Siva Maha Puranam-4    Chapters   

అథ అష్టాదశో%ధ్యాయః

తత్త్వ శోధనము - కళాస్వరూపము

ఉపమన్యురువాచ |

తతస్స్నానాదికం సర్వం సమాప్యాచార్యచోదితః | గచ్ఛేద్బద్ధాంజలిర్ధ్యాయన్‌ శివమండలపార్శ్వతః || 1

అథ పూజాం వినా సర్వం కృత్వా పూర్వదినే యథా | నేత్రబంధనపర్యంతం దర్షయేన్మండలం గురుః || 2

బద్ధనేత్రేణ శిష్యేణ పుష్పావకిరణ కృతే | యత్రాపతంతి పుష్పాణి తస్య నామాస్య సందిశేత్‌ || 3

తం చోపనీయ నిర్మాల్యమండలే%స్మిన్‌ యథా పురా | పూజయేద్దేవమీశానం జుహుయాచ్చ శివానలే || 4

శిష్యేణ యది దుస్స్వప్నో దృష్టస్తద్దోషశాంతయే | శతమర్ధం తదర్ధం వా జుహుయాన్మూలవిద్యయా || 5

తతస్సూత్రం శిఖాబద్ధం లంబయిత్వా యథా పురా | ఆధారపూజాప్రభృతి యన్నివృత్తికలాశ్రయమ్‌ || 6

వాగీశ్వరీపూజనాంతం కుర్యాద్ధోమపురస్సరమ్‌ | అథ ప్రణమ్య వాగీశం నివృత్తేర్వ్యాపికాం సతీమ్‌ || 7

మండలే దేవమభ్యర్చ హుత్వా చైవాహుతిత్రయమ్‌ | ప్రాపయేచ్చ శిశోః ప్రాప్తిం యుగపత్సర్వయోనిషు || 8

సూత్రదేహే%థశిష్యస్య తాడన ప్రోక్షణాదికమ్‌ | కృత్వాత్మానం సమాదాయ ద్వాదశాంతే నివేద్యచ || 9

తతో%ప్యాదాయ మూలేన ముద్రయా శాస్త్రదృష్టయా | యోజయేన్మనసాచార్యో యుగపత్సర్వ యోనిషు || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను -

తరువాత శిష్యుడు స్నానము మొదలగు వాటిని అన్నింటినీ పూర్తిచేసుకొని ఆచార్యునిచే ఆదేశించ బడినవాడై చేతులను జోడించి శివుని మండలము ప్రక్కకు వెళ్లవలెను (1). తరువాత గురువు పూజను మినహాయించి మిగిలిన కర్మను అంతనూ కళ్లకు బంధమును కట్టే వరకు పూర్వదినమునందు, వలెనే చేసి, మండలమును చూపించ వలెను (2). కళ్లకు బంధము కట్టబడి యున్న శిష్యుడు పుష్పములను విసరగా., అవి ఎక్కడ పడునో, అక్కడనే గురువు వానికి శివుని నామమును ఉపదేశించ వలెను (3). గురువు వానిని పూర్వమునందు వలెనే నిర్మాల్యమండలము వద్దకు తీసుకువచ్చి, ఈశానదేవుని పూజించి శివాగ్ని, యందు హోమమును చేయవలెను (4). శిష్యుడు చెడు కలను చూచియున్నచో ఆ దోషము శాంతించుట కొరకై మూలమంత్రముతో వంద, లేక ఏభై, లేక ఇరవై అయిదు ఆహుతులను ఈయవలెను (5). తరువాత శిఖకు కట్టబడిన సూత్రమును ఇదివరలో వలెనే వ్రేలాడదీసి ఆధారశక్తి పూజతో మొదలిడి నివృత్తికళకు ఆశ్రయమగు వాగీశ్వరి యొక్క పూజ వరకు హోమముతో సహా చేయవలెను. తరువాత వాగీశ్వరునకు, నివృత్తి కళను వ్యాపించియుండే సతీదేవికి నమస్కరించి, మండలమునందు దేవుని చక్కగా పూజించి, మూడు ఆహుతులను ఇచ్చి, పుత్రునివంటి శిష్యునకు ఒకేసారి సమస్తప్రాణియోనులలో జన్మ లభించినట్లు భావన చేయవలెను (6-8). తరువాత గురువు సూత్రముతో కూడియున్న శిష్యుని దేహమునందు కొట్టుట, నీటిని చల్లుట మొదలగు సంస్కారములను చేసి , ఆతని ఆత్మను తీసుకొని, పన్నెండు దళముల హృదయపద్మమునందు గల శివునకు నివేదించి, శాస్త్రములో చెప్పబడిన ముద్రను చూపి మూలమంత్రముతో అక్కడ నుండి కూడ ఆ ఆత్మ చైతన్యమును భావనారూపముగా తీసుకొని, ఒకేసారి దానికి అన్ని ప్రాణియోనులతో సంబంధమును భావన చేయవలెను (9. 10).

