Siva Maha Puranam-4
Chapters
అథ పంచత్రింశో
ఉపమన్యుడు శివుని వద్దనుండి వరములను పొందుట
వాయురువాచ |
అథ సర్వే ప్రదీప్తాంగా వైకుంఠం ప్రయయుర్ద్రుతమ్ | ప్రణమ్యాహుశ్చ తత్సర్వం హరయే దేవసత్తమాః || 1
శ్రుత్వా తేషాం తదా వాక్యం భగవాన్ పురుషోత్తమః | కిమిదం త్వితి సంచింత్య జ్ఞాత్వా తత్కారణం చ సః || 2
జగామ మందరం తూర్ణం మహేశ్వరదిదృక్షయా | దృష్ట్వా దేవం ప్రణమ్యైవం ప్రోవాచ సుకృతాంజలిః || 3
వాయువు ఇట్లు పలికెను -
అపుడు బాగా మండుచున్న అవయవములు గలవారై దేవనాయకులు అందరు వెంటనే వైకుంఠమునకు వెళ్లి విష్ణువునకు నమస్కరించి ఆ వృత్తాంతమునంతనూ చెప్పిరి (1). పురుషోత్తముడగు ఆ విష్ణుభగవానుడు అపుడు వారి వాక్యమును విని, ఇది ఏమై ఉండును ? అని బాగా ఆలోచించి దానికి కారణమును తెలుసుకొని (2), వెంటనే మహేశ్వరుని చూడాలనే కోరికతో మందరపర్వతమునకు వెళ్లి, ఆ దేవుని చూచి చక్కగా చేతులను జోడించి నమస్కరించి ఇట్లు పలికెను (3).
విష్ణురువాచ |
భగవన్ బ్రాహ్మణః కశ్చిదుపమన్యురితి శ్రుతః | క్షీరార్థమదహత్సర్వం తపసా తన్నివారయ || 4
విష్ణువు ఇట్లు పలికెను -
ఓ భగవన్! ఉపమన్యుడు పేరు గల ఒక బ్రాహ్మణుడు పాల కొరకై తపస్సుతో సర్వమును దహించు చున్నాడు. దానిని ఆపుము (4).
వాయురువాచ |
ఇతి శ్రుత్వా వచో విష్ణోః ప్రాహ దేవో మహేశ్వరః | శిశుం నివారయిష్యామి తత్త్వం గచ్ఛ స్వమాశ్రమమ్ || 5
తచ్ఛ్రుత్వా శంభువచనం స విష్ణుర్దేవవల్లభః | జగామాశ్వాస్య తాన్ సర్వాన్ స్వలోకమమరాదికాన్ || 6
ఏతస్మిన్నంతరే దేవః పినాకీ పరమేశ్వరః | శక్రస్య రూపమాస్థాయ గంతుం చక్రే మతిం తతః || 7
అథ జగామ మునేస్తు తపోవనం గజవరేణ సితేన సదాశివః | సహ సురాసురసిద్ధమహోరగైరమరరాజతనుం స్వయమాస్థితః || 8
స వారణశ్చారు తదా విభుం తం నివీజ్య వాలవ్యజనేన దివ్యమ్ |
దధార శచ్యా సహితం సురేంద్రం కరేణ వామేన సితాతపత్రమ్ || 9
రరాజ భగవాన్ సోమశ్శక్రరూపీ సదాశివః | తేనాతపత్రేన యథా చంద్రబింబేన మందరః || 10
అస్థాయైవం హి శక్రస్య స్వరూపం పరమేశ్వరః | జగామానుగ్రహం కర్తుముపమన్యోస్తదాశ్రమమ్ || 11
తం దృష్ట్వా పరమేశానం శక్రరూపధరం శివమ్ | ప్రణమ్య శిరసా ప్రాహ మహామునివరస్స్వయమ్ || 12
వాయువు ఇట్లు పలికెను -
