Sri Matsya Mahapuranam-1    Chapters   

ఏకాదశోత్తర శతతమో7ధ్యాయః.

భూగోళ వర్ణన ప్రారమ్భః.

ఋషయః:  

కథం మత్స్యేన కథితో భువనస్యతు విస్తరఃl మనవే త త్సమాచక్ష్వ యాథాతథ్యేన సూతజ. 1

సూతః: కథితం మత్స్యరూపేణ విష్ణునా మణ్డలం భువః l సాబ్ధిద్వీపాదిభూగోళం మనవే భానుసూనవే . 2

తత్సర్వ మిహ వక్ష్యామి శృణుధ్వం మునిపుజ్గవాః l దేవేశ్వరంచ విశ్వేశం విష్ణుంవై కారణాత్మకమ్‌. 3

వక్తుకామో7థ భూగోళం ప్రాహ ప్రాఞ్జలి రగృతః l మనుః: భగవ ఞ్చ్రోతుమిచ్ఛామి విస్తరా న్మణ్డలం భువః. 4

విస్తారతః కియత్ప్రోక్తం కతి ద్వీపా స్ససాగరాః l కథం మేరు స్థ్సిత స్తత్ర ఏతన్మే బ్రూహి కేశవః. 5

శ్రీమత్స్యః: శృణు సర్వం ప్రవక్ష్యామి విస్తరా న్మణ్డలం భువః l సప్తద్వీపా న్త్సముద్రాంశ్చ యాథాతథ్యేన తే మనో. 6

పఞ్చాశత్కోటివిస్తారం యోజనానాం ధరాతలమ్‌ l తచ్చసప్తసముద్రైశ్చ సప్తద్వీపై స్సమావృతమ్‌. 7

లవణక్షుసురాసర్పి ర్థధిక్షీర జలార్ణవైః l జమ్బూః ప్లక్ష శ్శాల్మలిశ్చ కుశః క్రౌఞ్చస్తు పఞ్చమః. 8

శాక పుష్కరనామానౌ ద్విగుణౖః పరివేష్టితః (తౌ).

ఇతి శ్రీమత్స్యమహాపురాణ మత్స్యమనుంసంవాదే భూగోళే ఏకాదశోత్తరశతతమో7ధ్యాయః.

నూట పదునొకండవ అధ్యాయము.

భూగోళ వర్ణనారంభము.

[భగవత్తత్త్వమును అంతర్యామిగా-కాలరూపునిగా- దేశరూపునిగా - దేశకాలోభయరూపునిగా ఉపాసించవలయును. వీనినే అధునికులు కేవలము ప్రకృతియందలి అంశములుగా Time, Space and Time-Space అను చున్నారు. కాల పరిమాణ వ్యవస్థయు-యుగ-మహాయుగ-కల్పాది రూపములును ఆయా యుగములందుండెడి ధర్మాధర్మ ప్రవృత్తియును భగవంతుని కాలరూపునిగా ఉపాసించుటకు తోడుపడును.

భుగోళ వ్యవస్థా విజ్ఞానము-భగవానుని దేశరూపునిగా ఉపాసించుటకు ఉపకరించును. జ్యోతిర్గోళ వ్యవస్థావిజ్ఞానము భగవానుని దేశకాలోభయరూపునిగా ఉపాసించుటకు సాయపడును. ఇది ఎరిగి పురాణములను చదువుట సార్థకమగు పని. - అనువాదకుడు]

ఋషులు సూతు నిట్లడిగిరి: మత్స్య నారాయణుడు మనువునకు భువన విస్తారము ఎట్లు చెప్పెనో అది ఉన్నది ఉన్నట్లు (ఏ మాత్రమును విడువక) మాకు తెలుపుము. అని అడుగ వారికి సూతు డిట్లు చెప్పెను: మత్స్యరూపుడగు విష్ణువు భానుపుత్త్రుడగు వైవస్వత మనువునకుభూమండల (స్వరూప) మును సముద్రములతో ద్వీపములతో కూడిన భూగోళ స్వరూపమును (దాని వివరణమును) తెలిపెను. ముని పుంగవులారా! అదియంతయు చెప్పెదను; వినుడు. నేను భూగోళ (విషయ)మును మీకు చెప్పగోరి మొదట దేవేశ్వరుడును విశ్వేశ్వరుడును కారణరూపుడును నగు విష్ణుని దోసిలియొగ్గి నమస్కరించి చెప్ప నారంభింతును.

మునువు మత్స్య నిట్లడిగెను: భగవన్‌! భూమండలమును(గూర్చి)విస్తరముగా వినగోరుచున్నాను. దాని విస్తారము(వైశాల్యము)ఎంత? ద్వీపములు ఎన్నీ? సముద్రములు ఎన్ని? దానియందు మేరువు ఎట్లున్నది? కేశవా! ఇది యంతయు నాకు తెలుపుము. అన శ్రీమత్స్యు డిట్లు చెప్పెను. భూమండల(స్వరూప)మును (దానియందుగల) సప్త ద్వీపముల(విషయ)మును సప్త సముద్రముల(విషయ)మును యథతథముగా చెప్పెదను. ధరాతలము ఏబదికోట్ల యోజనముల విస్తారము కలది. అది సప్త సముద్రములతో సప్త ద్వీపములతో ఆవరింపబడియున్నది. లవణక్షు సురాసర్పిర్దధిక్షీర జల సముద్రములు ఏడు. జంబూ ప్లక్షశాల్మలి కుశ క్రౌంచ శాక పుష్కర ద్వీపములు ఏడు.

ఏబదికోట్ల చదరపుయోజములు= 32000000000000000 చదరపు (బ్రిటిషు) గజములు.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున భుగోళ వర్ణనారంభమను నూట పదునొకండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters