Siva Maha Puranam-4
Chapters
అథ సప్తవింశో
శివపార్వతుల పునస్సమాగమము
ఋషయ ఊచుః |
కృత్వా గౌరం వపుర్దివ్యం దేవీ గిరివరాత్మజా | కథం దదర్శ భర్తారం ప్రవిష్టా మందిరం సతీ || 1
ప్రవేశసమయే తస్యా భవనద్వారగోచరైః | గణశైః కిం కృతం దేవస్తాన్ దృష్ట్వా కిం తదా%కరోత్ || 2
ఋషులు ఇట్లు పలికిరి -
పార్వతీదేవి పచ్చని దివ్యదేహమును పొంది మందిరములో ప్రవేశించినదై భర్తను దర్శించిన విధమెట్టిది?(1) ఆమె భవనములో ప్రవేశించిన సమయములో ద్వారము వద్దనుండే గణాధ్యక్షులు ఏమి చేసిరి? శివుడు వారిని చూచి అపుడేమి చేసెను? (2).
వాయురువాచ |
ప్రవక్తుమంజసా%శక్యస్తాదృశః పరమో రసః | యేన ప్రణయగర్భేణ భావో భావవతాం హృతః || 3
ద్వాఃస్థైస్ససంభ్రమైరేవ దేవో దేవ్యాగమోత్సుకః | శంకమానా ప్రవిష్టాంతస్తం చ సా సమపశ్యత || 4
తైసై#్తః ప్రణయభావైశ్చ భవనాంతరవర్తిభిః | గణంద్రై ర్వందితా వాచా ప్రణనామ త్రియంబకమ్ || 5
ప్రణమ్య నోత్థితా యావత్తావత్తాం పరమేశ్వరః | ప్రగృహ్య దోర్భ్యామాశ్లిష్య పరితః పరయా ముదా || 6
స్వాంకే ధర్తుం ప్రవృత్తో%పి సా పర్యంకే న్యషీదత | పర్యంకతో బలాద్దేవీం సోంకమారోప్య సుస్మితామ్ || 7
సస్మితో వివృతైర్నేత్రై స్తద్వక్త్రం ప్రపిబన్నివ | తయా సంభాషణాయేశః పూర్వభాషితమబ్రవీత్ || 8
వాయువు ఇట్లు పలికెను -
సర్వోత్కృష్టమగు ఆ ప్రేమరసమును సంపూర్ణముగా వర్ణించుట సంభవము కాదు. ఆ ప్రేమ సహృదయుల హృదయములను చూరగొన్నది (3). ద్వారపాలకులు కంగారు పడుచుండగనే ఆమె సందేహిస్తూ లోపలికి ప్రవేశించెను. అచట ఆమె యొక్క రాక కొరకు ఉత్కంఠతో ఎదురు చూచుచున్న శివుని ఆమె చూచెను (4). భవనము లోపలనుండే గణాధ్యక్షులు ఆయా ప్రేమపూర్వకమగు భావములతో ఆమెకు నమస్కరించిరి. ఆమె ఆ ముక్కంటికి నమస్కారమును చెప్పెను (5). ఆమె నమస్కరించి లేవబోవునంతలో పరమేశ్వరుడు మహానందముతో ఆమెను పట్టుకొని రెండు చేతులతో పూర్ణముగా కౌగిలించు కొనెను (6). ఆయన ఆమెను తన అంకముపై కూర్చుండ బెట్టుటకు యత్నించిననూ ఆమె పర్యంకముపైననే కూర్చుండెను. అపుడు ఆమె చిరునవ్వు నవ్వుచుండగా ఆయన బలముగా ఆ దేవిని పర్యంకమునుండి తన అంకముపై కూర్చుండ బెట్టు కొనెను (7). ఆయన చిరునవ్వుతో కళ్లను పెద్దవి చేసి ఆమె ముఖమును చూపులతో పానము చేయుచున్నాడా యన్నట్లు ఉండెను . ఆమెతో కబుర్లాడ గోరిన శివుడు తానే ముందుగా ఇట్లు పలికెను (8).
