Siva Maha Puranam-4
Chapters
అథ ఏకత్రింశోధ్యాయః వాయుకృత జ్ఞానోపదేశము వాయురువాచ | స్థానే సంశయితం విప్రా భవద్చిర్హేతుచోదితైః | జిజ్ఞసా హి న నాస్తిక్యం సాధయేత్సాధుబుద్ధిషు ||
1 ప్రమాణమత్ర వక్ష్యామి సతాం మోహనివర్తకమ్ | అసతాం త్వన్యథాభావః ప్రసాదేన వినా ప్రభోః || 2 శివస్య పరిపూర్ణస్య పరానుగ్రహమంతరా | న కించదపి కర్తవ్యమితి సాధు వినిశ్చితమ్ || 3 స్వభావ ఏవ పర్యాప్తః పరానుగ్రహకర్మణి | అన్యథా నిస్స్వభావేన న కిమప్యనుగృహ్యతే || 4 పరం సర్వమనుగ్రాహ్యం పశుపాశాత్మకం జగత్ | పరస్యానుగ్రహార్థం తు పత్యురాజ్ఞాసమన్వయః || 5 పతిరాజ్ఞాపకస్సర్వమనుగృహ్ణాతి సర్వదా | తదర్థమర్థస్వీకారే పరతంత్రః కథం శివః || 6 అనుగ్రాహ్యనపేక్షో%స్తి న హి కశ్చిదనుగ్రహః | అతస్స్వాతంత్ర్యశబ్దార్థానన పేక్షత్వలక్షణః || 7 ఏతత్పునరనుగ్రాహ్యం పరతంత్రం తదిష్యతే | అనుగ్రహాదృతే తస్య భుక్తి ముక్త్యోరనన్వయాత్ || 8 మూర్త్యాత్మనో%ప్యనుగ్రాహ్యా శివాజ్ఞాన నివర్తనాత్ | ఆజ్ఞా నాధిష్ఠితం శంభోర్న కించిదిహ విద్యతే || 9 యేనోపలభ్యతే%స్మాభిస్సకలేనాపి నిష్కలః | సమూర్త్యాత్మా శివశ్శైవమూర్తిరిత్యుపచర్యతే || 10 వాయువు ఇట్లు పలికెను- ఓ బ్రాహ్మణులారా! విమర్శాత్మకమగు దృష్టిచే ప్రేరేపించ బడినవారై మీరు వెలిబుచ్చిన సందేహము యోగ్యముగా నున్నది. సద్బుద్ధి గలవారియందు ఉండే తెలియాలనే కోరిక నాస్తికతకు నిదర్శనము కాబోదు (1). ఈ విషయములో సత్పురుషుల అజ్ఞానమును నివారించే జ్ఞానసాధనమును చెప్పెదను. పరమేశ్వరుని అనుగ్రహము లేకపోవుటచేతనే దుష్టులయందు అయోగ్యమగు ప్రవృత్తి కలుగుచున్నది (2). పరిపూర్ణుడగు శివుని గొప్ప అనుగ్రహము లేనిదే ఎవ్వరైననూ దేనినైననూ చేయజాలరని చక్కగా నిర్ధారించ బడినది (3). శివుడు జగత్తు (పరము) పై పూర్ణమగు అనుగ్రహమును చూపించే కర్మయందు మాయోపాధి సమర్థమగుచున్నది. అట్లు గానిచో, అనగా మాయాసంబంధము లేనిచో నిర్గుణ పరంబ్రహ్మము దేనినైననూ అనుగ్రహించుట పొసగదు (4). జీవులు, వారి బంధములతో కూడియుండే జగత్తు పరము (అన్యము) అనబడును. దీనిని పరమేశ్వరుడు అనుగ్రహించ వలసి యున్నది. ఈ విధముగా జగత్తును అనుగ్రహించుట కొరకై ఆ ప్రభునకు దేవి (ఆజ్ఞా) తో సంబంధము ఆవశ్యకమగుచున్నది (5). ఆజ్ఞయే స్వభావముగా గల ఆ ప్రభుడు సర్వజగత్తును సర్వకాలములలో అనుగ్రహించును. దాని కొరకై ఆజ్ఞ అనే అర్థము (శక్తి)ను స్వీకరించుటలో శివుడు అస్వతంత్రుడు ఎట్లు అగును? (6) అనుగ్రహించే వాని అపేక్ష లేని అనుగ్రహమేదియూ లేదు. కావున, స్వాతంత్ర్యము అనే శబ్దముయొక్క అర్ధముతో అపేక్ష లేకుండుట అనుగ్రహముయొక్క లక్షణము అగుచున్నది (7). ఈ జీవునకు పరమేశ్వరుని అనుగ్రహము లేనిదే భుక్తి గాని, ముక్తి గాని సిద్ధించదు. కావున, అనుగ్రహమును నిశ్చితముగా అపేక్షించే ఈ జగత్తు పరతంత్రము (అన్యముపై ఆధారపడునది) అని చెప్పబడుచున్నది (8). శివుని సగుణరూపములు కూడ శివుని ఆజ్ఞయొక్క పరిధిలోని వారే గనుక, వారు కూడ అనుగ్రహింప దగిన వారే. ఈ జగత్తులో శివుని ఆజ్ఞయొక్క పరిధిలోనికి రానిది ఏదీ లేదు (9). సాకారుడగు శివును పూజించియు మనము నిర్గుణశివతత్త్వమును పొందుచున్నాము. అట్టి సగుణరూపములో నున్న శివుడు శైవమూర్తి (శివునికి సంబంధించిన మూర్తి) అనే గౌణ (శివునకు మూర్తికి భేదము లేకున్ననూ భేదమును సూచించే) ప్రయోగముతో వ్యవహరించుచున్నాము (10). న హ్యసౌ నిష్కలస్సాక్షాచ్ఛివః పరమకారణమ్ | సాకారేణానుభావేన కేనాప్యనుపలక్షితః || 11 ప్రమాణాగమ్యతామాత్రం తత్స్వభావోపపాదకమ్ | న తావతాత్రోపేక్షాధీరుపలక్షణమంతరా || 12 ఆత్మోపమోల్బణం సాక్షాన్మూర్తిరేవ హి కాచన | శివస్య మూర్తిమూర్త్యాత్మా పరస్తస్యోపలక్షణమ్ || 13 యథా కాష్టేస్వనారూఢో న వహ్నిపరుపలభ్యతే | ఏవం శివో%పి మూర్యాత్మన్యనారూఢ ఇతి స్థితిః || 14 యథాగ్నిమానయేత్యుక్తే జ్వలత్కాష్ఠాదృతే స్వయమ్ | నాగ్నిరానీయతే తద్వత్పూజ్యో మూర్త్యాత్మనా శివః || 15 అత ఏవ హి పూజాదౌ మూర్త్యాత్మపరికల్పనమ్ | మూర్త్యాత్మని కృతం సాక్షాచ్ఛివ ఏవ కృతం యతః || 16 లింగాదావపి తత్కృత్యమర్చాయాం చ విశేషతః తత్తన్మూర్త్యాత్మభావేన శివో%స్మాభిరుపాస్యతే || 17 యథానుగృహ్యతే సో%పి మూర్త్యాత్మా పారమేష్ఠినా | తథా మూర్త్యాత్మనిష్ఠేన శివేన పశవో వయమ్ || 18 లోకానుగ్రహణాయైవ శివేన పరమేష్ఠినా | సదాశివాదయస్సర్వే మూర్త్యాత్మానో%ప్యధిష్ఠితాః || 19 ఆత్మనామేవ భోగాయ మోక్షయ చ విశేషతః | తత్త్వాతత్త్వస్వరూపేషు మూర్త్యాత్మసు శివాన్వయః || 20 సర్వకారణకారణుడగు ఈ శివుడు ఏ రకమైన సాకారమగు అనుభూతిచేనైననూ తెలియ శక్యము కాని కేవలనిర్గుణస్వరూపుడు కాదు (11). శివుని స్వరూపము ప్రత్యక్షాదిప్రమాణములకు ఉపలభ్యము కాదు అని మాత్రమే తాత్పర్యము.. అంత మాత్రముచే శివుని సగుణరూపమును ఉపేక్షించుటయందు తాత్పర్యము లేదు. శివుని సగుణరూపము నిర్గుణపరంబ్రహ్మకు ఉపలక్షకము అని చెప్పుట తప్ప మరియొకటి కాదు (12). తన స్వరూపముతో చాల దగ్గర పోలిక గల ఏదో ఒక మూర్తి మాత్రమే సాక్షాత్తుగా శివుని మూర్తి అగుచున్నది. ఆనగా ఆ పరబ్రహ్మయే మూర్తి రూపములో నున్నాడు. మూర్తి పరబ్రహ్మకు ఉపలక్షకము (దగ్గరగా చూపించేది) అగును (13). కట్టెను ఆశ్రయించ కుండగా నిప్పు మనకు లభించుట లేదు. అదే విధముగా ఒక మూర్తిని అధిష్ఠించకుండగా శివుడు కూడ మనకు లభించుట లేదు. వస్తుస్థితి అట్లున్నది (14). నిప్పును తీసుకు రమ్ము అని చెప్పినచో, మండే పుల్లను కాకుండగా సాక్షాత్తుగా అగ్నిని మాత్రమే తీసుకు వచ్చుట సంభవము కాదు. అదే విధముగా శివుని మూర్తి రూపములో పూజించ వలెను (15). ఈ కారణము చేతనే పూజ మొదలగు వాటియందు సగుణరూపము కల్పించ బడుచున్నది. ఏలయనగా, సగుణరూపమునకు పూజను చేసినచో, అది శివునకు చేసిన పూజయే యగుచున్నది (16). కావున, లింగము మొదలగు వాటిని మాత్రమే గాక, అర్చామూర్తులను కూడ విశేషముగా పూజించ వలెను. మనము శివుని అయా మూర్తుల రూపములో ఉపాసించు చున్నాము (17). నిర్గుణపరంబ్రహ్మ సగుణసాకారరూపమును అనుగ్రహించు విధముగానే, అదే విధముగా సగుణరూపమునందు పరినిష్ఠితుడై యున్న శివుడు అజ్ఞానులమగు మనలను అనుగ్రహించును (18). పరంబ్రహ్మయగు శివుడు లోకములను అనుగ్రహించుట కొరకు మాత్రమే సదాశివుడు మొదలగు మూర్తిరూపములను అన్నింటినీ అధిష్ఠించి యున్నాడు (19). శివుడు భోగమోక్షముల కొరకై క్రమముగా సగుణ నిర్గుణ రూపములలో భేదమును కల్పించి తనను ప్రకటించినాడు. సగుణరూపములలో ఆ శివుడు అనువృత్తుడగుచున్నాడు (20). భోగః కర్మవిపాకాత్మా సుఖదుఃఖాత్మకో మతః | న చ కర్మ శివే%స్తీతి తస్య భోగః కిమాత్మకః || 21 సర్వం శివో%నుగృహ్ణాతి న నిగృహ్ణాతి కించన | నిగృహ్ణతాం తు యే దోషాశ్శివే తేషామసంభవాత్ || 22 యే పునర్నిగ్రహాః కేచిద్ర్బహ్మాదిషు నిదర్శితాః | తే%పి లొకహితాయైవ కృతాః శ్రీకంఠమూర్తినా || 23 బ్రహ్మాండస్యాధిపత్యం హి శ్రీకంఠస్య న సంశయః | శ్రీకంఠాఖ్యాం శివో మూర్తిం క్రీడతీమధితిష్ఠతి || 24 సదోషా ఏవ దేవాద్యా నిగృహీతా యథోదితమ్ | తతస్తేపి విపాప్మానః ప్రజాశ్చాపి గతజ్వరాః || 25 నిగ్రహో%పి స్వరూపేణ విదుషాం న జుగుప్సితః | అత ఏవ హి దండ్యేషు దండో రాజ్ఞాం ప్రశస్యతే || 26 యత్సిద్ధిరీశ్వరత్వేన కార్యవర్గస్య కృత్స్నశః | న స చేదీశతాం కుర్యాజ్జగతః కథమీశ్వరః || 27 ఈశేచ్ఛా చ విధాతృత్వం విధేరాజ్ఞాపనం పరమ్ | ఆజ్ఞావశ్యమిదం కుర్యాన్న కుర్యాదితి శాసనమ్ || 28 తచ్ఛాసనానువర్తిత్వం సాధుభావస్య లక్షణమ్ | విపరీతమసాధోస్స్యాన్న సర్వం తత్తు దృశ్యతే || 29 సాధు సంరక్షణీయం చేద్వినివర్త్యమసాధు యత్ | నివర్తతే చ సామాదేరంతే దండో హి సాధనమ్ || 30 భోగము కర్మఫలము పరిపక్వమై లభించే సుఖదుఃఖముల రూపములో నుండును. కాని శివునియందు కర్మ లేదు. కావున, ఆయనకు భోగమనగా నేమి? (21) శివుడు సర్వులను అనుగ్రహించును; ఎవ్వరినైననూ శిక్షించడు. ఏలయనగా, శిక్షించే వారిలో ఉండే దోషములేమియు శివునిలో లేవు (22). కాని, బ్రహ్మమొదలగు వారి విషయములో కొన్ని సందర్భములలో శివుడు శిక్షించి యున్నాడు. విషమును కంఠమునందు ధరించే శివుడు