Siva Maha Puranam-4    Chapters   

అథ చతుర్థోధ్యాయః

గౌరీ శంకరుల విభూతి యోగము

శ్రీకృష్ణ ఉవాచ |

భగవన్‌ పరమేశస్య శర్వస్యామితతేజసః | మూర్తిభిర్విశ్వమేవేదం యథా వ్యాప్తం తథా శ్రుతమ్‌ || 1

అథైతత్‌ జ్ఞాతుమిచ్ఛామి యాథాత్మ్యం పరమేశయోః | స్త్రీపుంభావాత్మకం చేదం తాభ్యాం కథమధిష్ఠితమ్‌ || 2

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! జగత్సంహారకుడు, అనంతమగు తేజస్సు గలవాడు అగు పరమేశ్వరుని మూర్తులచే ఈ జగత్తు ఏ విధముగా నిశ్చయముగా వ్యాపించబడి యున్నదో, ఆ వివరములను వింటిని (1). తరువాత పార్వతీపరమేశ్వరుల స్వరూపమును గురించి నేను తెలియగోరుచున్నాను. స్త్రీపురుషాత్మకమగు ఈ జగత్తును వారిద్దరు ఎట్లు అధిష్ఠించి యున్నారు? (2)

ఉపమన్యురువాచ |

శ్రీమద్విభూతిం శివయోర్యాథాత్మ్యం చ సమాసతః | వక్ష్యే తద్విస్తరాద్వక్తుం భ##వేనాపి న శక్యతే || 3

శక్తిస్సాక్షాన్మహాదేవీ మహాదేవశ్చ శక్తిమాన్‌ | తయోర్విభూతిలేశో వై సర్వమేతచ్చరాచరమ్‌ || 4

వస్తు కించిదచిద్రూపం కించిద్వస్తు చిదాత్మకమ్‌ | ద్వయం శుద్ధమశుద్ధం చ పరం చాపరమేవ చ || 5

యత్సంసరతి చిచ్చక్రమచిచ్చక్రసమనిత్వమ్‌ | తదేవాశుద్ధమపరమితరం తు పరం శుభమ్‌ || 6

అపరం చ పరం చైవ ద్వయం చిదచిదాత్మకమ్‌ | శివస్య చ శివాయాశ్చ స్వామ్యం చైతత్స్వభావతః || 7

శివయోర్వైవశే విశ్వం న విశ్వస్య వశే శివౌ | ఈశితవ్యమిదం యస్మాత్తస్మాద్విశ్వేశ్వరౌ శివౌ || 8

యథా శివస్తథా దేవీ యథా దేవీ తథా శివః | నానయోరంతరం విద్యాచ్చంద్రచంద్రికయోరివ || 9

చంద్రో న ఖలు భాత్యేష యథా చంద్రికయా వినా | న భాతి విద్యమానో%పి తథా శక్త్యా వినా శివః || 10

ప్రభయా హి వినా యద్వద్భానురేష న విద్యతే | ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా || 11

ఏవం పరస్పరాపేక్షా శక్తిశక్తిమతోః స్థితా | న శివేన వినా శక్తిర్న శక్త్యా చ వినా శివః || 12

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

పార్వతీపరమేశ్వరుల శోభాయుక్తమైన విభూతి (మహిమ) ని మరియు వారి స్వరూపమును సంగ్రహముగా చెప్పగలను. దానిని విస్తరముగా చెప్పుటకు భవునకైననూ శక్యము కాదు (3). మహాదేవి సాక్షాత్తుగా శక్తి కాగా, మహాదేవుడు ఆ శక్తి గలవాడు. ఈ చరాచరజగత్తు అంతా వారి విభూతియొక్క లేశము మాత్రమే (4). కొన్ని వస్తువులు జడములు కాగా, మరికొన్ని చేతనస్వరూపములై యున్నవి. ఈ రెండు శుద్ధము-అశుద్ధము అనియు, పరము-అపరము అనియు విభాగమును కలిగియున్నవి (5). జడముల సముదాయముతో గూడి సంసారముననుభవించు చేతనుడే అశుద్ధుడు మరియు అపరుడు కాగా, దీనికి భిన్నమైనది (జడము నుండి సంసారమునుండి విముక్తిని పొందిన చేతనుడు) శుద్ధము మరియు పరము అగును (6). అపరము మరియు పరము అనే రెండు స్వయముగా చేతన-జడస్వరూపములై యున్నవి. వీటిపై పార్వతీపరమేశ్వరులకు సహజముగనే ప్రభుత్వము గలదు (7). జగత్తు పార్వతీ పరమేశ్వరుల వశములో నున్నదియే గాని, పార్వతీపరమేశ్వరులు జగత్తునకు వశములో లేరు. ఏలయన, ఈ జగత్తును నియమించ వలసి యున్నది. కావున, పార్వతీపరమేశ్వరులు జగత్తునకు శాసకులగుచున్నారు (8). శివుడు ఎట్లో దేవి అట్లే, దేవి ఎట్లో శివుడ అట్లే, చంద్రునకు వెన్నెలకు వలె వీరిద్దరికి మధ్యలో భేదము లేదు (9). వెన్నెల లేనిదే ఈ చంద్రుడు ప్రకాశించడు. అదే విధముగా శివుడు ఉనికి గలవాడే అయిననూ, శక్తి లేనిదే ప్రకాశించడు (10). కాంతి లేనిదే ఈ సూర్యుడే లేడు. సూర్యుడు లేనిదే కాంతి మనజాలదు. కాంతి పూర్తిగా సూర్యుని ఆశ్రయించి యున్నది (11). ఇదే విధముగా శక్తికి శక్తిమంతనకు అన్యోన్యమగు అపేక్ష గలదు. శివుడు లేనిదే శక్తి లేదు. శక్తి లేనిదే శివుడు లేడు (12).

