Siva Maha Puranam-4
Chapters
అథ వింశో
దక్ష యజ్ఞ విధ్వంసనము
వాయురువాచ |
తతో విష్ణుప్రధానానాం సురాణామమితౌజసామ్ | దదర్శ చ మహత్సత్రం చిత్రధ్వజపరిచ్ఛదమ్ || 1
సుదర్భఋజుసంస్తీర్ణం సుసమిద్ధహుతాశనమ్ | కాంచనైర్యజ్ఞభాండైశ్చ భ్రాజిష్ణుభిరలంకృతమ్ || 2
ఋషిభిర్యజ్ఞపటుభిర్యథావత్కర్మకర్తృభిః | విధినా వేదదృష్టేన స్వనుష్ఠితబహుక్రమమ్ || 3
దేవాంగనాసహస్రాఢ్యమప్సరోగణ సేవితమ్ | వేణువీణారవైర్జుష్టం వేదఘోషైశ్చ బృంహితమ్ || 4
దృష్ట్వా దక్షాధ్వరే వీరో వీరభద్రః ప్రతాపవాన్ | సింహనాదం తదా చక్రే గంభీరో జలదో యథా || 5
తతః కిలకిలాశబ్ద ఆకాశం పూరయన్నివ | గణశ్వరైః కృతో యజ్ఞే మహాన్యక్కృతసాగరః || 6
తేన శ##బ్దేన మహతా గ్రస్తాస్సర్వే దివౌకసః | దుద్రువుః పరితో భీతాస్స్ర స్తవస్త్ర విభూషణాః || 7
కింస్విధ్భగ్నో మహామేరుః కింస్విత్సందీర్యతే మహీ | కిమిదం కిమిదం వేతి జజల్పుస్త్ర్పి దశా భృశమ్ || 8
మృగేంద్రాణాం యథా నాదం గజేంద్రా గహనే వనే | శ్రుత్వా తథావిదంకేచితత్త్యజుర్జీవితం భయాత్ || 9
వాయువు ఇట్లు పలికెను -
అపుడు విష్ణువు మొదలగు సాటిలేని తేజస్సు గల దేవతలు పాల్గొనే, రంగు రంగుల ధ్వజములు మరియు సామగ్రి గల గొప్ప యజ్ఞమును వీరభద్రుడు చూచెను (1). చక్కని పొడవైన దర్భలచే పరచబడి యున్నది, చక్కగా ప్రజ్వరిల్లే అగ్నులు గలది, మెరిసే బంగరు యజ్ఞభాండములతో అలంకరింపబడినది (2). యజ్ఞమును చేయుటయందు సమర్థులు, యథావిధిగా యజ్ఞప్రయోగమును నిర్వహించువారు అగు ఋషులచే వేదమునందు చెప్పబడిన విధిని అనుసరించి చక్కగా అనుష్ఠించబడే అనేకయజ్ఞాంగముల క్రమము గలది (3). వేలాది దేవతా స్త్రీలతో శోభిల్లునది, అప్సరసల గణములచే సేవింపబడునది, వేణునాదముతో మరియు వీణావాదనముతో ఉల్లాసమును కలిగించునది. వేదఘోషలతో ఆకాశమును నింపుచున్నది (4). అగు యజ్ఞమును దక్షుని యజ్ఞశాలలో చూచి వీరుడు, ప్రతాపము గలవాడు అగు వీరభద్రుడు అపుడు దట్టని మేఘము వలె సింహనాదమును చేసెను (5). తరువాత గణాధ్యక్షులు యజ్ఞశాలయందు పెద్ద సముద్రఘోషను ధిక్కరిస్తూ ఆకాశమును పూరించుచున్నవా యన్నట్లు కిలకిల శబ్దములను చేసిరి (6). ఆ పెద్ద శబ్దమును తాళ##లేక దేవతలందరు వస్త్రములు మరియు ఆభరణములు జారిపోవుచుండగా అన్నివైపులకు పరుగులెత్తిరి (7). గొప్ప మేరుపర్వతము విరిగి పడు చున్నదా యేమి? భూమి పగిలిపోవుచున్నదా యేమి? ఇది యేమి? అని దేవతలు కంగారుగా కేకలను వేయుచుండిరి (8). మానవులు ప్రవేశింప శక్యము కాని అడవిలో సింహముల నాదమును విన్న ఏనుగులు వలె కొందరు భయముతో ప్రాణములను విడచిరి (9).