దేవానాం జాతయశ్చాష్టౌ తిరశ్చాం పంచ జాతయః | జాత్యైకయా చ మానుష్యాయోనయశ్చ చతుర్దశ || 11

తాసు సర్వాసు యుగపత్ర్పవేశాయ శిశోర్ధియా | వాగీశాన్యాం యథాన్యాయం శిష్యాత్మానం నివేశ##యేత్‌ || 12

గర్భనిష్పత్తయే దేవం సంపూజ్య ప్రణిపత్య చ | హుత్వా చైవ యథాన్యాయం నిష్పన్నం తదనుస్మరేత్‌ || 13

నిష్పన్నసై#్యవముత్పత్తిమనువృత్తిం చ కర్మణా | ఆర్జవం భోగనిష్పత్తిః కుర్యాత్ర్పీతిం పరాం తథా || 14

నిష్కృత్యర్థం చ జాత్యాయుర్భోగసంస్కారసిద్ధయే | హుత్వాహుతిత్రయం దేవం ప్రార్థయేద్దేశికోత్తమః || 15

భోక్తృత్వవిషయాసంగమలం తత్కాయశోధనమ్‌ | కృత్వైవమేవ శిష్యస్య ఛింద్యాత్పాశత్రయం తతః || 16

నికృత్యా పరిబద్ధస్య పాశస్యాత్యంతభేదతః | కృత్వా శిష్యస్య చైతన్యం స్వచ్ఛం మన్యేత కేవలమ్‌ || 17

హుత్వా పూర్ణాహుతిం వహ్నౌ బ్రాహ్మణం పూజయేత్తతః | హుత్వాహుతిత్రయం తసై#్మ శివాజ్ఞామనుసందిశేత్‌ || 18

పితామహ త్వయా నాస్య యాతుశ్శైవం పరం పదమ్‌ | ప్రతిబంధో విధాతవ్యశ్శైవాజ్ఞైషా గరీయసీ || 19

ఇత్యాదిశ్య తమభ్యర్చ్య విసృజ్య చ విధానతః | సమభ్యర్చ్య మహాదేవం జుహుయాదాహుతిత్రయమ్‌ || 20

