Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రిసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

షోడశమహాదానాను కీర్తన ప్రారమ్భః.

ఋషయః : న్యాయోపార్జన మర్థానాం వర్ధనం చాబిరక్షణమ్‌| సత్పాత్రప్రతిపత్తిస్చ సర్వశాస్త్రేషు పఠ్యతే. 1

కృతకృత్యో భ##వే త్కేన మనస్వీ ధనవా న్బుధః| మహాదానేన దత్తేన తన్నో విస్తరతో వద. 2

సూతః : అథాత స్సపమ్ప్రవక్ష్యామి మహాదానానుకీర్తనమ్‌| దానధర్మే 7పి యన్నోక్తం విష్ణునా ప్రభవిష్ణునా. 3

తదహం సమ్ప్రవక్ష్యామి మహాదాన మనుత్తమ్‌| సర్వపాపక్షయకరం నృణాం దుస్స్వప్ననాశనమ్‌. 4

యత్త త్షోడశథా ప్రోక్తం వాసుదేవేన భూతలే | పుణ్యం పవిత్ర మాయుష్యం సద్యః పాపహరం పరమ్‌.5

పూజితం దేవతాభిశ్చ బ్రహ్మవిష్ణుశివాదిభిః| ఆద్యస్తు సర్వదానానాం తులాపురుషసంజ్ఞకమ్‌. 6

హిరణ్య గర్భదానం చ బ్రహ్మాణ్డం తదనన్తరమ్‌| కల్పపాదపదానంచ గోసహస్రంతు పఞ్చమమ్‌. 7

హిరణ్య కామ ధేనుస్చ హిరణ్యాశ్వ స్తథైవచ| హిరణ్యాశ్వరథ స్తద్వ ద్దేమహస్తి రథ స్తథా. 8

పఞ్చలాఙ్గలకం తద్వద్ధం రాదానం తథైవచ| ద్వాదశం విశ్వ చక్రం చ తతః కల్పలతాత్మకమ్‌. 9

సప్త సాగర దానం చ రత్నధేను స్తథైవచ| మహాభూతఘట స్తద్వ త్షోడశం పరికీర్తితమ్‌. 10

సర్వాణ్యతాని కృతవా న్పురా శమ్బరసూదనః| వాసుదేవశ్చ ఙగవా సమ్భరీషశ్చ భార్గవః. 11

కార్తవీర్యార్జునో నామ ప్రహ్లాదః పృథురేవచ| కుర్యు రన్యే మహీపాలాః కేచిచ్చ భరతాదయః. 12

యస్మా ద్విఘ్నసహస్రేణ మహాదానాని సర్వదా| రక్షన్తే దేవతా స్సర్వా ఏకైకమపి భూతలే. 13

ఏషా మన్యతమం కుర్యా ద్వాసుదేవ ప్రసాదతః| న శక్య మన్యథా కర్తు మపి శ##క్రేణ భూతలే. 14

తస్మా దారాధ్య గోవిన్ద ముమాపతి వినాయకౌ| మహాదానమకం కుర్యా ద్విపై#్రశ్చైవాసుమోదితః. 15

ఏతావదేవ మనునా పరిపృష్టో జనార్ధనః| యథావ దనువక్ష్యామి శృణుధ్వ మృషిసత్తమాః. 16

మహాదానాని యానీహ పవిత్రాణి శుభానిచ | రహస్యాని ప్రదేయాని తాని మే కథయాచ్యుత.17

రెండు వందల డెబ్బది మూడవ అద్యాయము.

షోడశ మహాదానాను కీర్తనారంభము- తులాపురుష దానవిధానము

ఋషులు సూతునితో ఇట్లు పలికిరి: సూతా! ధనములను న్యాయ మార్గమున అర్జించుటయు వృద్ధి చేయుటయు అభిరక్షము సేయుటయు సత్పాత్రమునందు దానము సేయుటయు సర్వ శాస్త్రములయందును చెప్పబడినట్లు అధ్యయనము చేయుచు న్నాము. ఏ మహాదానమును ఇచ్చినచో వివేకియగు నరుడు తాను ధనవంతుడైనందులకు కృత కృత్యతనంది మానవంతుడగును? అది మాకు విస్తరించి చెప్పుము. అన సూతుడిట్లు చెప్పెను; ఇట్టి జిజ్ఞాస గలవారు గావున మీకు ఇపుడు మహాదానములను అనుక్రమమున కీర్తించుచు పేర్కొందును. అనేక విధములగు ధర్మ కర్మములందు ఒకటియగు దానాతమక ధర్మ ప్రకరణమందు మహాసమర్థుడును లోకకర్తయునగు విష్ణువునకు మాకు ప్రవచించిన (ఇచట 'యద్‌ -నః- ఉక్తం- యన్నోక్తం' అని ఆర్ష సంధి ; 'న- ఉక్తం 'అని పొరపడవలదు). సర్వోత్తమముగు మహాదాన (సముదాయ) మును మీకు తెలిపెదను. అది నరులకు సర్వపారక్షయకరము; దుఃస్వప్ననాశము; ఇది ఈ భూతలమున పదునారు విధములుగా నున్నదని వాసుదేవుడే చెప్పెను; ఇది పుణ్య కరము పవిత్రము ఆయుష్యప్రదము సద్యః పాపహరము ఉత్తమము; బ్రహ్మ విష్ణు శివాది దేవతలచేతను పూజితము; వరుసగా ఇవి 1. తులాపురుషదానము2. హిరణ్య గర్భదానము 3. బ్రహ్మాండ దానము; 4, కల్పపాదవ (వృక్ష) దానము; 5. గోసహస్రదానము; 6. హిరిణ్య కామదేను దానము; 7. హిరణ్యాశ్వదానము 8. హరిణ్యాశ్వరథా దానము; 9. హిరణ్య గజరథ దానము; 10. పంచలాంగల దానము; 11. ధరాదానము; 12. విశ్వచక్రదానము; 13. కల్పలతాదానము ; 14. సప్త సాగరదానము; 15. రత్న ధేనుదానము; 16. మహాభూతఘటదానము;

