Siva Maha Puranam-4
Chapters
అథ అష్టమో
శివుని ఆదిత్య రూపమును వర్ణించుట
శ్రీకృష్ణ ఉవాచ |
భగవన్ శ్రోతుమిచ్ఛామి శివేన పరిభాషితమ్ | వేదసారం శివజ్ఞానం స్వాశ్రితానాం విముక్తయే || 1
అభక్తానామబుద్ధీనామయుక్తానామగోచరమ్ | అర్థైర్దశార్ధైస్సంయుక్తం గూఢమప్రాజ్ఞనిందితమ్ || 2
వర్ణాశ్రమకృతైర్ధర్మైర్విపరీతం క్వచిత్సమమ్ | వేదాత్ షడంగాదుద్ధృత్య సాంఖ్యా ద్యోగాచ్చ కృత్స్నశః || 3
శతకోటిప్రమాణన విస్తీర్ణం గ్రంథసంఖ్యయా | కథితం పరమేశేన తత్ర పూజా కథం ప్రభోః || 4
కస్యాధికారః పూజాదౌ జ్ఞానయోగాదయః కథమ్ | తత్సర్వం విస్తరాదేవ వక్తుమర్హసి సువ్రత|| 5
శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -
ఓ పూజ్యా! శివుడు తనను ఆశ్రయించిన వారి మోక్షము కొరకై చెప్పియున్న వేదసారమగు శివజ్ఞానమును నేను వినగోరుచున్నాను (1). భక్తులు కానివారికి, బుద్ధి లేనివారికి, అయోగ్యులకు అందనిది, అయిదు అంశములతో కూడియున్నది, రహస్యమైనది, మూర్ఖులచే నిందించబడేది (2), వర్ణాశ్రమధర్మములతో కొన్నిచోట్ల సమానముగ నున్ననూ కొన్నిచోట్ల విభేదించునది అగు శివజ్ఞానము పరమేశ్వరునిచే ఆరు అంగములతో కూడిన వేదము నుండి సాంఖ్యమునుండి మరియు యోగము నుండి పూర్తి సారమును పైకి తీసి వందకోట్ల శ్లోకసంఖ్య గల గ్రంథరూపముగా చెప్పబడినది. దానియందు ఆ ప్రభుని పూజ ఎట్లు చెప్పబడినది? (3, 4) పూజ మొదలగు వాటియందు ఎవనికి అధికారము గలదు?జ్ఞానయోగము మొదలగునవి ఎట్లు చెప్పబడినవి? ఓ గొప్ప వ్రతము గలవాడా! ఆ విషయమునంతనూ నీవు విస్తరముగా చెప్పదగుదువు (5).
ఉపమన్యురువాచ |
శైవం సంక్షిప్య వేదోక్తం శివేన పరిభాషితమ్ | స్తుతినిందాదిరహితం సద్యః ప్రత్యయకారణమ్ || 6
గురు ప్రసాదజం దివ్యమనాయాసేన ముక్తిదమ్ | కథయిష్యే సమాసేన తస్య శక్యో న విస్తరః || 7
సిసృక్షయా పురావ్యక్తాచ్ఛివః స్థాణుర్మహేశ్వరః | సత్కార్యకారణోపేతస్స్వయమావిరభూత్ర్పభుః || 8
జనయామాస చ తదా ఋషిర్విశ్వాధిపః ప్రభుః | దేవానాం ప్రథమం దేవం బ్రహ్మాణం బ్రహ్మణస్పతిమ్ || 9
బ్రహ్మాపి పితరం దేవం జాయమానో న్యవైక్షత | తం జాయమానం జనకో దేవః ప్రాపశ్యదాజ్ఞయా || 10
దృష్టో రుద్రేణ దేవో%సా వసృజద్విశ్వమీశ్వరః | వర్ణాశ్రమవ్యవస్థాం చ చకార స పృథక్ పృథక్ || 11