వాటిని లోకముల హితము కొరకు మాత్రమే చేసినాడు (23). బ్రహ్మాండముయొక్క అధిపత్యము కాలకంఠునిదే యనుటలో సందేహము లేదు. ఆ శివుడు లీల కొరకై కాలకంఠుడు అనే మూర్తిని ధరించి యున్నాడు (24). దోషము గల దేవతలు మొదలగు వారు మాత్రమే శిక్షించ బడినారని పూర్వములో చెప్పడమైనది. అట్లు చెయుట వలన వారికి పాపములు తొలగి పోవుట మాత్రమే గాక, ప్రజలకు పీడతొలగును (25). శిక్షించుటయైననూ స్వరూపముచే నిందావిషయము కాదని పండితులు చెప్పుచున్నారు. కావుననే, శిక్షార్హులకు రాజులు విధించే శిక్షలు కొనియాడ బడుచున్నవి (26). ఈ సకలకార్యజగత్తు ఈశ్వరుని అధ్యక్షతచే మాత్రమే స్థితిని కలిగియున్నది. జగత్తులోని జీవులను నియంత్రించనిచో, ఆయన ఈశ్వరుడు ఎట్లు అగును? (27) ఈశ్వరుని సంకల్పము మాత్రమే సృష్టికర్తయొక్క సృష్టి కార్యమునకు ఆధారము. ఆయనయొక్క ఉల్లంఘింప శక్యము కాని ఆజ్ఞ చేతనే ఈ సృష్టి జరుగుచున్నది. ఈ జగత్తు శివుని ఆజ్ఞకు లోబడి యున్నది. ఇట్లు చేయవలెను, ఇట్లు చేయరాదు అనే విధినిషేధముల రూపములో శివుని శాసనము గలదు (28). ఆ శాసనమునకు అనురూపముగా నడుచు కొనుట మంచివారి లక్షణము. దానికి విరుద్ధముగా నడచుట చెడ్డతనము అగును. కాని, సర్వులు సాధుభావమును కలిగియుండుట లేదు (29). సాధుత్వమును సంరక్షించుటకై అసాధుత్వమును నివారించ వలెను. అసాధుత్వము సామదానభేదోపాయములచే తొలగి పోనిచో, దండము మాత్రమే సాధనమగును (30). హితార్థలక్షణం చేదం దండాంతమనుశాసనమ్ | అతో యద్విపరీతం తదహితం సంప్రచక్షతే || 31 హితే సదా నిషణ్ణానామీశ్వరస్య నిదర్శనమ్ | స కథం దుష్యతే సద్భిరసతామేవ నిగ్రహాత్ || 32 అయుక్తకారిణో లోకే గర్హణీయావివేకితా | యదుద్వేజయతే లోకం తదయుక్తం ప్రచక్షతే || 33 సర్వో%పి నిగ్రహో లోకే న చ విద్వేషపూర్వకః | న హి ద్వేష్టి పితా పుత్రం యో నిగృహ్యాతి శిక్షయేత్ || 34 మాధ్యస్థేనాపి నిగ్రాహ్యాన్యో నిగృహ్ణాతి మార్గతః | తస్యాప్యవశ్యం యత్కించిన్నైర్ఘృణ్యమనువర్తతే || 35 అన్యథా న హినస్త్యేవ సదోషానప్యసౌ పరాన్ | హినస్తి చాయమప్యజ్ఞాన్ పరం మాధ్యస్థ్యమాచరన్ || 36 తస్మాద్దుఃఖాత్మికాం హింసాం కుర్వాణో యస్స నిర్ఘృణః | ఇతి నిర్బంధయంత్యేకే నియమో నేతి చాపరే || 37 నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజతః | న కించిదపి నైర్ఘృణ్యం ఘృణౖవాత్ర ప్రయోజికా || 38 ఘృణాపి న గుణాయైవ హింస్రేషు ప్రతియోగిషు | తాదృశేషు ఘృణీ భ్రాంత్యా ఘృణాంతరితనిర్ఘృణః || 39 ఉపేక్షాపీహ దోషాయ రక్ష్యేషు ప్రతియోగిషు | శక్తౌ సత్యాముపేక్షాతో రక్ష్యస్సద్యో విపద్యతే || 40 దండము వరకు గల ఈ అనుశాసనము వ్యక్తియొక్క హితము కొరకు ప్రవర్తిల్లు చున్నది. దీనికి విరుద్ధముగా నేరమును చేసిన వానిని శిక్షించనిచో, అది వానికి అపకారమే యగును (31). సర్వకాలములలో హితమును కోరువారికి ఈశ్వరుడే నిదర్శనమగుచున్నాడు. సత్పురుషులు ఈశ్వరుని ఏల నిందింతురు? ఈశ్వరుడు దుష్టులను మాత్రమే శిక్షించును (32). లోకములో అయోగ్యమగు పనిని చేయువాని అవివేకము నిందించ దగినది. ఏ పని చేసినచో జనులకు ఉద్వేగము కలుగునో, అది అయోగ్యమగు పని అని పెద్దలు చెప్పుచున్నారు (33). లోకములో శిక్ష వేసిన సందర్భములన్నింటిలో అది ద్వేషపూర్వకముగా వేసిన శిక్ష కాదు. తండ్రి కొడుకును శాసించి విద్యను గరపును. అట్టి తండ్రికి వానిపై ద్వేషము ఉండదు (34). తాను కేవలము మధ్యస్థునిగా మాత్రమే ఉంటూ శిక్షార్హులకు శిక్షను శాస్త్ర మార్గము ననుసరించి విధించే వ్యక్తి యందు కూడ ఏదో కొంత కాఠిన్యము తప్పక ఉండి తీరును (35). అటుల గానిచో, ఆ పరమేశ్వరుడ దోషులైననూ ఇతరులగు జీవులను హింసకు గురి చేయజాలడు. కాని, ఆయన తాను ఖచ్చితముగా అసంగుడుగా నుండి అజ్ఞానులను శిక్షించు చున్నాడు (36). దుఃఖరూపమగు హింసను చేయు వ్యక్తి నిర్దయుడే నని కొందరు గట్టిగా వాదించు చున్నారు. కాని, అట్టి నియమము లేదని కొందరు చెప్పుచున్నారు (37). రోగియొక్క రోగమును గుర్తించి, వానిపై శస్త్ర చికిత్స మొదలైన హింసను చేసే వైద్యునియందు