పూర్వము మన్మథుడును వాసుదేవ భగవానుడును అంబరీషుడును భార్గవుడును కార్తవీర్యార్జునుడును ప్రహ్లాదుడును పృథుడును భరతుడు మొదలగు మరి ఇతర రాజులును ఈ మహా దానములను ఆచరించియుండిరి. దేవతలీ మహాదానములను సర్వదా వేలకొలది విగ్నములతో కాపాడుచుందురు; వాసుదేవుని యనుగ్రహమున్న విషయములను అన్యథాకరించుట ఈ భూతలమునందు ఇంద్రునకై శక్యముకాదు కావున గోవిందుని ఉమాపతిని వినాయకుని ఆరాధించి విప్రుల యనుమతిని కూడ పొంది ఆ మహా దాన యజ్ఞమాచరించవలయును; ఇంతమాత్రపు విషయమునే మనువు మత్స్య రూప జనార్ధనునడిగెను; ఆ విషయము జరిగినది జరిగినట్లు అనువచింతును; ఋషి సత్తములారా; వినుడు; మనువు ఇట్లడిగెను; అచ్యుతా! పవిత్రములును రహస్యములును శుభకరములనునగు ఏయే దానములాచరించదగినవి యున్నవో చెప్పుము; అనగా మత్స్యుడిట్లు చెప్పెను.

తులాపురుషవిధానమ్‌.

శ్రీ మత్స్యః : నోక్తాని యాని గుహ్యాని మహాదానాని షోడశ| తాని తే సమ్ప్రవక్ష్యామి యథావ దనుపూర్వశః. 18

తులాపురుష యోగో 7యం యేషా మాదౌ విధీయతే| ఆయనే విఘవే పుణ్య వ్యతీపాతే దినక్షయే. 19

యుగాదిషూపరాగేషు తథా మన్వన్తరాదిషు| సఙ్క్రాన్తౌ వైధృతిదినే చతుర్దశ్యష్టమీషుచ. 20

సితపంచదశీ పర్వ ద్వాద శీష్వష్టకాసుచ| యజ్ఞోత్సవవివాహేషు దుస్స్వప్నాద్భుతదర్సనే. 21

ద్రవ్య బ్రహ్మణలాభే వా శ్రద్ధా వా యత్రజాయతే| తీర్థేష్వా యతనే గోష్ఠే కూపారమసరిత్సుచ. 22

గృహే వాయతనే వా 7పి తటాకే రుచిరేపి వా| మహాదానాని దేయాని సంసారభయభీరుణా. 23

అనిత్యం జీవితం యస్మా ద్వసు చాతీవ చఞ్చలమ్‌| కేశేష్వేవ గృహీత స్స స్మృత్యునా ధర్మ మాచరేత్‌. 24

పుణ్యాం తిథి మథాసాద్య కత్వా బ్రాహ్మణవాచనమ్‌| షోడసారత్నిమాత్రంతు దశ ద్వాదశ వా కరా &. 25

మణ్డపం కారయే ద్విద్వాంశ్చతుర్భద్రాసనం బుధః| సప్తహస్తా భ##వేద్వేదీ మధ్యే పఞ్చకరా 7థవా. 26

తన్మధ్యే తోరణం కృత్వా సారదారుమయం బుధః| కుర్యా త్కుణ్డాని చత్వారి చతుర్దిక్షు విచక్షణః. 27

సమేఖలాయోనియుతాని కుర్యా త్తసమ్పూర్ణకుమ్బాని సహాసనాని| సుతామ్రపాత్రద్వయ.సంయుతాని సయజ్ఞపాత్రాణి సువిష్టరాణి. 28

హస్త ప్రమాణాని తిలాజ్యధూపపుష్పోపహారాణి సుశోభనాని| పూర్తోత్తరే హస్త మితా చ వేదీ గ్రహాదిదేవేశ్రపూజనాయ. 29

అథార్చనం బ్రహ్మశివాచ్యుతానాం తత్రైవ కార్యం ఫలమాల్యవసై#్త్రః| లోకేశవర్ణాః పరితః పతాకా మధ్యే ధ్వజః కిఙ్కిణికాయు స్స్యాత్‌. 30

ద్వారేషు కార్యాణిచ తోరణాని చత్వారిచ క్షీరవసస్పతీనామ్‌| ద్వారేషు కుమ్బద్వయం మత్ర కార్యం స్రగ్గన్దధూపామ్భరరత్నయుక్తమ్‌. 31

శాలేఙ్గుదీచన్దనదేవదారు శ్రీపర్ణిబిల్వా మ్రకదమ్బకోత్థమ్‌| స్తమ్భద్వయం హస్తయుగాభిఖాతం కృత్వా దృఢం పఞ్చకరోచ్ఛ్రితం చ. 32

తదన్తరం హస్త చతుష్టయం స్యా దథోరఙ్గశ్చ తదఙ్గమేవ|

గుహ్యములగు ఏ మహాదానములను పదునారింటిని ఇదివరకు ఎవరును ఎవరికిని గాని నేను నీకును గాని చెప్పి యుండలేదో అవి కల్పమున ఉన్నవియున్నట్లు అనుపూర్వితో (క్రమానుసారముగా) చెప్పెదను; వీని యన్నిటిలోను మొదటిదిగా శాస్త్రమును విధింపబడినది తులాపురుష దానము.