శక్తో యయా శివో నిత్యం భుక్తౌ ముక్తౌ చ దేహినామ్‌ | ఆద్యాసైకా పరా శక్తిశ్చిన్మయీ శివసంశ్రయా || 13

యామాహురఖిలేశస్య తైసై#్తరనుగుణౖర్గుణౖః | సమానధర్మిణీమేవ శివస్య పరమాత్మనః || 14

సైకా పరా చ చిద్రూపా శక్తిః ప్రసవధర్మిణీ | విభజ్య బహుధా విశ్వం విదాధాతి శివేచ్ఛయా || 15

సా మూలప్రకృతిర్మాయా త్రిగుణా చ త్రిధా స్మృతా | శివయా చ విపర్యస్తం యయా తతమిదం జగత్‌ || 16

ఏకధా చ ద్విధా చైవ తథా శతసహస్రధా | శక్తయః ఖలు భిద్యంతే బహుధా వ్యవహారతః || 17

శివేచ్ఛయా పరా శక్తిశ్శివతత్త్వైకతాం గతా | తతః పరిస్ఫురత్యాదౌ సర్గౌ తైలం తిలాదివ || 18

తతః క్రియాఖ్యయా శక్త్యా శక్తౌ శక్తిమదుత్థయా | తస్యాం విక్షోభ్యమాణాయామాదౌ నాదస్సముద్బభౌ || 19

నాదాద్వినిస్సృతో బిందుర్బిందోర్దేవస్సదాశివః | తస్మాన్మహేశ్వరో జాతశ్శుద్ధవిద్యా మహేశ్వరాత్‌ || 20

సా వాచామీశ్వరీ శక్తిర్వాగీశాఖ్యా హి శూలినః | యా సా వర్ణస్వరూపేణ మాతృకేతి విజృంభ##తే || 21

అథానంతసమావేశాన్మాయా కాలమవాసృజత్‌ | నియతిం చ కలాం విద్యాం కలాతో రాగపూరుషౌ || 22

ఏ శక్తిచే శివుడు నిత్యము ప్రాణులకు భుక్తిని ముక్తిని ఇచ్చుటకు సమర్థుడగుచున్నాడో, ఆ అద్వితీయ-చిన్మయ-పరాశక్తియే శివుని ఆశ్రయించి జగత్కారణమగుచున్నది (13). ఆమె ఆ సర్వజగదీశ్వరునకు అనురూపమైన ఆయా గుణములతో కూడియున్నదై, ఆ శివపరమాత్మతో సమానమగు ధర్మములను మాత్రమే కలిగియున్నదని పెద్దలు చెప్పుచున్నారు (14). అద్వితీయము, సర్వోత్కృష్టము, చైతన్యస్వరూపము, సృష్టి స్వీయధర్మముగా గలది అగు ఆ శక్తి శివుని ఇచ్ఛచే అనేకరూపములుగా విభాగమును చెంది జగత్తును నిర్మించుచున్నది (15). మూలప్రకృతి, మాయ, త్రిగుణ అను మూడు పేర్లతో ఆ శక్తి మూడు విధములుగా నున్నదని చెప్పబడినది. ఆ పార్వతి తననుండి ఈ జగత్తును ప్రకటించినది. ఈ జగత్తు ఆమె చేతనే వ్యాపించబడి యున్నది (16). వ్యవహారమును బట్టి ఒకటి, రెండు, వంద, వేయి, అనేకము మొదలైన విధముగా శక్తులలో భేదము కానవచ్చును (17). శివుని ఇచ్ఛచే ఆ పరాశక్తి శివతత్త్వములో ఐక్యమును చెందినది, సృష్ట్యాదియందు ఆ శక్తి ఆ శివుని నుండి నువ్వుగింజనుండి నూనె వలె జగద్రూపములో ప్రకటమగుచుండును (18). తరువాత సృష్ట్యాదియందు శక్తిమంతుడగు పరమేశ్వరునినుండి పుట్టిన క్రియాశక్తి ఆ శక్తియందు తీవ్రమగు కదలికను తీసుకు రాగా, నాదము పుట్టెను (19). నాదమునుండి బిందువు బయల్వెడలెను. బిందువునుండి ప్రకాశస్వరూపుడగు సదాశివుడు పుట్టెను. ఆయననుండి మహేశ్వరుడు, మహేశ్వరునినుండి శుద్ధవిద్య పుట్టెను (20). ఆ శుద్ధవిద్య వాక్కులకు అధీశ్వరియగు శక్తి. త్రిశూలధారియగు శివుని ఆ శక్తికి వాగీశా అని పేరు. ఆమెయే అక్షరముల రూపములో విస్తారమును చెంది మాతృక అనబడుచున్నది (21). తరువాత అనంతుని (చైతన్యరూపుడగు ఈశ్వరుని) సమావేశముచే మాయ కాలమును, నియతిని, కళను మరియు విద్యను సృష్టించెను. కళనుండి రాగము, పురుషుడు పుట్టినవి (22).

