Siva Maha Puranam-4    Chapters   

అథ దశమో%ధ్యాయః

శివభక్తియొక్క మహిమ

శ్రీకృష్ణ ఉవాచ |

భగవన్‌ సర్వయోగీంద్ర గణశ్వర మునీశ్వర | షడాననసమప్రఖ్య సర్వజ్ఞాననిధే గురో || 1

ప్రాయస్త్వమవతీర్యోర్వ్యాం పాశవిచ్ఛిత్తయే నృణామ్‌ | మహర్షివపురాపస్థాయ స్థితో%సి పరమేశ్వర || 2

అన్యథా హి జగత్యస్మిన్‌ దేవో వా దానవో%పి వా | త్వత్తో%న్యః పరమం భావం కో జానీయాచ్ఛివాత్మకమ్‌ || 3

తస్మాత్తవ ముఖోద్గీర్ణం సాక్షాదివ పినాకినః | శివజ్ఞానామృతం పీత్వా న మే తృప్తమభూన్మనః || 4

సాక్షాత్సర్వజగత్కర్తుర్భర్తురంకం సమాశ్రితా | భగవన్‌ కిం ను పప్రచ్ఛ భర్తారం పరమేశ్వరీ || 5

శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను -

ఓ పూజ్యా! నీవు యోగులందరిలో గొప్పవాడవు. ఓ గణాధ్యక్షా! మహర్షీ! కుమారస్వామితో సమానమగు ప్రకాశము గలవాడా! సకలజ్ఞానమునకు నిధియైనవాడా! గురుదేవా! (1) ఓ పరమేశ్వరా! బహుశః నీవు మానవుల పాశములను త్రెంచివేయుట కొరకై భూమియందు మహర్షిరూపములో అవతరించి మాముందు ఉన్నావు (2). అట్లు గానిచో, ఈ జగత్తులో దేవత గాని, దానవుడు గాని నీవు తప్ప మరియొకడు శివతత్త్వమునెరింగిన వాడు ఎవడు గలడు? (3) కావున, సాక్షాత్తుగా ఆ పినాకధారియగు శివుడే నీ రూపములో నున్నాడా యన్నట్లు , నీ ముఖము నుండి వెలువడే శివజ్ఞానము అనే అమృతమును పానము చేసిననూ నాకు తృప్తి కలుగుట లేదు (4). ఓ పూజ్యా! సాక్షాత్తుగా సకలజగత్తులను సృష్టించిన తన భర్తయగు శివుని అంకమునందు కూర్చున్నదై ఆ పరమేశ్వరి తన భర్తను ఏమి ప్రశ్నించెను ? (5)

ఉపమన్యురువాచ |

స్థానే పృష్టం త్వయా కృష్ణ తద్వక్ష్యామి యథాతథమ్‌ | భవభక్తస్య యుక్తస్య తవ కల్యాణచేతసః || 6

మహాధరవరే దివ్యే మందరే చారుకందరే | దేవ్యా సహ మహాదేవో దివ్యో ధ్యానగతో% భవత్‌ || 7

తదా దేవ్యాః ప్రియసఖీ సుస్మితాస్యా శుభావతీ | ఫుల్లాన్యతిమనోజ్ఞాని పుష్పాణి సముదాహరత్‌ || 8

తతస్స్వమంకమారోప్య దేవీం దేవవరో రహః | అలంకృత్య చ తైః పుషై#్పరాస్తే హృష్టతరస్స్వయమ్‌ || 9

అథాంతఃపురచారిణ్యో దేవ్యో దివ్యవిభూషణాః | అంతరంగా గణంద్రాశ్చ సర్వలోకమహేశ్వరీమ్‌ || 10

భర్తారం పరిపూర్ణం చ సర్వలోకమహేశ్వరమ్‌ | చామరాసక్తహస్తాశ్చ దేవీం దేవం సిషేవిరే || 11

తతః ప్రియాః కథా వృత్తా వినోదాయ మహేశయోః | త్రాణాయ చ నృణాం లోకే యే శివం శరణం గతాః || 12