తులా పురుష విధానము.

ఆయనము విషువము వ్యతీపాతము దినక్షయము యుగాదిదినము గ్రహణదినము మనవ్వంతరాదిదినము రవి సంక్రాంతిదినము వైధృతియోగము దినము చతుర్దశీ అష్టమీ శుక్ల పంచదసీ (పూర్ణిమా) పర్వదినము ద్వాదశీ అష్టకా యజ్ఞములు ఉత్సవములు వివాహాది శుభకార్యములు- దుస్స్వప్నములు- అద్భుతములు కనబడుట ద్రవ్యము లభించుట తగిన బ్రహ్మణులు లభించుట శ్రద్ధ కలుగుట- ఇట్టి సమయములందును తీర్థములు క్షేత్రములు గోష్ఠములు ఆపామములు నదులు గృహము దేవాలయములు తటాకములు మనోహర ప్రదేశములు- ఇటువంటి ప్రదేశములందును సంసారపు వలనుండి భయపడు వారేవరయినను ఈ మహాదానములను ఈయవచ్చును; ఏలయన జీవితము అనిత్యము; ధనమతిచంచలము; మృత్యులు కేశములయందు పట్టుకొనియే ఎల్లప్పుడు ను సిద్ధమయియున్నదన్నట్లుగానే మానవుడు ధర్మమాచరించవలయును.

పుణ్య (శుభ) కరమగు తిథినాజు బ్రాహ్మణులచే స్వస్తి పుణాయాహవాచనము జరిపించవలయును; పదునారు పిడిమూరల పొడవును పదికాని పండ్రెండు కాని మూరల వెడల్పును కల దీర్ఘచతురస్రాకృతి మండపమును నిర్మింపజేయవలయును; అందు నాలుగు శుభాసనములమర్చవలెను; దాని నడుమ నుండునట్లు తోరణ (ప్రధాన ద్వార) మును దృఢమగు దారువుతో చేయించవలెను; నాలుగు దిక్కులందును నాలుగు కుండములును వానికి చుట్టును మేఖలలును (అంచు కట్టలును) యోనులును (ఇది లోగడ చెప్పబడినది) పూర్ణ కుంభములతో ఆసనములతో కూడ నిర్మించవలెను; అచటనే ప్రతి కుండముకడను రెండేసి తామ్ర పాత్రములును స్రుక్స్రువాజ్యస్థాలీ ప్రభృతి యజ్ఞ పాత్రములును మూరెడు చదరపు విష్టరములును (దర్భాసనములో అజినములో) ఉండవలయును; తిలలు ఆజ్యము ధూప సామగ్రియు శోభన పుష్పోరహారములు ను ఉండవలయును. ఈశాన్యమున వేరుగా మూరెడు చదరపు వేదిక గ్రహాదులను లోకపాలురను పూజించుటకై ఉండవలయును; తరువాత అందే పండ్లు మాల్యములు వస్త్రములు మొదలగు వానితో బ్రహ్మ విష్ణు రుద్రుల అర్చనము కూడ జరుపవలయును; అందుచే అచట ఆయా లోకేశ్వర గ్రహాదులకు చెప్పిన వర్ణములతో వస్త్రములతో చేసిన పతాక(చిరుజెండా) లును వాని నడుమ చిరుగంటలతో మువ్వలతో కూడిన ధ్వజము(పెద్దజెండాయు)ను ఉండవలెను; నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములును వానికి మర్రి జువ్వి మొదలగు పాలుగల వనస్పతుల (పూలు పూయకయే కాయలు కాయు వృక్షజాతులు వనస్సతులు)చివుళ్ళతో చేసిన తోరణములు నాలుగును ప్రతి ద్వారమందును రెండేసి పూర్ణకుంభములును మాలికలు గంధ ద్రవ్యములును ధూప సామగ్రియు వస్త్రములు నుండవలయును; ఈ మండప సమీపమున ఏపి-గార-మంచి గంధము-దేవదారు- శ్రీపర్ణి-మారేడు- మామిడి-కడిమి మొదలగు వానితో చేసిన ఐదు మూరల రెండుస్తంభములును తెచ్చి రెండు మూలలోతుగల గోతిలో ఒకదానికొకటి నాలుగు మూల దూరములో నుండునట్లు దృడముగా పాతవలెను;( అనగా స్తంభదారువు-ఐదును రెండును కలిపి ఏడు మూరలు) వానిపై అడ్డముగా ఒక దారువును అమర్చవలెను(ఉత్తరదారువు అని దానికిచట పేరు వ్యవహరించబడినది; పైగా కట్టిన కొయ్య అని అర్థము.) ఇదియు ఈ స్తంభములు రెండును ఒకేజాతి దారువుతో చేసినవిగా నుండవలెను.

