Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వాత్రింశోధ్యాయః

పరమశైవ ధర్మములు

ఋషయ ఊచుః|

కిం తచ్ర్ఛేష్ఠమనుష్ఠానం మోక్షో యేనాపరోక్షితః | తత్తస్య సాధనం వాద్యవక్తుమర్హసి మారుత|| 1

ఋషులు ఇట్లు పలికిరి-

ఆపరోక్షజ్ఞానరూపమగు మోక్షమును ఇచ్చే ఆ శ్రేష్ఠమగు అనుష్ఠానము ఏది? ఓ వాయుదేవా! దానిని గాని, దాని సాధనమును గాని ఇప్పుడు చెప్ప దగుదువు (1).

వాయురువాచ|

శైవోహి పరమో ధర్మః శ్రేష్టానుష్ఠానశబ్దితః | యత్రాపరోక్షో లక్ష్యేత సాక్షాన్మోక్షప్రదశ్శివః || 2

స తు పంచవిధో జ్ఞేయః పంచభిః పర్వభిః క్రమాత్‌| క్రియాతపోజపధ్యానజ్ఞానాత్మభిరనుత్తరైః || 3

తైరేవ సోత్తరైస్సిద్ధో ధర్మస్తు పరమో మతః | పరోక్షమపరోక్షం చ జ్ఞానం యత్ర చ మోక్షదమ్‌ || 4

పరమో%పరమశ్చోభౌ ధర్మౌ హి శ్రుతిచోదితౌ | ధర్మశబ్దాభిధేయేర్థే ప్రమాణం శ్రుతిరేవ నః || 5

పరమో యోగపర్యంతో ధర్మః శ్రుతిశిరోగతః | ధర్మస్త్వపరమస్తద్వదధః శ్రుతిముఖోత్థితః || 6

అపశ్వాత్మాధికారత్వాద్యో ధర్మః పరమో మతః | సాధారణస్తతో%న్యస్తు సర్వేషామధికారతః || 7

స చాయమపరో ధర్మః పరధర్మస్య సాధనమ్‌ | ధర్మశాస్త్రాదిభిస్సమ్యక్‌ సాంగ ఏవోపబృంహితః || 8

స చాయమపరో ధర్మః శ్రేష్ఠానుష్ఠానశబ్దితః | ఇతిహాసపురాణాభ్యాం కథంచిదుపబృంహితః || 9

శైవాగమైస్తు సంపన్నస్సహాంగోపాంగవిస్తరః | తత్సంస్కారాధికారైశ్చ సమ్యగేవోపబృంహితః || 10

శైవాగమో హి ద్వివిధః శ్రోతో%శ్రౌతశ్చ సంస్కృతః | శ్రుతిసారమయః శ్రౌతస్స్వతంత్ర ఇతరో మతః || 11

వాయువు ఇట్లు పలికెను -

శ్రేష్ఠమగు అనుష్ఠానము అని బోధించబడిన పరమధర్మము శైవధర్మమే. దాని యందు సాధకుడు మోక్షమునిచ్చే శివుని సాక్షాత్తుగా అపరోక్షజ్ఞానరూపముగా దర్శించును (2). దానియందు క్రియ, తపస్సు, జపము, ధ్యానము మరియు జ్ఞానము అనే సర్వోత్కృష్టములగు అయిదు ప్రకారములు గలవని తెలియవలెను (3). వాటిలో ముందున్న దానికంటె తరువాతిది శ్రేష్ఠమైనది. వాటి వలన సిద్ధించే ధర్మము శ్రేష్ఠమైనది. వీటిని అనుష్ఠించుట వలన పరోక్షజ్ఞానము అపరోక్షమై మోక్షమునిచ్చును (4). పర (సర్వోత్కృష్టమైన) ధర్మము, అపర (రెండవ స్థాయికి చెందిన) ధర్మము అని రెండువిధములుగా ధర్మమును వేదము విధించుచున్నది. ధర్మము అనే శబ్దముచే చెప్పబడే వస్తువు విషయములో మనకు ప్రమాణము వేదము మాత్రమే (5). యోగము వరకు గల ధర్మము పరధర్మము. దీనిని ఉపనిషత్తులు వర్ణించుచున్నవి. దాని క్రింది స్థాయికి చెందిన అపరధర్మమును వేదములోని ఆదిమకాండ బోధించుచున్నది (6). పరధర్మమునందు అజ్ఞానులగు జీవులకు అధికారము లేదు. అందువలననే, అది పరధర్మమని చెప్పబడినది. దానికంటె భిన్నమైన అపరధర్మమునందు సాధారణముగా అందరికీ అధికారము గలదు. (7). అపరధర్మము పరధర్మమునకు సాధనమగును ఈ పరధర్మమును, దానిని పొందే సాధనమును వాటి అంగములతో సహా ధర్మశాస్త్రము మొదలైనవి విస్తారముగా నిరూపించి యున్నవి (8). శ్రేష్ఠమగు అనుష్ఠానము అని వర్ణించబడిన సర్వోత్కృష్ణమగు ఏ శైవధర్మము గలదో, దానిని ఇతిహాసములు మరియు పురాణములు చాల కష్టపడి విస్తారముగా నిరూపించినవి. (9). అంగములు, ఉపాంగములు, సంస్కారములు మరియు అధికారము అను వాటితోకూడియున్న సుసంపన్నమగు ఆ ధర్మమును శైవాగమములు చాల చక్కగానే విస్తారముగా నిరూపించి యున్నవి. (10). శైవాగమములు శ్రౌతము మరియు అశ్రౌతము అని రెండు విధములుగా నున్నవి. వేదముల సారముతో గూడియున్నది శ్రౌతము. స్వతంత్రము మరియు సంస్కారములతో కూడినది అగు రెండువది అశ్రౌతము (11).

స్వతంత్రో దశధా పూర్వం తథాష్టాదశధా పునః | కామికాదిసమాఖ్యాభిసిస్సిద్ధస్సిద్ధాంతసంజ్ఞితః || 12

శ్రుతిసారమయో యస్తు శతకోటిప్రవిస్తరః | పరం పాశుపతం యత్ర వ్రతం జ్ఞానం చ కథ్యతే || 13

యుగావర్తేషు శిష్యేత యోగాచార్యస్వరూపిణా | తత్ర తత్రావతీర్ణేన శివేనైవ ప్రవర్త్యతే || 14

సంక్షిప్యాస్య ప్రవక్తారశ్చత్వారః పరమర్షయః | రురుర్దధీచో%గస్త్యశ్చ ఉపమన్యుర్మహాయశాః || 15

తే చ పాశుపతా జ్ఞేయాస్సంహితానాం ప్రవర్తకాః | తత్సంతతీయా గురవశ్శతశో%థ సహస్రశః || 16

తత్రోక్తః పరమో ధర్మశ్చర్యాద్యాత్మా చతుర్విధః | తేషు పాశుపతో యోగశ్శివం ప్రత్యక్షయేద్దృఢమ్‌ || 17

తస్మాచ్ర్ఛేష్ఠమనుష్ఠానం యోగః పాశుపతో మతః | తత్రాప్యుపాయో యః ప్రోక్తో బ్రహ్మణా స తు కథ్యతే || 18

నామాష్టకమయో యోగశ్శివేన పరికల్పితః | తేన యోగేన సహసాశైవీ ప్రజ్ఞా ప్రజాయతే || 19

ప్రజ్ఞయా పరమం జ్ఞానమచిరాల్లభ##తే స్థిరమ్‌ | ప్రసీదతి శివస్తస్య యస్య జ్ఞానం ప్రతిష్ఠితమ్‌ || 20

ప్రసాదాత్పరమో యోగో యశ్శివం చాపరోక్షయేత్‌ | శివాపరోక్షాత్సంసారకారణన వియుజ్యతే || 21

స్వతంత్రమగు శైవధర్మము ముందుగా పది రూపములుగను, తరువాత పెద్ధెనిమిది రూపములుగను ఉన్నది. కామికా మొదలగు పేర్లతో లభించే ఆ శాస్త్రమునకు సిద్ధాంతము అని పేరు (12). వేదముల సారముతో నిండి యున్నశైన ధర్మము వంద కోట్ల శ్లోకములలో విస్తారముగా నిరూపించ బడియున్నది. దానియందు సర్వోత్కృష్టమగు పాశుపతవ్రతము మరియు జ్ఞానము చెప్పబడును (13). నాలుగు యుగముల కాలచక్రము తిరుగుచుండగా ఆయా సమయములలో యోగాచార్యరూపములో శివుడే అవతరించి దానిని జనులకు నేర్పుచున్నాడు (14). దీనిని సంక్షేపించి బోధించిన ఋషులు నలుగురు గలరు. రురువు, దధీచుడు, అగస్త్యుడు మరియు ఉపమన్యుడు ఆనునవి వారి పేర్లు. ఉపమన్యునకు గొప్ప కీర్తి గలదు (15). సంహితలను ప్రవర్తిల్ల జేసిన ఆ ఋషులు పాశుపతులని తెలియవలెను. వారి సంతతికి చెందిన గురువులు వందల వేల సంఖ్యలో గలరు (16). ఆ సంహితలలో చర్య మొదలగు రూపములలో నున్న నాలుగు రకములు (చర్య, విద్య, క్రియా, యోగము) పరమధర్మము చెప్పబడినది. వాటిలోని పాశుపతయోగము శివుని దృఢముగా సాక్షాత్కరింప జేయును (17). కావున, శ్రేష్ఠమగు అనుష్ఠానమనగా పాశుపతయోగమే. ఆ ధర్మము విషయములో బ్రహ్మచే చెప్పబడిన ఉపాయము చెప్పబడుచున్నది (18). శివుడు నామాష్టకమయము (ఎనిమిదినామములతో గూడియున్నది) అనే యోగమును నిర్మించినాడు. ఆ యోగము వలన వెంటనే శివునకు సంబంధించిన ప్రజ్ఞ కలుగును (19). ఆ ప్రజ్ఞచే సాధకుడు తొందరలో స్థిరమగు పరమజ్ఞానమును పొందును. ఆ జ్ఞానమునందు స్థిరముగ నున్నవారియందు శివుడు ప్రసన్నుడగును (20). శివుని అనుగ్రహము వలన వానికి పరమయోగము సిద్ధించును. దాని వలన ఆతడు శివుని సాక్షాత్కరించు కొనును. శివుని సాక్షాత్కారము వలన సంసారకారణమగు అజ్ఞానము ఆతనికి తొలగి పోవును (21).

తతస్స్యాన్ముక్తసంసారో ముక్తశ్శివసమో భ##వేత్‌ | బ్రహ్మప్రోక్త ఇత్యుపాయస్స ఏవ పృథగుచ్యతే || 22

శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణుః పితామహః | సంసారవైద్యస్సర్వజ్ఞః పరమాత్మేతి ముఖ్యతః || 23

నామాష్టకమిదం ముఖ్యం శివస్య ప్రతిపాదకమ్‌ | ఆద్యం తు పంచకం జ్ఞేయం శాంత్యతీతాద్యనుక్రమాత్‌ || 24

సంజ్ఞా సదాశివాదీనాం పంచోపాధిపరిగ్రహాత్‌ | ఉపాధివినివృత్తౌ తు యథాస్వం వినివర్తతే || 25

పదమేవ హి తన్నిత్యమనిత్యాః పదినస్స్మృతాః | పదానాం ప్రతివృత్తౌతు ముచ్యంతే పదినో యతః || 26

పరివృత్త్యంతరే భూయస్తత్పదప్రాప్తిరుచ్యతే | ఆత్మాంతరాభిధానం స్యాద్యదాద్యం నామపంచకమ్‌ || 27

అన్యత్తు త్రితయం నామ్నాముపాదానాదియోగతః | త్రివిధోపాధివచనాచ్ఛివ ఏవానువర్తతే || 28

అనాదిమలసంశ్లేషః ప్రాగభావాత్స్వభావతః | అత్యంతం పరిశుద్ధాత్మేత్యతో%యం శివ ఉచ్యతే || 29

అథవాశేషకల్యాణగుణౖకఘన ఈశ్వరః | శివ ఇత్యుచ్యతే సద్భిశ్శివతత్త్వార్థవాదిభిః || 30

త్రయోవింశతితత్త్వేభ్యః ప్రకృతిర్హి పరా మతా| ప్రకృతేస్తు పరం ప్రాహుః పురుషం పంచవింశకమ్‌ || 31

