Siva Maha Puranam-4    Chapters   

అథ చతుస్త్రింశో%ధ్యాయః

ఉపమన్యుని తపస్సు

ఋషయ ఊచుః |

ధౌమ్యాగ్రజేన శిశునా క్షీరార్థం హి తపః కృతమ్‌ | తస్మాత్‌ క్షీరార్ణవో దత్తస్తసై#్మ దేవేన శూలినా || 1

స కథం శిశుకో లేభే శివశాస్త్ర ప్రవక్తృతామ్‌ | కథం వా శివసద్భావం జ్ఞాత్వా తపసి నిష్ఠితః || 2

కథం చ లబ్ధవిజ్ఞానస్తపశ్చరణపర్వణి | రుద్రాగ్నేర్యత్పరం వీర్యం లేభే భస్మ స్వరక్షకమ్‌ || 3

ఋషులు ఇట్లు పలికెను -

ధౌమ్యుని అన్నగారగు ఉపమన్యుడు పిల్లవాడుగా నున్నపుడు పాల కొరకు తపస్సును చేసెను. ఆ తపస్సు వలన త్రిశూలియగు శివభగవానుడు పాల సముద్రమును ఆతనికి ఇచ్చినాడు (1). ఆ పిల్లవాడు శివశాస్త్రమును బోధించే సామర్థ్యమును ఎట్లు పొందినాడు? ఆతడు శివుని సత్స్వరూపమును తెలుసుకొని తపస్సునందు నిష్ఠను పొందిన విధమెట్టిది? (2) ఆతడు తపస్సును చేయు కాలములో విజ్ఞానమును పొందిన విధానమెట్టిది? అగ్ని రూపములోనున్న రుద్రుని సర్వోత్కృష్టమగు శక్తి యగు భస్మను ఆతడు పొంది తనను తాను రక్షించుకున్న విధమెట్టిది? (3).

వాయురువాచ |

న హ్యేష శిశుకః కశ్చిత్ర్పాకృతః కృతవాంస్తపః | మునివర్యస్య తనయో వ్యాఘ్రపాదస్య ధీమతః || 4

జన్మాంతరేణ సంసిద్ధః కేనాపి ఖలు హేతునా | స్వపదప్రచ్యుతో దిష్ట్యా ప్రాప్తో మునికుమారతామ్‌ || 5

మహాదేవప్రసాదస్య భాగ్యాపన్నస్య భావినః | దుగ్ధాభిలాషప్రభవం ద్వారతామగమత్తపః || 6

అతస్సర్వగణశత్వం కుమారత్వం చ శాశ్వతమ్‌ | సహ దుగ్ధాభ్ధినా తసై#్మ ప్రదదౌ శంకరస్స్వయమ్‌ || 7

తస్య జ్ఞానాగమోప్యస్య ప్రసాదాదేవ శాంకరాత్‌ | కౌమారం హి పరం సాక్షాత్‌ జ్ఞానం శక్తిమయం విదుః || 8

శివశాస్త్ర ప్రవక్తృత్వమపి తస్య హి తత్కృతమ్‌ | కుమారో మునితో లబ్ధజ్ఞానాబ్ధిరివనందనః || 9

దృష్టం తు కారణం తస్య శివజ్ఞానసమన్వయే | స్వమాతృవచనం సాక్షాచ్ఛోకజం క్షీరకారణాత్‌ || 10

కదాచిత్‌ క్షీరమత్యల్పం పీతవాన్‌ మాతులాశ్రమే | ఈర్ష్యయా మాతులసుతం సంతృప్తక్షీరముత్తమమ్‌ || 11

పీత్వా స్థితం యథాకామం దృష్ట్వా వై మాతులాత్మజమ్‌ | ఉపమన్యుర్వ్యాఘ్రపాదిః ప్రీత్యా ప్రోవాచ మాతరమ్‌ || 12