సమానజాతిశ్చ తులావమ్బ్యా హైమేన మధ్యే పురుషేణ యుక్తా.3

దైర్ఘ్యేణ సా హస్తచతుష్టయం స్యా త్పృథుత్వ మస్యాశ్చ దశాఙ్గుళాని|

సువర్ణపట్టాభరణా తు కార్యా నలోహపాత్రద్వయశృఙ్ఖలాభిః. 34

యుతా సువర్ణేన తు రత్నమాలా విభూషితా మాల్యవిలేపనైశ్చ|

చక్రం లిఖే ద్వారిజపత్రయుక్తం నానారజోభిర్భువి పుష్పకీర్ణమ్‌. 35

వితానకం చోపరి పఞ్చవర్ణం సంస్థాపయో త్పుష్పఫలోపశోభమ్‌ |

ఆథర్త్విజో వేదవిదశ్చ కార్యా స్సురూపవేషాన్వయ శీలయుక్తాః.36

విధానదక్షాః పటవో నుకూలా యే చార్యదేశ ప్రభవా ద్విజేన్ద్రాః |

గురుశ్చ వేదార్థవిచారధక్ష స్సముద్భవ శ్శీలకులాభిరూతః. 37

పురాణశాస్త్రాభిరతో7తిదక్షః ప్రసన్న గమ్భీరసరస్వతీకః |

సితామ్బరః కుణ్డల హేమసూత్ర కేయూరకణ్ఠాభరణాభిరామః 38

పూర్వేణ ఋగ్వేదవిదా వథాస్తాం యజుర్విదౌ దక్షిణతశ్చ శస్తౌ |

స్థాప్యౌ ద్విజౌ సామవిదౌచ పశ్చా దాథర్వణా వుత్తరతశ్చ కార్యౌ. 39

వినాయకాదిగ్రహలోకపాల వస్వష్టకాదిత్యమరుద్గణానామ్‌ |

బ్రహ్మాచ్యుతేశార్కవనస్పసతీనాం స్వమన్త్రతో హోమచతుష్టయం స్యాత్‌. 40

జప్యాని సూక్తాని తథైవ చేషా మనుక్రమేణౖవ యథాస్వరూపమ్‌ |

హోమావసానే కృతతూర్యనాదో గురుర్గృహీత్వా బలిపుష్పధూపా&. 41

ఆవాహయేల్లోకపతీ న్క్రమేణ మన్త్రైరమీభిర్యజమానయుక్తః |

స్తంభముల దారు జాతికే చెందిన దారువతో చేసిన * తులను ఈ ఉత్తర దారువునుండి వ్రేలాడజేయవలెను ;

*మత్స్య-273 శ్లో. 33

''సమాన జాతిశ్చ తులా7వలంబ్యా హైమేన మధ్యే పురుషేణ యుక్తా!''

ఇందు పురుష శబ్దమునకు 'ఒక సమగ్ర పదార్థపు రెండవయవముల నడుమ సమానతను చూపునది' అని అర్థము; ఈ యర్థము వ్యాకరణ శాస్త్రమునందలి పారిభాషిక పదపు అర్థముతో కూడ సరిపోవుచున్నది. ''యస్మాత్పరం నాపరమస్తి కించిత్‌ యస్మాన్నాణీయోన జ్యాయో7స్తికించిత్‌ వృక్ష | ఇవ స్తబ్ధోదివితిష్ఠత్యేక | స్తేనేదం పూర్ణం పురుషేణ సర్వమ్‌.'' (ఋక్‌)

ఈతుల నడుమ బంగారుతో చేసిన పురుషమును (రెండు వైపులను బరువులు సమానముగా నున్నవని తెలుపు సన్నని మొనగల కడ్ణీగాని రేకుగాని) నాలుగు మూరల పొడవును పది అంగుళముల మందము (వెడల్పు) ను కల దానిని అమర్చ వలెను; ఈ తులకు బంగారు పట్టికలే ఆభరణములుగా నుండవలెను; ఈతులకు రెండు కొనలయందును ఇనుప పళ్ళెరము లను ఇనుప గొలుసులతో బిగించవలయును; వీనిని బంగారుతో రత్నములతో చేసిన మాలలతో మాల్యములతో విలేపనములతో అలంకరించవలయును; అచట భూమిపై చక్రమును మ్రుగ్గులుగా విభజించి దానిపై తామర పూరేకులును ఇతర పుష్పములును చల్లవలయును; ఈ తులకు పైగా వచ్చునట్లు పుష్ప ఫలోప శోభితమగు ఐదు వన్నెల వితానకము (మేల్కట్టు-చాందినీ) ఏర్పరచవలయును.

ఇవికాక - వేదవిదులును మంచి రూపము వేషము వంశము శీలము కలవారు విధానమందు సమర్థులు నేర్పు గట్టి దనము గలవారు అనుకూలురు ఆర్యదేశమునందు జన్మించిన వారునగు ఋత్విజులను వేదార్థ విచారణా దక్షుడుసు ఉత్తమ వంశోత్పన్నుడును మంచి శీలమును వంశమును సౌందర్యమును కలవాడును పురాణములందును శాస్త్రములందును ఆసక్తి కలవాడును మహాసమర్థుడును ప్రసన్నముగాను గంభీరముగాను మాటలాడు వాడును తెల్లని (శుద్ధ) వస్త్రముల ధరించు వాడును కుండలములను బంగారు హారములను ధరించినవాడును భుజకీర్తులను కంఠాభరణములను ధరించి అందముగా నుండు వాడునగు ఆచార్యుని నియమించుకొనవలయును.

మండపమునందు ఉత్తరమున ఋగ్వేద విదులను దక్షిణమున యజుర్వేద విదులను పశ్చిమమున సామవేద విదులను ఉత్తరమున ఆథర్వణ వేదపారంగతులను ఇద్దరేసి చొప్పున కూర్చుండబెట్టవలయును.

