Sri Matsya Mahapuranam-1    Chapters   

ద్వాత్రింశదుత్తరశతతమోధ్యాయః.

నారదస్య త్రిపురగమనమ్‌.

సూతః : పూజ్యమానే రథే తస్మి న్యాతే దేవవరైస్సహ | దేవేషుచ నదత్సూగ్రం ప్రమథేషుచ సాధ్వితి. 1

ఐశ్వరే స్వరఘేషేణ నర్దమానే మహావృషే | జపత్సు విప్రేషు తదా గచ్ఛత్సు తురగేషుచ. 2

వ్యోమాఙ్కణా త్సముత్ల్పుత్య మహర్షి ర్నారదః ప్రభుః | కన్త్యా చన్ద్రోపమ స్తూర్ణం త్రిపురం పుర మాగతః. 3

ఉత్పాతకంచ దైత్యానాం త్రిపురే వర్ధతే ధ్రువమ్‌ | నారదశ్చాత్ర భగవా న్ర్పాదుర్భూత స్తపోధనః. 4

ఆగతం జ్వలనాభాసం సమేతా దైత్యదానవాః | ఉత్తస్థు ర్నారదం దృష్ట్వా అభివాదనవాదినః. 5

తమర్ఘ్యేణచ పాద్యేన మధుపర్కేణ చేశ్వరాః | నారదం పూజయామాసు ర్ర్బహ్మాణమివ వాసవః. 6

స తస్య పూజాం పూజార్హః ప్రతిగృహ్య తపోధనః | నారద స్సుఖమాస్తేస్మ కాఞ్చనే పరమాసనే. 7

తతోహి దానవైస్సార్ధ మాసీనో దానవేశ్వరః | ఆసీనం నారదం ప్రేక్ష్య మయస్త్వథ మహాసురః. 8

నారదంప్రతి మయకృతోత్పాతనిమిత్తప్రశ్నః.

అబ్రవీ ద్వచనం తుష్టో హృష్టరోమాననేక్షణః | ఔత్పాతికం పురేస్మాకం యథా నాన్యత్ర కుత్రచిత్‌. 9

వర్తతే వర్తమానంచ జ్ఞాతుం శక్తోసి నారద | దృశ్యన్తే భయదా స్స్వప్నా భజ్యన్తేచ ధ్వజాః పురే. 10

వినాచ వాయునా కేతుః పతతేచ తథా భువి | అట్టాలకాశ్చ భజ్యన్తే సపతాకా స్సగోపురాః. 11

హింసహింసేతి శ్రూయనే గిరశ్చ భయదాః పురే | నాహం బిభేమి దేవానాం సేన్ద్రాణామపి నారద. 12

ముక్త్వైకం వరదం స్థాణుం భక్తాభయకరం హరమ్‌ | భగవ్‌& నాస్త్యవిదిత ముత్పాతేషు తవానఘ. 13

అనాగత మతీతంచ భవా& జానాసి తత్త్వతః | తదేతన్నో భయస్థాన ముత్పాతాభినివేదితమ్‌. 14

కథయస్వ మునిశ్రేష్ఠ ప్రయత్నేనతు నారద | ఇత్యుక్తో నారదస్తేన మయేనామయవర్జితః. 15

నూట ముప్పది రెండవ అధ్యాయము.

నారదుడు త్రిపురముల కేగుట.

