Siva Maha Puranam-4    Chapters   

అథ అష్టత్రింశో%ధ్యాయః

సగరోపాఖ్యానము

సూత ఉవాచ|

సత్యవ్రతస్తు తద్భక్త్యా కృపయా చ ప్రతిజ్ఞయా | విశ్వామిత్ర కలత్రం చ పోషయామాస వై తదా || 1

హత్వామృగాన్‌ వరాహాంశ్చ మహిషాంశ్చ వనే చరాన్‌ | విశ్వామిత్రాశ్రమాభ్యాశే తన్మాంసం చాక్షిపన్మునే || 2

తీర్థం గాంచైవ గోత్రం చ తథైవాంతః పురం మునిః | యాజ్యోపాధ్యాయసంయోగాద్వసిష్ఠః పర్యరక్షత || 3

సత్యవ్రతస్య వాక్యాద్వా భావినో%ర్థస్య వై బలాత్‌ | వసిష్టో%భ్యధికం మన్యుం ధారయామాస నిత్యశః || 4

పిత్రా తు తం తదా రాష్ట్రాత్పరిత్యక్తం స్వమాత్మజమ్‌ | న వారయామాస మునిర్వసిష్ఠః కారణన చ || 5

పాణిగ్రహణమంత్రాణాం నిష్టా స్యాత్సప్తమే పదే | న చ సత్యవ్రతస్తస్య తమూపాంశుమబుద్ధ్యత || 6

తస్మిన్‌ స పరితోషాయ పితురాసీన్మహాత్మనః | కులస్య నిష్కృతిం విప్ర కృతవాన్‌ వై భ##వేదితి || 7

న తం వసిష్ఠో భగవాన్‌ పిత్రా త్యక్తం న్యవారయత్‌ | అభిషేక్ష్యామ్యహం పుత్రమస్యాం నైవాబ్రవీన్మునిః || 8

స తు ద్వాదశ వర్షాణి దీక్షాం తాముద్వహద్బలీ | అవిద్యమానే మాంసే తు వసిష్ఠస్య మహాత్మనః || 9

సర్వకామదుహాం దోగ్ధ్రీం దదర్శ స నృపాత్మజః | తాంవై క్రోధచ్చ లోభాచ్చ శ్రమాద్వై చ క్షుధాన్వితః || 10

దాశధర్మగతో రాజా తాం జఘాన స వై మునే | స తం మాంసం స్వయం చైవ విశ్వామిత్రస్య చాత్మజమ్‌ || 11

భోజయామాస తచ్ఛ్రుత్వా వసిష్ఠో హ్యస్య చుక్రుధే | ఉవాచ చ మునిశ్రేష్ఠస్తం తదా క్రోధసంయుతః || 12

సూతుడు ఇట్లు పలికెను -

సత్యవ్రతుడు విశ్వామిత్రుని యందు గల భక్తిచే, ప్రతిజ్ఞను చేసియుండుటచే మరియు దయాస్వభావము గలవాడగుటచే ఆ సమయములో విశ్వామిత్రుని భార్యను పోషించెను (1). ఓ మునీ! ఆతడు లేళ్లను, పందులను, వనములో తిరిగే దున్నలను సంహరించి వాటి మాంసమును విశ్వామిత్రుని ఆశ్రమమునకు సమీపములో ఉంచెడివాడు (2). యాజకుడు మరియు ఉపాధ్యాయుడు అయి ఉండుటచే వసిష్ఠుడు తీర్థమును, గోవును, గోత్రమును మరియు భార్యాదికమును రక్షించెడివాడు (3). సత్యవ్రతుని పలుకుల వలన, మరియు భవితవ్యము బలీయమగుట వలన వసిష్ఠుడు సర్వకాలములలో అధికమగు కోపమును కలిగియుండెడివాడు (4). ఆ దేశపు మహారాజు తన కుమారుని సకారణముగా దేశమునుండి బహిష్కరించగా, ఆ వసిష్ఠమహర్షి వారించలేదు (5). వివాహమంత్రములు సప్తపదిలో పర్యవసానమును పొందును. కాని ఈ రహస్యము సత్యవ్రతునకు తెలియదు (6). ఓ విప్రా! ఆయన మహాత్ముడగు తండ్రియొక్క సంతోషము కొరకు, కులధర్మములు పాటింపబడుననే భావన గలవాడై దేశనిష్కాసనమును పాలించెను (7). తండ్రి ఆయను బహిష్కరించుచుండగా పూజ్యుడగు వసిష్ఠుడు వారించలేదు. 'రాజ్యమునందు ఈ మహారాజు పుత్రుని నేను అభిషేకించెదను' అని ఆయన చెప్పనే లేదు (8). ఆ బలవంతుడగు సత్యవ్రతుడు పన్నెండు సంవత్సరములు దేశబహిష్కారమును దీక్షగా పాలించెను. ఆహారము కొరకై ఒకనాడు ఆతనికి మాంసము దొరకలేదు. అపుడా రాజపుత్రునకు కోరికలనన్నిటినీ ఈడేర్చే ధేనువు కనబడెను. అది మహాత్ముడగు వసిష్టునిది. ఆతడు ఆకలిగొని యుండుటచే, వసిష్ఠుని పై కోపము ఉండుటచే, ఆహారము నందు తృష్ణ ఉండుటచే, మరియు శ్రమపడి యుండుటచే, కిరాతప్రవృత్తిని అనుసరించి ఉన్నవాడై ఆ ధేనువును సంహరించెను. ఓ మునీ! ఆయన స్వయముగా ఆ మాంసమును తాను భక్షించి విశ్వామిత్రుని కుమారునిచే భుజింపజేసెను. ఈ విషయమును విని వసిష్ఠుడు ఆయనపై కోపించెను. అపుడా మహర్షి కోపముతో నిండిన వాడై ఆతనితో నిట్లనెను (9-12).