తరువాత సంసారమునుండి విముక్తిని పొందిన ఆ ముక్తుడు శివునితో సముడగును. బ్రహ్మ చెప్పన ఉపాయము ఇదియే. దీనిని మరల వేరుగా చెప్పుచున్నాను (22). శివుడు, మహేశ్వరుడు, రుద్రుడు, విష్ణువు, పితామహుడు, సంసారవైద్యుడు, సర్వజ్ఞుడు మరియు పరమాత్మ అనునవి ముఖ్యములైన పేర్లు (23). ఈ ఎనిమిది నామములు ప్రధానముగా శివుని ప్రతిపాదించు చున్నవి. శాంత్యతీత మొదలగు కళల క్రమములో శివుడు సదాశివుడు మొదలగు అయిదు ఉపాధులను స్వీకరించి యున్నాడు. ఆ ఉపాధులు ఉపసంహరింప బడగానే ఆయన తన స్వరూపము లోనికి మరలి వెళ్లును. పైన చెప్పిన వాటిలో మొదటి అయిదు నామములు ఆ ఉపాధులను నిర్దేశించును (24,25). ఆ ఆధికారికపదములు మాత్రమే నిత్యము. ఆ పదములయందుండే ఆధికారిక పురుషులు నిత్యులు కాదు. ఏలయనగా, కాలచక్రములో ఆ పదములు తిరుగుచున్నప్పుడు ఆయా ఆధికారిక పురుషులకు మోక్షము కలుగును (26). కాలచక్రము తిరిగి ఇంకో మహాయుగము ఆరంభ##మైనప్పుడు మరల ఆ పదములు ఇతరములగు ఆత్మలకు లభించును. మొదటి అయిదు పేర్లు ఆ ఆత్మలను నిర్దేశించును (27). ఉపాదానము (జగత్కారణము) మొదలగు వాటితో శివునకు గల సంబంధమును బట్టి ఆయనకు మూడు రకముల ఉపాధులు గలవు. ఆ ఉపాధులను నిర్దేశించే మిగిలిన మూడు నామములు శివునియందు మాత్రమే అనువర్తించు చున్నవి (28). అనాదియగు అజ్ఞానముతో సంపర్కము శివునియందు గడచిన ఏ కాలమునందైననూ లేదు. ఆయన స్వభావస్వరూపములచే అత్యంతపరిశుద్ధుడు. కావుననే, ఆయనకు శివుడని పేరు (29). లేదా, ఆ ఈశ్వరుడు సమస్తకల్యాణగుణములు ఘనీభవించిన మూర్తియగుటచే, శివతత్త్వముయొక్క సారమునెరింగిన సత్పురుషులు ఆయనను శివుడు అని పిలుచుచున్నారు (30). ఇరువది మూడు తత్త్వములకు అతీతముగా ప్రకృతి ఉండగా, ఇరువది అయిదవ తత్త్వమగు పురుషుడు ప్రకృతికంటె కూడా అతీతుడని పెద్దలు చెప్పచున్నారు (31).

యం వేదాదౌ స్వరం ప్రాహుర్వాచ్యవాచకభావతః | వేదైకవేద్యయాథాత్మ్యాద్వేదాంతే చ ప్రతిష్ఠితః || 32

తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వరః | తదధీనప్రవృత్తిత్వాత్ర్పకృతేః పురుషస్య చ || 33

అథవా త్రిగుణం తత్త్వముపేయమిదమవ్యయమ్‌ | మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ || 34

మాయావిక్షోభకో%నంతో మహేశ్వరసమన్వయాత్‌ | కాలాత్మా పరమాత్మాధిః స్థూలస్సూక్ష్మః ప్రకీర్తితః || 35

రుద్దుఃఖం దుఖ హేతుర్వా తద్ద్రావయతి నః ప్రభుః | రుద్ర ఇత్యుచ్యతే సద్భిశ్శివః పరమకారణమ్‌ || 36

తత్త్వాదిభూతపర్యంతం శరీరాదిష్వతంద్రితః | వ్యాప్యాధితిష్ఠతి శివస్తతో రుద్ర ఇతస్తతః || 37