సూతు డిట్లు చెప్పసాగెను: త్రిపుర విజయార్థమైన రథము సాగిపోవుచుండెను. దానిని దేవవరులు అభినందించుచు వెంట పోవుచుండిరి. దేవవరులును ప్రమథులును సాధువాదములు చేయుచు ధ్వనులు చేయుచుండిరి. ఈశ్వరుని మహా వృషభము వేద స్వరఘోషముతో ఱంకెలు వేయుచుండెను. విప్రులు వేదాధ్యయనము చేయుచుండిరి. అశ్వములును వేదముల పఠించుచు పోవుచుండెను. అట్టి సమయమున ప్రభుడగు నారద మహర్షి గగనాంగణమునుండి చంద్ర సదృశ దేహకాంతిలో దుమికి శీఘ్రముగా త్రిపుర దుర్గమునకు పోయెను. అప్పుడును అచట ఉత్పాతములు అధిక ముగ జరుగుచునే యుండెను. అదే సమయమున తపోధనుడు నారద భగవాను డట సాక్షాత్కరించుటచే అగ్ని ప్రకాళుడగు ఆయన రాకను చూచి దైత్య దానవులు అభివాదనములు పలుకుచు లేచి నిలువబడిరి. అసురేశ్వరుడు నారదుని అర్ఘ్యపాద్య మధుపర్కములతో ఇంద్రుడు బ్రహ్మ నర్చించి నట్లర్చించెను. తపోధనుడగు పూజార్హుడా నారదుడు మయుడు ఇచ్చిన పూజను స్వీకరించి మేలగు బంగరు పీఠముపై కూర్చుండెను. అనంతరము దానవేశ్వరుడగు మయమహాసురుడు తుష్టుడును హర్షసహిత రోమముఖనయనములు కలవాడునై తన దానవులతో కూడ తానును కూర్చుండి నారదుని చూచి ఇట్లు పలికెను: నారదా! నీవు వర్తమానము నెరిగినవాడవు. మా పురుమునం దిపుడు మరెప్పుడు నెక్కడను లేనంతగా ఉత్పాతములు కనబడుచున్నవి. ఏమనగా-భయంకర స్వప్నములు కలుగుచున్నవి. ధ్వజములు విరుగుచున్నవి. వాయువు వీచకయే జెండాలు క్రింద పడుచున్నవి. పతాకలతో గోపురములతో కూడ అట్టాలకములు (మేడలపై అంతస్తులు) విరిగి పడుచున్నవి. 'బాధించుడు బాధించుడు.' అను భయంకర ద్వనులు వినబడుచున్నవి. నారదా! స్థాణు(శాశ్వత)రూపుడు భక్తాభయకరుడు వరదుడు నగు హరునకుతప్ప నే నింద్రాది దేవతల కెవ్వరికిని భయపడను. అనఘా! భగవన్‌! ఉత్పాత విషయమున నీకు తెలియని దేదియు లేదు. భూత భవిష్యముల వాస్తవ రూపము నీ వెరుగుదువు. కావున మునిశ్రేష్ఠా! నారదా! ఈ ఉత్పాతములు మాకు రానున్న ఏ భయ హేతువును సూచించుచున్నవో నీకు తెలిసినంత తెలుపుము. అనగా ఏ చిత్త దోషములును లేని నారదుడు మయునితో ఇట్లు పలికెను.

నారదః : శృణు దానవ! తత్త్వేన భవత్యౌత్పాతికం యథా | ధర్మేతి ధారణ ధాతు ర్మహాతేజోపపద్యతే. 16

ధారణచావధరణ ధర్మఏష నిరూప్యతే | న దృష్టప్రాపకో ధర్మ ఆచార్యై రుపదిశ్యతే. 17

ఇతశ్చైవానిష్టఫల మాచార్యై రుపదిశ్యతే | దుర్మార్గం గచ్ఛతో మార్గే మార్గే సతి విమారతః. 18

వినాశస్తస్య నిర్దేశ్య ఇతి ధర్మవిదో విదుః | త్వమధర్మం యథా మూఢ స్సహైభి ర్దైత్యదానవైః. 19

అవాచీనాని దేవానాం కురుషే కుసహాయవా& | తదేతాన్యేవ మాద్యాని ఉత్పాతవిదితానిచ. 20

వైనాశికాని దృశ్యన్తే దానవానాం తథైవచ | ఏష రుద్ర స్సమాస్థాయ రౌద్రం లోకమయం రథమ్‌. 21

ఆయాతి త్రిపురం దగ్ధుం మయ! త్వా మసురానపి| సత్వం మహౌజసం నిత్యం ప్రపద్యస్వ మహేశ్వరమ్‌.

యాస్యసే సహపుత్త్రేణ దానవైస్సహ మానద | ఇత్యేవ మావేద్య భయం నారదః ప్రస్తుతం వచః. 23

దానవానాం పునర్ధీమా& దేవేశపుర మాగతః | నారదేతు మునౌ యాతే మయో దానవనాయకః. 24

శూరా నుద్బోధయన్నేవ మువాచ సహి దానవః | శూరాశ్చ జాతపుత్త్రాశ్చ కృతకృత్యాశ్చ దానవాః. 25

యుధ్యధ్వం దైవతైస్సార్ధం కర్తవ్యంహి న వో భయమ్‌ | హతా వయం భవిష్యామ స్సర్వే సురసభాసదః. 26

దేవాన్వా సేన్ద్రకాన్‌ హత్వా లోకా& భోక్ష్యామహే వయమ్‌ | అట్టాలకేషు తిష్ఠధ్వం సన్నద్ధా శ్శస్త్రపాణయః.

దంశితాయుధసఙ్ఘాశ్చ తిష్ఠధ్వం ప్రోద్యతాయుధాః | పురాణి త్రీణి చైతాని యథాస్థానేషు దానవాః. 27

తిష్ఠస్త్వలఙ్ఘనీయాని భవిష్యన్తి పురాణిచ | నభోగాః ప్రమథాశ్శూరా దేవాశ్చ విదితాహి వః. 29

తే ప్రయత్నేన వార్యాశ్చ విదార్యాశ్చైవ సాయకైః | ఇతి దనుతనయా న్మయస్తథోక్త్వా సురరణకారణవారణ వచాంసి. 30

శరణ మథ జగామ దేవదేవం యమమదనాన్ధకయజ్ఞదేవఘాతమ్‌ | మయ మభయపదైషిణం ప్రపన్నం స ఖలు బుబోధ తృతీయనేత్రదీప్తః. 32

తదభిమత మదా చ్ఛశాఞ్కమౌళి స్సచ కిల నిర్భయదేవదానవేన్ద్రః. 32

ఇతి శ్రీమత్స్యమహాపురాణ త్రిపురాఖ్యానే నారదమయసంవాదాది

కథనం నామ ద్వాత్రింశదుత్తరశతతమోధ్యాయః.