మాయాతః పునరేవాభూదవ్యక్తం త్రిగుణాత్మకమ్‌ | త్రిగుణాచ్చ తతో వ్యక్తాద్విభక్తాస్స్యుస్త్రయో గుణాః || 23

సత్త్వం రజస్తమశ్చేతి యైర్వ్యాప్తమఖిలం జగత్‌ | గుణభ్యః క్షోభ్యమాణభ్యో గుణశాఖ్యాస్త్రిమూర్తయః || 24

అభవన్మహదాదీని తత్త్వాని చ యథాక్రమమ్‌ | తేభ్యస్స్యురండపిండాని త్వసంఖ్యాని శివాజ్ఞయా |

అధిష్ఠితాన్యనంతాద్యైర్విద్యేశైశ్చక్రవర్తిభిః || 25

శరీరాంతరభేదేన శ##క్తేర్భేదాః ప్రకీర్తితాః | నానారూపాస్తు విజ్ఞేయాః స్థూలసూక్ష్మ విభేదతః || 26

రుద్రస్య రౌద్రీ సా శక్తిర్విష్మోర్వై వైష్ణవీ మతా | బ్రహ్మాణీ బ్రహ్మణః ప్రోక్తా చేంద్రసై#్యంద్రీతి కథ్యతే || 27

కిమత్ర బహునోక్తేన యద్విశ్వమితి కీర్తితమ్‌ | శక్త్యాత్మనైవ తద్వ్యాప్తం యథా దేహో%ంతరాత్మనా || 28

తస్మాచ్ఛక్తిమయం సర్వం జగత్‌ స్థావరజంగమమ్‌ | కలా యా పరమా శక్తిః కథితా పరమాత్మనః || 29

ఏవమేషా పరా శక్తిరీశ్వరేచ్ఛానుయాయినీ | స్థిరం చరం చ యద్విశ్వం సృజతీతి వినిశ్చయః || 30

జ్ఞానక్రియా చికీర్షాభిస్తిసృభిస్స్వా త్మశక్తిభిః | శక్తిమానీశ్వరశ్శశ్వద్విశ్వం వ్యాప్యాధితిష్ఠతి || 31

ఇదమిత్థమిదం నేత్థం భ##వేదిత్యేవమాత్మికా | ఇచ్ఛాశక్తిర్మ హేశస్య నిత్యా కార్యనియామికా || 32

మరల మాయనుండి మూడు గుణములే స్వరూపముగా గల అవ్యక్తము పుట్టెను. ఆ త్రిగుణాత్మకమగు అవ్యక్తము తరువాత వ్యక్తమైనప్పుడు ఆ మూడు గుణములు వేర్వేరుగా ప్రకటమగును (23). సత్త్వము, రజస్సు, తమస్సు అను పేర్లు గల ఆ గుణములచే జగత్తు అంతయు వ్యాపించబడి యున్నది. సంక్షోభమును పొందియున్న గుణములనుండి గుణశులు (ఆయా గుణములు ప్రధానముగా గలవారు) అగు త్రిమూర్తులు పుట్టిరి, క్రమముగా మహత్తు (సమష్టిబుద్ధిశక్తి) మొదలైన తత్త్వములు పుట్టినవి. వాటినుండి శివుని అజ్ఞచే సకలబ్రహ్మాండములు మరియు లెక్క లేనన్ని దేహములు పుట్టినవి. అనంతుడు మొదలగు విద్యేశ్వరులైన చక్రవర్తులచే ఆ బ్రహ్మాండములు అధిష్ఠించ బడినవి. (24,25). శరీరములలో భేదమును బట్టి శక్తిలో భేదములు చెప్పబడినవి. స్థూలసూక్ష్మవిభాగముచే శక్తులు అనేకరూపములలో నున్నవని తెలియవలెను (26). రుద్రుని శక్తి రౌద్రి అనియు, విష్ణువుయొక్క శక్తి వైష్ణవి అనియు, బ్రహ్మయొక్క శక్తి బ్రహ్మాణి అనియు, ఇంద్రుని శక్తి ఐంద్రి అనియు చెప్పబడును (27). ఈ విషయములో ఇన్ని మాటలేల? విశ్వము అను పేరుతో ఏదైతే కీర్తింప బడుచున్నదో అది, దేహము అంతరాత్మ చేతను వలె, శక్తి స్వరూపముచేతనే వ్యాపించబడి యున్నది (28). కావున, స్థావరజంగమాత్మకమగు జగత్తు అంతయు శక్తితో నిండి యున్నది. ఈ పరాశక్తి పరమాత్మయొక్క కళ అని చెప్పబడినది (29). ఈ విధముగా ఈ పరాశక్తి ఈశ్వరుని ఇచ్ఛను అనుసరించి ప్రవర్తిల్లి, చరాచరమగు జగత్తు ఏది గలదో దానిని సృష్టించు చున్నదని సిద్ధాంతము (30). శక్తిమంతుడగు ఈశ్వరుడు జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అను మూడు ఆత్మశక్తులచే శాశ్వతకాలము జగత్తును వ్యాపించి అధిష్ఠించి యున్నాడు (31). మహేశ్వరుని ఇచ్ఛాశక్తి నిత్యము. ఇది ఇట్లుండవలెను; ఇది ఇట్లుండరాదు అను విధముగా కార్యములను అదియే నియమించుచున్నది (32).

