Siva Maha Puranam-4    Chapters   

అథ ద్వితీయో%ధ్యాయః

శివుని ఆజ్ఞయొక్క మహిమ

ఋషయ ఊచుః |

కిం తత్పాశుపతం జ్ఞానం కథం పశుపతిశ్శివః | కథం ధౌమ్యాగ్రజః పృష్టః కృష్ణేనాక్లిష్టకర్మణా || 1

ఏతత్సర్వం సమాచక్ష్వ వాయో శంకరవిగ్రహ | త్వత్సమో న హి వక్తాస్తి త్రైలోక్యేష్వపరః ప్రభుః || 2

ఋషులు ఇట్లు పలికిరి -

ఆ పాశుపతజ్ఞానము ఎట్టిది? శివుడు పశుపతి ఎట్లు అయినాడు? క్లేశము లేకుండగా గొప్ప పనులను చేయు శ్రీకృష్ణుడు ధౌమ్యుని అన్నగారగు ఉపమన్యుని ప్రశ్నించిన విధమెట్టిది? (1) ఓ వాయూ! నీవు శంకరస్వరూపుడవు. ఈ విషయమునంతనూ చెప్పుము. ముల్లోకములలో నీతో సమానముగా చెప్పగలిగే మరియొక ప్రభుడు లేడు (2).

సూత ఉవాచ |

ఇత్యాకర్ణ్య వచస్తేషాం మహర్షీణాం ప్రభంజనః | సంస్మృత్య శివమీశానం ప్రవక్తుముపచక్రమే || 3

సూతుడు ఇట్లు పలికెను-

వాయువు ఆ మహర్షుల ఈ వచనమును విని, మంగళస్వరూపుడగు ఈశ్వరుని సంస్మరించి చెప్పుటకు ఆరంభించెను (3).

వాయురువాచ |

పురా సాక్షాన్మహేశేన శ్రీకంఠాఖ్యేన మందరే | దేవ్యై దేవేన కథితం జ్ఞానం పాశుపతం పరమ్‌ || 4

తదేవ పృష్టం కృష్ణేన విష్ణునా విశ్వయోనినా | పశుత్వం చ సురాదీనాం పతిత్వం చ శివస్య చ || 5

యథోపదిష్టం కృష్ణాయ మునినా హ్యుపమన్యునా | తథా సమాసతో వక్ష్యే తచ్ఛృణుధ్వమతంద్రితాః || 6

పురోపమన్యుమాసీనం విష్ణుః కృష్ణవపుర్ధరః | ప్రణిపత్య యథాన్యాయమిదం వచనమబ్రవీత్‌ || 7

వాయువు ఇట్లు పలికెను -

పూర్వము శ్రీకంఠుడు అను పేరు గల మహేశ్వరదేవుడు సాక్షాత్తుగా పార్వతికి సర్వోత్కృష్టమగు పాశుపతజ్ఞానమును చెప్పెను (4). జగత్తునకు కారణమగు విష్ణువు శ్రీకృష్ణ రూపములో నున్నవాడై ఆ జ్ఞానమును గురించి, దేవతలు మొదలగు వారి పశుత్వమును గురించి, మరియు శివుడు పశుపతి అను విషయమును గురించి ప్రశ్నించెను (5). ఉపమన్యుమహర్షి శ్రీకృష్ణునకు ఉపదేశించిన విధముగనే సంగ్రహముగా చెప్పెదను. ఆ విషయమును సావధానముగా వినుడు (6). పూర్వము శ్రీకృష్ణరూపములోనున్న విష్ణువు , కూర్చుండియున్న ఉపమన్యునకు యథావిధిగా నమస్కరించి ఇట్లు పలికెను (7).