దేవదేవ ఉవాచ |
సా దశా చ వ్యతీతా కిం తవ సర్వాంగసుందరి | యస్యామనునయోపాయః కో%పి కోపాన్న లభ్యతే || 9
స్వేచ్ఛయాపి న కాలీతీ నాన్యవర్ణవతీతి చ | త్వత్స్వభావాహృతం చిత్తం సుభ్రు చింతావహం మమ || 10
విస్మృతః పరమో భావః కథం స్వేచ్ఛాంగయోగతః | న సంభవంతి యే తత్ర చిత్త కాలుష్యహేతవః || 11
పృథగ్జనవదన్యోన్యం విప్రియస్యాపి కారణమ్ | ఆవయోరపి యద్యస్తి నాస్త్యేవైతచ్చరాచరమ్ || 12
అహమగ్నిశిరోనిష్ఠస్త్వం సోమశిరసి స్థితా | అగ్నీ షోమాత్మకం విశ్వమావాభ్యాం సమధిష్ఠితమ్ || 13
జగద్ధితాయ చరతోస్స్వేచ్ఛాధృతశరీరయోః | ఆవయోర్విప్రయోగే హి స్యాన్నిరాలంబనం జగత్ || 14
అస్తి హేత్వంతరం చాత్ర శాస్త్ర యుక్తివినిశ్చితమ్ | వాగర్ధమయ మే వైతజ్జగత్ స్థావరజంగమమ్ || 15
త్వం హి వాగమృతం సాక్షాదహమర్థామృతం పరమ్ | ద్వయమప్యమృతం కస్మాద్వియుక్తముపపద్యతే || 16
విద్యాప్రత్యాయికా త్వం మే వేద్యో%హం ప్రత్యయాత్తవ | విద్యావేద్యాత్మనోరేవ విశ్లేషః కథమావయోః || 17
న కర్మణా సృజామీదం జగత్ర్పతిసృజామి చ | సర్వస్యాజ్ఞైకలభ్యత్వాదాజ్ఞా త్వం హి గరీయసీ || 18
దేవదేవుడగు శివుడు ఇట్లు పలికెను -
ఓ సర్వావయవసుందరీ! ఒకప్పుడు నీవు కోపించగా నాకు నిన్ను ఓదార్చే ఉపాయమే కరువయ్యెను. అట్టి కోపావస్థ ఇప్పుడు నీకు తొలగిపోయినదా? (9) నీవు నల్లగా గాని, మరియొక రంగులో గాని ఉండవలెననే ఇచ్ఛ నాకు లేదు. నా మనస్సు నీ స్వభావముచే మాత్రమే ఆకర్షించబడినది. కాని నాకు ఈ విషయము దుఃఖమును కలిగించుచున్నది (10). నీవా పరమ ప్రేమను ఎట్లు మరువ గల్గితివి? మనము మన ఇచ్ఛచే మాత్రమే దేహములను ధరించితిమి. కావున, మనస్సులకు కాలుష్యమును కలిగించే పరిస్థితులు మన మధ్య సంభవము కావు (11). సామాన్యజనులకు వలెనే మన ఇద్దరికి కూడా వైమనస్యము కలిగే కారణములు ఉండే పక్షములో, ఈ చరాచరజగత్తు ఉండనే ఉండదు (12). నేను అగ్నియొక్క శిరస్సుపై నుండగా, నీవు చంద్రుని శిరస్సుపై నున్నావు. అగ్ని మరియు చంద్రుడు (భోక్తృ - భోగ్యములు) అను తత్త్వములతో నిండియున్న జగత్తునకు మనమిద్దరమే అధిష్టానమై యున్నాము (13). లోకముల శ్రేయస్సు కొరకై స్వేచ్ఛగా శరీరములను ధరించి సంచరించే మనమిద్దరము విడి పోయినచో, జగత్తునకు ఆశ్రయము ఉండదు (14). ఈ సందర్భములో శాస్త్రముచే మరియు యుక్తులచే నిర్ధారింప బడిన మరియొక కారణము కూడ గలదు. చరచరాత్మకమగు ఈ జగత్తు కేవలము నామ (వాక్కు) రూపాత్మకము (అర్థము) మాత్రమే (15). అమృతమగు వాక్కు నీవే. పరమామృతమగు అర్థము సాక్షాత్తుగా నేనే. అమృతములగు ఈ రెండింటికీ వియోగము ఎట్లు సంభవమగును? (16) నా స్వరూపజ్ఞానమును కలిగించే మనోవృత్తి నీవే. అఖండార్థబోధను కలిగించే నీ స్వరూపమగు వృత్తిచే తెలియబడే తత్త్వము నేనే. ఈవిధముగా జ్ఞానజ్ఞేయరూపములలో నుండే మన యిద్దరి వియోగము ఎట్లు సంభవము? (17) నేను కేవలము నా ప్రయత్నముచే మాత్రమే ఈ జగత్తును సృష్టించి నశింప జేయుట లేదు. సర్వము ఆజ్ఞచే మాత్రమే లభించుచున్నది. అట్టి సర్వోత్కృష్టమగు ఆజ్ఞ నీవే (18).