మయదానవా! ఈ ఉత్పాతము లేమి సూచించునో తెలిపెదను; వినుము; మహాతేజా! ధర్మ శబ్దమునందలి 'ధా' ధాతువునకు గల అర్థమును బట్టి 'తను ఆశ్రయించినవారిని నిలుపునది' 'కంటికి కానరాని ఫలితములను తన యందు గట్టిగా నిలుపుకొనునది' అని ధర్మశబ్దమునకు అర్థము. ఈ కారణమున ఈ ఉత్పాతములు మీకు అనిష్ట ఫలమునే సూచించుచున్నవి. విమార్గమును విడిచి సన్మార్గమును నడువ వీలుండియు దుర్మార్గము ననుసరించువానికి నాశము తప్పదని ధర్మతత్త్వ వేత్తలందురు. నీవు మూఢుడువై ఈ దైత్య దానవులతో కూడి ఈ దుష్టుల తోడ్పాటుతో దేవతలకు ప్రతికూలము లాచరించుచున్నావు. ఈ దోషమునకు ఫలముగా మీకు నాశము కలుగుననియే ఈ ఉత్పాతములు తెలుపుచున్నవి. ఇదిగో! రుద్రుడు లోకమయరథ మారోహించి మయా! త్రిపుర దుర్గమును నిన్ను అసురులను దహించుటకై వచ్చుచున్నాడు. కావున ఇట్టి స్థితిలో నీవు నీవాదానవులతో కూడ మహేశ్వరుని శరణు చొచ్చుట మేలు. లేనిచో నీకుమారులతో నీదానవులతో కూడ నశించిపోయెదవు. అని నారదుడు మయాదులగు దానవులకు రానున్న భయమును ప్రస్తుత వచనములతో తెలిపి ఆ ధీమంతుడు మరల దేవేశుని పురమును (స్వర్గమునకు) వచ్చెను.

నారదుడు వెడలిన తరువాత దానవ నాయకుడగు మయుడు తన శూరుల నుద్బోధించుచు ఇట్లు పలికెను: శూరులగు దానవులారా! మనమందరము పుత్త్రవంతులమయితిమి. (వారును మనంతటి వారయినారు.) మనము కుటుంబములకు చేయవలసిన కృత్యములను చేసితిమి. మనము ఎవరికిని ఎందులకును భయపడవలసిన పనిలేదు. దేవతలతో యుద్ధము చేయుదము. మనము చచ్చితిమా ఇంద్రుని సభాసదులమై స్వర్గసుఖము లనుభవింతము. ఇంద్రాదులను చంపగలిగితిమా-మనమే సర్వలోకముల ననుభవింతము. కావున మీరెల్లరు శస్త్రపాణులై సన్నద్ధులై అట్టాల కములపై (బురుజులపై-భవనాగ్రములపై) నిలువుడు. కవచములు ఆయుధములు ధరించి నిలుపుడు. ఈ త్రిపురములును వీనికి అనుబద్ధములగు పురములును శత్రువులకు చేరనలవి కాకుండునట్లు మీమీ స్థానములందు నిలుపుడు. దేవతలును ప్రమథులును ఆకాశమున సంచరింపగలవారును శూరులను అని మీకు తెలియును. వారిని మీశక్తికొలది అడ్డగించుడు. బాణములతో చీల్చుడు.

అని ఇట్లు మయుడు దానవులకు వారు దేవతలతో పోరవలసిన హేతువును వీరు వారినడ్డగించవలసిన విధమును తెలిపి తన మనస్సును యుద్ధాసక్తమొనర్చి గగన సంచారియగు త్రిపుర దుర్గమును ప్రవేశించెను. అనంతరమతడు రజోగుణ రహిత విశుద్ధ భావమును అట్టి రూపమును కలవాడయి దిగంబరుడు దేవదేవుడు యముని మదనుని అంధకుని దక్షయజ్ఞమును అంతమొందించినవాడు అగు పరమేశ్వరుని (లౌకిక) వాక్కులతో స్తుతించి శరణువేడెను. ప్రకాశమాన తృతీయ నేత్రముగల చంద్రమౌళియు మయుడు అభయమగు ముక్తిపదమును కోరి తను శరణువేడెనని గురుతించి అతని కభయ మభిమతముగా నిచ్చెను. దానవేంద్రుడగు మయుడును నిర్భయుడై యుండెను.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయనారద

సంవాదాది కథనమను నూట ముప్పది రెండవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-1    Chapters