Siva Maha Puranam-4
Chapters
అథ త్రయోవింశో
దేవతలు శివుని అనునయించుట
వాయురువాచ |
ఇతి సంఛిన్నభిన్నాంగా దేవా విష్ణుపురోగమాః | క్షణాత్కష్టాం దశామేత్య త్రేసుః స్తోకావశేషితాః || 1
త్రస్తాంస్తాన్ సమరే వీరాన్ దేవానన్యాంశ్చ వై గణాః | ప్రమథాః పరమక్రుద్ధా వీరభద్రప్రణోదితాః || 2
ప్రగృహ్య చ తథా దోషం నిగడైరాయసైర్దృఢైః | బబంధుః పాణిపాదేషు కంధరేషూదరేషు చ || 3
తస్మిన్నవసరే బ్రహ్మా భద్రమంద్రీంద్రజాసుతమ్ | సారథ్యాల్లబ్ధవాత్సల్యః ప్రార్థయన్ ప్రణతో%బ్రవీత్ || 4
అలం క్రోధేన భగవన్నష్టాశ్చైతే దివౌకసః | ప్రసీద క్షమ్యతాం సర్వం రోమజైస్సహ సువ్రత || 5
ఏవం విజ్ఞాపితస్తేన బ్రహ్మణా పరమేష్ఠినా | శమం జగామ సంప్రీతో గణవస్తస్య గౌరవాత్ || 6
దేవాశ్చ లబ్ధావసరా దేవదేవస్య మంత్రిణః | ధారయంతో%జలీన్మూర్ధ్ని తుష్టుపుర్వివిధైః స్తవైః || 7
వాయువు ఇట్లు పలికెను -
ఈ విధముగా విష్ణువు మొదలగు దేవతలు ఛిన్నాభిన్నము గావింపబడిన అవయవములు గలవారై క్షణకాలములో కష్టస్థితిని పొంది భయపడుచుండిరి. వారు కొద్ది మంది మాత్రమే మిగిలి యుండిరి (1). వీరభద్రునిచే ప్రోత్సహించబడి మిక్కిలి కోపమునుపొంది యున్న ప్రమథగణములు యుద్ధములో భయపడియున్న ఆ దేవవీరులను మరియు ఇతరులను (2) బలాత్కారముగా పట్టుకొని, దోషమును చేసియున్న ఆ దేవతల చేతులను, కాళ్లను, భుజములను, ఉదరములను దృఢమైన ఇనుప సంకెళ్లతో బంధించిరి (3). ఆ సమయములో సారథి కార్యమును చేసి ప్రేమను సంపాదించి యున్న బ్రహ్మ పార్వతీపుత్రుడగు వీరభద్రునకు నమస్కరించి ప్రార్థిస్తూ ఇట్లు పలికెను (4). ఓ పూజ్యా! కోపమును చాలించుము. ఈ దేవతలు నశించి యున్నారు. ఓ గొప్ప వ్రతము గలవాడా! ప్రసన్నుడవు కమ్ము. రోమములనుండి పుట్టిన గణములతో కూడియున్న నీవు అందరినీ క్షమించుము (5). పరమేష్ఠియగు బ్రహ్మ ఈ విధముగా విన్నవించగా, మిక్కిలి ప్రీతిని పొందిన ఆ గణాధ్యక్షుడు ఆయనయందలి గౌరవముచే శాంతించెను (6). దేవదేవుడగు వీరభద్రునకు సలహాను ఇచ్చిన బ్రహ్మ ద్వారా ఈ అవకాశమును పొందియున్న దేవతలు దోసిళ్లను శిరస్సులపై దాల్చి వివిధస్తోత్రములతో స్తుతించిరి (7).