శ్రీకృష్ణ ఉవాచ |

భగవన్‌ శ్రోతుమిచ్ఛామి దేవ్యై దేవేన భాషితమ్‌ | దివ్యం పాశుపతం జ్ఞానం విభూతిం వాస్య కృత్స్నశః || 8

కథం పశుపతిర్దేవః పశవః కేప్రకీర్తితాః | కైః పాశైస్తే నిబధ్యంతే విముచ్యంతేచ తే కథమ్‌ || 9

ఇతి సంచోదితః శ్రీమానుపమన్యుర్మహాత్మనా | ప్రణమ్య దేవం దేవీం చ ప్రాహ పృష్టో యథా తథా || 10

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! దేవుడు దేవికి చెప్పిన దివ్యమగు పాశుపతజ్ఞానమును, ఈ శివుని మహిమను సంపూర్ణముగా వినగోరుచున్నాను (8). ఆ దేవుడు పశుపతి ఎట్లైనాడు? పశువులని చెప్పబడిన వారెవ్వరు? వారు ఏ పాశములచే బంధింప బడినారు? వారికి విముక్తి కలుగు విధమెయ్యది? (9) ఆ మహాత్ముడు ఇట్లు ప్రశ్నించగా , శ్రీమాన్‌ ఉపమన్యుడు పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి ప్రశ్నకు తగ్గట్లుగా ఇట్లు చెప్పెను (10).

ఉపమన్యురువాచ |

బ్రహ్మాద్యాః స్థావరాంతాశ్చ దేవదేవస్య శూలినః | పశవః పరికీర్త్యంతే సంసారవశవర్తినః || 11

తేషాం పతిత్వాద్దేవేశశ్శివః పశుపతిస్మ్సృతః | మలమాయాదిభిః పాశైస్స బధ్నాతి పశూన్‌ పతిః || 12

స ఏవ మోచకస్తేషాం భక్త్యా సమ్యగుపాసితః | చతుర్వింశతితత్త్వాని మాయాకర్మగుణా అమీ || 13

విషయా ఇతి కథ్యంతే పాశా జీవనిబంధనాః | బ్రహ్మాదిస్తంబపర్యంతాన్‌ పశూన్‌ బద్ధ్వా మహేశ్వరః || 14

పాశైరేతైః పతిర్దేవః కార్యం కారయతి స్వకమ్‌ | తస్యాజ్ఞయా మహేశస్య ప్రకృతిః పురషోచితామ్‌ || 15

బుద్ధిం ప్రసూతే సా బుద్ధిరహంకారమహంకృతిః | ఇంద్రియాణి దశైకం చ తన్మాత్రాపంచకం తథా || 16

శాసనాద్దేవదేవస్య శివస్య శివదాయినః | తన్మాత్రాణ్యపి తసై#్యవ శాసనేన మహీయసా || 17

మహాభూతాన్యశేషాణి భావయంత్యనుపూర్వశః | బ్రహ్మాదీనాం తృణాంతానాం దేహినాం దేహసంగతిమ్‌ || 18

మహాభూతాన్యేశేషాణి జనయంతి శివాజ్ఞయా | అధ్యవస్యతి వై బుద్దిరహంకారోభిమన్యతే || 19

చిత్తం చేతయతే చాపి మనస్సంకల్పయత్యపి | శ్రోత్రాదీని చ గృహ్ణంతి శబ్దాదీన్‌ విషయాన్‌ పృథక్‌ || 20

స్వానేవ నాన్యాన్‌ దేవస్య దివ్యేనాజ్ఞాబలేన వై | వాగాదీన్యపి యాన్యాసంస్తాని కర్మేంద్రియాణి చ || 21

యథా స్వం కర్మ కుర్వంతి నాన్యత్కించిచ్ఛివాజ్ఞయా | శబ్దాదయోపి గృహ్యంతే క్రియంతే వచనాదయః || 22