వినాయకాదులగు దేవతలను గ్రహములను లోకపాలురను అష్టవసువులను ద్వాదశాదిత్యులను మరుత్తులు మొదలగు ఇతర దేవతాగణములను బ్రహ్మ విష్ణు రుద్ర రవులను ఉద్దేశించి ఆయా వనస్పతి సమిధలతో వారి వరి మంత్రము లతో నాలుగేసి హోమములను జరుపవలయును. వారి వారికి శాస్త్రమందు చెప్పబడిన సూక్తములను ఈ దేవతల నందర నుద్దేశించి ఆయా సూక్తములను జపించ (పఠించ) వలయును; హోమాంతమునందు ఆచార్యుడు తూర్యనాదములతో బలి పుష్ప ధూపములను ఇచ్చుచు యజమానునితో కూడి చెప్పబోవు మంత్రములతో లోకపాలుర నందరను క్రమమున ఆవాహించవలయును.

ఏహ్యేహి సరవామరసిద్ధసాధ్యై రభిష్టుతో వజ్రధరామరేశః. 42

సంవీజ్యమానో7ప్సరసాంగ గణన రక్షాధ్వరం మే భగవ న్నమస్తే | ఓం ఇన్ద్రాయనమః :

ఏహ్యేహిసర్వామరహవ్యవాహ మునిప్రవీరై రభితో7భిజుష్టః 43

తేజోవతా లోకగణన సార్ధం మమాధ్వరం రక్ష కవే నమస్తే | ఓం అగ్నయే నమః :

ఏహ్యేహి వైవస్వత ధర్వరాజ సర్వామరై రర్చితదివ్యమూర్తే. 44

శుభాశుభానాం దదతా మధీశ శివాయ నః పాహి మఖం నమస్తే | ఓం యమాయనమః :

ఏహ్యేహి రక్షోగణనాయక స్త్వం సర్వైస్తు భేతాళపిశాచసఙ్ఘైః. 45

మమాధ్వరం పాహి శుభాధినాథ లోకేశ్వర స్త్వం భగవన్నమస్తే : ఓం నైరృతాయనమః :

ఏహ్యేహి యాదోగణవారిధీనాం గణన పర్జన్యసహాప్సరోభిం. 46

విద్యాధరేన్ద్రామరగీయమాన పాహి త్వ మస్మా న్భగవ న్నమస్తే | ఓం వరుణాయనమః :

ఏహ్యేహి యజ్ఞే మమ రక్షణాయ మృగాధిరూఢ స్సహ దేవసఙ్ఞైః. 47

ప్రాణాధిపః కాలకవే స్సహాయో గృహాణ పూజాం భగవన్నమస్తే | ఓంవాయవేనమః :

ఏహ్యేహి యజ్ఞేశ్వర యజ్ఞేశ్వర యజ్ఞరక్షాం విధత్స్వ నక్షత్రగణన సార్ధమ్‌. 48

సర్వౌషధీభిః పితృభి స్సహైవ గృహాణ పూజాం భగవ న్నమస్తే | ఓం సోమాయనమః :

ఏహ్యేహి విశ్వేశ్వర న స్త్రిశూలకపాలఖట్వాఙ్గధరేణ సార్ధమ్‌. 49

లోకేశభూతేశ్వర యజ్ఞసిద్ధ్యై గృహాణ పూజాం భగవ న్నమస్తే | ఓం ఈశానాయనమః :

ఏహ్యేహి పాతాళధరాధరేన్ద్ర నాగాఙ్గనాకిన్నరగీయమాన. 50

యక్షోరగేన్ద్రామరలోక పూజ్య హ్యనన్త రక్షాధ్వర మస్మదీయమ్‌ | అనన్తాయనమః :

ఏహ్యేహి విశ్వాధిపతే మునీన్ద్రలోకేన సార్ధం పితృదేవతాభిః. 51

సర్వస్య ధాతా7స్యమిత ప్రభావ రక్షాధ్వరన్నో భగవ న్నమస్తే | ఓం బ్రహ్మణ నమః:

త్రైలోక్యే యాని భూతాని స్థావరాణి చరాణిచ. 52

బ్రహ్మవిష్ణుశివై స్సార్ధం రక్షాం కుర్వన్తు తాని మే | దేవదానవగన్ధర్వా యక్షరాక్షసపన్నగాః. 53

ఋషయో మనవో గావో దేవమాతర ఏవచ | సర్వే మమాధ్వరే రక్షాం ప్రకుర్వస్తు ముదాన్వితాః. 54

1. సర్వ దేవతలచే సిద్ధసాధ్యులచే అభిష్టుతుడవు వజ్రధరుడవు అమరేశుడవు అప్సరోగణముచే వీజనము చేయ బడువాడవు నగు భగవన్‌ : నా యజ్ఞమును రక్షించుము; ప్రణవస్వరూపుడగు ఇంద్రునకు నమస్కారము.

2. సర్వ దేవతలకును హవిస్సును కొనిపోవువాడును ముని ప్రవరులచే అన్ని వైపులను ఆశ్రయించబడు వాడును నగు కవీ (విద్వన్‌!) నీకు వందనము; తేజఃశాలురగు దేవగణముతో కూడి నా అధ్వర (యజ్ఞ) మును రక్షించుము; ప్రణవరూపుడగు అగ్నికి నమస్కారము.