దేవా ఊచుః |
నమశ్శివాయ శాంతాయ యజ్ఞహంత్రే త్రిశూలినే | రుద్రభద్రాయ రుద్రాణాం పతయే రుద్రభూతయే || 8
కాలాగ్నిరుద్రరూపాయ కాలకామాంగహారిణ | దేవతానాం శిరోహంత్రే దక్షస్య చ దురాత్మనః || 9
సంసర్గాదస్య పాపస్య దక్షస్యాక్షిష్టకర్మణః | శాసితాస్సమరే వీర త్వయా వయ మనిందితాః || 10
దగ్ధాశ్చామీ వయాం సర్వే త్వత్తో భీతాశ్చ భో ప్రభో | త్వమేవ గతిరస్మాకం త్రాహి నశ్శరణాగతాన్ || 11
దేవతలు ఇట్లు పలికిరి -
శాంత మూర్తియగు శివునకు నమస్కారము. త్రిశూలమును చేతబట్టి యజ్ఞమును వినాశము చేసినవాడు, రుద్రునకు ఆనందమును కలిగించువాడు, రుద్రులకు ప్రభువు, రుద్రుని మహిమతో కూడినవాడు, ప్రళయకాలమునందలి అగ్నియొక్క రూపము గలవాడు, కాలమునకు అతీతుడై కాముని సంహరించిన శివుని స్వరూపమైన వాడు, దేవతల శిరస్సులను మరియు దక్షుని శిరస్సును నరికినవాడు అగు వీరభద్రునకు నమస్కారము (8, 9). ఓ వీరా! మేము దోషము లేనివారమే అయిననూ, అయోగ్యమగు పనులను చేసే పాపాత్ముడగు ఈ దక్షుని సహవాసము వలన నీచే యుద్ధములో శిక్షించ బడితిమి (10). మమ్ములనందరినీ నీవు దహించి వేసితివి. ఓ ప్రభూ! మేము నీ వలన భయపడుచున్నాము. నీవే మాకు గతి. శరణు పొందిన మమ్ములను రక్షించుము (11).
వాయురువాచ |
తుష్టస్త్వేవం స్తుతో దేవాన్ విసృజ్య నిగడాత్ర్పభుః | ఆనయద్దేవదేవస్య సమీపమమరానిహ || 12
దేవోపి తత్ర భగవానంతరిక్షే స్థితః ప్రభుః | సగణస్సర్వగశ్శర్వస్సర్వలోకమహేశ్వరః || 13
తం దృష్ట్వా పరమేశానం దేవా విష్ణుపురోగమాః | ప్రీతా అపి చ భీతాశ్చ నమశ్చక్రుర్మహేశ్వరమ్ || 14
దృష్ట్వా తానమరాన్ భీతాన్ ప్రణతార్తిహరో హరః | ఇదమాహ మహాదేవః ప్రహసన్ ప్రేక్ష్య పార్వతీమ్ || 15
వాయువు ఇట్లు పలికెను -
ఈ విధముగా దేవతలు స్తుతించగా ఆ వీరభద్రప్రభుడు సంతసించి వారిని సంకెళ్లనుండి విడిపించి కైలాసములో దేవదేవుడగు శివుని వద్దకు తీసుకొని వచ్చెను(12). ప్రకాశస్వరూపుడు, దేవతలకు ప్రభువు, గణములతో కూడి యున్నవాడు, సర్వవ్యాపకుడు, సర్వలోకములకు గొప్ప శాసకుడు అగు ఆ శివభగవానుడు కూడ అచట అంతరిక్షమునందు ఉండెను (13). విష్ణువు మొదలగు దేవతలు ఆ పరమేశ్వరుడగు మహేశ్వరుని చూచి ప్రీతిని పొందినవారే అయిననూ భయపడినవారై నమస్కరించిరి (14). నమస్కరించిన వారి కష్టములను పోగొట్టే మహాదేవుడగు ఆ శివుడు భయపడియున్న ఆ దేవతలను చూచి చిరునవ్వుతో పార్వతిని చూచి ఇట్లు పలికెను (15).