వాయువు ఇట్లు పలికెను -

తపస్సును చేసిన ఈ బాలుడు ఏదో ఒక సామాన్యబాలకుడు కాడు. ఆతడు బుద్ధి శాలియగు వ్యాఘ్రపాదుడు అను మహర్షియొక్క కొడుకు (4). ఆతడు పూర్వజన్నలో సిద్ధిని పొందిన వాడే అయిననూ ఏదో ఒక కారణముచే దైవవశముచే తన స్థానమునుండి జారినవాడై మునికుమారుడై జన్మించెను (5). భాగ్యవశముచే లభించబోయే మహాదేవుని అనుగ్రహమునకు, పాలయందలి కోరికతో చేయబడిన తపస్సు ద్వారము ఆయెను (6). ఆ తపస్సు వలన శంకరుడు ఆతనికి పాల సముద్రముతో బాటు గణములన్నింటిపై అధ్యక్షత్వమును, శాశ్వతమగు కుమారపదవిని స్వయముగా ఇచ్చెను (7). ఆతనికి శంకరుని అనుగ్రహముచే జ్ఞానము కూడ కలిగెను. కుమారుడగు ఆ ఉపమన్యుని జ్ఞానము సర్వోత్కృష్టమైనదనియు, శక్తితో కూడినదనియు పెద్దలు చెప్పుదురు (8). ఆతనికి శివశాస్త్రమును చెప్పే సామర్ధ్యమును కూడ శివుడే ఇచ్చెను. ఆ కుమారుడు తన తండ్రియగు వ్యాఘ్రపాదునినుండి పొందబడిన జ్ఞానము గలవానివలె సంతోషించెను (9). ఆతడు శివజ్ఞానమును స్వంతము చేసుకొనుటకు కంటికి కనబడే కారణము సాక్షాత్తుగా తన తల్లియొక్క వచనమే. ఆమె పాలు కారణముగా పలికిన వచనము శోకమును కలిగించును (10). ఒకనాడు ఆతడు మేనమామయొక్క ఆశ్రమములో చాల తక్కువ పాలను త్రాగెను. యథేచ్ఛగా తృప్తి కలుగునంతవరకు మంచి పాలను త్రాగి నిలబడి యున్న మేనమామయొక్క పుత్రుని చూచి, వ్యాఘ్రుపాదుని కుమారుడగు ఉపమన్యుడు ఈర్ష్యపడి, ప్రేమతో తల్లిని ఉద్దేశించి ఇట్లు పలికెను (11, 12).

ఉపమన్యురువాచ |

మాతర్మాతర్మహాభాగే మమ దేహి తపస్వని | గవ్యం క్షీరమతిస్వాదు నాల్పముష్ణం పిబామ్యహమ్‌ || 13

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

అమ్మా!అమ్మా! నీవు మహాత్మురాలవు; గొప్ప తపశ్శాలినివి. నాకు మిక్కిలి మధురమైన ఆవుపాలను ఇమ్ము. వేడిగానుండే కొద్ది పాలను నేను త్రాగను (13).

వాయురువాచ |

తచ్ఛ్రుత్వా పుత్రవచనం తన్మాతా చ తపస్వినీ | వ్యాఘ్రపాదస్య మహిషీ దుఃఖమాపత్తదా చ సా || 14

ఉపలాల్యాథ సుప్రీత్యా పుత్రమాలింగ్య సాదరమ్‌ | దుఃఖితా విలలాపాథ స్మృతా నైర్ధన్యమాత్మనః || 15

స్మృత్వా స్మృత్వా పునః క్షీరముపమన్యుస్స బాలకః | దేహి దేహీతి తామహ రుదన్‌ భూయో మహాద్యుతిః || 16

తద్ధఠం సా పరిజ్ఞాయ ద్విజపత్నీ తపస్వినీ | శాంతయే తద్ధఠస్యాథ శుభోపాయమరీరచత్‌ || 17

ఉంఛవృత్త్యార్జితాన్‌ జీజాన్‌ స్వయం దృష్ట్వా చ సా తదా | బీజపిష్టమథాలోడ్య తోయేన కలభాషిణీ || 18

ఏహ్యేహి మమ పుత్రేతి సామపూర్వం తతస్సుతమ్‌ | ఆలింగ్యాదాయ దుఃఖార్తా ప్రదదౌ కృత్రిమం పయః || 19

పీత్వా చ కృత్రిమం క్షీరం మాత్రా దత్తం స బాలకః | నైతత్‌ క్షీరమితి ప్రాహ మాతరం చాతివిహ్వలః || 20