విష్ణువు యొక్క ఈ మాటను విని మహేశ్వరదేవుడు ఇట్లు పలికెను: నేను ఆ బాలకుని ఆపెదను. కావున, నీవు నీ ఆశ్రమమునకు వెళ్లుము (5). శంభుని ఆ మాటను విని దేవనాయకుడగు ఆ విష్ణువు దేవతలు మొదలగు వారినందరినీ ఓదార్చి తన లోకమునకు వెళ్లెను (6). ఇంతలో ప్రకాశస్వరూపుడు, పినాకమును ధరించినవాడు అగు పరమేశ్వరుడు అపుడు ఇంద్రుని రూపమును దాల్చి వెళ్లుటకు నిశ్చయించెను (7). అపుడు సదాశివుడు స్వయముగా దేవేంద్రుని రూపమును ధరించి దేవతలు, రాక్షసులు, సిద్ధులు, గొప్ప నాగులు అను వారితో గూడి తెల్లని గొప్ప ఏనుగుపై ఆ మునియొక్క తపోవనమునకు వెళ్లెను (8).అపుడు ఆ ఏనుగు శచీదేవితో గూడి చక్కగా ప్రకాశించే ఆ దేవేంద్రప్రభుని అందముగా వింజామరలతో వీచుచూ, సుందరమగు తుండముతో తెల్లని గొడుగును పట్టెను (9). ఉమాదేవితో గూడి యున్న సదాశివభగవానడు ఇంద్రుని రూపమును దాల్చినవాడై ఆ గొడుగుతో చంద్రబింబముతో కూడియున్న మందరపర్వతము వలె ప్రకాశించెను (10). పరమేశ్వరుడు ఈ విధముగా ఇంద్రుని రూపమును దాల్చి ఉపమన్యుని అనుగ్రహించుటకై ఆయన ఆశ్రమమునకు వెళ్లెను (11). పరమేశ్వరుడు, ఇంద్రరూపమును దాల్చి యున్నవాడు అగు ఆ శివుని చూచి, ఆ మహర్షి తలను వంచి నమస్కరించి స్వయముగా ఇట్లు పలికెను (12).
ఉపమన్యురువాచ |
పావితశ్చాశ్రమస్సో%యం మను దేవేశ్వర స్వయమ్ | ప్రాప్తో యత్త్వం జగన్నాథ భగవన్ దేవసత్తమ || 13
ఉపమన్యుడు ఇట్లు పలికెను -
ఓ దేవేంద్రా ! నీవు స్వయముగా వచ్చుటచే నా ఈ ఆశ్రమము పవిత్రమైనది. ఓ జగన్నాథా!భగవాన్! నీవు దేవతలలో శ్రేష్ఠుడవు (13).
వాయురువాచ |
ఏవముక్త్వా స్థితం ప్రేక్ష్య కృతాంజలిపుటం ద్విజమ్ | ప్రాహ గంభీరయా వాచా శక్రరూపధరో హరః || 14
వాయువు ఇట్లు పలికెను -
ఈ విధముగా పలికి చేతులను జోడించి నిలబడియున్న బ్రాహ్మణుని చూచి ఇంద్రుని రూపములోనున్న శివుడు గంభీరమగు వాక్కుతో నిట్లనెను (14).
శక్ర ఉ వాచ |
తుష్టో%స్మి తే వరం బ్రూహి తపసానేన సువ్రత | దదామి చేప్సితాన్ సర్వాన్ ధౌమ్యాగ్రజ మాహామునే || 15
ఇంద్రుడు ఇట్లు పలికెను -
ఓ గొప్ప వ్రతము గల మహర్షీ! నీవు ధౌమ్యుని అన్నగారివి. నీ ఈ తపస్సునకు నేను సంతసించితిని. నీ కోరికలను అన్నింటినీ ఇచ్చెదను. వరములను కోరుకొనుము (15).