సోమం ససర్జ యజ్ఞార్థే సోమాద్ద్యౌస్సమజాయత | ధరా చ వహ్నిస్సూర్యశ్చ యజ్ఞో విష్ణుశ్శచీపతిః || 12
తే చాన్యే చ సురా రుద్రం రుద్రాధ్యాయేన తుష్టువుః | ప్రసన్నవదనస్తస్థౌ దేవానామగ్రతః ప్రభుః || 13
అపహృత్య స్వలీలార్థం తేషాం జ్ఞానం మహేశ్వరః | తమపృచ్ఛంస్తతో దేవాః కో భవానితి మోహితాః || 14
సో%బ్రవీద్భగవాన్ రుద్రో హ్యహమేకః పురాతనః | ఆసం ప్రథమమేవాహం వర్తామి చ సురోత్తమాః || 15
ఉపమన్యువు ఇట్లు చెప్పెను -
వేదముచే చెప్పబడినది, మరల శివునిచే చెప్పబడినది, స్తుతి నింద మొదలగునవి లేనిది, వెనువెంటనే జ్ఞానమును కలిగించునది, గురువుయొక్క అనుగ్రహముచే లభించునది, దివ్యమైనది, అనాయాసముగా ముక్తిని ఇచ్చునది అగు శైవాగమమును సంగ్రహముగా చెప్పెదను. దానిని విస్తారముగా చెప్పుట సంభవము కాదు (6, 7). పూర్వము నిర్వికారుడు, మహేశ్వరుడు, సద్రూపమగు కార్యకారణములతో కూడియున్నవాడు అగు శివప్రభుడు అవ్యక్తము(ప్రకృతి) నుండి సృష్టిని చేయగోరి తాను అవిర్భవించెను (8). అపుడు మంత్రద్రష్ట, జగత్తునకు ప్రభువు అగు ఆ ప్రభువు దేవతలలో మొదటి దేవత, వేదమునకు ప్రభువు అగు బ్రహ్మను సృష్టించెను (9). బ్రహ్మ కూడా పుట్టుచుండగా తండ్రియగు శివదేవుని చూచెను. తండ్రియగు ఆ శివదేవుడు పుట్టుచున్న ఆ బ్రహ్మను చూచెను. రుద్రునిచే చూడబడి తద్ద్వారా ఆజ్ఞాపించబడిన ఈ జగత్ర్పభువగు బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించి, వేర్వేరుగా వర్ణాశ్రమవ్యవస్థను కూడ చేసెను (10, 11). ఆయన యజ్ఞము కొరకై సోమమును సృష్టించెను. సోమమునుండి ఆకాశము, భూమి, అగ్ని, సూర్యుడు, యజ్ఞము, విష్ణువు, శచీపతియగు ఇంద్రుడు ప్రకటమైనారు (12). వారు మరియు ఇతరదేవతలు రుద్రాధ్యాయముతో రుద్రుని స్తుతించిరి. ఆ ప్రభుడు ప్రసన్నమగు ముఖము గలవాడై దేవతల యెదుట నిలబడెను (13). మహేశ్వరుడు తన లీల కొరకై వారి జ్ఞానమును అపహరించెను. అపుడు మోహమును పొంది దేవతలు ఆయననే, నీవెవరివి? అని ప్రశ్నించిరి (14). అపుడా రుద్రభగవానుడు ఇట్లు పలికెను: సృష్టికి ముందులో సనాతనుడగు నేను ఒక్కడిని మాత్రమే ఉంటిని. ఓ గొప్ప దేవతలారా! ఇప్పుడు కూడ నేను ఉన్నాను (15).