3. వివస్వంతుని (సూర్యుని) కుమారుడు ధర్మరాజు సర్వామర పూజితుడు దివ్యమూర్తి శుభాశుభ ఫలములను ఇచ్చువారగు దేవాదులకు అధీశుడు శివ (శుభ) కరుడు నగు దేవా! రారమ్ము; నా యజ్ఞమును రక్షించుము; నీకు నమస్కారము. ప్రణవరూపుడగు యమునకు వందనము.

4. రక్షోగణనాయకుడవు శుభములను అధినాథుడవు లోకేశుడవు అగు నిరృతీ! భగవన్‌! నీకు నమస్కారము; సర్వ బేతాళపిశాచ సంఘములతో కూడి రారమ్ము; నా అధ్వరమును రక్షించుము; ప్రణవరూపుడగు నిరృతికి వందనము.

5. జలజంతు గణములతో సముద్రముల గణములతో అప్సరోగణములతో కూడి రారమ్ము. విద్యాధరేంద్రులచే అమరులచే గానము చేయబడు వరుణా | భగవన్‌ మమ్ము రక్షించుము; నీకు నమస్సు; ప్రణవ రూపుడగు వరుణునకు నమస్కారము.

6. ప్రాణములకు అధిపతి కాలరూపుడగు కవి (విద్వాంసుడగు దేవుడు) నీకు తోడు కాగా మృగ (లేడి) వాహన మారోహించి దేవసంఘములతో కూడి నా యజ్ఞమును రక్షించుటకై రారమ్ము; భగవన్‌! నా పూజ నందుకొనుము; నీకు వందనము; ప్రణవరూపుడగు వాయువునకు నమస్కారము.

7. సోమా! యజ్ఞేశ్వరా ! భగవన్‌ ! నీకు నమస్కారము; నక్షత్ర గణములతోను సర్వౌషధులతోను పితరుల తోను కూడి రారమ్ము; నా పూజనందుకొనుము; నా యజ్ఞరక్ష చేయుము; ప్రణవరూపుడగు సోమునకు నమస్సు.

8. విశ్వేశ్వరా ! రారమ్ము; లోకేశా! భూతపతీ! భగవన్‌! త్రిశూల కపాల ఖట్వాంగ ధారణముతో కూడి రారమ్ము; మా యజ్ఞ (ఫల) ము సిద్ధింపజేయుము; ప్రణవరూపుడగు ఈశానునకు మనస్కారము.

9. పాతాళధరను (భూమిని) ధరించువారిలో ఇంద్రా! (శ్రేష్ఠా) నాగాంగనలచే కింనరులచే గానము చేయబడు వాడా! యక్షనాగదేవతాగణములచే పూజించబడువాడా! అనంతా! మా యజ్ఞమును రక్షించుము. ప్రణవరూపుడగు అనంతునకు నమస్కారము.

10. సర్వ విశ్వమునకును సృష్టికర్తవై విశ్వాధిపతివగు చతుర్ముఖాః మునీంద్రులతో పితృ దేవతలతో కూడి రారమ్ము; అమిత ప్రభ (భా)వా! భగవన్‌! నీకు నమస్కారము; మా యజ్ఞమును రక్షించుము; ప్రణవరూపుడగు బ్రహ్మకు నమస్కారము.

త్రైలోక్యమునందును గల స్థిరచర భూతములను బ్రహ్మ విష్ణు రుద్రులును సదా నన్ను రక్షింతురు గాక! దేవదానవ గంధర్వ యక్షరాక్షస నాగ ఋషి మనుజ దేవ మాతృదేవతలందరును మోదముతో కూడి నా యజ్ఞమును రక్ష సేయుదురు గాక!

ఇత్యావాహ్య సురా న్దర్యా దృత్విగ్భ్యో హేమభూషణా& | కుణ్డలానిచ హైమాని సూత్రాణి కటకానిచ. 56

జపేయు శ్శాన్తికాధ్యాయం జాపకా స్సర్వతో దిశమ్‌ | ఉపోషితా స్తతస్సర్వే కృత్వైవ మధివాసనమ్‌. 57

ఆదా వన్తేచ మధ్యేచ కుర్యా ద్ర్బాహ్మణవాచనమ్‌ | తతో మఙ్గళశ##బ్దేన స్నాపితో విప్రపుఙ్గవైః. 58

త్రిః ప్రదక్షిణ మావృత్య గృహీతకుసుమాఞ్జలిః | శుక్లమాల్యామ్బరో భూత్వా తాం తులా మభిన్త్రయేత్‌. 59

నమస్తే సర్వేదేవానాం శక్తిస్త్వం సత్య మాస్థితా | సాక్షిభూతా జగద్దాత్రీ నిర్మితా విళ్వయోనినా. 60

ఏకత స్సర్వసత్యనాఇ తథా7నృతశతానిచ | ధర్మాధర్మకృతలాం మధ్యే స్థాపితా7సి జగద్ధితే. 61

త్వం తులే సర్వభూతానాం ప్రమాణమిహ కీర్తితా | మాం తోలయన్తీ సంసారా దుద్ధరస్వ నమో7స్తుతే.

యో7సౌ తత్త్వాధిపో దేవః పురుషః పఞ్చవింశకః | స ఏషో7ధిష్ఠితో దేవి త్వయి తస్మా న్న మోనమః.