జగతః పితృభూతానాం శివో మూర్త్యాత్మనామపి | పితృభావేన సర్వేషాం పితామహ ఉదీరితః || 38

నిదానజ్ఞో యథావైద్యో రోగస్య వినివర్తకః | ఉపాయైర్భేషజైస్తద్వల్లయభోగాధికారతః || 39

సంసారస్యేశ్వరో నిత్యం సమూలస్య నివర్తకః | సంసారవైద్య ఇత్యుక్తస్సర్వతత్త్వార్థవేదిభిః || 40

ఆ శివుని యథార్థతత్త్వమును వేదము ద్వారా మాత్రమే తెలియదగును. వేదమునకు అదిలో చెప్పబడే ఓంకారము అనే శబ్దము ఆ శివుని నిర్దేశించును. అనగా, ఆ శబ్దమునకు శివునితో వాచ్య (నిర్దేశించ బడువాడు) - వాచక (నిర్దేశించే పదము) సంబంధము గలదు. ఆ శివుడు వేదాంతములయందు ప్రతిష్ఠితుడై యున్నాడు; అనగా ఉపనిషత్తులు శివుని దృఢముగా ప్రతిపాదించు చున్నవి (32). ఆ ఓంకారము ప్రకృతిలో లీనమగును. ప్రకృతి మరియు పురుషుడు ఆ శివునకు వశవర్తులై ప్రవర్తించు చున్నారు. కావున, ఆ పరమేశ్వరుడు ప్రకృతికి కూడ అతీతుడు (33). లేదా, ఈ జగత్తు వినాశము లేని సత్త్వరజస్తమోగుణాత్మకమగు ప్రకృతియొక్క పరిణామమే. ఆ ప్రకృతి మిథ్యారూపమగుటచే మాయ అనబడును. మహేశ్వరుడు మాయను వశము చేసుకున్నవాడని తెలియవలెను (34). మహేశ్వరునితో సంబంధమును కలిగియున్న అనంతుడు (విష్ణువు) ఈ మాయాశక్తియందు క్షోభ (జగత్తు ఉదయించుటకు హేతువు అగు కదలిక) ను కలిగించును. ఆయనకే కాలాత్మ (కాలస్వరూపుడు), పరమాత్మ (పరమార్థమగు చైతన్యమే స్వరూపముగా గలవాడు), ఆది (కారణస్వరూపుడు), స్థూలుడు (జగద్రూపముగా వ్యక్తమైనవాడు), సూక్ష్ముడు (జగత్తునకు కారణమైనవాడు) అని పేర్లు (35). రుత్‌ అనగా దుఃఖము; లేదా దుఃఖహేతువు. మనకు వాటిని లేకుండా ఆ ప్రభుడు తరిమి కొట్టుటచే సర్వకారణకారణుడగు ఆ శివుని సత్పురుషులు రుద్రుడని పిలుచు చున్నారు (36). కళ, కాలము మొదలగు తత్త్వములతో మొదలిడి ఈ పంచభూతముల వరకు మరియు ప్రాణుల శరీరము మొదలగు వాటియందు దేనినీ విడువకుండగా అధిష్ఠానరూపముగా శక్తిరూపములో వ్యాపించి యుండుటచే శివునకు రుద్రుడని పేరు వచ్చినది (37). సదాశివుడు మొదలగు మూర్తిస్వరూపములు జగత్తునకు తండ్రులగుచుండగా, వారందరికీ శివుడు తండ్రి యగుటచే, ఆయనకు పితామహుడని పేరు (38). రోగమును ఖచ్చితముగా గుర్చించిన వైద్యుడు మందులు అనే ఉపాయములతో దానిని పోగొట్టును. అదే విధముగా, ఈశ్వరుడు లయము సకలతత్త్వముల సారమునెరింగిన పండితులు ఆయనకు సంసారవైద్యుడని పేరు పెట్టినారు (39,40).

