Siva Maha Puranam-4
Chapters
అథ పంచదశోధ్యయః గురు మహిమ - గురు శుశ్రూష శ్రీకృష్ణ ఉవాచ | భగవన్మంత్రమాహాత్మ్యం భవతా కథితం ప్రభో | తత్ర్పయోగవిధానం చ సాక్షాచ్ర్ఛుతిసమం యథా ||
1 ఇదానీం శ్రోతుమిచ్ఛామి శివసంస్కారముత్తమమ్ | మంత్రసంగ్రహణ కించిత్సూచితం న తు విస్మృతమ్ ||
2 శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను - ఓ పూజ్యా! పంచాక్షరమంత్రమాహాత్మ్యమును, సాక్షాత్తుగా వేదముతో సమానమైన దాని ప్రయోగవిధానమును నీవు చెప్పియుంటివి (1). ఇప్పుడు నేను ఉత్తమమగు శివసంస్కారమును వినగోరుచున్నాను. దానిని గురించి నీవు మంత్రమును గ్రహించే ప్రకరణములో కొద్దిగా సూచించితివి. దానిని నేను మరువలేదు (2). ఉపమన్యురువాచ | హంత తే కథయిష్యామి సర్వపాపవిశోధనమ్ | సంస్కారం పరమం పుణ్యం శివేన పరిభాషితమ్ ||
3 సమ్యక్ కృతాధికారస్స్యాత్పూజాదిషు నరో యతః | సంస్కారః కథ్యతే తేన షడధ్వపరిశోధనమ్ ||
4 దీయత్ యేన విజ్ఞానం క్షీయతే పాశబంధనమ్ | తస్మాత్సంస్కార ఏవాయం దీక్షేత్యపి చ కథ్యతే ||
5 శాంభవీ చైవ శాక్తీ చ మాంత్రీ చైవ శివాగమే | దీక్షోపదిశ్యతే త్రేధా శివేన పరమాత్మనా ||
6 గురోరాలోకమాత్రేణ స్పర్శాత్సంభాషణాదపి | సద్యస్సంజ్ఞా భ##వేజ్జంతోః పాశోపక్షయకారిణీ ||
7 సా దీక్షా శాంభవీ ప్రోక్తా సా పునర్భిద్యతే ద్విధా | తీవ్రా తీవ్రతరా చేతి పాశోపక్షయభేదతః ||
8 యయా స్యాన్నిర్వృతిస్సద్యసై#్సవ తీవ్రతరా మతా | తీవ్రా తు జీవతోత్యంతం పుంసః పాపవిశోధికా ||
9 శాక్తీ జ్ఞానవతీ దీక్షా శిష్యదేహం ప్రవిశ్య తు | గురుణా యోగమార్గేణ క్రియతే జ్ఞానచక్షుషా ||
10 మాంత్రీ క్రియావతీ దీక్షా కుండమండలపూర్వికా | మందమందతరోద్దేశాత్కర్తవ్యా గురుణా బహిః ||
11 శక్తిపాతానుసారేణ శిష్యో%నుగ్రహమర్హతి | శైవధర్మానుసారస్య తన్మూలత్వాత్సమాసతః ||
12 ఉపమన్యుడు ఇట్లు పలికెను - సకలపాపములను విశేషముగా శుద్ధి చేయునది, పరమపవిత్రమైనది, శివునిచే బోధించబడినది అగు సంస్కారమును నీకు తప్పక చెప్పెదను (3). ఆరు మార్గముల శోధనము వలన మానవునకు పూజ మొదలగు వాటియందు చక్కని అధికారము లభించును. కావుననే, దానికి సంస్కారము అను పేరు వచ్చినది (4). దీని వలన మానవునకు విజ్ఞానము లభించి సంసారబంధము నశించును. కావుననే, దీనికి దీక్ష అను పేరు కూడ గలదు (5). శివాగమములో శాంభవి, శాక్తి, మాంత్రి అను మూడు రకముల దీక్షను శివపరమాత్మ బోధించినాడు (6). జీవునకు గురువుయొక్క దర్శనమాత్రముచే, స్పృశించుటచే మరియు సంభాషించుటచే వెంటనే సంసారబంధమును నశింపజేసే సమ్యగ్ జ్ఞానము కలుగును (7). ఆ దీక్షకు శాంభవి అని పేరు. సంసారబంధమును నశింపజేయుటలో గల భేదమును బట్టి ఆ దీక్షయే తీవ్రము మరియు తీవ్రతరము అని రెండు విధములుగా నున్నది (8). దేనిచే వెనువెంటనే శాంతి కలుగునో, దానికి తీవ్రతరము