ఉపమన్యువు ఇట్లు చెప్పెను -

బ్రహ్మ మొదలుకొని కీటకము వరకు గలవి, సంసారము యొక్క వశములో నుండునవి అగు ప్రాణులు దేవదేవుడు, త్రిశూలధారియగు శివునకు పశువులు అని చెప్పబడుచున్నవి (11). దేవదేవుడగు శివుడు వాటికి ప్రభువు అగుటచే పశుపతి అని చెప్పబడుచున్నాడు., ఆ పశుపతి దోషము మాయ మొదలగు పాశములతో పశువులనబడే జీవులను బంధించుచున్నాడు (12). భక్తితో చక్కగా ఉపాసించినచో, ఆ పరమేశ్వరుడే వారికి మోక్షమునిచ్చును. ఈ ఇరువది నాలుగు తత్త్వములు మాయయొక్క కార్యములు మరియుగుణములు అగుచున్నవి (13). వీటికి విషయములు అని పేరు. జీవులను బంధించు పాశములు అవియే. బ్రహ్మతో మొదలిడి కీటకము వరకు గల జీవులను పశుపతి యగు మహేశ్వరదేవుడు బంధించి, వారిచే తన కార్యమును చేయించు చున్నాడు. ఆ మహేశ్వరుని ఆజ్ఞచే ప్రకృతి పురుషునకు అనురూపమైన బుద్ధిని సృష్టించును. దేవదేవుడు, మంగళములనిచ్చువాడు అగు శివుని శాసనము వలన ఆ బుద్ధి అహంకారమును, అహంకారము పదకొండు ఇంద్రియములను మరియు అయిదు సూక్ష్మభూతములను సృష్టించు చున్నది. ఆ శివుని గొప్ప శాసనము చేతనే సూక్ష్మభూతములు కూడా సకలమహాభూతములను ఒక విశిష్టక్రమములో సృష్టించు చున్నవి. నిశ్శ్యయాత్మకమైనది బుద్ధి కాగా, అహంకారము అభిమానమునకు కేంద్రమగుచున్నది (14-19). చిత్తము స్మృతికి కారణమగుచున్నది. మనస్సు సంకల్పించు చున్నది. ఆ దేవుని దివ్యమగు ఆజ్ఞ యొక్క బలముచే చెవి మొదలగు ఇంద్రియములు శబ్దము మొదలగు విషయములను తమకు సంబంధించిన వాటిని మాత్రమే వేర్వేరుగా గ్రహించు చున్నవి. అవి తమకు సంబంధించని విషయములను గ్రహించుట లేదు. వాక్కు మొదలగు కర్మేంద్రియములు శివుని ఆజ్ఞచే తమకు నిర్దేశించబడిన కర్మను మాత్రమే చేయుచున్నవి; మరియొక కర్మను చేయుట లేదు. శబ్దము మొదలగు విషయములు జ్ఞానేంద్రియములచే గ్రహించబడుచున్నవి. మాటలాడుట మొదలగు కర్మలు కర్మేంద్రియములచే చేయబడు చున్నవి (20-22).

అవిలంఘ్యా హి సర్వేషామాజ్ఞా శంభోర్గరీయసీ | అవకాశమశేషాణాం భూతానాం సంప్రయచ్ఛతి || 23

ఆకాశః పరమేశస్య శాసనాదేవ సర్వగః | ప్రాణాద్యైశ్చ తథా నామభేదైరంతర్బహిర్జగత్‌ || 24

బిభర్తి సర్వం శర్వస్య శాసనేన ప్రభంజనః | హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాశినామపి || 25

పాకాద్యం చ కరోత్యగ్నిః పరమేశ్వరశాసనాత్‌ | సంజీవనాద్యం సర్వస్య కుర్వంత్యాపస్తదాజ్ఞయా || 26

విశ్వంభరా జగన్నిత్యం ధత్తే విశ్వేశ్వరాజ్ఞయా | దేవాన్‌ పాత్యసురాన్‌ హంతి త్రిలోకమభిరక్షతి || 27

ఆజ్ఞయా తస్య దేవేంద్రస్సర్వైర్దేవైరలంఘ్యయా | ఆధిపత్యమపాం నిత్యం కురుతే వరుణస్సదా || 28

పాశైర్బధ్నాతి చ యథా దండ్యాంస్తసై#్యవ శాసనాత్‌ | దదాతి నిత్యం యక్షేంద్రో ద్రవిణం ద్రవిణశ్వరః || 29

పుణ్యానురూపం భూతేభ్యః పురుషస్యానుశాసనాత్‌ | కరోతి సంవదశ్శశ్వత్‌ జ్ఞానం చాపి సుమేధసామ్‌ || 30

నిగ్రహం చాప్యసాధూనామీశానశ్శివశాసనాత్‌ | ధత్తే తు ధరణీం మూర్ధ్నా శేషశ్శివనియోగతః || 31

యామాహుస్తామసీం రౌద్రీం మూర్తిమంతకరీం హరేః | సృజత్య శేషమీశస్య శాసనాచ్చతురాననః || 32

శంభుని శ్రేష్ఠమగు ఆజ్ఞను ఎవ్వరైననూ జవదాట లేరు. పరమేశ్వరుని ఆజ్ఞ చేతనే సర్వవ్యాపకమగు ఆకాశము. సకలభూతములకు అవకాశమునిచ్చు చున్నది. ఆ సంహారకుని శాసనముచే వాయువు ప్రాణాపానాది నామభేదముచే జగత్తును అంతనూ లోపల మరియు బయట నిలబెట్టు చున్నది. పరమేశ్వరుని శాసనముచే అగ్ని దేవతలకు హోమద్రవ్యములను, పితృదేవతలకు కవ్యము (పితరులకు అర్పించే ఆహారము) ను మోసుకొని వెళ్లుచుండుటయే గాక, వంట మొదలగు కార్యములను కూడా చేయుచున్నది. జలములు ఆ శివుని ఆజ్ఞచే సర్వుల ప్రాణములను నిలబెట్టుచున్నవి (23-26). విశ్వేశ్వరుని ఆజ్ఞచే భూమి నిత్యము ప్రాణులను మోయుచున్నది. సకలదేవతలకు జవదాట శక్యము కాని ఆ శివుని అజ్ఞచే దేవేంద్రుడు దేవతలను రక్షించి రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడు చున్నాడు. ఆ శివుని శాసనము చేతనే వరుణుడు సర్వకాలములలో జలములపై శాశ్వతమగు ఆధిపత్యమును చేయుచూ, శిక్షార్హులను పాశములతో బంధించు చున్నాడు. ధనాధిపతి, యక్షరాజు అగు కుబేరుడు ఆ పరమపురుషుని శాసనముచే నిత్యము ప్రాణులకు వరి పుణ్యమునకు తగినట్లుగా ధనమును ఇచ్చుచున్నాడు. శివుని శాసనముచే ఈశానుడు మంచి బుద్ధి గలవారికి శాశ్వతమగు సంపదలను మరియు జ్ఞానమును కూడా ఇచ్చి, దుష్టులను శిక్షించు చున్నాడు. శివుని ఆదేశముచే శేషుడు భూమిని తలపై మోయుచున్నాడు (27-31). ఆ శేషుడే విష్ణువు యొక్క తమోగుణప్రధానమైన భయంకరమగు శక్తిస్వరూపమని చెప్పుచున్నారు. ఆ శేషుడే జగత్తునకు ప్రళయమును కలుగ జేయును. ఈశ్వరుని శాసనముచే బ్రహ్మగారు సకలజగత్తును సృష్టించు చున్నాడు (32).

అన్యాభిర్మూర్తిభిస్స్వాభిః పాతి చాంతే నిహంతి చ | విష్ణుః పాలయతే విశ్వం కాలకాలస్య శాసనాత్‌ || 33

సృజితే గ్రసతే చాపి స్వకాభిస్తనుభిస్త్రిభిః | హరత్యంతే జగత్సర్వం హరస్తసై#్యవ శాసనాత్‌ || 34

సృజత్యపి చ విశ్వాత్మా త్రిధా భిన్నస్తు రక్షతి | కాలః కరోతి సకలం కాలస్సంహరతి ప్రజాః || 35

కాలః పాలయతే విశ్వం కాలకాలస్య శాసనాత్‌ | త్రిభిరం శైర్జగద్భి భ్రత్తేజోభిర్వృష్టిమాదిశన్‌ || 36

దివి వర్షత్యసౌ భానుర్దేవదేవస్య శాసనాత్‌ | పుష్ణాత్యోషధిజాతాని భూతాన్యాహ్లాదయత్యపి || 37

దేవైశ్చ పీయతే చంద్రశ్చంద్రభూషణశాసనాత్‌ | ఆదిత్యా వసవో రుద్రా అశ్వినౌ మరుతస్తథా || 38

ఖేచరా ఋషయస్సిద్ధా భోగినో మనుజా మృగాః | పశవః పక్షిణశ్చైవ కీటాద్యాః స్థావరాణి చ || 39

నద్యస్సముద్రా గిరయః కాననాని సరాంసి చ | వేదాస్సాంగాశ్చ శాస్త్రాణి మంత్రస్తోమమఖాదయః || 40

కాలాగ్న్యాదిశివాంతాని భువనాని సహాధిపైః | బ్రహ్మాండాన్యప్యసంఖ్యాని తేషామావరణాని చ || 41

వర్తమానాన్యతీతాని భవిష్యంత్యపి కృత్య్నశః | దిశశ్చ విదిశ్తశ్చెవ కాలభేదాః కలాదయః || 42

యచ్చ కించిజ్జగత్యస్మిన్‌ దృశ్యతే శ్రూయతే%పి వా | తత్సర్వం శంకరస్యాజ్ఞాబలేన సమధిష్ఠితమ్‌ || 43

ఆ బ్రహ్మ తన ఇతరములగు మూర్తులచే జగత్తును రక్షించి, ప్రళయకాలమునందు సంహరించుచున్నాడు. మృత్యువునకు మృత్యువు అగు శివుని శాసనముచే విష్ణువు తన మూడు రూపములచే జగత్తును సృష్టించి పాలించి సంహరించుచున్నాడు. ఆ శివుని శాసనముచే మాత్రమే జగత్స్వరూపుడగు హరుడు కూడ మూడు రూపములను దాల్చి సృష్టించి రక్షించి ప్రళయకాలమునందు జగత్తును అంతనూ సంహరించు చున్నాడు. మృత్యువునకు మృత్యువు అగు శివుని శాసనముచే కాలము కూడ మూడు అంశలతో (భూతభవ్యవర్తమానములు) జగత్తును ధరించుచున్నది; ప్రజలను సంహరించు చున్నది; జగత్తును పాలించు చున్నది; సర్వమును చేయుచున్నది. దేవదేవుడగు శివుని శాసనముచే ఈ ద్యులోకమునందలి సూర్యుడు తన వేడి కిరణములచే నీటిని స్వీకరించి వర్షించుచున్నాడు. చంద్రుని శిరస్సుపై అలంకారముగా ధరించిన శివుని శాసనము వలన చంద్రుడు పంట మొక్కలకు పుష్టిని చేకూర్చి ప్రాణులకు ఆహ్లాదమును కలిగించి, దేవతలచే పానము చేయబడు చున్నాడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు అశ్వినీ దేవతలు, మరుత్తులు (33-38), ఆకాశమునందు సంచరించే దేవయోనులు, ఋషులు, సిద్ధులు, నాగులు, మానవులు, అడవులలోని మృగములు గ్రాపములోని పశువులు, పక్షులు, కీటకములు మొదలైనవి, చెట్టుచేమలు (39), నదులు, సముద్రములు, పర్వతములు, అడవులు, సరస్సులు, అంగములతో కూడిన వేదములు, శాస్త్రములు, మంత్రములు, వేదముల యందలి స్తోత్రములు, యజ్ఞములు మొదలైనవి (40), కాలాగ్నితో మొదలిడి శివుని వరకు గల భవనములు, వాటి అధిపతులు, లెక్కలేనన్ని బ్రహ్మాండములు, వాటి ఆవరణలు (41), గడచిన జరుగుచున్న మరియు రాబోయే సకలఘటనలు, దిక్కులు, విదిక్కులు, కళ మొదలగు కాలభేదములు (42), ఈ విధముగా ఈ జగత్తులో ఏది ఏది కనబడుచున్నదో, లేదా వినవచ్చు చున్నదో ఆ సర్వము శంకరుని ఆజ్ఞయొక్క బలముచే అధిష్ఠించబడి యున్నది (43).