దేవతల జాతులు ఎనిమిది, పశుపక్షులవి అయిదు, మనుష్యజాతి ఒకటి, వెరసి పదునాలుగు జాతులు గలవు (11). గురువు వాటిలో అన్నింటియందు ఒకే సారిగా శిష్యుని ఆత్మను భావనారూపముగా ప్రవేశ##పెట్టుట కొరకై యథాశాస్త్రముగా వాగీశ్వరీదేవియందు ప్రవేశ పెట్ట వలెను (12). ఆ గర్భము సఫలమగుట కొరకై దేవుని చక్కగా పూజించి నమస్కరించి, యథాశాస్త్రముగా ఆహుతలనిచ్చి, అది సఫలమైనట్లు భావన చేయవలెను (13). ఈ విధముగా సఫలమైన ఆ గర్భమునకు ఉత్పత్తిని, కర్మనువృత్తిని (వివిధ సేవల ద్వారా నిలబెట్టుట) , సరళత్వము (ఇబ్బందులు కలుగకుండుట), భోగము లభ్యమగుట మరియు పరమ ప్రీతి అను వాటిని భావనారూపముగా సమకూర్చ వలెను (14). ఉత్తముడగు గురువు ఆ జీవుని ఉద్ధారము కొరకు, జాతకర్మ ఆయుష్కర్మ మరియు భోగసంస్కారము అనునవి సిద్ధించుట కొరకు మూడు ఆహుతులనిచ్చి దేవుని ప్రార్థించవలెను (15). తరువాత గురువు భోక్తృత్వము మరియు విషయ భోగముల యందలి ఆసక్తి అను మాలిన్యమును పోగొట్టి , కాయశుద్ధిని చేసి, శిష్యుని మూడు పాశములను నశింప జేయవలెను (16). అజ్ఞానముచే కలిగించబడిన బంధములను పూర్తిగా నశింప జేసి, శిష్యుని చైతన్యము పూర్ణముగా స్వచ్ఛమైనదని భావన చేయవలెను (17). తరువాత అగ్నియందు పూర్ణాహుతిని చేసి బ్రహ్మను పూజించవలెను. తరువాత ఆ బ్రహ్మగారికి మూడు ఆహుతులను సమర్పించి, శివుని ఆజ్ఞను వినిపించవలెను (18). ఓ పితామహా! శివుని పరమపదమునకు వెళ్లే ఈ జీవునకు ఆటంకమును కలిగించకుము. ఇది ఉత్కృష్టమగు శివుని ఆజ్ఞ (19). అని విన్నవించి,ఆయనను పూజించి, యథావిధిగా ఉద్వాసన చెప్పి మహాదేవుని చక్కగా పూజించి, మూడు ఆహుతులను ఈయవలెను (20).

నివృత్త్యా శుద్ధముద్ధృత్య శిష్యాత్మానం యథా పురా | నివేశ్యాత్మని సూత్రేచ వాగీశం పూజయేత్తతః || 21

హుత్వాహుతిత్రయం తసై#్మ ప్రణమ్య చ విసృజ్య తమ్‌ | కుర్యాన్నివృత్తస్సంధానం ప్రతిష్ఠాకలయా సహ || 22

సంధానే యుగపత్పూజాం కృత్వా హుత్వాహుతిత్రయమ్‌ | శిష్యాత్మనః ప్రతిష్ఠాయాం ప్రవేశం త్వథ భావయేత్‌ || 23

తతః ప్రతిష్ఠామావాహ్య కృత్వా శేషం పురోదితమ్‌ | తద్వ్యాప్తిం వ్యాపికాం తస్య వాగీశానీం చ భావయేత్‌ || 24

పూర్ణేందుమండలప్రఖ్యాం కృత్వా శేషం చ పూర్వవత్‌ | విష్ణవే సంవిశేదాజ్ఞాం శివస్య పరమాత్మనః || 25

విష్ణోర్విసర్జనాద్యం చ కృత్వా శేషం చ విద్యయా | ప్రతిష్ఠామనుసంధాయ తస్యాం చాపి యథా పురా || 26

కృత్వానుచింత్య తద్వ్యాప్తిం వాగీశాం చ యథాక్రమమ్‌ | దీప్తాగ్నౌ పూర్ణహోమాంతం కృత్వా శేషం చ పూర్వవత్‌ || 27

నీలరుద్రముపస్థాప్య తసై#్మ పూజాదికం తథా | కృత్వా కర్మ శివాజ్ఞాం చ దద్యాత్పూర్వోక్తవర్త్మనా || 28

తతస్తమపి చోద్వాస్య కృత్వా తస్యాథ శాంతయే | విద్యాకలాం సమాదాయ తద్వ్యాప్తిం చావలోకయేత్‌ || 29