తదావసరమాలోక్య సర్వలోకమహేశ్వరీ | భర్తారం పరిపప్రచ్ఛ సర్వలోకమహేశ్వరమ్‌ || 13

ఉపమన్యుడు ఇట్లు పలికెను -

ఓ శ్రీకృష్ణా! నీవు చాల యోగ్యమగు ప్రశ్నను వేసితివి. శివభక్తుడవు, యోగ్యుడవు, మంగళకరమగు ఆలోచనలు గలవాడవు అగు నీకు నేనా విషయమును యథాతథముగా చెప్పెదను (6). పర్వతములలో శ్రేష్ఠమైనది, దివ్యమైనది, సుందరమగు గుహలు గలది అగు మందర పర్వతమునందు ప్రకాశస్వరూపుడగు మహాదేవుడు దేవితో గూడి ధ్యానమును పొంది యుండెను (7). అపుడు దేవియొక్క ప్రియసఖియగు శుభావతి చిరునవ్వుతో ప్రకాశించే ముఖము గలదై మిక్కిలి అందమైన వికసించిన పుష్పములను తెచ్చెను (8). తరువాత శివుడు దేవిని ఏకాంతములో తన అంకముపై కూర్చుండ బెట్టుకొని మిక్కిలి హర్షమును పొంది స్వయముగా ఆ పుష్పములతో ఆమెను అలంకరించు చుండెను (9). అపుడు అంతఃపురమునందు సంచరించే, దివ్యములగు ఆభరణములను ధరించి యున్న దేవతామూర్తులు మరియు ఆంతరంగికులగు గణాధ్యక్షులు సర్వలోకములకు మహేశ్వరియగు ఆ దేవిని, పూర్ణుడు సర్వలోకములకు మహేశ్వరుడు అగు ఆ దేవుని, చేతులలో వింజామరలను పట్టుకొని సేవించిరి (10. 11). అపుడు పార్వతీపరమేశ్వరుల వినోదము కొరకై ప్రీతికరమగు గాథలు చెప్పబడెను. అపుడు సర్వలోకమహేశ్వరి యగు దేవి సరియగు సమయమును చూచి, లోకములో శివుని శరణు పొందిన మానవుల రక్షణ కొరకై, సర్వలోకమహేశ్వరుడగు తన భర్తను ప్రశ్నించెను (12, 13).

దేవ్యువాచ |

కేన వశ్యో మహాదేవో మర్త్యానాం మందచేతసామ్‌ | ఆత్మతత్త్వాద్యశక్తానామాత్మనామకృతాత్మనామ్‌ || 14

దేవి ఇట్లు పలికెను -

మందబుద్ధి గలవారు, ఆత్మతత్త్వము మొదలగు వాటియందు శక్తి లేనివారు, కృతార్థులు కానివారు అగు మానవులకు మహాదేవుడు వశమయ్యే ఉపాయమేది? (14).

ఈశ్వర ఉవాచ |

న కర్మణా న తపసా న జపైర్నాసనాదిభిః | న జ్ఞానేన న చాన్యేన వశ్యో%హం శ్రద్ధయా వినా || 15

శ్రద్ధా మయ్యస్తి చేత్పుంసాం యేనకేనాపి హేతునా | వశ్యస్స్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్యస్సంభాష్య ఏవ చ || 16

సాధ్యా తస్మాన్మయి శ్రద్ధా మాం వశీకర్తుమిచ్ఛతా | శ్రద్ధా హేతుస్స్వధర్మస్య రక్షణం వర్ణినామిహ || 17

స్వవర్ణాశ్రమధర్మేణ వర్తతే యస్తు మానవః | తసై#్యవ భవతి శ్రద్ధా మయి నాన్యస్య కస్యచిత్‌ || 18

ఆమ్నాయసిద్ధమఖిలం ధర్మమాశ్రమిణామిహ | బ్రహ్మణా కథితం పూర్వం మమైవాజ్ఞాపురస్సరమ్‌ || 19

స తు పైతామహో ధర్మో బహువిత్తక్రియాన్వితః | నాత్యంతఫలభూయిష్ఠః క్లేశాయాససమన్వితః |

తేన ధర్మేణ మహతా శ్రద్ధాం ప్రాప్య సుదుర్లభామ్‌ || 20

వర్ణినో యే ప్రపద్యంతే మామనన్యసమాశ్రయాః | తేషాం సుఖేన మార్గేణ ధర్మకామార్థముక్తయః || 21

వర్ణాశ్రమసమాచారో మయా భూయః ప్రకల్పితః | తస్మిన్‌ భక్తిమతామేవ మదీయానాం తు వర్ణినామ్‌ || 22

అధికారో న చాన్యేషామిత్యాజ్ఞానైష్ఠికీ మమ | తదాజ్ఞప్తేన మార్గేణ వర్ణినో మదుపాశ్రయాః || 23

మలమాయాదిపాశేభ్యో విముక్తా మత్ర్పసాదతః | పురం మదీయమాసాద్య పునరావృత్తిదుర్లభమ్‌ |

పరమం మమ సాధర్మ్యం ప్రాప్య నిర్వృతిమాయయుః || 24

తస్మాల్లభ్ధ్వా%ప్యలబ్ధ్వా వా వర్ణధర్మం మయేరితమ్‌ | ఆశ్రిత్య మమ భక్తశ్చేత్స్వాత్మనాత్మానముద్ధరేత్‌ || 25

అలబ్ధలాభ ఏవైష కోటికోటిగుణాధికః | తస్మాన్మే ముఖతో లబ్ధం వర్ణధర్మం సమాచరేత్‌ || 26

ఈశ్వరుడిట్లు పలికెను -

శ్రద్ధ లేనిచో, కర్మ, తపస్సు, జపములు, ఆసనములు మొదలగు వాటికి గాని, జ్ఞానము నకు గాని, ఇతరమునకు గాని నేను వశము గాను (15). నాయందు మానవులకు ఏ కారణము చేతనైననూ శ్రద్ధ ఉన్నచో, నేను వారికి వశడనగుదును; వారు నన్ను స్పృశించ వచ్చును; చూచి పూజించి సంభాషించవచ్చును (16). కావున, నన్ను వశము చేసుకొన గోరు వ్యక్తి నాయందు శ్రద్ధను సాధన చేయవలెను. స్వధర్మమునకు హేతువు అగు శ్రద్ధ ఈ లోకములో వర్ణములవారిని అందరినీ రక్షించును (17). ఏ మానవుడైతే తన వర్ణాశ్రమధర్మమునకు అనురూపముగా జీవించునో, వానికి మాత్రమే నాయందు శ్రద్ధ కలుగును; ఇతరులకు ఎవరికైననూ కలుగదు (18). పూర్వము నా ఆజ్ఞను అనుసరించియే బ్రహ్మ ఈ లోకములో ఆశ్రమముల వారిని ఉద్దేశించి వేదములలో బోధింపబడిన సకలధర్మములను చెప్పి యున్నాడు (19). బ్రహ్మచే బోధిపబడిన ఆ ధర్మము చాల ధనముచే సాధ్యమయ్యే కర్మలతో, క్లేశముతో మరియు ఆయాసముతో కూడియున్ననూ అత్యధికఫలమును ఇచ్చునది గాదు. ఏ వర్ణముల వారైతే ఆ గొప్ప ధర్మముచే మిక్కిలి దుర్లభమగు శ్రద్ధను పొంది , సంసారమును విడిచిపెట్టి నన్ను మాత్రమే ఆశ్రయించెదరో, వారికి సుఖకరమగు మార్గముచే ధర్మార్ధకామమోక్షములు లభించును (20, 21). వర్ణాశ్రమములకు సంబంధించిన చక్కని ఆచారమును నేనే పలుపర్యాయములు సృష్టించితిని. దానియందు భక్తిని కలిగి నన్ను శరణు పొందిన వర్ణముల వారికి మాత్రమే అధికారము గలదు; ఇతరులకు లేదు. ఇది నా ఖచ్చితమైన ఆజ్ఞ. నేను ఆజ్ఞాపించియున్న ఆ మార్గముచే వర్ణములకు చెందినవారు నన్ను ఆశ్రయించి (22, 23), నా అనుగ్రహముచే పాపములు, మాయ మొదలగు బంధములనుండి విముక్తిని పొందెదరు. వెనుకకు తిరుగుట లేనిది, దుర్లభ##మైనది, సర్వోత్కృష్టమైనది అగు నా పురమునకు వచ్చి వారు నాతో ఐక్యమును పొంది మోక్షమును పొందెదరు (24). కావున, నేను చెప్పిన వర్ణధర్మమును పొందినవారు గాని, పొందని వారు గాని, నన్ను శరణు పొందిన భక్తుడైనచో, తనను తాను ఉద్ధరించు కొనును (25). ఇది కోటి కోటి రెట్లు అధికమైన లాభము. ఈ లాభము పూర్వములో పొందినది కాదు. కావున, నా ముఖమునుండి వచ్చిన వర్ణధర్మమును చక్కగా ఆచరించవలెను (26).

