Siva Maha Puranam-4
Chapters
అథ చతుర్వింశో
శివుడు పార్వతితో పరిహాసవచనమును పలుకుట
ఋషుయ ఊచుః |
అంతర్ధానగతో దేవ్యా సహ సానుచరో హరః | క్వ యాతః కుత్ర వా వాసః కిం కృత్వా విరరామ హ || 1
ఋషులు ఇట్లు పలికిరి -
దేవితో మరియు అనుచరులతో గూడి అంతర్ధానమును జెందిన శివుడు ఎక్కడకు వెళ్లినాడు? ఎక్కడ నివసించినాడు? ఏయే కార్యములను చేసి విరమించినాడు? (1)
వాయురువాచ |
మహీధరవరః శ్రీమాన్ మందరశ్చిత్రకందరః | దయితో దేవదేవస్య నివాసస్తపసో%భవత్ || 2
తపో మహత్కృతం తేన వోఢుం స్వశిరసా శివౌ | చిరేణ లబ్ధం తత్పాదపంకజస్పర్శజం సుఖమ్ || 3
తస్య శైలస్య సౌందర్యం సహస్రవదనైరపి | న శక్యం విస్తరాద్వక్తుం వర్షకోటిశ##తైరపి || 4
శక్యమప్యస్య సౌందర్యం న వర్ణయితుముత్సహే | పర్వతాంతరసౌందర్యం సాధారణవిధారణాత్ || 5
ఇదం తు శక్యతే వక్తుమస్మిన్ పర్వతసుందరే | బుద్ధ్యా కయాపి సౌందర్యమీశ్వరావాసయోగ్యతా || 6
అత ఏవ హి దేవేన దేవ్యాః ప్రియచికీర్షయా | అతీవ రమణీయోయం గిరిరంతఃపురీకృతః || 7
మేఖలాభూమయస్తస్య విమలోపలపాదపాః | శివయోర్నిత్యసాన్నిధ్యాన్న్యకుర్వంత్యఖిలం జగత్ || 8
పితృభ్యాం జగతో నిత్యం స్నానపానోపయోగతః | అవాప్త పుణ్యసంస్కారైః ప్రసరద్భిరితస్తతః || 9
లఘుశీతలసంస్పర్శైరచ్ఛాచ్ఛైర్నిర్ఘ రాంబుభిః | అధిరాజ్యేన చాద్రీణామద్రిరేషో%భిషిచ్యతే || 10
నిశాసు శిఖరప్రాంతర్వర్తినా స శిలోచ్చయః | చంద్రేణాచలసామ్రాజ్యచ్ఛత్రేణవ విరాజతే || 11
వాయువు ఇట్లు పలికెను -
శోభాయుక్తమైనది, రంగు రంగుల గుహలు గలది, పర్వతములలో శ్రేష్ఠమైనది అగు మందరపర్వతము దేవదేవుడగు శివునకు తపస్సును చేసుకొనే నివాసస్థానముగా నుండెను (2). ఆ పర్వతము తన శిఖరముపై పార్వతీపరమేశ్వరులను దాల్చ గోరి గొప్ప తపస్సును చేసి చిరకాలము తరువాత వారి పద్మముల వంటి పాదముల స్పర్శ వలన కలిగే సుఖమును పొందెను (3). వేయు ముఖములు గలవారైననూ వంద కోటి సంవత్సరములు ప్రయత్నించిననూ ఆ పర్వతము యొక్క సౌందర్యమును వివరముగా చెప్పజాలరు (4). ఆ పర్వతసౌందర్యమును నేను వర్ణించగలను. కాని, నాకు వర్ణించే ఉత్సాహము లేదు. ఏలయనగా, ఈ పర్వతము కూడా ఇతర పర్వతముల వలెనే సామాన్యమగు సౌందర్యమును కలిగియుండుననే అభిప్రాయము కలుగువచ్చును (5). కాని ఆ పర్వత శోభను గురించి ఒక మాటను చెప్ప వచ్చును. ఒక విలక్షణమైన సౌభాగ్యము కారణముగా ఈ పర్వతమునందు ఈశ్వరుడు నివసించుటకు యోగ్యమగు సౌందర్యము గలదు (6). ఇందు వలననే శివుడు పార్వతికి ప్రీతిని కలిగించ గోరి మిక్కిలి సుందరమగు ఈ పర్వతమును తన అంతఃపురముగా చేసుకొనినాడు (7). స్వచ్ఛమగు శిలలతో మరియు వృక్షములతో కూడి ఆ పర్వతమునకు మేఖలలవలె నున్న సానువులు (కొండ చరియలు) పార్వతీపరమేశ్వరుల నిత్యనివాసముచే జగత్తునంతనూ తృణీకరించు చున్నవి (8). ముల్లోకములకు తల్లిదండ్రులగు పార్వతీపరమేశ్వరులు నిత్యము స్నానమును చేసి త్రాగుటకు ఉపయోగించుట వలన పొందబడిన పుణ్యసంస్కారము గలవి, ఇటునుండి అటునుండి ప్రవహించునవి (9), చల్లని తేలిక (పలచని) స్పర్శ గలవి, మిక్కిలి స్వచ్ఛమైనవి అగు కొండ కాలువల జలములచే ఈ పర్వతుడు పర్వతములకు చక్రవర్తి అనే పదవినందు అభిషేకించబడు చున్నాడు (10). రాత్రులయందు శిఖరములకు దగ్గరలో నుండే చంద్రుడు ఆ పర్వతముయొక్క పర్వతసామ్రాజ్యధిపతిత్వమునకు చిహ్నము అగు గొడుగు వలె నున్నాడు(11).
స శైలశ్చంచలీభూతైర్బాలైశ్చామరయోషితామ్ | సర్వపర్వతసామ్రాజ్యచామరైరివ వీజ్యతే || 12
ప్రాతరభ్యుదితే భానౌ భూధరో రత్నభూషితః | దర్పణ దేహసౌభాగ్యం ద్రష్టుకామ ఇవ స్థితః || 13
కూజద్విహంగవాచాలైర్వాతోద్ధృతలతాభుజైః | విముక్తపుషై#్పస్సతతం వ్యాలంబిమృదుపల్లవైః || 14
లతాప్రతానజటిలైస్తరుభిస్తాపసైరివ | జయాశిషా సహాభ్యర్చ్య నిషేవ్యత ఇవాద్రిరాట్ || 15
అధోముఖైరూర్ధ్వముఖైశ్శృంగైస్తిర్యఙ్ముఖైస్తథా | ప్రపతన్నివ పాతాలే భూపృష్ఠాదుత్పతన్నివ || 16
పరీతస్సర్వతో దిక్షు భ్రమన్నివ విహాయపి | పశ్యన్నివ జగత్సర్వం నృత్యన్నివ నిరంతరమ్ || 17
గుహాముఖైః ప్రతిదినం వ్యాత్తాస్యో విపులోదరైః | అజీర్ణలావణ్యతయా జృంభమాణ ఇవాచలః || 18
గ్రసన్నివ జగత్సర్వం పిబన్నివ పయోనిధిమ్ | వమన్నివ తమోంతఃస్థం మాద్యన్నివ ఖమంబుదైః || 19
నివాసభూమయస్తాస్తా దర్పణప్రతిమోదరాః | తిరస్కృతాతపాస్స్నిగ్ధాశ్రమచ్ఛాయామహీరుహాః || 20
సరిత్సరస్తడాగాదిసంపర్కశిశిరానిలాః | తత్ర తత్ర నిషణ్ణాభ్యాం శివాభ్యాం సఫలీకృతాః || 21
