Siva Maha Puranam-4    Chapters   

అథ షోడశోధ్యాయః

శివ సంస్కార విధి

ఉపమన్యురువాచ |

పుణ్య%హని శుచౌ దేశే బహుదోషవివర్జితే | దేశికః ప్రథమం కుర్యాంత్సంస్కారం సమయాహ్వయమ్‌ || 1

పరీక్ష్య భూమిం విధివద్గంధవర్ణరసాధిభిః | శిల్పిశాస్త్రోక్తమార్గేణ మండపం తత్ర కల్పయేత్‌ || 2

కృత్వా వేదిం చ తన్మధ్యే కుండాని పరికల్పయేత్‌ | అష్టదిక్షు తథా దిక్షు తత్రైశాన్యాం పునః క్రమాత్‌ || 3

ప్రధానకుండం కుర్వీత యద్వా పశ్చిమభాగతః | ప్రధానమేకమేవాథ కృత్వా శోభాం ప్రకల్పయేత్‌ || 4

వితానధ్వజమాలాభిర్వివిధాభిరనేకశః | వేదిమధ్యే తతః కుర్యాన్మండలం శుభలక్షణమ్‌ || 5

రక్తహేమాదిభిశ్చూర్ణైరీశ్వరావాహనోచితమ్‌ | సిందూరశాలినీవారచూర్ణైరేవాథ నిర్ధనః || 6

ఏకహస్తం ద్విహస్తం వా సితం వా రక్తమేవ వా | ఏకహస్తస్య పద్మస్య కర్ణికాష్టాంగులా మతా || 7

కేసరాణి తదర్ధాని శేషం చాష్టదలాదికమ్‌ | ద్విహస్తస్య తు పద్మస్య ద్విగుణం కర్ణికాదికమ్‌ || 8

కృత్వా శోభోపశోభాఢ్యమైశాన్యాం తస్య కల్పయేత్‌ | ఏకహస్తం తదర్ధం వా పునర్వేదాస్తు మండలమ్‌ || 9

వ్రీహితందులసిద్ధార్థతిలపుష్పకుశాస్తృతే | తత్ర లక్షణసంయుక్తం శివకుంభం ప్రసాధయేత్‌ || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను-

పవిత్రదినమునాడు అనేకదోషములు లేని పవిత్రమగు స్థానములో గురువు ముందుగా సమయ అనే సంస్కారమును చేయవలెను (1). గంధము, రంగు, రుచి మొదలగు అంశములను బట్టి భూమిని యథావిధిగా పరీక్షించి, అచట శిల్పశాస్త్రములో చెప్పిన విధముగా మండపమును నిర్మించవలెను (2). దాని మధ్యలో వేదిని కట్టి, ఎనిమిది దిక్కులలో వరుసగా కుండములను ఏర్పాటు చేయవలెను. మరల ఈశాన్యమునందు గాని, పశ్చిమమునందు గాని ప్రధానకుండమును కట్టవలెను. ప్రధానకుండము ఒక్కటి మాత్రమే నుండును. దానిని అనేకరకములైన చాందినీ, పతాకము మరియు మాలలు అను వాటితో అలంకరించ వలెను.తరువాత వేదిమధ్యలో ఈశ్వరుని ఆవాహన చేయుటకు తగిన శుభలక్షణములు గల మండలమును ఎరుపు మొదలగు రంగులు గల పొడులతో మరియు బంగారపు చూర్ణముతో ముగ్గు వేయవలెను. నిర్ధనుడైనచో సిందూరము, బియ్యపు పిండి, నివ్వెర బియ్యపు పిండి అను వాటితో ముగ్గు వేయవలెను (3-6). దానిలో ఒక చేయి లేదా రెండు చేతుల పరిమాణము గల తెల్లని లేదా ఎర్రని పద్మమును గీయవలెను. ఒక చేయి పరిమాణము గల పద్మమునకు కర్ణిక (దుద్దు) ఎనిమిది అంగుళములు ఉండవలెను (7). కేసరములు నాలుగు అంగుళముల పరిమాణములో నుండవలెను. మిగిలిన భాగములో ఎనిమిది రేకులు మొదలగు వాటిని కల్పించ వలెను. రెండు చేతుల పరిమాణము గల పద్మమునకు కర్ణిక మొదలగు వాటి పరిమాణము కూడ రెట్టింపు ఉండవలెను (8). మరల ఆ వేదికి ఈశాన్యమునందు ఒక చేయి లేక దానిలో సగము పరిమాణము గల మండలమును గీసి దానిని శోభను ఇనుమడింప జేసే సామగ్రితో అలంకరించ వలెను (9). ధాన్యము, బియ్యము, ఆవాలు, నువ్వులు, పువ్వులు మరియు దర్భలు అను వాటితో దానిని కప్పి, దానిపై శుభలక్షణములతో కూడిన శివకలశమును స్థాపించ వలెను (10).