మమావతారా హి శుభే యోగాచార్యచ్ఛలేన తు | సర్వాంతరేషు సంత్యార్యే సంతతిశ్చ సహస్రశః || 27

ఆయుక్తానామబుద్ధీనామభక్తానాం సురేశ్వరి | దుర్లభం సంతతిజ్ఞానం తతో యత్నాత్సమాశ్రయేత్‌ || 28

స హానిస్తన్మహచ్ఛిద్రం స మోహస్సాంధకూపతా | యదన్యత్ర శ్రమం కుర్యాన్మోక్షమార్గబహిష్కృతః || 29

జ్ఞానం క్రియా చ చర్యా చ యోగశ్చేతి సురేశ్వరి | చతుష్పాదస్సమాఖ్యాతో మమ ధర్మస్సనాతనః || 30

పశుపాశపతిజ్ఞానం జ్ఞానమిత్యభిధీయతే | షడధ్వశుద్ధివిధినా గుర్వధీనా క్రియోచ్యతే || 31

వర్ణాశ్రమప్రయుక్తస్య మయైవ విహతస్య చ | మమార్చనాదిధర్మస్య చర్యా చర్యేతి కథ్యతే || 32

మదుకైనైవ మార్గేణ మయ్యవస్థితచేతసః | వృత్త్యంతరనిరోధో యో యోగ ఇత్యభిధీయతే || 33

అశ్వమేధగణాచ్ఛ్రేష్ఠం దేవి చిత్తప్రసాధనమ్‌ | ముక్తిదం చ తథా హ్యేతద్దుష్ప్రాప్యం విషయైషిణామ్‌ || 34

విజితేంద్రియవర్గస్య యమేన నియమేన చ | పూర్వపాపహరో యోగో విరక్తసై#్యవ కథ్యతే || 35

వైరాగ్యాజ్ఞాయతే జ్ఞానం జ్ఞానాద్యోగః ప్రవర్తతే || 36

ఓ శుభకరులారా! యోగాచార్యులు అనే మిషతో మహాయుగములన్నింటియందు నా అవతారములు గలవు. వారి శిష్యపరంపర కూడ వేలాది మంది గలరు (27). ఓ దేవదేవీ! అయోగ్యులు, మందబుద్ధులు, భక్తి లేనివారు అగు జనులకు పరంపరాప్రాప్తమగు ఈ జ్ఞానము దుర్లభము. కావున, ప్రయత్నపూర్వకముగా నన్ను ఆశ్రయించ వలెను (28). మానవుడు మోక్ష మార్గమునుండి బహిష్కృతుడై ఇతరములగు సంసారవిషయములయందు శ్రమించుట అనునది యేది గలదో, అదియే హాని; అదియే పెద్ద లోటు; అదియే మోహము; అదియే గ్రుడ్డితనము మరియు మూగితనము (29). ఓ దేవదేవీ! సనాతనమగు నా ధర్మమునందు జ్ఞానము, క్రియ, చర్య మరియు యోగములనే నాలుగు పాదములు గలవు (30). జీవుడు, బంధము, ఈశ్వరుడు అనువాటి జ్ఞానమునకు జ్ఞానమని పేరు. యథావిధిగా గురువునకు వశుడై చేసే ఆరుమార్గముల శుద్ధికి క్రియ అని పేరు (31) వర్ణాశ్రమములలో చేయబడే నా పూజ మొదలగు ధర్మము నా చేతనే విధించబడినది . దానిని ఆచరించుట చర్య అనబడును (32). నేను చెప్పిన మార్గము చేతనే నాయందు స్థిరముగా నున్న మనస్సు గలవాడై సాధకుడు ఇతరమగు మనోవృత్తులను నిరోధించుటయే యోగమని చెప్పబడు చున్నది (33). ఓ దేవీ! అనేకములగు అశ్వమేధయాగములకంటె శ్రేష్ఠమైనది, మనస్సునకు ప్రసన్నతను కలిగించునది మరియు మోక్షమునిచ్చునది అగు ఈ యోగము విషయభోగములయందు కోరిక గలవారికి లభించుట చాల కష్టము (34). యమనియమములచే పూర్వమునందలి పాపములను హరించి వేసే యోగము ఇంద్రియసమూహమును జయించిన విరక్తునకు మాత్రమే చెప్పబడినది (35). వైరాగ్యమునుండి జ్ఞానము పుట్టును. జ్ఞానము వలన యోగము ముందుకు సాగును (36).