ఆడు చామరమృగముల పిల్లలు ఇటునటు పరుగులెత్తుచుండగా, పర్వతములన్నింటి సామ్రాజ్యమునందు అభిషిక్తుడైన ఆ పర్వతమునకు అవి వింజామరలను వీచుచున్నట్లుండెను (12). ఉదయము సూర్యుడు ఉదయించినప్పుడు రత్నములచే అలంకరింపబడి యున్న ఆ పర్వతము అద్దములో తన దేహముయొక్క సౌభాగ్యమును చూడ గోరుచున్నదా యన్నట్లు ఉండెను (13). పక్షికూతలే మంత్రపఠనములుగా కలిగినట్టియు, గాలికి పైకి యెత్తబడిన లతలే భుజములుగా కలిగినట్టియు, పరస్పరము చిక్కువడియున్న తీగలు అనే జటాజూటములను కలిగియున్న చెట్లు అనే తపశ్శాలురు ఎల్లవేళలా పుష్పములను జార్చుచూ వ్రేలాడే కొమ్మలకు సుకుమారమగు చిగుళ్లను కలిగియుండి జయాశీస్సులను పలుకుతూ ఆ పర్వతరాజును పూజించి సేవించుచున్నవా యన్నట్లుండెను (14, 15). కొన్ని శిఖరములు పైకి, మరికొన్ని క్రిందకు, ఇంకొన్ని అడ్డముగా వ్యాపించి యుండ ఆ పర్వతము పాతాళములోనికి దుముకుచున్నదా యన్నట్లు,భూతలమునుండి పైకి లేచుచున్నదా యన్నట్లు (16), ఆకాశములో అంతటా అన్ని దిక్కుల యందు తిరుగాడుతూ జగత్తునంతనూ చూచుచున్నదా యన్నట్లు, ఎడతెరపి లేకుండగా నాట్యమాడుచున్నదా యన్నట్లు ఉండెను (17). శిథిలము కాని సౌందర్యము గల ఆ పర్వతము ప్రతిదినము విశాలమగు లోపలి భాగములు గల గుహలు అనే ముఖములతో నోటిని తెరచి ఆవలించు చున్నదా యన్నట్లు ఉండెను (18). ఆ పర్వతము జగత్తునంతనూ మ్రింగుచున్నదానివలె, సముద్రమును త్రాగుచున్న దానివలె, తన లోపలనున్న చీకటిని గ్రక్కుచున్న దాని వలె, ఆకాశమును మేఘములతో కప్పుచున్నదాని వలె నుండెను (19). ఆయా నివాసస్థానములు అద్దము వలె స్వచ్ఛముగా నుండెను. ఆశ్రమమునందు నీడనిచ్చే దట్టని చెట్లు ఎండను తిరస్కరించుచుండెను (20). నదులు, సరస్సులు, చెరువులు మొదలగు వాటితోడి సంపర్కము వలన చల్లనైన వాయువులు అక్కడక్కడ కూర్చుండిన పార్వతీపరమేశ్వరులచే సఫలము చేయబడినవి (21).
తమిమం సర్వతః శ్రేష్ఠం స్మృత్వా సాంబస్త్రి యంబకః | రైభ్యాశ్రమసమీపస్థశ్చాంతర్ధానం గతో య¸° || 22
తత్రోద్యానమనుప్రాప్య దేవ్యా సహ మహేశ్వరః | రరామ రమణీయాసు దివ్యాంతఃపురభూమిషు || 23
తథా గతేషు కాలేషు వర్ధితాసు ప్రజాసు చ | దైత్యౌ శుంభనిశుంభాఖ్యౌ భ్రాతరౌ సంబభూవతుః || 24
తాభ్యాం తపోబలాద్దత్తం బ్రహ్మణా పరమేష్ఠినా | అవధ్యత్వం జగత్యస్మిన్ పురుషైరఖిలైరపి || 25
అయోనిజా తు యా కన్యా హ్యంబికాంశసముద్భవా | అజాతపుంస్పర్శరతిరవిలంఘ్యపరాక్రమా || 26
తయా తు నౌ వధస్సంఖ్యే తస్యాం కామాభిభూతయోః | ఇతి చాభ్యర్థితో బ్రహ్మా తాభ్యాం ప్రాహ తథాస్త్వితి || 27
తతః ప్రభృతి శక్రాదీన్ విజిత్య సమరే సురాన్ | నిస్స్వాధ్యాయవషట్కారం జగచ్చక్రతురక్రమాత్ || 28