మహాదేవ ఉవాచ |
మా భైష్ట త్రిదశాస్సర్వే యూయం వై మామికాః ప్రజాః | అనుగ్రహార్థమేవేహ ధృతో దండః కృపాలునా || 16
భవతాం నిర్జరాణాం హి క్షాంతో%స్మాభిర్వ్యతిక్రమః | క్రుద్ధేష్వస్మాసు యుష్మాకం న స్థితిర్న చ జీవితమ్ || 17
మహాదేవుడు ఇట్లు పలికెను -
ఓ దేవతలారా! మీరు భయపడకుడు. మీరందరు నా సంతానమే. దయామయుడనగు నేను మిమ్ములను అనుగ్రహించుట కొరకు మాత్రమే శిక్షను వేసితిని (16). దేవతలగు మీరు చేసిన తప్పిదమును మేము క్షమించితిమి. మేము కోపించినచో మీరు నిలబడ లేరు.మీరు బ్రతుకులు ఉండవు (17).
వాయురువాచ |
ఇత్యుక్తాస్త్రి దశాస్సర్వే శ##ర్వేణామితతేజసా | సద్యో విగతసందేహా ననృతుర్విబుధా ముదా || 18
ప్రసన్నమనసో భూత్వానందవిహ్వలమానసాః | స్తుతిమారేభిరే కర్తుం శంకరస్య దివౌకసః || 19
వాయువు ఇట్లు పలికెను -
సాటిలేని తేజస్సు గల శివుడు ఇట్లు పలుకగా నిత్య¸°వనులగు దేవతలందరు వెనువెంటనే తొలగిన సందేహములు గలవారై ఆనందముతో నాట్యమాడిరి (18). ఆనందముతో నిండిపోయి కంగారు పడుచున్న మనస్సులు గల ఆ దేవతలు మనస్సులలో ప్రసన్నతను నింపుకొని శంకరుని స్తుతించుటకు ఆరంభించిరి (19).
దేవా ఊచుః |
త్వమేవ దేవఖిలలోకకర్తా పాతా చ హర్తా పరమేశ్వరో%సి | కవిష్ణురుద్రాఖ్యస్వరూపభేదై రజస్తమస్సత్త్వధృతాత్మమూర్తే || 20
సర్వమూర్తే నమస్తేస్తు విశ్వభావన పావన | అమూర్తే భక్త హేతోర్హి గృహీతాకృతిసౌఖ్యద || 21
చంద్రో%గదో హి దేవేశ కృపాతస్తవ శంకర | నిమజ్జనాన్మృతః ప్రాప సుఖం మిహిరజాజలే || 22
సీమంతినీ హతధవా తవ పూజనతః ప్రభో | సౌభాగ్యమతులం ప్రాప సోమవారవ్రతాత్సుతాన్ || 23
శ్రీకరాయ దదౌ దేవస్స్వీయం పదమనుత్తమమ్ | సుదర్శనమరక్షస్త్వం నృపమండలభీతితః || 24
మేదురం తారయామాస సదారం చ ఘృణానిధిః | శారదాం విధవాం చక్రే సధవాం క్రియయా భవానీ || 25
భద్రాయుషో విపత్తిం చ విచ్ఛిద్య త్వమదాస్సుఖమ్ | సౌమినీ భవబంధాద్వై ముక్తా%భూత్తవ సేవనాత్ || 26
దేవతలు ఇట్లు పలికిరి -
ఓ దేవా! లోకములనన్నింటినీ సృష్టించి పాలించి సంహరించే పరమేశ్వరుడవు నీవే. ఆత్మస్వరూపుడవగు ఓ దేవా! నీవు రజస్సత్త్వతమోగుణములను స్వీకరించి క్రమముగా బ్రహ్మ విష్ణురుద్రరూపములను దాల్చితివి (20). విశ్వమును సృష్టించే ఓ దేవా! సర్వము నీ స్వరూపమే. పావనుడవగు నీకు నమస్కారమగుగాక! రూపము లేని నీవు భక్తుల కొరకై రూపములను దాల్చి సౌఖ్యముల నొసంగెదవు (21). ఓ దేవదేవా! శంకరా! నీ దయచే చంద్రుడు రోగవిముక్తుడైనాడు. మరణించ బోయే చంద్రుడు యమునానదిలో స్నానమును చేసి సుఖమును పొందెను (22). ఓ ప్రభూ! భర్తను పోగొట్టుకున్న సీమంతిని సోమవారవ్రతమును చేసి నిన్ను పూజించి సాటిలేని సౌభాగ్యమును పుత్రులను పొందెను (23). శివప్రభుడు శ్రీకరునకు తన సర్వోత్కృష్టమగు స్థానమును ఇచ్చెను. రాజుల సమూహము వలన భయమును పొందియున్న సుదర్శనుని నీవు రక్షించితివి (24). దయానిధివగు నీవు మేదురుని భార్యతో సహా గట్టెక్కించితివి. నీవు నీ కర్మచే శారదయొక్క భర్తకు ప్రాణభిక్షను పెట్టి ఆమె మాంగల్యమును కాపాడితివి (25). నీవు భద్రాయుషుని ఆపదను పోగొట్టి సుఖము నిచ్చితిమి. సౌమిని నిన్ను సేవించి సంసారబంధమునుండి విముక్తిని పొందెను (26).
