Siva Maha Puranam-4    Chapters   

అథ నవమో%ధ్యాయః

శివుని యోగావతారము

శ్రీకృష్ణ ఉవాచ |

యుగావర్తేషు సర్వేషు యోగాచార్యచ్ఛలేన తు | అవతారాన్‌ హి శర్వస్య శిష్యాంశ్చ భగవన్‌ వద || 1

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

కాలచక్రములోని మహాయుగములన్నింటియందు శివుడు యోగాచార్యరూపముగా అవతరించినాడు గదా! ఆ అవతారములను మరియు ఆ శిష్యులను గురించి చెప్పుము (1).

ఉపమన్యురువాచ |

శ్వేతస్సుతారో మదనస్సుహోత్రః కంక ఏవ చ | లౌగాక్షిశ్చ మహామాయో జైగీషవ్యస్తథైవ చ || 2

దధివాహశ్చ ఋషభో మునిరుగ్రో%త్రిరేవ చ | సుపాలకో గౌతమశ్చ తథా వేదశిరా మునిః || 3

గోకర్ణశ్చ గుహావాసీ శిఖండీ చాపరస్స్మృతః | జటామాలీ చాట్టహాసో దారుకో లాంగులీ తథా || 4

మహాకాలశ్చ శూలీ చ దండీ ముండీశ ఏవ చ | సహిష్ణుస్సోమశర్మా చ లకులీశ్వర ఏవ చ || 5

ఏతే వారాహకల్పే%స్మిన్‌ సప్తమస్యాంతరే మనోః | అష్టావింశతిసంఖ్యాతా యోగాచార్యా యుగక్రమాత్‌ || 6

శిష్యాః ప్రత్యేకమేతేషాం చత్వారశ్శాంతచేతసః | శ్వేతాదయశ్చ రుష్యాంతాస్తాన్‌ బ్రవీమి యథాక్రమమ్‌ || 7

శ్వేతశ్శ్వేతశిఖశ్చైవ శ్వేతాశ్వశ్శ్వేతలోహితః | దుందుభిశ్శతరూపశ్చ ఋచీకః కేతుమాంస్తథా || 8

వికోశశ్చ వికేశశ్చ విపాశః పాశనాశనః | సుముఖో దుర్ముఖశ్చైవ దుర్గమో దురతిక్రమః || 9

సనత్కుమారస్సనకస్సనందశ్చ సనాతనః | సుధామా విరజాశ్చైవ శంఖశ్చాండజ ఏవ చ || 10

సారస్వతశ్చ మేఘశ్చ మేఘవాహస్సువాహకః | కపిలశ్చాసురిః పంచశిఖో బాష్కల ఏవ చ || 11

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

శ్వేతుడు, సుతారుడు, మదనుడు, సుహోత్రుడు, కంకుడు, లౌగాక్షి, మహామాయవియగు జైగీషవ్యుడు (2), దధివాహుడు, ఋషభుడు, ఉగ్రముని, అత్రి , సుపాలకుడు, గౌతముడు, వేదశిరముని(3), గోకర్ణుడు, గుహావాసి, శిఖండి, జటామాలి, అట్టహాసుడు, దారుకుడు, లాంగులి (4), మహాకాలుడు, శూలి, దండి, ముండీశుడు, సహిష్ణుడు, సోమశర్మ, లకులీశ్వరుడు (5) అనువారు వరాహకల్పములోని ఏడవ మన్వంతరములో మహాయుగముల వరుస ననుసరించి వచ్చిన ఇరవై ఎనిమిది యోగాచార్యులు (6). వీరిలో ప్రతి ఒక్కరికి శ్వేతునితో మొదలిడి రుష్యుని వరకు ఉండే శాంతమైన మనస్సు గల నలుగురు శిష్యులు గలరు. వారిని వరుసగా చెప్పెదను (7). శ్వేతుడు, శ్వేతశిఖుడు, శ్వేతాశ్వుడు, శ్వేతలోహితుడు, దుందుభి, శతరూపుడు, ఋచీకుడు, కేతుమంతుడు (8), వికోశుడు, వికేశుడు, విపాశుడు, పాశనాశనుడు, సుముఖుడు, దుర్ముఖుడు, దుర్గముడు, దురతిక్రముడు (9), సనత్కుమారుడు, సనకుడు, సనందుడు, సనాతనుడు, సుధాముడు, విరజస్సు, శంఖుడు, అండజుడు (10), సారస్వతుడు, మేఘుడు, మేఘవాహుడు, సువాహకుడు, కపిలుడు, ఆసురి, పంచశిఖుడు, బాష్కలుడు (11).