అని పేరు. జీవించుచున్న పురుషుని పాపములను పూర్తిగా నశింపజేసే దీక్షకు తీవ్ర అని పేరు (9). గురువు యోగమార్గముచే శిష్యుని దేహమును ప్రవేశించి జ్ఞాననేత్రముతో జ్ఞానయుక్తమగు దీక్షను ఇచ్చును. దానికి శాక్తి అని పేరు (10). అగ్నికుండములో మరియు మండలములో వివిధక్రియలతో కూడియున్న బాహ్యదీక్షకు మాంత్రి అని పేరు. దానిని గురువు మందము లేదా మందతరము అగు ఉద్దేశ్యముతో ఇచ్చును (11). శక్తిపాతముననుసరించి శిష్యుడు గురువుయొక్క అనుగ్రహమును పొందును. శైవధర్మముయొక్క అనుసరణము శక్తిపాతమే మూలముగా కలిగి యున్నది. కావున, అది సంగ్రహముగా చెప్పబడుచున్నది. (12). యత్ర శక్తిర్న పతితా తత్ర శుద్ధిర్న జాయతే | న విద్యా న శివాచారో న ముక్తిర్న చ సిద్ధయః || 13 తస్మాల్లింగాని సంవీక్ష్య శక్తిపాతస్య భూయసః | జ్ఞానేన క్రియయా వాథ గురుశ్శిష్యం విశోధయేత్ || 14 యో%న్యథా కురుతే మోహాత్స వినశ్యతి దుర్మతిః | తస్మాత్సర్వప్రకారేణ గరుశ్శిష్యం పరీక్షయేత్ || 15 లక్షణం శక్తిపాతస్య ప్రబోధానందసంభవః | సా యస్మాత్పరమా శక్తిః ప్రబోధానందరూపిణీ || 16 ఆనందబోధయోర్లింగమంతఃకరణవిక్రియాః | యథా స్యాత్కంపరోమాంచస్వర నేత్రాంగవిక్రియాః || 17 శిష్యో%పి లక్షణౖరేభిః కుర్యాద్గురుపరీక్షణమ్ | తత్సంపర్కైశ్శివార్చాదౌ సంగతైర్వాథ తద్గతైః || 18 శిష్యస్తు శిక్షణీయత్వాద్గురోర్గౌరవకారణాత్ | తస్మాత్సర్వప్రయత్నేన గురోర్గౌరవమాచరేత్ || 19 యో గురుస్స శివః ప్రోక్తో యశ్శివస్స గురుస్స్మృతః | గురుర్వా శివ ఏవాథ విద్యాకారేణ సంస్థితః || 20 యథా శివస్తథా విద్యా యథా విద్యా తథా గురుః | శివవిద్యాగురూణాం చ పూజయా సదృశం ఫలమ్ || 21 సర్వదేవాత్మకశ్చాసౌ సర్వమంత్రమయో గురుః | తస్మాత్సర్వప్రయత్నేన తస్యాజ్ఞాం శిరసా వహేత్ || 22 ఎవనియందు శక్తిపాతము (గురువునుండి శిష్యునిలోనికి శక్తి ప్రవహించుట) జరుగలేదో, వానికి శుద్ధి కలుగదు. వానియందు విద్య శివాచారము, ముక్తి మరియు సిద్ధులు అనునవి లేవు (13). కావున, అధికమగు శక్తిపాతముయొక్క చిహ్నములను గుర్తించి గురువు జ్ఞానముచే గాని, క్రియచే గాని శిష్యుని విశేషముగా శోధన చేయవలెను. (14). ఎవడైతే మోహము వలన దీనికి భిన్నముగా చేయునో, అట్టి దుర్బుద్ధి వినాశమును పొందును. కావున, గురువు శిష్యుని అన్ని ప్రకారములుగా పరీక్షించ వలెను (15). ప్రకృష్టమగు జ్ఞానము మరియు ఆనందము కలుగుటయే శక్తిపాతము యొక్క లక్షణము. ఏలయనగా, ప్రకృష్టమగు జ్ఞానము మరియు ఆనందము ఆ శ్రేష్ఠమగు శక్తియొక్క స్వరూపమైయున్నవి (16). అంతఃకరణమునందలి వికారములు ఆనందజ్ఞానములకు చిహ్నములు. అంతఃకరణవికారము వలన వణుకు, గగుర్పాటు, గొంతు బొంగురు పోవుట, కన్నుల వెంబడి నీరు స్రవించుట అనే దేహవికారములు కలుగును (17). శిష్యుడు కూడా శివపూజ మొదలగు సందర్భములలో గురువుతో