నిర్దయ లేశ##మైననూ లేదు. ఆతడు చేయు హింసకు ప్రేరణ దయయే యగుచున్నది (38). హింసను ఆచరించే శత్రువుల విషయములో దయను చూపుట మంచిది కానే కాదు. వారియందు భ్రాంతిచే చూపబడే దయ కూడ ఆ రూపములో నున్న నిర్దయయే యగును (39). రక్షింప దగిన శత్రువులనైననూ ఉపేక్షించినచో, అది దోషమే యగును. శక్తి ఉండి కూడా రక్షింప దగిన వానిని ఉపేక్షించినచో, ఆతడు వెను వెంటనే ఆపదకులోనగును (40). సర్పస్యా%%స్యగతం పశ్యన్ యస్తు రక్ష్యముపేక్షతే | దోషాభాసాన్ సముత్ర్పేక్ష్య ఫలతస్సో%పి నిర్ఘృణః || 41 తస్మాద్ఘృణా గుణాయైవ సర్వథేతి న సంమతమ్ | సంమతం ప్రాప్తకారిత్వం సర్వం త్వన్యదసంమతమ్ || 42 మూర్త్యాత్మస్వపి రాగాద్యా దోషాస్సంత్యేవ వస్తుతః | తథాపి తేషామేవైతే న శివస్య తు సర్వథా| అగ్నావపి సమావిష్టం తామ్రం ఖలు సకాలికమ్ || 43 ఇతి నాగ్నిరసౌ దుష్యేత్తాతమ్రసంసర్గకారణాత్ | నాగ్నేరశుచిసంసర్గాదశుచిత్వమపేక్షతే || 44 అశుచేస్త్వగ్నిసంయోగాచ్ఛుచిత్వమపి జాయతే | ఏవం శోధ్యాత్మసంసర్గాన్న హ్యశుద్ధశ్శినో భ##వేత్ || 45 శివసంసర్గతసై#్వష శోధ్యాత్మైవ హి శుధ్యతి | అయస్యగ్నౌ సమావిష్టే దాహో%గ్నేరేవ నాయసః || 46 మూర్తాత్మన్యేవమైశ్వర్యమీశ్వరసై#్యవ నాత్మనామ్ | న హి కాష్టం జ్వలత్యూర్ధ్వమగ్నిరేవ జ్వలత్యసౌ || 47 కాష్ఠస్యాంగారతా నాగ్నేరేవమత్రాపి యోజ్యతామ్ | అత ఏవ జగత్యస్మిన్ కాష్టపాషాణమృత్స్వపి || 48 శివావేశవశాదేవ శివత్వముపచర్యతే | మైత్ర్యాదయో గుణా గౌణాస్తస్మాత్తే భిన్నవృత్తయః || 49 తైర్గుణౖరుపరక్తానాం దోషాయ చ గుణాయ చ | యత్తు గౌణమగౌణం చ తత్సర్వమనుగృహ్ణతః | న గుణాయ న దోషాయ శివస్య గుణవృత్తయః || 50 పాము నోటిలో పడబోతూ ఉన్న రక్షించుటకు అర్హుడైన వ్యక్తిని చూస్తూ, ఆతని యందు కానవచ్చిన దోషములను అధికముగా ఊహించుకొని ఎవడైతే ఉపేక్షించునో, వాడు కూడ దాని ఫలరూపముగా నిర్దయుడే అగుచున్నాడు (41). కావున, సకల పరిస్థితులలో దయమంచియే అను మాట అంగీకారము కాదు. సందర్భమును బట్టి దయను చూపవలెనను మాట అంగీకారమే. అంతకు మించి చెప్పినా, అది అంగీకారము కాదు (42). వాస్తవములో పరమేశ్వరుని సగుణరూపములయందు కూడ రాగము మొదలగు దోషములు నిశ్చితముగా నున్నవి. అయిననూ, ఆ దోషములు ఆ మూర్తులకు మాత్రమే చెందును గాని, ఏ విధముగా నైననూ శివునకు అంటవు. అగ్నియందు కాల్చబడే రాగిలో కల్తీ ఉండవచ్చును (43). అట్లు కల్తీ రాగితో కలిసిన కారణముగా ఈ అగ్నికి దోషము అంటదు. అపవిత్రములగు పదార్థముల తోడి కలయిక వలన అగ్ని అపవిత్రము కాదు (44). పైగా, ఆ అపవిత్రపదార్థమే అగ్నితోడి కలయిక వలన పవిత్రమగును. ఇదే విధముగా పవిత్రము చేయదగిన ఆత్మ తోడి కలయికచే శివుడు అపవిత్రుడు కాబోడు (45). ఈ పవిత్రము చేయదగిన ఆత్మయే శివునితో కలయిక వలన పవిత్రమగును. నిప్పులో కాలిన ఇనుప గుండు పదార్థములను కాల్చును. కాని, ఆ దాహకశక్తి నిప్పుదే కాని, ఇనుముది కాదు (46). ఇదే విధముగా సగుణమూర్తులయందు ఉండే ఐశ్వర్యము ఈశ్వరునిదే గాని, ఆయా ఆత్మలది కాదు. పైకి జ్వాలలను చిమ్ముతూ మండేది కట్టెకాదు. అగ్నియే అట్లు మండుచున్నది (47). కాని, నల్లని బొగ్గు కట్టెది మాత్రమే. అది అగ్నికి చెందినది కాదు. ప్రస్తుతములో కూడ వస్తుస్థితిని అటులనే తెలియవలెను. ఇందు వలననే, ఈ జగత్తులో కట్టె, రాయి, మట్టి అనువాటియందు కూడ (48). శివుడు ఆవేశించి యుండుట చేతనే వాటి యందు శివుడు గౌణ (అప్రధాన) వృత్తిచే భావన చేయబడు చున్నాడు. మైత్రి (స్నేహభావము) మొదలైన గుణములు సత్త్వరజస్తమోగుణాత్మకమగు అంతఃకరణముయొక్క ధర్మములు మాత్రమే. కావుననే, అవి విభిన్నసమయములలో విభిన్నముగా వ్యక్తమగుచుండును (49). ఆయా గుణములచే సంసర్గమును పొంది వాటిచే ప్రభావితులైన వారికి వాటి గుణదోషములు సంక్రమించును. త్రిగుణాత్మకమగు ప్రకృతి కార్యములను గాని, వాటియందు చైతన్యము అభివ్యక్తమై సంప్రాప్తించే జీవులను గాని, ఈ సర్వమును అనుగ్రహించే శివునకు ఈ సత్త్వరజస్తమోగుణముల వ్యాపారములు గుణమును గాని, దోషమును గాని కలిగించవు (50). న