వాయురువాచ |
ఏవముక్తస్తదా తేన శ##క్రేణ మునిపుంగవః | వరయామి శివే భక్తిమిత్యువాచ కృతాంజలిః || 16
తన్నిశమ్య హరిః ప్రాహ మాం న జానాపి లేఖపమ్ | త్రైలోక్యాధిపతిం శక్రం సర్వదేవనమస్కృతమ్ || 17
మద్భక్తో భవ విప్రర్షే మామేవార్చయ సర్వదా | దదామి సర్వం భద్రం తే త్యజ రుద్రం చ నిర్గుణమ్ || 18
రుద్రేణ నిర్గుణనాపి కింతే కార్యం భవిష్యతి . దేవపంక్తిబహిర్భూతో యః పిశాచత్వమాగతః ||19
తచ్ఛ్రుత్వా ప్రాహ స మునిర్జపన్ పంచాక్షరం మనుమ్ | మన్యమానో ధర్మవిఘ్నం ప్రాహ తం కర్తుమాగతమ్ || 20
వాయువు ఇట్లు పలికెను -
ఆ ఇంద్రుడు ఇట్లు పలుకగా అపుడు మహర్షి చేతులను జోడించి,నేను శివునియందు భక్తిని కోరుచున్నాను అని పలికెను (16). ఆ మాటను విని ఇంద్రుడు ఇట్లనెను: నీవు నన్ను యెరుగవు. నేను దేవప్రభుడనగు ఇంద్రుడను; ముల్లోకములకు అధిపతిని. దేవతలు అందరు నన్ను నమస్కరించెదరు (17). ఓ బ్రాహ్మణ- ఋషీ!నా భక్తుడవు కమ్ము. సర్వకాలములలో నన్నే పూజించుము. నేను సర్వమును ఇచ్చెదను. నీకు మంగళమగు గాక! నిర్గుణుడగు రుద్రుని విడిచి పెట్టుము (18). నిర్గుణుడు, దేవతల పంక్తినుండి బహిష్కరించ బడినవాడు, పిశాచత్వమును పొందినవాడు అగు రుద్రునితో కూడ నీకు పని యేముండును? (19) ఆ మాటను విని ఆ ముని పంచాక్షరమంత్రమును జపిస్తూ ఆతడు ధర్మమునకు విఘ్నమును చేయుటకు వచ్చిన వాడని తలంచి వానితో నిట్లనెను (20).
ఉపమన్యురువాచ |
త్వయైవం కథితం సర్వం భవనిందారతేన నై | ప్రసంగాదేవ దేవస్య నిర్గుణత్వం మహాత్మనః || 21
త్వం న జానాపి వై రుద్రం సర్వదేవేశ్వరేశ్వరమ్ | బ్రహ్మవిష్ణుమహేశానాం జనకం ప్రకృతేః పరమ్ || 22
సదసద్వ్యక్తమవ్యక్తం యమాహుర్బ్రహ్మవాదినః | నిత్యమేకమనేకం చ పరం తస్మాద్వృణోమ్యహమ్ || 23
హేతువాదవినిర్ముక్తం సాంఖ్యయోగార్థదం పరమ్ | ఉపాసతే తం తత్త్వజ్ఞా వరం తస్మాద్వృణోమ్యహమ్ || 24
నాస్తి శంభోః పరం తత్త్వం సర్వకారణకారణాత్ | బ్రహ్మవిష్ణ్వాదిదేవానాం స్రష్టుర్గుణపరాద్విభోః || 25
బహునాత్ర కిముక్తేన మయాద్యానుమితం మహత్ | భవాంతరే కృతం పాపం శ్రుతా నిందా భవస్య చేత్ || 26
శ్రుత్వా నిందాం భవస్యాథ తత్ క్షణాదేవ సంత్యజేత్ | స్వదేహం తన్నిహత్యాశు శివలోకం స గచ్ఛతి || 27
ఆస్తాం తావన్మమేచ్ఛేయం క్షీరం ప్రతి సురాధమ | నిహత్య త్వాం శివాస్త్రేణ త్యజామ్యేతం కలేవరమ్ || 28