భవిష్యామి చ మత్తో%న్యో వ్యతిరిక్తో న కశ్చన | అహమేవ జగత్సర్వం తర్పయామి స్వతేజసా || 16
మత్తో%ధికస్సమో నాస్తి మాం యో వేద స ముచ్యతే | ఇత్యుక్త్వా భగవాన్ రుద్రస్తత్రైవాంతరధత్త సః |
అపశ్యంతస్తమీశానం స్తువంతశ్చైవ సామభిః || 17
వ్రతం పాశుపతం కృత్వా త్వథర్వశిరసిస్థితమ్ | భస్మసంఛన్నసర్వాంగా బభూవురమరాస్తదా || 18
అథ తేషాం ప్రసాదార్థం పశూనాం పతిరీశ్వరః || 19
సగణశ్చోమయా సార్ధం సాన్నిధ్యమకరోత్ర్పభుః | యం వినిద్రా జితశ్వాసా యోగినో దగ్ధకిల్బిషాః || 20
హృది పశ్యంతి తం దేవం దదృశుర్దేవపుంగవాః | యామాహుః పరమాం శక్తిమీశ్వరేచ్ఛానువర్తినీమ్ || 21
తామపశ్యన్మహేశస్య వామతో వామలోచనామ్ | యే వినిర్ధుతసంసారాః ప్రాప్తాశ్శైవం పరం పదమ్ || 22
నిత్యసిద్ధాశ్చ యే వాన్యం తే చ దృష్టా గణశ్వరాః | అథ తం తుష్టువుర్దేవా దేవ్యా సహ మహేశ్వరమ్ || 23
స్తోత్రైర్మాహేశ్వరైర్దివ్యైః శ్రౌతైః పౌరాణికైరపి | దేవో%పి దేవానాలోక్య ఘృణయా వృషభధ్వజః || 24
తుష్టో%స్మీత్యాహ సుప్రీతస్స్వభావమధురాం గిరమ్ | అథ సుప్రీతమనసం ప్రణిపత్య వృషధ్వజమ్ |
అర్థం మహత్తమం దేవాః పప్రచ్ఛురిదమాదరాత్ || 25
భవిష్యత్తులో కూడ నేనే ఉండగలను. నాకంటె భిన్నముగా మరియొకడు లేడు. నేనే జగత్తునంతకూ నా తేజస్సుతో తృప్తిని కలిగించు చున్నాను (16). నాకంటె అధికుడు గాని, నాతో సమానమైన వాడు గాని లేడు. నన్ను తెలుసుకున్నవాడు మోక్షమును పొందును. ఆ రుద్రభగవానుడు ఇట్లు పలికి, అచటనే అంతర్థానమును చెందెను. ఆ ఈశ్వరుని కనజాలక దేవతలు ఆయనను స్తోత్రములతో స్తుతిస్తూ, అపుడు అథర్వోపనిషత్తులో చెప్పబడిన పాశుపతవ్రతమును చేసి, భస్మను సకలావయవములకు పూసుకొనిరి (17, 18). అపుడు పశుపతి, జగన్నాథుడు అగు ఈశ్వరుడు వారిని అనుగ్రహించుట కొరకై గణములతో మరియు పార్వతితో గూడి వారికి తన సన్నిధిని ఇచ్చెను. నిద్రను వీడి శ్వాసను జయించి పాపములను దహించివేసి యోగులు ఏ ఈశ్వరుని హృదయములో దర్శించుచున్నారో, అట్టి దేవుని దేవనాయకులు దర్శించిరి. ఏ పరమశక్తి ఈశ్వరుని ఇచ్ఛకు అనురూపముగా ప్రవర్తిల్లునని పెద్దలు చెప్పుచున్నారో, అట్టి సుందరమగు కన్నులు గల పార్వతిని వారు ఆయనకు ఎడమ భాగమునందు దర్శించిరి. ఎవరైతే సంసారమును త్రోసిపుచ్చి సర్వశ్రేష్ఠమగు శివపదమును పొంది నిత్యసిద్ధులైనారో, అట్టి గణశ్వరులను కూడ వారు చూచిరి. తరువాత దేవతలు దేవితో కూడియున్న ఆ మహేశ్వరుని, వేదములలో మరియు పురాణములలో ఉండే దివ్యములైన మహేశ్వరునకు సంబంధించిన స్తోత్రములతో స్తుతించిరి. వృషభము ధ్వజమునందు చిహ్నముగా గల శివదేవుడు కూడ దేవతలను దయాదృష్టితో చూచి, మిక్కిలి ప్రీతిని పొందినవాడై, స్వభావము చేతనే మధురమైన వాక్కుతో,నేను సంతోషించితిని అని పలికెను. తరువాత దేవతలు మిక్కిలి సంతోషముతో నిండిన మనస్సు గల ఆ వృషభధ్వజునకు నమస్కరించి మిక్కిలి మహత్త్వము గల ఈ విషయమును గురించి ఆదరముగా ప్రశ్నించిరి (19-25).
