Siva Maha Puranam-4
Chapters
అథ సప్తమోధ్యాయః శివానుగ్రహముయొక్క మహిమ ఉపమన్యురువాచ | శక్తిస్స్వాభావికీ తస్య విద్యా విశ్వవిలక్షణా | ఏకానేకస్య రూపేణ భాతి భానోరివ ప్రభా || 1 అనంతాశ్శక్తయో యస్యా ఇచ్ఛాజ్ఞానక్రియాదయః | మాయాద్యాశ్చాభవన్ వహ్నేర్విస్ఫులింగా యథా తథా || 2 సదాశివేశ్వరాద్యా హి విద్యా%విద్యేశ్వరాదయః | అభవన్ పుశుషాశ్చాస్యాః ప్రకృతిశ్చ పరాత్పరా || 3 మహదాదివిశేషాంతాస్త్వజాద్యాశ్చాపి మూర్తయః | యచ్చాన్యదస్తి తత్సర్యం తస్యాః కార్యం న సంశయః || 4 సా శక్తిస్సర్వగా సూక్ష్మా ప్రబోధానందరూపిణీ | శక్తీమానుచ్యతే దేవశ్శివశ్శీతాంశుభూషణః || 5 వేద్యశ్శివశ్శివా విద్యా ప్రజ్ఞా చైవ శ్రుతిస్స్మృతిః | ధృతిరేషా స్థితిర్నిష్ఠా జ్ఞానేచ్ఛాకర్మశక్తయః || 6 ఆజ్ఞా చైవ పరం బ్రహ్మ ద్వే విద్యే చ పరాపరే | శుద్ధవిద్యా శుద్ధకలా సర్వం శక్తికృతం యతః || 7 మాయా చ ప్రకృతిర్జీవో వికారో వికృతిస్తథా | అసచ్చ సచ్చ యత్కించిత్తయా సర్వమిదం జగత్ || 8 సా దేవీ మాయయా సర్వం బ్రహ్మాండం సచరాచరమ్ | మోహయత్యప్రయత్నేన మోచయత్యపి లీలయా || 9 అనయా సహ సర్వేశస్సప్తవింశప్రకారయా | విశ్వం వ్యాప్య స్థితస్తస్మాన్ముక్తిరత్ర ప్రవర్తతే || 10 ఉపమన్యుడు ఇట్లు పలికెను - విద్యారూపమైనది, జగత్తుకంటె విలక్షణమైనది అగు శక్తి ఆ శివునియందు సహజసిద్ధముగా నున్నది. ఆ శక్తి ఒక్కటియే అయిననూ సూర్యుని కాంతి వలె అనేకరూపములలో ప్రకాశించుచున్నది (1). ఇచ్ఛ జ్ఞానము క్రియ మొదలైనవి, మాయ మొదలైనవి అగు ఆ శక్తి యొక్క రూపములు మంటనుండి లేచే నిప్పు కణముల వలె అనంతములుగా నున్నవి (2). సదాశివుడు, ఈశ్వరుడు మొదలగు వారు మరియు విద్య, విద్యేశ్వరుడ మొదలగు పురుషులు ఆ శక్తినుండియే ప్రకటమైనారు. సర్వకారణములకు కారణమగు ప్రకృతి కూడా ఆ శక్తినుండియే ఉదయించినది (3). మహత్తు మొదలుకొని పరమాణువులలోని విశేషము వరకు గల పదార్థములు, బ్రహ్మ మొదలగు మూర్తులు, ఇంకనూ ఏమైన ఉన్నచో ఆ సర్వము ఆ శక్తినుండి పుట్టినవియే. సందేహము లేదు (4). సర్వవ్యాపకము, సూక్ష్మము అగు ఆ శక్తి, జ్ఞానము మరియు ఆనందముల రూపములో నున్నది. చల్లని కిరణముల చంద్రుని శిరముపై నలంకరించుకున్న శివదేవుడు శక్తిమాన్ అనబడును (5). తెలియదగినవాడు శివుడు. విద్యాస్వరూపిణి పార్వతి. ప్రజ్ఞ (వినూత్నవిషయములను కనుగొనే బుద్ధిశక్తి), వేదము, స్మృతులు, ధైర్యము, మనయందు కానవచ్చే