స్వాత్మనో వ్యాపికాం తద్వద్వాగీశీం చ యథా పురా | బాలార్కసదృశాకారాం భాసయంతీం దిశో దశ || 30

నివృత్తి కళద్వారా పరిశుద్ధమైన శిష్యుని ఆత్మను పూర్వమునందు చెప్పిన విధముగా పైకి తీసి, తన ఆత్మయందు మరియు సూత్రమునందు ఉంచి, తరువాత వాగీశ్వరుని పూజించ వలెను (21). ఆయనకు మూడు ఆహుతులను ఇచ్చి, నమస్కరించి, ఉద్వాసనను చెప్పి అక్కడనుండి మరల వచ్చి, ప్రతిష్ఠాకళతో సాన్నిధ్యమును స్థాపించుకొన వలెను (22). సంధానము కలిగిన తరువాత ఒకసారి పూజను చేసి, మూడు ఆహుతులను ఇచ్చి, తరువాత శిష్యుని ఆత్మ ప్రతిష్ఠాకళయందు ప్రవేశించినట్లు భావన చేయులెను (23). తరువాత ప్రతిష్ఠాకళను ఆవాహన చేసి, పూర్వములో చెప్పిన కర్మను అంతనూ చేసి, దాని వ్యాప్తిని, దానిని వ్యాపించియుండే, పూర్ణచంద్రునితో సమానమగు కాంతిగల వాగీశ్వరీదేవిని భావన చేయవలెను. మిగిలిన కర్మను పూర్వమునందు వలెనే చేసి , శివపరమాత్మ యొక్క ఆజ్ఞను విష్ణువునకు వినిపించవలెను (24, 25). విష్ణువునకు ఉద్వాసనను చెప్పుట మొదలగు మిగిలిన కర్మను పూర్తి చేసి, విద్యాకళతో ప్రతిష్ఠా కళను అనుసంధానము చేసి, ఆ విద్యాకళయందు కూడ పూర్వము నందు వలెనే చేసి, దాని వ్యాప్తిని మరియు వాగీశ్వరిని యథాక్రమముగా భావన చేసి, ప్రజ్వరిల్లే అగ్నియందు పూర్ణాహుతి వరకు మిగిలిన కర్మను పూర్తి చేయవలెను (26, 27). నీలరుద్రుని ప్రతిష్ఠించి, ఆయనకు పూజ మొదలగు కర్మను చేసి, పూర్వములో చెప్పిన మార్గములో శివాజ్ఞను వినిపించవలెను (28). తరువాత ఆయనకు కూడ ఉద్వాసనను చెప్పి, తరువాత శిష్యుని దోషములు శాంతించుట కొరకై విద్యాకళను స్వీకరించి దాని వ్యాప్తిని భావన చేయవలెను (29). అదే విధముగా పూర్వమునందు వలెనే తన ఆత్మను వ్యాపించునది ఉదయించే సూర్యుని పోలిన ప్రకాశము గలది, పది దిక్కులను ప్రకాశింప జేయునది అగు వాగీశ్వరిని ధ్యానించ వలెను (30).

తతశ్శేషం యథా పూర్వం కృత్వా దేవం మహేశ్వరమ్‌ | ఆవాహ్యారాధ్య హుత్వాసై#్మ శివాజ్ఞాం మనసా దిశేత్‌ || 31

మహేశ్వరం తథోత్సృజ్య కృత్వాన్యాం చ కలామిమామ్‌ | శాంత్యతీతాం కలాం నీత్వా తద్వ్యాప్తిమవలోకయేత్‌ || 32

స్వాత్మనో వ్యాపికాం తద్వాద్వాగీశాం చ విచింతయేత్‌ | నభోమండలసంకాశాం పూర్ణాంతం చాపి పూర్వవత్‌ || 33

కృత్వా శేషవిధానేన సమభ్యర్చ్య సదాశివమ్‌ | తసై#్మ సమాదిశేదాజ్ఞాం శంభోరమితకర్మణః || 34