సంపర్కమును పెట్టుకొని, లేదా ఆయన వద్ద ఉండి చనువును పెంచుకొని, ఈ లక్షణములను బట్టి గురువును పరీక్షించవలెను. (18). గురువుచే విద్య గరపబడువాడు గనుక శిష్యునకు ఆ పేరు వచ్చినది. శిష్యునిచే సమ్మానింపబడువాడు గనుక, గురువునకు ఆ పేరు వచ్చినది. కావున, శిష్యుడు సకలప్రయత్నముల ద్వారా గురువును గౌరవించవలెను (19). గురువే శివుడనియు, శివుడే గురువనియు చెప్పబడినది. శివుడే విద్యయొక్క ఆకారమును పొంది గురువై ఉన్నాడు (20). ఏ తత్త్వము శివుడో, అదియే విద్య. ఏది విద్యయో అదియే గురువు. శివుడు, విద్య మరియు గురువు అనువారిని పూజించుట వలన సమానమగు ఫలము లభించును (21). శివుడు సర్వదేవతాస్వరూపుడు కాగా, గురువు సర్వమంత్రస్వరూపుడు. కావున, సకలప్రయత్నములను చేసి ఆయన ఆజ్ఞను శిరసా వహించవలెను (22). శ్రేయో%ర్థీ యది గుర్వాజ్ఞాం మనసాపి న లంఘయేత్ | గుర్వాజ్ఞాపాలకో యస్మాత్ జ్ఞానసంపత్తిమశ్నుతే || 23 గచ్ఛంస్తిష్ఠన్ స్వపన్ భుంజన్నాన్యత్కర్మ సమాచరేత్ | సమక్షం యది కుర్వీత సర్వం చానుజ్ఞయా గురోః || 24 గురోర్గృహే సమక్షం వా న యథేష్టాసనో భ##వేత్ | గురుర్దేవో యతస్సాక్షాత్తద్గృహం దేవమందిరమ్ || 25 పాపినాం చ యథా సంగాత్తత్పాపాత్పతితో భ##వేత్ | యథేహ వహ్నిసంపర్కాన్మలం త్యజతి కాంచనమ్ || 26 తథైవ గురుసంపర్కాత్పాపం త్యజతి మానవః | యథా వహ్నిసమీపస్థో ఘృతకుంభో విలీయతే || 27 తథా పాపం విలీయేత హ్యాచార్య స్య సమీపతః | యథా ప్రజ్వాలితో వహ్నిశ్శుష్కమార్ద్రం చ నిర్దహేత్ || 28 తథాయమపి సంతుష్టో గురుః పాపం క్షణాద్దహేత్ | మనసా కర్మణా వాచా గురోః క్రోధం న కారయేత్ || 29 తస్య క్రోధేన దహ్యంతే హ్యాయుః శ్రీజ్ఞానసత్ర్కియా) | తత్ర్కోధకారిణో యే స్యుస్తేషాం యజ్ఞాశ్చ నిష్ఫలాః || 30 యమాశ్చ నియమాశ్చైవ నాత్ర కార్యా విచారణా | గురోర్విరుద్ధం యద్వాక్యం న వదేజ్జాతుచిన్నరః || 31 వదేద్యది మహామోహాద్రౌరవం నరకం వ్రజేత్ | మనసా కర్మణా వాచా గురుముద్దిశ్య యత్నతః || 32 శ్రేయోర్థీ చేన్నరో ధీమాన్న మిథ్యాచారమాచరేత్ | గురోర్హితం ప్రియం కుర్యాదాదిష్టో వా న వా సదా || 33 శ్రేయస్సును కోరు శిష్యుడు గురువుయొక్క ఆజ్ఞను మనస్సులోనైననూ ఉల్లంఘించరాదు. ఏలయనగా, గురువుయొక్క ఆజ్ఞను పాలించువాడు జ్ఞానము అనే సంపదను పొందును (23). శిష్యుడు నడుస్తూ ఉన్నా, నిలబడి ఉన్నా, నిద్రిస్తున్నా, భుజిస్తున్నా, గురువు యొక్క ఆజ్ఞను మినహాయించి ఇతరములగు కర్మలను చేయరాదు. గురువుయొక్క సమక్షములో ఏ కర్మను చేసిననూ, సర్వమును ఆయన అనుమతితో మాత్రమే చేయవలెను (24). గురువుయొక్క ఇంటిలో గాని, ఆయన యెదుట గాని ఇచ్చ వచ్చిన రీతిలో ఆసనముపై కూర్చుండరాదు. ఏలయనగా, గురువు సాక్షాత్తుగా దేవుడే. ఆయన గృహము దేవాలయము (25). పాపాత్ముల సంగము వలన కలిగే పాపము వలన మానవుడు ఏ విధముగా పతనమును