Siva Maha Puranam-4
Chapters
అథ ఏకాదశో
శివజ్ఞానము యొక్క మహిమ
ఈశ్వర ఉవాచ |
అథ వక్ష్యామి దేవేశి భక్తానామధికారిణామ్ | విదుషాం ద్విజముఖ్యానాం వర్ణధర్మం సమాసతః || 1
త్రిస్న్నానం చాగ్నికార్యం చ లింగార్చనమనుక్రమమ్ | దానమీశ్వరభావశ్చ దయా సర్వత్ర సర్వదా || 2
సత్యం సంతోషమాస్తిక్యమహింసా సర్వజంతుషు | హ్రీః శ్రద్ధాధ్యయనం యోగస్సదాధ్యాపనమేవ చ || 3
వ్యాఖ్యానం బ్రహ్మచర్యం చ శ్రవణం చ తపః క్షమా | శౌచం శిఖోపవీతం చ ఉష్ణీషం చోత్తరీయకమ్ || 4
నిషిద్ధాసేవనం చైవ భస్మరుద్రాక్షధారణమ్ | పర్వణ్యభ్యర్చనం దేవి చతుర్దశ్యాం విశేషతః || 5
పానం చ బ్రహ్మకూర్చస్య మాసి మాసి యథావిధి | అభ్యర్చనం విశేషేణ తేనైవ స్నాప్య మాం ప్రియే || 6
సర్వక్రియాన్నసంత్యాగః శ్రాద్ధాన్నస్య చ వర్జనమ్ | తథా పర్యుషితాన్నస్య యావకస్య విశేషతః || 7
మద్యస్య మద్యగంధస్య నైవేద్యస్య చ వర్జనమ్ | సామాన్యం సర్వవర్ణానాం బ్రాహ్మణానాం విశేషతః || 8
క్షమా శాంతిశ్చ సంతోషస్సత్యమస్తేయమేవ చ | బ్రహ్మచర్యం మమ జ్ఞానం వైరాగ్యం భస్మసేవనమ్ || 9
సర్వసంగనివృత్తిశ్చ దశైతాని విశేషతః | లింగాని యోగినాం భూయో దివా భిక్షాశనం తథా || 10
ఈశ్వరుడిట్లు పలికెను -
ఓ దేవదేవీ! భక్తులు, అధికారులు, విద్వాంసులు అగు బ్రాహ్మణ శ్రేష్ఠులు పాటించదగిన వర్ణధర్మమును గురించి సంగ్రహముగా చెప్పెదను (1). మూడు సార్లు స్నానము, అగ్నికార్యము, తరువాత లింగార్చనము , దానము, ఈశ్వరునియందు భక్తి, సర్వకాలములలో సర్వప్రాణులయందు దయ(2), సత్యము, సంతోషము, ఆస్తికుడైయుండుట, సర్వప్రాణులయెడ దయ, వినయము, శ్రద్ధ, అధ్యయనము, యోగము, సర్వకాలములలో ఇతరులకు జ్ఞానమును బోధించుట (3), ధార్మికమగు ప్రవచనములను చేయుట, బ్రహ్మచర్యము, వేదాంతమును శ్రవణము చేయుట, తపస్సు, క్షమ, శౌచము, పిలకను యజ్ఞోపవీతమును తలపాగాను మరియు ఉత్తరీయమును ధరించుట (4), నిషేధించబడిన విషయములను సేవించకుండుట, భస్మను రుద్రుక్షలను ధరించుట అను ధర్మములను వారు పాటించవలెను. ఓదేవీ! వారు పర్వదినములయందు, విశేషించి చతుర్దశినాడు, ఈశ్వరుని పూజించవలెను (5). ఓ ప్రియురాలా! ప్రతి మాసమునందువారు యథావిధిగా పంచగవ్యమును హోమము చేసి దానిని పానము చేయవలెను. దానితోడనే నన్ను అభిషేకించి విశేషముగా పూజించవలెను (6). సకలకర్మలలో భాగముగా ఈయబడే అన్నమును, శ్రాద్ధమునాడు ఈయబడే అన్నమును, నిలవ ఉన్న అన్నమును, గంజిని వారు స్వీకరించ రాదు (7). మద్యమును, మద్యగంధము గల నైవేద్యమును కూడ విడిచిపెట్టుట సర్వవర్ణముల వారికి వర్తించే నియమము. ఇది బ్రాహ్మణులకు విశేషముగా వర్తించును (8). క్షమ, మనోనిగ్రహము, సంతోషము, సత్యము, పరధనముపై మనస్సులోనైననూ ఆశ పడకుండుట, బ్రహ్మచర్యము, శివజ్ఞానము, వైరాగ్యము, భస్మను ధరించుట (9), సర్వవిధముల ఆసక్తినుండి నివృత్తి అనే ఈ పది యోగుల విశేషలక్షణములు. ఇంతేగాక, వారు పగలు మాత్రమే భిక్షాన్నమును భుజించవలెను (10).