తత్రాపి చ యథాపూర్వం శివం శిరసి పూర్వవత్‌ | సమభ్యర్చ్య చ వాగీశం ప్రణమ్య చ విసర్జయేత్‌ || 35

తతశ్శివేన సంప్రోక్ష్య శిష్యం శిరసి పూర్వవత్‌ | విలయం శాంత్యతీతాయాశ్శక్తితత్త్వే%థ చింతయేత్‌ || 36

షడధ్వనః పరే పారే సర్వాధ్వవ్యాపినీం పరామ్‌ | కోటిసూర్యప్రతీకాశాం శైవీం శక్తిం చ చింతయేత్‌ || 37

తదగ్రే శిష్యమానీయ శుద్ధస్ఫటికనిర్మలమ్‌ | ప్రక్షాల్య కర్తరీం పశ్చాచ్ఛివశాస్త్రోక్తమార్గతః || 38

కుర్యాత్తస్య శిఖాచ్ఛేదం సహ సూత్రేణ దేశికః | తతస్తాం గోమయే స్యస్య శివాగ్నౌ జుహుయాచ్ఛిఖామ్‌ || 39

వౌషడంతేన మూలేన పునః ప్రక్షాల్య కర్తరీమ్‌ | హస్తే శిష్యస్య చైతన్యం తద్దేహే వినివర్తయేత్‌ || 40

తరువాత మిగిలిన కర్మను పూర్వమునందు వలెనే చేసి, మహేశ్వర దేవుని ఆవాహన చేసి, పూజించి, ఆయనకు భావనారూపముగా శివుని ఆజ్ఞను వినిపించవలెను (31). అదే విధముగా మహేశ్వరునకు ఉద్వాసనము చెప్పి, మరియొకటి యగు శాంతి కళను శాంత్యతీతకళలోనికి తీసుకు వచ్చి, దాని వ్యాప్తిని భావన చేయవలెను (32). అదే విధముగా తన ఆత్మను వ్యాపించునది, ఆకాశమండలమును పోలియున్నది అగు వాగీశ్వరీదేవిని ధ్యానించవలెను . తరువాత పూర్ణాహూతి పూర్తియగువరకు పూర్వములో వలెనే చేసి, మిగిలిన విధానముతో సదాశివుని చక్కగా పూజించి, అనంతమగు శక్తి గల శంభుని ఆజ్ఞను ఆయనకు వినిపించవలెను (33, 34). అక్కడ కూడ పూర్వమునందు వలెనే శిష్యుని శిరస్సుపై వాగీశ్వరుని చక్కగా పూజించి, నమస్కరించి, ఉద్వాసన చెప్పవలెను (35). తరువాత పూర్వము నందు వలెనే శివనామముతో శిష్యుని శిరస్సునందు నీటిని చల్లి , శక్తితత్త్వమునందు శాంత్యతీతకళయొక్క విలీనమును ధ్యానించవలెను (36). ఆరు మార్గములకు అతీతమగు పరంబ్రహ్మయందు ఉండునది, ఆరు మార్గములను వ్యాపించి యుండునది, కోటి సూర్యులను బోలియున్నది అగు శివుని పరాశక్తిని ధ్యానించవలెను (37). శుద్ధస్ఫటికము వలె నిర్మలుడైన శిష్యుని ఆ శక్తికి యెదురుగా తీసుకు వచ్చి, కత్తెరను కడిగి, తరువాత శివశాస్త్రములో చెప్పిన మార్గముననుసరించి, గురువు వాని శిఖను సూత్రముతో సహా కత్తిరించ వలెను. తరువాత ఆ శిఖను గోమయములో నుండి ఓం నమశ్శివాయ వౌషట్‌ అను మంత్రముతో శివాగ్నియందు హోమము చేయవలెను. మరల కత్తెరను కడిగి, శిష్యుని చైతన్యమును చే తి ద్వారా ఆతని దేహములోనికి మరల ప్రవేశ పెట్టవలెను (38-40).