చెందునో, ఈ లోకములో బంగారము అగ్నితోడి సంప్కరము వలన ఏవిధముగా మాలిన్యములను పోగొట్టుకొనునో (26), అదే విధముగా, మానవుడు గురువుతోడి సంపర్కము వలన పాపమును విడిచి పెట్టును. ఏ విధముగా నిప్పుకు దగ్గరలో నున్న కుండలోని నెయ్యి కరిగి పోవునో (27), అదే విధముగా గురువునకు సమీపములో పాపము వినాశమును పొందును. భగభగ మండే నిప్పు ఎండు కట్టెలను మాత్రమే గాక, పచ్చి కట్టెలను కూడ ఏ విధముగా దహించి వేయునో (28), అదే విధముగా ఈ గురువు సంతోషించినచో క్షణములో పాపమును దహించి వేయును. మనస్సుచే గాని, కర్మచే గాని, వాక్కుతో గాని గురువునకు కోపమును కలిగించరాదు (29). గురువునకు కోపము వచ్చినచో, ఆయుర్దాయము, సంపద, జ్ఞానము, చేసుకున్న పుణ్యకర్మలు ఆ కోపములో పడి మసియగును. ఆయనకు కోపము తెప్పించిన వారి యజ్ఞములు, యమములు, నియమములు వ్యర్థములనుటలో సందేహము లేదు. మానవుడు ఏ కాలమునందైననూ గురువునకు విరుద్ధమగు వాక్యమును పలుకరాదు (30,31). గొప్పమోహముచే అట్లు పలికినచో, అట్టివాడు రౌరవనరకమును పొందును. వివేకవంతుడగు మానవుడు శ్రేయస్సును కోరువాడైనచో, ప్రయత్నపూర్వకముగా గురువు విషయములో మనోవాక్కాయముల ద్వారా తప్పు పని జరుగకుండునట్లు జాగ్రత్త పడవలెను. గురువు అదేశించినా, అదేశించక పోయినా, ఆయనకు హితమును ప్రియమును సర్వదా ఆచరించుచుండవలెను (32,33). అసమక్షం సమక్షం వా తస్య కార్యం సమాచరేత్ | ఇత్థమాచారవాన్ భక్తో నిత్యముద్యుక్తమానసః || 34 గురుప్రయకరశ్శిష్యశ్శైవధర్మాంస్తతో% ర్హతి | గురుశ్చేద్గుణవాన్ ప్రాజ్ఞః పరమానందభాసకః || 35 తత్వవిచ్ఛివసంసక్తో ముక్తిదో న తు చాపరః | సంవిత్సంజననం తత్త్వం పరమానందసంభవమ్ || 36 తత్తత్త్వం విదితం యేన స ఏవానందదర్శకః | న పునర్నామమాత్రేణ సంవిదా రహితస్తు యః || 37 అన్యోన్యం తారయేన్నౌకా కిం శిలా తారయేచ్ఛిలామ్ | ఏతస్యా నామమాత్రేణ ముక్తిర్వై నామమాత్రికా || 38 యైః పునర్విదితం తత్త్వం తే ముక్తా మోచయంత్యపి | తత్త్వహీనే కుతో బోధః కుతో హ్యాత్మపరిగ్రహః || 39 పరిగ్రహవినిర్ముక్తః పశురిత్యభిధీయతే | పశుభిః ప్రేరితశ్చాపి పశుత్వం నాతివర్తతే || 40 తస్మాత్తత్త్వవిదేవేహ ముక్తోమోచక ఇష్యతే | సర్వలక్షణసంయుక్తస్సర్వశాస్త్రవిదప్యయమ్ || 41 సర్వోపాయవిధిజ్ఞో%పి తత్త్వహీనస్తు నిష్ఫలః | యస్యానుభవపర్యంతా బుద్ధిస్తత్త్వే ప్రవర్తతే || 42 తస్యావలోకనాద్యైశ్చ పరానందో%భిజాయతే | తస్మాద్యసై#్యవ సంపర్కాత్ర్పబోధానందసంభవః || 43 గురుం తమేవ వృణుయాన్నాపరం మతిమాన్నరః | స శిషై#్యర్వినయాచారచతురైరుచితో గురుః || 44 యావద్విజ్ఞాయతే తావత్సేవనీయో ముముక్షుభిః | జ్ఞాతే తస్మిన్ స్థిరా భక్తిర్యావత్తత్త్వం సమాశ్రయేత్ || 45 గురువు ఎదురుగా ఉన్నా లేకున్నా ఆయన కార్యమును చక్కగా చేయవలెను. ఈ విధమైన ప్రవృత్తి గలవాడు, భక్తుడు, నిత్యము సావధానముగా నుండే మనస్సు గలవాడు (34), గురువునకు ప్రియమును చేయువాడు అగు శిష్యుడు ఆ శుశ్రూష వలన శైవధర్మములకు అర్హుడు అగును. గురువు గుణవంతుడు, జ్ఞాని, పరమానందస్వరూపమగు తత్త్వమును ప్రకాశింపజేయగలవాడు (35), తత్త్వము తెలిసినవాడు, శివునియందు భక్తి గలవాడు అయినచో, శిష్యునకు మోక్షమునీయగలడు; దీనికి భిన్నమైనవాడు ఈయలేడు. తత్త్వమనగా శుద్ధచైతన్యస్వరూపము మరియు పరమానందఘనము (36). ఆ తత్త్వము (పరంబ్రహ్మ) ను తెలిసినవాడు మాత్రమే ఆనందస్వరూపమును చూపించగలడు, అంతేగాని, జ్ఞాని కాని నామమాత్రపు గురువు ఆనందస్వరూపమును చూపలేడు (37). ఒక నౌక మరియొక నౌకను లాగి సముద్రమును దాటించగలదు. కాని, ఒకా రాయి మరియొక రాయిని దాటించగలదా? గురువు నామమాత్రుడైనచో, ముక్తి కూడ నామమాత్రమే యగును (38). దీనికి భిన్నముగా, తత్త్వము తెలిసిన వారు తాము ముక్తులై ఇతరులను కూడ ముక్తులను చేయగల్గుదురు. తత్త్వము తెలియని వానియందు జ్ఞానమెక్కడిది? ఆత్మసాక్షాత్కారమెక్కడిది? (39) ఆత్మసాక్షాత్కారము లేనివాడు పశువు అనబడును. ఇతరపశువులచే ప్రేరితుడైన పశువు (అజ్ఞానియగు జీవుడు) తన పశుత్వము (అజ్ఞానము) ను అతిక్రమించ లేడు (40). కావున, ఈ లోకములో తత్త్వమును తెలిసి ముక్తిని పొందినవాడు మాత్రమే ఇతరులకు ముక్తిని ఈయగల్గును. సకలలక్షణములు గలవాడైననూ, సకలశాస్త్రములను చదివినవాడైననూ (41), సకలములగు ఉపాయములను విధులను తెలిసినవాడే అయిననూ, తత్త్వము తెలియని వాడైనచో వ్యర్థము. ఎవని బుద్ధి తత్త్వమునందు అనుభవపర్యంతము ప్రవర్తిల్లునో (42), వానిని చూచుట మొదలగు వాటి వలన పరమానందము కలుగును. కావున, బుద్ధిమంతుడగు మానవుడు, ఎవని సంపర్కము వలన మాత్రమే ప్రకృష్టమగు జ్ఞానము మరియు ఆనందము కలుగునో, వానిని మాత్రమే గురువుగా ఎన్నుకొనవలెనే గాని, మరియొకనిని గాదు. అట్టి యోగ్యుడగు గురువును మోక్షమును కోరే శిష్యులు వినయముతో, సదాచారముతో మరియు నేర్పుతో, జ్ఞానము స్థిరమగు భక్తి మరియు తత్త్వమునందు నిష్ఠ కలిగే వరకు సేవించవలెను (43-45). న తు తత్త్వం త్యజేజ్జాతు నోపేక్షేత కథంచన | యత్రానందః ప్రబోధో వా నాల్పమప్యుపలభ్యతే || 46 వత్సరాదపి శిష్యేణ సో%న్యం గురుముపాశ్రయేత్ | గురుమన్యం ప్రపన్నో %పి నావమన్యేత పౌర్వికమ్ | గురోర్ర్భాతౄంస్తథా పుత్రాన్ బోధకాన్ ప్రేరకానపి || 47 తత్రాదావుపసంగమ్య బ్రాహ్మణం వేదపారగమ్ | గురుమారాధయేత్ర్పాజ్ఞం శుభగం ప్రియదర్శనమ్ || 48 సర్వాభయప్రదాతారం కరుణాక్రాంతమానసమ్ | తోషయేత్తం ప్రయత్నేన మనసా కర్మణా గిరా || 49 తావదారాధయేచ్ఛిష్యః ప్రసన్నోసౌ భ##వేద్యథా | తస్మిన్ ప్రసన్నే శిష్యస్య సద్యః పాపక్షయో భ##వేత్ || 50 తస్మాద్ధనాని రత్నాని క్షేత్రాణి చ గృహాణి చ | భూషణాని చ వాసాంసి యానశయ్యాసనాని చ || 51 ఏతాని గురవే దద్యాద్భక్త్యా