తయోర్వధాయ దేవేశం బ్రహ్మాభ్యర్థితవాన్ పునః | వినింద్యాపి రహస్యం వాం క్రోధయిత్వా యథా తథా || 29
తద్వర్ణకోశజాం శక్తిమకామాం కన్యకాత్మికామ్ | నిశుంభశుంభయోర్హంత్రీం సురేభ్యో దాతుమర్హసి || 30
ఏవమభ్యర్థితో ధాత్రా భగవాన్నీలలోహితః | కాలీత్యాహ రహస్యం వాం నిందయన్నివ సస్మితః || 31
తతః క్రుద్ధా తదా దేవీ సువర్ణా వర్ణకారణాత్ | స్మయంతీ చాహ భర్తారమసమాధేయయా గిరా || 32
రైభ్యుని ఆశ్రమమునకు సమీపమునందున్న ముక్కంటి యగు శివుడు అట్టి ఈ సర్వోత్కృష్టమైన పర్వతమును గర్తుకు దెచ్చుకొని పార్వతితో గూడి అంతర్ధానమును చెంది అచటకు వెళ్లెను (22). మహేశ్వరుడు పార్వతీదేవితో గూడి అచట ఉండే ఉద్యానవనము వద్దకు వెళ్లి సుందరమగు అంతఃపురస్థానముల యందు రమించెను (23). ఆ విధముగా కాలము గడచుచుండగా సృష్టిలో ప్రజల సంఖ్య పెరిగెను. శుంభనిశుంభులు అనే సోదరులగు ఇద్దరు రాక్షసులు ఉదయించిరి (24). వారి తపోబలము వలన వారికి ఈ జగత్తులో సర్వపురుషుల చేతిలో మరణము లేకుండునట్లు పరమేష్ఠియగు బ్రహ్మ వరమునిచ్చెను (25). అయోనిజ, పార్వతీదేవి యొక్క అంశనుండి జన్మించినది, పురుషునితో స్పర్శ మరియు రతి లేనిది, ఉల్లంఘింప శక్యము కాని పరాక్రమము గలది అగు ఏ కన్య గలదో (26), ఆమె చేతిలో మాత్రమే కామముచే పరాజితులమై యున్న మేమిద్దరము యుద్ధములో వధింప బడెదము గాక! అని వారు ప్రార్థించగా, బ్రహ్మ అటులనే యగుగాక! అనెను (27). అప్పటి నుండియు వారు ఇంద్రుడు మొదలగు దేవతలను యుద్ధములో జయించి, జగత్తులో స్వాధ్యాయము గాని, యజ్ఞములు గాని లేని విధముగా అక్రమముగా చేసిరి (28). బ్రహ్మ వారి వధ కొరకై దేవదేవుడగు శివుని మరల ప్రార్థించెను. పార్వతిని నిందించి గాని, లేక ఏదో విధముగా రహస్యముగా కోపమును తెప్పించుము (29). ఆమె రూపమునుండి రంగునుండి పుట్టినది, కామము లేనిది, కన్య రూపములో నున్నది, శుంభనిశుంభులను సంహరించునది అగు శక్తిని దేవతలకు నీవు ఈయ దగుదువు (30). నీలలోహితుడగు శివభగవానుని బ్రహ్మ ఈ విధముగా ప్రార్థించగా, ఆయన ఏకాంతమునందు పార్వతిని నిందించు చున్న వానివలె చిరునవ్వుతో ' నీవు నల్లని దానవు' అనెను (31). అపుడు చక్కని దేహవర్ణము గల ఆ దేవి వర్ణమును గురించి శివుడు చేసిన వ్యాఖ్యకు కోపించి వెటకారముగా నవ్వి సమాధాన పరచుటకు వీలు లేని విధముగా కఠినమగు వాక్కుతో భర్తను ఉద్దేశించి ఇట్లు పలికెను (32).
దేవ్యువాచ |
ఈదృశే మమ వర్ణే%స్మిన్నరతిర్భవతో % స్తి చేత్ | ఏతావంతం చిరం కాలం కథమేషా నియమ్యతే || 33
అరత్యా వర్తమానో %పి కథం చ రమసే మయా | న హ్యశక్యం జగత్యస్మిన్నీశ్వరస్య జగత్ర్పభోః || 34
స్వాత్మారామస్య భవతో రతిర్న సుఖసాధనమ్ | ఇతి హేతోస్స్మరో యస్మాత్ర్ప సభం భస్మసాత్కృతః || 35
యా చ నాభిమతా భర్తురపి సర్వాంగసుందరీ | సా వృథైవ హి జాయేత సర్వైరపి గుణాంతరైః || 36
భర్తుర్భోగైకశేషో హి సర్గ ఏవైష యోషితామ్ | తథా సత్యన్యథా భూతా నారీ కుత్రోపయుజ్యతే || 37
తస్మాద్వర్ణమిమం త్యక్త్వా త్వయా రహసి నిందితమ్ | వర్ణాంతరం భజిష్యే వా న భజిష్యామి వా స్వయమ్ || 38
ఇత్యుక్త్వోత్థాయ శయనాద్దేవీ సాచష్ట గద్గదమ్ | యయాచే% నుమతిం భర్తుస్తపసే కృతనిశ్చయా || 39
తథా ప్రణయభంగేన భీతో భూతపతిస్స్వయమ్ | పాదయోః ప్రణమన్నేవ భవానీం ప్రత్యభాషత || 40
దేవి ఇట్లు పలికెను -
నా ఇట్టి ఈ రంగునందు మీకు ప్రీతి లేని పక్షములో, ఇంత దీర్ఘకాలము మీరు ఈ అరుచిని ఎట్లు దాచి పెట్ట గల్గితిరి? (33) ప్రేమ లేకున్ననూ మీరు నాతో ఎట్లు రమించితిరి? జగత్తులకు ప్రభువగు ఈశ్వరునకు ఈ జగత్తులో శక్యము కానిది ఏది లేదు (34). తన ఆత్మస్వరూపములోని ఆనందమునందు రమించే మీకు స్త్రీ సహవాసము సుఖమునకు సాధనము కాదు. ఈ కారణము చేతనే మీరు మన్మథుని బలాత్కారముగా బూడిదగా మార్చివేసితిరి (35). స్త్రీ సర్వావయవములయందు సుందరియే అయిననూ ఆ సౌందర్యము భర్తకు అభిమతము కానిచో, ఆమెకు సమస్తసద్గుణములు ఉన్ననూ, ఆమె జన్మ వ్యర్థమే (36). భర్త యొక్క ఆనందము మాత్రమే స్త్రీ యొక్క సృష్టికి ఏకైకప్రహయోజనము.స్థితి ఇట్లుండగా దానికి విరుద్ధముగా నుండే స్త్రీకి మరియొక్క ప్రయోజనమేమి గలదు ? (37) కావున, నేను నీచే ఏకాంతములో నిందించబడిన ఈ వర్ణమును విడిచి పెట్టి మరియొక్క రంగును పొందెదను. లేదా, స్వయముగా ప్రాణములను విడిచెదను (38). ఆ దేవి ఈ విధముగా పలికి శయనమునుండి లేచి తపస్సును చేయవలెననే నిశ్చయమునకు వచ్చి గద్గదమగు వచనముతో భర్తను అనుమతిని కోరెను (39). సకలప్రాణులకు ప్రభువగు ఆ శివుడు ఆ విధముగా తన ప్రేమకు భంగము కలుగునని భయపడిన వాడై స్వయముగా ఆ భవానియొక్క పాదములకు ప్రణమిల్లి ఇట్లు చెప్పెను (40).
