Siva Maha Puranam-4    Chapters   

అథ ఏకోనవింశో%ధ్యాయః

పంచాక్షరీ మంత్ర పురశ్చరణము

ఉపమన్యురువాచ |

అతః పరం ప్రవక్ష్యామి సాధకం నామ నామతః | సంస్కారమంత్రమహాత్య్మం కథనే సూచితం మయా || 1

సంపూజ్య మండలే దేవం స్థాప్య కుంభే చ పూర్వవత్‌ | హుత్వా శిష్యమనుష్ణీషం ప్రాపయేద్భువి మండలే || 2

పూర్ణాంతం పూర్వవత్కృత్వా హుత్వా హుతిశతం తథా | సంతర్ప్య మూలమంత్రేణ కలశైర్దేశికోత్తమః || 3

సందీప్య చ యథాపూర్వం కృత్వా పూర్వోదితం క్రమాత్‌ | అభిషిచ్య యథాపూర్వం ప్రదద్యాన్మంత్రముత్తమమ్‌ || 4

తత్ర విద్యోపదేశాంతం కృత్వా విస్తరశః క్రమాత్‌ | పుష్పాంబునా శిశోః పాణౌ విద్యాం శైవీం సమర్పయేత్‌ || 5

తవైహికాముష్మికయోస్సర్వసిద్ధిఫలప్రదః | భవత్యేవ మహామంత్రః ప్రసాదాత్పరమేష్ఠినః || 6

ఇత్యుక్త్వా దేవమభ్యర్చ్య లబ్ధానుజ్ఞశ్శివాద్గురుః | సాధనం శివయోగం చ సాధకాయ సమాది శేత్‌ || 7

తచ్ఛ్రుత్వా గురుసందేశం క్రమశో మంత్రసాధకః | పురతో వినియోగస్య మంత్రసాధనమాచరేత్‌ || 8

సాధనం మూలమంత్రస్య పురశ్చరణముచ్యతే | పురతశ్చరణీయత్వాద్వినియోగాఖ్యకర్మణః || 9

నాత్యంతం కరణీయం తు ముముక్షోర్మంత్రసాధనమ్‌ | కృతం తు తదిహాన్యత్ర తస్యాపి శుభదం భ##వేత్‌ || 10

ఉపమన్యువు ఇట్లు చెప్పెను -

నేను ఈ పైన ఇంతకు ముందు చెప్పిన దానిలో సూచించిన సాధకుని స్వరూపమును, సంస్కారమంత్రమహాత్మ్యమును చెప్పెదను (1). పూర్వములో చెప్పిన విధముగానే మండలమునందు కలశములో దేవుని ప్రతిష్ఠించి చక్కగా పూజించి, హోమమును చేసి, తలపాగా లేకుండగా శిష్యుని మండలములో నేలపై కూర్చుండబెట్ట వలెను (2). ఉత్తముడగు గురువు ఇంతకు ముందు చెప్పిన విధముగా పూర్ణాహుతి పూర్తియగువరకు చేసి, వంద ఆహుతులను హోమము చేసి, మూలమంత్రమును ఉచ్చరిస్తూ కలశములతో తర్పణమును చేసి, పూర్వమునందు వలెనే క్రమబద్ధముగా దీపమూర్తులను ప్రకాశింపజేసి, ఇదివరలో చేసినట్లు గనే అభిషేకమును చేసి, ఉత్తమమగు మంత్రమును ఈయవలెను (3, 4). ఆ స్థానములో (శైవీ) విద్యోపదేశము పూర్తి యగువరకు విస్తారముగా కర్మను చేసి, పుష్పములతో కూడిన నీటితో శిష్యుని చేతిలో శైవీవిద్యను సమర్పించవలెను (5). పరమేశ్వరుని అనుగ్రహముచే మహామంత్రము నీకు ఇహపరలోకములలో సకల సిద్ధులను మరియు ఫలములను ఇచ్చి తీరును (6). అని పలికి, గురువు దేవుని చక్కగా పూజించి, శివుని నుండి అనుమతిని పొంది సాధకునకు సాధనమును, శివయోగమును ఉపదేశించవలెను (7). క్రమముగా మంత్రసిద్ధిని గోరు ఆ సాధకుడు ఆ గురుసందేశమును విని ఆయన యెదుటనే వినియోగముయొక్క మంత్రసాధనను చేయవలెను (8). మూలమంత్రముయొక్క సాధనకు పురశ్చరణము అని పేరు. ఏలయనగా, వినియోగము అనబడే ఈ కర్మను అన్నింటికంటెముందుగా చేయవలెను (9). ముముక్షువు మంత్రసాధనకు పురశ్చరణను మించి అదే పనిగా చేయనక్కరలేదు (జ్ఞానసాధనకు అడ్డు కారాదని అభిప్రాయము). చేసినంతవరకు అది వానికి ఇహపరలోకములలో శుభమును కలిగించును (10).