పరాశరశ్చ గర్గశ్చ భార్గవశ్చాంగిరాస్తథా | బలబంధుర్నిరామిత్రః కేతుశృంగస్తపోధనః || 12

లంబోదరశ్చ లంబశ్చ లంబాత్మా లంబకేశకః | సర్వజ్ఞస్సమబుద్ధిశ్చ సాధ్యస్సిద్ధిస్తథైవ చ ||13

సుధామా కశ్యపశ్చైవ వసిష్ఠో విరజాస్తథా | అత్రిరుగ్రో గురుశ్రేష్ఠః శ్రవణో%థ శ్రవిష్ఠకః || 14

కుణిశ్చ కుణిబాహుశ్చ కుశరీరః కునేత్రకః | కాశ్యపో హ్యుశనాశ్చైవ చ్యవనశ్చ బృహస్పతిః || 15

ఉతథ్యో వామదేవశ్చ మహాకాలో మహానిలః | వాచఃశ్రవాస్సువీరశ్చ శ్యావకశ్చ యతీశ్వరః || 16

హిరణ్యనాభః కౌశల్యో లోకాక్షిః కుథుమిస్తథా | సుమంతుర్జైమినిశ్చైవ కుబంధః కుశకంధరః || 17

ప్రక్షో దార్భాయణిశ్చైవ కేతుమాన్‌ గౌతమస్తథా | భల్లవీ మధుపింగశ్చ శ్వేతకేతుస్తథైవ చ || 18

ఉశిజో బృహదశ్వశ్చ దేవలః కవిరేవ చ | శాలిహోత్రస్సువేషశ్చ యువనాశ్వశ్శరద్వసుః || 19

అక్షపాదః కణాదశ్చ ఉలూకో వత్స ఏవ చ | కులిక్తశ్చైవ గర్గశ్చ మిత్రకో రుష్య ఏవ చ || 20

ఏతే శిష్యా మహేశస్య యోగాచార్యస్వరూపిణః | సంఖ్యాచ శతమేతేషాం సహ ద్వాదశసంఖ్యయా || 21

పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, అంగిరసుడు, బలబంధుడు, నిరామిత్రుడు, కేతుశృంగుడు, తపోధనుడు (12), లంబోదరుడు, లంబుడు, లంబాత్ముడు, లంబకేశకుడు, సర్వజ్ఞుడు, సమబుద్ధి, సాధ్యుడు, సిద్ధి (13), సుధాముడు, కశ్యపుడు, వసిష్ఠుడు, విరసుడు, అత్రి, ఉగ్రుడు, గురుశ్రేష్ఠుడు, శ్రవణుడు, శ్రవిష్ఠకుడు (14), కుణి , కుణిబాహుడు, కుశరీరుడు, కునేత్రకుడు, కాశ్యపుడు, ఉశనసుడు, చ్యవనుడు, బృహస్పతి (15), ఉతథ్యుడు, వామదేవుడు, మహాకాలుడు, మహానిలుడు, వాచఃశ్రవసుడు, సువీరుడు, శ్యావకుడు, యతీశ్వరుడు (16), హిరణ్యనాభుడు, కౌశల్యుడు, లోకాక్షి, కుథుమి, సుమంతుడు, జైమిని, కుబంధుడు, కుశకంధరుడు (17), ప్రక్షుడు, దార్భాయణి , కేతుమంతుడు, గౌతముడు, భల్లవి, మధుపింగుడు, శ్వేతకేతువు (18), ఉశిజుడు, బృహదశ్వుడు, దేవలుడు,కవి, శాలిహోత్రుడు, సువేషుడు, యువనాశ్వుడు, శరద్వసువు (19), అక్షపాదుడు, కణాదుడు, ఉలూకుడు, వత్సుడు, కులికుడు, గర్గుడు, మిత్రకుడు, రుష్యుడు (20), అనువారలు యోగాచార్యరూపములో అవతరించిన మహేశ్వరుని శిష్యులు. వీరి సంఖ్య నూడ పన్నెండు గలదు (21).