జ్ఞానశక్తిస్తు తత్కార్యం కరణం కారణం తథా | ప్రయోజనం చ తత్త్వేన బుద్ధిరూపాధ్యవస్యతి || 33

యథేప్సితం క్రియాశక్తిర్యథాధ్యవసితం జగత్‌ | కల్పయత్యఖిలం కార్యం క్షణాత్సంకల్పరూపిణీ || 34

యథా శక్తిత్రయోత్థానం శక్తిః ప్రసవధర్మిణీ | శక్త్యా పరమయా నున్నా ప్రసూతే సకలం జగత్‌ || 35

ఏవం శక్తిసమాయోగాచ్ఛక్తిమానుచ్యతే శివః | శక్తిశక్తిమదుత్థం తు శాక్తం శైవమిదం జగత్‌ || 36

యథా న జాయతే పుత్రః పితరం మాతరం వినా | తథా భవం భవానీం చ వినానైతచ్చరాచరమ్‌ |

స్త్రీపుంసప్రభవం విశ్వం స్త్రీపుంసాత్మకమేవ చ || 37

స్త్రీపుంసయోర్విభూతిశ్చ స్త్రీపుంసాభ్యామధిష్ఠితమ్‌ | పరమాత్మా శివః ప్రోక్తశ్శివా సా చ ప్రకీర్తితా || 38

శివస్సదాశివః ప్రోక్తశ్శివా సా చ మనోన్మనీ | శివో మహేశ్వరో జ్ఞేయశ్శివా మాయేతి కథ్యతే || 39

పురుషః పరమేశానః ప్రకృతిః పరమేశ్వరీ | రుద్రో మహేశ్వరస్సాక్షాద్రుద్రాణీ రుద్రవల్లభా || 40

విష్ణుర్విశ్వేశ్వరో దేవో లక్ష్మీర్విశ్వేశ్వరప్రియా | బ్రహ్మాశివో యదా స్రష్టా బ్రహ్మాణీ బ్రహ్మణః ప్రియా || 41

భాస్కరో భగవాన్‌ శంభుః ప్రభా భగవతీ శివా | మహాంద్రో మన్మథారాతిశ్శచీశైలేంద్రకన్యకా || 42

జ్ఞానశక్తి బుద్ధిరూపములో ఆ ప్రకృతి యొక్క కార్యమును, కరణము (సాధనము) ను, కారణమును మరియు ప్రయోజనమును యథాతథముగ నిశ్చయించు చుండును (33). క్రియాశక్తి సంకల్పరూపములో నుదయించి శివుని ఇచ్ఛను మరియు నిశ్చయమును అతిక్రమించకుండగా క్షణకాలములో సమస్తకార్యజగత్తును సృష్టించును (34). ఈ విధముగా మూడు శక్తుల కలయికచే జగత్తు పుట్టుచున్నది. ప్రసవించుట ధర్మముగా గల శక్తి పరాశక్తిచే ప్రేరితమై సకలజగత్తును సృష్టించుచున్నది (35) ఈ విధముగా శక్తులతో సమావేశముచే శివునకు శక్తిమాన్‌ అను పేరు వచ్చినది. శక్తి మరియు శక్తిమంతుల సంయోగముచే ఉదయించిన ఈ శివమయమగు జగత్తు శక్తితో నిండియున్నది (36). తల్లిదండ్రులు లేనిదే పుత్రుడు ఉదయించడు. అటులనే, పార్వతీపరమేశ్వరులు లేనిదే ఈ చరాచరజగత్తు లేదు. స్త్రీ పురుషుల (ఆదిదంపతుల) నుండి పుట్టిన జగత్తు స్త్రీ పురుషుల రూపములో మాత్రమే ఉన్నది (37). స్త్రీ పురుషులు క్రమముగా పార్వతీ పరమేశ్వరుల విభూతులు. కావుననే, జగత్తు స్త్రీ పురుషులచే అధిష్ఠించబడి యున్నది. పురుషుడు శివపరమాత్మ అనియు, శక్తి శివాదేవి అనియు కీర్తించబడుచున్నారు. స్త్రీపురుషులగు ఆదిదంపతుల విభూతి యైన ఈ జగత్తు ఆ స్త్రీపురుషుల చేతనే అధిష్ఠింపబడి యున్నది. పురుషుడగు శివుడు పరమాత్మ అనియు, పార్వతీదేవి ఆయన శక్తి అనియు కీర్తించబడుచున్నారు (38). శివుడు సదాశివుడనియు, పార్వతి మనోన్మని అనియు పిలువ బడుచున్నారు. శివుడే మహేశ్వరుడనియు, పార్వతి మాయ యనియు తెలియవలెను (39). పురుషుడే పరమేశ్వరుడు కాగా, ప్రకృతి పరమేశ్వరి యగుచున్నది. రుద్రుడు సాక్షాత్తుగా మహేశ్వరుడే. ఆయన ప్రియురాలగు పార్వతి రుద్రాణి (40). జగత్తునకు ప్రభువు అగు దేవుడు విష్ణువు కాగా, ఆ విశ్వేశ్వరుని ప్రియురాలు లక్ష్మి, శివుడు సృష్టికార్యమును చేసే బ్రహ్మకాగా, బ్రహ్మ యొక్క ప్రియురాలు బ్రహ్మాణి అనబడు చున్నది (41). సూర్యుడు శంభుభగవానుడే. సూర్యకాంతి భగవతియగు పార్వతి. మహేంద్రుడు మన్మధనాశకుడగు శివుడే. శచియే పార్వతి (42).

జాతవేదా మహాదేవస్స్వాహా శర్వార్ధదేహినీ | యమస్త్రియంబకో దేవస్తత్ర్పియా గిరికన్యకా || 43

నిరృతిర్భగవానీశో నైరృతీ నగనందినీ | వరుణో భగవాన్‌ రుద్రో వారుణీ భూధరాత్మజా || 44

బాలేందుశేఖరో వాయుశ్శివా శివమనోహరా | యక్షో యజ్ఞశిరోహర్తా బుద్ధిర్హిమగిరీంద్రజా || 45

చంద్రార్ధశేఖరశ్చంద్రో రోహిణీ రుద్రవల్లభా | ఈశానః పరమేశానస్తదార్యా పరమేశ్వరీ || 46

అనంతవలయో%నంతో హ్యనంతానంతవల్లభా | కాలాగ్నిరుద్రః కాలారిః కాలీ కాలంతకప్రియా || 47

పురుషాఖ్యో మనుశ్శంభుశ్శతరూపా శివప్రియా | దక్షస్సాక్షాన్మహాదేవః ప్రసూతిః పరమేశ్వరీ || 48

రుచిర్భవో భవానీ చ బుధైరాకూతిరుచ్యతే | భృగుర్భగాక్షిహా దేవః ఖ్యాతిస్త్రినయనప్రియా || 49

మరీచిర్భగవాన్‌ రుద్రస్సంభూతిశ్శర్వవల్లభా | గంగాధరో%గిరా జ్ఞేయస్స్మృతిస్సాక్షాదుమా స్మృతా || 50

పులస్త్యశ్శశభృన్మౌలిః ప్రీతిః కాంతా పినాకినః | పులహస్త్రిపురధ్వంసీ తత్ర్పియా తు శివప్రియా || 51

క్రతుధ్వంసీ క్రతుః ప్రోక్తస్సంనతిర్దయితా విభోః | త్రినేత్రో%త్రిరుమా సాక్షాదనసూయా స్మృతా బుధైః || 52

మహాదేవుడు అగ్ని, శివుని అర్ధాంగియగు పార్వతియే స్వాహాదేవి. ముక్కంటి దేవుడే యముడు. పార్వతియే యముని ప్రియురాలు (43). ఈశ్వరభగవానుడే నిరృతి. పార్వతి నిరృతి ప్రియురాలు. రుద్రభగవానుడే వరుణుడు. పార్వతియే వరుణుని ప్రియురాలు (44). బాలచంద్రుని శిరముపై ధరించిన శివుడే వాయువు, పార్వతియే వాయువుయొక్క ప్రియురాలు. యజ్ఞదేవత యొక్క తలను నరికిన శివుడే కుబేరుడు. పార్వతియే బుద్ధి (సంపద) (45). చంద్రవంకను శిరోభూషణముగా ధరించిన శివుడే చంద్రుడు, రుద్రుని ప్రియురాలగు పార్వతియే రోహిణి. పరమేశ్వరుడే ఈశానుడు. ఆ పరమేశ్వరియే ఈశానుని పత్ని (46). ఆదిశేషుడు కంఠాభరణముగా గల శివుడే ఆదిశేషుడు. అనంతురాలగు పార్వతియే శేషుని పత్ని. కాలమునకు శత్రువు (అతీతుడు) అగు శివుడే కాలాగ్ని రూపములోనున్న రుద్రుడు ఆ కాలాంతకుడగు శివుని ప్రియురాలే కాళి (47). పురుషుడని వర్ణించబడిన శివుడే మనువు. శివుని ప్రియురాలగు పార్వతియే శతరూప. సాక్షాత్తుగా మహాదేవుడే దక్షుడు. ఆ పరమేశ్వరియే ప్రసూతి (48). శివుడే రుచి, భవానియే ఆకూతి అని పండితులచే చెప్పబడుచున్నది. భగుని నేత్రములను ఊడబెరికిన శివుడే భృగుడు. ఆ ముక్కంటియొక్క ప్రియురాలగు పార్వతియే ఖ్యాతి (49). రుద్రభగవానుడే మరీచి, శివుని ప్రియురాలగు పార్వతియే సంభూతి. ఆ గంగాధరుడే అంగిరసుడని తెలియదగును. సాక్షాత్తు ఉమాదేవియే స్మృతి యని ఋషులు చెప్పుచున్నారు (50). చంద్రుని శిరముపై దాల్చిన శివుడే పులస్త్యుడు. పినాకధారియగు శివుని ప్రియురాలగు పార్వతియే ప్రీతి. త్రిపురములను ధ్వంసము చేసిన శివుడే పులహుడు. శివుని ప్రియురాలగు పార్వతియే పులహుని ప్రియురాలు (51). దక్షయజ్ఞమును నాశము చేసిన శివుడే క్రతువు అని చెప్పబడినాడు. ఆ విభుని ప్రియురాలగు పార్వతియే సంనతి. ఆ ముక్కంటియే అత్రి. ఉమాదేవియే సాక్షాత్తుగా అనసూయ అని పండితులు చెప్పుచున్నారు (52).

కశ్యపః కాలహా దేవో దేవమాతా మహేశ్వరీ | వసిష్ఠో మన్మథారాతిర్దేవీ సాక్షాదరుంధతీ || 53

శంకరః పురుషాస్సర్వే స్త్రి యస్సర్వా మహేశ్వరీ | సర్వే స్త్రీపురుషాస్తస్మాత్తయోరేవ విభూతయః || 54

విషయీ భగవానీశో విషయః పరమేశ్వరీ | శ్రావ్యం సర్వముమారూపం శ్రోతా శూలవరాయుధః || 55

ప్రష్టవ్యం వస్తుజాతం తు ధత్తే శంకరవల్లభా | ప్రష్టా స ఏవ విశ్వాత్మా బాలచంద్రావతంసకః || 56

ద్రష్టవ్యం వస్తురూపం తు బిభర్తి భవవల్లభా | ద్రష్టా విశ్వేశ్వరో దేవశ్శశిఖండశిఖామణిః || 57

రసజాతం మహాదేవీ దేవో రసయితా శివః | ప్రేయజాతం చ గిరిజా ప్రేయాంశ్చైవ గరాశనః || 58

మంతవ్యవస్తుతాం ధత్తే సదా దేవీ మహేశ్వరీ | మంతా స ఏవ విశ్వాత్మా మహాదేవో మహేశ్వరః || 59