దేవా ఊచుః |
భగవాన్ కేన మార్గేణ పూజనీయో%పి భూతలే | కస్యాధికారః పూజాయాం వక్తుమర్హసి తత్త్వతః || 26
తతస్సస్మితమాలోక్య దేవీం దేవవరో హరః | స్వరూపం దర్శయామాస ఘోరం సూర్యాత్మకం పరమ్ || 27
సర్వైశ్వర్యగుణోపేతం సర్వతేజోమయం పరమ్ | శక్తిభిర్మూర్తిభిశ్చాంగైర్గ్రహైర్దేవైశ్చ సంవృతమ్ || 28
అష్టబాహుం చతుర్వక్త్రమర్ధనారీకమద్భుతమ్ | దృష్ట్వైవమద్భుతాకారం దేవా విష్ణుపురోగమాః || 29
బుద్ధ్వా దివాకరం దేవం దేవీం చైవ నిశాకరమ్ | పంచ భూతాని శేషాణి తన్మయం చ చరాచరమ్ || 30
ఏవముక్త్వానమశ్చక్రుస్తసై#్మ చార్ఘ్యం ప్రదాయవై || 31
సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణవర్ణాభరణాయ తుభ్యమ్ |
పద్మాభ##నేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ || 32
సురత్నపూర్ణం ససువర్ణతోయం సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్ |
ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్ ప్రసీద || 33
నమశ్శివాయ శాంతాయ సగణాయాది హేతవే | రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణ సూర్యమూర్తయే || 34
యశ్శివం మండలే సౌరే సంపూజ్యైవ సమాహితః | ప్రాతర్మధ్యాహ్నసాయాహ్నే ప్రదద్యాదర్ఘ్యముత్తమమ్ || 35
ప్రణమేద్వా పఠేదేతాన్ శ్లోకాన్ శ్రుతిముఖానిమాన్ | న తస్య దుర్లభం కించిద్భక్తశ్చేన్ముచ్యతే దృఢమ్ || 36
దేవతలు ఇట్లు పలికిరి-
ఓ భగవాన్! భూలోకములో నిన్ను ఏ మార్గములో పూజించవలెను? పూజయందు అధికారము ఎవరికి గలదు? నీవీ విషయమును యథాతథముగా చెప్పు దగుదువు (26). తరువాత దేవతలలో శ్రేష్ఠుడగు శివుడు పార్వతీదేవి వైపు చిరునవ్వుతో చూచి, భయంకరమైనది, సూర్య స్వరూపములో నున్నది, సర్వశ్రేష్ఠమైనది, సకలమైన ఈశ్వరగుణములతో కూడియున్నది, సకలతేజస్సులతో నిండియున్నది, శక్తులు మూర్తులు అంగములు గ్రహములు మరియు దేవతలు అను వాటితో చుట్టువారబడి యున్నది, ఎనిమిది బాహువులు నాలుగు ముఖములు గలది, సగభాగము స్త్రీ రూపములో నున్నది, అద్భుతమైనది అగు తన స్వరూపమును చూపించెను. విష్ణువు మొదలగు దేవతలు ఈ విధముగా అద్భుతరూపమును చూచి (27-29), శివుడే సూర్యుడనియు, పార్వతియే చంద్రుడనియు, మిగిలిన దేహావయవములు పంచభూతములనియు, చరాచరజగత్తు శివునితో నిండి యున్నదనియు తెలుసుకొని (30), ఆయనకు అర్ఘ్యమునిచ్చి, ఇట్లు పలికి నమస్కరించిరి (31). ఎర్రని రంగు గలవాడు, చక్కని మండలము గలవాడు, బంగరు రంగు గల ఆభరణములు గలవాడు, పద్మమును పోలిన కన్నులు గలవాడు, పద్మముతో కూడి యున్నవాడు, బ్రహ్మ ఇంద్రుడు నారాయణుడు అను వారికి కారణమైన వాడు అగు నీకు నమస్కారము (32). ఓ భగవాన్! చక్కని రత్నములు, బంగారము, కుంకుమ, దర్భలు, పుష్పములు మొదలగునవి గల, నీటితో నింపబడిన బంగరు పాత్రను మేము సమర్పించుచున్నాము. ఈ ప్రశస్తమైన అర్ఘ్యమును స్వీకరించి ప్రసన్నుడవు కమ్ము (33). శాంతస్వరూపుడు, గణములతో కూడియున్నవాడు, ఆదికారణుడు, భయంకరుడు, బ్రహ్మవిష్ణుశివస్వరూపుడు, సూర్యరూపములో నున్నవాడు అగు నీకు నమస్కారము (34). ఎవడైతే సూర్యమండలములో ఈ విధముగా ఏకాగ్రచిత్తముతో శివుని ఉదయము, మధ్యాహ్నము మరియు సాయంకాలము చక్కగా పూజించి, ఉత్తమమగు అర్ఘ్యమును ఇచ్చి నమస్కరించునో, లేదా వేదమునందు చెప్పబడిన ఈ శ్లోకములను పఠించునో, వానికి లభించ శక్యము కానిది ఏదీ లేదు. అతడు భక్తుడు అయినచో, నిశ్చయముగా ముక్తిని పొందును (35, 36).