ఈశ్వర ఉవాచ |
అజానతీ చ క్రీడోక్తిం ప్రియే కిం కుపితాసి మే | రతిః కుతో వా జాయేత త్వత్తశ్చేదరతిర్మమ || 41
మాతా త్వమస్య జగతః పితాహమధిపస్తథా | కథం తదుపపద్యేత త్వత్తో నాభిరతిర్మమ || 42
అవయోరభికామో%పి కిమసౌ కామకారితః | యతః కామసముత్పత్తిః ప్రాగేవ జగదుద్భవః || 43
పృథగ్జనానాం రతయే కామాత్మా కల్పితో మయా | తతః కథముపాలబ్ధః కామదాహాదహం త్వయా || 44
మాం వై త్రిదశసామాన్యం మన్యమానో మనోభవః | మనాక్పరిభవం కుర్వన్మయా వై భస్మసాత్కృతః || 45
విహారోప్యావయోరస్య జగతస్త్రా ణకారణమ్ | తతస్తదర్థం త్వయ్యద్య క్రీడోక్తిం కృతవానహమ్ || 46
స చాయమచిరాదర్ధస్తవైవావిష్కరిష్యతే | క్రోధస్య జనకం వాక్యం హృది కృత్వేదమబ్రవీత్ || 47
ఈశ్వరుడిట్లు పలికెను -
ఓ ప్రియురాలా! నేను పలికిన పలుకులోని పరిహాసమును తెలియ జాలక నాపై కోపించుచున్నావా? నాకు నీపై ప్రేమ లేనిచో, నాకు ఇతరము దేనిపై ప్రేమ ఉండగల్గును?(41) నీవు ఈ జగత్తునకు తల్లివి. నేను ఈ జగత్తునకు ప్రభువు మాత్రమే గాక, తండ్రిని కూడా. నాకు నీపై ప్రేమ లేనిచో, ఈస్థితి ఎట్లు పొసగును? (42) మన మధ్య గల పరస్పరప్రేమకు ఈ మన్మథుడు కారణమా యేమి? కాదు. ఏలయనగా, మన్మథుడు పుట్టుటకు పూర్వమే జగత్తు పుట్టినది (43). స్త్రీ పురుషుల పరస్పరప్రేమ కొరకై నేను కాముడను వానిని కల్పించితిని. ఇట్టి స్థితిలో నేను కాముని దహించి వేసితినని నీవు నన్ను ఎట్లు నిందించితివి? (44) నన్ను ఒక సామాన్యదేవతగా భావించిన మన్మథుడు నన్ను కొద్దిగా అవమానించ బోగా, నేను వానిని భస్మము చేసితిని (45). మన యిద్దరి ఈ విహారము కూడా జగత్తును రక్షించుట కొరకు మాత్రమే ఉద్దేశించ బడినది. కావుననే, నేను ఆ ప్రయోజనము కొరకు మాత్రమే ఈ నాడు నీతో పరిహాస వాక్యమును పలికితిని (46). ఈ ప్రయోజనము నీకు తొందరలోననే స్పష్టము కాగలదు. తనకు కోపమును కలిగించిన శివుని మాటను మనస్సులో నుంచుకొని దేవి ఇట్లు పలికెను (47).
దేవ్యువాచ |
శ్రుతపూర్వం హి భగవంస్తవ చాటు వచో మయా | యేనైవమతిధీరాహమపి ప్రాగభివంచితా || 48
ప్రాణానప్యప్రియా భర్తుర్నారీ యా న పరిత్యజేత్ | కులాంగనా శుభా సద్భిః కుత్సితైవ హి గమ్యతే || 49
భూయసీ చ తవాప్రీతిరగౌరమితి మే వపుః | క్రీడోక్తిరపి కాలీతి ఘటతే కథమన్యథా || 50
సద్భిర్విగర్హితం తస్మాత్తవ కార్ ష్ణ్యమసమ్మతమ్ | అనుత్సృజ్య తపోయోగాత్ స్థాతుమేవేహ నోత్సహే || 51
దేవి ఇట్లు పలికెను -
ఓ భగవాన్! నేను నీ పరిహాసోక్తులను ఇదివరలో విని యుంటిని. నేను అతిధీరురాలనే అయిననూ, నీవు అట్టి వచనములతో నన్ను పూర్వములో మోసగించి యుంటివి (48). మంగళ స్వరూపురాలగు ఏ కులస్త్రీ భర్త యొక్క ప్రీతిని పొందలేనిదైననూ ప్రాణములను విడువకుండునో, ఆమెను సత్పురుషులు దుష్టురాలనియే భావించెదరు (49). నా దేహము పచ్చగా లేదని నీకు నాపై అరుచి అధికముగా గలదు. అట్లు గానిచో, పరిహాసమునకైననూ నీవు నల్లనిది అనుట ఎట్లు సంభవమగును? (50) కావున, సత్పురుషులు ఏవగించుకొనే ఈ నల్లదనము నీకు నచ్చుబాటు కాదు. తపస్సుయొక్క ప్రభావముచే దానిని తొలగించు కొన కుండగా ఇక్కడ నిలిచి యుండుటలో నాకు ఉత్సాహము లేదు (51).