ఉపమన్యువు ఇట్లు పలికెను -
శివుని నిందించుటయందు ప్రీతి గల నీవు ఈ విధముగా అంతనూ చెప్పియుంటివి. ప్రసంగవశముననే నీవు మహాత్ముడగు ఆ దేవుని నిర్గుణత్వమును కూడ చెప్పితివి (21). దేవనాయకులకు అందరికీ నియంత, బ్రహ్మవిష్ణుమహేశ్వరులకు తండ్రి, ప్రకృతికి అతీతమైనవాడు అగు రుద్రుని గురించి నీవు యెరుంగవు (22). కారణరూపములో అవ్యక్తుడైన ఏ శివుడు కార్య జగద్రూపములో వ్యక్తమైనాడో, బ్రహ్మవేత్తలు ఎవనిని నిత్యుడు, ఒక్కడు, అనేకుడు అని వర్ణించు చున్నారో, అట్టి శివునినుండి నేను వరమును కోరెదను (23). హేతువాదమునకు అతీతుడు, జ్ఞానయోగ కర్మయోగముల ఫలమునిచ్చువాడు, సర్వోత్కృష్టుడు అగు ఏ శివుని తత్త్వవేత్తలు ఉపాసించు చున్నారో, ఆయననుండియే నేను వరమును కోరుచున్నాను (24). సర్వకారణకారణుడు, బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలను సృష్టించినవాడు, సత్త్వరజస్తమోగుణములకు అతీతుడు, సర్వవ్యాపకుడు అగు శంభుని కంటె గొప్ప తత్త్వము మరియొకటి లేదు (25). ఈ విషయములో ఇన్ని మాటలను పలుకనేల? నేనీ నాడు శివుని నిందను వినినాను గనుక పూర్వజన్మలో మహాపాపమును చేసియుందునని ఊహించుచున్నాను (26).ఎవడైతే శివుని నిందను విని వెనువెంటనే ఆ నిందించినవానిని సంహరించి, తాను ప్రాణములను విడుచునో, వాడు వెంటనే శివలోకమును పొందును (27). ఓ దేవతాధమా! నాకు పాలపై గల ఈ కోరిక అటులనే ఉండుగాక! నేను నిన్ను శివాస్త్ర ముతో సంహరించి ఈ దేహమును విడిచెదను (28).
వాయురువాచ |
ఏవముక్త్వోపమన్యుస్తం మర్తుం వ్యవసితస్స్వయమ్ | క్షీరే వాంఛామపి త్యక్త్వా నిహంతుం శక్రముద్యతః || 29
భస్మాదాయ తదా ఘరమ ఘోరాస్త్రా భిమంత్రితమ్ | విసృజ్య శక్రముద్దిశ్య ననాద స మునిస్తదా || 30
స్మృత్వా శంభుపదద్వంద్వం స్వదేహం దగ్ధుముద్యతః | ఆగ్నేయీం ధారణాం బిభ్రదుపమన్యురవస్థితః || 31
ఏవం వ్యవసితే విప్రే భగవాన్ భగనేత్రహా | వారయామాస సౌమ్యేన ధారణాం తస్య యోగినః || 32
తద్విసృష్టమఘోరాస్త్రం నందీశ్వరనియోగతః | జగృహే మధ్యతః క్షిప్రం నందీ శంకరవల్లభః || 33
స్వం రూపమేవ భగవానాస్థాయ పరమేశ్వరః | దర్శయామాస విప్రాయ బాలేందుకృతశేఖరమ్ || 34
క్షీరార్ణవసహస్రం చ పీయూషార్ణవమేవ వా | దధ్యాదేరర్ణవాంశ్చైవ ఘృతోదార్ణవమేవ చ || 35
ఫలార్ణవం చ బాలస్య భక్ష్యభోజ్యార్ణవం తథా | అపూపానాం గిరిం చైవ దర్శయామాస స ప్రభుః || 36