వానప్రస్థాశ్రమస్థానాం సమానమిదమిష్యతే | రాత్రౌ న భోజనం కార్యం సర్వేషాం బ్రహ్మచారిణామ్ || 11
అధ్యాపనం యాజనం చ క్షత్రియస్య ప్రతిగ్రహః | వైశ్యస్య చ విశేషణ మయా నాత్ర విధీయతే || 12
రక్షణం సర్వవర్ణానాం యుద్ధే శత్రువధస్తథా | దుష్టపక్షిమృగాణాం చ దుష్టానాం శాతనం నృణామ్ || 13
అవిశ్వాసశ్చ సర్వత్ర విశ్వాసో మమ యోగిషు | స్త్రీ సంసర్గశ్చ కాలేషు చమూరక్షణమేవ చ || 14
సదా సంచారితైశ్చారైర్లోకవృత్తాంతవేదనమ్ | సదాస్త్రధారణం చైవ భస్మకంచుకదారణమ్ || 15
రాజ్ఞాం మమాశ్రమస్థానామేష ధర్మస్య సంగ్రహః | గోరక్షణం చ వాణిజ్యం కృషిర్వైశ్యస్య కథ్యతే || 16
శుశ్రూషేతరవర్ణానాం ధర్మశ్శూద్రస్య కథ్యతే |ఉద్యానకరణం చైవ మమ క్షేత్రసమాశ్రయః || 17
ధర్మపత్న్యాస్తు గమనం గృహస్థస్య విధీయతే | బ్రహ్మచర్యం వనస్థానాం యతీనాం బ్రహ్మచారిణామ్ || 18
స్త్రీణాం తు భర్తృశుశ్రూషా ధర్మో నాన్యస్సనాతనః | మమార్చనం చ కల్యాణి నియోగో భర్తురస్తి చేత్ || 19
యా నారీ భర్తృశుశ్రూషాం విహాయ వ్రతతత్పరా | సా నారీ నరకం యాతి నాత్ర కార్యా విచారణా || 20
ఈ ధర్మము వానప్రస్థాశ్రమములోని వారికి కూడ సమానముగా వర్తించును. . బ్రహ్మచారులతో సహా వీరందరు రాత్రియందు భుజించరాదు (11).శాస్త్రములను బోధించుట, యజ్ఞములను చేయించుట మరియు దానమును స్వీకరించుట అను వాటిని నేను ఈ సందర్భములో క్షత్రియులకు, విశేషించి వైశ్యులకు విధించుట లేదు (12). సర్వవర్ణముల వారిని రక్షించుట, యుద్ధములో శత్రువులను వధించుట, దుష్టమగు పక్షులను మృగములను సంహరించుట, దుష్టులగు మానవులను దండించుట (13), అందరినీ విశ్వసించ కుండుట, శివయోగులయందు విశ్వాసమును కలిగియుండుట, యోగ్యమగు కాలములలో స్త్రీతోడి సంగమము, సైన్యమును రక్షించుట (14), సర్వకాలములలో సంచరిస్తూ ఉండే చారుల ద్వారా లోకములోని వృత్తాంతములను తెలుసుకొను చుండుట, సర్వదా ఆయుధములను, భస్మను, కవచమును ధరించుట (15) అనునవి నా భక్తిని చేసే రాజులు పాటించ వలసిన ధర్మముల సంగ్రహస్వరూపము. గోవులను పాలించుట, క్రయవిక్రయములను చేయుట, పంటలను పండించుట అనునవి వైశ్యుల ధర్మములని చెప్పబడినవి (16). ఇతరవర్ణముల వారికి శుశ్రూషను చేయుట, ఉద్యానవనములను పెంచుట, శివక్షేత్రములను ఆశ్రయించుకొని ఉండుట అనునవి శూద్రుల ధర్మములని చెప్పబడినది (17). ధర్మపత్నితో సంయోగము గృహస్థునకు విధించబడినది. బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, యతులకు బ్రహ్మచర్యము విధించ బడినది (18). స్త్రీలకు భర్తృశుశ్రూష తప్ప మరియొక కర్తవ్యము లేదు. ఇది సనాతనమగు ధర్మము. ఓ కల్యాణీ! భర్త అనుమతించినచో, వారు నన్ను పూజించ వచ్చును (19). ఏ స్త్రీ భర్తయొక్క శుశ్రూషను విడిచి పెట్టి , వ్రతములయందు తత్పురురాలగునో, ఆ స్త్రీ నరకమును పొందుననుటలో సందేహము లేదు (20).