నమో నమస్తే గోవిన్ద తులాపురుషసంజ్ఞక | త్వం హరే తారయస్వాస్మా న్భవసంసారసాగరాత్‌. 64

పుణ్యకాలం సమాసాద్య కృత్వైవ మధివాసనమ్‌ | పునః ప్రదక్షిణీకృత్య తాం తులా మారుహే ద్భుధః.

సఖడ్గచర్మకవచీ సర్వాభరణభూషితః | ధర్మరాజ మథాదాయ హేమసూత్రేణ సంయుతమ్‌. 66

కరాభ్యాం బద్ధముష్టిభ్యా మాస్తే పశ్యన్హరే ర్ముఖమ్‌ | తతో7పరే తులాభాగే న్యసేయు ర్ద్విజపుఙ్గవాః. 67

సమాదభ్యధికం యావ త్కాఞ్చనం చాతినిర్మలమ్‌ | పుష్టికామస్తు కుర్వీత భూమిసంస్థం నరేశ్వరః. 68

క్షణమాత్రం తత స్థ్సిత్వా పున రేత దుదీరయేత్‌ |

ఇట్లు దేవతల నావాహనము చేసిన తరువాత ఋత్విజులకు సువర్ణాభరణములను స్వర్ణకుండల కటక సూత్రాంగుళీయ పవిత్రములను వస్త్రశయనాదులను ఈయవలెను. ఋత్విజున కిచ్చిన దానికి రెట్టింపు దక్షిణ నాచార్యున కీయవలయును. అతనికి భూషణ వస్త్రాదిక మధికముగా ఈయవలయును; ఈ సమయములందు దేవతాధివాసనము జరుగునది జరుగుచుండ అన్ని దిశలయందు ఉండు జాపకులు ఉపవాసముతో నుండి శాన్తికాధ్యాయములను పఠించుచుందురు; ఆది మధ్యావసానములయందు బ్రాహ్మణులు స్వస్తి వాచనములు జరుపుచుండవలయును.

తరువాత యజమానుడు మంగళవాద్యాది ధ్వనులతో బ్రాహ్మణులచే స్నానము చేయించబడి శుక్ల వస్త్ర పుష్ప ధారియై వారిని దేవతలను తులను కూడ ముమ్మారు ప్రదక్షిణించి దోసిట కుసుమములను పట్టుకొని ఈ మంత్రముతో 'తుల' ను అభిమంత్రించవలయును.

తులా ! నీకు నమస్కారము; నీవు సర్వదేవతా శక్తిరూపురాలవు; సత్యము నాశ్రయించినవదానవు; లోకసాక్షి భూతవు; లోకధాత్రివి (లోకములను తమ తమ స్థితియందు నిలుపుదానవు;) నిన్ను విశ్వయోని (జగత్కారణుడు) అగు నారాయణుడే నిర్మించెను; నీయందు సర్వ సత్యములును ఒకవైపున అన్ని అసత్యములును ఒకవైపున ఉండును; లోక హితకాఇరిణీ, ధర్మాధర్మముల నాచరించు మానవుల నడుమ వానిని తూకము చేయుటకై భగవానుడు వారి నడుమ నిన్నుంచినాడు; తులా! నీవు సర్వభూతములకును ప్రమాణమని కీర్తించబడుచున్నావు; నన్నును నీవు తూకము చేసి సంసారమునుండి ఉద్ధరించుము. నీకు నమస్కారము; దేవీ: చతుర్వింశతి తత్త్వములకును అధిపతియగు పంచవింశక (ఇరువది యైదవ తత్త్వమగు) ఏ పురుషుడు కలడో ఆ ఈ పరమపురుషుడును నీయందధిష్ఠించియున్నాడు; కావున నీకు పునః పునర్నమస్కారము; తులా పురుష నామము గల గోవిందా; నీకు నమస్కారము! నమస్కారము; హరీ! నీవు మమ్ములను జన్మ సంసారసాగరమునుండి తరింపజేయుము; ఇట్లు దేవతాధివాసన కార్యమంతయునైన తరువాత వివేకి యగు యజమానుడు పుణ్య సమయము రాగానే ఖడ్గము చర్మము (డాలు) కవచము ధరించి సర్వాభరణ భూషితుడై మరల తులను ప్రదక్షిణించి దాని నారోహించవలయును; అనంతరము బంగారు దారముతో (హారముతో) కూడిన ధర్మ రాజును పిడికిళ్ళు గట్టిగా బిగించి పట్టుకొన్న చేతులతో పట్టుకొని హరి ముఖమును చూచుచు ఉండవలెను; తరువాత బ్రాహ్మణ శ్రేష్ఠులు రెండవ తులా భాగమందు (సిబ్బెయందు) యజమానుని బరువుతో సమమగు దానికంటె అధిక భారము గల అతి నిర్మలమగు బంగారము నుంచవలయును; పుష్టి (వృద్ది) కాముగడు రాజు ఆ అపర తులాభాగమును ఆ బంగారు బరువుతో ఆ సిబ్బె నేలను తాకునట్లు చేయవలయును; క్షణమాత్రము అట్లేయుండి అపుడు ఈ మంత్రముచ్చరించ వలయును.

నమస్తే సర్వభూతానాం సాక్షిభూతే సనాతని. 69

పితామహేన దేవి త్వం నిర్మితా పరమేష్ఠినా | త్వయా ధృతం జగత్సర్వం స్థావరం జఙ్గమం తథా. 70

సర్వభూతాత్మభూతస్థే నమస్తే భూతధారిణి | తతో7వతీర్య గురవే పూర్వ మర్ధం నివేదయేత్‌. 71

ఋత్విగ్భ్యో7పరమర్ధంతు దద్యాదుదకపూర్వకమ్‌ | గురవే గ్రామరత్నాని ఋత్విగ్భ్యశ్చ నివేదయేత్‌;. 72

ప్రాప్య తేషా మనుజ్ఞాంతు తథా7న్యేభ్యోపి దాపయేత్‌ | దీనానాథవిశిష్టాదీ న్పూజయే ద్ర్బాహ్మణౖ స్సహ.