శుభే%హని శుభే దేశే కాలే వా దోషవర్జితే | శుక్లదంతనఖస్స్నాతః కృతాపూర్వాహ్ణికక్రియః || 11

అలంకృత్య యథా లబ్ధైర్గంధమాల్య విభూషణౖః | సోష్ణీషస్సోత్తరాసంగస్సర్వ శుక్లస్సమాహితః || 12

దేవాలయే గృహే%న్యస్మిన్‌ దేశే వా సుమనోహరే | సుఖేనాభ్యస్తపూర్వేణ త్వాసనేన కృతాసనః || 13

తనుం కృత్వాత్మనశ్శైవీం శివశాస్త్రోక్తవర్త్మనా | సంపూజ్య దేవదేవేశం నకులీశ్వరమీశ్వరమ్‌ || 14

నివేద్య పాయనం తసై#్మ సమాప్యారాధనం క్రమాత్‌ | ప్రణిపత్య చ తం దేవం ప్రాప్తానుజ్ఞశ్చ తన్ముఖాత్‌ || 15

కోటివారం తదర్ధం వా తదర్ధం వా జపేచ్ఛివమ్‌ | లక్షవింశతికం వాపి దశలక్షమథాపి వా || 16

తతశ్చ పాయసాక్షారలవణౖకమితాశనః | అహింసకః క్షమీ శాంతో దాంతశ్చైవ సదా భ##వేత్‌ || 17

అలాభే పాయసస్యాశ్నన్‌ ఫలమూలాదికాని వా | విహితాని శివేనైవ విశిష్టాన్యుత్తరోత్తరమ్‌ || 18

చరుం భక్ష్య మథో సక్తుకణాన్యావకమేవ చ | శాకం పయో దధి ఘృతం మూలం ఫలమథోదకమ్‌ || 19

అభిమంత్ర్య చ మంత్రేణ భక్ష్యభోజ్యాదికాని చ | సాధమే%స్మిన్‌ విశేషేణ నిత్యం భుంజీత వాగ్యతః || 20

శుభదినమునాడు శుభస్థానమునందు దోషములు లేని సమయములో స్వచ్ఛమైన దంతములు మరియు గోళ్లు గలవాడై, స్నానమును చేసి, ఉదయకాలీనములగు నిత్యకర్మలను పూర్తి చేసుకొని (11), లభించినంత వరకు గంధము, పుష్పమాలలు, అభరణములు అనువాటితో అలంకరించుకొని, తలపాగా కట్టుకొని, ఉత్తరీయమును కప్పుకొన వలెను. ఇవి అన్నియు తెల్లని వస్త్రములై యుండవలెను. ఆతడు ఏకాగ్రమగు చిత్తము గలవాడై (12), దేవాలయమునందు గాని, ఇంటియందు గాని, లేదా మరియొక మిక్కిలి అందమగు స్థానమునందు గాని తనకు అలవాటైన పద్ధతిలో సుఖకరమగు ఆసనమునందు కూర్చుండి (13), శివశాస్త్రములో చెప్పిన విధముగా తన దేహమును శివమయముగా చేసుకొని,దేవదేవుడు సర్వజగన్నియంత అగు నకులీశ్వరుని చక్కగా పూజించి (14), ఆయనకు పాయసమును నైవేద్యము పెట్టి, క్రమముగ పూజావిధానమును ముగించి, ఆ దేవునకు ప్రణమిల్లి, సాక్షాత్తుగా ఆయననుండి అనుమతిని పొంది (15), కోటి, ఏభై లక్షలు, ఇరవై అయిదు, లక్షలు, ఇరవై లక్షలు లేదా పది లక్షలు శివమంత్రమును జపించవలెను (16). ఆ తరువాత పాయసమును, వగరు ఉప్పు లేని మరియొక పదార్థమును మితముగా భుజిస్తూ, హింసను చేయకుండగా, మనోనియంత్రణ గలవాడై, సర్వదా ఇంద్రియజయము గలవాడై ఉండవలెను (17). పాయసము దొరకనిచో పళ్లు, దుంపలు మొదలగు వాటిని భుజించ వలెను. ఈ క్రింది పదార్థములను శివుడే స్వయముగా విధించినాడు. వాటిలో ముందు చెప్పిన దాని కంటె దాని తరువాతది శ్రేష్ఠతరము అగును (18). వండిన అన్నమును భక్షించుట మొదటి పక్షము. పిండి కణములు రెండవది. బార్లీ అన్నము, కూరలు, పాలు, పెరుగు, నెయ్యి దుంప పండు, నీరు అనునవి అభక్ష్యములు (19). భక్ష్యములు, భోజ్యములు అగు ఆ పదార్థములపై మంత్రముతో నీటిని చల్లి, సాధకుడు ప్రత్యేకించి ఈ సాధనసమయములో ప్రతినిత్యము వీలైనంత మౌనముగా భుజించవలెను (20).