శివ ఉవాచ |
స యద్యేవంవిధతాపస్తే తపసా కిం ప్రయోజనమ్ | మమేచ్ఛయా స్వేచ్ఛయా వా వర్ణాంతరవతీ భవ || 52
శివుడు ఇట్లు పలికెను -
నీకు ఈ విధమగు మనోవేదన ఉన్నచో, తపస్సుతో పని యేమి? నా సంకల్పముచే గాని, లేదా నీ ఇచ్ఛచే గాని మరియొక వర్ణమును పొందుము (52).
దేవ్యువాచ |
నేచ్ఛామి భవతో వర్ణం స్వయం వా కర్తుమన్యథా | బ్రహ్మాణం తపసారాద్య క్షిప్రం గౌరీ భవామ్యహమ్ || 53
దేవి ఇట్లు పలికెను -
నేను మరియొక దేహవర్ణమును నీనుండి పొంద గోరుట లేదు. స్వయముగా దేహవర్ణమును మార్చుకొనుట యైననూ నాకు సమ్మతము కాదు. నేను తపస్సును చేసి బ్రహ్మను ఆరాధించి శీఘ్రముగా పచ్చని రంగు గలదానను కాగలను (53).
ఈశ్వర ఉవాచ |
మత్ర్ప సాదాత్పురా బ్రహ్మా బ్రహ్మత్వం ప్రాప్తవాన్ పురా | తమాహూయ మహాదేవి తపసా కిం కరిష్యసి || 54
ఈశ్వరుడు ఇట్లు పలికెను -
పూర్వము బ్రహ్మనా అనుగ్రహముచే బ్రహ్మ పదవిని పొందినాడు. ఓ మహాదేవీ!ఆతనిని పిలిపించెదము. నీవు తపస్సును చేయుట యేల? (54)
దేవ్యువాచ |
త్వత్తో లబ్ధపదా ఏవ సర్వే బ్రహ్మాదయస్సురాః | తథాప్యారాధ్య తపసా బ్రహ్మాణం త్వన్నియోగతః || 55
పురా కిల సతీ నామ్నా దక్షస్య దుహితా% భవమ్ | జగతాం పతిమేవం త్వాం పతిం ప్రాప్తవతీ తథా || 56
ఏవమద్యాపి తపసా తోషయిత్వా ద్విజం విధిమ్ | గౌరీ భవితుమిచ్ఛామి కో దోషః కథ్యతామిహ || 57
ఏవముక్తో మహాదేవ్యా వామదేవస్స్మయన్నివ | న తాం నిర్బంధయామాస దేవకార్యచికీర్షయా || 58
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వభాగే శివక్రీడోక్తివర్ణనం నామ చతుర్వింశో%ధ్యాయః (24).
దేవి ఇట్లు పలికెను -
బ్రహ్మ మొదలగు దేవతలు అందరు నీనుండి పదవులను పొందిన వారే. అయినప్పటికీ, నీ అనుమతిని పొందు నేను పూర్వము తపస్సుచే బ్రహ్మను ఆరాధించి, సతి అను పేరుతో దక్షుని కుమార్తెనై జన్మించి, జగత్తులకు ప్రభువగు నిన్ను ఈ విధముగా భర్తగా పొందితిని (55, 56). అదే విధముగా ఈ నాడు కూడ వేదవేత్తయగు బ్రహ్మను తపస్సుచే సంతోషపెట్టి, గౌరి (పచ్చని వర్ణము గలది) ని కావలెనని కోరుచున్నాను. దీనిలో దోషమేమియో చెప్పుడు (57). మహాదేవి ఇట్లు పలుకగా, ఆ వామదేవుడు చిరునవ్వు నవ్వుచున్న వాని వలె నుండి, దేవకార్యమును చేయగోరుటచే ఆమెను వద్దని నిర్బంధించ లేదు (58).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు శివుడు పార్వతిని పరిహాసము చేయుట అనే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది(24).