చానుగ్రహశబ్దార్థం గౌణమహుర్విపశ్చితః | సంసారమోచనం కిం తు శైవమాజ్ఞామయం హితమ్ || 51 హితం తదాజ్ఞాకరణం యద్ధితం తదనుగ్రహః | సర్వం హితే నియుంజానస్సర్వానుగ్రహకారకః || 52 యస్తూపకారశబ్దార్థస్తమప్యాహురనుగ్రహమ్ | తస్యాపి హితరూపత్వాచ్ఛివస్సర్వోపకారకః || 53 హితే సదా నియుక్తం తు సర్వం చిదచిదాత్మకమ్ | స్వభావప్రతిబంధం తత్సమం న లభ##తే హితమ్ || 54 యథ వికాసయత్యేవ రవిః పద్మాని భానుభిః | సమం న వికసంత్యేవ స్వస్వభావానురోధతః || 55 స్వభావో%పి హి భావానాం భావినో%ర్థస్య కారణమ్ | న హి స్వభావో నశ్యంతమర్థం కర్తృషు సాధయేత్ || 56 సువర్ణమేవ నాంగారం ద్రావయత్యగ్నిసంగమః | ఏవం పక్వమలానేవ మోచయేన్న శివః పరాన్ || 57 యద్యథా భావితుం యోగ్యం తత్తథా న భ##వేత్స్వయమ్ | వినా భావనయా కర్తా స్వతంత్రస్సంతతో భ##వేత్ || 58 స్వభావవిమలో యద్వత్సర్వానుగ్రాహకశ్శివః | స్వభావమలినాస్తద్వదాత్మానో జీవసంజ్ఞితాః || 59 అన్యథా సంసరంత్యేతే నియమాన్న శివః కథమ్ | కర్మమాయానుబంధోస్య సంసారః కథ్యతే బుధైః || 60 అనుగ్రహము అనే శబ్దమునకు చెప్పబడే అర్థము ముఖ్యార్థమే గాని, గౌణము (అప్రధానము) కాదని పండితులు చెప్పుచున్నారు. కాని, శివుని ఆజ్ఞను పాలించుటచే సంసారవిముక్తి అనే హితము కలుగును (51). శివుని ఆజ్ఞను పాలించుటయే హితము. ఏది హితమో, అదియే అనుగ్రహము. సర్వులను హితమునందు నియోగించే శివుడు సర్వులకు అనుగ్రహమును చేయుచున్నాడు (52). ఉపకారము అనే శబ్దమునకు అర్థము కూడ అనుగ్రహమే అని పండితులు చెప్పుచున్నారు. ఉపకారము కూడ హితరూపములోననే యుండును. కావున, శివుడు సర్వులకు ఉపకారమును చేయువాడు (53). జడచేతనాత్మకమగు ఈ ప్రపంచమంతయు సర్వకాలములలో హితమునందు నియోగించబడి యున్నది. కాని, వ్యక్తుల స్వభావము ఆటంకమగుటచే అందరికీ సమానమగు హితము లభించుట లేదు (54). అది యెట్లనగా, సూర్యుడు తన కిరణములతో పద్మములను ప్రకాశింప జేయుచున్నాడు. కాని పద్మములన్నియు తమ తమ స్వభావమునకు అనురూపముగా వికసించునే గాని, అన్నీ సమానముగా వికసించుట లేదు (55). జీవుల స్వభావము కూడా వారికి భవిష్యత్తులో లభించ బోయే స్థితికి కారణమగును. కాని, కర్మలను చేయు జీవులకు నశించి పోవుచున్న పదార్థమును స్వభావము సంపాదించి పెట్టలేదు (56). అగ్నితో కలిసినప్పుడు కరిగేది బంగారమే గాని బొగ్గు కాదు. అదే విధముగా శివుడు పక్వమైన, అనగా రాలిపోయిన దోషములు గల జీవులకు మాత్రమే మోక్షమునిచ్చును; ఇతురులకు కాదు (57). ఏ వస్తువు ఏ విధముగా కాదగి యున్నదో, ఆ విధముగా స్వయముగా కర్తయొక్క భావన లేకుండగా కాలేదు. సర్వకాలములలో కర్త మాత్రమే స్వతంత్రుడై యుండును (58). ఏ విధముగా నైతే సర్వులను అనుగ్రహించే శివుడు స్వభావము చేతనే దోషరహితుడై యున్నాడో, అదే విధముగా జీవులు అనే పేరుతో వ్యవహరింపబడే ఆత్మలు స్వభావము చేతనే దోషము కలవియై ఉన్నవి (59). అట్లు గానిచో, ఈ జీవులు నిశ్చయముగా సంసారములో పరిభ్రమించుటకు శివుడు కాకుండుటకు కారణమేమున్నది? జీవునకు కర్మతో మరియు మాయతో గల రాగపూర్వకమైన సంబంధమే సంసారమని పండితులు చెప్పుచున్నారు (60). అనుబంధో%యమసై#్యవ న శివస్యేతి హేతుమాన్ | స హేతురాత్మనామేవ నిజో నాగంతుకో మలః || 61 ఆగంతుకత్వే కస్యాపి భావ్యం కేనాపి హేతునా | యోయం హేతురసావేకస్త్వవిచిత్రస్వభావతః || 62 ఆత్మతాయాస్సమత్వే%పి బద్ధా ముక్తాః పరే యతః | బద్ధేష్వేవ పునః కేచిల్లయభోగాధికారతః || 63 జ్ఞానైశ్వర్యాదివైషమ్యం భజంతే సోత్తరాధరాః | కేచిన్మూర్త్యాత్మతాం యాంతి కేచిదాసన్నగోచరాః || 64 మూర్త్యాత్మసు శివాః కేచిదధ్వనాం మూర్ధసు స్థితాః | మధ్యే మహేశ్వరా రుద్రాస్త్వర్వాచీనపదే స్థితాః || 65 ఆసన్నే%పి చ మాయాయాః పరస్మాత్కారణత్రయమ్ | తత్రాప్యాత్మా స్థితో%ధస్తాదంతరాత్మా చ మధ్యతః || 66 పరస్తాత్పరమాత్మేతి బ్రహ్మవిష్ణుమహేశ్వరాః | వర్తంతే వసవః కేచిత్పరమాత్మపదాశ్రయాః || 67 అంతరాత్మపదే కేచిత్కేచిదాత్మపదే తథా | శాంత్యతీతపదే శైవాశ్శాంతే మాహేశ్వరే తతః || 68 విద్యాయాం తు యథా రౌద్రాః ప్రతిష్ఠాయాం తు వైష్ణవాః | నివృత్తౌ చ తథాత్మానో బ్రహ్మా బ్రహ్మాంగయోనయః || 69 దేవయోన్యష్టకం ముఖ్యం మానుష్యమథ మధ్యమమ్ | పక్ష్యాదయో%ధమాః పంచ యోనయస్తాశ్చతుర్దశ || 70 ఇట్టి రాగము అనే హేతువు గల సంసారబంధము జీవులకు మాత్రమే గలదు. ఈ సంసారము శివునకు లేదు. దీనికి కారణమేమనగా, జీవునియందు దోషము సహజముగా నుండుటయే. ఆ దోషము బయటనుండి వచ్చినది కాదు (61). జీవదోషము ఆగంతుకము అన్నచో, ఎవ్వనికైననూ ఏ కారణము చేతనైననూ బంధము కలుగవలెను. కాని, అట్లు కాదు. ఈ బంధ హేతువు ఒకే ఒకటి గలదు. ఏల యనగా, జీవుల స్వభావములలో భేదము లేదు (62). ఏలయనగా, అందరిలో ఆత్మస్వరూపము సమానముగనే యున్ననూ, కొందరు బద్ధులుగను, మరికొందరు ముక్తులుగను ఉంటున్నారు. బద్ధులలో గూడ మరల లయము మరియు భోగము ఆను వాటియందు గల అధికారసంపదను బట్టి కొందరు ఉత్తములుగను, మరికొందరు అధములుగను ఉంటూ, జ్ఞానము, ఐశ్వర్యము మొదలగు ధర్మములలో హెచ్చుతగ్గులను అనుభవించు చున్నారు. కొందరు మూర్తిస్వరూపులు అగుచుండగా, మరికొందరు శివునకు సమీపములో సంచరించుచున్నారు (63,64). మూర్తిరూపములో నుండు వారిలో కూడ కొందరు శివస్వరూపులైయుండగా, మరికొందరు ఆరు విధముల మార్గముల ఊర్ధ్వస్థానమునందు ఉంటున్నారు. కొందరు ఈ మార్గముల మధ్యలో మహేశ్వరరూపులై యుండగా, మరికొందరు క్రింది భాగములో రుద్రరూపులై ఉంటున్నారు (65). శివునకు సమీపములో నుండు స్వరూపములో కూడ సర్వకారణమగు మాయకు అతీతమగు స్థానములో మూడు భేదములు గలవు. అచట క్రింది స్థానములో ఆత్మ, మధ్యలో అంతరాత్మ (66). ఊర్ధ్వస్థానములో పరమాత్మ ఉన్నారు. వారే క్రమముగా బ్రహ్మవిష్ణుమహేశ్వరులనబడు చున్నారు. పరమాత్మపదమును ఆశ్రయించిన శ్రేష్ఠ జీవులు కొందరు గలరు (67). కొందరు అంతరాత్మపదమునందు, మరికొందరు ఆత్మపదమునందు ఉంటున్నారు. తరువాత మహేశ్వరునిచే అధిష్టించ బడిన శాంతిపదమునందు కూడ కొందరు గలరు (68). రుద్రభక్తులు విద్యా అనే కళాస్థానమునందు, విష్ణుభక్తులు ప్రతిష్ఠాకళయొక్క స్థానమునందు ఉంటున్నారు. అదే విధముగా బ్రహ్మ, మరియు ఆయన దేహమునుండి పుట్టిన జీవులు నివృత్తి కళయొక్క స్థానమునందు ఉండెదరు (69). ఎనిమిది దేవయోనులు ముఖ్యమైనవి గలవు. మనుష్యజాతి మధ్యమము. పక్షులు మొదలైన అయిదు అధమయోనులు గలవు. ఈ విధముగా వెరసి పదునాల్గు యోనులు గలవు. (70). ఉత్తరాధరభావో%పి జ్ఞేయస్సంసారిణో మలః | యథామభావో భుక్తస్య పూర్వం పశ్చాత్తు పక్వతా || 71 మలో %ప్యామశ్చ పక్వశ్చ భ##వేత్సంసారకారణమ్ | ఆమే త్వధరతా పుంసాం పక్వే తూత్తరతా క్రమాత్ || 72 పశ్వాత్మానస్త్రిధా భిన్నా ఏకద్విత్రిమలాః క్రమాత్ | అత్రోత్తరా ఏకమలా ద్విమలా మధ్యమా తతః | త్రిమలాస్త్వధమా జ్ఞేయా యథోత్తరమధిష్ఠితాః || 73 త్రిమలానధితిష్టంతి ద్విమలైకమలాః క్రమాత్ | ఇత్థమౌపాధికో భేదో విశ్వస్య పరికల్పితః || 74 ఏకద్విత్రిమలాన్ సర్వాన్ శివ ఏకో %ధితిష్ఠతి | అశివాత్మకమప్యేతచ్ఛఇవేనాధిష్ఠితం యథా || 75 అరుద్రాత్మకమిత్యేవం రుద్రైర్జగదధిష్ఠితమ్ | అండాంతా హి మహాభూమిశ్శశతరుద్రాద్యధిష్ఠితా || 76 మాయాంతమంతరిక్షం తు హ్యమరేశాదిభిః క్రమాత్ | అంగుష్ఠమాత్రపర్యంతైస్సమంతాత్సంతతం తతమ్ || 77 మహామాయావసానా ద్యౌర్వాయ్వాద్యైర్భువనాధిపైః | అనాశ్రితాంతైరధ్వాంతర్వర్తిభిస్సమధిష్ఠితా || 78 తే హి సాక్షాద్దివిషదస్త్వంతరిక్షసదస్తథా | పృథివీషద ఇత్యేవం దేవా దేవవ్రతైః స్తుతాః || 79 ఏవం త్రిభిర్మలైరామైః పక్వైరేవ పృథక్ పృథక్ | నిదానభూతైస్సంసారరోగః పుంసాం ప్రవర్తతే || 80 సంసారియగు జీవునకు ఉండే ఉత్తమము లేక అధమము అగు స్థితి కూడ మాలిన్యములో భాగమే యగుచున్నది. ఉదాహరణకు, మనము తిన్న ఆహారము ముందుగా అపక్వముగ నున్ననూ, తరువాత పక్వమగును (71). మాలిన్యము అపక్వమైనా, పక్వమైనా, సంసారమునకు హేతువు అగును. మాలిన్యము అపక్వముగా నున్న జీవులు అధమస్థానమును, క్రమముగా పక్వమైన జీవులు ఉత్తమస్థానమును పొందెదరు (72). సంసారములో బద్ధులై యుండే జీవులు క్రమముగా ఒక మాలిన్యము గలవారు, రెండు మాలిన్యములు