పొంది హిమవత్పర్వతుడు ఆనందించుచుండెను (2). శివుడు కూడ ఆమెను వివాహమాడి హిమవంతుని శిఖరమును నివాసముగా చేసుకొని ఆమెతో కూడి విహరించుచుండగా చిరకాలము గడచి పోయెను (3). వైవస్వత మన్వంతరము ఆరంభమయ్యెను. ప్రచేతసుల పుత్రుడగు దక్షుడు స్వయముగా అశ్వమేధమనే యజ్ఞమును చేయగోరి అచటకు విచ్చేసెను (4). అపుడు దక్షుడు హిమవత్పర్వతము పై గంగాద్వారము (హరిద్వార్) వద్ద ఋషులచే మరియు సిద్ధులచే సేవించబడే శుభకరమగు స్థలములో యజ్ఞమును ఆరంభించెను (5). అపుడు వాని ఆ యజ్ఞమునకు ఇంద్రుడు మొదలగు దేవతలు అందరు గుమిగూడి వెళ్లుటకు సంకల్పించిరి (6). ఆదిత్యులు, వసువులు, రుద్రులు, సాధ్యులు, మరుద్గణములు, ఉష్మప-సోమప-ఆజ్యప-ధూమపులనే పితృదేవతలు (7), అశ్వినీ దేవతలు, ఇతర పితృదేవతలు, మహర్షులు కలిసి యజ్ఞభాగములను పొందుటకై చక్కగా వచ్చియుండిరి (8). ఈశ్వరుని మినహాయించి దేవతల సమూహమంతయు వచ్చియుండుటను గాంచి దధీచుడు కోపముతో నిండిన మనస్సు గలవాడై దక్షునితో నిట్లు పలికెను (9)
దధీచ ఉవాచ |
అప్యపూజ్యే చైవ పూజా పూజ్యానాం చాప్యపూజనే | నరః పాపమవాప్నోతి మహద్వై నాత్ర సంశయః || 10
అసతాం సమ్మతిర్యత్ర సతామవమతిస్తథా | దండో దేవకృతస్తత్ర సద్యః పతతి దారుణః || 11
ఏవముక్త్వా తు విప్రర్షిః పునర్దక్షమభాషత | పూజ్యం తు పశుభర్తారం కస్మాన్నార్చయసే ప్రభుమ్ || 12
దధీచుడు ఇట్లు పలికెను -
పూజింపదగని వారిని పూజించుటయందు, పూజింపదగిన వారిని పూజింపకుండుట యందు మానవుడు మహాపాపమును పొందును. ఈ విషయములో సందేహము లేదు (10). ఏ స్థానములో అయోగ్యులకు సమ్మానము, సత్పురుషులకు అవమానము జరుగునో, అచట ఈశ్వరునిచే ఈయబడే దారుణమగు శిక్ష పడును (11). ఆ బ్రాహ్మణమహర్షి ఈ విధముగా పలికి మరల దక్షునితో నిట్లనెను : పూజనీయుడగు పశుపతిప్రభుని నీవు ఏల పూజించుట లేదు? (12).
దక్ష ఉవాచ |
సంతి మే బహవో రుద్రాశ్శూలహస్తాః కపర్దినః | ఏకాదశావస్థితా యే నాన్యం వేద్మి మహేశ్వరమ్ || 13
దక్షుడు ఇట్లు పలికెను -
నా వద్ద శూలమును చేతియందు ధరించినవారు, జటాజూటధారులు అగు రుద్రులు పదకొండు మంది గలరు. మరియొక మహేశ్వరుని గురించి నాకు తెలియదు (13).
దధీచ ఉవాచ |
కిమేభిరమరైరన్యైః పూజితైరధ్వరే ఫలమ్ | రాజా చేదధ్వరస్యాస్య న రుద్రః పూజ్యతే త్వయా || 14
బ్రహ్మవిష్ణుమహేశానాం స్రష్టా యః ప్రభురవ్యయః | బ్రహ్మాదయః పిశాచాంతా యస్య కైంకర్యవాదినః || 15
ప్రకృతీనాం పరశ్చైవ పురుషస్య చ యః పరః | చింత్యతే యోగవిద్వద్భిర్ ఋషిభిస్తత్త్వదర్శిభిః || 16
అక్షరం పరమం బ్రహ్మ హ్యసచ్చ సదసచ్చ యత్ | అనాదిమధ్యనిధనమప్రతర్క్యం సనాతనమ్ || 17
యస్స్రష్టా చైవ సంహర్తా భర్తా చైవ మహేశ్వరః | తస్మాదన్యం న పశ్యామి శంకరాత్మానమధ్వరే || 18
దధీచుడు ఇట్లు పలికెను -
ఈ యజ్ఞమునకు అధీశ్వరుడగు రుద్రుని నీవు పూజించనిచో, యజ్ఞములో ఈ ఇతరదేవతలను పూజించుట వలన ఫలమేమున్నది? (14) ఏ ప్రభువు బ్రహ్మవిష్ణుమహేశ్వరులను సృష్టించినవాడో, వినాశము లేనివాడో, బ్రహ్మ మొదలుకొని పిశాచము వరకు ఎవని యెదుట, అయ్యా! ఏమి చేయవలెను? అని పలికెదరో (15), ఎవడు ప్రకృతిపురుషులకు అతీతుడో, యోగమునెరింగిన తత్త్వమును దర్శించిన ఋషులు ఎవనిని ధ్యానించెదరో (16), ఏ అక్షరపరబ్రహ్మ తన మాయాశక్తిచే కార్యకారణరూపమగు జగత్తుయొక్క రూపములో ప్రకటమగుచున్నాడో, ఎవనికి ఆదిమధ్యము మరియు అంతము లేవో, ఏ శాశ్వతుడు ఊహకు అందడో (17), ఎవడు సృష్టిస్థితిలయములను చేయు సర్వేశ్వరుడో, అట్టి శంకరస్వరూపుడగు పరమాత్మను తప్ప మరియొకనిని యజ్ఞముననందు పూజింపదగిన వానిని నేను ఎరుంగను (18).
దక్ష ఉవాచ |
ఏతన్మఖేశస్య సువర్ణపాత్రే హవిస్సమస్తం విధిమంత్రపూతమ్ |
విష్ణోర్నయామ్యప్రతిమస్య భాగం ప్రభోర్విభజ్యాహవనీయమద్య || 19
దక్షుడు ఇట్లు పలికెను -
యజ్ఞేశ్వరుడు, సాటి లేనివాడు అగు విష్ణుప్రభుని హవిర్భాగమును అంతను విభాగము చేసి ఈ బంగరు పాత్రలో యథావిధిగా మంత్రములచే పవిత్రముగా చేసి ఇప్పుడే ఆహవనీయాగ్ని (హోమములు చేయబడే అగ్ని) వద్దకు తీసుకొని వెళ్లుచున్నాను (19).
దధీచ ఉవాచ |
యస్మాన్నారాధితో రుద్రస్సర్వదేవేశ్వరేశ్వరః | తస్మాద్దక్ష తవాశేషో యజ్ఞో%యం న భవిష్యతి || 20
ఇత్యుక్త్వా వచనం క్రుద్ధో దధీచో మునిసత్తమః | నిర్గమ్య చ తతో దేశాజ్జగామ స్వకమాశ్రమమ్ || 21
నిర్గతే %పి మునే తస్మిన్ దేవా దక్షం న తత్యజుః | అవశ్యమనుభావిత్వాదనర్థస్య తు భావినః || 22
ఏతస్మిన్నేవ కాలే తు జ్ఞాత్వై తత్సర్వమీశ్వరాత్ | దగ్ధుం దక్షాధ్వరం విప్రా దేవీ దేవమచోదయత్ || 23
దేవ్యా సంచోదితో దేవో దక్షాధ్వరజిఘాంసయా | ససర్జ సహసా వీరం వీరభద్రం గణశ్వరమ్ || 24
సహస్రవదనం దేవం సహస్రకమలేక్షణమ్ | సహస్రముద్గరధరం సహస్రశరపాణికమ్ || 25
శూలటంకగదాహస్తం దీప్తకార్ముకధారిణమ్ | చక్రవజ్రధరం ఘోరం చంద్రార్ధకృతశేఖరమ్ || 26
కులిశోద్ద్యోతితకరం తడిజ్జ్వలితమూర్ధజమ్ | దంష్ట్రాకరాలం బిభ్రాణం మహావక్త్రం మహోదరమ్ || 27
విద్యుజ్జిహ్వం ప్రలంబోష్ఠం మేఘసాగరనిస్స్వనమ్ | వసానం చర్మ వైయాఘ్రం మహద్రుధిరనిస్స్రవమ్ || 28
గండద్వితయసంసృష్టమండలీకృతకుండలమ్ | వరామరశిరోమాలావలీకలితశేఖరమ్ || 29
రణన్నూపురకేయూరమహాకనకభూషితమ్ | రత్నసంచయసందీప్తం తారహారవృతోరసమ్ || 30