దశార్థజ్ఞానసిద్ధ్యర్థమింద్రియేష్వేషు సత్స్వపి | త్రికాలభావినో భావాన్‌ స్థూలాన్‌ సూక్ష్మానశేషతః || 41

అణవోనైవ జానంతి మాయయైవ మలావృతాః | అసత్స్వపి చ సర్వేషు సర్వార్ధజ్ఞానహేతుషు || 42

యద్యథావస్థితం వస్తు తత్తథైవ సదాశివః | అయత్నేనైవ జానాతి తస్మాత్సర్వజ్ఞ ఉచ్యతే || 43

సర్వాత్మా పరమైరేభిర్గుణౖర్నిత్యసమన్వయాత్‌ | స్వస్మాత్పరాత్మవిరహాత్పరమాత్మా శివస్స్వయమ్‌ || 44

నామాష్టకమిదం చైవ లబ్ధ్వాచార్యప్రసాదతః | నివృత్త్యాదికలాగ్రంథిం శివాద్యైః పంచనామభిః || 45

యథాస్వం క్రమశశ్ఛిత్త్వా శోధయిత్వా యథాగుణమ్‌ | గుణితైరేవ సోద్ఘాతైరనిరుద్ధైరథాపి వా || 46

హృత్కంఠతాలుభ్రూమధ్యబ్రహ్మరంధ్రసమన్వితామ్‌ | ఛిత్త్వా పుర్యష్టకాకారం స్వాత్మానం చ సుషుమ్నయా || 47

ద్వాదశాంతఃస్థితస్యేందోర్నీత్వోపరి శివౌజసి | సంహృత్య వదనం పశ్చాద్యథాసంస్కరణం లయాత్‌ || 48

శాక్తేనామృతవర్షేణ సంసిక్తాయాం తనౌ పునః | అవతార్య స్వమాత్మానమమృతాత్మాకృతిం హృది || 49

ద్వాదశాంతఃస్థితస్యేందోః పరస్తాచ్ఛ్వేతపంకజే | సమాసీనం మహాదేవం శంకరం భక్తవత్సలమ్‌ || 50

అర్ధనారీశ్వరం దేవం నిర్మలం మధురాకృతిమ్‌ | శుద్ధస్ఫటికసంకాశం ప్రసన్నం శీతలద్యుతిమ్‌ || 51

ధ్యాత్వా హి మానసే దేవం స్వస్థచిత్తో%థ మానవః | శివనామాష్టకేనైవ భావపుషై#్పస్సమర్చయేత్‌ || 52

పది విషయముల జ్ఞానము కొరకై ఈ ఇంద్రియములు (అయిదు కర్మేంద్రియములు, అయిదు జ్ఞానేంద్రియములు) ఉన్ననూ, అల్పులగు జీవులు అవిద్యాదోషముచే కప్పివేయబడిన వారు గనుక, మూడు కాలములలో ఉండే స్థూలములు మరియు సూక్ష్మములు అగు పదార్థములను పూర్ణముగా తెలుసుకొన జాలరనుటలో సందేహము లేదు. కాని, సకల పదార్థముల జ్ఞానమునకు హేతువులగు ఇంద్రియములు ఏమియూ లేకున్ననూ, ఏ వస్తువు ఏ విధముగా నున్నదో, దానిని అదే విధముగా ఖచ్చితముగా ప్రయత్నము లేకుండగనే సదాశివుడు తెలియగల్గుచున్నాడు. కావుననే, ఆయన సర్వజ్ఞుడన బడుచున్నాడు (41-43). సర్వుల ఆత్మ శివుడే. ఆయనయందు ఈ శ్రేష్ఠగుణములు నిత్యము నివసించి యుండును. ఆయన కంటె భిన్నముగా మరియొక ఆత్మ లేదు. కావుననే, ఆయనకు స్వయముగా పరమాత్మ అని పేరు (44). ఈ ఎనిమిది నామములు ఆచార్యుని అనుగ్రహము వలన పొంది శివుడు మొదలైన అయిదు నామములతో నివృత్తి మొదలగు కళలు అనే గ్రంథులను (సంసారకారణమగు అజ్ఞానధారణలను) క్రమముగా ఛేదించి, వాటిని గుణములకు మరియు స్వరూపమునకు అనురూపముగా శోధించి (యథాతథముగా తెలుసుకొని), ఉద్ఘాతము (పైకి వేగముగా త్రోయుట) తో కూడినవి లేదా నిరుద్ధములు (గాలిని నిలిపి ఉంచుట) కానివి అగు గుణితములైన (మరల మరల చేయబడిన) ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములతో (ఇది ప్రాణాయమము; 45,46), హృదయము, కంఠము, తాలువు, కనుబొమల మధ్యభాగము మరియు బ్రహ్మరంధ్రములతో కూడిన పుర్యష్టకము (ఎనిమిది చక్రములతో కూడియున్న దేహము) ను భేదించి, తన ఆత్మను సుషుమ్నానాడీ మార్గము గుండా (47) పన్నెండు దళముల హృదయపద్మమునందలి దహరాకాశమునకు, ఆజ్ఞాచక్రమునందలి చంద్రునకు పైన ఉండే శివతేజస్సు లోనికి తీసుకొని వెళ్లవలెను. తరువాత శాస్త్రీయమైన సంస్కారములను అతిక్రమించకుండగా ముఖవ్యాపారములను (మాటలాడుట మరియు భుజించుట) ఆపివేయవలెను. ఈ విధమగు లయము వలన కలిగిన (48) శక్తిస్వరూపమగు అమృతముయొక్క వర్షముచే శరీరము పలుమార్లు చక్కగా తడుపబడును. తరువాత సాధకుడు అమృతమగు ఆత్మయొక్క ఆకారముతో కూడియున్న తన ఆత్మను క్రింద హృదయములోనికి తీసుకు రావలెను (49). పన్నెండు దళముల హృదయపద్మములోనున్న (?) చంద్రునకు పైన తెల్లని పద్మమునందు కూర్చున్నవాడు, దేవతలలో శ్రేష్ఠుడు, భక్తులపై ప్రేమ గలవాడు, శరీరములో సగభాగము స్త్రీరూపము గల ఈశ్వరుడు, దోషరహితుడు, మధురమగు ఆకారము గలవాడు, స్వచ్ఛమగు స్పటికమువలె ప్రకాశించువాడు, ప్రసన్నుడు, చల్లని కాంతులు గలవాడు అగు శంకర దేవుని మనస్సులో ధ్యానించవలెను. తరువాత ఆ సాధకుడు స్వస్థమగు మనస్సు గలవాడై శివుని ఎనిమిది నామములను స్మరిస్తూ ఆ దేవుని భావాత్మకమగు పుష్పములతో చక్కగా పూజించవలెను (50-52).