పర్వతాశ్చ వ్యశీర్యంత చకం పే చ వసుంధరా | మరుతశ్చ వ్యఘూర్ణంత చుక్షుభే మకరాలయః ||10
అగ్నయో నైవ దీప్యంతే న చ దీప్యతి భాస్కరః | గ్రహాశ్చ న ప్రకాశంతే నక్షత్రాణి చ తారకాః || 11
ఏతస్మిన్నేవ కాలే తు యజ్ఞవాటం తదుజ్జ్వలమ్ | సంప్రాప భగవాన్ భద్రో భ##ద్రైశ్చ సహ భద్రయా || 12
తం దృష్ట్వా భీతభీతో %పి దక్షో దృఢ ఇవ స్థితః | క్రుద్ధవద్వచనం ప్రాహ కో భవాన్ కిమహేచ్ఛసి || 13
తస్య తద్వచనం శ్రుత్వా దక్షస్య చ దురాత్మనః | వీరభద్రో మహాతేజా మేఘగంభీరనిస్స్వనః || 14
స్మయన్నివ తమాలోక్య దక్షం దేవాంశ్చ ఋత్విజః | అర్థగర్భమసంభ్రాంతమవోచదుచితం వచః || 15
పర్వతములు పగిలెను. భూమి కంపించెను. గాలులు సర్వమును పెకలించి వేసెను. సముద్రము కల్లోలమాయోను (10). అగ్నులు మండుట మానవేసెను. సూర్యుడు ప్రకాశంచుట ఆగిపోయెను. గ్రహములు, నక్షత్రములు, ఇతరములగు ప్రకాశించే గోళములు ప్రకాశించుట మానివేసెను. (11). ఇదే సమయములో వీరభద్ర భగవానుడు భద్రగణములతో మరియు భద్రకాళితో కూడి ఆ ప్రకాశించే యజ్ఞవాటికను చేరుకొనెను (12). ఆయనను చూచి దక్షుడు చాల భయపడిననూ, దృఢముగా నున్నాడా యన్నట్లు నిలబడి, కోపముతో నిట్లు పలికెను. నీవెవరివి? నీకిచట పని యేమి? (13). దుర్బుద్ధియగు దక్షుని ఆ మాటను విని, గొప్ప తేజశ్శాలి, మేఘగర్జనవలె గంభీరమగు స్వరము గలవాడు అగు వీరభద్రుడు చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు ఆ దక్షుని, దేవతలను మరియు ఋత్విక్కులను చూచి, కంగారు పడకుండగా గంభీరమగు అర్థము గలది, మరియు సముచితమైనది అగు వచనమును పలికెను (14,15).
వీరభద్ర ఉవాచ |
వయం హ్యనుచరాస్సర్వే శర్వస్యామితతేజసః | భాగభిలిప్సయా ప్రాప్తా భాగో నస్సంప్రదీయతామ్ || 16
అథ చేదధ్వరే %స్మాకం న భాగః పరికల్పితః | కథ్యతాం కారణం తత్ర యుధ్యతాం వా మయా %మరైః 17
ఇత్యుక్తాస్తే గణంద్రేణ దేవా దక్షపురోగమాః | ఊచుర్మంత్రాః ప్రమాణం నో న వయం ప్రభవస్త్వితి || 18
మంత్రా ఊచుస్సురా యూయం తమో%పహతచేతసః | యేన ప్రథమభాగార్హం న యజధ్వం మహేశ్వరమ్ || 19
మంత్రోక్తా అపి తే దేవాస్సర్వే సంమూఢచేతస | భద్రాయ న దదుర్భాగం తత్ప్రహాణమభీప్సవః || 20
యదా తథ్యం చ పధ్యం చ స్వవాక్యం తద్వృథా%భవత్ | తదా తతో యయుర్మందా బ్రహ్మలోకం సనాతనమ్ || 21
అథోవాచ గణాధ్యక్షో దేవాన్ విష్ణుపురోగమాన్ | మంత్రాః ప్రమాణం న కృతా యుష్కాభిర్బలగర్వితైః || 22
యస్మాదస్మిన్ మఖే దేవైరిత్థం వయమసత్కృతాః | తస్మాద్వో జీవితైస్సార్ధమపనేష్యామి గర్వితమ్ || 23
ఇత్యుక్త్వాభవాన్ క్రుద్ధో వ్యదహన్నే త్రవహ్నినా | యజ్ఞవాటం మహాకూటం యథా తిస్రః పురో హరః || 24
తతో గణశ్వరాస్సర్వే పర్వతోదగ్రవిగ్రహాః | యూపానుత్పాట్య హోతౄణాం కంఠేష్వాబధ్య రజ్జుభిః || 25
యజ్ఞపాత్రాణి చిత్రాణి భిత్త్వా సంచూర్ణ్య వారిణి | గృహీత్వా చైవ యజ్ఞాంగం గంగాస్రోతసి చిక్షిపుః || 26
వీరభద్రుడు ఇట్లు పలికెను -
మేము అందరము సాటిలేని తేజస్సు గల లయకారకుడుగు శివుని అనుచరులము. మేము యజ్ఞములో భాగములను పొందగోరి వచ్చియుంటిమి. మాకు భాగములనిడు (16). అట్లు గాక, యజ్ఞములో మాకు భాగములనీయక పోయినచో, దానికి కారణమును చెప్పుడు. లేదా, దేవతలతో కలసి యుద్ధమునుచేయుడు (17). ఆ గణాధ్యక్షుడు ఇట్లు పలుకగా, దక్షుని ముందిడుకున్న దేవతలు ఇట్లు పలికిరి: ఈ విషయములో మంత్రములు మాత్రమే ప్రమాణము. ఇది మా ఆధీనములో లేదు (18). మంత్రములు ఇట్లు పలికినవి: ఓ దేవతలారా! మీ బుద్ధులు అజ్ఞానముచే కప్పివేయబడినవి. ఏలయనగా, యజ్ఞములో మొట్టమొదటి భాగమునకు అర్హుడగు మహేశ్వరుని మీరు పూజించకుంటిరి (19). మంత్రములీ విధముగా చెప్పిననూ, ఆ దేవతలందరు వ్యామోహముతో నిండిని బుద్ధి గలవారై, వీరభద్రుని త్రోసివేయగోరి, ఆయనకు యజ్ఞభాగమునీయలేదు (20). తాము పలికిన హితకరము మరియు సత్యము అగు వచనములు వృథాయగుటను గాంచి, అపుడు మంత్రుములు ఆ స్థానమును విడిచిపెట్టి శాశ్వతమగు బ్రహ్మలోకమునకు మెల్లగా వెళ్లినవి (21). అపుడు గణాధ్యక్షుడగు వీరభద్రుడు విష్ణువు మొదలగు దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను: బలముచే గర్వించియున్న మీరు మంత్రముల వచనములను ప్రమాణముగా స్వీకరించకుంటిరి (22). అందు వలననే, ఈ యజ్ఞములో మేము దేవతలచే ఈ విధముగా అవమానించ బడినాము. కావున, మీ గర్వమును మరియు దానితో బాటు మీ ప్రాణములను నేను తొలగించి వేసెదను (23). వీరభద్ర భగవానుడు ఇట్లు పలికి కోపించి శివుడు త్రిపురములను వలె విశాలమగు భవనమువంటి ఆ యజ్ఞశాలను తన కంటినుండి పుట్టిన అగ్నితో దహించెను (24). తరువాత పర్వతముల వలె విశాలమైన దేహములు గల గణాధ్యక్షులు అందరు యూవస్తంభముల నూడబెరకి హోత ( యజ్ఞములోని ఋత్విక్కు ) ల కంఠములయందు త్రాళ్లతో కట్టి (25), రంగు రంగుల యజ్ఞపాత్రలను పగులగొట్టి, పొడి చేసి నీటిలో కరిగించి, యజ్ఞసాధనములన్నింటినీ తీసుకొని గంగాప్రవాహములో పారవైచిరి (26).
తత్ర దివ్యాన్నపానానాం రాశయః పర్వతోపమాః | క్షీరనద్యో% మృత స్రావాస్సుస్నిగ్ధదధికర్దమాః || 27
ఉచ్చావచాని మంసాని భక్ష్యాణి సురభీణి చ | రసవంతి చ పానాని లేహ్యచోష్యాని తానివై || 28
వీరస్తద్భుంజతే వక్త్రైర్విలుంపంతి క్షిపంతి చ | వజ్రైశ్చక్రై ర్మహాశూలైశ్శక్తిభిః పాశపట్టిశైః || 29
ముసలైరసిభిష్టంకైర్భిందిపాలైః పరశ్వధైః | ఉద్ధతాంస్త్రి దశాన్ సర్వాన్ లోకపాలపురస్సరాన్ || 30
బిభిదుర్బలినో వీరా వీరభద్రాంగసంభవాః | ఛింధి భింధి క్షిప క్షిప్రం మార్యతాం దార్యతామితి || 31
హరస్వ ప్రహరస్వేతి పాటయోత్పాటయేతి చ | సంరంభప్రభవాః క్రూరాశ్శబ్దాః శ్రవణశంకవః || 32
తత్ర తత్ర గణశానాం జజ్ఞిరే సమరోచితాః | వివృత్తనయనాః కేచిద్దష్టదంఎ్టో్రష్ఠతాలవః || 33
ఆశ్రమస్థాన్ సమాకృష్య మారయంతి తపోధనాన్ | స్రువానపహరంతశ్చ క్షిపంతో %గ్నిం జలేషు చ || 34
కలశానపి భిందంతశ్ఛిందంతో మణివేదికాః | గాయంతశ్చ నదంశశ్చ హసంతశ్చ ముహుర్ముహుః || 35
రక్తాసవం పిబంతశ్చ ననృతుర్గణపుంగవాః || 36
అచట పర్వతములవంటి దివ్యములగు అన్నములు రాశులు, మధురపానీయములు చెరువులు, అమృతప్రవాహములనదగిన పాల నదులు, చిత్తడి నేలలవలె విశాలమైన గెడ్డ పెరుగుల సముదాయములు (27). రుచికరములైన పరిమళభరితములైన మాంసముల చిన్న పెద్ద గుట్టలు, రసవంతములైన ఆసవములు, పచ్చళ్లు, హల్వాలు ఉండెను (28). వీరులు వాటిని నోటియందుంచుకొని నమిలి భక్షించి చెల్లాచెదరుగా పారమేయు చుండిరి. వీరభద్రుని దేహమునుండి పుట్టిన బలవంతులగు ఆ వీరులు వజ్రములు, చక్రములు, పెద్ద శూలములు, శక్తులు, పాశములు, పట్టిసములు (గదల వంటి ఆయుధములు), రోకళ్లు, కత్తులు, గొడ్డళ్లు, భిందిపాలములు (ఒక రకమైన ఆయుధములు), గండ్ర గొడ్డళ్లు అనే ఆయుధములతో, లోకపాలురనందరినీ ముందిడుకొని గర్వించియున్న దేవతలను చావగొట్టిరి. నరుకుము, పగులగొట్టుము, త్రోసివేయుము, వేగముగా చంపుము, చీల్చుము, లాగుము, దెబ్బ తీయుము, పీకి వేయుము, పెకిలించి వేయుము మొదలైన క్రూరములగు, కర్ణకఠోరములైన, యుద్ధమునకు తగియున్న, హడావుడినుండి పుట్టే శబ్దములను గణాధ్యక్షులు అక్కడక్కడ మహావేగముతో ఉచ్చరించుచుండిరి. కొందరు కోరల వంటి దంతములతో పెదవులను అంగుడులను కొరుకుతూ కన్నులను గిరగిర త్రిప్పుచుండిరి. (29-33). వారు తపస్సే ధనముగా గల, ఆశ్రమములయందు ఉన్న తపశ్శాలులను గట్టిగా లాగి కొట్టుచుండిరి. వారి స్రువము (హోమసాధనము) లను అపహరించి, వారి అగ్నిహోత్రములను నీళ్లలో పారవేసిరి (34). వారి కమండలములను పగులగొట్టి, మణులు పాదిగిన అరుగులను పగులగొట్టి, వారు పాడుతూ, గర్జిస్తు, అదే పనిగా నవ్వుచుండిరి (35). ఆ గణనాయకులు ఎర్రని ఆసవమును త్రాగుచూ నాట్యమును చేసిరి (36).