బోద్ధవ్యవస్తురూపం తు బిభర్తి భవవల్లభా | దేవస్స ఏవ భగవాన్‌ బోద్ధా ముగ్ధేందుశేఖరః || 60

ప్రాణః పినాకీ సర్వేషాం ప్రాణినాం భగవాన్‌ ప్రభుః | ప్రాణస్థితిస్తు సర్వేషామంబికా చాంబురూపిణీ || 61

బిభర్తి క్షేత్రతాం దేవీ త్రిపురాంతకవల్లభా | క్షేత్రజ్ఞత్వం తదా ధత్తే భగవానంతకాంతకః || 62

కాలాంతకుడగు ఆ శివదేవుడే కశ్యపుడు. ఆ మహేశ్వరియే దేవమాత యగు అదితి. మన్మథశత్రువగు శివుడే వసిష్ఠుడు. పార్వతీదేవియే సాక్షాత్తుగా అరుంధతి (53). పురుషులందరు శంకరస్వరూపులే. స్త్రీలందరు మహేశ్వరియొక్క స్వరూపము వారే. కావున, స్త్రీపురుషులు అందరూ వారిద్దరి విభూతులే (54). విషయములను గ్రహించే ద్రష్ఠ ఈశభగవానుడే. విషయములు పరమేశ్వరియే. వినుటకు ఇంపైన శబ్దములన్నియు ఉమారూపమే. గొప్ప శూలము ఆయుధముగా గల శివుడే వినువాడు (55). ప్రశ్నించదగిన (దేని విషయములో జిజ్ఞాస పుట్టునో అట్టి) వస్తుసముదాయమంతనూ శంకరుని ప్రియురాలగు పార్వతియే ధరించి యున్నది. జగత్తునకు ఆత్మ అయినవాడు, బాలచంద్రుని శిరోభూషణముగా ధరించినవాడు అగు ఆ శివుడే ప్రశ్నించువాడు (జిజ్ఞాసువు) (56). చూడదగిన వస్తుసముదాయము నంతనూ శివుని ప్రియురాలగు పార్వతియే ధరించు చున్నది. చంద్రవంకను శిరోమణిగా దాల్చిన జగదీశ్వరుడగు ఆ దేవుడే చూచేవాడు (57). రసముల సముదాయము ఆ మహాదేవియే. రసములను ఆస్వాదించువాడు శివుడే. ప్రీతికరమైన వస్తువుల సముదాయము పార్వతియే. వాటియందు ప్రీతి గలవాడు విషమును మ్రింగిన శివుడే (58). మననము చేయదగిన వస్తువుయొక్క స్వరూపమును సర్వకాలములలో మహేశ్వరియగు ఆ దేవియే ధరించి యున్నది. జగత్తునకు ఆత్మ అయినవాడు, మహేశ్వరుడు అగు ఆ మహాదేవుడే మననము చేయువాడు (59). శివుని ప్రియురాలగు పార్వతియే తెలియదగిన వస్తువుల స్వరూపమును ధరించి యున్నది. చంద్రవంకను శిరముపై దాల్చిన, ప్రకాశస్వరూపుడగు ఆ శివభగవానుడే తెలుసుకొనువాడు (60). ప్రాణులందరిలోని ప్రాణము పినాకమనే ధనస్సును ధరించిన జగన్నాథుడగు శివభగవానుడే. నీరు రూపములో సర్వప్రాణుల ప్రాణములను నిలబెట్టునది ఆ జగన్మాతయే (61). త్రిపురములను నశింపజేసిన శివునకు ప్రియురాలగు పార్వతీదేవి క్షేత్రము (సమష్టి మరియు వ్యష్టి దేహేంద్రియమనస్సంఘాతము) ను ధరించగా, అపుడు మృత్యువునకు మృత్యువు అగు శివభగవానుడు క్షేత్రజ్ఞస్వరూపమును ధరించి యున్నాడు (62).

అహశ్శూలాయుధో దేవశ్శూలపాణిప్రియా నిశా | ఆకాశశ్శంకరో దేవః పృథివీ శంకరప్రియా || 63

సముద్రో భగవానీశో వేలా శైలేంద్రకన్యకా | వృక్షో వృషధ్వజో దేవో లతా విశ్వేశ్వరప్రియా || 64

పుంలింగమఖిలం ధత్తే భగవాన్‌ పురశాసనః | స్త్రీలింగం చాఖిలం ధత్తే దేవీ దేవమనోరమా || 65

శబ్దజాలమశేషం తు ధత్తే శర్వస్య వల్లభా | అర్థస్వరూపమఖిలం ధత్తే ముగ్ధేందుశేఖరః || 66

యస్య యస్య పదార్థస్య యా యా శక్తిరుదాహృతా | సా సా విశ్వేశ్వరీ దేవీ స స సర్వో మహేశ్వరః || 67

యత్పరం యత్పవిత్రం చ యత్పుణ్యం యచ్చ మంగలమ్‌ | తత్తదాహ మహాభాగస్తయోస్తేజోవిజృంభితమ్‌ || 68

యథా దీప్తస్య దీపస్య శిఖా దీపయతే గృహమ్‌ | తథా తేజస్తయోరేతద్వ్యాప్య దీపయతే జగత్‌ || 69

తృణాదిశివమూర్త్యంతం విశ్వస్యాతిశయక్రమః | సన్నికర్షక్రమవశాత్తయోరితి పరా శ్రుతిః || 70

సర్వాకారాత్మకావేతౌ సర్వశ్రేయోవిధాయినౌ | పూజనీ¸° నమస్కార్యౌ చింతనీ¸° చ సర్వదా || 71