అథ భర్తృవిహీనాయా వక్ష్యే ధర్మం సనాతనమ్ | వ్రతం దానం తపశ్శౌచం భూశయ్యా నక్తభోజనమ్ || 21
బ్రహ్మచర్యం సదా స్నానం భస్మనా సలిలేన వా | శాంతిర్మౌనం క్షమా నిత్యం సంవిభాగో యథావిధి || 22
అష్టమ్యాం చ చతుర్దశ్యాం పౌర్ణమాస్యాం విశేషతః | ఏకాదశ్యాం చ విధివదుపవాసో మమార్చనమ్ || 23
ఇతి సంక్షేపతః ప్రోక్తో మయాశ్రమనిషేవిణామ్ | బ్రహ్మక్షత్రవిశాం దేవి యతీనాం బ్రహ్మచారిణామ్ || 24
తథైవ వానప్రస్థానాం గృహస్థానాం చ సుందరి | శూద్రాణామథ నారీణాం ధర్మ ఏష సనాతనః || 25
ధ్యేయస్త్వయాహం దేవేశి సదా జప్యః షడక్షరః | వేదోక్తమఖిలం ధర్మమితి ధర్మార్థసంగ్రహః || 26
అథ యే మానవా లోకే స్వేచ్ఛయా ధృతవిగ్రహాః | భావాతిశయసంపన్నాః పూర్వసంస్కారసంయుతాః || 27
విరక్తా వానురక్తా వాస్త్ర్యా స్త్యాదీనాం విషయేష్వపి | పాపైర్నతే విలింపంతే పద్మపత్రమివాంభసా|| 28
తేషాం మమాత్మవిజ్ఞానం విశుద్ధానాం వివేకినామ్ | మత్ర్పసాదాద్విశుద్ధానాం దుఃఖమాశ్రమరక్షణాత్ || 29
నాస్తి కృత్యమకృత్యం చ సమాధిర్వా పరాయణమ్ | న విధిర్ననిషేధశ్చ తేషాం మమ యథా తథా || 30
ఇపుడు భర్త లేని స్త్రీ పాటించదగిన సనాతనమగు ధర్మమును గురించి చెప్పెదను. వ్రతము, దానము, తపస్సు శౌచము, నేలపై పరుండుట, రాత్రియందు మాత్రమే భుజించుట (21), సర్వకాలములలో బ్రహ్మచర్యము, భస్మతో గాని నీటితో గాని స్నానమును చేయుట, మనోనిగ్రహము, మౌనము, నిత్యము సహనమును కలిగియుండుట, యథావిధిగా దానమును చేయుట (22), అష్టమి, చతుర్దశి, పూర్ణిమలయందు, విశేషించి ఏకాదశినాడు ఉపవాసమును చేసి నన్ను పూజించుట అనునవి ఆమె ధర్మములు (23). ఓ దేవీ! నేను ఈ విధముగా వివిధములగు ఆశ్రమములలోనుండువారు, బ్రాహ్మణక్షత్రియ వైశ్యులు, యతులు, బ్రహ్మచారులు పాటించ వలసిన ధర్మములను సంగ్రహముగా చెప్పితిని (24). ఓ సుందరీ! నీవు నన్ను ధ్యానము చేయుము. సర్వకాలములలో ఆరు అక్షరముల మంత్రమును జపించవలెను. వేదములో చెప్పబడిన సకలధర్మముల సారము ఇదియే. ఇదియే ధర్మార్థముల సంగ్రహస్వరూపము (26). ఈ లోకములో తమ ఇచ్ఛచే నా విగ్రహము (లింగము) ను ధరించినవారు, గొప్ప భక్తితో, నిండినవారు, పూర్వజన్మసంస్కారము గలవారు అగు మానవులు ఎవరైతే గలరో (27), వారు స్త్రీ మొదలైన విషయములలో వైరాగ్యము గలవారైనా రాగము గలవారైనా, తామరాకును నీరు వలె, వారిని పాపములు స్పృశించవు (28). పరిశుద్ధమైన జీవనము మరియు వివేకము గల అట్టి మానవులకు నా అనుగ్రహముచే అంతఃకరణము శుద్ధమై నా స్వరూపమైన ఆత్మజ్ఞానము కలుగును. ఆశ్రమధర్మమును రక్షించినవారగుటచే వారికి దుఃఖము గాని, కర్తవ్యము గాని, చేయరానిది గాని, సమాధి గాని, ప్రయత్నించి పొందదగిన గొప్ప లక్ష్యము గాని ఉండవు. నాకు ఎల్లాగైతే విధినిషేధములు లేవో, వారికి కూడ అటులనే అవి ఉండవు (29, 30).