తస్మాదభ్యర్చయేన్నిత్యం శివమాదిత్యరూపిణమ్ | ధర్మకామార్థముక్త్యర్థం మనసా కర్మణా గిరా || 37
అథ దేవాన్ సమాలోక్య మండలస్థో మహేశ్వరః | సర్వాగమోత్తరం దత్త్వా శాస్త్రమంతరధాద్ధరః || 38
తత్ర పూజాధికారో%యం బ్రహ్మక్షత్రవిశామితి |జ్ఞాత్వా ప్రణమ్య దేవేశం దేవా జగ్ముర్యథాగతమ్ || 39
అథ కాలేన మహతా తస్మిన్ శాస్త్రే తిరోహితే | భర్తారం పరిపప్రచ్ఛ తదంకస్థా మహేశ్వరీ || 40
తయా స చోదితే దేవో దేవ్యా చంద్రవిభూషణః | అవదత్కరముద్ధృత్య శాస్త్రం సర్వాగమోత్తరమ్ || 41
ప్రవర్తితం చ తల్లోకే నియోగాత్పరమేష్ఠినః | మయాగస్త్యేన గురుణా దధీచేన మహర్షిణా || 42
స్వయమప్యవతీర్యోర్వ్యాం యుగావర్తేషు శూలధృక్ | స్వాశ్రితానాం విముక్త్యర్థం కురుతే జ్ఞానసంతతిమ్ || 43
ఋభుస్సత్యో భార్గవశ్చ హ్యంగిరాస్సవితా ద్విజః | మృత్యుశ్శత క్రతుర్ధీమాన్ వసిష్ఠో మునిపుంగవః || 44
సారస్వతస్త్రి ధామా చ త్రివృతో మునిపుంగవః | శతతేజాస్స్వయం ధర్మో నారాయణ ఇతి శ్రుతః || 45
స్వరక్షశ్చారుణిర్ధీమాంస్తథా చైవ కృతంజయః | కృతంజయో భరద్వాజో గౌతమః కవిరుత్తమః || 46
వాచస్స్రవా మునిస్సాక్షాత్తథా సూక్ష్మాయణిశ్శుచిః | తృణబిందుర్మునిః కృష్ణశ్శక్తిశ్శాక్తేయ ఉత్తరః || 47
జాతూకర్ణ్యో హరిస్సాక్షాత్కృష్ణద్వైపాయనో మునిః | వ్యాసావతారాన్ శృణ్వంతు కల్పయోగేశ్వరాన్ క్రమాత్ || 48
కావున, నిత్యము సూర్యుని రూపములో నున్న శివుని ధర్మార్థకామమోక్షముల కొరకై మనోవాక్కాయములచే చక్కగా పూజించవలెను (37). తరువాత సూర్యమండలమునందున్న మహేశ్వరుడగు హరుడు దేవతలను చూచి, సర్వశాస్త్రములలో శ్రేష్ఠమైన శాస్త్రమును ఇచ్చి అంతర్ధానమయ్యెను (38). దానియందు బ్రాహ్మణక్షత్రియవైశ్యులకు ఈ పూజ యందు అధికారము చెప్పబడినది అని తెలుసుకొని, దేవతలు దేవదేవుడగు శివునకు నమస్కరించి వచ్చిన దారిన వెళ్లిరి (39). తరువాత చాల కాలమునకు ఆ శాస్త్రము కనబడకుండా పోగా, శివుని అంకముపై కూర్చున్న మహేశ్వరి తన భర్తను దానిని గురించి ప్రశ్నించెను (40). చంద్రుని ఆభరణముగా దాల్చిన ఆ దేవుడు ఆ దేవిచే ప్రోత్సహించబడినవాడై చేతిని పైకెత్తి సర్వశాస్త్రములలో శ్రేష్ఠమైన శాస్త్రమును చెప్పెను (41). పరమేశ్వరుని ఆజ్ఞచే ఆ శాస్త్రమును