వసిష్ఠ ఉవాచ|

పాతయేయమహం క్రూరం తవ శంకుమయోమయమ్‌ | యది తే ద్వావిమౌ శంకూ నశ్యేతాం వై కృతౌ పురా || 13

పితుశ్చాపరితోషేణ గురోర్దోగ్ధ్రీవధేన చః | అప్రోక్షితోపయోగాచ్చ త్రివిధస్తే వ్యతిక్రమః || 14

త్రిశంకురితి హోవాచ త్రిశంకురితి స స్మృతః | విశ్వామిత్రస్తు దారాణామాగతో భరణ కృతే || 15

తేన తసై#్మ వరం ప్రాదాన్మునిః ప్రీతస్త్రిశంకవే | ఛంద్యమానో వరేణాథ వరం వవ్రే నృపాత్మజః || 16

అనావృష్టి భ##యే చాస్మిన్‌ జాతే ద్వాదశవార్షికే | అభిషిచ్య పితూ రాజ్యే యాజయామాస తం మునిః || 17

మిషతాం దేవతానం చ వసిష్ఠస్య చ కౌశికః | స శరీరం తదా తం తు దివమారోహయత్ర్పభుః || 18

తస్య సత్యరథా నామ భార్యాకేకయవంశజా | కుమారం జనయామాస హరిశ్చంద్రమకల్మషమ్‌ || 19

సవై రాజా హరిశ్చంద్రో త్రైశంకవ ఇతి స్మృతః | ఆహర్తా రాజసూయస్య సమ్రాడితి హ విశ్రుతః || 20

హరిశ్చంద్రస్య హి సుతో రోహితో నామ విశ్రుతః | రోహితస్య వృకః పుత్రో వృకాద్బాహుస్తు జజ్ఞివాన్‌ || 21

హై హయాస్తాల జంఘాశ్చ నిరస్యంతి స్మతం నృపమ్‌ | నాత్మార్థే ధార్మికో విప్రస్స హి ధర్మపరో%భవత్‌ || 22

సగరం ససుతం బాహుర్జజ్ఞే సహ గరేణ వై | ఔర్వస్యాశ్రమమాసాద్య భార్గవేణాభిరక్షతః || 23

ఆగ్నేయమస్త్రం లబ్ధ్వా చ భార్గవాత్సగరో నృపః | జిగాయ పృథివీం హత్వా తాలజంఘాన్‌ సహై హయాన్‌ || 24

శకాన్‌ బహూదకాంశ్చైవ పారదాన్‌ తగణాన్‌ ఖశాన్‌ | సుధర్మం స్థాపయామాస శశాస వృషతః క్షితిమ్‌ || 25

వసిష్ఠుడు ఇట్లు పలికెను -

నీకు పూర్వము రెండు శంకువులు వేయబడియున్నవి. అవి తొలగిపోయినచో, నీకు మరియొక పీడాకరమగు ఇనుప శంకువును నేను వేసెదను (13). నీవు తండ్రికి దుఃఖమును కలిగించితివి. గురువునకు పాలను ఇచ్చే ఆవును సంహరించి, ప్రోక్షించకుండగా వినియోగించితివి. నీవీ విధముగా మూడు రకములుగా ధర్మమును ఉల్లంఘించితివి (14). వసిష్ఠుడు ఆయనకు 'త్రిశంకుడు' అని పేరు పెట్టుటచే ఆ పేరే స్థిరపడెను. ఆయన విశ్వామిత్రుని భార్యను పోషించెను. ఇంతలో విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆ త్రిశంకునిపై ప్రీతిని పొందినవాడై వరమునిచ్చెను. వరమును కోరుకొమ్మని మహర్షి చెప్పగా, ఆ రాజకుమారుడు వరమును కోరెను. అపుడా మహర్షి ఆయన కోరిక మేరకు, పన్నెండు సంవత్సరములనుండి వర్షాభావపరిస్థితులు కలిగియుండగా, ఆయనను తండ్రియొక్క రాజ్యమునకు రాజుగా అభిషేకించి యజ్ఞమును చేయించెను (15-17). సర్వసమర్ధుడగు విశ్వామిత్రుడు, దేవతలు మరియు వసిష్ఠుడు నిస్సహాయులై చూచుచుండగా, త్రిశంకువును బొందెతో స్వర్గమునధిష్ఠింప జేసెను (18). కేకయవంశమునందు పుట్టిన సత్యరథ అనునామె త్రిశంకుని భార్య. ఆమె పరమ పవిత్రుడగు హరిశ్చంద్రుడనే కుమారునకు జన్మనిచ్చెను (19). ఆ హరిశ్చంద్ర మహారాజునకు త్తైశంకవుడు (త్రిశంకుని పుత్రుడు) అని ప్రసిద్ధి. ఆ చక్రవర్తి రాజసూయయాగమును చేసినవాడని ప్రఖ్యాతి గలదు (20). హరిశ్చంద్రుని కుమారుడు ప్రఖ్యాతుడైన రోహితుడు. ఆయనకు వృకుడు, వృకునకు బాహువు పుత్రులు (21). ఓ విప్రా! ఆ బాహుమహారాజు ధర్మాత్ముడు. ఆయన స్వార్థము కొరకు ప్రవర్తించెడివాడు కాదు. ఆ మహారాజును హైహయులు, తాలజంఘులు పదవీచ్యుతుని చేసిరి (22). ఆ బాహువునకు ఒక పుత్రుడు కలిగెను. ఆ పుత్రుడు విషముతో గూడి జన్మించుటచే సగరుడైనాడు. బాహువు భృగువంశజుడగు ఔర్వుని ఆశ్రమమునకు వెళ్లగా, ఆయన ఆ బాలుని కాపాడినాడు (23). సగరమహారాజు భార్గవుని వద్దనుండి ఆగ్నేయాస్త్రమును సంపాదించి తాలజంఘులను, హైహయులను సంహరించి భూమిని జయించెను (24). ఆయన శక-బహూదక-పారద-తగణ-ఖశులను జయించి చక్కని ధర్మమును నెలకొల్పి భూమిని ధర్మబద్ధముగా పాలించెను (25).

శౌనక ఉవాచ|

సవై గరేణ సహితః కథం జాతస్తు క్షత్రియాన్‌| జితవానేతదాచక్ష్వ విస్తరేణ హి సూతజ || 26

శౌనకుడిట్లు పలికెను -

ఓ సూతపుత్రా! ఆతడు విషముతో గూడి ఎట్లు జన్మించెను? క్షత్రియులనెట్లు జయించెను? ఈ విషయములను విస్తారముగా చెప్పుము (26).

సూత ఉవాచ|

పారీక్షితేన సంపృష్టో వై శంపాయన ఏవ చ| యదాచష్ట స్మతద్వక్ష్యే శృణుషై#్వకమనా మునే|| 27

సూతుడిట్లు పలికెను -

జనమేజయుడు ప్రశ్నించగా వైశంపాయనుడు చెప్పిన విషయమును చెప్పుచున్నాను. ఓ మునీ! ఏకాగ్రమగు మనస్సు గలవాడవై వినుము (27).

పారీక్షిత ఉవాచ|

కథం స సగరో రాజా గరేణ సహితో మునే| జాతస్స జఘ్నివాన్‌ భూయానేతదాఖ్యాతుమర్హసి || 28

జనమేజయుడిట్లు పలికెను -

ఓ మునీ! ఆ సగరమహారాజు విషముతో గూడి ఎట్లు జన్మించినాడు? అనేక శత్రువులనెట్లు సంహరించినాడు? ఈ విషయమును నీవు చెప్పదగును (28).