దుఃఖితా సా తదా ప్రాహ సంప్రేక్ష్యాఘ్రా య మూర్ధని | సంమార్జ్య నేత్రే పుత్రస్య కరాభ్యాం కమలాయతే || 21

వాయువు ఇట్లు పలికెను -

అపుడు పుత్రుని ఆ మాటను విని, తపశ్శాలిని, వ్యాఘ్రపాదుని భార్య అగు వాని ఆ తల్లి దుఃఖమును పొందెను (14). అపుడు దుఃఖితురాలైన ఆమె అతిశయించిన ప్రీతితో పుత్రుని దగ్గరకు తీసుకొని ఆదరముతో కౌగిలించుకొని లాలించి తన వద్ద ధనము లేదని గుర్తు చేసుకొని రోదించెను (15). గొప్ప కాంతి గలవాడు, బాలకుడు అగు ఆ ఉపమన్యుడు మరల మరల ఆ పాలనే గుర్తు చేసుకొనుచూ మరల ఏడ్చుచూ ఆమె ఇమ్ము, ఇమ్ము అని పలికెను (16). అపుడు తపశ్శాలినియగు ఆ బ్రాహ్మణపత్ని వాని మొండిపట్టును గుర్తించి ఆ పట్టును శాంతింప జేయుట కొరకై చక్కని ఉపాయమును చేసెను (17). అపుడు మధురముగా సంభాషించే ఆ తల్లి తాను స్వయముగా ఉంఛవృత్తి (పొలములో రాలి పడిన గింజలను ఏరుకొనుట) చే సంపాదించిన గింజలను చూచి, వాటిని విసిరి పిండి చేసి నీటిలో కలిపి (18), తరువాత పుత్రా! రమ్ము, రమ్ము అని ప్రేమపూర్వకముగా పుత్రుని దగ్గరకు తీసుకొని ఆలింగనము చేసుకొని, దుఃఖముచే పీడింపబడుతూ ఆ పాలు కాని పాలను ఇచ్చెను (19). తల్లి ఇచ్చిన ఆ పాలు కాని పాలను త్రాగి ఆ బాలుడు మిక్కిలి దుఃఖించిన వాడై, ఇవి పాలు కావు అని తల్లితో పలికెను (20). అపుడామె దుఃఖితురాలై పుత్రుని చూచి నుదుటిపై ముద్దాడి, పద్మము వలె విశాలమైన పుత్రుని కన్నులను చేతులతో తుడిచి ఇట్లు పలికెను (21).

జనన్యువాచ |

తటినీ రత్నపూర్ణాస్తాస్స్వర్గపాతాలగోచరాః | భాగ్యహీనా న పశ్యంతి భక్తిహీనాశ్చ యే శివే || 22

రాజ్యం స్వర్గం చ మోక్షం చ భోజనం క్షీరసంభవమ్‌ | న లభంతే ప్రియాణ్యషాం న తుష్యతి యదా శివః || 23

భవప్రసాదజం సర్వం నాన్యదేవ ప్రసాదజమ్‌ | అన్యదేవేషు నిరతా దుఃఖార్తా విభ్రమంతి చ || 24

క్షీరం తత్ర కుతో%స్మాకం వనే నివసతాం సదా | క్వ దుగ్ధసాధనం వత్స క్వ వయం వనవాసినః || 25

కృత్స్నాభావేన దారిద్ర్యాన్మయా తే భాగ్యహీనయా | మిథ్యాదుగ్ధమిదం దత్తం పిష్టమాలోడ్య వారిణా || 26

త్వం మాతులగృహే స్వల్పం పీత్వా స్వాదు పయః శృతమ్‌ | జ్ఞాత్వా స్వాదు త్యయా పీతం తజ్జాతీయమనుస్మరన్‌ || 27

దత్తం న పయ ఇత్యుక్త్వా రుదన్‌ దుఃఖీకరోషిమామ్‌ | ప్రసాదేన వినా శంభోః పయస్తవ న విద్యతే || 28

పాదపంకజయోస్తస్య సాంబస్య సగణస్య చ | భక్త్యా సమర్పితం యత్తత్కారణం సర్వసంపదామ్‌ || 29