ఏవం స దదృశే దేవో దేవ్యా సార్ధం వృషోపరి | గణశ్వరైస్త్రి శూలాద్యైర్దివ్యాసై#్త్ర రపి సంవృతః || 37
దివి దుందుభయో నేదుః పుష్పవృష్టిః పపాత చ | విష్ణుబ్రహ్మేంద్రప్రముఖైర్దేవైశ్ఛ న్నా దిశో దశ || 38
అతోపమన్యురానందసముద్రోర్మిభిరావృతః | పపాత దండవద్భూమౌ భక్తినమ్రేణ చేతసా || 39
ఏతస్మిన్ సమయే తత్ర సస్మితో భగవాన్ భవః | ఏహ్యేహీతి తమాహూయ మూర్ధ్న్యాఘాయ దదౌ వరాన్ || 40
వాయువు ఇట్లు పలికెను -
ఉపమన్యువు ఈ విధముగా పలికి స్వయముగా తాను మరణించుటకు నిశ్చయించుకొని, పాలయందు కోరికను కూడ విడిచి పెట్టి, ఇంద్రుని సంహరించుటకు ఉద్యుక్తుడయ్యెను (29). అపుడు ఆ ముని భయంకరమగు భస్మను తీసుకొని అఘోరాస్త్రముతో అభిమంత్రించి ఇంద్రుని ఉద్దేశించి దానిని విడిచిపెట్టి తరువాత నాదమును చేసెను (30). ఉపమన్యుడు శివుని పాదములను రెండింటినీ స్మరించి అగ్నిని మనస్సులో ధ్యానించి దానితో తన దేహమును దహించుటకు సంసిద్ధుడుగా నుండెను (31). ఆ బ్రాహ్మణుడు ఇట్లు సిద్ధపడుచుండగా, భగుని నేత్రములను ఊడబెరకిన ఆ భగవానుడు ఆ యోగియొక్క మానసికధారణను తన సౌమ్యదృష్టితో నివారించెను (32).వానిచే విడువబడిన అఘోరాస్త్రమును నందీశ్వరుని ఆజ్ఞచే శంకరునకు ప్రియుడగు నంది వెంటనే మధ్యలో పట్టుకొనెను (33). పరమేశ్వర భగవానుడు చంద్రవంకతో అలంకరింపబడిన శిరస్సు గల తన రూపమును స్వీకరించి ఆ బ్రాహ్మణునకు ఆ రూపమును చూపించెను (34). ఆ ప్రభుడు ఆ బాలకునకు వేయి పాల సముద్రములను, అమృతసముద్రమును, పెరుగు సముద్రములను, నేతి సముద్రమును, నీటి సముద్రమును, ఫలరస సముద్రమును, భక్ష్యభోజ్యముల సముద్రమును, అప్పముల పర్వతమును కూడ చూపించెను (35, 36). ఈ విధముగా దేవితో కూడియున్న ఆ దేవుడు గణాధ్యక్షులచే మరియు త్రిశూలము మొదలగు దివ్యాస్త్రములతో చుట్టు వారబడి యున్నవాడై నందీశ్వరునిపై కానవచ్చును (37). దేవదుందుభులు మ్రోగినవి. పుష్పవర్షము కురిసెను. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలగు దేవతలతో పది దిక్కులునిండి పోయినవి (38). అపుడు ఉపమన్యుడు ఆనందసముద్రములో నోలలాడుచున్నవాడై భక్తితో నమ్రమైన మనస్సుతో భూమిపై దండము వలె పడి నమస్కరించెను (39). అదే సమయములో అచట శివభగవానుడు చిరునవ్వుతో రమ్ము., రమ్ము అని వానిని పిలిచి నుదుటిపై ముద్దాడి వరముల నిచ్చెను(40).