విష్ణురువాచ |
త్వం శంభో కహరీశాశ్చ రజస్సత్త్వతమోగుణౖః | కర్తా పాతా తథా హర్తా జనానుగ్రహకాంక్షయా|| 27
సర్వగర్వాపహారీ చ సర్వతేజో విలాసకః| సర్వవిద్యాదిగూఢశ్చ సర్వాను గ్రహకారకః || 28
త్వత్తస్సర్వం చ త్వం సర్వం త్వయి సర్వం గిరీశ్వర | త్రాహి త్రాహి పునస్త్రాహి కృపాం కురు మమోపరి || 29
అథాస్మిన్నంతరే బ్రహ్మా ప్రణిపత్య కృతాంజలిః | ఏవం త్వవసరం ప్రాప్య వ్యజ్ఞాపయత శూలినే ||30
విష్ణువు ఇట్లు పలికెను -
ఓ శంభూ! నీవు జనులను అనుగ్రహించ గోరి రజస్సత్త్వతమోగుణముల ద్వారా బ్రహ్మవిష్ణురుద్రరూపుడవై సృష్టించి పాలించి ఉపసంహరించు చున్నావు (27). అందరి గర్వమును పోగొట్టువాడవు, సర్వవిధముల తేజస్సుల విలాసములు గలవాడవు, సర్వవిద్యలు మొదలగు వాటికి నిగూఢమగు నిధానమైనవాడవు అగు నీవు అందరినీ అనుగ్రహించుచున్నావు (28). ఓ కైలాసపతీ! సర్వము నీనుండి పుట్టినది. సర్వము నీ స్వరూపమై యున్నది. సర్వము నీయందు ఉన్నది. నీవు నాపై దయను చూపి ముమ్మాటికీ రక్షించుము (29). ఇదే సమయములో ఇట్లి అవకాశమును పొందిన బ్రహ్మ చేతులను జోడించి నమస్కరించి శూలధారియగు శివునకు ఇట్లు విన్నవించు కొనెను (30).