వైశంపాయన ఉవాచ|

బాహోర్వ్యసనినస్తాత హృతం రాజ్యమభూత్కిల | హైహయైస్తాలజంఘైశ్చ శ##కైస్సార్ధం విశాం పతే || 29

యవనాః పారదాశ్చైవ కాంబోజాః పాహ్లవాస్తథా | బహూదకాశ్చ పంచైవ గణాః ప్రోక్తాశ్చ రక్షసామ్‌ || 30

ఏతే పంచగణా రాజన్‌ హైహయార్థేషు రక్షసామ్‌ | కృత్వా పరాక్రమాన్‌ బాహో రాజ్యం తేభ్యో దదుర్బలాత్‌ || 31

హృతరాజ్యస్తతో విప్రాస్స వై బాహుర్వనం య¸° | పత్న్యా చానుగతో దుఃఖీ సవై ప్రాణానవాసృజత్‌ || 32

పత్నీ య యాదవీ తస్య సగర్భా పృష్ఠతో గతా | సపత్న్యా చ గరస్తసై#్య దత్తః పూర్వం సుతేర్ష్యయా || 33

సా తు భర్తుశ్చితాం కృత్వా జ్వలనం చావరోహత | ఔర్వస్తాం భార్గవో రాజన్‌ కారుణ్యాత్సమవారయత్‌ || 34

తస్యాశ్రమే స్థితా రాజ్ఞీ గర్భరక్షణహేతవే | సిషేవే మునివర్యం తం స్మరంతీ శంకరం హృదా || 35

ఏకదా ఖలు తద్గర్భో గరేణౖవ సహ చ్యుతః | సుముహూర్తే సులగ్నే చ పంచోచ్చగ్రహ సంయుతే || 36

తస్మింల్లగ్నే చ బలిని సర్వథా మునిసత్తమ | వ్యజాయత మహాబాహుస్సగరో నామ పార్థివః || 37

ఔర్వస్తు జాతకర్మాది తస్య కృత్వా మహాత్మనః | అధ్యాప్య వేదశాస్త్రాణి తతో%స్త్రం ప్రత్యపాదయత్‌ || 38

ఆగ్నేయం తం మహాభాగో హ్యమరైరపి దుస్సహమ్‌ | జగ్రాహ విధినా ప్రీత్యా సగరో%సౌ నృపోత్తమః || 39

వైశంపాయనుడిట్లు పలికెను -

ఓ వత్సా! మహారాజా! ఆపదలకు గురియై యున్న బాహువుయొక్క రాజ్యమును హైహయ-తాలజంఘ-శకులు అపహరించిరి గదా! (29) యవన-పారద-కాంబోజ-పాహ్లవ-బహూదకులనే అయిదు రాక్షస గణములు గలవు (30). ఓ రాజా! ఈ అయిదు రాక్షస గణములు హైహయుల కొరకై పరాక్రమమును ప్రదర్శిస్తూ బాహువుయొక్క రాజ్యమును ఊడలాగి వారికి ఇచ్చిరి (31). ఓ బ్రాహ్మణులారా! అపుడు బాహువు రాజ్యమును పోగొట్టుకొని అడవుల పాలయ్యెను. దుఃఖితుడైయున్న ఆయన వెంట భార్య నడిచెను. ఆయన అచట ప్రాణములను విడిచెను (32). యదువంశమునందు జన్మించిన ఆయనయొక్క భార్య ఆయన వెంట వెళ్లియుండెను. ఆమెకు తనకంటె ముందు పుత్రుడు జన్మించుననే ఈర్ష్యతో సవతి విషమును పెట్టెను. (33). ఆమె భర్త చితికి నిప్పును పెట్టి తాను కూడ దానిపై అధిరోహించెను. ఓ రాజా! అపుడు భృగువంశజుడగు ఔర్వుడు దయతో ఆమెను అడ్డుకొనెను (34). ఆ మహారాణి గర్భమును పదిల పరచుటకై ఆయన ఆశ్రమములో నుండి హృదయములో శంకరుని స్మరిస్తూ ఆ మహర్షిని సేవించెను (35). ఒకనాడు ఆ గర్భము విషముతో సహా ప్రసవమాయెను. ఓ మహర్షీ! మంచి ముహూర్తములో మంచి లగ్నములో అయిదు గ్రహములు ఉన్నతస్థానములలో నుండగా అన్నివిధములుగా శ్రేష్ఠమగు కాలములో మహాబాహుడు అగు సగరమహారాజు జన్మించెను (36,37). ఆ మహాత్ముడగు సగరునకు మహాత్ముడగు ఔర్వుడు జాతకర్మ మొదలగు సంస్కారములను చేసి వేదశాస్త్రములను చదివించిన తరువాత దేవతలకు కూడ సహింప శక్యము కాని ఆగ్నేయాస్త్రమునిచ్చెను. ఆ సగరమహారాజు ఆ అస్త్రమును ప్రేమతో యథావిధిగా స్వీకరించెను (38,39).