అభ్యర్చనాంతే తు పునః ప్రాణానాయమ్య మానవః | సమ్యక్చిత్తం సమాధాయ శార్వం నామాష్టకం జపేత్‌ || 53

నాభౌ చాష్టాహుతీర్షుత్వా పూర్ణాహుత్యా నమస్తతః | అష్టపుష్పప్రదానేన కృత్వాభ్యర్చనమంతిమమ్‌ || 54

నివేదయేత్స్వమాత్మానం చులుకోదకవర్త్మనా | ఏవం కృత్వాచిరాదేవ జ్ఞానం పాశుపతం శుభమ్‌ || 55

లభ##తే తత్ర్పతిష్ఠాం చ వృత్తం చానుత్తమం తథా | యోగం చ పరమం లబ్ధ్వా ముచ్యతే నాత్ర సంశయః || 56

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వ ఖండే పరమశైవధర్మ వర్ణనం నామ ద్వాత్రింశో%ధ్యాయః (32).

ఈ విధమగు మానసికపూజ చక్కగా పూర్తి అయిన తరువాత ఆ సాధకుడు మరల ప్రాణాయామమును చేసి మనస్సును చక్కగా ఏకాగ్రము చేసి, శివుని ఎనిమిది నామములను జపించవలెను (53). నాభిదేశము (మణిపూరము) నందు ఎనిమిది ఆహుతులను (మానసికముగా) హోమము చేసి, పూర్ణాహుతిని చేసి, నమస్కరించి, తరువాత ఎనిమిది పుష్పములతో (మాసికముగా) ఆఖరి పూజను చేసి (54), అరచేతిలో నీళ్లను తీసుకొని విడిచి పెచుతూ తన ఆత్మను నివేదించ వలెను. ఈ విధముగా చిరకాలము చేసిన సాధకుడు శుభకరమగు పాశుపతజ్ఞానమును పొందును. ఇంతేగాక, ఆ జ్ఞానము స్థిరపడును. ఆతడు సర్వోత్కృష్టమగు శీలమును మరియు శ్రేష్ఠమగు యోగమును పొంది ముక్తుడగును. దీనిలో సందేహము లేదు (55,56).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో పరమశైవధర్మములను వర్ణించే ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).

Siva Maha Puranam-4    Chapters