బ్రహ్మోవాచ |
జయ దేవ మహాదేవ ప్రణతార్తివిభంజన | ఈ దృశేష్వపరాధేషు కో%న్యస్త్వత్తః ప్రసీదతి || 31
లబ్ధాత్మానో భవిష్యంతి యే పురా నిహతా మృధే | ప్రత్యాపత్తిర్న కస్య స్యాత్ర్పసన్నే పరమేశ్వరే || 32
యదిదం దేవ దేవానాం కృతమంతుషు దూషణమ్ | తదిదం భూషణం మన్యే త అంగీకారగౌరవాత్ || 33
ఇతి విజ్ఞాప్యమానస్తు బ్రహ్మణా పరమేష్ఠినా | విలోక్య వదనం దేవ్యా దేవదేవస్స్మయన్నివ || 34
పుత్రభూతస్య వాత్సలాద్బ్ర హ్మణః పద్మజన్మనః | దేవాదీనాం యథాపూర్వమంగాని ప్రదదౌ ప్రభుః || 35
ప్రమథాద్యైశ్చ యా దేవ్యో దండితా దేవమాతరః | తాసామపి యథాపూర్వాణ్యంగాని గిరిశో దదౌ || 36
దక్షస్య భగవానేవ స్వయం బ్రహ్మా పితామహః | తత్పాపానుగుణం చక్రే జరచ్ఛాగముఖం ముఖమ్ || 37
సో%పి సంజ్ఞాం తతో లబ్ధ్వా స దృష్ట్వా జీవితస్సుధీః | భీతః కృతాంజలిశ్శంభుం తుష్టావ ప్రలపన్ బహు || 38
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ దేవా! మహాదేవా! నీకు జయమగుగాక! నమస్కరించిన వారి కష్టములను పోగొట్టు వాడా! ఇట్లు అపరాధములయందు నీవు తప్ప మరి యెవరు ప్రసన్నులు కాగలరు? (31) పూర్వము యుద్ధములో ప్రాణములను పోగొట్టుకున్న వారు మరల జీవించ గలరు. పరమేశ్వరుడే ప్రసన్నుడు కాగా, ఎవనికి మరల ప్రాణములు దక్కవు? (32) ఓ దేవా! దేవతలు చేసిన పనిలోని ఈ దోషము యేది గలదో, అది నీ అంగీకారము యొక్క మహిమచే భూషణముగా మారినదని నేను తలపోయుచున్నాను (33). పరమేష్ఠియగు బ్రహ్మ ఇట్లు విన్నవించు కొనగా, ఆ దేవదేవుడు పార్వతీదేవియొక్క ముఖమును చూచి చిరునవ్వు నవ్వినాడా యన్నట్లు ఉండెను (34). పద్మమునుండి జన్మించిన బ్రహ్మయందు ఆయనకు పుత్రవాత్సల్యము ఉండుటచే ఆ ప్రభుడు దేవతలు మొదలగు వారికి పూర్వమునందు ఉన్న విధముగా అవయవములను ఇచ్చెను (35). ప్రమథగణములు మొదలగువారిచే దండించబడి యున్న దేవతల తల్లులకు కూడ కైలసపతి పూర్వమునందు ఉన్న విధముగనే అవయవములను ఇచ్చెను (36). పితామహుడగు బ్రహ్మభగవానుడే స్వయముగా దక్షునకు వాని పాపములకు తగినట్లుగా ముసలి మేక యొక్క ముఖమునే ముఖముగా చేసెను (37). అపుడు ఆ దక్షుడు కూడా మరల జీవించి సంజ్ఞను పొంది బుద్ధిమంతుడై భయముతో చేతులను జోడించి అనేకవాక్యములను పలుకుతూ శంభుని స్తుతించెను (38).
దక్ష ఉవాచ |
జయ దేవ జగన్నాథ లోకానుగ్రహకారక | కృపాం కురు మహేశానాపరాధం మే క్షమస్వ హ || 39
కర్తా భర్తా చ హర్తా చ త్వమేవ జగతాం ప్రభో | మయా జ్ఞాతం విశేషేణ విష్ణ్వాదిసకలేశ్వరః || 40
త్వయైవ వితతం సర్వం వ్యాప్తం సృష్టం న నాశితమ్ | న హి త్వదధికాః కేచిదీశాస్తే %చ్యుతకాదయః || 41
దక్షుడు ఇట్లు పలికెను -
ఓ దేవా! జగన్నాథా! లోకములను అనుగ్రహించు వాడా! మహేశ్వరా! దయను చూపుము. నా తప్పును క్షమించుము (39). ఓ ప్రభూ! నీవే లోకములను సృష్టించి పోషించి సంహరించు చున్నావు. విష్ణువు మొదలగు వారందరికీ నీవే ఈశ్వరుడవని నేను విశేషముగా తెలుసుకొంటిని (40). సర్వమును నీవే వ్యాపించి యున్నావు. ఈ సృష్టిని నీవు ఇంకనూ నశింప చేయలేదు. విష్ణువు మొదలగు వారు ఎవ్వరైననూ నీ కంటె గొప్ప ప్రభువులు కారు (41).
వాయురువాచ |
తం తథా వ్యాకులం భీతం ప్రలపంతం కృతాగసమ్ | స్మయన్నివావదత్ర్పే క్ష్య మా భైరితి ఘృణానిధిః || 42
తథోక్త్వా బ్రహ్మణస్తస్య పితుః ప్రియచికీర్షయా | గాణపత్యం దదౌ తసై#్మ దక్షాయాక్షయమీశ్వరః || 43
తతో బ్రహ్మాదయో దేవా అభివంద్య కృతాంజలిః | తుష్టువుః ప్రశ్రయా వాచా శంకరం గిరిజాధిపమ్ || 44
వాయువు ఇట్లు పలికెను -
ఆ విధముగా తప్పును చేసి భయపడుతూ కంగారుతో అధికముగా మాటాలాడుచున్న ఆ దక్షుని చూచి దయానిధినయగు శివుడు చిరునవ్వు నవ్వుతున్నాడా యన్నట్లు చూచి భయపడవద్దని పలికెను (42). ఆ విధముగా పలికి వాని తండ్రియగు బ్రహ్మకు ప్రీతిని కలిగించ గోరి ఈశ్వరుడు ఆ దక్షునకు వినాశము లేని గణాధ్యక్షస్థానమును ఇచ్చెను (43). తరువాత బ్రహ్మ మొదలగు దేవతలు వినయము గలవారై చేతులను జోడించి నమస్కరించి పార్వతీపతియగు శంకరుని స్తుతించిరి (44).
బ్రహ్మాదయ ఊచుః |
జయ శంకర దేవేశ దీనానాథ మహాప్రభో | కృపాం కురు మహేశానాపరాధం నో క్షమస్వ వై || 45
మఖపాల మఖాదీశ మఖవిధ్వంసకారక | కృపాం కురు మహేశానాపరాధం నః క్షమస్వ వై || 46
దేవదేవ పరేశాన భక్తప్రాణప్రపోషక | దుష్టదండప్రద స్వామిన్ కృపాం కురు నమో%స్తు తే || 47
త్వం ప్రభో గర్వహర్తా వై దుష్టానాం త్వమజానతామ్ | రక్షకో హి విశేషేణ సతాం త్వత్సక్తచేతసామ్ || 48
అద్భుతం చరితం తే హి నిశ్చితం కృపయా తవ | సర్వాపరాధః క్షంతవ్యో విభవో దీనవత్సలాః || 49
బ్రహ్మ మొదలగు వారు ఇట్లు పలికిరి -
ఓ శంకరా! దేవదేవా! నీకు జయమగుగాక! దీనులకు ప్రభువైన వాడా! ఓ మహాప్రభూ! దయను చూపుము. ఓ మహేశ్వరా! మా అపరాధమును నిశ్చయముగా క్షమింపుము (45). యజ్ఞమును రక్షించువాడా! యజ్ఞప్రభూ! దక్షయజ్ఞమును ధ్వంసము చేసినవాడా! ఓ మహేశ్వరా! దయను చూపుము. మా అపరాధమును నిశ్చయముగా క్షమించుము (46). ఓ దేవదేవా! సర్వమునకు కారణమగు ప్రకృతిని నియంత్రించు వాడా! భక్తుల ప్రాణములను నిలబెట్టువాడా! దుష్టులను శిక్షించే స్వామీ! దయను చూపుము. నీకు నమస్కారమగుగాక! (47) ఓ ప్రభూ! నిన్ను తెలియజాలని దుష్టుల గర్వమును నీవు అడంచెదవు. నీయందు లగ్నమైన మనస్సు గల సత్పురుషులను నీవు ప్రత్యేకముగా రక్షించెదవు (48). నీ చరిత్రము అద్భుతమని నీ దయచేతనే నిశ్చయించు కొంటిమి. మా అపరాధముల నన్నింటినీ క్షమించ వలెను. ప్రభువులు దీనులపై దయను కలిగి యుందురు గదా! (49).