అధునా వసుదోస్మాభిర్మహాదేవో న పూజితః | సకామానాం యథాకామం యథోక్తఫలదాయకః || 30

ధనాన్యుద్దిశ్య నాస్మాభిరితః ప్రాగర్చితశ్శివః | అతో దరిద్రాస్సంజాతా వయం తస్మాన్న తే పయః || 31

పూర్వజన్మని యద్దత్తం శివముద్దిశ్య వై సుత | తదేవ లభ్యతే నాన్యద్విష్ణుముద్దిశ్య వా ప్రభుమ్‌ || 32

స్వర్గమునందు పాతాళమునందు కానవచ్చునవి, రత్నములతో నిండి యుండునవి అగు నదులను భాగ్యము లేనివారు, శివునియందు భక్తి లేనివారు కూడ చూడజాలరు (22). శివుడు ప్రసన్నుడు కాని వీరికి రాజ్యము, స్వర్గము, మోక్షము మరియు పాలతో కూడిన ఆహారము అను ప్రీతికరమైన వస్తువులు లభించవు (23). సర్వము శివుని అనుగ్రహముచే లభించునదే గాని, ఇతరదేవతల అనుగ్రహముచే లభించేది కాదు. ఇతర దేవతలయందు నిష్ఠ గలవారు దుఃఖముచే పీడింపబడి పరిభ్రమించెదరు (24). సర్వదా అడవిలో నివసించే మనకు ఇచట పాలు ఎక్కడనుండి వచ్చును? ఓ వత్సా! పాలు దొరికే ఉపాయము ఎక్కడ? అడవిలో బ్రతికే మనము ఎక్కడ? (25). భాగ్యహీనురాలగు నేను దారిద్య్రము వలన ఏమియు లేకుండుటచే పిండిని నీటిలో కలిపి పాలు కాని ఈ పాలను నీకు ఇచ్చితిని (26). నీవు మావయ్య గారి ఇంట్లో కాచిన తియ్యని పాలను కొద్దిగా త్రాగి యున్నావు. దాని వలన నీకు పాల రుచి తెలిసినది. ఆ రుచిని గుర్తు చేసుకొని (27), పాలను ఈయలేదని పలికి ఏడుస్తూ నాకు దుఃఖమును కలిగించు చున్నావు. శంభుని అనుగ్రహము లేనిదే నీకు పాలు లభించవు (28). జగన్మాతతో మరియు గణములతో కూడియున్న ఆ శివుని పాదపద్మముల యందు భక్తితో దేనిని సమర్పిస్తే, అదియే సకలసంపదలకు కారణమగును (29). పైన చెప్పిన విధముగా కోరికలు గలవారి కోరికలనన్నింటినీ తీర్చి ఫలములను సంపదలను ఇచ్చే మహాదేవుని మనమీనాడు పూజించలేదు (30). మనము ఇంతకు ముందు ధనమును ఉద్దేశించి పూజించి యుండలేదు. కావుననే, మనము దరిద్రులమైతిమి, కావున, నీకు పాలు లేవు (31). ఓ పుత్రా! పూర్వజన్మలో శివుని గాని, విష్ణుప్రభుని గాని ఉద్దేశించి దేనిని ఇస్తామో అదియే లభించును. గాని, మరియొకటి లభించదు (32).

వాయురువాచ |

ఇతి మాతృవచః శ్రుత్వా తథ్యం శోకాదిసూచకమ్‌ | బాలో%ప్యనుతపన్నంతః ప్రగల్భమిదమబ్రవీత్‌ || 33

వాయువు ఇట్లు పలికెను -

శోకము మొదలగు వాటిని సూచించే యథార్థమగు ఈ తల్లి మాటలను విని ఆతడు బాలకుడే అయిననూ మనస్సు లోపల బాధపడుతూ గంభీరముగా నిట్లనెను (33).