శివ ఉవాచ |
భక్ష్య భోజ్యాన్ యథాకామం బాంధవైర్భుంక్ష్వ సర్వదా | సుఖీ భవ సదా దుఃఖాన్నిర్ముక్తో భక్తిమాన్మమ || 41
ఉపమన్యో మహాభాగ తవాంబైషా హి పార్వతీ | మయా పుత్రీకృతో హ్యద్య దత్తః క్షీరో దకార్ణవః || 42
మధునశ్చార్ణవశ్చైవ దధ్యన్నార్ణవ ఏవ చ | ఆజ్యౌదనార్ణవశ్చైవ ఫలాద్యర్ణవ ఏవ || 43
అపూపగిరయశ్చైవ భక్ష్యభోజ్యార్ణవస్తథా | ఏతే దత్తా మయా తే హి త్వం గృహ్ణీష్వ మహామునే || 44
పితా తవ మహాదేవో మాతా వై జగదంబికా | అమరత్వం మయా దత్తం గాణపత్యం చ శాశ్వతమ్ || 45
వరాన్ వరయ సుప్రీత్యా మనో%భిలషితాన్ పరాన్ | ప్రసన్నో%హం ప్రదాస్యామి నాత్ర కార్యా విచారణా || 46
శివుడు ఇట్లు పలికెను -
భక్ష్యములను, భోజ్యములను యథేచ్ఛగా సర్వకాలములలో బంధువులతో కలిసి భుజించుము. సర్వదా నాయందు భక్తి గలవాడవై దుఃఖమునుండి విముక్తుడవై సుఖమును పొందుము (41). ఓ ఉపమన్యూ! మహాత్మా! ఈ పార్వతి నీకు తల్లి. ఈనాడు నేను నిన్ను పుత్రునిగా స్వీకరించుచున్నాను. నేను నీకు పాలు, నీరు, తేనె, పెరుగు అన్నము, నేయి అన్నము, పండ్ల రసములు మొదలగు వాటి సముద్రములను, అప్పముల పర్వతములను, భక్ష్యభోజ్యముల సముద్రమును ఇచ్చినాను. ఓ మహర్షీ! నీవు వీటిని తీసుకొనుము (42-44). నీకు మహాదేవుడు తండ్రి; జగదంబ తల్లి. నేను నీకు అమృతత్వమును, శాశ్వతమగు గణాధ్యక్ష పదమును ఇచ్చినాను (45). ఇంకనూ నీ మనస్సునకు నచ్చిన వరములను మిక్కిలి ప్రీతితో కోరుకొనుము. ప్రసన్నుడనైన నేను ఇచ్చెదను. ఈ విషయములో నీవు ఆలోచించకుము (46).
వాయురువాచ |
ఏవముక్త్వా మహాదేవః కరాభ్యాముపగృహ్య తమ్ | మూర్ధ్న్యాఘ్రాయ సుతస్తే%యమితి దేవ్యై న్యవేదయత్ || 47
దేవీ చ గుహవత్ర్పీత్యా మూర్ధ్ని తస్య కరాంబుజమ్ | విన్యస్య ప్రదదౌ తసై#్మ కుమారపదమవ్యయమ్ || 48
క్షీరాబ్ధిరపి సాకారః క్షీరం స్వాదు కరే దధత్ | ఉపస్థాయ దదౌ పిండీభూతం క్షీరమనశ్వరమ్ || 49
యోగైశ్వర్యం సదా తుష్టిం బ్రహ్మవిద్యామనశ్వరామ్ | సమృద్ధిం పరమాం తసై#్మ దదౌ సంతుష్టమానసః || 50
అథ శంభుః ప్రసన్నాత్మా దృష్ట్వా తస్య తపోమహః | పునర్దదౌ వరం దివ్యం మునయే హ్యుపమన్యవే || 51
వ్రతం పాశుపతం జ్ఞానం వ్రతయోగం చ తత్త్వతః | దదౌ తసై#్మ ప్రవక్తృత్వపాటవం సుచిరం పరమ్ || 52
సో%పి లబ్ధ్వా వరాన్ దివ్యాన్ కుమారత్వం చ సర్వదా | తస్మాచ్ఛివాచ్చ తస్యాశ్చ శివాయా ముదితో%భవత్ || 53
తతః ప్రసన్నచేతస్కస్సుప్రణమ్య కృతాంజలిః |యయాచే స వరం విప్రో దేవదేవాన్మహేశ్వరాత్ || 54
వాయువు ఇట్లు పలికెను -
మహాదేవుడు ఇట్లు పలికి, వానిని చేతులతో దగ్గరకు తీసుకొని, నుదుటిపై ముద్దిడి, ఈతడునీకు పుత్రుడు అని దేవికి విన్నవించెను (47). దేవి కూడ కుమారస్వామిని వలెనే ప్రేమతో వాని తలపై పద్మమువంటి తన చేతిని ఉంచి వానికి శాశ్వతమగు కుమారపదమును ఇచ్చెను (48). పాల సముద్రము కూడ రూపమును దాల్చి తియ్యని పాలను చేతిలో పట్టుకొని దగ్గరకు వచ్చి, చెడిపోని విధముగా ముద్ద చేయబడిన పాలను ఇచ్చెను (49). సంతోషముతో నిండిన మనస్సు గల శివుడు ఆతనికి యోగసిద్ధిని, నిత్యమగు ఆనందమును, శాశ్వతమగు బ్రహ్మవిద్యను, సర్వోత్కృష్టమగు సంపదను ఇచ్చెను (50). తరువాత ప్రసన్నమగు మనస్సుగల శంభుడు వాని తపస్సుయొక్క తేజస్సును చూచి, మరల ఆ ఉపమన్యుమహర్షికి దివ్యమగు వరమునిచ్చెను (51). పాశుపత వ్రతమును, దాని జ్ఞానమును, తత్త్వ దృష్టిలో వ్రతము యొక్క జ్ఞానమును, చాలకాలము ప్రవచనము చెప్పగలిగే గొప్ప పాటవమును ఇచ్చెను (52). ఆ ఉపమన్యుడు కూడా ఆ పార్వతీపరమేశ్వరులనుండి దివ్యములగు వరములను, శాశ్వతమగు కుమారపదమును పొంది ఆనందించెను(53). తరువాత ప్రసన్నమగు మనస్సు గల ఆ బ్రాహ్మణుడు చేతులను జోడించి చక్కగా నమస్కరించి దేవదేవుడగు మహేశ్వరునినుండి వరమును కోరెను (54).
ఉపమన్యురువాచ |
ప్రసీద దేవదేవేశ ప్రసీద పరమేశ్వర | స్వభక్తిం దేహి పరమాం దివ్యామవ్యభిచారిణీమ్ || 55
శ్రద్ధాం దేహి మహాదేవ స్వసంబంధిషు మే సదా | స్వదాస్యం పరమం స్నేహం సాన్నిధ్యం చైవ సర్వదా || 56
ఏవముక్త్వా ప్రసన్నాత్మా హర్షగద్గదయా గిరా | స తుష్టావ మహాదేవముపమన్యుర్ద్విజోత్తమః || 57
దేవదేవ మహాదేవ శరణాగతవత్సల | ప్రసీద కరుణాసింధో సాంబ శంకర సర్వదా || 58
ఉపమన్యువు ఇట్లు పలికెను -
ఓ దేవదేవా! ఈశా! పరమేశ్వరా! ప్రసన్నుడవు కమ్ము. సర్వోత్కృష్టమైనది, దివ్యమైనది, అచంచలమైనది అగు నీయందలి భక్తిని ఇమ్ము (55). ఓ మహాదేవా! సర్వకాలములలో నీకు సంబంధించిన వారియందు నాకు శ్రద్ధను ఇమ్ము. నీయందు దాస్యభావమును, సర్వోత్కృష్టమగు ప్రేమను, శాశ్వతమగు సన్నిధిని కూడ ఇమ్ము (56). బ్రాహ్మణశ్రేష్ఠుడగు ఆ ఉపమన్యుడు ఇట్లు పలికి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆనందముతో బొంగేరు పోయిన కంఠముతో మహాదేవుని స్తుతించెను (57). ఓ దేవదేవా! మహాదేవా! శరణు జొచ్చిన వారియందు ప్రేమ గల వాడా! దయాసముద్రా! జగన్మాతతో కూడియున్నవాడా! శంకరా! సర్వదా ప్రసన్నుడవు కమ్ము (58).
వాయురువాచ |
ఏవముక్తో మహాదేవస్సర్వేషాం చ వరప్రదః | ప్రత్యువాచ ప్రసన్నాత్మోపమన్యుం మునిసత్తమమ్ || 59
వాయువు ఇట్లు పలికెను -
అందరికీ వరములనిచ్చే మహాదేవుడు ఇట్లు పలుకబడిన వాడై ప్రసన్నమగు మనస్సు గలవాడై ఉపమన్యుమహర్షికి ఇట్లు బదులిడెను (59).
శివ ఉవాచ |
వత్సోపమన్యో తుష్టో%స్మి సర్వం దత్తం మయా హితే | దృఢభక్తో%సి విప్రర్షే మయా జిజ్ఞాసితో హ్యాసి || 60
అజరశ్చామరశ్చైవ భవ త్వం దుఃఖవర్జితః | యశస్వీ తేజసా యుక్తో దివ్యజ్ఞానసమన్వితః || 61
అక్షయా బాంధవాశ్చైవ కులం గోత్రం చ తే సదా | భవిష్యతి ద్విజశ్రేష్ఠ మయి భక్తిశ్చ శాశ్వతీ || 62
సాన్నిధ్యం చాశ్రమే నిత్యం కరిష్యామి ద్విజోత్తమ | ఉపకంఠం మమ త్వం వై సానందం విహరిష్యసి || 63
ఏవముక్త్వా స భగవాన్ సూర్యకోటిసమప్రభః | ఈశానస్స వరాన్ దత్త్వా తత్రై వాంతర్దధే హరః || 64
ఉపమన్యుః ప్రసన్నాత్మా ప్రాప్య తస్మాద్వరాద్వరాన్ | జగామ జననీస్థానం సుఖం ప్రాపాధికం చ సః || 65
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వఖండే ఉపమన్యు చరితవర్ణనం నామ పంచత్రింశో%ధ్యాయః (35).
|| సమాప్తో%యం సప్తమ్యాం వాయవీయసంహితాయాం పూర్వఖండః ||
శివుడు ఇట్లు పలికెను -
ఓ వత్సా! ఉపమన్యూ! నేను సంతోషించి నీకు సర్వమును ఇచ్చితిని. ఓ బ్రాహ్మణ - ఋషీ! నీవు దృఢమగు భక్తి గలవాడవు. నేను నిన్ను పరీక్షించ గోరితిని (60). నీవు జరామరణములు లేనివాడవు, దుఃఖవిముక్తుడవు, యశశ్శాలివి, తేజశ్శాలివి, దివ్యజ్ఞానముతో కూడియుండు వాడవు కమ్ము (61). నీ బంధువులు వినాశమును పొందరు. నీ కులము, గోత్రము శాశ్వతముగా అక్షయముగా నుండగలదు. ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీకు నాయందు శాశ్వతమగు భక్తి ఉండగలదు (62). ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీ ఆశ్రమములో నేను నిత్యము సన్నిహితుడనై ఉండగలను. నీవు నా సన్నిధిలో ఆనందముగా విహరించ గలవు (63). ఇట్లు పలికి కోటి సూర్యులు కాంతి గలవాడు, సర్వమును శాసించువాడు అగు ఆ హరభగవానుడు వరములనిచ్చి అచటనే అంతర్ధానమును చెందెను (64). ఆ ఉపమన్యుడు ఆ గొప్ప దైవమునుండి వరములను పొంది ప్రసన్నమగు మనస్సు గలవాడై తల్లి ఉన్న స్థానమునకు వెళ్లి అధికమగు సుఖమును పొందెను (65).
శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు పూర్వఖండలో ఉపమన్యుని వృత్తాంతమును వర్ణించే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).
ఏడవదియగు వాయవీయసంహితలో పూర్వఖండము ముగిసినది.
|| శ్రీకృష్ణార్పణమస్తు ||
|| శ్రీ సాంబ సదా శివార్పణమస్తు ||