ఆజ్ఞాబలాత్తస్య ధరా స్థితేహ ధరాధరా వారిధరాస్సముద్రాః |

జ్యోతిర్గణాశ్శక్రముఖాశ్చ దేవాః స్థిరం చరం వా చిదచిద్యదస్తి || 44

అత్యాశ్చర్యమిదం కృష్ణ శంభోరమితకర్మణః | ఆజ్ఞాకృతం శృణుషై#్వతచ్ఛ్రుతం శ్రుతిముఖే మయా || 45

పురా కిల సురాస్సేంద్రా వివదంతః పరస్పరమ్‌ | అసురాన్‌ సమరే జిత్వా జేతాహమహమిత్యుత || 46

తదా మహేశ్వరస్తేషాం మధ్యతో వరవేషధృక్‌ | స్వలక్షణౖర్విహీనాంగస్స్వయం యక్ష ఇవాభవత్‌ || 47

స తానాహ సురానేకం తృణమాదాయ భూతలే| య ఏతద్వికృతం కర్తుం క్షమతే స తు దైత్యజిత్‌ || 48

యక్షస్య వచనం శ్రుత్వా వజ్రపాణిశ్శచీపతిః | కించుత్ర్కుద్ధో విహసై#్యనం తృణమాదాతుముద్యతః || 49

న తత్తృణముపాదాతుం మనసాపి చ శక్యతే | యథా తథాపి తచ్ఛేత్తుం వజ్రం వజ్రధరో%సృజత్‌ || 50

తద్వజ్రం నిజవజ్రేణ సంసృష్టమివ సర్వతః | తృణనాభిహతం తేన తిర్యగగ్రం పపాత హ || 51

తతశ్చాన్యే సుసంరబ్ధా లోకపాలా మహబలాః | ససృజుస్తృణముద్దిశ్య స్వాయుధాని సహస్రశః || 52

ప్రజజ్వాల మహావహ్నిః ప్రచండః పవనో వవౌ | ప్రవృద్ధో%పాం పతిర్యద్వత్ర్పలయే సముపస్థితే || 53

ఆ శివుని ఆజ్ఞయొక్క బలముచే భూమి, పర్వతములు, మేఘములు, సముద్రములు, నక్షత్రగణములు, ఇంద్రాది దేవతలు, కదిలేది గాని, కదలనిది గాని, చేతనము గాని, జడము గాని సర్వము ఉనికిని కలిగి యున్నవి (44). ఓ కృష్ణా! అంతము లేని కర్మలు గల శంభుని ఆజ్ఞచేత చేయబడిన ఈ మిక్కిలి ఆశ్చర్యకరమగు సంఘటనను వినుము. దీనిని నేను వేదములో వినియున్నాను (45). పూర్వము ఇంద్రునితో కూడియున్న దేవతలు రాక్షసులను యుద్ధములో జయించి, విజేతను నేనంటే నేనే అంటూ ఒకరితో నొకరు తగవు లాడుచుండిరి (46). అపుడు మహేశ్వరుడు తనవైన చిహ్నములు లేని గొప్ప వేషమును ధరించి స్వయముగా యక్ష రూపముతో వారి మధ్యకు వచ్చెను (47). ఆయన నేలపైనుండి ఒక గడ్డిపోచను తీసుకొని, ఎవడైతే దీనియందు వికారమును కలిగించుటకు సమర్థుడగునో వాడే రాక్షస విజేత అని వారితో పలికెను (48). యక్షుని ఆ మాటను విని శచీపతియగు ఇంద్రుడు వజ్రమును చేతబట్టి, కొద్దిగా కోపించి చిరునవ్వు నవ్వి, ఆ గడ్డిపోచను తీసుకొనుటకు యత్నించెను (49). అది ఊహకు అందని విషయము. వజ్రధరుడగు ఆ ఇంద్రుడు దానిని పైకి లేప లేక పోయిన వాడై, దానిని ఛేదించుటకు వజ్రమును దానిపై ప్రయోగించెను (50). ఆ వజ్రము తనకు జన్మను ఇచ్చిన వజ్రమును ఢీకొన్నదా యన్నట్లు ఆ గడ్డిపోచచే భాగములన్నింటి యందు గట్టిగా కొట్టబడినదై అడ్డముగా పడి పోయెను. దాని మొన మొక్కవోయెను (51). తరువాత మహాబలవంతులగు మిగిలిన లోకపాలకులు పెద్ద కంగారుతో ఆ గడ్డిపోచను ఉద్దేశించి తమ ఆయుధములను వేల సంఖ్యలో ప్రయోగించిరి (52). పెద్ద అగ్ని మండజొచ్చెను. ప్రచండమగు వాయువు వీచెను. ప్రళయకాలమునందు వలె సముద్రము హద్దులు దాటి పెరిగెను. (53).

ఏవం దేవైస్సమారబ్ధం తృణముద్దిశ్య యత్నతః | వ్యర్థమాసీదహో కృష్ణ యక్షస్యాత్మబలేన వై || 54

తదాహ యక్షం దేవేంద్రతః భవానిత్యమర్షితః | తతస్స పశ్యతామేవ తేషామంతరధాదథ || 55

తదంతరే హైమవతీ దేవీ దివ్యవిభూషణా | ఆవిరాసీన్నభోరంగే శోభమానా శుచిస్మితా || 56

తాం దృష్ట్వా విస్మయావిష్టా దేవాశ్శక్రపురోగమాః | ప్రణమ్య యక్షం పప్రచ్ఛుః కో% సౌ యక్షో విలక్షణః || 57

సా% బ్రవీత్సస్మితం దేవీ స యుష్మాకమగోచరః | తేనేదం భ్రామ్యతే చక్రం సంసారాఖ్యం చరాచరమ్‌ || 58

తేనాదౌ క్రియతే విశ్వం తేన సంహ్రియతే పునః | న తన్నియంతా కశ్చిత్స్యాత్తేన సర్వం నియమ్యతే || 59

ఇత్యుక్త్వా సా మహాదేవీ తత్రైవాంతరధత్త వై | దేవాశ్చ విస్మితాస్సర్వే తాం ప్రణమ్య దివం యయుః || 60

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివాజ్ఞాప్రభావ వర్ణనం నామ ద్వితీయో%ధ్యాయః (2).

ఓ కృష్ణా! ఈ విధముగా దేవతలు గడ్డిపోచను లక్ష్యముగా పెట్టుకొని చేసిన ప్రయత్నమంతయు యక్షుని ఆత్మబలము ముందు వ్యర్థమయ్యెను. ఆశ్చర్యము! (54) అపుడు క్రోధమును పొందిన దేవేంద్రుడు యక్షుని, నీవెవరివి? అని ప్రశ్నించెను. అపుడు ఆ యక్షుడు వారు చూచుచుండగనే అంతర్ధానమును చెందెను (55). ఇంతలో దివ్యమగు ఆభరణములను ధరించి స్వచ్ఛమగు చిరునవ్వుతో ప్రకాశించుచున్న పార్వతీదేవి ఆకాశస్థానమునందు ఆవిర్భవించెను (56). ఇంద్రుడు మొదలగు దేవతలు ఆమెను చూచి ఆశ్చర్యపడిన వారై, ఆ యక్షునకు మనస్సులో నమస్కరించి, విడ్డూరముగా నున్న ఈ యక్షుడు ఎవరు? అని ప్రశ్నించిరి (57). ఆ దేవి చిరునవ్వుతో ఇట్లు పలికెను. ఆయన మీచే తెలియబడడు. చరాచరజగత్తు అనే ఈ సంసారచక్రమును త్రిప్పేది ఆయనయే (58). ఆయనయే ముందుగా జగత్తును సృష్టించి, అంతములో దానిని ఉపసంహరించును. ఆయనయే సర్వమును నియంత్రించును. కాని, ఆయనను నియంత్రించువారు మరెవ్వరూ లేరు (59). ఆ మహాదేవి ఇట్లు పలికి అక్కడనే అంతర్ధానమును చెందెను. ఆశ్చర్యమును పొందియున్న దేవతలు అందరు ఆమెకు నమస్కరించి స్వర్గమునకు వెళ్లిరి (60).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివుని ఆజ్ఞయొక్క మహిమను వర్ణించే రెండవ ఆధ్యాయము. ముగిసినది (2).

Siva Maha Puranam-4    Chapters