Siva Maha Puranam-4    Chapters   

శ్రీః

శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతము

శ్రీ శివ మహా పురాణము

ఆంధ్రానువాద సహితము

(చతుర్థ సంపుటము)

అనువాదకులు :

స్వామి తత్త్వవిదానంద సరస్వతి

బ్రహ్మవిద్యా కుటీర్‌

1- 3 - 93, పాత అల్వాల్‌,

సికింద్రాబాద్‌.

ప్రకాశకులు :

శ్రీ వేంకటేశ్వర ఆర్ష భారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాదు - 500 020.

సర్వస్వామ్యములు ప్రకాశకులవి.

ప్రథమ ముద్రణము : 2001

ప్రతులు : 1000 మూల్యము : రూ. 100.00

ఇంటింట దేవతా మందిరములందు పూజింపవలసినవి,

ఆడపడుచులు అత్తవారింటికి వెళ్లునపుడు సారె పెట్టవలసినవి,

ఆచంద్రార్కము మనుమల మునిమనుమల ఆయురారోగ్య భాగ్య సౌభాగ్య

సమృద్ధికి ధర్మము ధనము భోగము మోక్షము కోరి చదివి చదివించి

విని వినిపించవలసినవి, వేద వేదాంత రహస్య సుబోధకములైనవి,

వ్యాసప్రోక్త అష్టాదశ (18) మహాపురాణములు.

వానిని సంస్కృతమూల - సరళాంధ్రానువాద - పరిశోధనలతో

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముద్రించి

అందించుచున్నది.

 

ప్రతులకు : ముద్రణ :

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ఇమేజ్‌ ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌,

గురుకృప హిమాయత్‌నగర్‌,

1-10-140/1, అశోక్‌ నగర్‌, హైదరాబాదు -29

హైదరాబాదు - 500 020. ఫోన్‌ : 3223645

శ్రీ గణశాయ నమః

ఆముఖము

పరమపూజనీయ బ్రహ్మ విద్యాచార్య శ్రీశ్రీశ్రీ స్వామి దయానంద సరస్వతీ మహారాజుల కృపాదృష్టి నాపై ప్రసరించుటచే, డా.రాణి రామకృష్ణగా ఉండిన నేను స్వామి తత్త్వవిదానంద సరస్వతిని అయితిని. నేను బాల్యములో రాష్ట్రపతి సమ్మాన గ్రహీతలు, అభినవ పాణిని అగు కొంపెల్ల సుబ్బరాయశాస్త్రి గారి వద్ద, మా నాయన గారు రాష్ట్రపతి సమ్మానగ్రహీత వేదాంతశిరోమణి బ్రహ్మశ్రీ రాణి నరసింహ శాస్త్రి గారి వద్ద నేరుచుకొన్న సంస్కృతము శివపురాణమును తెనిగించే ఈ బృహత్కార్యములో అక్కరకు వచ్చినది. ప్రాతస్స్మరణీయులగు వీరికి నా సాష్టాంగ ప్రణామములు.

పురాణ వాఙ్మయము చాల పెద్దదిగా నుండుట మాత్రమే గాక, అనేకములగు ప్రక్షిప్త భాగములతో కలిసిపోయి, ఏకవాక్యత కరువై, చాల గజిబిజిగా నున్నది. దీనికి తోడు వ్రాత ప్రతులలో లేఖక దోషములు, ముద్రణలో తప్పులు పెద్ద సంఖ్యలో వచ్చి చేరినవి. ఈ గడ్డు పరిస్థితిలో శివమహాపురాణమను పేరిట లభ్యమయ్యే బృహద్గ్రంథమును ప్రామాణికముగా తెనుగు చేయుట చాల ప్రయాసతో కూడిన పని. నేను సుమారు 5 సంవత్సరములు ఈ కార్యక్రమములో తలమున్కలుగా మునిగియుంటిని. గ్రంథములోని కొన్ని భాగములు అనేకములగు శబ్ద దోషములతో కొరకరాని కొయ్యలుగా నున్నవి. శ్లోకములో క్రియతో అన్వయించని పదములు గాలిలో వ్రేలాడుతూ అనువాదకుని సామర్ధ్యమును అవహేళన చేసే సందర్భములు కోకొల్లలుగా నున్నవి. పూర్వాపర సందర్భములను బట్టి కొన్ని దోషములను సరిదిద్దుట సంభ##మే అయినా, చాల చోట్ల పరిస్థితి సవరణకు అతీతముగా నున్నది. ఇట్టి సందర్భములలో 'స్థితస్య గతిశ్చింతనీయా' అను న్యాయముననుసరించి, తాత్పర్యమును చేతనైనంత సావధానతతో ఊహించి తెనిగించడమైనది.ఇట్టి స్థితిలో నేను కొన్ని చోట్ల సరిగా ఊహించ లేకపోవుట, దోషమును కనిపెట్టి దిద్దకపోవుట సంభవమే. పండితులు అట్టి సందర్భములను గమనించినచో, నాకు తెలుపుడు చేయగలరని మనవి. రెండవ ముద్రణలో అట్టి భాగములను మార్పు చేయుటకు యత్నించగలవాడను.

ఆస్తికవరేణ్యులగు శ్రీ పి. వెంకటేశ్వర్లు గారు ఈ గ్రంథమును ముద్రించిరి. మిత్రులు శ్రీ జొన్నలగడ్డ అన్నప్ప శాస్త్రి గారు ముద్రణ బాధ్యతను సమర్థవంతముగా నిర్వహించిరి. వారికి నా కృతజ్ఞతలు. భారత దేశములో మాత్రమే గాక, ఇతర దేశములలో కూడ శివభక్తి వ్యాప్తమగుటలో ఈ గ్రంథము దోహదము చేయు గాక అని ఆ పరమేశ్వరుని ప్రార్థించుచున్నాను.

భాగ్యనగరము ఇట్లు, బుధ జన విధేయుడు

24.9.2001. స్వామి తత్త్వవిదానంద సరస్వతి

శ్రీః

ఉపోద్ఘాతము

శ్రీ శివమహాపురాణం దాదాపు 26,000 శ్లోకాల గ్రంథం. దీనిలో ఏడు సంహితలు ఉన్నాయి. మొదటి సంహిత విద్యేశ్వర సంహిత. దీనిలో 25 అధ్యాయాలు ఉన్నాయి. రెండవదైన రుద్రసంహిత - సృష్టిఖండం, సతీఖండం, పార్వతీ ఖండం, కుమారఖండం, యుద్ధఖండం అనే ఐదు ఖండాలుగా విభక్తమై ఉన్నది. ఈ ఖండాలలో వరుసగా 20, 43, 55, 20, 59 అధ్యాయాలున్నాయి. శతరుద్రసంహిత అనే మూడవ సంహితలో 42 అధ్యాయాలు, నాల్గవదైన కోటిరుద్రసంహితలో 43 అధ్యాయాలు, ఐదవదైన ఉమాసంహితలో 51 అధ్యాయాలు, ఆరవదైన కైలాస సంహితలో 23 అధ్యాయాలు ఉన్నాయి. రెండు భాగాలుగా విభక్తమైన వాయవీయసంహితలో వరుసగా 35, 41 అధ్యాయాలు ఉన్నాయి. శైవదార్శనిక సిద్ధాంతాలు, అనేక ఉపాఖ్యానాలు, తత్తద్దేవతారాధనవిధానాలు అతివిస్తృతంగా వర్ణింపబడి ఉన్న ఈ మహాపురాణం శైవసంప్రదాయానికి సంబంధించిన విజ్ఞానసర్వస్వం అని చెప్పవచ్చును.

శ్రీ స్వామి తత్త్వవిదానందసరస్వతి రచించిన ఆంధ్రానువాదంతో ఈ మహాపురాణం తృతీయ సంపుటం పఠితలకు అందజేస్తూన్నందుకు సంతోషిస్తున్నాము. పూర్వాశ్రమంలో డా|| రాణి రామకృష్ణ అనే పేరుతో ప్రసిద్ధులైన అనువాదకులు భారతీయ సంస్కృతి ప్రచారబద్ధ దీక్షులు. చిన్నతనంలో వేదాధ్యయనం చేసి రసాయనశాస్త్రంలో యమ్‌.యస్‌. సి., పిహేడ్‌. డి. పట్టాలు, సంస్కృతంలో యమ్‌. ఏ., పిహెడ్‌.డి. పట్టాలు తీసికొని అటు వైజ్ఞానిక రంగంలోను ఇటు భారతీయ సాంస్కృతిక రంగంలోను నిరుపమానమైన ప్రజ్ఞ సంపాదించినవారు. ఈ పురాణానికి ప్రామాణికమైన చక్కని అనువాదం అందజేసినందుకు వారికి కృతజ్ఞతలు.

శ్రీ వెంకటేశ్వర ఆర్ష భారతీ ట్రస్టు

 

Siva Maha Puranam-4    Chapters