Siva Maha Puranam-4    Chapters   

వైవస్వత రాజవంశ వర్ణనము

అథ ఏకోన చత్వారింశోధ్యాయః

వైవస్వత రాజవంశ వర్ణనము

శౌనక ఉవాచ |

సగరస్యాత్మజా వీరాః కథం జాతా మహా బలాః | విక్రాంతాః షష్టి సాహస్రా విధినా కేన వా వద || 1

శౌనకుడిట్లు పలికెను -

సగరుని అరువది వేల పుత్రులు వీరులుగను, మహాబలశాలురుగను, విక్రమశీలురుగను ఎట్లు కాగల్గిరి? ఆ విధానమేది? చెప్పుము (1).

సూత ఉవాచ|

ద్వే పత్న్యో సగరస్యాస్తాం తపసా దగ్ధ కిల్బిషే | ఔర్వస్తయోర్వరం ప్రాదాత్తోషితో మునిసత్తమః || 2

షష్టిపుత్రసహస్రాణి ఏకా వవ్రే తరస్వినామ్‌ | ఏకం వంశకరం త్వేకా యథేష్టం వరశాలినీ || 3

తత్రైవాగత్య తాంల్లబ్ధ్వా పుత్రాన్‌ శూరాన్‌ బహూంస్తదా | సా చైవ సుషువే తుంబం బీజపూర్ణం పృథక్కృతమ్‌ || 4

తే సర్వే హి స్వధా త్రీభిర్వవృధుశ్చ యథాక్రమమ్‌ | ఘృతపూర్ణేషు కుంభేషు కుమారాః ప్రీతివర్ధనాః || 5

కపిలాగ్నిప్రదగ్ధానాం తేషాం తత్ర మహాత్మనామ్‌ | ఏకః పంచజనో నామ పుత్రో రాజా బభూవ హ || 6

తతః పంచజన స్యాసీదంశుమాన్నామ వీర్యవాన్‌ | దిలీపస్తనయుస్తస్య పుత్రో యస్య భగీరథః || 7

యస్తు గంగాం సరిచ్ఛ్రేష్ఠామవాతారయత ప్రభుః | సముద్రమానయచ్చేమాం దుహితృత్వమకల్పయత్‌ || 8

భగీరథ సుతో రాజా శ్రుతసేన ఇతి శ్రుతః | నా భాగస్తు సుతస్తస్య పుత్రః పరమధార్మికః || 9

అంబరీషస్తు నాభాగిస్సింధుద్వీపస్తతో%భవత్‌ | అయుతాజిత్తు దాయాదస్సింధుద్వీపస్య వీర్యవాన్‌ || 10

అయుతాజిత్సుతస్త్వాసీ దృతువర్ణో మహాయశాః | దివ్యాక్ష హృతయజ్ఞో%సౌ రాజా నలసఖో% భవత్‌ || 11

సూతుడిట్లు పలికెను -

సగరునకు ఇద్దరు భార్యలు ఉండిరి. తపస్సుచే నశింపచేయబడిన పాపములు గల వారిద్దరు ఔర్వమహర్షిని సంతోషపెట్టిరి. ఆయన వారికి వరమునిచ్చెను (2). వారిలో ఒకామె వేగవంతులగు అరవై వేలమంది పుత్రులను కోరగా, వరలాభముచే ఉల్లాసముగా నున్న రెండవ ఆమె తన ఇచ్ఛననుసరించి వంశకారకుడగు ఒక పుత్రుని కోరెను (3). ఆ మహర్షి వద్దకు వచ్చి అనేకమంది శూరులగు పుత్రులను వరముగా పొందిన ఆ మొదటి భార్య అనేక బీజములతో నిండియున్న పిండమును కనెను. అది వివిధభాగములుగా విడిపోయెను (4). పెంపుడుగతైలు ఆ భాగములనన్నింటినీ నేతితో నింపబడిన కుండలలో భద్రము చేసిరి. కాలక్రమములో అవి పెరిగి ముద్దులు ఒలికే కుమారులు జన్మించిరి (5). మహాత్ములగు ఆ పుత్రులు అందరు కపిలుని కోపాగ్నిలో భస్మము కాగా, పంచజనుడనే ఏకైకపుత్రుడు రాజు ఆయెను (6). తరువాత పంచజనునకు పరాక్రమశాలియగు అంశుమంతుడనే పుత్రుడు కలిగెను. ఆయన పుత్రుడు దిలీపుడు. దిలీవుని పుత్రుడు భగీరథుడు (7). సర్వసమర్థుడగు భగీరథుడు నదీమతల్లి యగు గంగను దివినుండి భువికి తెచ్చి సముద్రము వరకు గొని పోయి ఆమెను తన కుమార్తెనుగా చేసుకొనెను (8). భగీరథుని కుమారుడు ప్రఖ్యాతి గాంచిన శ్రుతసేన మహారాజు. ఆతని పుత్రుడు పరమధర్మాత్ముడగు నాభాగుడు (9). నాభాగుని పుత్రుడు అంబరీషుడు. అంబరీషుని కొడుకు సింధుద్వీపుడు. సింధుద్వీపునకు పరాక్రమశాలియగు అయుతాజిత్తు అనే కొడుకు గలడు (10). అయుతాజిత్తునకు గొప్ప యశస్వియగు ఋతువర్ణుడనే పుత్రుడు గలడు . ఆ మహారాజు పాచికల జూదముయొక్క రహస్యముల నెరింగిన మహాబుద్ధిశాలి. ఆయన నలునకు మిత్రుడు ఆయెను (11).

ఋతుపర్ణసుతస్త్వాసీ దనుపర్ణో మహాద్యుతిః | తస్య కల్మాషపాదో వై నామ్నా మిత్ర సహస్తథా || 12

కల్మాషపాదస్య సుతస్సర్వకర్మేతి విశ్రుతః | అనరణ్యస్తు పుత్రో%భూద్విశ్రుతస్సర్వకర్మణః || 13

అనరణ్యసుతో రాజా విద్వాన్ముండి ద్రుహో%భవత్‌ | నిషధస్తస్య తనయో రతిః ఖట్వాంగ ఇత్యపి || 14

యేన స్వర్గాదిహాగత్య ముహూర్తం ప్రాప్య జీవితమ్‌ | త్రయో%పి సంచితా లోకా బుద్ధ్యా సత్యేన చానఘ | 15

దీర్గ బాహుస్సుతస్తస్య రఘుస్తస్యాభవత్సుతః | అజస్తస్య తు పుత్రో% భూత్తస్మాద్దశరథో%భవత్‌ || 16

రామె దశరథాజ్జజ్ఞే ధర్మత్మా యో మహాయశాః | సవిష్ణ్వంశో మహాశైవః పౌలస్త్యో యేన ఘాతితః || 17

తచ్చరిత్రం చ బహుధా పురాణషు ప్రవర్ణితమ్‌ | రామాయణ ప్రసిద్ధం హి నాతః ప్రోక్తం తు విస్తరాత్‌ | 18

రామస్య తనయో జజ్ఞే కుశ ఇత్యపి విశ్రుతః | అతిథిస్తు కుశాజ్జజ్ఞే నిషధస్తస్య చాత్మజః || 19

నిషధస్య నలః పుత్రో నభాః పుత్రో నలస్య తు | నభసః పుండరీకశ్చ క్షేమధన్వా తతస్స్మృతః || 20

క్షేమధన్వసుతస్త్వా సీద్దేవానీకః ప్రతాపవాన్‌ | ఆసీదహీనగుర్నామ దేవానీకాత్మజః ప్రభుః || 21