యోగజ్ఞః పతితో వాపి ముచ్యతే నాత్ర సంశయః | దయా కార్యాథ సతతమహింసా జ్ఞానసంగ్రహః || 37

సత్యమస్తే యమాస్తిక్యం శ్రద్ధా చేంద్రియనిగ్రహః | అధ్యాపనం చాధ్యయనం యజనం యాజనం తథా || 38

ధ్యానమీశ్వరభావశ్చ సతతం జ్ఞానశీలతా | య ఏవం వర్తతే విప్రో జ్ఞానయోగస్య సిద్ధయే || 39

అచిరాదేవ విజ్ఞానం లబ్ధ్వా యోగం చ విందతి | దగ్ధ్వా దేహమిమం జ్ఞానీ క్షణాత్‌ జ్ఞానాగ్నినా ప్రియే || 40

ప్రసాదాన్మమ యోగజ్ఞః కర్మబంధం ప్రహాస్యతి | పుణ్యాపుణ్యాత్మకం కర్మ ముక్తేస్తత్ర్పతిబంధకమ్‌ |

తస్మాన్నియోగతో యోగీ పుణ్యాపుణ్యం వివర్జయేత్‌ || 41

ఫలకామనయా కర్మకరణా త్ర్పతిబధ్యతే | న కర్మమాత్రకరణాత్తస్మాత్కర్మఫలం త్యజేత్‌ || 42

ప్రథమం కర్మయజ్ఞేన బహిస్సంపూజ్య మాం ప్రియే | జ్ఞానయోగరతో భూత్వా పశ్చాద్యోగం సమభ్యసేత్‌ || 43

విదితే మమ యాథాత్మ్యే కర్మయజ్ఞేన దేహినః | న యజంతి హి మాం యుక్తాస్సమలోష్టాశ్మకాంచనాః || 44

నిత్యయుక్తో మునిః శ్రేష్ఠో మద్భక్తశ్చ సమాహితః |జ్ఞానయోగరతో యోగీ మమ సాయుజ్యమాప్నుయాత్‌ || 45

అథవిరక్తచిత్తా యే వర్ణినో మదుపాశ్రితాః | జ్ఞానచర్యాక్రియాస్వేవ తే%ధికుర్యుస్తదర్హకాః || 46

యోగమునెరింగిన వాడు పతితుడే అయినా మోక్షమును పొందును. ఈ విషయములో సందేహము లేదు. సాధకుడు సర్వకాలములలో దయను కలిగి యుండవలెను. అహింస, జ్ఞానమును ప్రోగుచేసుకొనుట (37), సత్యము, పరధనమును అపహరించ కుండుట, ఈశ్వరుని యందు అస్తిత్వబుద్ధి, శ్రద్ధ, ఇంద్రియములపై నిగ్రహము, శాస్త్రమును బోధించుట, తాను చదువుట, పూజను తాను చేయుట, ఇతరులచే చేయించుట(38), ధ్యానము, ఈశ్వరభక్తి, సర్వకాలములలో జ్ఞాననిష్ఠను కలిగియుండుట అను లక్షణములను ఏ బ్రాహ్మణుడైతే కలిగియుండునో, అతడు జ్ఞానయోగము సిద్ధించుటకు యోగ్యుడగును (39). అతడు తొందరలోననే విశేషజ్ఞానమును పొంది, యోగమును కూడ పొందును. ఓ ప్రియురాలా! ఆ జ్ఞాని ఈ దేహమును జ్ఞానమనే అగ్నిచే క్షణకాలములో దహించి (40), నా అనుగ్రహముచే యోగమును తెలుసుకొని కర్మబంధమునుండి విముక్తుడగును. పుణ్య పాపములనే రెండు రకముల కర్మ కూడా మోక్షమునకు ఆటంకమగును. కావున, యోగి నిశ్చితమగు యోగము ద్వారా పుణ్యపాపములను రెండింటినీ విడువవలెను (41). ఫలమునందలి కోరికతో కర్మను చేయువాడు బంధితుడగును. కాని, కేవలము కర్మను చేసినంత మాత్రాన బంధము ఉండదు. కావున, కర్మఫలమును విడువ వలెను(42). ఓ ప్రియురాలా! ముందుగా నన్ను కర్మరూపమగు యజ్ఞముచే బాహ్యమూర్తియందు చక్కగా పూజించి, జ్ఞానయోగమునందు ప్రీతిని పొంది, తరువాత యోగమును చక్కగా అభ్యసించవలెను (43). మానవునకు కర్మరూపమగు యజ్ఞముచే నా స్వరూపము యథాతథముగా తెలిసినప్పుడు, మట్టిబెడ్డ రాయి బంగారము అనువాటియందు సమానమగు ప్రవృత్తి గల అట్టి యోగులు నా పూజనుండి విరమించెదరు (44). సర్వకాలములలో సావధానుడై యుండువాడు, మననశీలుడు, ఉత్తముడు, నాభక్తుడు,ఏకాగ్రచిత్తము గలవాడు, జ్ఞానయోగమునందు ప్రీతి గలవాడు అగు యోగి నా సాయుజ్యమును పొందును (45). దీనికి భిన్నముగా, వైరాగ్యము లేని మనస్సు గలవారు, వర్ణములకు చెందినవారు అగు ఏ మానవులు నన్ను ఆశ్రయించెదరో, వారికి జ్ఞానము చర్య క్రియ అనువాటియందు మాత్రమే అధికారము గలదు. వారు వాటికి అర్హులు (46).