గలవారు, మూడు మాలిన్యములు గలవారు అని మూడు విధములుగా నున్నారు. వీరిలో ఒక మాలిన్యము గలవారు ఉత్తములు, రెండు మాలిన్యములు గలవారు మధ్యములు, మూడు మాలిన్యములు గలవారు అధములు అని తెలియవలెను. వీరు సంసారములోని స్థానములను క్రమముగా ఒకరిపై నొకరు అధిష్ఠించెదరు (73). ఈ మూడు మాలిన్యములు గలవారి పైన ఉండే స్థానమును రెండు మాలిన్యములు గలవారు, వారిపై స్థానమును ఒక మాలిన్యము గలవారు క్రమముగా అధిష్ఠించెదరు. ఈ విధముగా జగత్తులో అంతటా ఉపాధిని బట్టి భేదములు కల్పించ బడినవి (74). ఒకటి, రెండు మరియు మూడు మాలిన్యములు గలవారందరిపై శివుడు ఒక్కడు మాత్రమే అధ్యక్షుడై యున్నాడు. ఏ విధముగానైతే ఈ జగత్తు అశివ (అమంగళ) స్వరూపమే అయిననూ, శివునిచే అధిష్ఠించబడి యున్నదో (75), అదే విధముగా, రుద్రస్వరూపముతో సంబంధము లేని జగత్తు రుద్రులచే అధిష్ఠించబడి యున్నది. మహాభూతమగు భూమితో మొదలయ్యే బ్రహ్మాండమంతయు అసంఖ్యాకులగు రుద్రులు మొదలగు వారిచే అధిష్ఠించబడి యున్నది. మహాభూతమగు భూమితో మొదలయ్యే బ్రహ్మాండమంతయు అసంఖ్యాకులగు రుద్రులు మొదలగు వారిచే అధిష్ఠించబడి యున్నది. (76). ఆకాశముతో మొదలిడి మాయాతత్త్వము వరకు గల విశ్వమంతయు ఇంద్రుడు మొదలగు వారిచే క్రమముగా పూర్ణముగా వ్యాప్తమై యున్నది. వీరి జీవపరిమాణము బొటనవ్రేలంత మాత్రమే యుండును (77). స్వర్గలోకముతో మొదలిడి మహామాయతో అంతమయ్యే విశ్వమును ఆరు మార్గముల లోపల ఉండే లోకపాలకులు చక్కగా అధిష్ఠించి యున్నారు. జీవులు ఈ లోకపాలకులను పరమపదరూపములో ఆశ్రయించుట లేదు (?78). ఆ దేవతలలో కొందరు సాక్షాత్తుగా స్వర్గమునందు, మరికొందరు అంతరిక్షమునందు, ఇంకొందరు భూమియందు నివసించెదరు. దేవతలను శ్రద్ధతో ఆరాధించే జనులచే వారు స్తుతించబడు చున్నారు (79). ఈ విధముగా పక్వము కానివి మరియు పక్వమైనవి అగు మూడు మాలిన్యములు మాత్రమే జీవులలోని విభేదములకు కారణములగుచున్నవి. జీవుల సంసారము అనే రోగము ఈ విధముగా ప్రవర్తిల్లుచున్నది (80). అస్య రోగస్య భైషజ్యం జ్ఞానమేవ న చాపరమ్ | భిషగాజ్ఞాపకశ్శంభుశ్శివః పరమకారణమ్ || 81 అదుఃఖేనా%పి శక్తో%సౌ పశూన్మోచయితుం శివః | కథం దుఃఖం కరోతీతి నాత్ర కార్యా విచారణా || 82 దుఃఖమేవ హి సర్వో%పి సంసార ఇతి నిశ్చితమ్ | కథం దుఃఖమదుఃఖం స్యాత్స్వభావో హ్యవిపర్యయః || 83 న హి రోగో హ్యరోగస్స్యాద్భిషగ్భైషజ్యకారణాత్ | రోగార్తం తు భిషగ్రోగాద్భైషజైస్సుఖముద్ధరేత్ || 84 ఏవం స్వభావమలినాన్ స్వభావాద్దుఃఖినః పశూన్ | స్వాజ్ఞౌషధవిధానేన దుఃఖాన్మోచయతే శివః || 85 న భిషక్కారణం రోగే శివస్సంసారకారణమ్ | ఇత్యేతదపి వైషమ్యం న దోషాయాస్య కల్పతే || 86 దుఃఖే స్వభావసంసిద్ధే కథం తత్కారణం శివః | స్వాభావికో మలః పుంసాం స హి సంసారయత్యమూన్ || 87 సంసారకారణం యత్తు మలం మాయాద్యచేతనమ్ | తత్స్వయం న ప్రవర్తేత శివసాన్నిధ్యమంతరా || 88 యథా మణిరయస్కాంతస్సాన్నిధ్యాదుపకారకః | అయసశ్చలతస్తద్వచ్ఛివో%ప్యస్యేతి సూరయః || 89 న నివర్తయితుం శక్యం సాన్నిధ్యం సదకారణమ్ | అధిష్ఠాణా తతో నిత్యమజ్ఞాతో జగతశ్శివః || 90 ఈ రోగమునకు జ్ఞానము ఒక్కటి మాత్రమే మందు; మరియొక మందు లేదు. ఆజ్ఞా తత్త్వముతో గూడినవాడై సర్వకారణకారణుడగు మంగళస్వరూపుడైన శంభుడేవైద్యుడు (81). ఈ శివుడు క్లేశము లేకుండగనే జీవులను విముక్తులను చేయుటకు సమర్థుడు. కాని, దుఃఖమునేల ఇచ్చుచున్నాడు? ఈ విషయములో విచారింప దగినది లేదు (82). ఈ సంసారమంతయు దుఃఖమే అను విషయము నిశ్చితము. అట్టి దుఃఖస్వభావము గల సంసారములో దుఃఖము లేకుండుట ఎట్లు సంభవము? స్వభావమును మార్చశఖ్యము కాదు గదా! (83) వైద్యుని చికిత్స కారణముగా రోగము రోగము కాకుండగా పోదు. వైద్యుడు రోగముతో బాధపడుచున్న వ్యక్తికి తన మందులతో సుఖమునిచ్చి ఉద్ధరించును (84). అదే విధముగా స్వభావము చేతనే మాలిన్యము గలవారు, స్వభావము చేతనే దుఃఖము గలవారు అగు జీవులను శివుడు తన ఆజ్ఞ అనే మందును విధించి దుఃఖమునుండి విముక్తిని కలిగించును (85). రోగమునకువైద్యుడు కారణమగుట