న చిరం ధారయే ద్గేహే సువర్ణం ప్రోక్షితం బుధః | తిష్ఠేద్భుయావహం తస్మా చ్ఛోకవ్యాధికరం నృణామ్‌.

శీఘ్రం పరస్వీకరణా చ్ఛ్రేయః ప్రాప్నోతి మానవః | అనేన విధినా యస్తు తులాపురుష మాచరేత్‌. 75

ప్రతిలోకాధిపస్థానే ప్రతిమస్వన్తరం వసేత్‌ | విమానేనార్కవర్ణేన కిఙ్కిణీజాలమాలినా. 76

పూజ్యమానో7ప్సరోభిశ్చ తతో విష్ణుపదం వ్రజేత్‌ | కల్పకోటిశతం సాగ్రం తస్మిన్లోకే మహీయతే. 77

కర్మక్షయాదిహ పున ర్జాయతే భువి రాజరాట్‌ |

భూపాలమౌళిమణిరఞ్జితపాదపీఠ శ్శ్రద్ధాన్వితో భవతి యజ్ఞసహస్రయాజీ. 78

దీప్తప్రతాపజిత సర్వమహీపలోకో యో దీయమాన మపి పశ్యతి భక్తియుక్తః |

కాలాన్తరే స్మరతి వాచయతీహ లోకేయాని శృణోతి పఠతీన్ద్రసమానరూపః. 79

సో7పి ప్రమోదశతసంయుతతత్స్వరూపః ప్రాప్నోతి ధామ స పురన్దరదేవజుష్టమ్‌. 79

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మహాదానానుకీర్తనే తులాపురుష ప్రదానికో నామ

త్రిసప్తత్యుత్తరద్విశతతమో7ధ్యాయః.

''సర్వభూత సాక్షిభూతా! సనాతనీ! నీకు నమస్కారము; దేవీ! నీవు పరమేష్ఠియగు పితామహుని (బ్రహ్మ)చే నిర్మింపబడినదానవు; స్థావర జంగమాత్మకమగు జగమంతయు నీచేతనే ధరించబడుచున్నది; సర్వభూతములకు ఆత్మ భూతరాలవై వాటియందుండు భూతధారిణీ! నీకు నమస్కారము.''

తరువాత తులనుండిదిగి (తూచిన ధనమును) సగము ఆచార్యునకును అనంతరము మిగిలిన సగమును ఋత్విజులకును ఉదక పూర్వకముగా ప్రదానమొనరించవలయును; గురునకును ఋత్విజులకును గ్రామములను రత్నములను ఈయ వలెను. అంతేకాదు. వారి యనుమతినంది అట్లే ధనమును ఇతరులకును ఇప్పించవలయును; బ్రాహ్మణులను దీనానాధులను కూడ పూజించవలయును; ప్రోక్షితమగు (దానముకై నీరు చల్లబడిన) స్వర్ణమును వివేకియగు దాత ఎక్కువ కాలము ఇంటియందుంచుకొనరాదు; ఉన్నచో అది మానవులకు భయావహమును శోకవ్యాధికరమునగును; అది ఎంత శీఘ్రముగా పరులు స్వీకరించినచో దాతయగు నరునకంత అధిక శ్రేయము కలుగును.

ఈ చెప్పిన విధానమున నెవడు 'తులాపురుష' దానమాచరించునో అతడు ఒక్కొక్క లోకాధిపతి లోకము నందొక్కొక్క మన్వంతరముండును; అనంతరము అప్సరః పూజితుడగుచు రవి సమానవర్ణమును చిరుమువ్వల గుముల మాలలతో అలంకృతమునగు విమానముపై విష్ణులోకమునకు ఏగును; శతకోటి కల్పములు సమగ్రముగా ఆ లోకమునందు పూజితుడగుచు సుఖించును; పుణ్యకర్మ ఫలక్షయము కాగా ఇహలోకమునందు మరల రాజరాజయి జన్మించును; భూపాలుర కిరీటములందలి మణులచే రంజితమగు పాదపీఠము కల చక్రవర్తియై శ్రద్ధాయుక్తతో యజ్ఞ సహస్రములతో దేవతలను యజిం (ఆరాధిం)చి మిగుల దీపించు తన ప్రతాపముచే సర్వనాకలోకమును జయించినవాడగును; భక్తియుక్తుడై ఎవడు ఈ తులాపురుష దానము ఈయబడుచుండగా చూచునో కాలాంతరమందెపుడైన తాను చూచిన ఈ విషయమును స్మరణకు తెచ్చుకొనునో ఈ విషయమును బ్రాహ్మణాదులచే చదివించు (కొను)నో వినునో చదువునో అతడును ఇంద్ర సమానరూపుడును వందలకొలది యానందములతో కూడ ఇంద్ర సమానుడునునగుచు ఇంద్రాది దేవతల కాశ్రయమయి వారనుభవించు స్వర్గలోకమును పొంది సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున మహాదానాను కీర్తనమున తులాపురుష ప్రదానికమను

రెండు వందల డెబ్బది మూడవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters