Siva Maha Puranam-4
Chapters
అథ సప్తదశో
షడధ్వ శోధన విధి
ఉపమన్యురువాచ |
అతః పరం సమావేక్ష్య గురుశ్శిష్యస్య యోగ్యతామ్ | షడధ్వశుద్ధిం కుర్వీత సర్వబంధవిముక్తయే || 1
కలాం తత్త్వం చ భువనం వర్ణం పదమతః పరమ్ | మంత్రశ్చేతి సమాసేన షడధ్యా పరిపఠ్యతే || 2
నివృత్త్యాద్యాః కలాః పంచ కలాధ్వా కథ్యతే బుధైః | వ్యాప్తాః కలాభిరితరే త్వధ్వానః పంచ పంచభిః || 3
శివతత్త్వాదిభూమ్యంతం తత్త్వాధ్వా సముదాహృతః | షడ్వింశత్సంఖ్యోపేతశ్శుద్ధాశుద్ధోభయాత్మకః || 4
ఆధారాద్యున్మనాంతశ్చ భువనాధ్వా ప్రకీర్తితః | వినా భేదోపభేదాభ్యాం షష్టిసంఖ్యాసమన్వితః || 5
పంచాశద్రుద్రరూపాస్తు వర్ణా వర్ణాధ్వ సంజ్ఞితాః | అనేకభేదసంపన్నః పదాధ్వా సముదాహృతః || 6
ఉపమన్యువు ఇట్లు చెప్పెను -
శివసంస్కారకర్మ అయిన పిదప గురువు శిష్యుని యోగ్యతను పరిశీలించి, సకలబంధములనుండి విముక్తి కొరకై షడధ్వ (ఆరు మార్గముల) శుద్ధిని చేయవలెను (1). కళ, తత్త్వము, భువనము, వర్ణము, పదము, మంత్రము అనునవి సంగ్రహముగా ఆరు మార్గములు అని చెప్పబడినవి (2). నివృత్తి మొదలగు అయిదు కళలు కళాధ్వ అగునని పండితులు చెప్పుచున్నారు .మిగిలిన అయిదు అధ్వలు అయిదు కళలచే వ్యాపించబడియున్నవి (3). శివతత్త్వముతో మొదలిడి భూమి వనకు తత్త్వాధ్వ అనబడును. శుద్ధము, అశుద్ధము అనే రెండు రకముల ఈ అధ్వలో ఇరవై ఆరు తత్త్వములు గలవు (4). ఆధారముతో మొదలిడి ఉన్మన వరకు గల అధ్వ భువనాధ్వ అని కీర్తించ బడినది. భేదములను అవాంతర భేదములను ఉపేక్షించినచో, దీనిలో అరవై మార్గములు గలవు (5). రుద్రరూపములగు ఏభై వర్ణములకు వర్ణాధ్వ అని పేరు. పదములే పదాధ్వ. దీనిలో అనేకభేదములు గలవు (6).
సర్వోపమంత్రైర్మంత్రాధ్వా వ్యాప్తః పరమవిద్యయా | యథా శివో న తత్త్వేషు గణ్యతే తత్త్వనాయకః || 7
మంత్రాధ్వని న గణ్యత తథాసౌ మంత్రనాయకః | కలాధ్వనో వ్యాపకత్వం వ్యాప్యత్వం చేతరాధ్వనామ్ || 8
న వేత్తి తత్త్వతో యస్య నైవార్హత్యధ్వశోధనమ్ | షడ్విధస్యాధ్వనో రూపం న యేన విదితం భ##వేత్ || 9
వ్యాప్యవ్యాపకతా తేన జ్ఞాతుమేవ న శక్యతే | తస్మాదధ్వస్వరూపం చ వ్యాప్యవ్యాపకతాం తథా || 10
యథావదవగమ్యైవ కుర్యాదధ్వవిశోధనమ్ | కుండమండలపర్యంతం తత్ర కృత్వా యథా పురా || 11
ద్విహస్తమానం కుర్వీత ప్రాచ్యాం కలశమండలమ్ | తతస్స్నాతశ్శివాచార్యస్సశిష్యః కృతనైత్యకః || 12
ఉపమంత్రములన్నియు కలిసి మంత్రాధ్వ అగును. అది పరమవిద్యచే వ్యాపించబడి యున్నది. తత్త్వములకు ప్రభువు అగు శివుడు తత్త్వములలో లెక్కించబడడు. అదే విధముగా మంత్రములకు రాజగు పంచాక్షరవిద్య మంత్రాధ్వలో పరిగణించ బడదు. కళాధ్వ వ్యాపకము (ఇతరములగు అధ్వలయందు వ్యాపించునది) కాగా, మిగిలిన అధ్వలు వ్యాప్యములు (వ్యాపించ బడునవి) అగుచున్నవి (7, 8). ఈ విషయము యథాతథముగా ఎవనికి తెలియదో, వాడు అధ్వశోధనమునకు అర్హుడు కాడు. ఎవనికి ఆరు విధముల మార్గముల స్వరూపము తెలియదో, వానికి వ్యాప్యవ్యాపకభావము తెలిసే ప్రసక్తియే లేదు. కావున, అధ్వల స్వరూపమును, వ్యాప్యవ్యాపకభావమును యథాతథముగా తెలుసుకొనియే అధ్వశోధనమును చేయవలెను. ఇదివరలో చెప్పిన విధముగా, కుండము మండలము వరకు పూర్తి చేసి, తూర్పు దిక్కునందు రెండు చేతుల పరిమాణము గల కలశమండలమును చేయవలెను. తరువాత శివస్వరూపుడగు ఆచార్యుడు శిష్యునితో కలిసి స్నానమును చేసి, నిత్యకర్మలను చేసుకొన వలెను (9-12).