విత్తానుసారతః | విత్తశాఠ్యం న కుర్వీత యదీచ్ఛేత్పరమాం గతిమ్ || 52 స ఏవ జనకో మాతా భర్తా బంధుర్ధనం సుఖమ్ | సఖా మిత్రం చ యత్తస్మాత్సర్వం తసై#్మనివేదయేత్ || 53 నివేద్య పశ్చాత్స్వాత్యానం సాన్వయం సపరిగ్రహామ్ | సమర్ప్య సోదకం తసై#్మ నిత్యం తద్వశగో భ##వేత్ || 54 యదా శివాయ స్వాత్మానం దత్తవాన్ దేశికాత్మనే | తదా శైవో భ##వేద్దేహీ న తతో %స్తి పునర్భవః || 55 సాధకుడు ఎన్నడైననూ తత్త్వమును విడిచి పెట్టరాదు; ఏ విధముగనైననూ ఉపేక్షించరాదు. ఏ గురువు వద్ద శిష్యునకు సంవత్సరకాలము తరువాత కూడ ఆనందము కాని జ్ఞానము కాని అల్పము కూడ లభించదో, అతడు ఆ గురువును విడిచిపెట్టి, మరియొక గురువును ఆశ్రయించవలెను. అతడు మరియొక గురువును ఆశ్రయించిన తరువాత కూడ పూర్వగురువును గాని, ఆయిన సోదరులు పుత్రులు మొదలగు వారిని గాని, ఆ గురువును చూపించి ప్రోత్సహించిన వారిని గాని, అవమానించ రాదు (46,47). ఇట్టి స్థితిలో ముందుగా బ్రాహ్మణుడు, వేదవేత్త, జ్ఞాని, శుభలక్షణములు గలవాడు, ఆహ్లాదకరమగు దర్శనము గలవాడు, అందరికి అభయమునిచ్చువాడు (సన్న్యాసి), దయతో నిండిన మనస్సు గలవాడు అగు గురువును సమీపించి ఆరాధించ వలెను. ఆయనను మనోవాక్కాయములచే ప్రయత్నపూర్వకముగా సంతోష పెట్టవలెను (48,49). ఆయన ప్రసన్నుడగు వరకు శిష్యుడు ఆయనను ఆరాధించ వలెను. ఆయన ప్రసన్నుడైనచో, శిష్యునకు వెంటనే పాపక్షయమగును (50). కావున, ధనములు, రత్నములు, పొలములు, ఇల్లు, అలంకారములు, వస్త్రములు, ప్రయాణసాధనములు, శయ్యలు, ఆసనములు అనువాటిని సాధకుడు తన ఆర్థికస్థితిని బట్టి గురువునకు భక్తితో నీయవలెను. మోక్షమును కోరు శిష్యుడు శక్తివంచన లేకుండగా ధనము నీయ వలెను (51,52). గురువే తండ్రి, తల్లి, పోషించువాడు, బంధువు, ధనము, సుఖము, మిత్రుడు మరియు సహచరుడు అగుటచే, సర్వమును ఆయనకు నివేదించ వలెను (53). ఈ విధముగా నివేదించి తరువాత తనను తన కుటుంబమును తన సమస్తసంపదను అయనకు నీటిని వదిలి సమర్పించి సర్వదా ఆయనకు వశుడై ఉండవలెను (54). మానవుడు ఎప్పుడైతే తనను గురురూపములోనున్న శివునకు సమర్పించుకొనునో, అప్పుడు ఆతడుశైవుడు అగును. అట్లుచేయుట వలన ఆతనికి పునర్జన్మ లేదు (55). గురుశ్చ స్వాశ్రితం శిష్యం వర్షమేకం పరీక్షయేత్ | బ్రాహ్మణం క్షత్రియం వైశ్యం ద్వివర్షం చ త్రివర్షకమ్ || 56 ప్రాణద్రవ్యప్రదానాద్యైరాదేశైశ్చ సమాసమైః | ఉత్తమాంశ్చాధమే కృత్వా నీచానుత్తమకర్మణి || 57 ఆకృష్టాస్తాడితా వాపి యే విషాదం న యాంత్యపి | తే యోగ్యాస్సంయతాశ్శుద్ధాశ్శివసంస్కారకర్మణి || 58 అహింసకా దయావంతో నిత్యముద్యుక్తచేతసః | అమానినో బుద్ధిమంతస్త్యక్తస్పర్ధాః ప్రియంవదాః || 59 ఋజవో మృదవస్స్వచ్ఛా వినీతాః స్థిరచేతసః |శౌచాచారసమాయుక్తాశ్శివభక్తా ద్విజాతయః || 60 ఏవం వృత్తసమోపేతా వాఙ్మనఃకాయకర్మభిః | శోధ్యా బోధ్యా యథాన్యాయమితి శాస్త్రేషు నిశ్చయః || 61 నాధికారస్స్వతో నార్యాశ్శివసంస్కారకర్మణి | నియోగాద్భర్తురస్త్యేవ భక్తియుక్తా యదీశ్వరే || 62 గురువు కూడ తనను ఆశ్రయించిన శిష్యుడు బ్రాహ్మణుడైనచో ఒక సంవత్సరము, క్షత్రియుడైనచో రెండేళ్లు, వైశ్యుడైనచో మూడేళ్లు పరీక్షించవలెను. (56). ప్రాణసంకటము, అధికమగు ధనమునకు పూచీని అప్పజెప్పుట మొదలగు పరీక్షలను చేయవలెను. ఉచితములు మరియు అనుచితములు అగు ఆదేశములను ఇచ్చి ఉత్తములను అధమకార్యమునందు, అధములను ఉత్తమకార్యమునందు నియోగించి పరీక్షించ వలెను (57). ఎవరైతే తిట్టినా, కొట్టినా దుఃఖమును కూడ పొందరో, అట్టి చిత్తైకాగ్రము గల శుద్ధాంతఃకరణులు శివసంస్కార కర్మకు అర్హులు (58). హింసను చేయనివారు, దయ గలవారు, సర్వదా సేవ చేయుటకు సంసిద్ధమైన మనస్సు గలవారు, గర్వము లేనివారు, బుద్ధిశాలురు, అసూయను వీడినవారు,ప్రియమును పలుకువారు (59). ఋజువర్తనులు, మృదుస్వభావము గలవారు, స్వచ్ఛమైన వారు, వినయవంతులు, స్థిరమగు బుద్ధి గలవారు, శౌచము మరియు ఆచారముతో సంపన్నమైనవారు, శివభక్తులు, ఉపనయనమును చేసుకున్నవారు (60) అగు శిష్యుల ప్రవృత్తిని పరీక్షించి, మనోవాక్కాయకర్మల ద్వారా వారిని పవిత్రులను చేసి వారికి ధర్మమునతిక్రమించకుండగా బోధించ వలెనని శాస్త్రములయందు నిశ్చయించ బడినది (61). స్త్రీకి తనంత తానుగా శివసంస్కారకర్మయందు అధికారము లేదు. కాని, ఆమెకు ఈశ్వరునియందు భక్తి ఉండి భర్త అనుమతి ఉన్నచో, అధికారము గలదు (62). తథైవ భర్తృహీనాయాః పుత్రాదేరభ్యనుజ్ఞయా | అధికారో భవత్యేవ కన్యాయాః పితురాజ్ఞయా | శూద్రాణాం మర్త్యజాతీనాం పతితానాం విశేషతః || 63 తథా సంకరజాతీనాం నాధ్వశుద్ధిర్విధీయతే | తేప్యకృత్రిమభావాశ్చేచ్ఛితే పరమకారణ || 64 పాదోదకప్రదానాద్యైః కుర్యుః పాపవిశోధనమ్ | అత్రానులోమజాతా యే యుక్తా ఏవ ద్విజాతిషు || 65 తేషామధ్వవిశుద్ధ్యాది కుర్యాన్మాతృకులోచితమ్ | యా తు కన్యా స్వపిత్రాద్యైశ్శివధర్మే నియోజితా || 66 సా భక్తాయ ప్రదాతవ్యా నాపరాయ విరోధినే | దత్తా చేత్ర్పతికూలాయ ప్రమాదాద్బోధయేత్పతిమ్ || 67 అశక్తా తం పరిత్యజ్య మనసా ధర్మమాచరేత్ | యథా మునివరం త్యక్త్వా పతిమత్రిం పతివ్రతా || 68 కృతకృత్యా%భవత్పూర్వం తపసారాధ్య శంకరమ్ | యథా నారాయణం దేవం తపసారాధ్య పాండవాన్ || 69 పతీన్ లబ్ధవతీ ధర్మే గురుభిర్న నియోజితా | అస్వాతంత్ర్యకృతో దోషో నేహాస్తి పరమార్థతః || 70 శివధర్మే నియుక్తాయాశ్శివశాసనగౌరవాత్ | బహునాత్ర కిముక్తేన యో%పి కో%పి శివాశ్రయః || 71 సంస్కార్యో గుర్వధీనశ్చేత్సంస్ర్కియా న ప్రభిద్యతే | గురోరాలోకనాదేవ స్పర్శాత్సంభాషణాదపి || 72 యస్య సంజాయతే ప్రజ్ఞా తస్య నాస్తి పరాజయః | మనసా యస్తు సంస్కారః క్రియతే యోగవర్త్మనా || 73 స నేహ కథితో గుహ్యో