తథేహ పరిపూర్ణస్య సాధ్యం మమ న విద్యతే | తథైవ కృతకృత్యానాం తేషామపి న సంశయః || 31
మద్భక్తానాం హితార్థాయ మానుషం భవమాశ్రితాః | రుద్రలోకాత్పరిభ్రష్టాస్తే రుద్రా నాత్ర సంశయః || 32
మమానుశాసనం మద్వద్ర్బహ్మాదీనాం ప్రవర్తకమ్ | తథా నరాణామన్యేషాం తన్నియోగః ప్రవర్తకః || 33
మమాజ్ఞాధారభావేన సద్భావాతిశ##యేన చ | తదాలోకనమాత్రేణ సర్వపాపక్షయో భ##వేత్ || 34
ప్రత్యయాశ్చ ప్రవర్తంతే ప్రశస్తఫలసూచకాః | మయి భావవతాంపుంసాం ప్రాగదృష్టార్థగోచరాః || 35
కంపస్స్వేదో%శ్రుపాతశ్చ కంఠే చ స్వరవిక్రియా | ఆనందాద్యుపలబ్ధిశ్చ భ##వేదాకస్మికీ ముహుః || 36
స తైర్వ్యసై#్తస్సమసై#్తర్వా లింగైరవ్యభిచారిభిః | మందమధ్యోత్తమైర్భావైర్విజ్ఞేయాస్తే నరోత్తమాః || 37
యథాయోగ్నిసమావేశాన్నాయో దహతి కేవలమ్ | తథైవ మమ సాన్నిధ్యాన్న తే కేవలమానుషాః || 38
హస్తపాదాదిసాధర్మ్యాద్రుద్రాన్మర్త్యవపుర్ధరాన్ | ప్రాకృతానివ మన్వానో నావజానీత పండితః || 39
అవజ్ఞానం కృతం తేషు నరైర్వ్యామూఢచేతనైః | ఆయుః శ్రియం కులం శీలం హిత్వా నిరయామావహేత్ || 40
బ్రహ్మవిష్ణుమహేశానామపి తూలాయతే పదమ్ | మత్తోన్యదనపేక్షాణాముద్ధృతానాం మహాత్మనామ్ || 41
అశుద్ధం బౌద్ధమైశ్వర్యం ప్రాకృతం పౌరుషం తథా | గుణశానామతస్త్యాజ్యం గుణాతీతపదైషిణామ్ || 42
అథ కిం బహునోక్తేన శ్రేయః ప్రాప్త్యేకసాధనమ్ | మయి చిత్తసమాసంగో యేన కేనాపి హేతునా || 43
పరిపూర్ణుడనగు నాకు ఈ లోకములో సంపాదించ దగినది ఏదీ లేదు. అదే విధముగా, కృతార్థలైన ఆ మానవులకు కూడ పొందదగిన లక్ష్యములు లేవు. ఈ విషయములో సందేహము లేదు (31). నా భక్తుల హితము కొరకై రుద్రలోకమునుండి దిగి వచ్చి మనుష్య దేహమును ధరించి యున్న అట్టి వ్యక్తులు కూడ రుద్రులే ననుటలో సందేహము లేదు (32). నా ఆజ్ఞను ఏ విధముగా బ్రహ్మ మొదలగు వారు పాటించెదరో, అదే విధముగా వారి ఆజ్ఞను ఇతరులగు మానవులు పాటించవలెను (33). నా శాసనమునకు వారు ఆ ధారమై ఉండుటచే, మరియు వారియందు సద్-జ్ఞానము అతిశయించి ఉండుటచే, వారిని చూచినంత మాత్రాన పాపములన్నియు నశించును (34). నాయందు భక్తి గల జనులకు ఇది వరలో కనబడనివి, ప్రశస్తమగు ఫలమును సూచించునవి అగు చిహ్నములు కానవచ్చును (34). వఱుకు, చెమట పట్టుట, కన్ను వెంబడి నీరు కారుట, కంఠస్వరములో వికారము, ఆనందానుభూతి మొదలగునవి పలుమార్లు ఆకస్మికముగా కలుగును (36). ఈ చిహ్నములు కొన్ని గాని, అన్నీ గాని, మందము, మధ్యమము మరియు ఉత్తమము అను స్థాయిలలో తప్పని సరిగా వారియందు కనబడును. వీటిని బట్టి వారు మానవులలో శ్రేష్ఠులని తెలియవలెను (37). నిప్పులో కాలిన ఇనుము దహించును. కాని దహించేది నిప్పుయే గాని కేవలము ఇనుము