యథాప్రజ్ఞమిదం కృష్ణ యాథాత్మ్యం పరమేశయోః | కథితం హి మయా తే%ద్య న తు తావదియత్తయా || 72

శూలమును ఆయుధముగా ధరించిన శివదేవుడు పగలు కాగా, ఆయనకు ప్రియురాలగు పార్వతి రాత్రి అయినది. శంకరదేవుడే ఆకాశము కాగా, శంకరుని ప్రియురాలగు పార్వతి భూమి అయినది (63). ఈశభగవానుడు సముద్రము కాగా, పార్వతి చెలియలి కట్ట అయినది. వృషభము ధ్వజమునందు చిహ్నముగా గల శివదేవుడు చెట్టు కాగా, ఆ విశ్వేశ్వరుని ప్రియురాలగు పార్వతి తీగ అయినది (64). త్రిపురాసురులను సంహరించిన శివభగవానుడు పుంలింగమునకు అంతకు స్థితిని కల్పించగా, ఆ దేవుని మనస్సును రమింపజేయు పార్వతీదేవి స్త్రీలింగమునకంతకూ స్థితిని కలిగించు చున్నది (65). శివుని ప్రియురాలగు పార్వతి శబ్దసముదాయమునంతను ధరించియుండగా, బాలచంద్రుని శిరముపై దాల్చిన శివుడు అర్థ స్వరూపమునంతనూ ధరించి యున్నాడు (66). ఏయే పదార్థములకు ఏయే శక్తులు వర్ణించబడినవో, అవి అన్నియు ఆ విశ్వేశ్వరీ దేవియే; ఆ సర్వము మహేశ్వరుడే (67). ఓ మహాత్ములారా! శ్రేష్ఠమైనది ఏది గలదో, పవిత్రమైనది ఏది గలదో, పుణ్యమైనది ఏది గలదో, మంగళకరమైనది ఏది గలదో, అవి అన్నియు వారిద్దరి తేజస్సుయొక్క విస్తారము మాత్రమే (68). దీపమును వెలిగించినచో దాని జ్వాల ఇంటికి వెలుతురునిచ్చును. అదే విధముగా, వారిద్దరి తేజస్సు ఈ జగత్తును వ్యాపించి ప్రకాశింపజేయుచున్నది (69). గడ్డిపోచతో మొదలిడి శివమూర్తి వరకు జగత్తులో ఉన్న క్రమవికాసము వారిద్దరి సంయోగముయొక్క క్రమమునకు వశ##మై యున్నదని సర్వోత్కృష్టమగు వేదవచనము చెప్పుచున్నది (70). ఆకారములన్నింటియొక్క ఆత్మ వీరిద్దరే. వీరిద్దరు సర్వులకు శ్రేయస్సును సమగూర్చెదరు. జనులు సర్వకాలములలో వీరిద్దరిని పూజించి నమస్కరించి ధ్యానించ వలెను (71). ఓ శ్రీకృష్ణా! నేను నాకు గల ప్రజ్ఞకు లోబడి పార్వతీపరమేశ్వరుల తత్త్వమును నీకీనాడు చెప్పితిని. అంతేగాని, వారి విభూతి ఇంత మాత్రమే అని కాదు (72).

తత్కథం శక్యతే వక్తుం యాథాత్మ్యం పరమేశయోః | మహతామపి సర్వేషాం మనసో%పి బహిర్గతమ్‌ || 73

అంతర్గతమనన్యానామీశ్వరార్పితచేతసామ్‌ | అన్యేషాం బుద్ధ్యనారూఢమారూఢం చ యథైవ తత్‌ || 74

యేయముక్తా విభూతిర్వై ప్రాకృతీ సా% పరా మతా | అప్రాకృతాం పరామన్యాం గుహ్యాం గుహ్యవిదో విదుః || 75

యతో వాచో నివర్తంతే మనసా చేంద్రియైస్సహ | అప్రాకృతీ పరా చైషా విభూతిః పారమేశ్వరీ || 76

సైవేహ పరమం ధామ సైవేహ పరమా గతిః | సైవేహ పరమా కాష్ఠా విభూతిః పరమేష్ఠినః || 77

తాం ప్రాప్తుం ప్రయతంతే% త్ర జితశ్వాసా జితేంద్రియాః | గర్భకారాగృహద్వారం నిశ్చిద్రం ఘటితుం యథా || 78

సంసారాశీవిషాలీఢమృతసంజీవనౌషధమ్‌ | విభూతిం శివయోర్విద్వాన్న బిభేతి కుతశ్చన || 79

యః పరామపరాం చైవ విభూతిం వేత్తి తత్త్వతః | సో%పరాం భూతిముల్లంఘ్య పరాం భూతిం సమశ్నుతే || 80

ఏతత్తే కథితం కృష్ణ యాథాత్మ్యం పరమాత్మనోః | రహస్యమపి యోగ్యో%సి భర్గభక్తో భవానితి || 81

నాశిష్యేభ్యో%ప్యశైవేభ్యో నాభ##క్తేభ్యః కదాచనః | వ్యాహరేదీశయోర్భూతిమితి వేదానుశాసనమ్‌ || 82