మహాశరభశార్దూలసింహైస్సదృశవిక్రమమ్ | ప్రశస్తమత్తమాతంగసమానగమనాలసమ్ || 31
శంఖచామరకుందేందుమృణాలసదృశప్రభమ్ | సతుషారమివాద్రీంద్రం సాక్షాజ్జంగమతాం గతమ్ || 32
జ్వాలామాలాపరిక్షిప్తం దీప్తమౌక్తికభూషణమ్ | తేజసా చైవ దీప్యంతం యుగాంత ఇవ పావకమ్ || 33
దధీచుడు ఇట్లు పలికెను -
ఓ దక్షా! సర్వదేవతల ప్రభువులకు కూడ అధీశ్వరుడగు రుద్రుని నీవు ఆరాధించలేదు. కావున, నీ ఈ యజ్ఞము పూర్తిగా వినాశమును పొందగలదు (20). కోపించియున్న దధీచమహర్షి ఈ విధముగా పలికి, ఆ స్థానమునుండి బయటకు వచ్చి, తన ఆశ్రమమునకు వెళ్లెను (21). ఆ మహర్షి వెళ్లిపోయిననూ, రాబోయే అనర్ధమును తప్పక అనుభవించవలసి యుండుటచే, దేవతలు దక్షుని విడిచి పెట్టకుండిరి (22). ఓ బ్రహ్మణులారా! ఇదే సమయములో ఈ విషయము నంతనూ ఈశ్వరునినుండి తెలుసుకొని, జగన్మాత దక్షయజ్ఞమును నాశనము చేయుమని శివుని ప్రేరేపించెను (23). ఆ దేవిచే ప్రేరేపించబడిన శివుడు దక్షయజ్ఞమును నాశనము చేయగోరి, వెంటనే వీరుడు, గణాధ్యక్షుడు అగు వీరభద్రుని సృష్టించెను (24). వేయి ముఖములు గలవాడు, ప్రకాశస్వరూపుడు, కలువల వంటి వేయి కన్నులు గలవాడు, వేయి ముద్గరము (ఇనుపరోకలి వంటి ఆయుధము) లను ధరించి యున్నవాడు, వేయి చేతులలో బాణములను పట్టుకొని యున్నవాడు (25), శూలము గొడ్డలి గద అను ఆయుధములను చేతులయందు ధరించినవాడు, ప్రకాశించే ధనస్సును ధరించినవాడు, చక్రమును వజ్రమును ధరించినవాడు, భయంకరుడు, చంద్రవంకను తలపై దాల్చినవాడు (26) మెరుపు (వజ్రాయుధము) తో అద్భుతముగా ప్రకాశించే చేయి గలవాడు, మెరుపుల వలె ప్రకాశించే జుట్టు గలవాడు, కోరలతో భయంకరముగా నున్నవాడు, పెద్ద నోరు మరియు పెద్ద పొట్టను కలిగియున్నవాడు (27), మెరుపు వలె ప్రకాశించే నాలుక గలవాడు, క్రిందకు వ్రేలాడే పెదవులు గలవాడు, మేఘము వలె గర్జించి సముద్రము వలె ఘోషించువాడు, అధికముగా రక్తమును స్రవించుచున్న పెద్దపులి చర్మమును ధరించినవాడు (28), రెండు చెక్కిళ్లను స్పృశించుచున్న గుండ్రని కుండలములు గలవాడు, గొప్ప దేవతల తలలను మాలలుగా గుచ్చి వాటితో శిరస్సును చుట్టి అలంకరించుకున్నవాడు (29), ధ్వనిని చేయుచున్న పెద్ద బంగరు నూపురములు మరియు హస్తాభరణములతో అలంకరించుకున్నవాడు, గుట్టల గుట్టల రత్నములతో చక్కగా ప్రకాశించువాడు, స్వచ్ఛమైన (ధ్వనిని చేయుచున్న) హారములతో నిండియున్న వక్షఃస్థలము గలవాడు (30), పెద్ద శరభములు పులులు సింహములు అనువాటితో సమానమగు పరాక్రమము గలవాడు, ప్రశంసించబడే మదించిన ఏనుగుల వలె ఠీవిగా నడచు వాడు (31), శంఖము వింజామరలు మల్లెలు చంద్రుడు తామరతూడు అను వాటితో సమానమైన (తెల్లని ) కాంతులు గలవాడు, మంచుతో నిండిన పెద్ద కొండ సాక్షాత్తుగా ప్రాణములతో నడచివచ్చినదా యన్నట్లు ఉన్నవాడు (32), అగ్ని జ్వాలల మాలలచే చుట్టువారబడి యున్నవాడు, ప్రకాశించే ముత్యముల భూషణములు గలవాడు, తేజస్సుచే ప్రళయకాలగ్ని వలె ప్రకాశిస్తూ శత్రువులను జయించగోరువాడు అగు వీరభద్రుని శివుడు సృష్టించెను (33).