ఉపమన్యురువాచ |

శోకేనాలమితో మాతస్సాంబో యద్యస్తి శంకరః | త్యజ శోకం మహాభాగే సర్వం భద్రం భవిష్యతి || 34

శృణు మాతర్వచో మే%ద్య మహాదేవో%స్తి చేత్క్వచిత్‌ | చిరాద్వా హ్యచిరాద్వాపి క్షీరోదం సాధయామ్యహమ్‌ || 35

ఉపమన్యువు ఇట్లు పలికెను -

అమ్మా! శోకము చాలును. మంగళకరుడగు సాంబుడు ఉన్నచో, సర్వము మంగళము కాగలదు. ఓ మహాత్మురాలా! శోకమును విడిచి పెట్టుము (34). అమ్మా! ఇప్పుడు నా మాటను వినుము. మహాదేవుడు ఎక్కడైననూ ఉన్నచో, తొందరలో గాని, ఆలస్యముగా గాని, నేను పాల సముద్రమును సాధించెదను (35).

వాయురువాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్య బాలకస్య మహామతేః | ప్రత్యువాచ తదా మాతా సుప్రసన్నా మనస్వినీ || 36

వాయువు ఇట్లు పలికెను -

మహాబుద్ధిశాలియగు ఆ బాలకుని మాటలను విని అపుడు అభిమానవతి యగు ఆ తల్లి మిక్కిలి ప్రసన్నురాలై ఇట్లు బదులు చెప్పెను (36).

మాతోవాచ |

శుభం విచారితం తాత త్వయా మత్ర్పీతివర్ధనమ్‌ | విలంబం మా కృథాస్త్వం హి భజ సాంబం సదాశివమ్‌ || 37

సర్వస్మాదధికో%స్త్యేవ శివః పరమకారణమ్‌ | తత్కృతం హి జగత్సర్వం బ్రహ్మాద్యాస్తస్య కింకరాః || 38

తత్ర్పసాదకృతైశ్వర్య దాసాస్తస్య వయం ప్రభో | తం వినాన్యం న జానీమశ్శంకరం లోకశంకరమ్‌ || 39

అన్యాన్‌ దేవాన్‌ పరిత్యజ్య కర్మణా మనసా గిరా | తమేవ సాంబం సగణం భజ భావపురస్సరమ్‌ || 40

తస్య దేవాధిదేవస్య శివస్య వరదాయినః | సాక్షాన్నమశ్శివాయేతి మంత్రో%యం వాచకస్స్మృతః || 41

సప్తకోటిమహామంత్రాస్సర్వే సప్రణవాః పరే | తస్మిన్నేవ విలీయంతే పునస్తస్మాద్వినిర్గతాః || 42

సప్రసాదాశ్చ తే మంత్రాస్స్వాధికారాద్యపేక్షయా | సర్వాధికారస్త్వే కో%యం మంత్ర ఏవేశ్వరాజ్ఞయా || 43

యథా నికృష్టానుత్కృష్టాన్‌ సర్వానప్యాత్మనశ్శివః | క్షమతే రక్షితుం తద్వన్మంత్రో%యమపి సర్వదా || 44

ప్రబలశ్చ తథా హ్యేష మంత్రో మంత్రాంతరాదపి | సర్వరక్షాక్షమో%ప్యేష నాపరః కశ్చిదిష్యతే || 45

తస్మాన్మంత్రాంతరాంస్త్యక్త్వా పంచాక్షరపరో భవ | తస్మిన్‌ జిహ్వాంతరగతే న కించిదిహ దుర్లభమ్‌ || 46

అఘోరాస్త్రం చ శైవానాం రక్షాహేతురనుత్తమమ్‌ | తచ్చ తత్ర్పభవం మత్వా తత్పరో భవ నాన్యథా || 47

భ##స్మేదం తు మయా లబ్ధం పితురేవ తవోత్తమమ్‌ | విరజానలసంసిద్ధం మహావ్యాపన్నివారణమ్‌ || 48