తతస్స్నాతం సమాచాంతం కృతస్వస్త్యయనం శిశుమ్‌ | ప్రవేశ్య మండలాభ్యాశం ప్రణిపత్య చ దండవత్‌ || 41

పూజాం కృత్వా యథాన్యాయం క్రియావైకల్యశుద్ధయే | వాచకేనైవ మంత్రేణ జుహుయాదాహుతిత్రయమ్‌ || 42

ఉపాంశూచ్చారయోగేన జుహుయాదాహుతిత్రయమ్‌ | పునస్సంపూజ్య దేవేశం మంత్రవైకల్యశుద్ధయే || 43

మానసోచ్చారయోగేన జుహుయాదాహుతిత్రయమ్‌ | తత్ర శంభుం సమారాధ్య మండలస్థం సహాంబయా |

హుత్వాహుతిత్రయం పశ్చాత్ర్పార్థయేత్ర్పాంజలిర్గురుః || 44

భగవంస్త్వత్ర్పసాదేన శుద్ధిరస్య షడధ్వనః | కృతా తస్మాత్పరం ధామ గమయైనం తవావ్యయమ్‌ || 45

ఇతి విజ్ఞాప్య దేవాయ నాడీసంధానపూర్వకమ్‌ | పూర్ణాంతం పూర్వవత్కృత్వా తతో భూతాని శోధయేత్‌ || 46

స్థిరాస్థిరే తతశ్శుద్ధ్యై శీతోష్టే చ తతః పదే | ధ్యాయేద్వ్యాపై#్త్య కతా కారే భూతశోధనకర్మణి || 47

భూతానాం గ్రంథివిచ్ఛేదం కృత్వా త్యక్త్వా సహాధిపైః | భూతాని స్థితియోగేన యోజయేత్పరమే శివే || 48

విశోధ్యాస్య తనుం దగ్ధ్వా ప్లావయిత్వా సుధాకణౖః | స్థాప్యాత్మానం తతః కుర్యాద్విశుద్ధాధ్వమయం వపుః || 49

తరువాత స్నానమును ఆచమనమును స్వస్తిపుణ్యాహవాచనమును చేసి యున్న శిష్యుని గురువు మండలము వద్దకు తీసుకు వెళ్లి, దానిలో ప్రవేశ##పెట్టి, సాష్టాంగనమస్కారమునుచేసి, యథాశాస్త్రముగా పూజను చేసి, కర్మలోపములను సరిదిద్దుట కొరకై వాచక మగు మంత్రమును మాత్రమే పైకి వినబడని విధముగా ఉచ్చరిస్తూ మూడు ఆహుతులను ఈయవలెను. ఆయన మరల దేవదేవుని చక్కగా పూజించి, మంత్రలోపములను పోగొట్టుట కొరకై ఆ మంత్రమును మనస్సులో ఉచ్చరిస్తూ మూడు ఆహుతులను ఈయవలెను. అపుడు ఆయన మండలమునందు జగన్మాతతో కూడియున్న శంభుని చక్కగా పూజించి, మూడు ఆహుతులను ఇచ్చి, తరువాత చేతులను జోడించి ప్రార్థించవలెను (41-44). ఓ భగవన్‌! నీ అనుగ్రహముచే వీనికి ఆరు మార్గముల శుద్ధి చేయబడినది. కావున, వీనిని నీయొక్క వినాశము లేని పరమధామమును పొందించుము (45). ఈ విధముగా విన్నవించి, పూర్వము నందు వలెనే నాడీ సంధానపురస్సరముగా పూర్ణాహుతితో అంతమయ్యే కర్మను చేసి, తరువాత పంచభూతములను శోధన చేయవలెను (46). భూతశుద్ధి అనే కర్మయందు పంచభూతములనే తత్త్వముల శుద్ధి కొరకై స్థిరతత్త్వమగు పృథివిని, అస్థిరతత్త్వమగు వాయువును, తరువాత చల్లదనమునకు ఆశ్రయమగు నీటిని, వేడికి ఆశ్రయమగు అగ్నిని, తరువాత వ్యాపకము మరియు నిరవయవము అగు ఆకాశమును ధ్యానించ వలెను (47). పంచభూతముల గ్రంథివిచ్ఛేదనమును చేసి (అనగా భావన ద్వారా వాటికి అతీతుడై), వాటిని వాటి అధిష్టానదేవతలతో సహా విడిచి పెట్టి, స్థితియోగము ద్వారా పరమశివునియందు ప్రవేశ పెట్టవలెను (48). ఈ విధముగా శిష్యుని శోధన చేసి భావనా రూపముగా శరీరమును దహించి, అమృత బిందువులతో తడిపి ఉజ్జీవింపజేసి, తరువాత దానియందు ఆత్మను స్థాపించి, తరువాత దేహమును విశుద్ధమగు అధ్వలతో నిండియున్న దానినిగా చేయవలెను (49).