సౌవర్ణం రాజతం వాపి తామ్రజం మృన్మయం తు వా | గంధపుష్పాక్షతాకీర్ణం కుశదూర్వాంకురాచితమ్‌ || 11

సితసూత్రావృతం కంఠే నవవస్త్రయుగావృతమ్‌ | శుధ్దాంబుపూర్ణముత్కూర్చం సద్రవ్యం సపిధానకమ్‌ || 12

భృంగారం వర్ధనీం చాపి శంఖం చ చక్రమేవ వా | వినా సూత్రాదికం సర్వం

పద్మపత్రమథాపి వా || 13

తస్యాసనారవిందస్య కల్పయేదుత్తరే దలే | అగ్రతశ్చందనాంభోభిరస్త్రరాజస్య వర్ధనీమ్‌ || 14

మండలస్య తతః ప్రాచ్యాం మంత్రకుంభే చ పూర్వవత్‌ | కృత్వా విధివదీశస్య మహాపూజాం సమాచరేత్‌ || 15

అథార్ణవస్య తీరే వా నద్యాం గోష్ఠే%పి వా గిరౌ | దేవాగారే గృహే వాపి దేశే%న్యస్మిన్మనోహరే || 16

కృత్వా పూర్వోదితం సర్వం వినా వా మండపాదికమ్‌ | మండలం పూర్వవత్కృత్వా స్థండిలం చ విభావసోః || 17

ప్రవిశ్య పూజాభవనం ప్రహృష్టవదనో గురుః | సర్వమంగలసంయుక్తస్సమాచరితనైత్యకః || 18

మహాపూజాం మహేశస్య కృత్వా మండలమధ్యతః | శివకుంభే తథా భూయశ్శివమావాహ్య పూజయేత్‌ || 19

అది బంగారు, వెండి, రాగి లేదా మట్టి కలశము కావచ్చును. దానికి గంధమును పూసి, పుష్పములను, అక్షతలను, దర్భలను మరియు దూర్వాంకురములను అలంకారము కొరకై దానిలో వేసి (11). దానికి కంఠములో తెల్లని దారమును చుట్టి, రెండు నూతనవస్త్రములతో కప్పి, స్వచ్ఛమైన నీటితో నింపి, దర్భకట్టను కొనలు పైకి ఉండునట్లు దానియందు వేసి, దానియందు పవిత్రద్రవ్యములను (బంగారము మొదలైనవి) వేసి, కప్పి యుంచవలెను (12). జరీ, వర్ధని (ఒక ప్రత్యేకమగు నీటి పాత్ర), శంఖము, చక్రము , పద్మపత్రములు అను వాటిని అన్నింటినీ పద్మరూపములో నున్న ఆ ఆసనముయొక్క ఉత్తరదళమునందు అమర్చుకొన వలెను. సూత్రము మొదలగునవి అక్కర లేదు. దానికి ఎదరుగా అస్త్రరాజము కొరకై గంధపు నీటితో నింపిన వర్ధనిని ఉంచవలెను (13, 14). తరువాత మండలమునకు తూర్పునందు పైన చెప్పిన విధముగనే మంత్రకలశమును యథావిధిగా స్థాపించి ఈశ్వరునకు మహాపూజను చేయవలెను (15).తరువాత సముద్రతీరము, నది, గోశాల, పర్వతము, దేవాలయము లేదా ఇల్లు అనే ఏదో ఒక స్థానమునందు గాని, లేదా మరియొక సుందరప్రదేశమునందు గాని (16), మండపనిర్మాణము మొదలగు వాటిని మినహాయించి మిగిలిన సర్వమును పైన చెప్పిన విధముగానే చేసి, మరల మండపమును మరియు అగ్ని కొరకు వేదిని పైన చెప్పిన విధముగా నిర్మించవలెను (17). మహానందముతో ప్రకాశించే ముఖము గల గురువు నిత్యకర్మలను పూర్తి చేసుకొని మంగళద్రవ్యములను అన్నింటినీ పట్టుకొని పూజాభవనమును ప్రవేశించి (18), మహేశ్వరున మహాపూజను చేసి, మండలమధ్యమునందలి శివకలశమునందు మరల అదే విధముగా శివుని ఆవాహన చేసి పూజించ వలెను (19).