ప్రవిశ్య మండలం శంభోః పూజాం పూర్వవదాచరేత్ | తత్రాఢకావరైస్సిద్ధం తందులైః పాయసం ప్రభోః || 13
అర్ధం నివేద్య హోమార్థం శేషం సముపకల్పయేత్ | పురతః కల్పితే వాథ మండలే వర్ణమండితే || 14
స్థాపయేత్పంచ కలశాన్ దిక్షు మధ్యే చ దేశికః | తేషు బ్రహ్మాణి మూలార్ణైర్బిందునాదసమన్వితైః || 15
నమఅద్యైర్యకారాంతైః కల్పయేత్కల్పవిత్తమః | ఈశానం మధ్యమే కుంభే పురుషం పురతః స్థితే || 16
అఘోరం దక్షిణ వామే వామం సద్యం చ పశ్చిమే | రక్షాం విధాయ ముద్రాం చ బద్ధ్వా కుంభాభిమంత్రణమ్ || 17
కృత్వా శివానలైర్హోమం ప్రారభేత యథా పురా | యదర్ధం పాయసం పూర్వం హోమార్థం పరికల్పితమ్ || 18
హుత్వా శిష్యస్య తచ్ఛేషం భోక్తుం సముపకల్పయేత్ | తర్పణాంతం చ మంత్రాణాం కృత్వా కర్మ యథా పురా || 19
హుత్వా పూర్ణాహుతిం తేషాం తతః కుర్యాత్ర్పదీపనమ్ | ఓంకారాదను హుంకారం తతో మూలం ఫడంతకమ్ || 20
స్వాహాంతం దీపనే ప్రాహురంగాని చ యథా క్రమమ్ | తేషామాహుతయస్తిస్రో దేయా దీపనకర్మణి || 21
ఆయన మండలమును ప్రవేశించి శివుని పూజను ఇదివరలో చెప్పిన విధముగా చేయవలెను. ఆ పూజలో ఇంచుమించు నాలుగు శేర్ల బియ్యముతో పరమాన్నమును సిద్ధము చేసి, శివప్రభునకు దానిలో సగమును నైవేద్యము పెట్టి, మిగిలిన సగమును హోమము కొరకు ఉంచుకొన వలెను. తరువాత గురువు తూర్పువైపునకు నిర్మించబడిన, అనేకములగు రంగులతో అలంకరించబడిన మండలమునందు నాలుగు దిక్కులలో మరియు మధ్యలో వెరసి అయిదు కలశములను స్థాపించవలెను. కల్పవేత్తలలో శ్రేష్ఠుడగు గురువు వాటియందు బిందువు మరియు నాదములతో కూడి,నమః అనే పదముతో మొదలై యకారముతో అంతమయ్యే మూలమంత్రము (ఓం నమశ్శివాయ) యొక్క వర్ణములతో పంచబ్రహ్మలను స్థాపించ వలెను. మధ్యకుంభములో ఈశానుని, తూర్పువైపు ఉన్న కుంభములో తత్పురుషుని, కుడివైపు అఘోరుని, ఎడమ వైపు వామదేవుని, పశ్చిమమునందు సద్యోజాతుని స్థాపించవలెను. రక్షలను కట్టి, ముద్రలను బంధించి, కలశములను అభిమంత్రించి, శివస్వరూపమగు అగ్ని యందు ఇదివరలో చెప్పిన విధముగా హోమమును ఆరంభించ వలెను. ఇదివరలో హోమము కొరకై భద్రము చేసిన సగము పాయసమును హోమము చేసి, దానిశేషమును శిష్యుడు భుజించుటకు భద్రము చేయవలెను. ఇదివరలో చెప్పిన విధముగా మంత్రముల తర్పణము వరకు కర్మను పూర్తి చేసి, పూర్ణాహుతి హోమము చేసి, తరువాత ప్రదీపనము అను కర్మను చేయవలెను. ఈ ప్రదీనకర్మలో ఓం నమః శివాయ ఫట్ స్వాహా అను మంత్రమునుచ్చరించి, హృదయము మొదలగు ఆరు అంగములకు (హృదయము, శిరస్సు, శిఖ, కవచము, నేత్రత్రయము, అస్త్రము) ఒక్కొక్క అంగమునకు మూడు ఆహుతులు చొప్పున ఈయవలెను (13-21).