తత్రాదౌ శాంత్యతీతాం తు వ్యాపికాం స్వాధ్వనః కలామ్‌ | శుద్ధామేవ శిశోర్మూర్ధ్ని న్యసేచ్ఛాంతిం ముఖే తథా || 50

విద్యాం గలాదినాభ్యంతం ప్రతిష్ఠాం తదధః క్రమాత్‌ | జాన్వంతం తదధో న్యస్యేన్నివృత్తిం చానుచింతయేత్‌ || 51

స్వబీజైస్సూత్రమంత్రం చ న్యస్యాంగైస్తం శివాత్మకమ్‌ | బుద్ధ్వా తం హృదయాంభోజే దేవమావాహ్య పూజయేత్‌ || 52

ఆశాస్య నిత్యసాన్నిధ్యం శివస్వాత్మ్యం శిశౌ గురుః | శివతేజోమయస్యాస్య శిశోరాసాదయేద్గుణాన్‌ || 53

అణిమాదీన్‌ ప్రసీదేతి ప్రదద్యాదాహుతిత్రయమ్‌ | తథైవ తు గుణానేవ పునరస్యోపపాదయేత్‌ || 54

సర్వజ్ఞతాం తథా తృప్తిం బోధం చాద్యంతవర్జితమ్‌ | అలుప్తశక్తిం స్వాతంత్ర్యమనంతాం శక్తిమేవ చ || 55

తతో దేవమనుజ్ఞాప్య సద్యాదికలశైస్తు తమ్‌ | అభిషించేత దేవేశం ధ్యాయన్‌ హృది యథాక్రమమ్‌ || 56

అథోపవేశ్య తం శిష్యం శివమభ్యర్చ్య పూర్వవత్‌ | లబ్ధానుజ్ఞశ్శివాచ్ఛైవీం విద్యామసై#్మ సమాదిశేత్‌ || 57

ఓంకారపూర్వికాం తత్ర సంపుటాం తు నమోం%తగామ్‌ | శివశక్తియుతాం చైవ శక్తివిద్యాం తు తాదృశీమ్‌ || 58

ఋషిం ఛందశ్చ దేవం చ శివతాం శివయోస్తథా | పూజాం సావరణాం శంభోరాసనాని చ సంది శేత్‌ || 59

పునస్సంపూజ్య దేవేశం యన్మయా సమనుష్ఠితమ్‌ | సుకృతం కురు తత్సర్వమితి విజ్ఞాపయేచ్ఛివమ్‌ || 60

సహశిష్యో గురుర్దేవం దండవత్‌ క్షితిమండలే | ప్రణమ్యోద్వా సయేత్తస్మాన్మండలాత్పావకాదపి || 61

తతస్సదసికాస్సర్వే పూజ్యాః పూజార్హకాః క్రమాత్‌ || 62

సేవ్యా విత్తానుసారేణ సదస్యాశ్చ సహర్త్విజః | విత్తశాఠ్యం న కుర్వీత యదీచ్ఛేచ్ఛివమాత్మనః || 63

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే షడధ్వ శుద్ధ్యాదికథనం నామ అష్టాదశో%ధ్యాయః (18).