పార్వతీపరమేశ్వరుల అట్టి మనస్సునకు కూడా గోచరము కాని యథార్థస్వరూపమును మహాత్ములందరు సమగూడియైననూ చెప్పుట ఎట్లు శక్యమగును? (73) ఈశ్వరుని యందు అనన్య (భేదము లేని) బుద్ధితో మనస్సును అర్పించిన వారలకు మాత్రమే బుద్ధియందు ఆరూఢమై అంతరంగమునందు విరాజిల్లే ఈ తత్త్వము ఇతరుల బుద్ధికి అందదు (74). ఇంతవరకు చెప్పబడిన ఈ విభూతి ప్రకృతికి సంబంధించినది గనుక అపరా (రెండువ స్థాయికి చెందినది) అని చెప్పబడును. దీనికంటె విలక్షణమైనది, ప్రకృతికి అతీతమైనది, రహస్యమైనది అగు పరావిభూతిని రహస్యవేత్తలగు ఋషులు తెలియుచున్నారు (75). పరమేశ్వరుని ఈ ప్రకృతికి అతీతమైన పరావిభూతిని వర్ణించలేక వాక్కులు మనస్సుతో మరియు ఇంద్రియములతో సహా వెనుక ముఖము పట్టుచున్నవి (76). ఈ జగత్తులో అదియే సర్వోత్కృష్టమగు తేజస్సు; అదియే సర్వోత్కృష్టమగు మోక్షము; అదియే పరమేశ్వరుని విభూతి యొక్క చరమసీమ (77). ఈ లోకములో యోగులు ఇంద్రియములను, శ్వాసను జయించి దానిని పొంది, తల్లి గర్భము అనే కారాగారముయొక్క ద్వారమును బంధించుటకు అనగా, మరల జన్మను పొందకుండుటకు యత్నించుచున్నారు (78). సంసారము అనే పాముచే కరువబడి మరణించినవారిని బ్రతికించే ఔషధము అగు పార్వతీపరమేశ్వరుల విభూతిని తెలుసుకున్నవాడు దేని వలనైననూ భయపడడు (79). ఎవడైతే పరాపర విభూతుల తత్త్వమునెరుంగునో, వాడు అపరావిభూతిని అతిక్రమించి పరావిభూతిని పొందును (80). ఓ శ్రీకృష్ణా! ఈ విధముగా పార్వతీపరమేశ్వరుల యథార్థతత్త్వము రహస్యమే అయిననూ, నీవు యోగ్యుడవు మరియు శివభక్తుడవు గనుక, నేను నీకు చెప్పితిని (81). పార్వతీపరమేశ్వరుల విభూతిని శిష్యులు కాని వారికి, శివభక్తులు కాని వారికి చెప్పరాదని వేదము శాసించు చున్నది (82).

తస్మాత్త్వమతికల్యాణ పరేభ్యః కథయేన్న హి | త్వాదృశేభ్యో%నురూపేభ్యః కథయైతన్న చాన్యథా || 83

విభూతిమేతాం శివయోర్యోగ్యేభ్యో యః ప్రదాపయేత్‌ | సంసారసాగరాన్ముక్తశ్శివసాయుజ్యమాప్నుయాత్‌ || 84

కీర్తనాదస్య నశ్యంతి మహాంత్యః పాపకోటయః | త్రిశ్చతుర్ధా సమభ్యసై#్తర్వినశ్యంతి తతో%ధికాః || 85

నశ్యంత్యనిష్టరిపవో వర్ధంతే సుహృదస్తథా | విద్యాచ వర్ధతే శైవీ మతిస్సత్యే ప్రవర్తతే || 86

భక్తిః పరా శివే సాంబే సానుగే సపరిచ్ఛదే | యద్యదిష్టతమం చాన్యత్తత్తదాప్నోత్యసంశయమ్‌ || 87

అంతశ్శుచిశ్శివే భక్తో విస్రబ్ధః కీర్తయేద్యది | ప్రబలైః కర్మభిః పూర్వైః ఫలం చేత్ర్పతిబధ్యతే |

పునః పునస్సమభ్యస్యేత్తస్య నాస్తీహ దుర్లభమ్‌ || 88

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే గౌరీశంకర విభూతియోగో నామ చతుర్థో%ధ్యాయః (4).

ఓయీ పరమమంగళస్వరూపా! కావున, నీవు దీనిని ఇతరులకు చెప్పకుము. నీవలె యోగ్యులైన వారికి దీనిని చెప్పుము. మరియొక విధముగా చేయకుము (83). పార్వతీపరమేశ్వరుల ఈ విభూతిని ఎవడైతే యోగ్యులకు ఇచ్చునో, వాడు సంసారసముద్రమునుండి విముక్తుడై శివుని సాయుజ్యమును పొందును (84). దీనిని కీర్తించుట వలన కోట్లాది మహాపాపములు నశించును. మూడు నాలుగు సార్లు అభ్యాసమును చేసినచో, అంత కంటె అధికములగు పాపములు నశించును (85). ఇష్టులు కాని శత్రువులు నశించి మిత్రులు వర్ధిల్లెదరు. శివవిద్య వర్దిల్లును. బుద్ధి సత్యమునందు ప్రవర్తిల్లును (86). అతడు జగన్మాతతో, అనుచరులతో మరియు ప్రమథగణములతో కూడియున్న శివునియందు పరాభక్తిని, మరియు తనకు ఏవేవి ఇష్టమో వాటిని నిస్సందేహముగా పొందును (87). అంతరంగములో శుచియగు శివభక్తుడు దీనిని విశ్వాసముతో కీర్తించ వలెను. బలీయమైన పూర్వకర్మలచే ఫలము అడ్డుకొనబడినచో, దీనిని మరల మరల అభ్యసించ వలెను. అట్లు చేయు వానికి లభింప శక్యము కానిది లేదు (88).

శ్రీశివమహాపురాణములోని వాయువీయసంహితయందు ఉత్తరఖండలో గౌరీశంకరుల విభూతిని వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).

Siva Maha Puranam-4    Chapters