స జానుభ్యాం మహీంగత్వా ప్రణతః ప్రాంజలిస్తతః | పార్శ్వతో దేవదేవస్య పర్యతిష్ఠద్గణశ్వరః || 34
మన్యునా చాసృజద్భద్రాం భద్రకాళీం మహేశ్వరీమ్ | ఆత్మనః కర్మసాక్షిత్వే తేన గంతుం సహైవ తు || 35
తం దృష్ట్వా%వస్థితం వీరభద్రం కాలాగ్ని సన్నిభమ్ | భద్రయా సహితం ప్రాహ భద్రమస్త్వి తి శంకరః || 36
స చ విజ్ఞాపయామాస సహ దేవ్యా మహేశ్వరమ్ | ఆజ్ఞాపయ మహాదేవ కిం కార్యం కరవాణ్యహమ్ || 37
తతస్త్రి పురహా ప్రాహ హైమవత్యాః ప్రియేచ్ఛయా | వీరభద్రం మహాబాహుం వాచా విపులనాదయా || 38
ఆ గణాధ్యక్షుడు మోకాళ్లపై నిలబడి చేతులను జోడించి నమస్కరించి, తరువాత ఆ దేవదేవుని ప్రక్కన నిలబడియుండెను (34). శివుడు కోపముతో మంగళస్వరూపురాలు, మహేశ్వరియగు భద్రకాళిని తన కర్మకు సాక్షిగా మరియు వీరభద్రునితో కలిసి వెళ్లుట కొరకు సృష్టించెను (35). భద్రకాళితో కలిసి ప్రళయకాలాగ్నివలె నిలబడియున్న ఆ వీరభద్రుని గాంచి శంకరుడు, మంగళమగుగాక! అని పలికెను (36). ఆ వీరభద్రుడు భద్రకాళితో కలిసి మహేశ్వరునకు ఇట్లు విన్నవించెను: ఓ మహాదేవా! నేను ఏ కార్యమును చేయవలసియున్నది? (37) అపుడు త్రిపురాసురులను సంహరించిన శంకరుడు పార్వతీదేవికి ప్రియమగు కోరికననుసరించి వ్యాపకమగు నాదముగల వాక్కుతో గొప్ప బాహువులు గల వీరభద్రుని ఉద్దేశించి ఇట్లు పలికెను (38).