స్థిరత్వము, నిష్ఠ (పట్టుదల), జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, ఆజ్ఞ, పరంబ్రహ్మ, పరావిద్య మరియు అపరావిద్య అనే రెండు విద్యలు, శుద్ధవిద్య, శుద్ధకళ అనునవి ఆ శక్తిరూపములే. ఏలయనగా, సర్వము శక్తిచేతనే చేయబడి యున్నది (6,7). మాయ, ప్రకృతి, జీవుడు, పంచభూతములనే వికారములు, వాటిచే నిర్మాణమైన పదార్థములు, ఉనికి, అభావము అనేవి ఏవి గలవో ఆ ఈ సర్వము ఆ శక్తి చేతనే వ్యాపించబడి యున్నది (8). ఆ దేవి మాయచే చరాచరప్రాణులతో కూడియున్న బ్రహ్మాండమునంతనూ ప్రయత్నము లేకుగడగనే మోహపెట్టుచున్నది; లీలచే విముక్తులను కూడ చేయుచున్నది (9). ఇరువది యేడు రకములుగా ప్రకటమైన ఈమెతో గూడి సర్వేశ్వరుడు జగత్తును వ్యాపించి యున్నాడు. కావున, ఈమెయందే మోక్షము ప్రవర్తిల్లు చున్నది (10). ముముక్షవః పురా కేచిన్మునయో బ్రహ్మవాదినః | సంశయావిష్టమనసో విమృశంతి యథాతధమ్ || 11 కిం కారణం కుతో జాతా జీవామః కేన వా వయమ్ | కుత్రా%స్మాకం సంప్రతిష్ఠా కేన వాధిష్ఠితా వయమ్ || 12 కేన వర్తామహే శశ్వత్సుఖేష్వన్యేషు చానిశమ్ | అవిలంఘ్యా చ విశ్వస్య వ్యవస్థా కేన వా కృతా || 13 కాలస్స్వభావో నియతిర్యదృచ్ఛా నా త్ర యుజ్యతే | భూతాని యోనిః పురుషో యోగశ్చైషాం పరో%థవా || 14 అచేతనత్వాత్కాలాదేశ్చేతనత్వే%పి చాత్మనః | సుఖదుఃఖాని భూతత్వాదనీశత్వాద్విచార్యతే || 15 తద్ధ్యానయోగానుగతాం ప్రపశ్యన్ శక్తిమైశ్వరీమ్ | పాశవిచ్ఛేదికాం సాక్షాన్నిగూఢాం స్వగుణౖర్భృశమ్ || 16 తయా విచ్ఛిన్నపాశాస్తే సర్వకారణకారణమ్ | శక్తిమంతం మహాదేవమపశ్యన్ దివ్యచక్షుషా || 17 యః కారణాన్యశేషాణి కాలాత్మసహితాని చ | అప్రమేయో%నయా శక్త్వా సకలం యో%ధితిష్ఠతి || 18 తతః ప్రసాదయోగేన యోగేన పరమేణ చ | దృఢేన భక్తియోగేన దివ్యాం గతిమవాప్నుయుః || 19 తస్మాత్సహ తయా శక్త్యా హృది పశ్యంతి యే శివమ్ | తేషాం శాశ్వతికీ శాంతిర్నేతరేషామితి శ్రుతిః || 20 పూర్వము మోక్షమును కోరే బ్రహ్మవాదులగు కొందరు మునులు సంశయములతో ఆవేశించబడిన మనస్సులు గలవారై వస్తుస్థితిని విమర్శచేసిరి (11). జగత్కారణమేది? మనము ఎక్కడనుండి పుట్టితిమి? మనము దేనిఏ జీవించుచున్నాము? మన నిశ్చలస్థితి ఎక్కడ నున్నది? మనము దేనిచే అధిష్టించబడి యున్నాము? (12) దేనిచే మనము శాశ్వతకాలము నిత్యము సుఖదుఃఖములను అనుభవించుచున్నాము? జగత్తుయొక్క ఉల్లంఘింప శక్యము కాని ఈ వ్యవస్థను ఎవరు చేసిరి? (13) కాలము, స్వభావము, నియతి (నిశ్చితముగా ఫలమునిచ్చే కర్మ), యదృచ్ఛ (ఆకస్మికముగా జరిగే ఘటన) అనునవి ఈ జగత్తునకు కారణములనుట యుక్తియుక్తముగా లేదు. పంచభూతములు గాని, జీవుడు గాని, వాటి కలయిక గాన, లేక మరియొకటి గాని కారణము కాజాలవు (14). ఏలయనగా, కాలము జడము, జీవుడు చేతనుడే అయినా వానికి సుఖదుఃఖములున్నవి; పైగా, జీవుడు అసమర్థుడు. జగత్కారణము ఈ విధముగా విచారము చేయబడుచున్నది (15). బంధమును పోగొట్టునది. సత్త్వరజస్తమస్సులు అనే తన గుణములచేతనే నిశ్చయముగా కప్పివేయబడి ఉండునది అగు ఈశ్వరశక్తిని వారు ధ్యానయోగముననుసరించి సాక్షాత్తుగా దర్శించిరి (16). ఆమెచే తొలగించి వేయబడిన బంధములు గల ఆ మునులు, శక్తితో గూడియున్న మహాదేవుడు సర్వకారణములకు కారణమైనవాడు అను సత్యమును దివ్యనేత్రములతో దర్శించిరి (17). ప్రమాణములకు అతీతుడైన ఆ శివుడు ఈ శక్తితో గూడి కాలముతో మరియు జీవులతో గూడియున్న సకలకారణములను మరియు సకలజగత్తును అధిష్ఠించి యున్నాడు (18). తరువాత వారు ప్రసాద (అనుగ్రహ) యోగముచే, పరమయోగముచే మరియు దృఢమగు భక్తియోగముచే దివ్యమగు గతి (మోక్షము) ని పొందిరి (19). కావున, ఎవరైతే శక్తితో గూడియున్న శివుని హృదయములో దర్శించెదరో, వారికి మాత్రమే శాశ్వతమగు శాంతి లభించుననియు, ఇతరులకు కాదనియు వేదము చెప్పుచున్నది (20). న హి శక్తిమతశ్శక్త్యా విప్రయోగో%స్తి జాతుచిత్ | తస్మాచ్ఛక్తేశ్శక్తిమతస్తాదాత్మ్యాన్నిర్వృతిర్ద్వయోః || 21 క్రమో వివక్షితో నూనం విముక్తౌ జ్ఞానకర్మణోః | ప్రసాదే సతి సా ముక్తిర్యస్మాత్కరతలే స్థితా || 22 దేవో వా దానవో వాపి పశుర్వా విహగో%పి వా | కీరో వాథ కృమిర్వాపి ముచ్యతే తత్ర్పసాదతః || 23 గర్భస్థో జాయమానో వా బాలో వా తరుణో%పి వా | వృద్ధో వా మ్రియమాణో వా స్వర్గస్థో వాథ నారకీ || 24 పతితో వాపి ధర్మాత్మా పండితో మూఢ ఏవ వా | ప్రసాదే తత్‌క్షణాదేవ ముచ్యతే నాత్ర సంశయః || 25 అయోగ్యానాం చ కారుణ్యాద్భక్తానాం పరమేశ్వరః | ప్రసీదతి న సందోహో విగృహ్య వివిధాన్మలాన్ || 26 ప్రసాదాదేవ సా భక్తిః ప్రసాదో భక్తిసంభవః | అవస్థాభేదముత్ర్పేక్ష్య విద్వాంస్తత్ర న ముహ్యతి || 27 ప్రసాదపూర్వికా యేయం భుక్తిముక్తివిధాయినీ | నైవ సా శక్యతే ప్రాప్తుం నరైరేకేన జన్మనా || 28 అనేకజన్మసిద్ధానాం శ్రౌతస్మార్తానువర్తినామ్ | విరక్తానాం ప్రబుద్ధానాం ప్రసీదతి మహేశ్వరః || 29 ప్రసన్నే సతి దేవేశే పశౌ తస్మిన్ ప్రవర్తతే | అస్తి నాథో మమేత్యల్పా భక్తిర్బుద్ధిపురస్సరా || 30 శక్తిమంతుడగు శివునకు శక్తితో ఎన్నడైననూ వియోగము ఉండదు. కావున, శక్తిశక్తిమంతులనే ఇద్దరి తాదాత్మ్యము వలన ఆనందము కలుగును (21). మోక్షమునందు జ్ఞానకర్మల క్రమము చెప్పబడిన మాట వాస్తవమే. కాని, వారి అనుగ్రహము ఉన్నచో, ఆ మోక్షము అరచేతిలో నున్నది (22). దేవత గాని, రాక్షసుడు గాని, పశువు గాని, పక్షి గాన, కీటకము గాని, క్రిమి గాని ఆ శివుని అనుగ్రహమున్నచో మోక్షమును పొందును (23). గర్భమునందలి శిశువు గాని, అప్పుడే పుట్టుచున్నవాడు గాని, పిల్లవాడు గాని, యువకుడు గాని, ముదుసలి గాని, మరణించుచున్నవాడు గాని, స్వర్గమునందున్నవాడు గాని, నరకమునందున్నవాడు గాని (24), పతితుడు గాని, ధర్మాత్ముడు గాని, పండితుడు గాని, మూర్ఖుడు గాని శివుని అనుగ్రహమున్నచో, వెనువెంటనే మోక్షమును పొందుననుటలో సందేహము లేదు (25). పరమేశ్వరుడు అయోగ్యులగు భక్తులయందలి దయచే వారియందలి వివిధములగు దోషములను నివారించి అనుగ్రహించుననుటలో సందేహము లేదు (26). శివుని అనుగ్రహము వలననే ఆ భక్తి కలుగును, భక్తినుండి అనుగ్రము పుట్టును. అవస్థలలోని భేదమును బట్టి ఈ స్థితులు ఉండునని ఊహించి విద్వాంసుడు ఆ విషయములో మోహమును పొందడు (27). అనుగ్రహము వలన కలిగి, భుక్తిని మరియు ముక్తిని ఇచ్చే ఈ ఏ భక్తి గలదో, దానిని మానవుడు ఒక్క జన్మలో పొందలేడు (28). అనేకజన్మలలో శ్రౌతస్మార్తకర్మలను చేసి సిద్ధి (అంతఃకరణశుద్ధి) ని పొంది విరక్తులై జ్ఞానమును పొందిన వారిని మహేశ్వరుడు అనుగ్రహించును (29). జీవునియందు ఆ దేవదేవుడు ప్రసన్నుడు కాగానే, నాకు నాథుడు గలడు అనే బుద్ధితో గూడియున్న అల్పమగు భక్తి వానియందు ఉదయించును (30). తపసా వివధైశ్శె వైర్ధర్మైస్సంయుజ్యతే నరః | తత్ర యోగే తదభ్యాసస్తతో భక్తిః పరా భ##వేత్ || 31 పరయా చ తయా భక్త్యా ప్రసాదో లభ్యతే పరః | ప్రసాదాత్సర్వపాశేభ్యో ముక్తిర్ముక్తస్య నిర్వృతిః || 32 అల్పభావో%పి యో మర్త్యస్సో% పి జన్మత్రయాత్పరమ్ | న యోనియంత్రపీడాయై భ##వేన్నైవాత్ర సంశయః || 33 సాంగా%నంగా చ యా సేవా సా భక్తిరితి కథ్యతే | సా పునర్భిద్యతే త్రేధా మనోవాక్కాయసాధనైః || 34 శివరూపాదిచింతా యా సా సేవా మానసీ స్మృతా | జపాదిర్వాచకీ సేవా కర్మ పూజాది కాయికీ || 35 సేయం త్రిసాధనా సేవా శివాధర్మశ్చ కథ్యతే | స తు పంచవిధః ప్రోక్తశ్శివేన పరమాత్మనా || 