స తేనాస్త్రబలేనైవ బలేన చ సమన్వితః | హైహయాన్‌ విజఘానాశు సంక్రుద్ధో%స్త్రబలేన చ || 40

ఆజహార చ లోకేషు కీర్తిం కీర్తిమతాం వరః | ధర్మం సంస్థాపమాయాస సగరో%సౌ మహీతలే || 41

తతశ్శకాస్సయవనాః కాంబోజాః పాహ్లవాస్తథాః | హన్యమానాస్తదా తే తు వసిష్ఠం శరణం యయుః | 42

వసిష్టో వంచనాం కృత్వా సమయేన మహాద్యుతిః | సగరం వారయామాస తేషాం దత్త్వాభయం నృపమ్‌ || 43

సగరస్స్వాం ప్రతిజ్ఞాం తు గురోర్వాక్యం నిశమ్య చ | ధర్మం జఘాన తేషాం వై కేశాన్యత్వం చకార హ || 44

అర్ధం శకానాం శిరసో ముండ కృత్వా వ్యసర్జయత్‌ | యవనానాం శిరస్సర్వం కాంబోజానాం తథైవ చ ||45

పారదా ముండకేశాశ్చ పాహ్లవాశ్శ్మశ్రుధారిణః | నిస్స్వాధ్యాయవషట్కారాః కృతాస్తేన మహాత్మనా || 46

జితా చ సకలా పృథ్వీ ధర్మతస్తేన భూభుజా | సర్వే తే క్షత్రియాస్తాత ధర్మహీనాః కృతాః పురా || 47

స ధర్మవిజయీ రాజా విజిత్వేమాం వసుంధరామ్‌ | అశ్వం సంస్కారయామాస వాజిమేధాయ పార్థివః || 48

తస్య చాస్యతే స్సో%శ్వస్సముద్రే పూర్వదక్షిణ | గతః షష్టిసహసై#్రస్తు తత్పుత్రైరన్వితో మునే || 49

అస్త్ర బలమును పొందియున్న ఆ సగరుడు సైన్యమును వెంటబెట్టుకొని మిక్కిలి కోపించినవాడై వెంటనే హైహయులను సంహరించెను. ఆయన ఆ అస్త్రబలముచే లోకములలో కీర్తిని సంపాదించి కీర్తిని సంపాదించి కీర్తిగలవారిలో శ్రేష్ఠుడాయెను. ఆ సగరుడు భూలోకములో ధర్మమును స్థాపించెను (40,41). అపుడు ఆతనిచే సంహరింపబడుచున్న శక-యవన-కాంబోజ-పాహ్లవులు వసిష్ఠుని శరణు పొందిరి (42). మహాతేజశ్శాలియగు వసిష్ఠుడు సందర్భానుసారముగా వారిని వంచించి వారికి అభయమునిచ్చి సగరమహారాజును వారిని సంహరించవద్దని వారించెను (43). సగరుడు గురువుయొక్క వాక్యమును విని, ధర్మమును మరియు తన ప్రతిజ్ఞను మనస్సులో నిడుకొని వారి కేశాలంకారములో మార్పు వచ్చునట్లు చేసెను (44). శకుల తలలను సగభాగము ముండనము చేయించి వదిలిపెట్టెను. యవన-కాంబోజుల తలలకు పూర్తి ముండనమును విధించెను (45). ఆ మహాత్ముడు పారదులకు మరియు పాహ్లవులకు తలలకు ముండనమును విధించి మీసములు ఉండునట్లు చేసెను. ఆ మహాత్ముడు వారికి వేదాధ్యయనమునందు, యజ్ఞానుష్ఠానమునందు అధికారము లేకుండగా చేసెను (46). ఆ మహారాజు భూమినంతనూ ధర్మబద్ధముగా జయించి పూర్వము ఆ క్షత్రియులనందరినీ ధర్మమునుండి బహిష్కరించెను (47). ధర్మముగా జయమును పొందిన ఆ రాజు ఈ భూమిని జయించి అశ్వమేధయాగము కొరకై గుర్రమునకు సంస్కారములను చేసెను (48). ఓ మునీ! సగరుని అరువది వేల పుత్రులు వెంట నడువగా ఆ గుర్రము ఆగ్నేయ సముద్రమును చేరెను (49).