ఆజ్ఞైకసారమైశ్వర్యం యస్మాత్స్వాతంత్ర్యలక్షణమ్ | ఆజ్ఞయా విప్రయుక్తస్య చైశ్వర్యం మమ కీదృశమ్ || 19
న కదాచిదవస్థానమావ యోర్విప్రయక్తయోః | దేవానాం కార్యముద్దిశ్య లీలోక్తిం కృతవానహమ్ || 20
త్వయాప్యవిదితం నాస్తి కథం కుపితవత్యసి | తతస్త్రి లోకరక్షార్థే కోపో మయ్యపి తే కృతః || 21
యదనర్థాయ భూతానాం న తదస్తి ఖలు త్వయి | ఇతి ప్రియంవదే సాక్షాదీశ్వరే పరమేశ్వరే || 22
శృంగారభావసారాణాం జన్మభూమిరకృత్రిమా | స్వభర్తా లలితం తథ్యముక్తం మత్వా స్మితోత్తరమ్ || 23
లజ్జయా న కిమప్యూచే కౌశికీ వర్ణనాత్పరమ్ | తదేవ వర్ణయామ్యద్య శృణు దేవ్యాశ్చ వర్ణనమ్ || 24
ఈశ్వరత్వము, యొక్క సారభూతమైన తత్త్వము ఆజ్ఞయే. ఏలయనగా, స్వాతంత్ర్యము యొక్క లక్షణము అదియే. ఆజ్ఞతో వియోగము కలిగినచో, నాఈశ్వరత్వము ఏపాటిది? (19)మనిద్దరి మధ్యలో వియోగము ఎప్పటికైననూ జరిగేది కాదు. దేవతల కార్యమునుద్దేశించి నేను పరిహాసవచనమును పలికితిని (20). నీకు కూడ తెలియనిది లేదు. నీకు కోపము ఎట్లు వచ్చినది? నీవు కూడ మూడు లోకముల రక్షణ కొరకు మాత్రమే నాపై కోపించితివి (21). ప్రాణులకు హానిని కలిగించేది ఏదైనా అది నీయందు లేదు. ఈ విధముగా పరమేశ్వరుడగు శివుడే సాక్షాత్తుగా ప్రియవచనములను పలుకుచుండగా (22), సారభూతమైన శృంగారభావములకు అతిసహజమగు జన్మస్థానమైన ఆ దేవి తన భర్త సత్యమును మధురముగా పలికినాడని తలపోసి చిరునవ్వు నవ్వి, కౌశికిని వర్ణించుటను మినహాయించి సిగ్గుతో ఇతరమగు సమాధానమును చెప్పలేదు. దేవి చేసిన ఆ వర్ణనమునే నేను కూడ చెప్పెదను. వినుము (23, 24).
దేవ్యువాచ |
కిం దేవేన న సా దృష్టా యా సృష్టా కౌశికీ మయా | తాదృశీ కన్యకా లోకే న భూతా న భవిష్యతి || 25
తస్యా వీర్యం బలం వింధ్యనిలయం విజయం తథా | శుంభస్య చ నిశుంభస్య మారణ చ రణ తయోః || 26
ప్రత్యక్షఫలదానం చ లోకాయ భజతే సదా | లోకానాం రక్షణం శశ్వద్ర్బ హ్మా విజ్ఞాపయిష్యతి || 27
ఇతి సంభాషమాణాయా దేవ్యా ఏవాజ్ఞయా తదా | వ్యాఘ్రస్సఖ్యా సమానీయ పురో%వస్థాపితస్తదా || 28
తం ప్రేక్ష్యాహ పునర్దేవీ దేవానీతముపాయనమ్ | వ్యాఘ్రం పశ్యన చానేన సదృశో మదుపాసకః || 29
అనేన దుష్టసంఘేభ్యో రక్షితం మత్తపోవనమ్ | అతీవ మమ భక్తశ్చ విశ్రబ్ధశ్చ స్వరక్షణాత్ || 30
స్వదేశం చ పరిత్యజ్య ప్రసాదార్థం సమాగతః | యది ప్రీతిరభూన్మత్తః పరాం ప్రీతిం కరోషి మే || 31
నిత్యమంతఃపురద్వారి నియోగాన్నందినస్స్వయమ్ | రక్షిభిస్సహ తచ్చిహ్నైర్వర్తతామయమీశ్వర || 32
దేవి ఇట్లు పలికెను -