లేదు. కాని శివుడు సంసారమునకు కారణమగుచున్నాడు. పై దృష్టాంతములో ఈ తేడా ఉన్నది. కాని, అది శివునకు దోషమును ఆరోపించుట లేదు (86). దుఃఖము స్వభావము చేతనే సిద్ధించుచుండగా, దానికి శివుడు కారణమెట్లగును? జీవులయందు స్వభావసిద్ధముగానున్న మాలిన్యము వారికి సంసారమును కలిగించుచున్నది (87). సంసారమునకు కారణమగు మాలిన్యము ఏది గలదో, అది మాయ మొదలగు జడతత్త్వము మాత్రమే. అది శివుని సన్నిధి లేనిదే స్వయముగా ప్రవర్తించ లేదు (88). అయస్కాంతమణి తన సన్నిధిచే ఇనుము కదలుటలో సహకరించును. అదే విధముగా, శివుని సన్నిధియే మాయ ప్రవర్తించుటకు కారణమగుచున్నదని పండితులు చెప్పుచున్నారు (89). సన్నిధియందు కారణత్వము లేదు. కావున, దానిని నివారించుట సంభవము కాదు. కావున, నిత్యము జగత్తునకు అధిష్ఠానమగు శివుడు తెలియబడుట లేదు (90). న శివేన వినా కించిత్ర్పవృత్తమిహ విద్యతే | తత్ర్పేరితమిదం సర్వం తథాపి న స ముహ్యతి || 91 శక్తిరాజ్ఞాత్మికా తస్య నియంత్రీ విశ్వతోముఖీ | తయా తతమిదం శశ్వత్తథాపి స న దుష్యతి || 92 అనిదం ప్రథమం సర్వమీశితవ్యం స ఈశ్వరః | ఈశనాచ్చ తదీయాజ్ఞా తథాపి స న దుష్యతి || 93 యో%న్యథా మన్యతే మోహాత్స వినశ్యతి దుర్మతిః | తచ్ఛక్తివైభవాదేవ తథాపి స న దుష్యతి 94 ఏతస్మిన్నంతరే వ్యోమ్నః శ్రుతా వాగశరీరిణీ | సత్యమోమమృతం సౌమ్యమిత్యావిరభవత్ స్ఫుటమ్ || 95 తతో హృష్టతరాస్సర్వే వినష్టాశేషసంశయాః | మునయో విస్మయావిష్టాః ప్రణముః పవనం ప్రభుమ్ || 96 తథా విగతసందేహాన్ కృత్వాపి పవనో మునీన్ | నైతే ప్రతిష్ఠితజ్ఞానా ఇతి మత్వైవమబ్రవీత్ || 97 పరోక్షమపరోక్షం చ ద్వివిధం జ్ఞానమిష్యతే | పరోక్షమస్థిరం ప్రాహురపరోక్షం తు సుస్థిరమ్ || 98 హేతూపదేశగమ్యం యత్తత్పరోక్షం ప్రచక్షతే | అపరోక్షం పునః శ్రేష్ఠాదనుష్ఠానాద్భవిష్యతి || 99 నాపరోక్షాదృతే మోక్ష ఇతి కృత్వా వినిశ్చయమ్ | శ్రేష్ఠానుష్ఠానసిద్ధ్యర్థం ప్రయతధ్వమతంద్రితాః || 100 ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే వాయుకృత జ్ఞానోపదేశో నామ ఏకత్రింశో %ధ్యాయః (31) ఈ లోకములో శివుడు లేకుండగా ప్రవర్తిల్లేది ఏదీ లేదు. ఈ సర్వము ఆయనచే ప్రేరేపించబడుచున్నది. అయినప్పటికీ, ఆయనకు మోహము లేదు (91). ఆయనయొక్క ఆజ్ఞారూపములోనుండే శక్తి సమస్తరూపములను దాల్చి సర్వమును నియంత్రించును. ఆ శక్తియే ఈ సర్వమును పూర్ణముగా వ్యాపించి యున్నది. అయిననూ, ఆయనకు దోషము తగలదు (92). ఈ సర్వజగత్తు సృష్ట్యాదియందు ఈ రూపములో నుండెడిది కాదు. పాలించ దగిన ఈ జగత్తును పాలించుట చేతనే ఆయన ఈశ్వరుడైనాడు. ఈ సృష్టి ఆయన ఆజ్ఞయే. అయిననూ, ఆయనకు దోషము లేదు (93).ఎవడైతే అజ్ఞానముచే దీనికి భిన్నముగా భావించునో, అట్టి దుర్బుద్ధి ఆ శక్తియొక్క వైభవముచే మాత్రమే నాశమునకు గురి యగును. అయిననూ, శివునకు దోషము తగలదు (94). ఇది సత్యము; ఓమ్ (నేను అంగీకరించు చున్నాను) అనే మధురమైన మాట ఇంతలో ఆకాశమునుండి అశరీరవాణి రూపములో స్పష్టముగా చెవులకు వినవచ్చెను (95). అపుడు ఆ మునులందరు సకలసందేహములు తొలగుటచే చాల సంతోషించిన వారై, ఆశ్చర్యచకితులై వాయుప్రభువునకు నమస్కరించిరి (96). ఆ విధముగా మునుల సందేహమును పోగొట్టిన తరువాత కూడా వాయుదేవుడు వీరియందు ఇంకనూ జ్ఞానము నిలదొక్కు కొనలేద భావించి ఇట్లు పలికెను (97). పరొక్షము మరియు అపరోక్షము అని జ్ఞానము రెండు రకములుగా నున్నది. ఇంకనూ స్థిరము కాని జ్ఞానము పరోక్షమనియు, స్థిరపడిన జ్ఞానము అపరోక్షమనియు పెద్దలు చెప్పుచున్నారు (98). హేతువుల ఉపదేశముచే పొందబడే జ్ఞానము పరోక్షజ్ఞానమని చెప్పబడును. కాని, అది ఉత్కృష్ణమగు అనుష్ఠానముచే అపరోక్షజ్ఞానమగును (99). అపరోక్షజ్ఞనము లేనిదే మోక్షము లేదు అని నిశ్చయించుకొని, ఉత్కృష్టమగు అనుష్ఠానము సిద్ధించుట కొరకై సోమరితనము లేకుండగా ప్రయత్నమును చేయుడు (100). శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో వాయువు మహర్షులకు బోధించిన జ్ఞానమును వర్ణించే ముప్పది ఒకటవ అధ్యాయము ముగిసినది (31).