ఋతుపర్ణునకు గొప్ప తేజశ్శాలియగు అనుపర్ణుడు పుత్రుడు. ఆయనకు మిత్రసహుడనే పుత్రుడు గలడు. మిత్ర సహునకు కల్మాషపాదుడనే పేరు కూడ గలదు (12). కల్మాషపాదునకు సర్వకర్ముడని ప్రఖ్యాతి గాంచిన కుమారుడుండెను సర్వకర్మునకు ప్రసిద్ధిని పొందిన అనరణ్యుడనే కుమారుడు ఉండెను. (13). అనరణ్యునకు విద్వాంసుడగు ముండిద్రుహమహారాజు పుత్రుడు. ఆయనకు నిషధుడు, రతి, ఖట్వాంగుడు అనే పుత్రులు గలరు (14). ఓ పుణ్యాత్మా! ఆ ఖట్వాంగుడు స్వర్గములోనుండగా తన ఒక ముహూర్తకాలము మాత్రమే ఆయుర్దాయము ఉన్నదని తెలుసుకొని భూలోకమునకు వచ్చి వివేకియై సత్యజ్ఞానముతో సర్వాత్మభావమును పొందెను (15). ఆయనకు దీర్ఘబాహుడనే కుమారుడు ఉండెను. ఆయన పుత్రుడు రఘువు. రఘువు పుత్రుడు అజుడు. అజుని పుత్రుడు దశరథుడు (16). ధర్మాత్ముడు, గొప్ప కీర్తి గలవాడు అగు రాముడు దశరథుని పుత్రుడు. విష్ణువు యొక్క అంశవలన జన్మించిన, గొప్ప శివభక్తుడగు ఆ రాముడు పులస్త్యుని కుమారుడగు రావణుని సంహరించెను (17). రాముని గాథ పురాణములలో మరియు రామాయణములో విస్తారముగా వర్ణించబడియున్నది. అందువలననే, విస్తారభయముచే ఇక్కడ చెప్పబడుట లేదు (18). రామునకు కుశుడని ప్రఖ్యాతిని గాంచిన పుత్రుడు ఉండెను. కుశుని పుత్రుడు అతిథి. ఆయన పుత్రుడు నిషధుడు (19). నిషధుని పుత్రుడు నలుడు. నలుని పుత్రుడు నభసుడు. నభసుని పుత్రుడు వుండరీకుడు. వుండరీకుని పుత్రుడు క్షేమధన్వుడు (20). క్షేమధన్వునకు ప్రతాపశాలియగు దేవానీకుడనే పుత్రుడు ఉండెను. దేవానీకుని పుత్రుడు అహీనగు మహారాజు (21).

అహీన గోస్తు దాయాదస్సహస్వాన్నామ వీర్యవాన్‌ | వీరసేనాత్మజస్తస్య యశ్చేక్ష్వాకు కులోద్భవః || 22

వీరసేనస్య దాయాదః పారియాత్రో బభూవ హ | తతో బలాఖ్యస్తనయ స్థ్సల స్తస్మాదభూత్సుతః || 23

అర్కాంశ సంభవస్తస్మాత్పుత్రో యక్షః ప్రతాపవాన్‌ | తత్సుతస్త్వగుణస్త్వాసీత్తస్మాద్విధృతిరాత్మజః || 24

హిరణ్యనాభస్తత్పుత్రో యోగాచార్యో బభూవ హ | స శిష్యో జైమిని మునే ర్హ్యాత్మ విద్యా విశారదః || 25

కౌశల్యో యాజ్ఞవల్క్యోథ యోగమధ్యాత్మసంజ్ఞకమ్‌ | యతో%ధ్యగాన్నృప వరాద్ధృదయగ్రంథి భేదనమ్‌ || 26

తత్సుతో పుష్పనామా హి ధ్రువసంజ్ఞస్తదాత్మజః | అగ్నివర్ణస్సుతస్తస్య శీఘ్రనామా సుతస్తతః || 27

మరున్నామా సుతస్తస్య యోగసిద్ధో బభూవ హ | అసావాస్తే% ద్యాపి ప్రభుః కలాపగ్రామ సంజ్ఞకే || 28

తద్వాసిభిశ్చ మునిభిః కలేరంతే స ఏవ హి | పునర్భావయితా నష్టం సూర్యవంశం విశేషతః || 29

పృథుశ్రుతశ్చ తత్పుత్ర స్సంధిస్తస్య సుతస్స్మృతః | అమర్షణస్సుతస్తస్య మరుత్వాం స్తత్సుతో%భవత్‌ || 30

విశ్వసాహ్వస్సుతస్తస్య తత్సుతో%భూత్ర్ప సేనజిత్‌ | తక్షకస్తస్య తనయస్తత్సుతో హి బృహద్వలః || 31

ఏత ఇక్ష్వాకు వంశీయా అతీతాస్సంప్రకీర్తితాః | శృణుతానాగతాన్‌ భూపాంస్తద్వంశ్యాన్‌ ధర్మవిత్తమాన్‌ || 32

పరాక్రమవంతుడగు సహస్వంతుడు అహీనగుని పుత్రుడు. ఇక్ష్వాకు వంశములో ప్రముఖుడగు వీరసేనుడు ఆతని పుత్రుడు (22). వీరసేనుని పుత్రుడు పారియాత్రుడు. ఆయన పుత్రుడు బలుడు. ఆయన పుత్రుడు స్థలుడు (23). ఆయనకు సూర్యుని అంశవలన ప్రతాపశాలియగు యక్షుడనే పుత్రుడు కలిగెను. ఆయన కొడుకు అగుణుడు. ఆయన పుత్రుడు విధృతి (24). ఆయన పుత్రుడగు హిరణ్యనాభుడు యోగవిద్యలో ఆచార్యుడు. ఆత్మవిద్యలో నిష్ణాతుడగు ఆయన జైమిని మహర్షియొక్క శిష్యుడు (25). కౌశల్య యాజ్ఞవల్క్యుడు బుద్ధియందలి అవిద్యాగ్రంథిని తొలగించే అధ్యాత్మయోగమును ఆ మహారాజు వద్ద అధ్యయనము చేసెను (26). ఆయన పుత్రుడు పుష్పుడు. ఆయన కొడుకు ధ్రువుడు. ఆయన కొడుకు అగ్నివర్ణుడు. ఆయన కొడుకు శీఘ్రుడు (27). ఆయన కుమారుడగు మరుత్తు యోగములో సిద్ధిని పొందెను. ఈ మహారాజు ఈ నాటికీ కలాపమనే పేరు గల గ్రామములో జీవించియున్నాడు. (28). కలియుగము అంతమైన తరువాత ఆయన వినష్టమైన సూర్యవంశమును అచట నివసించే ఋషులతో గూడి నిలబెట్టి ఖ్యాతిని పొందగలడు (29). ఆయన కొడుకు వృథుశ్రుతుడు. ఆయన కొడుకు సంధి. ఆయన కొడుకు అమర్షణుడు. ఆయన కొడుకు మరుత్వంతుడు (30). ఆయన కొడుకు విశ్వసాహ్వుడు. ఆయన కొడుకు ప్రసేనజిత్తు. ఆయన కొడుకు తక్షకుడు. ఆయన కొడుకు బృహద్వలుడు (310. ఇక్ష్వాకు వంశములో గతించిన ఈ రాజులను గురించి చెప్పడమైనది. భవిష్యత్తులో రాబోయే, ధర్మవేత్తలలో శ్రేష్ఠులగు ఇక్ష్వాకు వంశపు రాజులను గురించి వినుడు (32).

బృహద్వలస్య తనయో భవితా హి బృహద్రణః | బృహద్రణ సుతస్త స్యోరు క్రియో హి భవిష్యతి || 33

వత్సవృద్ధస్సుతస్తస్య ప్రతివ్యోమస్సుతస్తతః | భానుస్తత్తనయో భావీ దివార్కో వాహినీపతిః || 34

సహదేవస్సుతస్తస్య మహావీరో భవిష్యతి | తత్సుతో బృహదశ్వో హి భానుమాంస్తత్సుతో బలీ || 35

సుతో భానుమతో భావీ ప్రతీకాశ్వశ్చ వీర్యవాన్‌ | సుప్రతీకస్సుతస్తస్య భవిష్యతి నృపోత్తమః || 36

మరుదేవస్సుతస్తస్య సునక్షత్రో భవిష్యతి |తత్సుతో పుష్కరస్తస్యాంతరిక్షస్తత్సుతో ద్విజాః || 37

సుతపాస్తత్సుతో వీరో మిత్రచిత్త స్తదాత్మజః | బృహద్భాజస్సుతస్తస్య బర్హినామా తదాత్మజః || 38

కృతంజయస్సుతస్తస్య తత్సుతో హి రణంజయః | సంజయస్తు మయస్తస్య తస్య శాక్యో హి చాత్మజః || 39

శుద్ధోదస్తనయస్తస్య లాంగలస్తు తదాత్మజః | తస్య ప్రసేన జిత్పుత్ర స్తత్సుత శ్శూద్రకా హ్వయః || 40

రుణకో భవితా తస్య సురథస్తత్సుతస్స్మృతః | సుమిత్రస్తత్సుతో భావీ వంశనిష్ఠాంత ఏవ హి || 41

సుమిత్రాంతోన్వయో%యం వై ఇక్ష్వాకూణాం భవిష్యతి | రాజ్ఞాం వై చిత్ర వీర్యాణాం ధర్మిష్ఠానాం సుకర్మణామ్‌ || 42

సుమిత్రం ప్రాప్య రాజానం స తద్వంశశ్శుభః కలౌ | సంస్థాం ప్రాప్స్యతి తద్ర్బాహ్మే వర్ధిష్యతి పునః కృతే || 43