మంత్ర చ తే మయా దత్తం గృహాణ మదనుజ్ఞయా | అనేనైవాశు జప్తేన రక్షా తవ భవిష్యతి || 49

తల్లి ఇట్లు పలికెను -

ఓ పుత్రా!నీవు నాకు ప్రీతిని వర్ధిల్లజేసే విధముగా శుభకరమగు ఆలోచనను చేసితివి. ఆలస్యమును చేయుకుము. నీవు జగన్మాతతో కూడియున్న సదాశివుని నిశ్చయముగా సేవించుము (37). సర్వకారణకారణుడగు శివుడు అందరికంటె అధికుడు. ఆయనయే జగత్తునంతనూ సృష్టించినాడు. బ్రహ్మ మొదలగు వారు ఆయనకు కింకరులు (38). మేము ఆ ప్రభుని అనుగ్రహముచే లభించిన ఐశ్వర్యము గలవారము; ఆ ప్రభుని దాసులము. లోకములకు మంగళములను చేయు ఆ శంకరుని విడిచి మేము మరియొకనిని యెరుగము అని వారు చెప్పుదురు (39). ఇతరదేవతలను విడిచిపెట్టి, గణములతో మరియు జగన్మాతతో గూడియున్న ఆ శివుని మాత్రమే మనోవాక్కాయ కర్మలతో భక్తిపూర్వకముగా సేవించుము (40), దేవాధిదేవుడు, వరముల నిచ్చువాడు అగు ఆ శివుని నమశ్శివాయ అను ఈ మంత్రము సాక్షాత్తుగా నిర్దేశించునని చెప్పబడినది (41). ఇతరములగు ఏడు కోట్ల మహామంత్రములు ఓంకారముతో సహా దానియందు మాత్రమే విలీనమై మరల దాని నుండి ఉద్భవించు చున్నవి (42). ఆయా మంత్రములు అధికారసంపద మొదలగు అంశములను ఆధారముగా చేసుకొని సాధకులను అనుగ్రహించను. కాని, ఈశ్వరుని ఆజ్ఞచే ఈ ఒక్క మంత్రమునందు మాత్రమే అందరికీ అధికారము గలదు (43). ఏ విధముగా నైతే ఉత్తములు మరియు అధములు అగు జీవులను అందరినీ కూడ శివుడు రక్షించుటకు సమర్థుడై యున్నాడో, అదే విధముగా ఈ మంత్రము కూడ సర్వకాలములలో సమర్థమగు చున్నది (44). ఈ మంత్రము ఇతరమంత్రముల కంటె కూడా బలము గలది. అందరినీ రక్షించే సామర్థ్యము గల మంత్రము ఇది తప్ప మరియొకటి అంగీకరింప బడుట లేదు (45). కావున, నీవు ఇతరమంత్రములను విడిచి పెట్టి పంచాక్షరమంత్రమునందు నిష్ఠ గలవాడవు కమ్ము. ఆ మంత్రము నాలుక లోపల మెదలుచున్నచో, ఈ లోకములో లభింప శక్యము కానిది ఏదీ ఉండదు (46). శివభక్తులకు రక్షణనిచ్చే సర్వశ్రేష్ఠమగు సాధనమైన అఘోరాస్త్రము కూడ దానినుండియే పుట్టినదని తెలుసుకొని, దానియందు తత్పరుడవు కమ్ము. మరియొక విధముగా చేయకుము (47). ఉత్తమమైనది, విరజాహో మముయొక్క అగ్ని యందు చక్కగా తయారైనది, గొప్ప ఆపదలను నివారించునది అగు ఈ భస్మను నేను నీ తండ్రి వద్దనుండియే పొందితిని (48). నేను నీకు మంత్రమును కూడ ఇచ్చితిని. నేను అనుమతి నిచ్చు చున్నాను. దీనిని తీసుకొనుము. దీనిని జపించుట చేతనే నీకు వెంటనే రక్షణ లభించగలదు (49).

వాయురువాచ |

ఏవం మాత్రా సమాదిశ్య శివమస్త్విత్యుదీర్య చ | విసృష్టస్తద్వచో మూర్ధ్ని కుర్వన్నేవ తదా మునిః || 50

తాం ప్రణమ్యైవముక్త్వా చ తపః కర్తుం ప్రచక్రమే | తమాహ చ తదా మాతా శుభం కుర్వంతు తే సురాః || 51

అనుజ్ఞాతస్తయా తత్ర తపస్తేపే స దుశ్చరమ్‌ | హిమవత్పర్వతం ప్రాప్య వాయుభక్షస్సమాహితః || 52