ద్విధా మత్పూజనం జ్ఞేయం బాహ్యమాభ్యంతరం తథా | వాఙ్మనః కాయభేదాచ్చ త్రిధా మద్భజనం విదుః || 47

తపః కర్మ జపో ధ్యానం జ్ఞానం వేత్యనుపూర్వశః | పంచధా కథ్యతే సద్భిస్తదేవ భజనం పునః || 48

అన్యాత్మ విదితం బాహ్యమస్మదభ్యర్చనాదికమ్‌ | తదేవ తు స్వసంవేద్యమాభ్యంతరముదాహృతమ్‌ || 49

మనో మత్ర్పవణం చిత్తం న మనోమాత్రముచ్యతే | మన్నామనిరతా వాణీ వాఙ్‌ మతా ఖలు నేతరా || 50

లింగైర్మచ్ఛాసనాదిష్టైస్త్రిపుండ్రాదిభిరంకింతః | మమోపచారనిరతః కాయః కాయో న చేతరః || 51

మదర్చా కర్మ విజ్ఞేయం బాహ్యే యాగాది నోచ్యతే | మదర్థే దేహసంశోషస్తపః కృచ్ఛ్రాది నో మతమ్‌ || 52

జపః పంచాక్షరాభ్యాసః ప్రణవాభ్యాస ఏవ చ | రుద్రాధ్యాయాదికాభ్యాసో న వేదాధ్యయనాదికమ్‌ || 53

ధ్యానం మద్రూపచింతాద్యం నాత్మాద్యర్థసమాధయః | మమాగమార్ధవిజ్ఞానం జ్ఞానం నాన్యార్థవేదనమ్‌ || 54

బాహ్యే వాభ్యంతరే వాథ యత్ర స్యాన్మనసో రతిః | ప్రాగ్వాసనావశాద్దేవి తత్త్వ నిష్ఠాం సమాచరేత్‌ || 55

బాహ్యాదాభ్యంతరం శ్రేష్ఠం భ##వేచ్ఛతగుణాధికమ్‌ | అసంకరత్వాద్దోషాణాం దృష్టానామప్యసంభవాత్‌ || 56

బాహ్యము, అభ్యంతరము అని నా పూజ రెండు రకములుగా నున్నది. మనోవాక్కాయములు అనే భేదమును బట్టి నా సేవ మూడు విధములుగా నున్నదని పెద్దలు చెప్పెదరు (47). నా సేవనే మరల తపస్సు, కర్మ, జపము, ధ్యానము, జ్ఞానము అని ఐదు విధములుగా క్రమముగా సత్పురుషులు విభాగమును చేసినారు (48). ఇతరులకు తెలిసే విధముగా చేయబడే పూజ మొదలగునది బాహ్యమనబడును. దానినే తనకు మాత్రమే తెలిసే విధముగా చేసినచో, అది ఆభ్యంతరమగును (49). మనస్సు అనగా నాయందు లగ్నమైన మనస్సే గాని, కేవలము ఆలోచించుట మాత్రమే మనస్సు కాదు. నా నామమునందు లగ్నమైన వాక్కు వాక్కు అగునే గాని, కేవలము మాటలాడుట వాక్కు కాదు (50). నా శాసనముచే ఆదేశించబడిన విధముగా త్రిపుండ్రము మొదలగు చిహ్నములచే చిహ్నింపబడి నా సేవయందు లగ్నమైన దేహమే దేహము గాని, శరీరమాత్రము దేహము కాదు (51). బాహ్యమునందు చేసే యజ్ఞము మొదలగునవి కర్మ కావు. కర్మ అనగా నా పూజ అని తెలియవలెను. నా కొరకై శరీరమును కృశింప జేయుటయే తపస్సు; కృచ్ఛ్రము మొదలగు వ్రతములు తపస్సు అనబడవు (52). పంచాక్షరమంత్రమును, ఓంకారమును, రుద్రాధ్యాయము మొదలగువాటిని పదే పదే ఉచ్చరించుట జపమనబడును; వేదాధ్యయనము మొదలగునవి జపము కావు (53). నా రూపమును తలపోయుట మొదలగునవి ధ్యానమగునే గాని, ఆత్మ మొదలగు వాటికొరకు చేసే చిత్తైకాగ్రతలు ధ్యానము అనబడవు. నా ఆగమముయొక్క అర్ధమును తెలియుటయే జ్ఞానమగును గాని, ఇతరవిషయములను తెలియుట కాదు (54). ఓ దేవీ! పూర్వమునందలి వాసనలకు లోబడి బాహ్యమునందు గాని, ఆంతరము (లోపల) నందు గాని, మనస్సునకు ఎక్కడ ప్రీతి కలుగునో, దానియందు మాత్రమే దృఢమగు తత్త్వ నిష్ఠను కలిగి యుండవలెను (55). బాహ్యము కంటె ఆభ్యంతరము వంద రెట్లు గొప్పది. ఏలయన, దానియందు దోషముల సాంకర్యము ఉండదు. మరియు దానియందు ప్రత్యక్షముగా కనబడే దోషములు సంభవించవు (56).