ఏతద్వైవస్వతే వంశే రాజానో భూరిదక్షిణాః | ఇక్ష్వాకువంశ ప్రభవాః ప్రాధాన్యేనప్రకీర్తితాః || 44

పుణ్యయం పరమా సృష్టిరాదిత్యస్య వివస్వతః | శ్రాద్ధదేవస్య దేవస్య ప్రజానాం పుష్టిదస్య చ || 45

పఠన్‌ శృణ్వన్నిమాం సృష్టిమాదిత్యస్య చ మానవః | ప్రజావానేతి సాయుజ్యమిహ భుక్త్వా సుఖం పరమ్‌ || 46

ఇతి శ్రీ శివమహాపురాణ ఉమాసంహితాయాం వైవస్వత వంశోద్భవరాజవర్ణనం నామ ఏకోన చత్వారింశో%ధ్యాయః (39).

బృహద్వలునకు బృహద్రణుడు, ఆయనకు ఉరుక్రియుడు (33), ఆయనకు వత్సవృద్ధుడు,ఆయనకు ప్రతివ్యోముడు, ఆయనకు భానుడు, ఆయనకు దివార్కుడనే సేనాపతి (34), ఆయనకు సహదేవుడనే మహావీరుడు, ఆయనకు బృహదశ్వుడు, ఆయనకు బలశాలియగు భానుమంతుడు (35), ఆయనకు పరాక్రమశాలియగు ప్రతీకాశ్వుడు, ఆయనకు రాజశ్రేష్ఠుడగు సుప్రతీకుడు అను పుత్రులు కలిగెదరు (36). సుప్రతీకునకు మంచి నక్షత్రములో మరుదేవుడనే పుత్రుడు కలుగును. ఓ బ్రాహ్మణులారా ! ఆయనకు పుష్కరుడు, పుష్కరునకు అంతరిక్షుడు (37), ఆయనకు సుతపసుడు, ఆయనకు వీరుడగు మిత్రచిత్తుడు, ఆయనకు బృహద్భాజుడు, ఆయనకు బర్హి (38), ఆయనకు కృతంజయుడు, ఆయనకు రణంజయుడు, ఆయనకు సంజయుడు, ఆయనకు మయుడు, ఆయనకు శాక్యుడు (39), ఆయనకు శుద్ధోదనుడు, ఆయనకు లాంగలుడు, ఆయనకు ప్రసేనజిత్తు, ఆయనకు శూద్రకుడు (40), ఆయనకు రుణకుడు, ఆయనకు సురథుడు, ఆయనకు సుమిత్రుడు అనే పుత్రులు కలిగెదరు. సుమిత్రునితో ఆ వంశము అంతమగును (41). అనేకరకముల పరాక్రమముగలవారు, ధర్మాత్ములు, మంచి పనులను చేయువారు అగు ఇక్ష్వాకు వంశపు రాజుల వంశము సుమిత్రునితో అంతమగును (42). శుభకరమగు ఆ వంశము కలియుగములో సుమిత్ర మహారాజు వరకు కొనసాగి,తరువాత పరమేశ్వరరూపమగు సమాజములో విలీనమగును. అది మరల కృతయుగములో వర్ధిల్లగలదు (43). ఈ విధముగా సూర్యుడు కులదైవముగా గల ఇక్ష్వాకు వంశములో పుట్టి గొప్ప దక్షిణలతో కూడిన యజ్ఞములను చేసిన ప్రముఖులగు రాజుల చరిత్ర వర్ణించబడినది (44). అదితి పుత్రుడు, శ్రాద్ధదేవుడని కీర్తించబడినవాడు, ప్రకాశస్వరూపుడు, ప్రాణులకు పుష్టిని ఇచ్చువాడు అగు వివస్వానుని ఈ శ్రేష్ఠమగు వంశము పవిత్రమైనది (45). ఆ ఆదిత్య వంశమును గురించి పఠించే మరియు శ్రవణము చేసే మానవుడు ఇహలోకములో సంతానమును పొంది మహా సుఖముననుభవించి ఆదిత్యుని సాయుజ్యమును పొందును (46).

శ్రీశివమహాపురాణములోని ఉమాసంహితయందు వైవస్వత వంశోద్భవరాజవర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39)

Siva Maha Puranam-4    Chapters