లోకములోనేను, గురుదేవుడగు అగస్త్యుడు, దధీచమహర్షి ప్రవర్తిల్లజేసితిమి (42). త్రిశూలధారియగు శివుడు తనను ఆశ్రయించిన వారి మోక్షము కొరకై తాను కూడ మహాయుగముల కాలచక్రములో భూమిపై స్వయముగా అవతరించి, జ్ఞానపరంపరను నిలబెట్టెను (43). ఓ బ్రాహ్మణులారా! ఋభువు, సత్యుడు, భార్గవుడు, అంగిరసుడు, సూర్యుడు, మృత్యువు, ఇంద్రుడు, బుద్ధిశాలియగు వసిష్ఠమహర్షి(44), సారస్వతుడు, త్రిధాముడు, త్రివృతమహర్షి, శతతేజసుడు, సాక్షాత్తుగా ధర్మస్వరూపుడుగా ప్రసిద్ధిని గాంచిన నారాయణుడు (45), స్వరక్షుడు, బుద్ధిశాలియగు ఆరుణి, కృతంజయుడు, (మరో) కృతంజయుడు, భరద్వాజుడు, గౌతముడు, కవి, ఉత్తముడు (46), సాక్షాత్తుగా వాచఃస్రవ మహర్షి, సూక్ష్మాయణి, శుచి, తృణబిందుమహర్షి, శ్రీకృష్ణుడు, శక్తి-శక్తిఉపాసకుడగు ఉత్తరుడు (47), జాతూకర్ణ్యుడు, హరి, సాక్షాత్తుగా కృష్ణద్వైపాయనమహర్షి అను వారు వ్యాసుని అవతారములు. క్రమముగా కల్పయోగేశ్వరులను గురించి వినుడు (48).
లైంగే వ్యాసావతారా హి ద్వాపరాంతేషు సువ్రతాః | యోగాచార్యావతారాశ్చ తథా శిష్యేషు శూలినః || 49
తత్ర తత్ర విభోశ్శిష్యాశ్చత్వారస్స్యుర్మహౌజసః | శిష్యాస్తేషాం ప్రశిష్యాశ్చ శతశో%థ సహస్రశః || 50
తేషాం సంభావనాల్లోకే శైవాజ్ఞాకరణాదిభిః | భాగ్యవంతో విముచ్యంతే భక్తా చాత్యంత భావితాః || 51
ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివస్య ఆదిత్య రూపవర్ణనం నామ అష్టమో%ధ్యాయః (8).
ఓ గొప్ప వ్రతము గలవారా! ద్వాపరయుగము పూర్తి అయిన తరువాత వచ్చే వ్యాసావతారములు, మరియు శివుడు స్వీకరించిన యోగాచార్యావతారములు లింగ పురాణములో వర్ణించ బడినవి. అంతేగాక, శివుని శిష్యులలో ప్రముఖులు కూడ ఆ పురాణములో వర్ణించబడినారు (49). ఆయా అవతారములలో శివునకు నలుగురు గొప్ప తేజశ్శాలురగు శిష్యులు ఉండిరి. వారి శిష్యులు, ప్రశిష్యులు వందల వేల సంఖ్యలో నున్నారు (50). లోకములో వారి ఉపదేశముననుసరించి, శివుని ఆజ్ఞను నెరవేర్చుట మొదలగు వాటి ద్వారా భక్తిచే అత్యంతము ప్రభావితులైన భాగ్యవంతులు మోక్షమును పొందెదరు (51).
శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివుని ఆదిత్యరూపమును వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).