దేవదేవ ఉవాచ |
ప్రాచేతసస్య దక్షస్య యజ్ఞం సద్యో వినాశయ | భద్రకాల్యా సహాసి త్వమేతత్కృత్యం గణశ్వర || 39
అహమప్యనయా సార్ధం రైభ్యాశ్రమసమీపతః | స్తిత్వా వీక్షే గణశాన విక్రమం తవ దుస్సహమ్ || 40
వృక్షాః కనఖలే యే తు గంగాద్వారసమీపగాః | సువర్ణశృంగస్య గిరేర్మేరుమందరసన్నిభాః || 41
తస్మిన్ ప్రదేశే దక్షస్య యజ్ఞస్సంప్రతి వర్తతే | సహసా తస్య యజ్ఞస్య విఘాతం కురు మా చిరమ్ || 42
ఇత్యుక్తే సతి దేవేన దేవీ హిమగిరీంద్రజా | భద్రం భద్రాం చ సంప్రేక్ష్య వత్సం ధేనురివౌరసమ్ || 43
ఆలింగ్య చ సమాఘ్రాయ మూర్ధ్ని షడ్వదనం యథా | సస్మితా వచనం ప్రాహ మధురం మధురం స్వయమ్ || 44
దేవదేవుడగు శంకరుడిట్లు పలికెను -
ఓ గణాధ్యక్షా! ప్రచేతసుల పుత్రుడగు దక్షుని యజ్ఞమును వెంటనే వినాశము చేయుము. నీవు భద్రకాళితో కలిసి ఈ పనిని పూర్తి చేయుము (39). ఓ గణాధ్యక్షా! నేను కూడా ఈమెతే కూడి రైభ్యుని ఆశ్రమమునకు దగ్గరలో నిలబడి సహింప శక్యము కాని నీ పరాక్రమమును చూచెదను (40). హరిద్వారమునకు సమీపములోబంగరు రంగులో ప్రకాశించే శిఖరములు గల పర్వతముపై మేరుమందరపర్వతముల వలె ఎత్తైన వృక్షములు గలవు (41). ఆ ప్రదేశమునందు దక్షుని యజ్ఞము ఇప్పుడు జరుగుచున్నది. నీవు వెంటనే విలంబము చేయకుండగా ఆ యజ్ఞమునకు విఘాతమును కలిగించుము (42). శివుడు ఇట్లు చెప్పగా పార్వతీదేవి వీరభద్రుని భద్రకాళిని, గోవు తన దూడను వలె, చక్కగా చూచి (43), కుమారస్వామిని వలె కౌగలించుకొని లలాటముపై ముద్దిడి చిరునవ్వుతో మిక్కిలి మధురమగు వాక్కులతో స్వయముగా నిట్లనెను (44).
దేవ్యువాచ |
వత్స భద్ర మహాభాగ మహాబలపరాక్రమ | మత్ర్పి యార్థం త్వముత్పన్నో మమ మన్యుం ప్రమార్జయ || 45
యజ్ఞేశ్వరమనాహూయ యజ్ఞకర్మరతో%భవత్ | దక్షో వైరేణ తం తస్మాద్భింధి యజ్ఞం గణశ్వర || 46
యజ్ఞలక్ష్మీమలక్ష్మీం త్వం భద్ర కృత్వా మమాజ్ఞయా | యజమానం చ తం హత్వా వత్స హింసయ భద్రయా || 47
అశేషామివ తామాజ్ఞాం శివయోశ్చిత్రకృత్యయోః | మూర్ధ్ని కృత్వా నమస్కృత్య భద్రో గంతు ప్రచక్రమే || 48
అథైష భగవాన్ క్రుద్ధః ప్రేతావాసకృతాలయః | వీరభద్రో మహాదేవో దేహ్య మన్యు ప్రమార్జకః || 49
ససర్జ రోమకూపేభ్యో రోమజాఖ్యాన్ గణశ్వరాన్ | దక్షిణాద్భుజదేశాత్తు శతకోటిగణశ్వరాన్ | | 50
పాదాత్తథోరుదేశాచ్చ పృష్ఠాత్పార్శ్వాన్ముఖాద్గలాత్ | గుహ్యాద్గులాచ్ఫిచ్ఛిరోమధ్యాత్కంఠాదాస్యాత్తథోదరాత్ || 51
తదా గణశ్వరైర్భద్రై ర్భద్రతుల్యపరాక్రమైః | సంఛాదితమభూత్సర్వం సాకాశవివరం జగత్ || 52
సర్వే సహస్రహస్తాస్తే సహస్రాయుధపాణయః | రుద్రస్యాను చరాస్సర్వే సర్వే రుద్రసమప్రభాః || 53
శూలశక్తిగదాహస్తాష్టం కోపలశిలాధరాః | కాలాగ్ని రుద్రసదృశాస్త్రి నేత్రాశ్చ జటాధరాః || 54
దేవి ఇట్లు పలికెను -
కుమారా! వీరభద్రా! గొప్ప బలపరాక్రమములు గలవాడా! నీవు నా ప్రీతికొరకై జన్మించితివి. నా కోపమును చల్లార్చుము (45). దక్షుడు వైరముచే యజ్ఞాధిపతియగు శివుని పిలువకుండగా యజ్ఞకర్మను ఆరంభించినాడు. ఓగణాధ్యక్షా! కావున, ఆ యజ్ఞమును భగ్నము చేయుము (46). ఓ వీరభద్రా! కుమారా! నీవు నా ఆజ్ఞచే ఆ యజ్ఞముయొక్క శోభను శోభ లేనిదిగా చేసి, ఆ యజ్ఞమును చేయుచున్నవానిని సంహరించి హింసించుము (47). చిత్రములగు కర్మలను చేయు పార్వతీపరమేశ్వరుల ఆ ఆజ్ఞను పూర్ణముగా తల దాల్చి వీరభద్రుడు వారికి నమస్కరించి బయలుదేరుటకు సంసిద్ధుడాయెను (48). అపుడు శ్మశానమే నివాసస్థానముగా గలవాడు, గొప్ప ప్రకాశము గలవాడు, పార్వతీదేవియొక్క కోపమును చల్లార్చువాడు అగు వీరభద్రభగవానుడు కోపించి (49), తన రోమకూపములనుండి రోమజులు అనే గణాధ్యక్షులను, కుడి భుజమునుండి వందకోట్ల గణనాయకులను సృష్టించెను (50). పాదము, తొడలు, వెన్ను, ప్రక్కలు, నోరు, కంఠముయొక్క లోపలి భాగము, గుహ్యము, మడమలు, శిరస్సు యొక్క మధ్యభాగము, కంఠము ముఖము, పొట్ట అను స్థానములనుండి కూడ గణనాయకులను సృష్టించెను (51). అపుడు మంగళస్వరూపులు, వీరభద్రునితో సమానమగు పరాక్రమము గలవారు అగు గణనాయకులచే ఆకాశముతో మరియు రంధ్రములతో సహా జగత్తు అంతయూ పూర్తిగా కప్పివేయబడెను (52). వారు అందరు వేయి చేతులు గలవారే. వారు వేయి చేతులతో ఆయుధములను ధరించి యుండిరి . వారందరు రుద్రుని సేవకులే. వారందరు రుద్రునితో సమానమగు కాంతి గలవారే (53). వారు శూలము, శక్తి, గదలను చేతులలో ధరించిరి, గొడ్డళ్లను, రాళ్లను, బండలను ధరించిన వారు, మూడు నేత్రములు గలవారు, జటలను దాల్చినవారు అగు ఆ గణనాయకులు ప్రళయకాలాగ్నిని మరియు రుద్రుని పోలి యుండిరి (54).
నిపేతుర్భృశమాకాశే శతశస్సింహవాహనాః | వినేదుశ్చ మహానాదాన్ జలదా ఇవ భద్రజాః || 55
తైర్భద్రై ర్భగవాన్ భద్రస్తథా పరివృతో బభౌ | కాలానలశ##తైర్యుక్తో యథాం%తే కాలభైరవః || 56
తేషాం మధ్యే సమారుహ్య వృషేంద్రం వృషభధ్వజః | జగామ భగవాన్ భద్రశ్శుభ్రశుభ్రం యథా భవః || 57
తస్మిన్ వృషభమారూఢే భ##ద్రే తు భసితప్రభః | బభార మౌక్తికం ఛత్రం గృహీతసితచామరః || 58
స తదా శుశుభే పార్శ్వే భద్రస్య భసితప్రభః | భగవానివ శైలేంద్రః పార్శ్వే విశ్వజగద్గురోః || 59
సో%పి తేన బభౌ భద్రశ్శ్వే తచామరపాణినా | బాలసోమేన సౌమ్యేన యథా శూలవరాయుధః || 60
దధ్మౌ శంఖం సితం భద్రం భద్రస్య పురతశ్శుభమ్ | భానుకంపో మహాతేజా హేమరత్నైరలంకృతః || 61
దేవదుందుభయో నేదుర్దివ్యసంకులనిస్స్వనాః | వవృషుశ్శతశో మూర్ధ్ని పుష్పవర్షం వలాహకాః || 62
పుల్లానాం మధుగర్భాణాం పుష్పాణాం గంధబంధవః | మార్గానుకూలసంవాహా వవుశ్చ పథి మారుతా ః || 63
తతో గణశ్వరాస్సర్వే మత్తా యుద్ధబలోద్ధతాః | ననృతుర్ముముదుర్నేదుర్జహసుర్జగదుర్జగుః || 64
తదా భద్రగణాంతఃస్థో బభౌ భద్రస్సభద్రయా | యథా రుద్రగణాంతఃస్థ స్త్య్రంబకో%ంబికయా సహ || 65