అష్టేష్టకాభిః ప్రాసాదం కృత్వా లింగం చ మృన్మయమ్‌ | తత్రావాహ్య మహాదేవం సాంబం సగణమవ్యయమ్‌ || 53

భక్త్యా పంచాక్షరేణౖవ పత్రైః పుషై#్పర్వనోద్భవైః | సమభ్యర్చ్య చిరం కాలం చచార పరమం తపః || 54

తతస్తపశ్చరంతం తం బాలమేకాకినం కృశమ్‌ | ఉపమన్యుం ద్విజవరం శివసంసక్తమానసమ్‌ || 55

పురా మరీచినా శప్తాః కేచిన్మునిపిశాచకాః | సంపీడ్య రాక్షసైర్భావైస్తపసో విఘ్నమాచరన్‌ || 56

స చ తైః పీడ్యమానో %పి తపః కుర్వన్‌ కథంచన | సదా నమశ్శివాయేతి క్రోశతి స్మార్తనాదవత్‌ || 57

తన్నాదశ్రవణాదేవ తపసో విఘ్నకారిణః | తే తం బాలం సముత్సృజ్య మునయస్సముపాచరన్‌ || 58

తపసా తస్య విప్రస్య చోపమన్యోర్మహాత్మనః | చరాచరం చ మునయః ప్రదీపితమభూజ్జగత్‌ || 59

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే ఉపమన్యు తపోవర్ణనం నామ చతుస్త్రింశో%ధ్యాయః (34).

వాయువు ఇట్లు పలికెను -

తల్లి ఈ విధముగా చక్కగా బోధించి, నీకు మంగళమగుగాక! అని పలికి పంపించెను. అపుడు ఉపమన్యుమహర్షి ఆ మాటను తలపై దాల్చి (50), ఆమెకు నమస్కరించి, అటులనే యని పలికి తపస్సును చేయుటకు సంసిద్ధుడాయెను. అపుడా తల్లి ఆతనితో, నీకు దేవతలు శుభమును చేయుదురు గాక! అని పలికెను (51). ఈ విధముగా ఆమె అనుమతిని పొంది ఆతడు హిమవత్పర్వతమునకు వెళ్లి అచట గాలిని భక్షిస్తూ ఏకాగ్రమైన మనస్సుతో చేయ శక్యము కాని తపస్సును చేసెను (52). ఆతడు ఎనిమిది ఇటుకలతో మందిరమును నిర్మించి మట్టితో లింగమును చేసి దానియందు జగన్మాతతో మరియు గణములతో కూడియున్న అవినాశుడగు మహాదేవుని ఆవాహన చేసి (53), పంచాక్షరమంత్రమును ఉచ్చరిస్తూ, అడవిలో ఉండే పత్రములతో మరియు పుష్పములతో భక్తి పూర్వకముగా చక్కగా పూజించి చిరకాలము గొప్ప తపస్సును చేసెను (54). బాలుడు, ఒంటరివాడు, బ్రాహ్మణశ్రేష్ఠుడు అగు ఆ ఉపమన్యుడు శివుని యందు లగ్నమైన మనస్సు గలవాడై తపస్సును చేయుచుండగా (55)., పూర్వములో మరీచిచే శపించబడి పిశాచములై యున్న కొందరు మునులు రాక్షసరూపములతో ఆతనికి చాల బాధను కలిగించి, తపస్సునకు విఘ్నమును చేసిరి (56). వారు పీడించుచున్ననూ ఆతడు ఏదో విధముగా తపస్సును చేయుచుండెను. ఆతడు అన్ని సమయములలో నమశ్శివాయ అని ఆర్తనాదమును చేయుచున్నవాని వలె ఏడ్చుచుండెను (57). ఆ నాదమును వింటూనే తపస్సునకు విఘ్నమును చేసే ఆ మునులు ఆ బాలకుని విడిచి పెట్టి వెళ్లిపోయిరి (58) .ఓ మునులారా! మహాత్ముడు, బ్రాహ్మణుడు అగు ఆ ఉపమన్యుని తపస్సుచే చరాచర జగత్తు గొప్ప కాంతితో నిండెను (59).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో ఉపమన్యుని తపస్సును వర్ణించే ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).

Siva Maha Puranam-4    Chapters