సర్వే పాశుపతాస్సిద్ధా భస్మోద్ధూలితవిగ్రహాః | సర్వశాస్త్రార్ధతత్త్వజ్ఞా వేదవేదాంగపారగాః || 22

శివాశ్రమరతాస్సర్వే శివజ్ఞానపరాయణాః | సర్వే సంగవినిర్ము క్తాశ్శివైకాసక్తచేతసః || 23

సర్వద్వంద్వసహా ధీరాస్సర్వభూతహితే రతాః | ఋజవో మృదవస్స్వస్థా జితక్రోధా జితేంద్రియాః || 24

రుద్రాక్షమాలాభరణాస్త్రిపుండ్రాంకితమస్తకాః | శిఖాజటాస్సర్వజటా అజటా ముండశీర్షకాః || 25

ఫలమూలాశనప్రాయాః ప్రాణాయామపరాయణాః | శివాభిమానసంపన్నాశ్శివధ్యానైకతత్పరాః || 26

సమున్మథితసంసారవిషవృక్షాంకురోద్గమాః | ప్రయాతుమేవ సన్నద్ధాః పరం శివపురం ప్రతి || 27

సదేశికానిమాన్మత్వా నిత్యం యశ్శివమర్చయేత్‌ | స యాతి శివసాయుజ్యం నాత్ర కార్యా విచారణా || 28

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివస్య యోగావతారవర్ణనం నామ నవమో%ధ్యా యః (9)

వీరందరు పాశుపతులు, సిద్ధులు, భస్మచే పూయబడిన దేహములు గలవారు, సర్వశాస్త్రముల సారము నెరింగిన వారు, వేదవేదాంగములలో దిట్టలు (22). వీరందరు శివాశ్రమము (శివుని సేవించే ఆశ్రమము) నందు ప్రీతి గలవారు, శివజ్ఞానమునందు తత్పరులు. వీరందరు ఆసక్తి నుండి విముక్తిని పొందినవారు , కేవలము శివునియందు మాత్రమే లగ్నమైన మనస్సులు గలవారు (23). వీరు సుఖదుఃఖములు మొదలగు ద్వంద్వములనన్నింటినీ సహించే ధీరులు. వీరు సకల ప్రాణుల హితమునందు శ్రద్ధ గలవారు. వీరు తిన్నని మృదువైన స్వభావము గలవారై ప్రసన్నముగా నుండెదరు. వీరు కోపమును, ఇంద్రియములను జయించిన వారలు (24). వీరందరు రుద్రాక్షమాలలనే ఆభరణములుగా ధరించి ముఖముపై త్రిపుండ్రమును అలంకరించుకొనెదరు. వీరిలో కొందరు శిఖవద్ద మాత్రము జటను ధరించువారు; కొందరు పూర్తిగా జటాజూటమును ధరించువారు; కొందరు జటలు లేకుండగా ముండితశిరస్కులు (25). వీరి ఆహారము ప్రధానముగా పళ్లు, దుంపలు మాత్రమే. వీరు ప్రాణాయామమునందు నిష్ఠ గలవారు; నేను శివుని వాడను అను అభిమానము గలవారు; శివుని ధ్యానించుటయందు మాత్రమే తత్పరులు (26). సంసారమనే విషవృక్షముయొక్క అంకురము కూడ మొలకెత్తకుండగా పెకిలించిన ఈ శిష్యులు సర్వోత్కృష్టమగు శివపురమును గురించి వెళ్లుటకు సంసిద్ధముగా నున్నారు (27). వీరి గురువగు శివుని, వీరిని తలచి నిత్యము ఎవరైతే శివుని పూజించునో, వాడు శివుని సాయుజ్యమును పొందును. ఈ విషయములో ఆశంకకు అవకాశము లేదు (28).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు శివునియోగావతారమును వర్ణించే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).

Siva Maha Puranam-4    Chapters