మంత్రైరేకైకశ##సై#్తస్తు విచింత్యా దీపమూర్తయః | త్రిగుణం త్రిగుణీకృత్య ద్విజకన్యాకృతం సితమ్ || 22
సూత్రం సూత్రేణ సంమంత్ర్య శిఖాగ్రే బంధయేచ్ఛిశోః | చరణాంగుష్ఠపర్యంతమూర్ధ్వం కాయస్య తిష్ఠతః || 23
లంబయిత్వా తు తత్సూత్రం సుషువ్ణూం తత్ర యోజయేత్ | శాంతయా ముద్రయాదాయ మూలమంత్రేణ మంత్రవిత్ || 24
హుత్వాహుతిత్రయం తస్యాస్సాన్నిధ్యమనుకల్పయేత్ | హృది సంతాడ్య శిష్యస్య పుష్పక్షేపేణ పూర్వవత్ || 25
చైతన్యం సముపాదాయ ద్వాదశాంతే నివేద్య చ | సూత్రం సూత్రేణ సంయోజ్య సంరక్ష్యాస్త్రేణ వర్మణా || 26
అవగుంఠ్యాధ తత్సూత్రం శిష్యదేహం విచింతయేత్ | మూలత్రయమయం పాశం భోగభోగ్యత్వలక్షణమ్ || 27
విషయేంద్రియదేహాదిజనకం తస్య భావయేత్ | వ్యోమాదిభూతరూపిణ్యశ్శాంత్యతీతాదయః కలాః || 28
సూత్రే స్వనామభిర్యోజ్యాః పూజ్యాశ్చైవ నమోయుతైః | అథవా బీజభూతైస్తసత్కృత్వా పూర్వోదితం క్రమాత్ || 29
తతో మలాదేస్తత్త్వాదౌ వ్యాప్తిం సమవలోకయేత్ | కలావ్యాప్తిం మలాదౌ చ హుత్వా సందీపయేత్కలాః || 30
శిష్యం శిరసి సంతాడ్య సూత్రం దేహే యథాక్రమమ్ | శాంత్యతీతపదే సూత్రం లాంఛయేన్మంత్రముచ్చరన్ || 31
ఏవం కృత్వా నివృత్త్యంతం శాంత్యతీతమనుక్రమాత్ | హుత్వాహుతిత్రయం పశ్చాన్మండలే చ శివం యజేత్|| 32
ఆ మంత్రములతో ఒక్కొక్కటిగా అంగములను ప్రకాశించే స్వరూపము గలవిగా భావన చేయవలెను. బ్రాహ్మణకన్యకచే త్రెంపబడిన తెల్లని దారమును మూడు పేటలుగా పేని, మరల దానిని మూడు పేటలుగా చేసి ఆ సూత్రమును అభిమంత్రించి, ఒక కొనను పుత్రుని వంటి శిష్యుని పిలకయొక్క అగ్రభాగమునకు కట్టవలెను. శిష్యుడు తలను పైకెత్తి నిలబడగా ఆ సూత్రముయొక్క రెండవ కొన కాలి బొటన వ్రేలికి తగులునట్లుగా వ్రేలాడదీసి, దానిని సుషుమ్నానాడితో కలిపి ఉంచవలెను. మంత్రవేత్తయగు గురువు శాంతముద్రను పట్టి మూలమంత్రము (ఓం నమశ్శివాయ) తో మూడు ఆహుతులను ఇచ్చి, ఆ నాడిని సూత్రములో ప్రవేశ##పెట్టవలెను. ఇదివరలో చెప్పిన విధముగా శిష్యుని హృదయముపై పుష్పమును విసరి కొట్టి, జీవచైతన్యమును తీసుకొని పన్నెండు ఆహుతుల తరువాత శివునకు నివేదించి, వ్రేలాడే సూత్రమును మరియొక దారముతో దేహమునకు దగ్గరగా కట్టి, అస్త్ర కవచములతో (హుంఫట్) చక్కటి రక్షణను కల్పించి, ఆసూత్రమును కప్పి వుంచవలెను.