నిర్మథ్య సేంద్రానమరాన్ గణంద్రాన్ వృషేంద్రనాగేంద్రమృగేంద్రసారాః |
చక్రుర్బహూన్యప్రతిమప్రభావాస్సహర్షరోమాణి విచేష్టితాని || 37
నందంతి కేచిత్ప్ర హరంతి కేచిద్ధావంతి కేచిత్ప్ర లపంతి కేచిత్ | నృత్యంతి కేచిద్విహసంతి కేచిద్వల్గంతి కేచిత్ప్ర మథా బలేన || 38
కేచిజ్జిఘృక్షంతి ఘనాన్ సతో యాన్ కేచిద్గ్ర హీతుం రవిముత్పతంతి |
కేచిత్ప్ర సర్తుం పవనేన సార్థమిచ్ఛంతి భీమాః ప్రమథా వియత్స్థాః || 39
ఆక్షిప్య కేచిచ్చ వరాయుధాని మహాభుజంగానివ వైనతేయాః | భ్రమంతి దేవానపి విద్రవంతః ఖమండలే పర్వతకూటకల్పాః || 40
ఉత్పాట్య చోత్పాట్య గృహాణి కేచిత్సజాలవాతాయనవేదికాని | విక్షిప్య విక్షిప్య జలస్య మధ్యే కాలాంబుదాభాః ప్రమథా నినేదుః || 41
ఉద్వర్తితద్వారకపాటకుడ్యం విధ్వస్తశాలావలభీగవాక్షమ్ | అహో బతాభజ్యత యజ్ఞవాటమనాథవద్వాక్యమివాయథార్థమ్ || 42
హా నాథ తాతేతి పితస్సుతేతి భ్రాతర్మమాంచేతి చ మాతులేతి |
ఉత్పాట్యమానేషు గృహేషు నార్యో హ్యనాథశబ్దాన్ బహుశః ప్రచక్రుః || 43
ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే దక్షయజ్ఞవిధ్వంసనం నామ వింశో%ధ్యాయః (20).
గొప్ప ఎద్దుతో పెద్ద ఏనుగుతో మరియు సింహముతో సమానమగు బలము గలవారు, సాటిలేని ప్రభావము గలవారు అగు గణనాయకులు ఇంద్రునితో సహా దేవతలను చితకగొట్టి, శరీరమునకు గగుర్పాటును కలిగించే అనేకచేష్టలను చేసిరి (37). వారిలో కొందరు గణనాయకులు ఆనందించుచుండిరి; కొందరు కొట్టుచుండిరి; కొందరు పరుగెత్తుచుండిరి; కొందరు వాగుచుండిరి; కొందరు నాట్యమాడుచుండిరి; కొందరు అధికముగా నవ్వుచుండిరి; కొందరు బలముగా గెంతుచుండిరి (38). కొందరు వర్షజలముతో నిండియున్న మేఘములను పట్టుకొనుటకు యత్నించుచుండిరి; కొందరు సూర్యుని పట్టుకొనుటకై పైకి ఎగురుచుండిరి; కొందరు భయంకరాకారులగు గణనాయకులు ఆవాశమునందున్నవారై వాయువుతో సమానముగా వీచుటకు యత్నించుచుండిరి (39). గరుడ పక్షులు పెద్ద పాములను వలె కొందరు పర్వతశిఖరమును బోలి యున్న గణనాయకులు శ్రేష్ఠమగు ఆయుధములను ఎత్తి పట్టుకొని దేవతలను కూడ తరుముచూ అంతరిక్షమునందు గిరిగిర తిరుగుచుండిరి (40). నల్లని మేఘములను పోలియున్న కొందరు గణనాయకులు పై కప్పులతో కిటికీలతో మరియు అరుగులతో సహా ఇళ్లను పెకిలించి పెకిలించి నీటి మధ్యలో పారవేసి పారవేసి సంహనాదములను చేయుచుండిరి (41). ఆశ్చర్యము! ద్వారములను తలుపులను ఊడబెరకి, గోడలను పగులగొట్టి, శాలలను పై కప్పులకు ఆధారముగానుండే బల్లగొడుగులను మరియు కిటికీలను విధ్వంసము చేసి వారు, రక్షించే నాథుడు లేని ఆ యజ్ఞశాలను అసత్యవాక్యమును వలె భగ్నము చేసిరి (42). వారు ఇళ్లను పెకిలించుచుండగా, ఓ నాథా! తాతా! తండ్రీ! కుమారా! సోదరా! మాయమ్మా! మామయ్యా! మొదలైన, రక్షకులు లేని వారు చేసే పలువిధముల ఆక్రందనములను స్త్రీలు చేయుచుండిరి (43).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు దక్షయజ్ఞవిధ్వంసమును వర్ణించే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).