తత్ క్షణాదేవ దక్షస్య యజ్ఞవాటం హిరణ్మయమ్ | ప్రవివేశ మహాబాహుర్వీరభద్రో మహానుగః || 66
తతస్తు దక్షప్రతిపాదితస్య క్రతుప్రధానస్య గణప్రధానః |
ప్రయోగభూమిం ప్రవివేశ భద్రో రుద్రో యథాంతే భవనం దిధక్షు) || 67
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే వీరభద్ర జన్మవర్ణనం నామ ఏకోనవింశో%ధ్యాయః (19)
వీరభద్రునినుండి పుట్టిన గణములు సింహములు వాహనములుగా గలవారై వందల సంఖ్యలో ఆకాశమునందు వేగముగా విహరిస్తూ, మేఘముల వలె బిగ్గరగా గర్జించుచుండిరి (55). ఆ భద్రులతో చుట్టువారబడి యున్న వీరభద్రుడు ప్రళయకాలములో వందలాది ప్రళయకాలాగ్నులతో కూడియున్న కాలభైరవుని వలె ప్రకాశించెను (56). అతిస్వచ్ఛము మరియు శ్రేష్ఠము అగు వృషభమును అధిష్ఠించిన వీరభద్రుడు వారి మధ్యలో వృషభము చిహ్నముగా గల శివభగవానుని వలె పయనమయ్యెను (57). ఆ వీరభద్రుడు వృషభమునధిష్ఠించగానే భసితప్రభుడు తెల్లని వింజామరను చేతపట్టుకొని ముత్యాల గొడుగును పట్టెను (58). ఆ సమయములో వీరభద్రుని ప్రక్కనే యున్న భసితప్రభుడు జగత్తునకంతకు తండ్రియగు శివుని ప్రక్కన ఉన్న పర్వతరాజు మరియు పూజ్యుడు అగు హిమవంతుని వలె శోభిల్లెను (59). తెల్లని వింజామరను చేతిలో పట్టుకొనియున్న ఆ భసితప్రభునితో కూడియున్న ఆ వీరభద్రుడు కూడ, శ్రేష్ఠమగు శూలమును ఆయుధముగా ధరించి చల్లని కాంతులను వెదజల్లే చంద్రవంకతో కూడిన శివుని వలె ప్రకాశించెను (60). గొప్ప తేజశ్శాలి, రత్నములు పొదిగిన బంగరు ఆభరణములను అలంకరించుకున్నవాడు అగు భానుకంపుడు తెల్లని మంగళకరమగు శుభకరమగు శంఖమును వీరభద్రుని యెదుట పూరించెను (61). దేవదుందుభులు మ్రోగినవి. సంకులమగు దివ్యధ్వనులు చెలరేగినవి. మేఘములు శిరస్సుపై వందలాది పుష్పములను వర్షించినవి (62). పొట్టలో తేనెలను కలిగియున్న వికసించినపుష్పముల గంధములు బంధువులై తోడురాగా వాయువులు మార్గమునందు ప్రయాణమునకు అనుకూలముగా మెల్లగా వీచినవి (63). అపుడు బలముచే గర్వించి యున్నవారు, యుద్ధము కొరకై మదించి యున్నవారు అగు గణాధ్యక్షులు అందరు నాట్యము ను చేసి ఆనందించిరి; సింహనాదములను చేసిరి బిగ్గరగా నవ్విరి; మాటలాడిరి; పాడిరి (64). అపుడు భద్రకాళితో గూడి ఆ భద్రగణముల మధ్యలోనున్న వీరభద్రుడు రుద్రగణముల మధ్యలో జగన్మాతతో కూడి యున్న ముక్కంటి దేవుని వలె ప్రకాశించెను (65). గొప్ప అనుచరులు గలవాడు, గొప్ప బాహువులు గలవాడు అగు వీరభద్రుడు ఆ క్షణములోననే దక్షుని బంగరు యజ్ఞవాటికను ప్రవేశించెను (66). అపుడు దక్షుడు చేయదలబెట్టిన గొప్ప యజ్ఞముయొక్క ప్రయోగము జరుగవలసిన స్థలము లోనికి గణాధ్యక్షుడగు వీరభద్రుడు ప్రళయకాలమునందు లోకములను తగులబెట్ట గోరే రుద్రుని వలె ప్రకాశించెను(67).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వభాగములో వీరభద్రుని పుట్టుకను వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).