36 తపః కర్మ జపో ధ్యానం జ్ఞానం చేతి సమాసతః | కర్మ లింగార్చనాద్యం చ తపశ్చాంద్రాయణాదికమ్ || 37 జపస్త్రిధా శివాబ్యాసశ్చింతా ధ్యానం శివస్య తు | శివాగమోక్తం యద్ జ్ఞానం తదత్ర జ్ఞానముచ్యతే || 38 శ్రీ కంఠేన శివేనోక్తం శివాయై చ శివాగమః | శివా శ్రితానాం కారుణ్యాచ్ర్ఛేయసామేకసాధనమ్ || 39 తస్మాద్వివర్ధయేద్భక్తిం శివే పరమకారణ | త్యజేచ్చ విషయాసంగం శ్రేయోర్థీ మతిమాన్నరః || 40 ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివానుగ్రహ మహిమ వర్ణనం నామ సప్తమో%ధ్యాయః (7). ఆ భక్తుడు తపస్సుతో మరియు వివిధములగు శైవధర్మములతో సంయోగమును పొందును. ఆ సంయోగమును పొంది వాటిని అభ్యాసము చేయుట వలన ఆతనికి పరాభక్తి కలుగును (31). ఆ పరాభక్తిచే గొప్ప అనుగ్రహము లభించును. అనుగ్రహము వలన సకల బంధములనుండి మోక్షము లభించును. మోక్షము వలన ఆనందము లభించును (32). అల్పమగు భక్తి గల మానవుడైననూ మూడు జన్మల తరువాత మరల గర్భవాసదుఃఖముననుభవించ బోడు. ఈ విషయములో సందేహము లేదు (33). అంగములతో కూడినది మరియు అంగములు లేనిది అగు సేవకు భక్తి అని పేరు. మనస్సు, వాక్కు, శరీరము అను సాధనములను బట్టి, ఆ భక్తి మరల మూడు రకములుగా నున్నది (34). శివుని రూపము మొదలగు వాటిని ధ్యానించుట మానససేవ అనబడును. జపము మొదలైనవి వాచిక సేవ. పూజ మొదలగు కర్మలు కాయిక సేవ అగును (35). మూడు సాధనములతో చేయబడే ఈ సేవకే శివధర్మము అని కూడ పేరు. అది సంగ్రహముగా తపస్సు, కర్మ, జపము, ధ్యానము, జ్ఞానము అనే అయిదు రకములుగా నున్నదని శివపరమాత్మ చెప్పియున్నాడు. లింగార్చన మొదలగునవి కర్మ. చాంద్రాయణము మొదలైనవి తపస్సు (36,37). శివమంత్రమును మూడు విధములుగా (బిగ్గరగా ఉచ్చరించుట, పైకి వినబడని విధముగా ఉచ్చరించుట, మనస్సులో మాత్రమే ఉచ్చరించుట) ఆవృత్తి చేయుటయే జపము. శివుని తలపోయుచుండుటయే ధ్యానము. ఇచట జ్ఞానమనగా శివాగమములో చెప్పబడిన జ్ఞానము మాత్రమే (38). విషకంఠుడగు శివుడు తనను ఆశ్రయించిన వారిపై గల దయచే శ్రేయస్సులకు ఏకైక సాధనమగు శివాగమమును పార్వతికి చెప్పినాడు (39). కావున, శ్రేయస్సును కోరే బుద్ధిమంతుడగు మానవుడు విషయసుఖములయందలి ఆసక్తిని విడిచి పెట్టి, సర్వకారణకారణుడగు శివునియందు భక్తిని పెంపొందించు కొనవలెను (40). శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివభక్తియొక్క మహిమను వర్ణించే ఏడవ అధ్యాయము ముగిసినది (7).