శిష్యుని దేహము మూలప్రకృతియొక్క మూడు గుణములతో నిండిన పాశమనియు, భోగము మరియు భోగ్యత్వము దాని లక్షణములనియు, ఈ పాశ##మే విషయములను , ఇంద్రియములను, దేహము మొదలగువాటిని ఉత్పన్నము చేయుననియు భావన చేయవలెను. ఆకాశము మొదలగు అయిదు భూతములే రూపముగా గల శాంత్యతీత మొదలగు కళలను వాటి పేర్లకు నమః అను పదమును జోడించి, లేదా వాటి బీజాక్షరములను ఉచ్చరించి, ఆ సూత్రమునందు కలిపి పూజించవలెను. ఈ క్రమము ఇదివరలో చెప్పబడి యున్న ది (22-29).తరువాత మలము మొదలగు పాశములు తత్త్వములు మొదలగు వాటియందు వ్యాప్తిని చెందియున్నట్లు, మరియు మలము మొదలగు పాశములయందు కళల వ్యాప్తిని భావన చేయవలెను. తరువాత హోమమును చేసి ఆ కళలను ప్రకాశింప జేయవలెను (30). శిష్యుని శిరస్సుపై కొట్టి, మూలమంత్రమును ఉచ్చరిస్తూ సూత్రమును దేహమునుండి క్రమమును అతిక్రమించకుండగా విడదీసి, శాంత్యతీతకళయొక్క స్థానమునందు అంకితము చేయవలెను (31). శాంత్యతీతము తరువాత ఇదే విధముగా నివృత్తి కళ వరకు చేసి, మూడు ఆహుతులను ఇచ్చి, తరువాత మండలమునందు శివుని పూజించ వలెను (32).
దేవస్య దక్షిణ శిష్యముపవేశ్యోత్తరాముఖమ్ | సదర్భే మండలే దద్యాద్ధోమశిష్టం చరుం గురుః || 33
శిష్యస్తద్గురుణా దత్తం సత్కృత్య శివపూర్వకమ్ | భుక్త్వా పశ్చాద్ద్వి రాచమ్య శివమంత్రముదీరయేత్ || 34
అపరే మండలే దద్యాత్పంచగవ్యం తథా గురుః | సో%పి తచ్ఛక్తితః పీత్వా ద్విరాచమ్య శివం స్మరేత్ || 35
తృతీయే మండలే శిష్యముపవేశ్య యథా పురా | ప్రదద్యాద్దంతపవనం యథాశాస్త్రోక్తలక్షణమ్ || 36
అగ్రేణ తస్య మృదునా ప్రాఙ్ముఖో వాప్యుదఙ్ముఖః | వాచం నియమ్య చాసీనశ్శిష్యో దంతాన్విశోధయేత్ || 37
ప్రక్షాల్య దంతపవనం త్యక్త్వాచమ్య శివం స్మరేత్ | ప్రవిశేద్దేశికాదిష్టః ప్రాంజలిశ్శివమండలమ్ || 38
త్యక్తం తద్దంతపవనం దృశ్యతే గురుణా యది | ప్రాగుదక్పశ్చిమే వాగ్రే శివమన్యచ్ఛివేతరమ్ || 39
అప్రశస్తాశాముఖే తస్మిన్ గురుస్తద్దోషశాంతయే | శతమర్ధం తదర్ధం వా జుహుయాన్మూలమంత్రతః || 40
తతశ్శిష్యం సమాలభ్య జపిత్వా కర్ణయోశ్శివమ్ | దేవస్య దక్షిణ భాగే తం శిష్యమధివాసయేత్ || 41
అహతాస్తరణాస్తీర్ణే స దర్భశయనే శుచిః | మంత్రితే%తశ్శివం ధ్యాయన్ శయీత ప్రాక్ఛిరా నిశి || 42
శిఖయాం బద్ధసూత్రస్య శిఖయా తచ్ఛిఖాం గురుః | ఆబంధ్యాహతవస్త్రేణ తమాచ్ఛాద్య చ వర్మణా || 43
రేఖాత్రయం చ పరితో భస్మనా తిలసర్పిషైః | కృత్వాస్త్రజపై#్తస్తద్బాహ్యే దిగీశానాం బలిం హరేత్ || 44
శిష్యో%పి పరతో%నశ్నన్ కృత్వైవమధివాసనమ్ | ప్రబుధ్యోత్థాయ గురవే స్వప్నం దృష్టం నివేదయేత్ || 45
ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే షఢధ్వ శోధన విధానవర్ణనం నామ సప్తదశో%ధ్యాయః (17).
దర్భలను పరచిన మండలమునందు దేవునకు దక్షిణమునందు గురువు శిష్యుని ఉత్తరాభిముఖముగా కూర్చుండబెట్టి, హోమములో మిగిలిన అన్నమును ఈయవలెను (33). గురువుచే ఈయబడిన ఆ అన్నమును శిష్యుడు సాదరముగా సత్కరించి తీసుకొని భుజించి, తరువాత రెండు ఆచమనములను చేసి శివమంత్రమును ఉచ్చరించవలెను (34). అదే విధముగా గురువు మరియొక మండలములో పంచగవ్యమును ఈయవలెను. ఆ శిష్యుడు కూడ తన శక్తి మేరకుత్రాగి, రెండు ఆచమనములను చేసి, శివుని స్మరించవలెను (35). పైన చెప్పిన విధముగానే గురువు మూడవ మండలములో శిష్యుని కూర్చుండబెట్టి శాస్త్రములో చెప్పబడిన లక్షణములు గల పళ్లను తోముకొనే పుల్లను ఈయవలెను (36). శిష్యుడు తూర్పు ముఖముగా గాని, ఉత్తరముఖముగా గాని కూర్చుండి, మౌనమును పాటిస్తూ, దాని కొనను మెత్తగా చేసి, పళ్లను తోముకొనవలెను (37). ఆ పనుదోము పుల్లను కడిగి పారవేసి ఆచమనమును చేసి శివుని స్మరించవలెను. గురువు యొక్క అనుమతిని పొంది ఆతడు చేతులను జోడించి శివుని మండలమును ప్రవేశించవలెను (38). పారవేసిన ఆ పనుదోము పుల్లను గురువు తూర్పు, ఉత్తరము లేదా పశ్చిమమునందు తన యెదుట చూచినచో మంగళము కలుగును. దక్షిణములో చూచినచో, అమంగళము (39). గురువు దానిని ప్రశస్తము కాని దక్షిణ దిక్కులో చూచినచో, ఆ దోషమును శాంతింప జేయుటకై మూలమంత్రముతో వంద, లేక ఏభై, లేక ఇరవై అయిదు ఆహుతులను ఈయవలెను (40). తరువాత గురువు శిష్యుని స్పృశించి చెవులు రెండింటిలో శివనామమును చెప్పి, దేవునకు దక్షిణభాగమునందు ఆతనిని కూర్చుండ బెట్టవలెను (41). రాత్రియందు ఆ శిష్యుడు నూతనవస్త్రములను కప్పి అభిమంత్రించిన దర్భల శయ్యపై శుచిగా శివుని ధ్యానిస్తూ తూర్పువైపు తలను పెట్టుకొని పరుండవలెను (42). శిఖయందు కట్టబడిన సూత్రము గల ఆ శిష్యుని శిఖను గురువు శిఖతోనే బంధించి, హుం అనిఉచ్చరించి నూతనవస్త్రమును వానిపై కప్పి వాని చుట్టూ ఫట్ అని ఉచ్చిరిస్తూ భస్మ, నువ్వులు మరియు ఆవాలతో మూడు గీతలను గీసి, వాటికి బయట దిక్పాలకులకు ఆహారమును ఈయవలెను (43, 44). శిష్యుడు కూడ మరియొకరినుండి ఆహారమును స్వీకరించకుండగా ఈ విధముగా అచట నిద్రించి తెలివి వచ్చిన తరువాత లేచి గురువునకు తాను కలలో చూచిన విషయములను విన్నవించ వలెను (45).
శ్రీ శివమహాపురాణములో వాయవీయసంహితమందు ఉత్తరఖండలో షడధ్వ శోధనవిధిని వర్ణించే పదునేడవ అధ్యాయము ముగిసినది (17).