పశ్చిమాభిముఖం ధ్యాత్వా యజ్ఞరక్షకమీశ్వరమ్‌ | అర్చయేదస్త్రవర్ధన్యామస్త్రమీశస్య దక్షిణ || 20

మంత్ర కుంభే చ విన్యస్య మంత్రం మంత్రవిశారదః | కృత్వా ముద్రాదికం సర్వం మంత్రయాగం సమాచరేత్‌ || 21

తతశ్శివాన లే హోమం కుర్యాద్దేశికసత్తమః | ప్రధానకుండే పరితో జుహుయుశ్చాపరే ద్విజాః || 22

ఆచార్యాత్పాదమర్థం వాహోమస్తేషాం విధీయతే | ప్రధానకుండ ఏవాథ జుహుయాద్దేశికోత్తమః || 23

స్వాధ్యాయమపరే కుర్యుః స్తోత్రం మంగలవాచనమ్‌ | జపం చ విధివచ్చాన్యే శివభక్తిపరాయణాః || 24

నృత్యం గీతం చ వాద్యం చ మంగలాన్యపరాణి చ | పూజనం చ సదస్యానాం కృత్వా సమ్యగ్విధానతః || 25

పుణ్యాహం కారయిత్వాథ పునస్సంపూజ్య శంకరమ్‌ | ప్రార్థయేద్దేశికో దేవం శిష్యాను గ్రహకామ్యయా || 26

ప్రసీద దేవదేశ దేహమావిశ్య మామకమ్‌ | విమోచయైనం విశ్వేశ ఘృణయా చ ఘృణానిధే || 27

పశ్చిమము వైపునకు తిరిగి కూర్చిండి యుజ్ఞమును రక్షించే ఈశ్వరుని ధ్యానించి, అస్త్రమునకు సంబంధించిన వర్ధనీపాత్రలో దక్షిణమునందు ఈశ్వరుని అస్త్రమును పూడించవలెను (20). మంత్రశాస్త్రములో దిట్టయగు ఆ గురువు మంత్రకలశములో మంత్రన్యాసమును చేసి, ముద్రలు మొదలగు వాటిని అన్నింటిని చేసి, మంత్రయాగమును చక్కగా చేయవలెను (21). తరువాత ఆ గురుశ్రేష్ఠుడు ప్రధానకుండములోని శివాగ్నియందు హోమమును చేయవలెను. మిగిలిన బ్రాహ్మణులు దాని చుట్టూ కూర్చుండి హోమమును చేయుదురు (22). ఆచార్యుడ చేసే హోమములలో సగము గాని, నాల్గవ వంతు గాని వారు చేయవలెనని విధించ బడినది. ఆ గురుశ్రేష్ఠుడు ప్రధానకుండములో మాత్రమే హోమమును చేయవలెను (23). శివభక్తి నిరతులగు కొందరు వేదపారాయణమును,కొందరు స్తోత్రపఠనమును, మరి కొందరు మంగళవాచనమును, ఇంకొందరు జపమును యథావిధిగా చేయవలెను (24). నృత్యగీతవాద్యములను, ఇతరములగు మంగళములను చేయించి, సభాసదులను చక్కని విధానముతో పూజించి (25), తరువాత పుణ్యాహవాచనమును చేయించి, గురువు మరల శంకరుని పూజించి శిష్యుని అనుగ్రహింప జేసే కోరికతో ఆ దేవుని ప్రార్థించవలెను (26). ఓ దేవ దేవా! ఈశ్వరా!విశ్వేశ్వరా!దయానిధీ! నీవు ప్రసన్నుడవై దయతో నా దేహములో ప్రవేశించి వీనికి ముక్తిని ఇమ్ము (27).

అథ చైవం కరోమీతి లబ్ధానుజ్ఞస్తు దేశికః | ఆనీయోపోషితం శిష్యం హవిష్యాశినమేవ వా || 28

ఏకాశనం వా విరతం స్నాతం ప్రాతఃకృతక్రియమ్‌ | జపంతం ప్రణవం దేవం ధ్యాయంతం కృతమంగలమ్‌ || 29

ద్వారస్య పశ్చిమస్యాగ్రమండలే దక్షిణస్య వా | దర్భాసనే సమాసీనం విధ్యోధాయోదఙ్ముఖం శిశుమ్‌ || 30

స్వయం ప్రాగ్వదనస్తిష్ఠన్నూర్ధ్వకాయం కృతాంజలిమ్‌ | సంప్రోక్ష్య ప్రోక్షణీ తోయై ర్మూర్థన్యస్త్రేణ ముద్రయా || 31

పుష్ప క్షేపేణ సంతాడ్య బధ్నీయాల్లోచనం గురుః | దుకూలార్ధేన వస్త్రేణ మంత్రితేన నవేన చ || 32

తతః ప్రవేశ##యేచ్ఛిష్యం గురుర్ద్వారేణ మండలమ్‌ | సో%పి తేనేరితశ్శంభోరాచరేత్త్రిః ప్రదక్షిణమ్‌ || 33

తతస్సువర్మసంమిశ్రం దత్త్వా పుష్పాంజలిం ప్రభోః | ప్రాఙ్ముఖశ్చోదఙ్ముఖో వా ప్రణమేద్దండవత్‌ క్షితౌ || 34

తతస్సంప్రోక్ష్య మూలేన శిరస్యస్త్రేణ పూర్వవత్‌ | సంతాడ్య దేశికస్తస్య మోచయేన్నేత్రబంధనమ్‌ || 35

స దృష్ట్వా మండలం భూయః ప్రణమేత్సాంజలిః ప్రభుమ్‌ | అథాసీనం శివాచార్యోమండలస్య తుదక్షిణ || 36

ఉపవేశ్యాత్మనస్సవ్యే శిష్యం దర్భసనే గురుః | ఆరాధ్య చ మహాదేవం శివహస్తం ప్రవిన్యసేత్‌ || 37

ఆ తరువాత ఈ విధముగా చేసెదనని ఈశ్వరుని అనుమతిని పొంది ఆచ్యారుడు శిష్యుని తీసుకు రావలెను. ఆతడు ఉపవాసమును చేసి ఉండవలెను. లేదా, హవిస్సును భుజించ వచ్చును (28). ఒక పూట మాత్రమే భోజనము చేసే అలవాడు గల ఆ శిష్యుడు విరక్తుడై ఉండి, స్నానమును చేసి ప్రాతః కాలీనములగు నిత్యకర్మలను చేసి ఓంకారమును జపిస్తూ శివుని ధ్యానిస్తూ ఉండవలెను. ఆతడు మంగళకృత్యములను చేసి ఉండవలెను (29). ద్వారమునకు పశ్చిమమునందు గాని, దక్షిణమునందు గాని మండలమునకు ఎదురుగా ఆ పిల్ల వాని వంటి శిష్యుని ఉత్తరాభిముఖముగా దర్భాసనమునందు కూర్చండబెట్టి (30), గురువు తాను తూర్పు ముఖముగా నుండవలెను. గురువు చేతులను జోడించి నిటారుగా కూర్చుండి యున్న శిష్యుని తలపై ప్రోక్షణీపాత్రలోని నీటిని చల్లి, అస్త్రముద్రతో పూలను విసిరి కొట్టవలెను. తరువాత గురువు మంత్రించిన కొత్త వస్త్రమును సగమునకు చింపి ఆ శకలముతో శిష్యునికళ్లకు గంత కట్టవలెను (31, 32). తరువాత గురువు శిష్యుని ద్వారము గుండా మండలము లోనికి ప్రవేశ పెట్ట వలెను. ఆ శిష్యుడు కూడా గురువుయొక్క ప్రేరణను అనుసరించి మూడు సార్లు శివునకు ప్రదక్షిణమును చేయవలెను (33).తరువాత ఆతడు శివప్రభువునకు బంగారముతో కలిసియున్న దోసెడు పూవులను సమర్పించి, తూర్పు ముఖముగా గాని ఉత్తరముఖముగా గాని సాష్టాంగప్రణామమును చేయవలెను (34). తరువాత గురువు శిష్యుని తలపై మూలమంత్రముతో నీటిని చల్లి, పైన చెప్పిన విధముగా అస్త్రమంత్రముతో కొట్టి వాని కళ్లకు కట్టిన గంతను విప్పవలెను (35). ఆ శిష్యుడు మరల మండలమును చూచి చేతులను జోడించి శివప్రభువునకు, కూర్చుండియున్న గురువునకు నమస్కరించవలెను. తరువాత శివస్వరూపుడగు ఆ గురువు మండలమునకు దక్షిణమునందు తనకు ఎడమవైపు శిష్యుని దర్భాసనముపై కూర్చుండబెట్టి , మహాదేవుని ఆరాధించి, శివుని తేజస్సుతో గూడియున్న తన చేతిని ఆతని తలపై పెట్టవలెను (36. 37).

శివతేజోమయం పాణిం శివ మంత్రముదీరయేత్‌ | శివాభిమానసంపన్నో న్యసేచ్ఛిష్యస్య మస్తకే || 38

సర్వాంగాలంబనం చైవ కుర్యాత్తేనైన దేశికః | శిష్యో%పి ప్రణమేద్భూమౌ దేశికాకృతిమీశ్వరమ్‌ || 39

తతశ్శివానలే దేవం సమభ్యర్చ్య యథావిధి | హుతాహుతిత్రయం శిష్యముపవేశ్య యథా పురా || 40

దర్భాగ్రైస్సంస్పృశంస్తం చ విద్యయాత్మానమావిశేత్‌ | నమస్కృత్య మహాదేవం నాడీసంధానమాచరేత్‌ || 41

శివశాస్త్రోక్తమార్గేణ కృత్వా ప్రాణస్య నిర్గమమ్‌ | శిష్యదేహప్రవేశం చ స్మృత్వా మంత్రాంస్తు తర్పయేత్‌ || 42

సంతర్పణాయ మూలస్య తేనైవాహుతయో దశ | దేయాస్తిస్రస్తథాంగానామంగైరేవ యథాక్రమమ్‌ || 43

తతః పూర్ణాహుతిం దత్వా ప్రాయశ్చిత్తాయ దేశికః | పునర్దశాహుతీన్‌ కుర్యాన్మూలమంత్రేణ మంత్రవిత్‌ || 44

పునస్సంపూజ్య దేవేశం సమ్యగాచమ్య దేశికః | హుత్వా చైవ యథాన్యాయం స్వజాత్యా వేశ్యముద్ధరేత్‌ || 45

తసై#్యవం జనయేత్‌ క్షాత్రముద్ధారం చ తతః పునః | కృత్వా తథైవ విప్రత్వం జనయేదస్య దేశికః || 46

రాజన్యం చైవముద్ధృత్య కృత్వా విప్రంపునస్తయోః | రుద్రత్వం జనయేద్విప్రే రుద్రనామైవ సాధయేత్‌ || 47

నేను శివుడను అనే జ్ఞానముతో గూడియున్న గురువు శివుని తేజస్సుతో నిండి యున్న తన చేతిని శిష్యుని శిరస్సుపై నుండి, శివమంత్రమును ఉచ్చరించ వలెను (38). గురువు అదే చేతితో శిష్యుని శరీరావయవములను అన్నింటినీ స్పృశించవలెను. శిష్యుడు కూడా గురువు రూపములో నున్న శివునకు సాష్టాంగప్రణామము నాచరించ వలెను (39). తరువాత శివాగ్నియందు యథావిధిగా ఈశ్వరుని చక్కగా పూజించి మూడు ఆహుతులను ఇచ్చియున్న శిష్యుని కూర్చుండబెట్టి, గురువు పైన చెప్పిన విధముగనే (40) దర్భ కొనలతో ఆతనిని స్పృశిస్తూ, ఉపాసనచే తనను ఆతినియందు ఆవేశింప జేయవలెను. మరియు మహాదేవుని నమస్కరించి నాడీసంధానమును చేయవలెను (41). శివశాస్త్రములో చెప్పిన విధముగా ప్రాణమును బయటకు తీసుకువచ్చి, శిష్య దేహములో ప్రవేశించినట్లుగా భావన చేసి, మంత్రములను తర్పణ చేయవలెను (42). మూలమంత్రము యొక్క తర్పణ కొరకై దానినే ఉచ్చిరస్తూ పది ఆహుతులను, అంగమంత్రములతర్పణ కొరకై వాటితోనే వరుసగా మూడు ఆహుతులను ఈయవలెను (43). తరువాత మంత్రవేత్త యగు గురువు పూర్ణాహుతిని ఇచ్చి, ప్రాయశ్చిత్తము కొరకై మరల మూలమంత్రముతో పది ఆహుతులను ఈయవలెను. (44). గురువు మరల దేవదేవుని చక్కగా పూజించి ఆచమనమును చేసి హోమమును చేసి, శాస్త్రములో చెప్పిన విధముగా వైశ్యుడగు శిష్యుని తన జాతినుండి పైకి తీసుకు రావలెను (45). ఈ విధముగా గురువు వానిని క్షత్రియజాతిలోనికి ఉద్ధరించి, తరువాత వానికి అదే విధానములో బ్రాహ్మణత్వమును కలిగించ వలెను (46). క్షత్రియుని కూడ ఇదే విధముగా ఉద్ధరించి బ్రాహ్మణునిగా చేసి, మరల వారిద్దరికి రుద్రత్వమును కలిగించ వలెను. బ్రాహ్మణునియందు కేవలము రుద్రనామమును స్థాపించ వలెను (47).

ప్రోక్షణం తాడనం కృత్వా శిశోస్స్వాత్మానమాత్మని | శివాత్మకమనుస్మృత్య స్ఫురంతం విస్ఫులింగవత్‌ || 48

నాడ్యా యథోక్తయా వాయుం రేచయేన్మంత్రతో గురుః | నిర్గమ్య ప్రవిశేన్నాడ్యా శిష్యస్య హృదయం తథా || 49

ప్రవిశ్య తస్య చైతన్యం నీలబిందునిభం స్మరన్‌ | స్వతేజసాపాస్తమలం జ్వలంతమనుచింతయేత్‌ || 50

తమాదాయ తయా నాడ్యా మంత్రీ సంహారముద్రయా | పూరకేణ నివేశ్యైనమేకీభావార్థమాత్మనః || 51

కుంభ కేన తయా నాడ్యా రేచకేన యథా పురా | తస్మాదాదాయ శిష్యస్య హృదయే తన్నివేశ##యేత్‌ || 52

తమాలభ్య శివాల్లబ్ధం తసై#్మ దత్త్వో పవీతకమ్‌ | హుత్వా%%హుతిత్రయం పశ్చాద్దద్యాత్పూర్ణాహుతిం తతః || 53

దేవస్య దక్షిణ శిష్యముపవేశ్య వరాసనే | కుశపుష్పపరిస్తీర్ణే బద్ధాంజలిముదఙ్ముఖమ్‌ || 54

స్వస్తికాసనమారూఢం విధాయ ప్రాఙ్ముఖస్స్వయమ్‌ | వరాసనస్థితో మంత్రైర్మహామంగలనిస్స్వనైః || 55

సమాదాయ ఘటం పూర్ణం పూర్వమేవ ప్రసాదితమ్‌ | ధ్యాయమానశ్శివం శిష్యమభిషించేత దేశికః || 56

అథాపనుద్య స్నానాంబు పరిధాయ సితాంబరమ్‌ | ఆచాంతోలంకృతశ్శిష్యః ప్రాంజలిర్మండపం వ్రజేత్‌ || 57

గురువు తన పుత్రునివంటి శిష్యునిపై నీటిని చల్లి కొట్టి, నిప్పు కణము వలె ప్రకాశించే శివస్వరూపమగు ఆతని ఆత్మ తన ఆత్మలో ప్రవేశించినట్లుగా భావన చేసి, పైన చెప్పిన విధముగా మంత్రపూర్వకముగా నాడీమార్గము గుండా గాలిని రేచకము (విడిచిపెట్టుట) చేయవలెను. ఆ నాడి గుండా గురువు తాను బయటకు వచ్చి శిష్యుని హృదయమును ప్రవేశించి వలెను(48, 49). గురువు శిష్యునియందు ప్రవేశించి ఆతని చైతన్యమును నీలబిందువును పోలియున్న దానినిగా, తన తేజస్సుచే తొలగిన మాలిన్యములు గలదై ప్రకాశించుచున్న దానినిగా భావన చేయవలెను (50). మంత్రవేత్తయగు ఆ గురువు ఆశిష్యుని చైతన్యమును తనతో ఐక్యము చేయుట కొరకై ఆ నాడిగుండా సంహారముద్రతో పూరకము (గాలిని లోపల నింపుట) ద్వారా లోపలికి తీసుకురావలెను (51). తరువాత కుంభకము (గాలిని లోపల నిలిపి యుంచుట) ను చేసి, అదే నాడి గుండా పైన చెప్పిన విధముగా రేచకమును చేసి, దానినుండి శిష్యుని చైతన్యమును పైకి తీసుకు వచ్చి వాని హృదయములో నుంచవలెను (52). తరువాత వానిని స్పృశించి శివుని నుండి లభించిన యజ్ఞోపవీతమును వానికి ఇచ్చి, మూడు ఆహుతులను హోమము చేసి, తరువాత పూర్ణాహుతిని ఈయవలెను (53). గురువు తాని శ్రేష్ఠమగు ఆసనమునందు తూర్పు ముఖముగా నిలబడి, దేవునకు దక్షిణము నందు దర్భలు మరియు పుష్పములు పరచిన శ్రేష్ఠమగు ఆసనమునందు శిష్యుని ఉత్తరము ముఖముగా చేతులను కట్టుకుని ఉండునట్లుగా స్వస్తికాసనమునందు కూర్చుండబెట్టి, మంత్రములతో మరియు గొప్ప మంగళధ్వనులతో, అంతకు ముందే స్థాపన పూర్వకముగా పరమేశ్వరుని ప్రసాదరూపముగా సిద్ధము చేయబడి యున్న జలపూర్ణకలశమును తీసుకొని, శివుని ధ్యానిస్తూ, శిష్యుని అభిషేకించ వలెను (54-56). తరువాత శిష్యుడు ఆ స్నానపు నీటిని తుడుచుకొని, తెల్లని వస్త్రమును ధరించి, ఆచమనము చేసి, అలంకరించుకొని, చేతులను జోడించి మండపమును ప్రవేశించ వలెను (57).

ఉపవేశ్య యథాపూర్వం తం గురుర్దర్భవిష్టరే | సంపూజ్య మండలే దేవం కరన్యాసం సమాచరేత్‌ || 58

తతస్తు భస్మనా దేవం ధ్యాయన్మనసి దేశికః | సమాలభేత పాణిభ్యాం శిశుం శివముదీరయేత్‌ || 59

అథ తస్య శివాచార్యో దహనప్లావనాదికమ్‌ | సకలీకరణం కృత్వా మాతృకాన్యాసవర్త్మనా || 60

తతశ్శివాసనం ధ్యాత్వా శిష్యమూర్ధని దేశికః | తత్రావాహ్య యథాన్యాయమర్చయేన్మనసా శివమ్‌ || 61

ప్రార్థయేత్ర్పాంజలిర్దేవం నిత్యమత్ర స్థితో భవ | ఇతి విజ్ఞాప్య తం శంభోస్తేజసా భాసురం స్మరేత్‌ || 62

సంపూజ్యాథ శివం శైవీమాజ్ఞాం ప్రాప్య శివాత్మికామ్‌ | కర్ణే శిష్యస్య శనకైశ్శివమంత్రముదీరయేత్‌ || 63

స తు బద్ధాంజలిః శ్రుత్వా మంత్రం తద్గతమానసః | శ##నైస్తం వ్యాహరేచ్ఛిష్యశ్శివాచార్యస్య శాసనాత్‌ || 64

తతశ్శాక్తం చ సందిశ్య మంత్రం మంత్రవిచక్షణః | ఉచ్చారయిత్వా చ సుఖం తసై#్మ మంగలమాదిశేత్‌ || 65

తతస్సమాసాన్మంత్రార్థం వాచ్యవాచకయోగతః | సమాదిశ్యేశ్వరం రూపం యోగమాసనమాదిశేత్‌ || 66

అథ గుర్వాజ్ఞయా శిష్యశ్శివాగ్నిగురుసన్నిధౌ | భ##క్త్యైవమభిసంధాయ దీక్షావాక్యముదీరయేత్‌ || 67

పైన చెప్పిన విధముగా గురువు దర్భాసనమునందు వానిని కూర్చుండబెట్టి, మండలమునందు దేవుని పూజించి, కరన్యాసమును చేయవలెను (58). తరువాత గురువు దేవుని మనస్సులో ధ్యానిస్తూ రెండు చేతులలో భస్మను తీసుకొని తన పుత్రుని వంటి శిష్యుని స్పృశిస్తూ శివమంత్రమును ఉచ్చరించ వలెను (59). తరువాత శివస్వరూపుడగు గురువు వానికి మాతృకాన్యసపద్ధతితో దహనము, ప్లావనము మొదలైన సకలీకరణక్రియను చేయవలెను (60). తరువాత గురువు శిష్యుని శిరస్సుపై శివుని ఆసనమును భావన చేసి, దానియందు యథాశాస్త్రముగా శివుని ఆవాహన చేసి, మానసపూజను చేయవలెను (61). ఆయన చేతులను జోడించి దేవుని ప్రార్థించి, సర్వదా ఇచట స్థిరముగా నుండుమని విన్నవించి, ఆ శిష్యుని శివతేజస్సుతో ప్రకాశించుచున్న వానినిగా భావన చేయవలెను (62). తరువాత శివుని చక్కగా పూజించి శక్తిస్వరూపమే యగు శివుని ఆజ్ఞను పొంది, శిష్యుని చెవిలో మెల్లగా శివమంత్రమును చెప్పవలెను (63). ఆ శిష్యుడు చేతులను జోడించుకొని మంత్రముపై మనసును పెట్టి విని శివరూపములో నున్న ఆచార్యుని ఆజ్ఞచే దానిని మెల్లగా ఉచ్చరించవలెను (64). తరువాత మంత్రకోవిదుడగు గురువు వానికి శక్తిమంత్రమును కూడ ఉపదేశించి, సులభముగా ఉచ్చరించునట్లు చేసి, మంగళాశీస్సులను ఈయవలెను (65). తరువాత మంత్రమునకు శివునితో గల వాచ్యవాచకసంబంధపురస్సరముగా మంత్రార్థమును సంక్షేపముగా బోధించి, ఈశ్వరస్వరూపమును మరియు యోగాసనమును బోధించవలెను (66). తరువాత శిష్యుడు గురువుయొక్క ఆజ్ఞచే శివుడు, అగ్ని, గురువు అను వారి సన్నిధిలో భక్తిపూర్వకముగా దీక్షావాక్యమును పలుకుతూ ఇట్లు ప్రతిజ్ఞను చేయవలెను (67).

వరం ప్రాణపరిత్యాగశ్ఛేదనం శిరసో %పి వా | న త్వనభ్యర్చ్య భుంజీయ భగవంతం త్రిలోచనమ్‌ || 68

స ఏవ దద్యాన్నియతో యావన్మోహవిపర్యయః | తావదారాధయేద్దేవం తన్నిష్ఠస్తత్పరాయణః || 69

తతస్స సమయో నామ భవిష్యతి శివాశ్రమే | లబ్ధాధికారో గుర్వాజ్ఞాపాలకస్తద్వశో భ##వేత్‌ || 70

అతః పరం న్యస్తకరో భస్మాదాయ స్వహస్తతః | దద్యాచ్ఛిష్యాయ మూలేన రుద్రాక్షం చాభిమంత్రితమ్‌ || 71

ప్రతిమా వాపి దేవస్య గూఢదేహమథాపి వా | పూజాహోమజపధ్యానసాధనాని చ సంభ##వే || 72

సో%పి శిష్యశ్శివాచార్యాల్లబ్ధాని బహుమానతః |ఆదదీతాజ్ఞయా తస్య దేశికస్య న చాన్యథా || 73

ఆచార్యాదాప్తమఖిలం శిరస్యాధాయ భక్తితః | రక్షయేత్పూజయేచ్ఛంభుం మఠే వా గృహ ఏవ వా || 74

అతః పరం శివాచారమాదిశేదస్య దేశికః | భక్తిశ్రద్ధానుసారేణ ప్రజ్ఞాయాశ్చానుసారతః || 75

యదుక్తం యత్సమాజ్ఞాతం యచ్చైవాన్యత్ర్పకీర్తితమ్‌ | శివాచార్యేణ సమయే తత్సర్వం శిరసా వహేత్‌ || 76

శివాగమస్య గ్రహణం వాచనం శ్రవణం తథా | దేశికాదేశతః కుర్యాన్న స్వేచ్ఛాతో న చాన్యతః || 77

ఇతి సంక్షేపతః ప్రోక్తస్సంస్కారస్సమాయహ్వయః | సాక్షాచ్ఛివపుర ప్రాప్తౌ నృణాం పరమసాధనమ్‌ || 78

ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే శివసంస్కార విధివర్ణనం నామ షోడశో%ధ్యాయః (16).

ముక్కంటి భగవానుని పూజించకుండగా భోజనమును చేయుటకంటె తలను నరుకుకొని ప్రాణములను వీడుటయే శ్రేష్ఠము. కావున, నేను అట్లు చేయను (68). మోహము దూరమై జ్ఞానము కలుగునంతవరకు సాధకుడు ఆ దేవుని మాత్రమే ఆశ్రయించి ఆయన యందు నిష్ఠ గలవాడై నియమపూర్వకముగా ఆరాధించవలెను. సర్వమును ఆయనయే ఇచ్చును (69). అట్లు చేసినచో, ఆతనికి శివాశ్రమమునందు అధికారము లభించి, సమయ అనే పేరు వచ్చును. ఆతడు గురువుయొక్క ఆజ్ఞను పాలిస్తూ ఆయనకు వశుడై ఉండవలెను (70). తరువాత గురువు కరన్యాసమును చేసి, తన చేతితో భస్మను తీసుకొని, మూలమంత్రముతో అభిమంత్రించిన రుద్రాక్షతో సహా దానిని శిష్యునకు ఈయవలెను (71). శివుని ప్రతిమను గాని, లేదా శివుని రహస్యశరీరమగు లింగమును గాని, వీలైనంత వరకు పూజ హోమము జపముధ్యానము అను వాటికి ఉపయోగించే పరికరములను కూడ ఈయవలెను (72). ఆ శిష్యుడు కూడా ఆ గురువుయొక్క ఆజ్ఞచే ఆయన వలన లభించిన వస్తువులను సాదరముగా స్వీకరించ వలెనే గాని, వాటిని నిరాదరణ చేయరాదు (73). ఆచార్యుని నుండి లభించిన సర్వమును భక్తితో తలపై నిడుకొని తీసుకువెళ్లి భద్రము చేయవలెను. శంభుని మఠములో గాని, ఇంటిలోననే గాని పూజించవలెను (74). ఆ తరువాత గురువు వీనికి భక్తిశ్రద్ధలకు మరియు ప్రజ్ఞకు అనురూపముగా శివాచారమును ఉపదేశించవలెను (75). శివస్వరూపుడగు ఆచార్యుడు సమయాచారవిషయములో ఇంకనూ దేనిని చెప్పి కీర్తించి చక్కగా ఆజ్ఞాపించినాడో, దానినంతనూ శిష్యుడు శిరసా వహించవలెను (76). ఆతడు గురువుయొక్క ఆదేశముతో మాత్రమే శివాగమమును స్వీకరించుట, ప్రవచించుట మరియు వినుట అను పనులను చేయవలెను. తన ఇచ్ఛచే గాని, ఇతరుల ప్రోత్సాహముతో గాని చేయరాదు. (77). ఈ విధముగా సమయ అను పేరు గల సంస్కారమును నేను సంక్షేపముగా చెప్పితిని. మానవులు సాక్షాత్తుగా శివధామమును పొందుటకు ఇది సర్వోత్కృష్టమైన సాధనము)78).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో శివసంస్కారవిధిని వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది (16).

Siva Maha Puranam-4    Chapters