శౌచమాభ్యంతరం విద్యాన్న బాహ్యం శౌచముచ్యతే | అంతశ్శౌచవిముక్తాత్మా శుచిరప్యశుచిర్యతః || 57

బాహ్యమాభ్యంతరం చైవ భజనం భావపూర్వకమ్‌ | న భావరహితం దేవి విప్రలంభైకకారణమ్‌ || 58

కృతకృత్యస్య పూతస్య మమ కిం క్రియతే నరైః | బహిర్వాభ్యంతరం వాథ మయా భావో హి గృహ్యతే || 59

భావైకాత్మా క్రియా దేవి మమ ధర్మస్సనాతనః | మనసా కర్మణా వాచా హ్యనపేక్ష్య ఫలం క్వచిత్‌ || 60

ఫలోద్దేశేన దేవేశి లఘుర్మమ సమాశ్రయః | ఫలార్థీ తదభావే మాం పరిత్యక్తుం క్షమో యతః || 61

ఫలార్థినో%పి యసై#్యవ మయి చిత్తం ప్రతిష్ఠితమ్‌ | భావానురూపఫలదస్తస్యాప్యహమనిందితే || 62

ఫలానపేక్షయా యేషాం మనో మత్ర్పవణం భ##వేత్‌ | ప్రార్థయేయుః ఫలం పశ్చాద్భక్తాస్తే%పి మమ ప్రియాః || 63

ప్రాక్‌ సంస్కారవశాదేవ యే విచింత్య ఫలాఫలే | వివశా మాం ప్రపద్యంతే మమ ప్రియతమా మతాః || 64

మల్లాభాన్న పరో లాభ##స్తేషామితి యథాతథమ్‌ | మమాపి లాభస్తల్లాభాన్న పరః పరమేశ్వరి || 65

మదనుగ్రహతస్తేషాం భావో మయి సమర్పితః | ఫలం పరమనిర్వాణం ప్రయచ్ఛతి బలాదివ || 66

అంతరంగశౌచమే శౌచము గాని, బాహ్యము కాదని తెలియవలెను. ఏలయనగా, అంతశ్శౌచము లేని వ్యక్తి శుచిగా నున్ననూ అశుచియే (57). బాహ్యము మరియు ఆంతరము అగు సేవ భక్తిపూర్వకముగా నుండవలెను. ఓ దేవీ! భక్తి లేని సేవ సేవయే కాదు; అది కేవలము మోసమునకు మాత్రమే కారణమగును (58). కృతార్థుడను, పవిత్రుడను అగు నాకు జనులు ఏమి చేయవలసియున్నది? వారు చేసే బాహ్యము మరియు ఆభ్యంతరము అగు కర్మలలో నేను కేవలము భావనను మాత్రమే చూచెదను (59). ఓ దేవీ! క్రియ యొక్క ఆత్మ కేవలము భావము (అనురాగము) మాత్రమే. అదియే సనాతనమగు నా ధర్మము. ఫలమును ఏకాలమునందైననూ అపేక్షించకుండగా మనోవాక్కాయములతో కర్మను చేయవలెను (60). ఓ దేవీ! ఫలమును ఉద్దేశించి చేసినచో, నన్ను ఆశ్రయించుటయందు తేలిక భావము వచ్చినట్లగును. ఏలయనగా, ఫలమును కోరువాడు ఫలము లేని పక్షములో నన్ను విడుచుటకు సమర్థుడే యగును (61). దోషములు లేని ఓ పార్వతీ!ఫలమును కోరువానికైననూ ఎవని మనస్సు నాయందు స్థిరముగా నుండునో, వానికి కూడ వాని భావమునకు తగిన ఫలమును నేను ఇచ్చెదను (62). ఎవరి మనస్సులు ఫలమును అపేక్షించకుండగా నాయందు లగ్నమగునో, ఆ భక్తులు తరువాత ఫలమును కోరిననూ, నాకు ప్రియులే అగుచున్నారు (63). ఎవరైతే ఫలమును గురించి గాని, దాని అభావమును గురించి గాని, ఆలోచించకుండగా పూర్వమునందలి సంస్కారములకు వశులై ఒళ్లు మరిచి నన్ను శరణు వేడెదరో, వారు నాకు అతిశయించిన ప్రీతికి పాత్రులగుదురు (64). ఓ పరమేశ్వరీ! వారికి నన్ను పొందుట కంటె గొప్ప దగు వాస్తవికలాభము లేదు. నాకు కూడ వారిని పొందుట కంటె అధికమగు లాభము మరియొకటి లేదు (65). నాయందు సమర్పించబడిన వారి ప్రేమ నా అనుగ్రహముచే బలాత్కారముగానా యన్నట్లు సర్వోత్కృష్టమగు మోక్షఫలమును ఇచ్చును.