మాత్రమే కాదు గదా! అదే విధముగా, వారు నా సన్నిధి ఉండుటచే, కేవలము మనుష్యమాత్రులు కారు (38). వారు మనుష్యరూపములో నుండే రుద్రులు. చేతులు, కాళ్లు మొదలగునవి వారికి ఇతరులకు వలెనే ఉన్నవి అనే పోలికను బట్టి పండితుడు వారిని సామాన్యమానవులని భావించి అవమానించ రాదు (39). మానవులు మోహమును పొందియున్న బుద్ధిగలవారై అట్టివారిని అవమానించినచో, ఆయుర్దాయమును, సంపదను, కులమును, శీలమును పోగొట్టుకొని నరకమును పొందెదరు (40). నన్ను తప్ప మరియొకదానిని ఆపేక్షించని వారు, సామాన్యులకంటె ఉన్నతమగు స్థానమునందుండు వారు అగు అట్టి మహాత్ముల దృష్టిలో బ్రహ్మవిష్ణుమహేశ్వరపదవులు కూడ గడ్డిపోచతో సమానము (41). సత్త్వరజస్తమోగుణములకు వశులై యుండే ప్రభువుల జ్ఞానము మరియు ఈశ్వరభావము దోషముతో కూడినది; వారి పౌరుషము సర్వసాధారణమైనది. కావున, గుణాతీతులగు మహాత్ములు వారిని పరిత్యజించెదరు (42). ఇన్ని మాటలేల? ఏదో ఒక ఉపాయముచే మనస్సును నాయందు లగ్నము చేయుట మాత్రమే శ్రేయస్సును పొందుటకు ఏకైకమార్గము (43).
ఉపమన్యురువాచ |
ఇత్థం శ్రీకంఠనాథేన శివేన పరమాత్మనా | హితాయ జగతాముక్తో జ్ఞానసారార్థసంగ్రహః || 44
విజ్ఞానసంగ్రహస్యాస్య వేదశాస్త్రాణి కృత్స్నశః | సేతిహాసపురాణాని విద్యా వ్యాఖ్యానవిస్తరః || 45
జ్ఞానం జ్ఞేయమనుష్ఠేయమధికారో% థ సాధనమ్ | సాధ్యం చేతి షడర్థానాం సంగ్రహస్త్వేష సంగ్రహః|| 46
గురోరధికృతం జ్ఞానం జ్ఞేయం పాశః పశుః పతిః | లింగార్చనాద్యనుష్ఠేయం భక్తస్త్వధికృతో%పి యః || 47
సాధనం శివమంత్రాద్యం సాధ్యం శివసమానతా | షడర్థసంగ్రహస్యాస్య జ్ఞానాత్సర్వజ్ఞతోచ్యతే || 48
ప్రథమం కర్మ యజ్ఞాదేర్భక్త్యా విత్తానుసారతః | బాహ్యేభ్యర్చ్య శివం పశ్చాదంతర్యాగరతో భ##వేత్ || 49
రతిరభ్యంతరే యస్య న బాహ్యే పుణ్యగౌరవాత్ | న కర్మ కరణీయం హి బహిస్తస్య మహాత్మనః || 50
జ్ఞానామృతేన తృప్తస్య భక్త్యా శైవశివాత్మనః | నాంతర్న చ బహిః కృష్ణ కృత్యమస్తి కదాచన || 51
తస్మాత్ర్కమేణ సంత్యజ్య బాహ్యమాభ్యంతరం తథా | జ్ఞానేన జ్ఞేయమాలోక్య జ్ఞానం చాపి పరిత్యజేత్ || 52
నైకాగ్రం చేచ్ఛివే చిత్తం కిం కృతేనాపి కర్మణా | ఏకాగ్రమేవ చేచ్చిత్తం కిం కృతేనాపి కర్మణా || 53
తస్మాత్కర్మాణ్యకృత్వా వా కృత్వా వాంతర్బహిః క్రమాత్ | యేన కేనాప్యుపాయేన శివే చిత్తం నివేశ##యేత్ || 54
శివే నివిష్టచిత్తానాం ప్రతిష్ఠితధియాం సతామ్ | పరత్రేహ చ సర్వత్ర నిర్వృతిః పరమా భ##వేత్ || 55
ఇహోన్నమశ్శివాయేతి మంత్రేణానేన సిద్ధయః | స తస్మాదధిగంతవ్యః పరాపరవిభూతయే || 56
ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివజ్ఞానవర్ణనం నామ ఏకాదశో%ధ్యాయః (11).