దేవరాజేన శ##క్రేణ సో%శ్వో హి స్వార్థ సాధినా | వేలా సమీపే% పహృతో భూమిం చైవ ప్రవేశితః || 50

మహారాజో%థ సగరస్తద్ధయాన్వేషణాయ చ | స తం దేశం తదా పుత్రైః ఖానయామాస సర్వతః || 51

ఆసేదుస్తే తతస్తత్ర ఖన్యమానే మహార్ణవే | తమాదిపురుషం దేవం కపిలం విశ్వరూపిణమ్‌ || 52

తస్య చక్షుస్సముత్థేన వహ్నినా ప్రతిబుధ్యతః | దగ్ధాః షష్టిసహస్రాణి చత్వారస్త్వవశేషితాః || 53

హర్షకేతుస్సుకేతుశ్చ తథా ధర్మరథో%పరః | శూరః పంచజనశ్చైవ తస్య వంశకరా నృపాః || 54

ప్రాదాచ్చ తసై#్మ భగవాన్‌ హరిః పంచ వరాన్‌ స్వయమ్‌ | వంశం మేధాం చ కీర్తిం చ సముద్రం తనయం ధనమ్‌ || 55

సాగరత్వం చ లేభే స కర్మణా తస్య తేన వై | తం చాశ్వమేధికం సో%శ్వం సముద్రాదుపలబ్ధవాన్‌ || 56

ఆజహారాశ్వమేధానాం శతం స తు మహాయశాః | ఈజే శంభువిభూతీశ్చ దేవతాస్తత్ర సువ్రతః || 57

ఇతి శ్రీశివమహాపురాణ ఉమాసంహితాయాం సగరోపాఖ్యానం నామ అష్టత్రింశో%ధ్యాయః (38).

స్వార్థసాధనలో దిట్టయగు దేవేంద్రుడు ఆ గుర్రమును సముద్రతీరము వద్ద అపహరించి భూమిలోపల ప్రవేశ##పెట్టెను (50). అపుడా సగరమహారాజు ఆ గుర్రమును వెదుకుట కొరకై ఆ స్థానమునంతనూ తన పుత్రులచే త్రవ్వించెను (51). వారు ఆ మహాసముద్రమును త్రవ్వుచూ, ఆదిపురుషుడు విశ్వమే రూపముగా గలవాడు అగు కపిలదేవుని సమీపమునకు చేరుకొనిరి (52). ఆయన సమాధినుండి బయటకు వచ్చి చూడగనే, ఆయన కంటినుండి పుట్టిన అగ్నిలో నలుగురిని మినహాయించి అరవై వేలమంది బూడిద అయిరి (53). హర్షకేతువు, సుకేతువు, ధర్మరథుడు మరియు శూరుడగు పంచజనుడు అనే ఆ నల్గురు రాజులు సగరుని వంశమును నిలబెట్టిరి (54). విష్ణుభగవానుడు ఆ సగరునకు స్వయముగా, వంశాభివృద్ధి, మేధాశక్తి, కీర్తి, సముద్రుడు పుత్రుడు అగుట, ధనము అనే అయిదు వరములను ఇచ్చెను (55). ఆ కర్మచే సగరుడు సముద్రునకు తండ్రి ఆయెను. ఆయన అశ్వమేధయాగమునకు సంబంధించి ఆ గుర్రమును సముద్రుని వద్దనుండి పొందెను (56). గొప్ప కీర్తి గల ఆ సగరుడు వంద అశ్వమేధయాగములను చేసెను. గొప్ప వ్రతము గల ఆ సగరుడు శంభుని అనుగ్రహముచే సంపదలను పొంది దేవతలను తన యజ్ఞశాలలో ఆహుతులనిచ్చి ఆరాధించెను (57).

శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు సగరోపాఖ్యానమనే ముప్పది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (38).

Siva Maha Puranam-4    Chapters