గురువక్త్రైకగోచరః | క్రియావాన్ యస్తు సంస్కారః కుండమండపపూర్వకః | స వక్ష్యతే సమాసేన తస్య శక్యో న విస్తరః || 74 ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే గురు మహిమవర్ణనం నామ పంచదశో%ధ్యాయః (15). అదే విధముగా భర్త లేని స్త్రీ విషయములో పుత్రులు మొదలగు వారి అనుమతిని పొందినచో, శివసంస్కారమునకు అర్హత తప్పక కలుగును; తండ్రి అనుమతితో కన్యకు అర్హత గలదు. శూద్రులు మొదలగు మానవ జాతులకు, విశేషించి పతితులకు (63. అదే విధముగా సంకరజాతి వారికి మార్గశుద్ధి విధించబడలేదు. వారు కూడా సర్వజగత్కారణుడగు శివునియందు కపటము లేని భక్తి గలవారైనచో (64), గురువుయొక్క పాదములపై నీటిని పోయుట (లేదా, శివును పాదోదకమును తమపై చల్లుకొనుట) మొదలగు కర్మలచే పాపక్షాళనమును చేసుకొన వలెను. బ్రాహ్మణులలో నైననూ అనులోమవివాహము (తల్లి బ్రాహ్మణి కాని స్థితి) వలన జన్మించిన వారిలో యోగ్యులు ఎవరు గలరో (65), వారికి తల్లి వంశము యొక్క ఆచారమును బట్టి మార్గశుద్ధి మొదలగు వాటిని చేయవలెను. ఏ కన్యనైతే తల్లి తండ్రి మొదలగు వారు శివధర్మమునందు నియోగించెదరో (66), ఆమెను శివభక్తునకు మాత్రమే ఇచ్చి వివాహమును చేయవలెను; శివవిరోధి యగు మరియొకనికి ఈయరాదు. ఒకచో పొరపాటున శివవిరోధికి ఇచ్చియున్నచో, ఆమె భర్తకు శివధర్మమును బోధించ వలెను (67). ఆమె ఆతనిని సన్మార్గములోనిక తీసుకు రాలేక పోయినచో, వానిని విడిచిపెట్టి తన మనస్సులో ధర్మమును అనుష్ఠించ వలెను. దీనికి కొన్ని దృష్టాంతములు గలవు. పూర్వము పతివ్రత యగు అనసూయ అత్రిమహర్షిని విడిచిపెట్టి తపస్సుచే శంకరుని ఆరాధించి కృతార్థురాలు ఆయెను. ద్రౌపదిని ఆమె గురువులు ధర్మమునందు నియోగించ లేదు. ఆమె నారాయణుని తపస్సుచే ఆరాధించి పాండవులను భర్తలుగా పొందెను. ఈ లోకములో శివధర్మమునందు నియోగించ బడిన స్త్రీకి శివుని శాసనము యొక్క మహిమచే స్వాతంత్ర్యము లేని కారణముగా వచ్చే దోషము యథార్థముగా సంక్రమించదు. ఇన్ని మాటలేల? ఎట్టి మానవుడైనా శివుని ఆశ్రయించి గురువును శరణు పొందినచో, వానికి శివసంస్కారమును చేయవలెను. సంస్కారపద్ధతిలో భేదము లేదు. గురువును చూచిన వెంటనే, లేదా స్పృశించుటచే, లేదా సంభాషించుట చేతనైననూ ఎవనికైతే జ్ఞానము కలుగునో, వానికి పరాజయము లేదు. యోగమార్గములో మానసికముగా చేయబడే సంస్కారము ఏది గలదో, అది రహస్యము మరియు గురువు ద్వారా మాత్రమే తెలియదగినది అగుటచే, ఈ సందర్భములో చెప్పబడుట లేదు. అగ్నికుండము, మండపము అను వాటితో కూడిన కర్మరూపమైన సంస్కారము ఏది గలదో, అది మాత్రమే సంగ్రహముగా చెప్పబడ గలదు. దానిని విస్తరముగా చెప్పుట అసంభవము (68-74). శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో గురుమహిమను గురుశుశ్రూషను వర్ణించే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).