మంత్రాష్టశతపూతేన జలేన శుచినా వ్రతీ | స్నాయాన్నదీనదోత్థేన ప్రోక్షయే ద్వాథ శక్తితః || 21

తర్పయేచ్చ తథా నిత్య జుహుయాచ్చ శివానలే | సప్తభిః పంచభిర్ద్రవ్యైస్త్రిభిర్వాథ ఘృతేన వా || 22

ఇత్థం భక్త్యా శివం శైవో యస్సాధయతి సాధకః | తస్యేహాముత్ర దుష్ప్రాపం న కించిదపి విద్యతే || 23

అథవాహరహర్మంత్రం జపేదేకాగ్రమానసః | అనశ్నన్నేవ సాహస్రం వినా మంత్రస్య సాధనమ్‌ || 24

న తస్య దుర్లభం కించిన్న తస్యాస్త్యశుభం క్వచిత్‌ | ఇహ విద్యాం శ్రియం సౌఖ్యం లభ్ద్వా ముక్తిం చ విందతి || 25

సాధనే వినియోగే చ నిత్యే నైమిత్తికే తథా | జపేజ్జలైర్భస్మనా చ స్నాత్వా మంత్రేణ చ క్రమాత్‌ || 26

శుచిర్బద్ధశిఖస్సూత్రీ సపవిత్రకరస్తథా | ధృతత్రిపుండ్రరుద్రాక్షో విద్యాం పంచాక్షరీం జపేత్‌ || 27

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం పంచాక్షరీ మంత్ర పురశ్చరణవర్ణనం నామ ఏకోనవింశో%ధ్యాయః (19).

పురశ్చరణ వ్రతములోనున్న సాధకుడు నూట యెనిమిది సార్లు చేసిన మంత్రజపముచే పవిత్రము చేయబడినది, స్వచ్ఛమైనది, గంగ మొదలగు నదినుండి గాని సింధు మొదలగు నదము నుండి గాని తెచ్చినది అగు నీటితో స్నానమును చేయవలెను. స్నానమును చేయుటకు సమస్య ఉన్నచో, శక్తిని బట్టి ఆ నీటిని దేహముపైచల్లుకొనవలెను (21). అదే విధముగా ప్రతి దినము తర్పణములను చేసి, శివస్వరూపమగు అగ్నియందు ఏడు, అయిదు, లేదా మూడు ద్రవ్యముల కలయిక అగు హవిస్సుతో గాని, లేదా నేతితో గాని హోమమును చేయవలెను (22). శివభక్తుడగు ఏ సాధకుడు ఈ విధముగా భక్తితో శివుని ఆరాధించునో, వానికి ఇహపరలోకములలో పొంద శక్యము కానిది ఏదీ ఉండదు (23). పైన చెప్పిన జపమునకు మరియొక వికల్పము గలదు. సాధకుడు ఏకాగ్రమగు మనస్సు గల వాడై ప్రతిదినము భోజనమును చేయుటకు ముందే మంత్రమును వేయి సార్లు జపించ వలెను. మంత్రసాధనను చేయకున్ననూ (24), ఈ విధముగా చేయువానికి లభించ శక్యము కానిది ఏదీ ఉండదు. వానికి ఎప్పుడైననూ అశుభము లేదు. అతడు ఇహలోకములో విద్యను, సంపదను, సౌఖ్యమును పొంది, ముక్తిని కూడ పొందును (25). సాధనయందు, వినియోగమునందు మరియు నిత్య నైమిత్తిక కర్మలయందు మంత్రమును జపించవలెను. సాధకుడు క్రమముగా నీటితో, భస్మతో మరియు మంత్రముతో స్నానమును చేసి (26), శుచియై శిఖను ముడి వేసుకొ%ి, సూత్రమును ధరించి , చేతికి పవిత్రమును కట్టుకొని, త్రిపుండ్రమును రుద్రాక్షలను ధరించి, పంచాక్షరీమంత్రమును జపించవలెను (27).

శ్రీ శివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో పంచాక్షరీ మంత్ర పురశ్చరణ పద్ధతిని వర్ణించే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).

Siva Maha Puranam-4    Chapters