మహాత్మనామనన్యానాం మయి సన్న్యస్తచేతసామ్‌ | అష్టధా లక్షణం ప్రాహుర్మమ ధర్మాధికారిణామ్‌ || 67

మద్భక్తజనవాత్సల్యం పూజాయాం చానుమోదనమ్‌ | స్వయమభ్యర్చనం చైవ మదర్థే చాంగచేష్టితమ్‌ || 68

మత్కథాశ్రవణ భక్తిస్స్వరనేత్రాంగవిక్రియాః | మమానుస్మరణం నిత్యం యశ్చ మాముపజీవతి || 69

ఏవమష్టవిధం చిహ్నం యస్మిన్‌ వ్లుెచ్ఛే%పి వర్తతే | స విప్రేంద్రో మునిః శ్రీమాన్‌ స యతిస్స చ పండితః || 70

న మే ప్రియశ్చతుర్వేదీ మద్భక్తో శ్వపచో%పి యః | తసై#్మ దేయం తతో గ్రాహ్యం స చ పూజ్యో యథా హ్యహమ్‌ || 71

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి | తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి || 72

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివభక్తి మహిమవర్ణనం నామ దశమో%ధ్యాయః (10).

నాయందు అనన్య (భేదము లేని) భక్తి గలవారు, నాయందు సమర్పించబడిన చిత్తము గలవారు, నా ధర్మమునందు అధికారులు అగు మహాత్ములకు ఎనిమిది లక్షణములు గలవని చెప్పుదురు (67). నా భక్తజనులపై ప్రేమ, నా పూజను ప్రోత్సహించుట, స్వయముగా నన్ను పూజించుట, నా కొరకు మాత్రమే దేహమునందు చేష్టలను చేయుట (68), నా కథలను వినుటయందు భక్తి, కంఠస్వరము బొంగురు పోవుట కన్నులనుండి నీరు కారుట శరీరము స్తంభించుట మొదలగు భక్తివికారములు, సర్వకాలములలో నన్ను స్మరించుచుండుట, సర్వదా నన్ను మాత్రమే ఆశ్రయించి జీవించుట (69) అనే ఈ ఎనిమిది లక్షణములు ఎవనియందు ఉండునో, వాడు వ్లుెచ్ఛుడే అయిననూ, వాడే గొప్ప బ్రాహ్మణుడు, ముని, శోభ గలవాడు, యతి మరియు పండితుడు (70). నాలుగు వేదములను చదివిన పండితుడు నాకు ప్రియుడు కాడు. నా భక్తుడు శునకమాంసభక్షకుడే అయిననూ, వానికే ఈయవలెను; వాని నుండియే గ్రహించ వలెను. వాడు నాతో సమానముగా పూజకు అర్హుడు (71). ఎవడైతే నాకు ఆకుని గాని, పుష్పమును గాని, పండును గాని, నీటిని గాని భక్తితో ఇచ్చునో, వానికి నేను కనబడకుండగా పోను; ఆతడు నా దృష్టిలో లేకుండగా నుండడు (72).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివభక్తిమహిమను వర్ణించే పదవ అధ్యాయము ముగిసినది (10).

Siva Maha Puranam-4    Chapters