ఉపమన్యుడు ఇట్లు పలికెను.
ఈ విధముగా కంఠమునందు విషమును ధరించే, పరమాత్మయగు శివప్రభుడు లోకముల హితము కొరకై జ్ఞానసారమును సంగ్రహించి ఆ తత్త్వమును చెప్పినాడు (44). సకలములగు వేదములు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, విద్యలు ఈ జ్ఞానసారము యొక్క విస్తారమగు వ్యాఖ్యానములు మాత్రమే (45). ఈ సంగ్రహసారమునందు జ్ఞానము, జ్ఞేయము, అనుష్ఠేయము, అధికారము, సాధనము మరియు సాధ్యము అనే ఆరు అంశములు సంక్షిప్తముగా సంగ్రహించబడినవి (46). గురువునుండి పొందబడేది జ్ఞానము అగును. బంధము, జీవుడు, శివుడు అను వాటి తత్త్వము జ్ఞేయము. లింగార్చనము మొదలైనవి అనుష్ఠేయము. భక్తుడు అధికారి (47). శివమంత్రము మొదలగునవి సాధనము. శివునితో సమానమగు స్థితి సాధ్యము. ఈ ఆరు అంశముల సంగ్రహస్వరూపమును తెలిసిన వాడు సర్వజ్ఞుడనబడును (48). ముందుగా ధనబలమును బట్టి బాహ్యమునందు శివుని భక్తితో యజ్ఞము మొదలగు కర్మల ద్వారా పూజించి, తరువాత సాధకుడు అంతర్యాగము నందు ప్రీతి గలవాడు కావలెను (49). అధికమగు పుణ్యముయొక్క ప్రభావముచే ఎవనికి బాహ్యకర్మయందు ప్రీతి లేదో, అట్టి మహత్ముడు బాహ్యకర్మను చేయనక్కర లేదు (50). ఓ శ్రీకృష్ణా! పార్వతీ పరమేశ్వరుల యందలి భక్తిచే శివభక్తులతో మరియు శివునితో ఐక్యమును పొంది జ్ఞానమనే అమృతముతో తృప్తిని చెందిన వ్యక్తి ఎప్పుడైననూ బాహ్యకర్మను గాని, అంతకర్మను గాని చేయనక్కర లేదు (51). మనస్సు శివునిపై ఏకాగ్రము కానిచో, కర్మను చేసి ప్రయోజనమేమున్నది? మనస్సు శివునియందు ఏకాగ్రమైన పక్షములో కర్మతో పని యేమి? (53) కావున, బాహ్యకర్మలను, ఆంతరకర్మలను క్రమముగా చేసి గాని, చేయకుండగా గాని, ఏదో ఒక ఉపాయముచే మనస్సును శివుని యందు ఏకాగ్రము చేయవలెను (54). శివునియందు లగ్నమైన మనస్సు కలిగి స్థిరమైన బుద్ధి గల సత్పురుషులకు ఇహపరలోకములలో సర్వకాలములలో పరమానందము లభించును (55). ఓం నమశ్శివాయ అను మంత్రముచే ఇహలోకములో సిద్ధులు లభించును. కావున, మోక్షము కొరకు మాత్రమే గాక, ఇహపరలోకములలోని మహిమలను పొందుట కొరకు కూడా ఈ మంత్రమును చేపట్టవలెను (56).
శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివజ్ఞానముయొక్క మహిమను వర్ణించే పదకొండవ అధ్యాయము ముగిసినది (11).