వాటిలో ముందుగా అధ్వలన్నింటియందు వ్యాపించియుండే శుద్ధమగు శాంత్యతీతకళను శిష్యుని తలపై న్యాసము చేసి, అదే విధముగా శాంతికళను ముఖమునందు, విద్యాకళను కంఠమునుండి నాభి వరకు, ప్రతిష్ఠాకళను నాభి క్రింద వరుసగా మోకాళ్ల వరకు, వాటి క్రింద నివృత్తికళను న్యాసము చేసి భావన చేయవలెను (50, 51). స్వీయబీజములతో కూడియున్న సూత్రమంత్రమును న్యాసము చేసి, శిష్యుడు ఈ అంగన్యాసములచే శివస్వరూపుడైనాడని తెలుసుకొని, హృదయపద్మమునందు ఆ దేవుని ఆవాహన చేసి పూజించవలెను (52). గురువు శిష్యునకు శివుని నిత్యసన్నిధి, శివస్వరూపుడై యుండుట లభించునట్లు ఆశీర్వదించి, శివుని తేజస్సుతో నిండియున్న ఆ శిష్యునకు అణిమ (దూదివలె తేలిక యగుట) మొదలగు గుణములను ఆపాదించవలెను. ఓ శివా! ప్రసన్నుడవు కమ్ము అని పలికి మూడు ఆహుతులను ఈయవలెను. అంతే గాక, మరల శిష్యునకు సర్వజ్ఞత్వము, తృప్తి, ఆద్యంతములు లేని జ్ఞానము, లోపించని బలము, స్వాతంత్ర్యము, అనంతమగు శక్తి అనే గుణములను భావనాత్మకముగా ఆపాదించవలెను (53-55). తరువాత దేవుని అనుమతిని భావనారూపముగా పొంది ఆ దేవదేవుని హృదయములో ధ్యానిస్తూ సద్యోజాత మొదలగు కలశములలోని జలముతో క్రమముగా అభిషేకించ వలెను (56). తరువాత ఆ శిష్యుని కూర్చుండబెట్టి, పూర్వమునందు వలెనే శివుని చక్కగా పూజించి, శివుని నుండి అనుమతిని పొంది, ఈతనికి ఆదిలో ఓంకారముతో అంతములో నమః తో సంపుటితమై ఉండే శైవీ విద్యను (ఓం ఓం నమశ్శివాయ ఓం నమః ), శివశక్తులతో కూడియున్న అటువంటిదే అగు శక్తివిద్యను (ఓం ఓం నమశ్శివాయై ఓం నమః) కూడ ఉపదేశించవలెను (57, 58). ఋషిని, ఛందస్సును, దేవతను, పార్వతీపరమేశ్వరుల మంగళస్వరూపమును, ఆవరణపూజను మరియు శివుని ఆసనములను కూడ ఉపదేశించవలెను (59). మరల ఆ దేవదేవుని చక్కగా పూజించి, ఓ దేవా! నేను చేసిన కర్మను అంతను యోగ్యమైనదిగా చేయుము అని శివునకు విన్నవించుకొనవెలను (60). గురువు శిష్యునితో గూడి దేవునకు సాష్టాంగ నమస్కారమును చేసి, ఆ మహామండలమునుండి మరియు అగ్నినుండి ఉద్వాసనను చెప్పవలెను (61). తరువాత పూజకు అర్హులగుసభాసదులను అందరినీ వరుసగా పూజించి (62), తన ఆర్థికస్థితిని బట్టి సభాసదులకు మరియు ఋత్విక్కులకు సేవను చేయవలెను. తనకు మంగళమును కోరు సాధకుడు ఈ విషయములో లౌభ్యమును చూపరాదు (63).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితమందు ఉత్తరఖండలో తత్త్వశోధనను, కళాస్వరూపమును వర్ణించే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).

Siva Maha Puranam-4    Chapters