వాయురువాచ |
ఇతి స్తుతో మహాదేవో బ్రహ్మాద్యైరమరైః ప్రభుః | స భక్తవత్సలస్స్వామీ తుతోష కరుణోదధిః || 50
చకారానుగ్రహం తేషాం బ్రహ్మాదీనాం దివౌకసామ్ | దదౌ వరాంశ్చ సుప్రీత్యా శంకరో దీవవత్సలః || 51
స చ తతస్త్రి దశాన్ శరణాగతాన్ పరమకారుణికః పరమేశ్వరః | అనుగతస్మితలక్షణయా గిరా శమితసర్వభయస్సమభాషత || 52
వాయువు ఇట్లు పలికెను -
ఈ విధముగా బ్రహ్మ మొదలగు దేవతలచే స్తోత్రము చేయబడిన ఆ మహాదేవప్రభుడు సంతోషించెను. భక్తవత్సలుడగు ఆ స్వామి కరుణాసముద్రుడు (50). దీనులపై ప్రేమ గల ఆ శంకరుడు బ్రహ్మ మొదలగు దేవతలపై అనుగ్రహమును చూపి వారికి మిక్కిలి ప్రీతితో వరముల నిచ్చెను(51). తరువాత అతిశయించిన దయ గల పరమేశ్వరుడు చిరునవ్వుతో గూడిన వచనముతో శరుణు జొచ్చిన దేవతల భయములనన్నింటినీ పోగొట్టుతూ ఇట్లు పలికెను (52).
శివ ఉవాచ |
యదిదమాగ ఇహాచరితం సురైర్విధినియోగవశాదివ యంత్రితైః | శరణమేవ గతానవలోక్య వస్తదఖిలం కిల విస్మృతమేవ నః || 53
తదిహ యూయమపి ప్రకృతం మనస్సవిగణయ్య విమర్దమపత్రపాః |
హరివిరించిసురేంద్రముఖాస్సుఖం వ్రజత దేవపురం ప్రతి సంప్రతి || 54
ఇతి సురానభిధాయ సురేశ్వరో నికృతదక్షక్రతురక్రతుః | సగిరిజానుచరస్సపరిచ్ఛదః స్థిత ఇవాంబరతోంతరధాద్ధరః || 55
అథ సురా అపి తే విగతవ్యథాః కథితభద్రసుభద్రపరాక్రమాః |
సపది ఖేన సుఖేన యథాసుఖం యయురనేకముఖా మఘవన్ముఖాః || 56
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయ సంహితాయాం పూర్వభాగే గిరిశానునయో నామ త్రయోవింశో%ధ్యాయః (23).
శివుడు ఇట్లు పలికెను -
దేవతలు విధివిధానమునకు వశులై దానిచే నియంత్రింప బడినారా యన్నట్లు ఇచట పాపమును చేసియున్నారు. కాని అట్టి మీరు నన్ను శరణు పొందినారు. మిమ్ములను ఈ విధముగా చూచి మేము ఆ పాపమునంతనూ మరచిపోయినాము (53). విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన ఓ దేవతలారా! కావున, మీరు కూడ ఇక్కడ మీకు జరిగిన దేహశుద్ధిని మనస్సులో పెట్టుకొనకుండగా, బిడియమును విడిచినవారై, సుఖముగా ఇప్పుడు స్వర్గమునకు వెళ్లుడు (54). దేవతలకు ప్రభువు, దక్షయజ్ఞమును విధ్వంసము చేసినవాడు, సంకల్పరహితుడు, పార్వతీదేవితో, గణములతో మరియు అనుచరులతో కూడియున్నవాడు అగు శివుడు, ఆకాశములో నిలబడి యున్నాడు అనుకుంటూ ఉండగనే అంతర్థానమును చెందినాడు (55). తరువాత ఇంద్రుడు మొదలగు ఆ దేవతలు కూడా భయము తొలగిన వారై వీరభద్రుని మిక్కిలి మంగళకరమగు పరాక్రమమును గురించి ముచ్చటించుకొని, వెనువెంటనే సుఖముగా నుండే ఆకాశమార్గములో వివిధదిక్కులలో సుఖముగా వెళ్లిరి (56).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో దేవతలు శివుని అనునయించుటను వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).