నేను సృష్టించిన కౌశికి దేవునిచే (నీచే) చూడబడినదా యేమి? లోకములో అట్టి కన్య ఇంతవరకు పుట్టిలేదు; ఈ పైన పుట్టబోదు (25). వింధ్యపర్వతమునందు శుంభనిశుంభులతోటి యుద్ధమునందు ఆమె ప్రదర్శించిన బలపరాక్రమములను, ఆమె వారిని సంహరించి విజయమును పొందిన విధమును (26), ఆమెను సేవించు జనులకు ఆమె ప్రత్యక్షఫలమునిచ్చు విషయమును, ఆమె లోకములను రక్షించే విషయమును గురించి బ్రహ్మ మీకు నిశ్చయముగా చెప్పగలడు (27). ఈ విధముగా సంభాషించుచున్న ఆ దేవి ఆజ్ఞాపించగా, అపుడు చెలికత్తె పెద్దపులిని తీసుకువచ్చి యెదుట నిలిపెను (18). దానిని చూచి దేవి మరల ఇట్లు చెప్పెను: దేవా! నేను ఒక బహుమానమును తెచ్చితిని. ఈ పెద్దపులిని చూడుడు.నన్ను ఉపాసించు వారిలో దీనితో సమానమైన వారు లేరు (29). ఇది నా తపోవనమును దుష్టమృగముల సముదాయమునుండి రక్షించినది. దీనికి నాయందు భక్తి మెండు. నన్ను రక్షించిన ఈ పులి నమ్మదగినది (30). ఇది తాను పుట్టిన స్థానమును విడిచిపెట్టి నీ అనుగ్రహము కొరకై వచ్చినది. ఓ ఈశ్వరా! నీకు నా వలన ప్రీతి కలిగినచో, నీకు నాపై ప్రేమ ఉన్నచో, ఇది నందీశ్వరుని ఆజ్ఞచే రక్షకభటుల గుర్తులను దాల్చి వారితో కలిసి నిత్యము అంతఃపురద్వారము వద్ద స్వయముగా నిలబడు గాక! (31, 32).
వాయురువాచ |
మధురం ప్రణయోదర్కం శ్రుత్వా దేవ్యాశ్శుభం వచః | ప్రీతో%స్మీత్యాహ తం దేవస్స చాదృశ్యత తత్ క్షణాత్ || 33
బిభ్రద్వేత్రలతాం హైమీం రత్నచిత్రం చ కంచుకమ్ | ఛురికామురగప్రఖ్యాం గణశో రక్షవేషధృక్ || 34
యస్మాత్సోమో మహాదేవో నందీ చానేన నందితః | సోమనందీతి విఖ్యాతస్తస్మాదేష సమాఖ్యయా || 35
ఇత్థం దేవ్యాః ప్రియం కృత్వా దేవశ్చార్థేందుభూషణః | భూషయామాస తం దివ్యైర్భూషణౖ రత్న భూషితైః || 36
తతస్స గౌరీం గిరిశో గిరీంద్రజాం సగౌరవం సర్వమనోహరాం హరః |
పర్యంకమారోప్య వరాంగభూషణౖర్విభూషయామాస శశాంకభూషణః || 37
ఇత శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే శివపార్వతీ పునస్సమాగమవర్ణనం నామ సప్తవింశో%ధ్యాయః (27).
వాయువు ఇట్లు పలికెను -
మధురమైనది, ప్రేమను వర్థిల్ల జేయునది, శుభకరమైనదిఅగు దేవియొక్క వచనమును విని ఆ శివుడు ఆ పెద్ద పులిని ఉద్దేశించి, నేను సంతసించితిని అని పలికెను. వెను వెంటనే దాని రూపములో మార్పు కానవచ్చెను (33). అది బంగరు బెత్తమును చేతబట్టెను. రత్నములతో రంగురంగుల కాంతులను విరజిమ్మే అంగీని ధరించెను. అది గణాధ్యక్షుడై రక్షకుని వేషమును ధరించి పాము వలె ప్రకాశించే కత్తిని చేత బట్టెను (34). అది పార్వతీసమేతుడగు మహాదేవునకు మరియు నందీశ్వరునకు ప్రీతిని కలిగించినది గనుక, అది సోమనంది అను పేరుతో ప్రసిద్ధిని గాంచెను (35). చంద్రవంకను శిరోభూషణము గా ధరించే శివుడు ఈ విధముగా దేవికి ప్రీతిని కలిగించి, దివ్యములగు రత్నాలంకారములతో ఆ సోమనందిని అలంకరించెను (36). తరువాత కైలాసపర్వతముపై నివసించువాడు, చంద్రవంకను అలంకరించుకున్నవాడు అగు హరుడు జగదేకసుందరి, పర్వతారాజపుత్రిక అగు గౌరిని సగౌరవముగా తల్పముపై కూర్చుండబెట్టి శ్రేష్ఠమగు ఆభరణములతో అలంకరించెను (37).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండములో శివపార్వతుల పునస్సమాగమమును వర్ణించే ఇరువది యేడవ అధ్యాయము ముగిసినది (27).